పూల బాస!

seetaram

ఇది ప్రముఖ  చాయాచిత్రకారుడు దండమూడి  సీతారాం తీసిన  ఫోటో! కొన్ని  ఫోటోలు  గొప్ప  దృశ్యాన్ని  పొదివి పట్టుకున్న  చిత్ర కవితలు. ఇదీ అలాంటిదే!

ఈ దృశ్యం  మీ  అక్షరాల్లో  ఎట్లా తర్జుమా  చేయగలరో  ప్రయత్నించండి. మీకు  నచ్చిన  పద్ధతిలో- కవిత  కావచ్చు, చిన్ని కథ  కావచ్చు, చిన్ని ఆలోచన కావచ్చు, చిన్ని  అనుభవమూ  కావచ్చు- ఇక్కడ  కామెంట్ గా  రాయండి.

మీ మాటలు

  1. స్వాతీ శ్రీపాద says:

    పూవు పూవునా పూవు పూవునా
    పుత్తడి వెలుగులే పుత్తడి వెలుగుల వెన్నెలే
    పున్నమి వెన్నెల జిలుగులే పున్నమి మెరుపుల మరకలే ….
    పూచింది ఈ నేల పూచింది వేల రాగాల రంగులనూ
    పూచింది ఈ నేలా పూచింది ఈ నేలా రంగుల హంగులనూ
    హంగులన్నీ పొ౦గి రంగులన్నీ చిమ్మి రతనాల దీవులై
    బంగారు పూవులై పులకించె పుడమి పూల కన్యకా
    కావ్య నాయిక….

    తీరొక్కపూవునా తిలకించు తీరునా
    తీరొక్క పూవునా తీరైన తేరునా పూరెక్క మాటునా
    పొ౦దికగా పేర్చిన పొదిగున్న భావనా
    పూవు పూవున పుప్పొడై పరిమళించే గానమై
    తావుతావున ఆటలై పాటలయ్యే గానమై
    బతుకమ్మ బతుకంతా పసిమిపూవుల తంగేడై
    బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో

  2. Sharada Sivapurapu says:

    ఆకు పచ్చని అమ్మ ఒడిన
    పొత్తిళ్ళ ఒదిగిన శిశువులా
    పూసింది పూసింది పూబాల
    నునులేత పెదవులు విప్పింది
    వన్నె వన్నెల నవ్వుల రువ్వింది
    గాలుల్లో ఘుమ ఘుమలు నింపింది
    పసిడి వన్నెల వెన్నెల్లు పరిచింది
    స్వాగతమె పలికింది…… భ్రమరాలా!
    ఝుమ్మంటు రమ్మంటు తీయని విందులే గ్రోల
    ప్రియురాళ్ళకు పంచింది తన అందాలు
    పలికించింది ప్రియుల పెదవుల మోహమకరందాలు
    ప్రేమల్లు పంచింది పండుగలు తెచ్చింది
    విరగపూసిన వనమంత నాదని విర్రవీగకు మాలీ
    ఈసు కళ్లనుంచి పదునైన గోళ్ళ నుంచి
    తోటలో సంచరించే సభ్యత లేని ధూర్తుల నుంచి
    తన సౌందర్యం, సౌకుమార్యం కాపాడే పని నీదంటూ
    సవ్వాలు విసిరింది పూబాలా
    పూసింది పుసింది పూబాలా.

  3. బూర్ల వేంకటేశ్వర్లు says:

    సూసినోల్ల
    రొండు కండ్లల్ల బంగారం పూయిస్తున్నయి
    ఆ నడుమ నల్ల సారల్ని తీసి
    పెద్ద పులి పెయ్యంత అంటిచ్చుకున్నట్టున్నది
    ఆ పసుప్పచ్చ రంగు జూసి
    మా శెల్లె పట్టు లంగ కట్టుకున్నట్టున్నది
    ఇవి పాయిరమసొంటి పెద్దవ్వ మొకానికి
    రొండు దిక్కుల యాల్లాడే గంటీలు
    కండ్లల్ల ఉండే ఇసపు పొరల్ని తుడిశేశే
    పసి పిల్లల నవ్వులు

  4. N.Navneeth Kumar says:

    ఒత్తిడి చిత్తడిలో పురుడుపోసుకొని
    పచ్చిక పచ్చదనం లో విరిసిన
    కదలీ కదలని పెదాల చిగురేసి వేయని
    చిరునవ్వులా , ఒక్కరోజు అనే
    సుదీర్ఘ జీవితకాలంలోకి
    వడిలిపోయే రేపటిని రేపుటికే
    దాచిపెట్టి , మోహనరాగంలో
    పసిడి అందెల రవళి వినిపిస్తూన్నా !

    నవనీత్❤️

  5. ఒక ఉదయం ఒక అష్టమయం
    ఎరుపు నుంఛి పసుపు
    పసుపు నుంచి ఎరుపు
    రెండు వర్ణాలు మధ్య నడిచిపోతూ జీవితం
    జీవితానికి రెండు హద్దులుగా పూచిన పూలు

    పుప్పొడిగా ఆయువును రాల్చేస్తూ
    ఫర్లేదు ఫీనిక్స్ గా ఇంకో జన్మ వైపే కదా

    రెండు హద్దులు మధ్య నీలోనే ఓ నువ్వు
    ఒక చిన్ని తూగు మధ్యాహ్నం లో అయినా
    తొంగి చూసి నిన్ను నిమురుతూనే ఉంటుంది
    నీ మూడో కన్నుగా !

  6. Sadlapalle Chidambarareddy says:

    సడ్లపల్లె చిదంబరరెడ్డి.
    —————————–
    సత్యమంత సుందర మూర్తి
    నిత్య ముత్తయిదువ ఈ ధాత్రి.

    ఆకుపచ్చని తీగల సిరస్సునలా పైకెత్తి
    మొగ్గల కనురెప్పల చిప్పల పై సుతారంగా
    సూర్యుని తొలి కిరణాల కాంతుల్ని
    రంగుల జిలిగు వెలుగులుగా అద్దుకొంటుంది.

    తనువు లోని తన పసిడి తత్వాన్ని
    కనుపాపల చూపుల పుష్పాలుగా మార్చి
    ప్రకృతి ఆకృతుల ప్రదర్శన క్షేత్రంలో
    పచ్చ పచ్చగా హాజరవుతూనే ఉంటుంది.

    ప్రతి నిత్యం జరిగే తతంగం
    అదో అద్భుత
    మార్మిక కాల ప్రవాహం!!

  7. దేవరకొండ says:

    నా వరకు నీవు అనామికవు!
    నేను గొప్ప నామకుడనుకునేవు!
    నేనూ అనామకుడనే!
    నిన్ను చూస్తుంటే
    నేను నిన్ను చూడట్లేదు…
    నన్ను నేను నీలో చూస్తున్నాను!
    నువ్వు నమ్ముతానంటే
    నువ్వు నవ్వుకోనంటే
    ఒక మాటను విరబూయాలనివుంది…
    నా హృదయం కూడా
    నీ అంత అందమైనదే!
    కానీ ఆ ఊసును నీ అంత అందంగా
    చెప్పుకోలేకపోతోంది!
    మౌనంగా తోటి హృదయాల తోటల్లో
    వెదుక్కుంటోంది…
    ఇంతకీ నువ్వు ఎవరి హృదయానివి?
    ఇంకా తడి ఆరకుండా నిల్చున్న
    నువ్వు మునిగివచ్చిన
    ఆ రంగుల నది ఎక్కడుంది?
    ఏ లోకంలో?
    రేపో మాపో మళ్ళీ నువ్వు వెళ్ళేది
    ఆ నది కేనా?
    నీ నేస్తంగా నేనూ నీతో రానా?

మీ మాటలు

*