నక్షత్ర భరిణ

 

moshe

Art Work: Moshe Dayan

అలా ఒలింపస్ పర్వతసానువుల్లో నువ్వు పచ్చని చెట్ల నీడలో కూర్చుని నీలాకాశం, నీలి తటాకం, ఎర్రని కొండచరియలకేసి చూస్తూ విరబోసిన జుట్టుతో కాటుక కళ్ళతో శరీరాన ధరించిన పల్చటి పట్టు వస్త్రాలతో శిల్పంలా కూర్చుని వుంటే నాకెలా వుంటుంది…?

… ఎప్పుడూ నిన్నే చూడాలనిపిస్తుంది! నీ మాటలే వింటూ నీ పాటలకే చెవులప్పగించి నీ కళ్ళ లోకి చూస్తూ… నీ మనసులోని ఉద్వేగ తరంగాలకి స్పందిస్తూ అలానే ఓ వంద సంవత్సరాలు గడిపేయాలనిపిస్తుంది.

అసలు వంద సంవత్సరాలంటే వంద కెప్లర్ సంవత్సరాలు. పట్టు వస్త్రాలంటే ఈ కెప్లర్ గ్రహంలో పెరిగే పట్టు పురుగుల నుంచి తీసిన దారాలు, నీలి ఆకాశం అంటే కెప్లర్ గ్రహ ఆకాశం లోని వాతావరణం వల్ల వచ్చే రంగే.

అలా ఫెళ్ళుఫెళ్ళున కాసే ఎండలో చెట్ల నీడలో కూర్చుంటాం. నువ్వు కవితావేశంలో పద్యాలు చెబుతావ్. నేను సెలయేళ్ళలో స్నానాలు చేసి ఎండలు వళ్ళు ఆరబెట్టుకుని దగ్గర్లో వున్న నీలి నీళ్ళ తటాకంలో మంచినీళ్ళు తాగి, నీ దగ్గరకి వస్తాను. దూరాన కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం లిబర్టీ నుండి తెచ్చుకున్న ఆహారం – గోధుమలతో చేసిన అన్నం, కూరలు, పళ్ళు, మాంసాలు, మంద్రంగా మత్తెక్కించే ద్రాక్షరసం – ఆ రోజల్లా గడిచిపోతుంది.

రోజంటే రోజూ రోజే! సాయంత్రం ఎప్పటికీ రాదు.

చీకటి ఎప్పటికీ రాదు. నీడలు ఎప్పుడూ పొడుగవవు.

ఎప్పటికీ రాత్రి రాదు. ఆకాశం నీలంగా ధగధగా మెరిసిపోతుంది. నడయాడే తెలిమబ్బులు కనబడినా, ఎప్పుడైనా కాంతితో మెరిసే సూర్యుళ్ళు… ఒకరు ఉదయిస్తూనో మరొకరు అస్తమిస్తూనో ఉంటారు. ఇద్దరూ కలిసి అయినా మెరుస్తారు లేక ఒకరు మెరుస్తుంటే మరొకరు విశ్రమిస్తునే వుంటారు. అందుకే ఎప్పుడూ పగలే కెప్లర్‌లో. ఎప్పుడూ కాంతే, ఎప్పుడూ వెలుగే.

“నాకు చల్లటి రాత్రి కావాలి” అంటుంది. “ఈ సూర్యకాంతి వద్దు. తెల్లటి మబ్బులు, మెరిసే చుక్కలు కావాలి” అంటుంది ఫిలోమీనా.

“నీకెలా తెలుసు? మబ్బులు అంటే ఏమిటి? చుక్కలు ఎలా వుంటాయి? రాత్రి ఎలా వుంటుంది?” అని అడుగుతాను.

“హెరోడోటస్! నాకు తెలుసు. నా కలల్లో రాత్రి నావహించే నీలి నీడలు, తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతి, మెరిసే నక్షత్రాలు, ఆకాశంలో తేలిపోయే నేను…”

నేను నవ్వుతాను. ఎప్పుడూ నవ్వుతూనే వుంటాను. ఈ కెప్లర్‌లో రాత్రి లేదు. చీకటే లేదు. నక్షత్రాలంటే ఏమిటి? మబ్బులంటే ఏమిటి? అంతా సూర్యశక్తే. ఇద్దరు సూర్యుళ్ళ శక్తి నుంచీ ఆహారం సంపాదించి చెట్లు పెంచుతాం. కృత్రిమ వాతావరణంలో మొక్కలు పెంచుతాం. ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చే నదుల జలాల నుంచీ నీరు తీసుకుని పంటలు పండిస్తాం. ఇద్దరు సూర్యుళ్ళు ధ్రువాల్లోని అంతులేని మంచుని కరిగిస్తూనే వుంటారు. నీరు సెలయేళ్ళుగా పొంగి పొరలుతునే వుంటుంది. ఇంక ఆకాశం నుంచి వాన ఎందుకు? రాదు కూడా! ఒక సూర్యుడిని మబ్బులు మూసినా మరో సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. వాన ఎప్పుడో కాని రాదేమో. ఎప్పుడూ వెలుతురే. ఎప్పుడూ ఆకాశం తళతళా మెరుస్తూంటుంది. నవ్వాను.

“కల కన్నాను” అంటుంది ఫిలోమినా.

కెప్లర్ దాటి అంతరిక్షంలోకి ఎగిరిపోయినట్లు ఏవేవో వింత లోకాలు చూసినట్లు, లక్షల కొద్దీ మినుకు మినుకుమనే చుక్కలు… ఏవేవో వింత స్వరాల పిలుపులు!”

నేను నవ్వాను. “లిబర్టీ నగరంలో అబ్జర్వేటరీలు శాస్త్రజ్ఞులు ఈ విషయంపై ఎప్పుడూ పరిశోధనలు జరుపుతూనే వుంటారు. వాళ్ళకే తెలియనిది నీకెలా, నాకెలా తెలుస్తుంది? మనం వచ్చింది ఈ రెండు రోజులు హాయిగా గడిపి వెళ్ళడానికి అంతే!”

కొండలు తళతళా వెండి వెల్తురుతో మెరుస్తున్నాయి. చెట్ల ఆకులు హరితంతో మిలమిలలాడుతున్నాయి. బాల్యం నుంచి కెప్లర్ చరిత్ర చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. మూడు శతాబ్దాల కొకసారి చీకటి వస్తుందట. అదేనా ప్రళయం? గ్రహం అంతా అంధకార బంధురమై పోతుందట. ప్రజలందరు ఉన్మాదులై ఒకరినొకరు హింసించుకుని చంపుకొంటారట. ఆకాశంలో మెరుపులు, మెరిసే చుక్కలు, పాములు లాంటి తోకచుక్కలు కనిపిస్తాయి అట. అలా ఒక నాగరకత అంతమయిపోయి దేవుడు ఆకాశంనుంచి దిగివచ్చి పాపహరిహారాలు చేసి శిక్షలు విధిస్తాడట!

ఈ కథ నేను చదువుకున్న చరిత్ర పుస్తకాలలోదే! కాని ఎంతవరకూ నిజమో, అసలు చీకటి ప్రళయం నిజంగా వస్తుందా? వస్తేనే చుక్కలు ఆకాశంలో మొలుస్తాయా?

“నాకు నక్షత్రాలతో నిండిన ఆకాశపు పందిరి కింద పాటలు పాడాలని వుంది” అంది ఫిలోమినా.

“సరేలే పద! వచ్చింది ట్రెకింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ నక్షత్రాల గోల ఏమిటి?” అని విసుక్కున్నాను.

 

కొన్నాళ్ళ క్రిందట కొందరు కెప్లర్ యువ శాస్త్రవేత్తలు – మన గ్రహవ్యవస్థ దాటి, ఇంకా గ్రహాలున్నాయనీ, వందల అంతరిక్ష నక్షత్రాలున్నాయనీ వాదించారు. ఒక గుడారంలో చిల్లులు పెట్టిన నల్లటి గుడ్డ కట్టి వేసి అందరినీ దాంట్లోకి ఆహ్వానించి చీకట్లో పైకి చూడమన్నారు. కాంతి చిన్న చిన్న నక్షత్రాల వలె కంతల్లోంచి మెరిసింది.

Kadha-Saranga-2-300x268

“విశ్వాంతరాళపు శక్తి అలా నక్షత్రాల వలె కనిపిస్తుంది. మన సూర్యుళ్ళు కాంతిలో మెరవడం వలనే అవి కనపడడం లేదు. సూర్యుళ్ళు ఆరినా, ప్రకాశించడం మానేసినా ఆ చీకటికి కనిపిస్తాయి సుదూర నక్షత్రాలు. ఇది మా సిద్ధాంతం!” అనేవారు. “అది తెలియక చీకటి ప్రళయం అని కొందరు కెప్లర్ ప్రజలు తరతరాలుగా భయపడి నాగరకతని నాశనం చేసుకున్నారు.”ఆని వాదించేవారు.

ఎవరూ ఒప్పుకోలేదు. మత విశ్వాసులు అసలే ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరినీ జైలులో వేశారు. యావజ్జీవ శిక్ష!

ఫిలోమినా నవ్వింది. “నేను ఇప్పటికే ట్రెకింగ్ చేసి వచ్చాను. మళ్ళీ వెళదాం. ఆ దూరపు కొండ చరియలో ఎన్నో నివాసాలున్నాయి. కొండ గుహలు!!! అక్కడ నాకొక ముసలి సాధువు తపసు చేస్తూ కనిపించాడు. ఎన్నో గుహలున్నాయి. వాటిలో వెల్తురు లేదు. ఆ చీకటిలోనే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు”.

“నిజమా!” ఆశ్చర్యపోయాను.

“మనకి తెలియని వింతలు ఎన్ని వుంటాయి! పద! నేనూ చూస్తాను”

ఎర్రటి రాతి బండల మీద ఆకుపచ్చని నాచు మొలిచింది. వాటి మీద నడుచుకుంటూ ఇద్దరం బయలుదేరాం. ఎండ ఫెళఫెళమని తలని కాలుస్తోంది. ఆల్ఫా వన్ సూర్యుడు పటమట, ఆల్ఫా టు నడిన కిరణాల వెదజల్లుతున్నారు. వీపు మీది సంచుల్లో నుంచి నీళ్ళు తీసుకుని తాగుతూ నడిచేం.

మూడో గుహ చూపించి “అక్కడ” అంది ఫిలోమినా. ఆమె కళ్ళు ఆతురతతో మెరిసాయి. “ఇద్దర్నీ రమ్మన్నాడు ఆ సాధువు?” అంది.

గుహాంతర్భాగంలో చీకటిలో దూరాకా, ఎత్తయిన రాతి వేదిక మీద కూర్చున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల వయస్సో వూహించడం కష్టం. తెల్లటి, ఎర్రటి జడలు కట్టిన గడ్డాలు మీసాలు జుట్టు. మాసిన కాషాయ రంగు వస్త్రాలు. నుదుటన తెల్లటి చారలు అడ్డంగా. అది ఒక మత చిహ్నమా? నాకు తెలీదు.

కాగడాలు అతని చుట్టూ వెలుగుతున్నాయి. వాటి నుంచి నూనె వాసనా, నల్లటి పొగలూ వస్తున్నాయి.

ఇద్దరం ఆయన దగ్గరికి వెళితే, సాగిలబడి దండం పెట్టమని  నాకు సంజ్ఞ చేసింది ఫిలోమినా.

“ఓం… శివోహం!” అలాంటి కంఠస్వరం నేనెన్నడూ వినివుండలేదు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు.

“హెరోడోటస్, ఫిలోమినా! దీర్ఘాయుష్మాన్ భవ!” అన్నాడు.

ఫిలోమినా చెప్పింది రహస్యంగా – “అది సంస్కృత భాష. ఏదో సుదూర గెలాక్సీ గ్రహంలోనిది!”

“ఆమె నన్నడిగింది ప్రళయం ఏమిటని? ఎలా తప్పించుకోవాలి అని!” సాధువు గంభీర స్వరంతో చెప్పసాగాడు.

“చీకటి ఏర్పడుతుంది. ఇద్దరు భానులు ఆరిపోతారు. ఈ కెప్లర్ గ్రహం అంతటా చీకటి ఏర్పడుతుంది. అది ప్రళయం కాదు. సహజమైన ఖగోళ పరిణామం. కాని ఈ అంధ విశ్వాసులు, ఒకరినొకరు భయంతో చంపుకొంటారు, గృహదహనాలు చేస్తారు. సైతాను వచ్చిందని నమ్ముతారు. నాగరకత నాశనమవుతుంది. మళ్ళీ కాంతి వస్తే మళ్ళీ మొదలవుతుంది! మీరిద్దరూ ఆ ప్రళయాన్ని తట్టుకోండి. ఈ గుహల్లో దీపాలున్నాయి. అవే కాంతిని ఇస్తాయి…”

ఫిలోమినా చేతులు జోడించి, “ఈసారి చీకటి ప్రళయం ఎప్పుడు వస్తుంది స్వామీ?” అన్నది.

నిశ్శబ్దం. టపటపా మండే కాగడాల చప్పుళ్ళు తప్ప.  ఎక్కడి నుంచో హోరు గాలి.

ఆయన చేతిలో హఠాత్తుగా ఒక భరిణ ప్రత్యక్షమయింది. నీలంగా వుంది. దాని మూత వెల్వెట్‌తో కప్పబడి వుంది. ఆ మూత నిండా వేలకొద్డీ వజ్రాల లాంటి కాంతిని చిమ్మే రాళ్ళు పొదగబడి మెరుస్తున్నాయి. అది ఒక కూజా ఆకారంలా వుంది. దాని లోపల ఎర్రటి ఇసుకలాంటి పదార్థం అణువులు అణువులుగా భరిణలోకి క్రింది అరలోకి జారుతోంది. అది పారదర్శకంగా కనిపిస్తోంది.

“అవర్ గ్లాస్! ఒక రకమైన కాలయంత్రం!”’ నేను విజ్ఞాన పురాతన దర్శినిలో చదివాను” అంది ఫిలోమినా. క్రింద అర పూర్తిగా నిండిపోయింది. కొంచెమే ఖాళీ!

“మూడు వందల ఏళ్ళ కొకసారి ఆల్ఫా వన్, ఆల్ఫా టు సూర్యులు కెప్లర్ గ్రహమూ, దాని ఉపగ్రహాల నీడలలో పడి గ్రహణానికి గురి అవుతారు. అప్పుడు సంపూర్ణ ద్విసూర్య గ్రహణం ఏర్పడి గ్రహం అంతా చీకటి అవుతుంది. అది ప్రళయం అని, సైతాను ఆకాశంలోంచి చుక్కల రూపంలో వస్తాడని మూఢ మత విశ్వాసులు నమ్ముతారు. నాగరకతని నిర్మూలిస్తారు.

అవి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. అవన్నీ సుదూర గెలాక్సీలలోని గ్రహాలు, నక్షత్రాలు. వాటి నుంచి వచ్చే కాంతి! సూర్యకాంతి లేకపోతేనే అవి కనిపిస్తాయి. రాత్రి లేని గ్రహంలో అదే ఒక వింత! వింత భయం! కింది అర నిండగానే సూర్యగ్రహణాలు మొదలవుతాయి. మీరు ఆ గొడవలకి దూరంగా పోయి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!”

“మీకు… ఎలా తెలుసు స్వామీ?”

“అనేక వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు గణితంలో ఈ లెక్కలు నేర్చుకుంటూ వున్నారు. అంతం, ఆరంభంల నుంచే నేను ఇక్కడ తపస్సులో మునిగిపోయాను. నిజంగా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు! శివోహం.”

కాగడాల వెలుతురులో గుహలోని అల్మారాలు పాత డిజిటల్ కంప్యూటర్లు, కాగితంతో కూడా చేసిన గ్రంథాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించాయి.

“ఫిలోమినా! దైవం నిన్ను నా దగ్గరకి పంపింది.  తీసుకో! శుభం భూయాత్!”

నక్షత్ర భరిణని కళ్ళకద్దుకుంది ఫిలోమినా.

నేను అనుమానంగానే ఆయనకి నమస్కరించి బయటకి నడిచాను.

***

కాలం గడుస్తోంది. నక్షత్ర భరిణలోని పై అర లోంచి ఇసుక రేణువులు చాలావరకు క్రింది అరలో నిండిపోతున్నాయి.

లిబర్టీ నగరంలో మా ఇంట్లో కూర్చుని వున్నాం. క్రమంగా ఆల్ఫా వన్ సూర్యుడు పడమట పసుపురంగులోకి, ఆ తర్వాత సగం నలుపు, సగం పలచటి ఎరుపులోకి మారిపోతున్నాడు. నడినెత్తిన ఆల్ఫా టు సూర్యుడు సూర్యకాంతి నల్లగా అయి అంచుల్లో తెలతెల్లగా మెరుస్తున్నాడు.

ఫిలోమినా, నేను – ఆహారం, చీకటి రోజుల కోసం కాగడాలు, తాగడానికి నీళ్ళూ, చలి తట్టుకోడానికి దుస్తులు అన్నీ సర్దుకున్నాం.

“కొండల్లోకి పోదాం” అన్నది ఫిలోమినా.

లిబర్టీ నగర వీధుల్లో కలకలం. “ప్రళయం… ప్రళయం” ఎవరి నోట విన్నా అదే మాట.

‘ఇండిపెండెంట్ స్క్వేర్’ లో వున్న ఖగోళ పరిశోధనాలయం దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది.

శాస్త్రజ్ఞులు నలుగురు ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు.

“కాదు. ఇది ప్రళయం కాదు. మన దైవం మరణించదు. సైతాను చుక్కల రూపంలో రాడు. ఇది ఒక గ్రహణం మాత్రమే. నమ్మండి.”

మత చిహ్నాలు ఒంటినిండా పూసుకున్న గడ్డాలు మీసాల విలేకరి హుంకరించాడు.

“ఎలా చెప్పగలరు? ఇది దైవ లిఖితం. ఈ నాగరకత నశించాలని రాసి పెట్టివుంది. ఇది ఎన్నో సార్లు జరిగింది. అందరినీ మీరు మభ్యపెడుతున్నారు.”

మేము జనసమూహంలోంచి తోసుకుంటూ వూరి బయటకి నడిచాం.

నక్షత్ర భరిణ పూర్తిగా ఖాళీ అయిపోయింది. క్రింది అర పూర్తిగా నిండింది.

ఇంకా నడిచాం. దూరాన కొండల మీద నీడలు అలముకుంటూ వున్నాయి.

చీకటి నాకు కొత్త. చలి నాకు కొత్త. ఆల్ఫా వన్, ఆల్ఫా టు ఇద్దరూ పూర్తిగా ఆరిపోయారు. ఒక్కసారిగా అంధకారం అలముకుంది.

ఆ సరికి మేం ఒలింపస్ కొండ గుహల దగ్గరికి వచ్చేశాం.

సాధువులంతా గుహల బయటకి వచ్చి ఆకాశానికేసి చూస్తూ – ఏదో వింత భాషలో – ప్రార్థనలు చేస్తున్నారు.

ఒక్కసారి ఆకాశం దేదీప్యమానంగా వెలిగింది. లక్ష దీపాలు వెలిగాయి. ఆకాశంలో చుక్కల పందిరి వెలిసింది. నీలం, పసుపు, తెలుపు, పెద్దవి, చిన్నవి, తోకలతో కొన్ని, తెలిమబ్బులతో కొన్ని అసంఖ్యాకంగా మినుకు మినుకుమని మెరుస్తూ వెలుస్తున్నాయి. అవి వెలిగే దీపాల్లా సువాసన లేని పువ్వుల్లా మెరిసే నక్షత్ర మాలికలు.

వాటి కాంతితో అస్పష్టంగా మెరుస్తున్నాయి కొండలు.

సాధువులు చేతులు ఆకాశం వైపు ఎత్తి పెద్ద గొంతులతో అనేక వింత భాషలలో ప్రార్థిస్తున్నారు.

ఒక వింత చలి ఎముకలని ఒణికిస్తూ ఆరంభమైంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు అరుస్తూ చెట్ల నుంచి ఎగిరిపోయాయి. కొన్ని అడవి జంతువులు అరవడం వినబడుతోంది.

“ఇద్దరం కొండ మీదకి ఎక్కేద్దాం. ఉన్ని దుస్తులు వేసుకో! భయపడక! ఇదంతా త్వరలో ముగిసిపోతుంది!”

కొండ సగం ఎక్కినాక ఇద్దరం దక్షిణం వైపు లోయలో వున్న లిబర్టీ, కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం వైపు చూశాం.

చీకటి, బొమ్మరిళ్ళ లాంటి ఇళ్ళని కప్పేసింది. చుక్కల వెలుగురు అస్పష్టంగా వాటి మీద పడి అది ఒక భీతి గొలిపే దృశ్యంలా ఉంది.

ఎందుకంటే హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పట్టణంలోని భవనాలు నిప్పు అంటుకున్నాయి. బహుశా ఖగోళ పరిశోధనాలయం కూడా అంటుకుంటుంది.

గాలిలో అలలు అలలుగా కేకలు, నినాదాలు వినబడుతున్నాయి. అవి మాకు తెలిసిన కెప్లరీ భాషలో ‘దేవుడి శాపం, దేవుడి శాపం, అంతా నశించిపోవాలి’ అన్న అరుపులు మిన్నుముట్టాయి.

అప్రతిభులమై, ఆశ్చర్యంతో, భయంతో దూరాన వున్న ఆ దృశ్యాన్ని చూడసాగాం నేనూ ఫిలోమినా.

కెప్లర్ గ్రహపు ఇద్దరు సూర్యుళ్ళు ఆరిపోయిన వేళ దీర్ఘరాత్రిలో చీకటి ప్రళయం మొదలయింది.

 

(ఈ రచనకు ఐజాక్ అసిమోవ్ వ్రాసిన “నైట్‌ఫాల్ అనే కథ స్ఫూర్తి. నక్షత్ర భరిణ అనే పదం ఉష మరువం రాసిన కవిత్వంలో చదివి ఈ కథ వ్రాశాను. ఆమెకీ, అసిమోవ్‌కి కృతజ్ఞతలు!)

 

మీ మాటలు

  1. Madhu Chittarvu says:

    ఈ కధ చదివి ఏమీ వ్యాఖ్య లు ఎవరి నుంచీ రాక పోతే కొంచెం నిరుత్సాహ పడ్డాను.బాగా లేదేమో మరి!.వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యం మాత్రమే రాయాలని ఏమీ లేదు కానీ అది కూడా ప్రాచుర్యం లోకి తేవాలని నా ప్రయత్నం మాత్రమే.

మీ మాటలు

*