చల్లని వేళా…చలించే జ్ఞాపకం!

konni sephalikalu

అవును , రచయిత చెప్పినట్టు చల్లని వేళ తలుచుకోవలసిన జ్ఞాపకమే ఈ కథ.  ఇంకోలా చెప్పాలంటే ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా ఆ సమయం చల్లగానే కాక గుప్పున  పరిమళభరితమవుతుంది. ఎన్.ఆర్.చందూర్ గారి

కథ  అది. ఆ కథ నేను కుడా లేత కొమ్మగా ఉన్నపుడే చదివాను.  చలించిపోయాను, చాలా…  మాటల్లో చెప్పలేను.

తర్వాత కథ పోగొట్టుకున్నా, జవ్వాది అలుముకున్న జేబురుమాలు బీరువాలో మారుమూల ఉండిపోయినట్లు కథా పరిమళాలు ఈ నలభయి ఏళ్ళుగా నా వెంట వస్తూనే ఉన్నాయి.  మళ్ళీ ఇన్నాళ్ళకు కథ దొరికింది.  ఒక మహానుభావుడు అందించాడు.  కాని లేత కొమ్మ ఇప్పుడు బాగా ముదిరి ఆ లేతదనం మళ్ళీ రాదని కథ చదువుతుంటే అర్ధం అయింది.  ఇంకొక విషయం ఏమిటంటే ఇంతటి సున్నితత్వం ఇవాళ సమాజంలో కూడా లోపించిందని ,మనం మళ్ళీ అలా మారడానికి ఇలాంటి కథలు ఎంతో  అవసరం అనీ అనిపించింది

ఇందులో రచయితే ఉత్తమ పురుషలో కథ చెప్తాడు.ఆ ఉత్తమపురుష  ‘అతను’ ఇంకా టీన్స్ ఉన్నాడు.  సాహిత్యం బాగా చదువుతాడు.  చదవడమేమిటి డాస్టవిస్కీ ‘క్రైం అండ్ పనిష్మెంట్” చదివి ఒక రోజల్లా అన్నం మానేసాడు. టర్నీవ్ ‘జ్యూ’ లోని కథా భాగం చదివి కన్నీళ్లు కార్చాడు.  అతను కథలు రాస్తాడు. ఒక హోటల్లో మూడో అంతస్తులో తొమ్మిదో నెంబరు గదిలో పర్మనెంటుగా అంటే ఒక ఏడాది కాలంగా ఉంటూఉంటాడు.  డబ్బు కోసం తడుముకోవలసిన అవసరం లేని ఆర్దిక స్థితి అతనిది.  హోటల్ యజమాని, నౌకర్లు అతనితో స్నేహంగా ఉంటారు.

అలాంటి తన లేత గుండె వయస్సులో జరిగిన తన ఉహాతీతమైన అనుభవాన్ని గురించి దాదాపు పద్నాలుగేళ్ళు తరవాత గుర్తుచేసుకుంటూ మనకి చెప్తాడు.  ఆ లేతదనం తన గుండెకి ఇప్పుడు లేదని, ఇప్పుడు స్పందించడం కంటే తర్కించడం ఎక్కువ చేస్తోందని, రసాస్వాదన లోనే బోలెడంత తేడా వచ్చిందని చెప్తాడు.

ఎందుకంటే ఆ లేత ప్రధమ యవ్వన దినాలనాటి స్పందన, ఉద్వేగమూ, తీవ్రతతో కూడిన నిజాయితీ – వాటి నుంచి ఎలాంటి ‘మిరకిల్స్’ జరుగుతాయో స్వయంగా తను అనుభవించాడు కనుక,ఆ తేడా అతనికి బాగా తెలిసింది.

ఆ హోటల్ కి తనకోసం వెంకటపతి అనే మిత్రుడొక్కడే వస్తుండేవాడు.  హోటల్ యజమాని ‘సేట్ జీ’ కూడా రొజూ వచ్చి కాసేపు కష్టసుఖాలు మాట్లాడి వెళ్ళేవాడు. వాళ్ళ మాటల ద్వారా అయిదవ నెంబరు గదిలో ఒక అమ్మాయి ఉందని, ఆమె భర్త వారం రోజులుగా ఆ గది అద్దెకు తీసుకుని మూడు రోజుల క్రితమే ఆమెను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి రూంలో ఉంచాడని మూడు రోజులుగా డబ్బు పే చెయ్యడం లేదని, మనిషి కూడా ఎప్పుడో అర్థరాత్రి గాని రావడం లేదని తెలిసి, సేట్ జీ అభ్యర్ధన వల్ల  అతను కనుక్కుంటానన్నాడు.

రోజూలాగే రాత్రి చాలా సేపు చదువుకుంటూ మేలుకుని ఉన్న అతనికి ఆ రామ్ నాధ రావడమూ, ఆ అమ్మాయీ  అతనూ భోజనం చేస్తూ చాలా సేపు వాదించుకోవడమూ ఓరగా వేసి ఉన్న తలుపులోంచి కనిపించింది.భాష తెలియకపోయినా.  భోజనం కాగానే సిగరట్ ముట్టించి ఇవతలికి వచ్చిన రామ్ నాధ అతనికి దొరికాడు.  మాటలు కలిసేక అతన్ని లోపలి తీసుకెళ్ళి వారిద్దరి కథ రామ్ నాధ గంటసేపు చెప్పాడు.  ఆమె కూడా పడుకునే వింటూ ఉండింది. వాళ్ళు మలయాళీలు, ఆమె పేరు మంజులత. ప్రేమించి పెద్దవాళ్ళని  కాదని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ళు హాయిగా గడిచేయి. ఇంతలో మంజు జబ్బు పడింది. వైద్యానికి చాలా ఖర్చయింది. ఊరు మారారు.ఉద్యోగం పోయింది . మరో ఉద్యోగం దొరకలేదు.  ఆమె ఆపరేషన్ అయి హాస్పిటల్ నించి వచ్చి ఈ హోటల్ లో ఉంది. డబ్బు ఇబ్బందుల్లో ములిగి ఉన్నారు.పెద్దవాళ్ళు రానివ్వరు.అయినవాళ్ళు లేరు.

‘అతను’ చాలా సున్నితమే కాక సంస్కారం ఉన్నవాడు. స్నేహితుడు వెంకటపతి సాయింత్రం  ఆమెను ‘రంగుల చిలక’ అంటే చివాట్లు పెట్టాడు.  ఇప్పుడు ఆమె జబ్బుపడి పీలగా ఉంది కానీ చక్కనిదే.  ఆమె వంటిమీద మరే నగా లేకపోవడం వల్ల చెవులకి ఉన్న ఎర్ర రాళ్ళ దుద్దులు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. సిల్కు లాంటి జుట్టు.ఆ జుట్టు లోంచి ఎర్ర రాళ్ళు ప్రత్యేకంగా మెరుస్తున్నాయ్   జబ్బు కోసం వంటిమీద బంగారం అంతా అమ్మేసుకున్నారుట.

‘అతను’ లోపలికి వచ్చి పడుకున్నా, వాళ్ళ నిస్సహాయత గురించే ఎంతగానో దిగులు పడ్డాడు.  ఎన్నో వెర్రి ఆలోచనలు చేసాడు. ఎంతో గాఢత తో ప్రేమించుకున్న వారి మనుగడ గురించి మధన పడ్డాడు.

తెల్లవారి సేట్ జీ ఒక పొట్లం తెచ్చి ఇచ్చి “ఆ రామ్ నాధ ఈ దుద్దులు ఇచ్చి పోయాడు.  డబ్బులు లేవన్నాడు” అని చెప్పి వాపోతే ఆ పొట్లం తీసుకుని అతనికి పాతిక రూపాయల చెక్ ఇచ్చి పంపేసాడు.ఆ దుద్దులు చూడగానే అతని మనసంతా కలగిపోయింది . సేట్ జీకి అతని మంచితనం తెలుసు కనుక, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకుని అందుకోసం ఇంత సాయం చేసే లాంటి మనిషి కాదని అతని గురించి తెలుసు కనుక,  మారు మాట్లాడలేదు గానీ – ఆ ఉదయం వేళ అతనికి లోకమంతా అగమ్యంగా తోచి ఉంటుందని’ రాస్తాడు రచయిత.  ‘అతను’ ఆ దుద్దుల పొట్లం నౌకరు ద్వారా ఆమెకు పంపబోయి, తానే ఇవ్వాలనే ఒక బాల్య చాపల్యంతో తానే ఆ గదికి వెళ్ళడమే ఒక అద్భుతమైన అనుభవానికి కారణమయిందని చెప్తాడు

అతను వెళ్లేసరికి ఆమె విపరీతమైన భాధతో పొట్ట పట్టుకుని లుంగలు చుట్టుకుపోతూ ఉంది.తెల్లవారుఝాము నుంచి నౌకరు కూడా ఇటు రాలేదట.  ఆమె చెప్పిన మాటలను బట్టి రామ్ నాధ బయటకు వెళ్ళక తప్పలేదని,ఉదయం నుంచి తన ప్రాణం పోయేలా ఉందని అంత బాధలోనూ చెప్పింది.

కాఫీ తెప్పించి పట్టిస్తే తాగి, గబా గబా వాంతులు చేసుకుంది.  అతను ఆమెను పట్టుకుని పడుకోబెట్టి డాక్టరును పిలిపించి ఇంజక్షన్ చేయించాడు.

విషయమేమిటంటే ఆమెకు వచ్చిన జబ్బుకి ఆమె సంసారం చెయ్యకూడదు.  అలా జరిగితే ఆమె ఏ క్షణమైనా చనిపోవచ్చు.  ఆ రాత్రి ఆ తప్పు చేసాడు రామ్ నాధ. ఆమెకు తాను బతకనని తెలుసు, డాక్టరూ అదే చెప్పాడు.

ఆమె అతనికి ఆ మరణ వేదనలో అత్యంత ప్రియమైనదైపోయింది.అతని గుండె జాలితో, వేదనతో కరిగిపోయింది   ఆమె కోసం ఎంతయినా ఇస్తాను బ్రతికించ మన్నాడు.  డాక్టరు నవ్వి బతకడం అసంభవం, ఈ రాత్రి పన్నెండు దాటడం కష్టం అన్నాడు. ఏవో నాలుగు పొట్లాలిచ్చి వెళ్ళాడు.

ఆమె అతని చెయ్యి వదల్లేదు. తన పక్కనే కూర్చోపెట్టుకుంది.  మరణ భయంతో ఆమె కళ్ళ ముందు నల్లటి నీడలు. అతను ఆమె సిల్కు జుట్టు నిమురుతూ ధైర్యం చెబుతూ ఉండిపోయాడు.

ఆమె బాధతో తాదాత్మ్యం చెందడం లో అతని మనసంతా ఆమె పట్ల  గొప్ప ప్రేమతో నిండిపోయింది.  రామ్ నాధ  ఇక రాకపోతే ఈ పెన్నిధి నాదే. ఈమె బతకాలి అని అతని ప్రాణం అపరిమితంగా కొట్టుకు పోయింది. ఆమె కడుపు పట్టుకుని మెలికలు తిరుగుతూ నరకబాధ పడింది.  కానీ అతని చెయ్యి వదల లేదు.

అతనికి ఆమె తన చెయ్యి పట్టుకున్నపుడు ఆ రోగి స్త్రీ అనే భావన కలిగిందట.  ఏదో విద్యుత్ నాలో ప్రవహించిందంటాడు.  అది మామూలు విద్యుత్ కాదు, మంత్ర మయమయిన విద్యుత్.  మీ చేతుల్లో ప్రాణాలు వదలనివ్వరూ ? నన్ను వదిలి వెళ్లి పోవద్దే అని ఆమె ఏడుస్తుంటే,  ఎవరూ దిక్కులేకుండా ఈ చిన్ని పుష్పం నేల కలుస్తుందా ! అనే అతని ఆవేదన ఆమెకు ధైర్యాన్నిస్తూ వచ్చింది.

గంటలు గడిచాయి “ఎందుకో తెలియదు, నువ్వు నా కోసం బతకాలి, బతికి తీరాలి” అనే అతని కంఠంలోకి ఏడుపు కూడా వచ్చింది.  ఆమె ఆ ప్రేమను గ్రహించింది.  అంత బాధలోనూ తన బాధ మరిచి అతన్ని లాలించింది.  అతని కంఠంలోని రోదన ఆమెను కొత్త లోకాలలోకి వెలిగించింది.అటువంటి స్త్రీ లాలన అతనికి కొత్త.

పగలంతా గడిచింది.  ఇద్దరి మధ్య వాళ్లకు మాత్రమె తెలిసే చనువు ఏర్పడింది.  బాధ కాస్త తగ్గగానే మొహానికీ చేతులకీ పౌడర్ వేసుకుంది.  అతన్ని అడిగి లవండర్ కూడా రాసుకుంది.  ఇంత తెలివిగా ఉన్న మనిషి అర్థ రాత్రి లోపు చనిపోతుంది.  ఆమెకూ తెలుసు.  అతనికీ తెలుసు.  ఆ చావు అమాంతం వస్తుంది.  బహుశా మాట్లాడుతూ మాట్లాడుతూ కొలాప్స్ కావచ్చు.

రామ్ నాధ వచ్చినా ఫరవాలేదనీ, తన పక్కన అలా కూర్చునే ఉండాలనీ నిష్కర్షగా చెప్పింది.  రాత్రి గడిచే కొద్దీ ఆమెకు భయం పెరుగుతూ వచ్చింది.  గ్లూకోజ్ నీళ్ళు పట్టాడు.  కిటికీలు ముసేసాడు.  అతనికీ భయంగానే ఉంది.  ఆమె భయం ఏదో విధంగా పోగొట్టాలి.  ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వెన్నుముక మీద చేతివేళ్ళతో నిమిరేడు. నిద్రపోయింది.

పన్నెండింటికి ఉలిక్కిపడి లేచి అతని వళ్ళో తలపెట్టుకుని పడుకుంది. మళ్ళీ కునుకుపట్టిన అరగంటలో కెవ్వుమని కేక పెట్టింది. మరణయాతన పడింది. నువ్వు నా మంజువి, నాకోసం బతికించు కుంటాను. ప్రేమలో అమృతానికున్న గుణం ఉందన్నారు.  నువ్వు బతక్క తప్పదు అన్నాడు.  ఇక ఇక్కడ రచయిత మాటలే రాయాలి.

“ఆమె బతికింది. సులువుగా ఒక్క మాటలో ఆ సంగతి ఈనాడు చెబుతున్నానే గాని, ఆనాడు తెల్లవారుఝాము మూడు గంటల దాక ఎంత బాధపడింది మంజు. విలవిలా తన్నుకునే ఆమె పాంచ భౌతిక శరీరాన్ని చూసి నేనెంత ఏడ్చాను.  బాధలూ, కన్నీళ్లు కాలమనే మహార్ణవంలో కలిసిపోతాయి కదా!  నా మంజూ నాకోసం మృత్యువుతో హోరా హోరీ పోరాడింది. ఎంత అహం – నా మంజు, నా కోసం:  మంజూ నేనూ జీవితంలో కలుసుకోము – కలుసుకోక పోయినప్పటికీ ఎంత అహం”

మర్నాడు డాక్టరు మంజులత బతకడం మిరకిల్ అన్నాడు.  ఆమెకింక ప్రాణ భయం లేదన్నాడు ఆ స్థితి దాటాక.డాక్టర్ వెళ్ళాక అతను ఆ ‘ఎర్ర రాళ్ళ’ దుద్దులు ఆమె చేతిలో పెట్టాడు.  అవి ఇవ్వడానికే కదా ఆ ఉదయం ‘అతడు’ ఆమె గదికి వెళ్లి ఆమె బాధ చూసింది.

చివరకు రామ్ నాధ విధిలేక ఆమెను వదిలి వెళ్ళిపోయాడు.  ఆమె తన అన్నగారిని పిలిపించుకుని అతనితో వెళ్ళిపోయింది.  ఈ లోగా నాలుగు రోజులు అదే రూమ్ లో ఉంది. ఆ నాలుగు రోజులు అతను ఆమెను తన ప్రాణంగా భావించాడు. వదలలేక వదలలేక మంగళూర్ మెయిల్ ఎక్కించాడు.  ఆమెకూ అంతే.  ఆమె తన గుర్తుగా ఆ ఎర్ర రాళ్ళ దుద్దులు అతనికి ఇచ్చింది.అతని కాబోయే భార్యకు ఇవ్వమని చెప్పింది

ఇదంతా పద్నాలుగేళ్ళ తర్వాత గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అవి నా భార్య చెవులను మెరుస్తూ ఉన్నాయంటాడు.

ఎవరి జీవితాలూ ఆగలేదు.  కానీ ఆగిన చోట ఒక సమయంలో, ఒక సందర్భం ఇద్దరినీ ఎలా దగ్గర చేసింది.  ఆ సమయం ఎలాంటిది ? ! ఆ వ్యక్తులెలాంటి వాళ్ళు ?! వాళ్ళ హృదయాలు ఆ సమయంలో గొప్ప వెలుగులో ఎలా ధగద్దగాయమానం అయ్యాయి – ?!

పూవులో సువాసన కనిపించనట్టే ప్రేమ కూడా కనిపించదు కదా?కేవలం అనుభవానికే తెలుస్తుంది. కానీ ఎంత మందికి ఆ అనుభవం తెలుస్తుంది.  మరణాన్ని సైతం ధిక్కరించగల ఆ అనుభవం, దానిపేరు ఏదయితేనేం.  కామం మాత్రం కాదు.  వారి మధ్య ఆ సంబంధం సాధ్యం కాదుకదా!

మంజు, రామ్ నాధ గాడంగాప్రేమించుకున్నారు.  కొంత జీవితం సుఖంగా గడిపారు. కానీ, మంజు ‘అతని’ నించి పొందిన ప్రేమ అవ్యాజమయినది. ఆమెకు అది ప్రాణాధారం.  ఆపైన ఆమెకు అతను ప్రాణాధికుడు.

లేత యవ్వనం ఎంత మృదువైనది.  దానికితోడు అతను నిరంతరం గొప్ప సాహిత్యం చదువుకుంటూ  దాంతో ఆ సున్నితాన్ని మరింత మృదువుగా, సంస్కారవంతంగా మార్చుకున్నాడు.

అందువల్లనే ఆమె బాధను తనదిగా తీసుకోగలిగాడు.  అలా తీసుకోవడంలో ఆమెతో ఆకస్మికమయిన ప్రణయ బంధానికి లోనయ్యాడు.  మానవతాదృష్టిలోంచి, దయలోంచి, గాఢ ప్రణయంలోకి అతనూ, అతనివెంట ఆమె చేసిన ప్రయాణం అంతా మన కళ్ళముందే నడుస్తుంది.  ఆ పగలూ, రాత్రీ మనం కళ్ళప్పగించి వారిద్దరి వేదనా ఉత్కంఠతో చూస్తూ నిమిష నిమిషం బరువుగా గడుపుతాం.  ఇదంతా చందూరి నాగేశ్వరరావు గారి ప్రతిభ. పైగా ఆయన ఇది కథ కాదంటాడు.  కథ అయితే పాత్రల్ని రచయిత ఇష్టం వచ్చినట్టు నడపచ్చు.  సన్నివేశాలు మార్చవచ్చు.  కానీ ఇది కథ కాదు.  నిజంగా అలా జరిగింది.  ఆ సన్నివేశాలు అలాగే మారాయి. చివరికి ఆశ్చర్యంగా వారిద్దరి భీతి , బాధ కన్నీళ్ల మధ్య ఆ అద్భుతం జరిగింది.  మళ్ళీ కలవకపోతేనేం వారి అనుబంధం మన మనస్సులో కుడా ఎంతో పదిలంగా ఉంటుంది.

స్త్రీ పురుష సంబంధాల గురించి మనం ఎన్ని చర్చలు చేస్తాం?ఇలాగే ఉండి తీరాలని ఎలా శాసిస్తాం!కాని జీవితం వీటన్నిటి కన్న యెంత అగోచరమో ,యెంత ఆశ్చర్యమో,ఎంతటి అద్భుతమో ఇలాంటి కథలు చెప్పకనే చెప్తాయి.ఇక మనం వేరేగా చెప్పేది ఏముంది !!!

%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b0%b3%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae

*

మీ మాటలు

  1. Srinivas Goud says:

    చాలా చక్కని విశ్లేషణ..కథ వెంటనే చదవాలి..

  2. Sadlapalle Chidambarareddy says:

    జీవితం వీటన్నిటి కన్న యెంత అగోచరమో ,యెంత ఆశ్చర్యమో,ఎంతటి అద్భుతమో ఇలాంటి కథలు చెప్పకనే చెప్తాయి.

  3. D. Subrahmanyam says:

    అద్భుతమయిన విశ్లేషణ. వీరలక్ష్మి గారి ప్రత్యేకం .

  4. వీరలక్ష్మి గారూ !మీరు ఎంచుకునే కధలు మానవసహజ భావనాలకన్నా కొంచెం ఎత్తుగా ,ఎంతో మంచి అనదగ్గ దైవిక భావనలకు దగ్గరగా ఉంటాయి. జీవిత కాలంలోఒక గొప్ప సంఘటన ఒక విశిష్ట జ్ఞాపకం అయి ఇచ్చే శాశ్వతానుభూతి వల్ల మనం పునీతమౌతాము . నాకైతే నా హౌస్-సర్జెన్సీ లో కాలిన రోగుల విభాగంలో ఇంజక్షన్ డ్యూటీకి వెళ్తే రాజమండ్రి పుట్టిల్లుగా కల ఒక ఇల్లాలు ఏడుస్తుంటే నిద్రకు ఇంజక్షన్ చేసి కూడా ఆవిడని వదిలి రాలేక ఆ రాత్రి 7. 30 కి అపుడు వచ్చిన గీతాంజలి సినిమా లో ఓ పాపా లాలీ పాట పాడి వెక్కివెక్కి ఏడ్చి ఇంటికి వచ్చిన నేను నాకు గుర్తొచ్చాను . మీ ఎంపికకు ,మీ బహు సున్నితమైన విశ్లేషణకు గత కాలపు జ్ఞాపకాలు కదలి లేచి వచ్చాయండి . ఒకరి బాధను మనదిగా తీసుకోగలిగిన అన్నారు చూశారూ ఇదే మీ ముద్ర గల గొప్ప విశ్లేషణ .కథ ఆత్మను పట్టుకుని మా ముందు నిలబెట్టేరు. నా మనఃపూర్వక నమస్సుమాలు అందుకోండి . మీ శేఫాలికలంత పరిమళం లేకున్నా అంట తెల్లనివే ఇవి …శైలజ

  5. Annapurna says:

    నిరంతరం సాహిత్యాన్ని చదువుకుంటూ ఆ సున్నితాన్ని మరింత మృదువుగా సున్నితంగా మార్చుకుంటున్నాడు.అందువల్లనే ఆమె బాధని తన బాధగా తీసుకుంటున్నాడు ….సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని ఎంతో చక్కగా ఈ కథతో కలిపి చెప్పారు .మీ సాహిత్యానుశీలనం మిమ్మల్ని ఎప్పటికి లేత కొమ్మగానీ ఉంచింది .మీవిశ్లేషణ బాగుంది

  6. దత్తమాల says:

    కథ చదివినట్టే ఉంది . అయినా ఒరిజినల్ ప్రింట్ చదవాలని ఉంది .లింక్ ఓపెన్ కావడం లేదు ..

  7. Vvlakshmidevi@gmail.com i says:

    థాంక్యూ మాల గారూ
    కథ లింక్ ని పైకిపైకి జరుపుతూ వెళ్ళాలి

  8. తహిరో says:

    కథను జవ్వాది పరిమళం లా పరిచయం చేశారు మీరు. కథ చదివిన తర్వాతె మీ పరిచయం చదివాను. జీవితం కల్పనకంటె మహాద్భుతం అంటారు – ఇలాంటి కథలు చదివాక ఆ తత్వం మరింత బోధ పడింది. ప్రతి మనిషికి మంజులత వంటి వారు తారసిల్లే ఉంటారు – కాకపొతె కొందరికి ఆమె వెంటాడే జ్ఞాపకం – మరికొందరికి మరుగున పడిన జ్ఞాపకం.
    వీరలక్ష్మీ దేవి గారూ – మంచి కథను పరిచయం చేశారు . ధన్యవాదాలు .
    అన్నట్టు నేను 16 ఏళ్ళ మద్రాస్ వెళ్ళినప్పుడు చందూర్ (దంపతులతో ) గంటసేపు గడిపాను – మళ్ళీ అవన్నీ గుర్తు చేశారు.

    • Vvlakshmidevi@gmail.com i says:

      జగదీశ్వర్రెడ్డిగారు
      Dhanyavadalu. Meeru kuda dhanyulu. chandur dampatulato gadipinanduku.

  9. దేవరకొండ says:

    పసితనం తాలూకు అమాయకపు నిర్మలత్వం వయసు గడిచే కొలదీ క్రమంగా మాయమై సున్నితత్వం అణగారిపోతుంది. పరిశుభ్రమైన రచనలు చేసే కవుల్లోనూ రచయితల్లోనూ అటువంటి సున్నితమైన నిర్మలత్వం వుండే అవకాశం ఎక్కువ. ఉత్తమ సాహిత్యాన్ని చదివే అలవాటున్నవారికి కూడా అది ఉంటుంది. ఇలాంటివి చదివినప్పుడు అది ఇంకా మిగిలి ఉందా ఆవిరైపోయిందా అని మన మనసుల్ని చెక్ చేసుకునే వీలుంటుంది. అలాంటి వీలును తరచూ కల్పిస్తున్న వీర లక్ష్మి దేవి గార్కి ధన్యవాదాలు.

  10. Manchi vishleshana…
    It reminded me of Tilak’s Voorichivara Illu.
    Thanks for such marvellous story write up Veeralaxmi garoo…
    Bhasker.K

  11. Sasikala Volety says:

    కధ ఎంత సున్నితమో, మీ మాటలు అంతకన్నా సున్నితంగా, హృద్యమంగా ఉన్నాయి. అన్ని తర్కాలకూ అతీతమయిన ప్రేమభావన, దానికున్న అమృత శక్తి, కధలో ఎంతో అందంగా పొందు పరిచారు రచయిత. బెంగాలీ సాహిత్యంలో కనిపించే, మనసును తాకే భావనా పరంపర మనలో నింపుతోంది ఈ కధ. చక్కటి కధాపరిచయానికి, పాత పరిమళం పరిచయం చేసిన మీ అద్భుత విశ్లేషణలకు ధన్యవాదాలండి.

  12. వరలక్ష్మి గారు ..మీ కొన్ని శఫాలికలు , “మంగులూరు ఎక్స్‌ ప్రెస్స్‌” కథ విశ్లషణ చాల బాగుంది .మానవత్వమున్న సున్నిత మైన మనిషి మనో భావాలు ఎంత సహజంగా అంకురిస్తాయొ ,వాటి పరిమళం రచయిత ను సున్నిత మనస్కులైన పాఠకులను ఎలా వెంటాడుతుందో ఉదహరించే మంచి కథ ను మాకందించారు , ధన్యవాదాలు

  13. పద్మాకర్ దగ్గుమాటి says:

    చక్కని విశ్లేషణ మేడం ! కథ చదవనవసరం లేనంతగా…

మీ మాటలు

*