మూడు కావ్యాల ముచ్చట!

mani-92మనకి తెలుగులో ఐదు పంచకావ్యాలు (మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవపాండవీయము, పాండురంగ మహాత్మ్యము, శృంగార నైషధము)  ఉన్నట్లే తమిళంలో కూడా ఐదు పంచకావ్యాలు ఉన్నాయి.  అవి శిలప్పదిగారం, మణిమేఖల, జీవక చింతామణి, వళయాపతి, కుండలకేశి.

వీటిలో అత్యుత్తమ రచనలు, జంట కావ్యాలు అయిన శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలను  ఎమ్.ఎ తెలుగు పాఠ్యపుస్తకాలు చదివీ,   నెట్ లోని సమాచారం సేకరించీ,  అన్నిటికంటే ముఖ్యంగా నా కొలీగ్స్,  తమిళ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకునీ గతంలో సారంగ పాఠకులకు సంక్షిప్తంగా పరిచయం చేశాను.  అదే విధంగా ఇప్పుడు మిగిలిన మూడు కావ్యాలను పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.  ఇవి నేను విన్న,  తెలుసుకున్న కథలు మాత్రమే గమనించగలరు.  తప్పులు ఉంటే మన్నించి మీకు ఇంకా ఈ కావ్య విశేషాలు తెలిసి ఉంటే ఇక్కడ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

  1. శిలప్పదిగారం లింక్
  1. మణిమేఖల  లింక్

మిగిలిన మూడు కావ్యాలను ఈ క్రింది వ్యాసంలో చదవండి –

  1. జీవకచింతామణి

తమిళ పంచకావ్యాలలోని మూడవది “జీవక చింతామణి”.  కావ్య నాయకుడు జీవకుడు పుట్టినప్పుడు ఆకాశవాణి “జీవ”  అని పలికిందనీ,  అతని తల్లి “చింతామణీ,  నువ్వు నాకు లభించావా?”  అన్నదనీ ఈ కావ్యానికి జీవక చింతామణి అనే పేరు వచ్చిందంటారు.

శృంగార కావ్యమైన ఈ జీవక చింతామణి కావ్యాన్ని తిరుత్తక్కదేవర్ రచించారు.  ఈ కావ్యం 3145 వృత్త పద్యాలతో రచింపబడినది.    తమిళంలో వృత్తపద్యాలతో కావ్యరచనకి నాంది పలికినవాడు తిరుత్తక్కదేవర్.    ఈయన జైన మత సంప్రదాయానికి చెందినవాడు.

ఒకసారి తిరుత్తక్కదేవర్ మధుర పండిత పరిషత్తుకు వెళ్ళినప్పుడు అక్కడి పండితులు ‘మీరు – జైన సంప్రదాయవాదులు – ఎంత సేపటికీ సన్యాస దీక్ష గురించి రాయమంటే రాయగలరు గాని ప్రణయానికి సంబంధించిన రచనలు చేయలేరు”  అని అన్నారుట.  తిరుత్తక్కదేవర్  దానిని సవాలుగా తీసుకుని ఈ జీవక చింతామణి కావ్యాన్ని ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేశారుట.

ఇది చక్కని కావ్యంగా పండితుల ప్రశంసలను అందుకొన్నది.

కథా సంగ్రహం :

హామాంగద రాజ్యానికి రాజు సత్యంధరుడు.  ఇతడు దయార్ద్ర హృదయుడు.  ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు.  అతని మేనమామ కూతురైన విజయను వివాహం చేసుకున్నాక అతిలోక సౌందర్యవతి, అపురూప లావణ్యవతి అయిన ఆమెని వదలకుండా ఆమెతోనే కాలం గడపసాగాడు.  రాజ్యవ్యవహారాలన్నీ మంత్రులు చేజిక్కించుకున్నారు.

కాష్టాంగాకారుడు అనే మంత్రి రాజుని మట్టుపెట్టి తాను రాజవ్వాలనే దురుద్దేశంతో సైన్యాన్ని సమీకరించుకుని  సమయం కోసం వేచి చూస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా విజయ గర్భవతి అయింది.  నెలలు నిండాయి.  రేపో మాపో బిడ్డ పుట్టబోతాడని రాజు సత్యంధరుడు భార్యని విడవకుండా రేయింబవళ్ళు ఆమె చెంతనే ఉండసాగాడు.  అది అదనుగా భావించిన కాష్టాంగాకారుడు తన సైన్యంతో అంతఃపురాన్ని ముట్టడించాడు.  సత్యంధరుడు తన ఎగిరే యంత్ర విమానంలో భార్యను కూర్చుండబెట్టి ఆమెని పుట్టినింటికి వెళ్ళమని చెప్పాడు.   అక్కడున్న కొద్దిపాటి సైన్యంతో కాష్టాంగాకారుడిని ఎదుర్కొన్నాడు కాని యుద్ధంలో వీరమరణం పొందాడు.

విజయను తీసుకెళ్ళిన విమానం ఓ స్మశానంలో ఆగిపోయింది.  అక్కడ ఆమె ప్రసవించింది.  నిస్సహాయతతో హృదయవిదారకంగా ఏడుస్తున్న విజయని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ దేవత మనిషి రూపంతో వచ్చి ఆమెని ఓదార్చింది.

ఆ సమయంలో రాజ్యంలోని ఓ ప్రముఖ వాణిజ్యశ్రేష్టి తన బిడ్డ చనిపోవడంతో కుమారుని ఖననం చేసిన చోటు కొచ్చి ఏడ్చుకుని  తిరిగి ఇంటికి వెళుతున్నాడు.  బిడ్డను ఎలా పెంచాలో ఏం చేయాలో తెలియక దుఃఖిస్తున్న విజయకు దేవత ఉపాయం చెప్పింది.  దానికి ఒప్పుకున్న విజయ బిడ్ద వేలికి రాజముద్రికను తొడిగి ఆ శ్రేష్టి వచ్చే దారిలో పరుండబెట్టి చెట్టు చాటుకి తప్పుకుంది.  బిడ్డను చూసిన శ్రేష్టి తన బిడ్డ చనిపోయినా భగవంతుడు మళ్ళీ ఈ బిడ్డను ప్రసాదించాడని భావించి చేతుల్లోకి తీసుకున్నాడు.  అప్పుడు చాటునుండి చూస్తున్న దేవత “జీవ”  అంది.  అది విన్న శ్రేష్టి ఆకాశవాణి ఆ మాటలు పలికిందని భావించి బిడ్డకు ‘జీవకుడు’  అని నామకరణం చేసి బిడ్డను తీసుకెళ్ళి భార్యకి ఒప్పచెప్పాడు.  బిడ్డ చేతికున్న రాజముద్రికను చూసిన వారు అతను రాజకుమారుడని తెలుసుకున్నారు.  రాజముద్రికను తీసి దాచిపెట్టి అతడు తనకి దొరికిన బిడ్డ అని అందరికీ చెప్పి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.

విజయ స్మశానం నుండి బయటపడి అడవిని దాటి వెళ్ళి అడవికి ఆవలనున్న ఓ జైన ఆశ్రమంలో చేరిపోయింది.

***

జీవకుడు ఆర్యనంది అనే ఓ రాజగురువు దగ్గర విద్యను అభ్యసించసాగాడు.   సకల విద్యలను నేర్చుకున్నాడు.  మనోహరాకారుడైన అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరచసాగింది.  అతని విద్య పూర్తయ్యాక ఆర్యనంది జీవకుడికి అతని పుట్టుక రహస్యాన్ని తెలియచేశాడు.  కోపోద్రేకుడైన జీవకుడిని ఆర్యనంది శాంతపరచి కాష్టాంగాకారుని చంపడానికి ఇది తరుణం కాదు.  ఓ ఏడాది తర్వాతనే నీకది సాధ్యమవుతుంది.  అప్పటివరకూ దేశాటన చేయమని ఆజ్ఞాపించాడు.  గురువుకి మాట ఇచ్చి ఇంటికి చేరాడు జీవకుడు.

ఆ సమయంలో రాజ నగరానికి సమీపంలోని అడవిలో వేటగాళ్ళ గుంపు తయారై పశువులని ఎత్తుకుపోసాగారు.  రాజు కాష్టాంగాకారుడు వాళ్ళ మీదికి సైన్యాన్ని పంపాడు కాని ఆ అడవి ఆనుపానులు తెలియక చిత్తుగా ఓడిపోయాడు.  జీవకుడికి అది తెలిసి తన స్నేహితులైన కొంతమంది వీరులని వెంటబెట్టుకు వెళ్ళి వేటగాండ్రను పారద్రోలాడు.  ప్రజలు అతన్ని కొనియాడారు.  అది కాష్టాంగాకారునికి నచ్చలేదు.  జీవకుడి ధైర్యసాహసాలని చూసి అసూయాద్వేషాలతో రగిలిపోసాగాడు.  జీవకుని చర్యల మీద కన్నేసి ఉంచాడు.

నగరంలో శ్రీదత్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఓ కుమార్తె ఉంది.  నిజానికి ఆమె ఒక గంధర్వుడి కుమార్తె.  ఈ నగరంలోనే ఆమె వివాహం అవాలని ఉందని ఆమె జాతకంలో ఉండటం వల్ల ఒకప్పుడు శ్రీదత్తుడిని కాపాడిన ఆ గంధర్వుడు కుమార్తెని శ్రీదత్తుని ఇంట్లో ఉంచాడు.  ఆమె పేరు గంధర్వదత్త.  గంధర్వదత్తను వీణావాదనలో ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి ఆమె భార్య అవుతుందని శ్రీదత్తుడు ప్రకటన చేస్తాడు.  ఎంతోమంది యువకులు ప్రయత్నించి విఫలులవుతారు.  జీవకుడికి సంగతి తెలిసి ఆ పోటీలో పాల్గొని గంధర్వదత్తని ఓడించి ఆమెని వివాహమాడతాడు.

ఇద్దరూ సంతోషంగా కాలం గడపసాగారు.  ఒకరోజు ఓ ఏనుగు సంకెళ్ళని తెంచుకుని కోమటి వీధుల్లో పరిగెడుతూ గుణమాల అనే యువతిని తరుముకు రాసాగింది.  ఆమె కూడా నగరంలో ఓ ప్రముఖ వ్యాపారి కుమార్తె.   ఆ సమయంలో ఆ వీధిలోనే వెళుతున్న జీవకుడు ఏనుగును అదుపులో పెట్టి గుణమాలని రక్షించాడు.   అతని చేతిలో వాలిన ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసిన జీవకుడు ఆమెపై మరులుగొన్నాడు.  ఆమె కూడా జీవకుడిని మొదటి చూపులోనే ప్రేమించింది.  తన చిలుక ద్వారా అతనికి ప్రణయసందేశాన్ని పంపింది.  జీవకుడు సంతోషపడి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి గుణమాలని వివాహమాడాడు.

తన కుమారుడైన మదనునికి గుణమాలనిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్న కాష్టాంగాకారుడు ఇది సహించలేకపోయాడు.  మదనుడిని పిలిచి జీవకుడి మీద ఏదో ఒక రాజద్రోహం మోపి సంహరించి రమ్మని పంపాడు.  పెద్ద సైన్యంతో జీవకుడి ఇంటి మీదకు వచ్చాడు మదనుడు.  సంవత్సరం పాటు కాష్టాంగాకారునిపై యుద్ధం చేయనని గురువుకిచ్చిన మాట నిలబెట్టడం కోసం తన భార్య గంధర్వదత్త మంత్రమహిమతో ఎవరికీ కనపడకుండా అక్కడ నుండి తప్పించుకుని మాయమైపోతాడు.

దేశ సంచారం చేస్తూ వివిధ దేశాలల్లోని ప్రముఖుల కుమార్తెలని ఐదుగురిని వివాహమాడతాడు.

పాము కాటు నుండి కాపాడి ఓ దేశ రాజకుమారి అయిన పద్మను మూడవభార్యగా స్వీకరిస్తాడు.   యుక్తవయస్తు వచ్చినా ఎవర్ని చూసినా సిగ్గుపడని ప్రముఖ వ్యాపారి కుమార్తె ఖేమచరి జీవకుడిని చూసి సిగ్గుపడటంతో అతనే ఆమె భర్త అని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమెని వివాహమాడతాడు.  ఆ తర్వాత మరో రాజకుమార్తె కనకమాలను వివాహమాడాడు.

జీవకుడు కనకమాల దగ్గర ఉన్నప్పుడు,  జీవకుడు ఎక్కడున్నాడో అని గంధర్వదత్త తనకున్న మంత్ర ప్రభావంతో చూసి “దారిలో కనపడుతున్న యువతులందరినీ పెళ్ళి చేసుకుని సాగిపోతున్నారు బాగానే ఉంది.  కాని ఇక మీరు వెంటనే తిరిగి వచ్చి కాష్టాంగాకారుడిని సంహరించి రాజ్యాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైంది” అని  ఉత్తరం రాసి రాజమిత్రుడికి ఇచ్చి పంపింది.

ఉత్తరం చదువుకున్న జీవకుడు కనకమాలకి చెప్పి రాజమిత్రుడితో పర్వతాలను నగరాలను దాటుకుంటూ తన తల్లి ఉన్న జైన ఆశ్రమానికి చేరుకుంటాడు.  అక్కడ విజయను చూసి గుర్తుపట్టిన ఆ రాజమిత్రుడు జీవకుడే ఆమె బిడ్డ అని చెప్తాడు.   తల్లీ బిడ్డలిద్దరూ ఆనందంతో ఆలింగనం చేసుకుంటారు.

అమ్మని మేనమామ ఇంటికి పంపి తన రాజ్యానికి చేరుకుంటాడు జీవకుడు.   అక్కడ ఉద్యానవనంలో స్నేహితులతో కలిసి విశ్రమిస్తాడు.  ఆ సమయంలో బంతి ఆడుకుంటూన్న  విమల అన్న ఓ యువతిని చూసి మోహిస్తాడు.  ఆమె కూడా జీవకుడినే పరిణయం చేసుకోవాలని ఉబలాటపడుతుంది.  ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమెని వివాహమాడతాడు.

నగరంలో సకలైశ్వర్యాలతో తులతూగే మరో ప్రముఖ శ్రేష్టి కుమార్తె సురమంజరి.  అహంకారి.  పురుషద్వేషి.  విమలని వివాహమాడానని  జీవకుడు తన స్నేహితులతో చెప్తున్నప్పుడు  “వివాహేచ్ఛ ఉన్న యువతులని వివాహమాడటం గొప్ప కాదు ఈ పురుషద్వేషిని వివాహమాడు చూద్దాం”  అని సవాలు చేశారు.

జీవకుడు ముసలివేషంతో సురమంజరి ఇంటికి చేరి స్పృహ తప్పినట్లు నటించి ఆ రాత్రికి ఆమె ఇంట్లోనే ఉంటాడు.  ఆ రాత్రి మైమరిపించే సంగీతంతో ఆమెను తన గదికి రప్పించుకుని ముసలి వేషాన్ని తీసివేస్తాడు.  మన్మధాకారుడైన జీవకుడిని చూసిన ఆమె తాను పురుషద్వేషినన్న సంగతి కూడా మరిచి అతన్ని వివాహమాడుతుంది.

ఈ విధంగా జీవకుడు తన దేశాటనలో  ఐదుగురు కన్యలను వివాహమాడతాడు.

***

download

ఆ తర్వాత జీవకుడు మేనమామ ఇంటికి వెళతాడు.  మామ సహాయంతో కాష్టాంగాకారుడిపై దండెత్తి అతడిని సంహరిస్తాడు.  రాజ్యలక్ష్మిని వరించిన జీవకుడికి మేనమామ తన కుమార్తె అయిన లక్షణను ఇచ్చి వివాహం జరిపిస్తాడు.

రాజైన జీవకుడు తన అష్టభార్యలతో సుఖంగా కాలం గడుపుతున్నాడు.  కొన్నాళ్ళయ్యాక అతని తల్లి విజయ తిరిగి జైన ఆశ్రమంలో చేరిపోయింది.   ఒక్కో భార్యకూ ఒక్కో కుమారుడు కలిగారు.

ఒకరోజు జీవకుడు భార్యలూ బిడ్డలతో ఉద్యానవనంలో కూర్చుని ఉన్నాడు.  ఎక్కడ నుండో పనసపండుని తెచ్చిన ఓ మగ కోతి దానిని సగంగా చీల్చి తన పక్కనే ఉన్న ఆడకోతికి ఇచ్చింది.  అదే సమయంలో తోటమాలి వాటిని తరిమి అవి కిందపడేసిన పనసపండుని తీసుకున్నాడు.  క్షణం ముందు ఆ పండుని కోతులు తింటాయని ఊహించుకుంటూ వాటిని తిలకించాలనుకున్న జీవకుడు క్షణంలో మారిపోయిన విధిని చూసి ఆశ్చర్యపోయాడు.

ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియని ఈ అశాశ్వతమైన భోగభాగ్యాలలోనే తానూ ఓలలాడుతున్నానని గ్రహించుకున్నాడు.  ఒక్కసారిగా అతనిలో ఏదో మార్పు.  అప్పటికప్పుడే తన పరివారాన్ని అందరినీ పిలిచి సన్యాసాశ్రమం తీసుకుంటున్నానని చెప్పాడు.  పెద్దకుమారుడైన సత్యంధరుడికి రాజ్యాన్ని ఒప్పగించాడు.   ఆ రాత్రి హాయైన స్నానం చేసి తృప్తిగా భోంచేసి సన్యాస దీక్షని స్వీకరించాడు.

మహావీరుడు బోధించిన మార్గంలో ప్రవర్తిల్లుతూ తపస్సు చేసి కర్మబంధాలను వదిలించుకుని జ్ఞాని అయ్యాడు.  దివ్యలోకాలు చేరాడు.   ‘నీ యీ కథను విన్న వారందరికీ శుభాలు కలుగుతాయ’ని దేవతలందరూ ఆయన్ని ఆశీర్వదించారు.

***

  1. వళయాపతి

వళయాపతి కావ్యం సంపూర్ణంగా లభించడం లేదు.  కేవలం డెబ్భై పద్యాలు మాత్రమే దొరికాయిట.  ఈ కథ అచ్చం ధృవుడి కథలా అనిపిస్తోంది.  ఈ కావ్య రచయిత ఎవరో కూడా తెలియదుట.

కథా సంగ్రహం

పుహార్ పట్టణంలో నారాయణుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు.  అంతులేని సంపద ఉన్న ఇతన్ని నవకోటి నారాయణుడు అని పిలుస్తారు.  అతనికి పెళ్ళయి భార్య ఉన్నా కూడా వేరే కులం ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.  తక్కువ కులపు స్త్రీతో సంసారం చేస్తున్నాడని అతన్ని అతని బంధువులు, అతని కులపెద్దలు నిందిస్తారు.  ఆవిడని వదిలెయ్యకపోతే కులాన్నించి వెలివేస్తామని అనడంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా రెండవ భార్యని వదిలేస్తాడు.

ఆమె కాళికాలయానికి చేరి అక్కడ బిడ్డను ప్రసవిస్తుంది.  భక్తులు ఇచ్చిన దక్షిణలతో ప్రసాదాలతో కడుపునింపుకుంటూ ఉంటుంది.  తన భర్తతో తనని చేర్చమని నిత్యమూ ఆ కాళికాదేవిని ప్రార్థిస్తూ ఉండేది.

బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు.   ఓరోజు ఆ పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వాళ్ళ మధ్య ఏదో తగాదా వస్తుంది.  “పోరా నీకు తండ్రే లేడు,  తండ్రి పేరు కూడా తెలియని వాడవు”  అని వాళ్ళల్లో ఒకడు ఎగతాళి చేస్తాడు.  ఆ బాబు ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని తన తండ్రెవరో చెప్పమని నిలదీస్తాడు.  ఆమె తండ్రి పేరు చెప్పగానే నేరుగా నవకోటి నారాయణుడి ఇంటికి వెళతాడు.   బిడ్దని వెంబడిస్తూ తల్లి కూడా వస్తుంది.

నిలదీస్తున్న కొడుకుకి సమాధానం చెప్పలేక తలవంచుకుని నిలబడి ఉంటాడు నవకోటి నారాయణుడు.  చోద్యం చూడను గుంపుగా చేరిన ప్రజలు ఆమెని నిందిస్తుంటారు.  ఆమె మౌనంగా కళ్ళు మూసుకుని కాళికాదేవిని ప్రార్థిస్తుంది.  దేవి ప్రత్యక్షమై అందరూ వినేట్లుగా ఈమె శీలవంతురాలు.  ఆమెని భార్యగా స్వీకరించు అని నారాయణుడికి చెప్తుంది.

నారాయణుడు సంతోషంగా రెండవ భార్యని తన ఇంట్లోకి పిలుచుకుంటాడు.  కొడుకుని ప్రయోజకునిగా చేసి తనంత గొప్ప వ్యాపారిని చేస్తాడు.

***

  1. కుండలకేశి

తమిళ పంచకావ్యాలలో ఐదవది కుండలకేశి. ఈ కావ్యం కూడా సంపూర్ణంగా లభించడం లేదు.  కుండలకేశి అనే యువతి బాధాకరమైన కథ ఇది.  ఈమె సన్యాసినియై  జైన మత గురువైన నాదగుత్తాచార్యులతో వాదించి గెలవడం ఈ కథలోని విశేషంగా చెప్పుకుంటారు.

కథా సంగ్రహం

రాజుగారికి చాలా దగ్గరివాడైన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ‘కుండలకేశి’.  అసమాన సౌందర్యవతి.  ఒకసారి ఆమె తన భవనం పైభాగానికి చల్లగాలి కోసం వచ్చింది.   ఆ సమయంలో రాజభటులు ఓ యువకుడిన సంకెళ్ళు వేసి వీధిలో నడిపించుకుంటూ తీసుకెళుతున్నారు.    వాళ్ళని అనుసరించి ఏవేవో మాట్లాడుకుంటూ ఓ గుంపు అనుసరిస్తోంది.  ఆ కలకలం విన్న ఆమె కిందికి చూసింది.  సంకెళ్ళు వేసి తీసుకెళుతున్న యువకుడిని చూడగానే ఆమె అతని పట్ల ఆకర్షణకి లోనయ్యింది.

ఆ యువకుడి పేరు కాలుడు.  అతను గజదొంగ.  దొంగతనం చేస్తూ పట్టుబడిన అతనికి మరణదండన విధించి ఉరి తీయడానికి తీసుకువెళుతున్నారు.   చెలికత్తెని కిందికి పంపి అతని గురించి ఈ వివరాలు తెలుసుకున్న కుండలకేశి హృదయం ద్రవించిపోయింది.  తొలిచూపులోనే అతనిపై మరులుగొన్న ఆమె అతన్ని ఎలాగైనా విడిపించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అప్పటికప్పుడే తండ్రికి తన కోరికను చెప్పింది.  కూతురు ఏది అడిగినా కాదనలేని బలహీనత కలిగిన ఆ తండ్రి ఎంతో ధనం పోసి (లంచాలు ఇచ్చి) కాలుడిని విడిపించాడు.  అంగరంగ వైభవంగా ఇద్దరికీ వివాహం జరిగింది.  ఇరువురూ ఆనందంగా కాలం గడపసాగారు.

కొన్నాళ్ళయ్యాక ఇద్దరి మధ్యా తీవ్ర విభేదాలు మొదలయ్యాయి.  ఒకరోజు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటున్నప్పుడు కుండలకేశి “నువ్వు గజదొంగవు.  ఆ పాత బుద్ధులు ఎక్కడకి పోతాయి?  ఆరోజు నేను నిన్ను కాపాడకపోయినట్లైతే ఏమై ఉండేవాడివో ఆలోచించుకో”  అని అవమానించింది.

ఆ మాటలకి కాలుడు విపరీతోద్రేకానికి లోనయ్యాడు.  అప్పటికప్పుడే ఆమెని చంపేయాలన్నంత కోపం కలిగిందతనికి.    అది సమయం కాదు అని ఆవేశాన్ని అణచుకున్నాడు కాని  సమయం చూసి ఎవరికీ అనుమానం రాకుండా ఆమెని కొండ మీద నుండి తోసి చంపేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

ఆ రోజునుండీ ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించసాగాడు.  కుండలకేశి కూడా తన భర్తకి మంచి బుద్ధి కలిగిందని సంతోషపడింది.  ఒకరోజు భార్యని పిలిచి “మనిద్దరి మధ్యా ఏ కలతలూ రాకుండా ఉంటే కొండమీది దేవాలయానికి వస్తానని మొక్కుకున్నాను.  మొక్కు తీర్చుకుని వద్దాం, బయలుదేరు”  అన్నాడు.

ఆమె నిజమేననుకుని చక్కగా అలంకరించుకుని భర్త వెంట బయలుదేరింది.   కొండ ఎక్కుతున్నప్పుడు  అతను మాట్లాడుతున్న విషపు మాటలు, వ్యంగ్యపు మాటల ద్వారా అతని పన్నాగాన్ని కనిపెట్టింది.  వంచనని వంచనతోనే గెలవాలని మనసులో తలపోసిన కుండలకేశి ఏమీ బయటపడలేదు.  పరిస్థితి అంతవరకూ వస్తే ఏం చేయాలో పథకం వేసుకుంది.

కొండ శిఖరం చేరాక “ఇప్పుడు నిన్ను కిందకు తోసి చంపబోతున్నాను”  అన్నాడు.  నిర్ఘాంతపోయి ఏడుస్తూ భర్త కాళ్ళ మీద పడుతుందనుకున్నాడేమో పాపం – ఆ మాట చెప్పి వికటంగా నవ్వుతున్న అతన్ని గభాల్న కిందకి తోసేసింది.  అతడు శిఖరం మీద నుండి కింద పడి ప్రాణాలు వదిలాడు.

ఇక ఆమెకి జీవితం పట్ల రోత కలిగింది.  సన్యాసినియై బౌద్ధమతాన్ని స్వీకరించి వివిధ ప్రదేశాలు తిరుగుతూ మహనీయులని కలుసుకుని బౌద్ధమత సారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది.  బౌద్ధమత ప్రచారం చేస్తూ బౌద్ధమత ప్రచారకురాలిగా పేరు పొందింది.

******

మీ మాటలు

  1. ఏల్చూరి మురళీధరరావు says:

    శ్రీమతి రాధ గారికి
    నమస్కారములతో,

    అనర్ఘములైన తమిళ పంచకావ్యాల కథలను మళ్ళీ ఒక కొత్త తరానికి పరిచయం చేయటం చాలా బాగుంది. మీ కథనధోరణి కూడా హృద్యంగా ఉన్నది.

    తెలుగులో వెనుక శ్రీ పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారివి రెండింటికీ, డా. చల్లా రాధాకృష్ణశర్మ గారివి అన్నింటికీ ఎంతో మంచి అనువాదాలు వచ్చాయి. ఇతస్తతంగా ఇతరులవి కూడా కొన్ని కొన్ని లభిస్తున్నాయి. మీరూ
    కృషిచేసి కౌతూహలజనకమైన ఈ శైలిలో సంపూర్ణ వచనానువర్తలను చేపట్టగలిగితే భావ్యంగా ఉంటుంది.

    జీవకచింతామణి వద్ద మీరు ఆ తాళపత్రఖండాన్ని ఎందుకు ఉదాహరించారో మాత్రం తెలియరాలేదు. అది అందులోనిదిగా సన్నివేశమేదీ స్ఫురింపలేదు. ఏదో జానపదవైద్యానికి సంబంధించిన పాటలోని త్రుటితభాగం అనిపిస్తున్నది.

    అభినందనలతో,
    ఏల్చూరి మురళీధరరావు

మీ మాటలు

*