ఎవరూ ‘నో’ చెప్పలేని సినిమా!

 

pink1

చిత్రం – ‘పింక్‌’ (హిందీ), తారాగణం – అమితాబ్‌ బచ్చన్, తాప్సీ పన్ను, కీర్తీ కుల్హారీ, ఆండ్రియా తైరాంగ్, అంగద్‌ బేడీ, పీయూష్‌ మిశ్రా, కథ – స్క్రీన్‌ప్లే – రితేశ్‌ షా, కెమేరా – అభిక్‌ ముఖోపాధ్యాయ్, సంగీతం – శాంతను మొయిత్రా, ఎడిటింగ్‌ – బోధాదిత్య బెనర్జీ, నిర్మాతలు – రష్మీ శర్మ, సూజిత్‌ సర్కార్, దర్శకత్వం – అనిరుద్ధ రాయ్‌ చౌధురి, నిడివి – 136 నిమిషాలు, రిలీజ్‌ – సెప్టెంబర్‌ 16

 

ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయమని తెలిసేలా టైటిల్‌ పెట్టుకున్న ‘పింక్‌’ సినిమా గురించి హాలులోకి వెళ్ళే దాకా నిజంగా నాకేమీ తెలియదు. అమితాబ్‌ నటిస్తున్న సినిమా అనీ, తాప్సీ కూడా ఉందనీ మాత్రం చదివాను. ఎందుకనో అంతకు మించి తెలుసుకోలేదు. ట్రైలర్‌ కూడా మిస్సయ్యాను. కానీ, పోస్టర్‌ చూసినప్పటి నుంచి సినిమా చూడాలని మైండ్‌ ఫిక్సయిపోయింది. మనసు చెప్పేవాటికి మెదడు వివరణ ఇవ్వలేదు. అది అంతే! సినిమా చూడదలుచుకొంటే అది రిలీజయ్యాక దాని గురించి దూషణ భూషణ తిరస్కారాలేవీ తెలుసుకోకపోవడం, విశ్లేషణలు చదవకపోవడం నాకున్న అలవాటు. అవన్నీ తెలుసుకుంటే ఏమీ రాయని పలకలా స్వచ్ఛంగా సినిమాకు వెళ్ళలేనేమోననీ, ఆ చదివినవాటి ప్రభావంతోనే హాలులో ఆలోచిస్తానేమోననీ ఒక చిన్న భయం. అందుకే, ‘పింక్‌’ వచ్చి మూడు రోజులైనా, దాని గురించి ఏమీ చదవలేదు. తెలుసుకోలేదు. ఇప్పుడే సినిమా చూసొచ్చాను. అర్ధరాత్రి అయ్యిందన్న మాటే కానీ, నిద్ర పట్టని అనుభవం ఈ సినిమా. ఇంటికొచ్చేశాక కూడా దర్శక, రచయితలు సమాజానికి సంధించిన ప్రశ్నలు నా బుర్రలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మనసులో అనిపించింది ఏదో రాయాలి… మనసు చెబుతోంది. రాయకుండా పడుకోలేని మనఃస్థితిలో… ఒకానొక రాత్రివేళ రాసుకుంటూ వెళ్ళిన ర్యాంబ్లింగ్స్‌ ఇవి…

అవునూ… కాస్తంత నవ్వుతూ, తుళ్ళుతూ, షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ తిరిగే అమ్మాౖయెతే… ఇక ఆ అమ్మాయి తిరుగుబోతు అనేనా? పార్టీకి వచ్చి ఒక దమ్ము బిగించి, బీరు కొట్టినంత మాత్రాన ఆడపిల్లంటే అలుసా? డబ్బుకో, మరొక దానికో చటుక్కున లొంగి, టపుక్కున పక్కలో చేరిపోతుందనే భావనా? వర్కింగ్‌ లేడీ కాస్తంత ఆలస్యంగా రూమ్‌కొచ్చినా, ఆమె కోసం ఇద్దరో ముగ్గురో మగ ఫ్రెండ్స్‌ రూమ్‌కు వచ్చినా ఆ అమ్మాయి బజారుదనే అర్థమా? కాస్తంత అందంగా తయారై ఆఫీసుకు వచ్చినా – క్యారెక్టర్‌ బ్యాడ్‌ అనే తాత్పర్యమా? ఏమిటీ మైండ్‌సెట్‌! తప్పు మనదా? మనల్ని ఇలా తయారుచేసిన చుట్టుపక్కలి సమాజానిదా? మరి, మనం మారమా? ఎప్పటికీ మారమా? మనసుతో బుర్రకు పని చెప్పే ఇలాంటి ప్రశ్నలెన్నో ‘పింక్‌’ మనకి వేస్తుంది. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

————————-

కథగా ఈ సినిమా చాలా సింపుల్‌. ఢిల్లీ పిల్ల మీనల్‌ అరోరా (తాప్సీ), లక్నో వనిత ఫాలక్‌ అలీ (కీర్తీ కుల్హారీ), మేఘాలయ పిల్ల ఆండ్రియా (ఆండ్రియా తైరాంగ్‌) – ముగ్గురూ వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధుల్లో ఉంటారు. స్వతంత్రంగా గడపాలనుకొనే ఈ ఆధునిక తరం యువతులు ఢిల్లీలో ఒక అపార్ట్‌మెంట్‌ను కలసి అద్దెకు తీసుకొంటారు. స్వేచ్ఛగా బతుకుతుంటారు. సిగరెట్‌ తాగడం, అవసరాన్ని బట్టి ఒకటో రెండో పెగ్గులేయడం, మనసుకు నచ్చితే దైహిక అవసరం తీర్చుకోవడం – ఇవేవీ తప్పు కాదని నమ్మి, అలాగే బతికే కొత్త తరానికి వీళ్ళంతా ప్రతినిధులు. ఒకసారి ఫ్రెండ్స్‌ నైట్‌ పార్టీలో జరిగిన ఒక గొడవలో మంత్రి గారి బంధువైన యువకుడు రాజ్‌ వీర్‌ (అంగద్‌ బేడీ)ని సీసాతో కణత మీద గట్టిగా రక్తమోడేలా కొట్టి, మీనల్‌ తన స్నేహితురాళ్ళతో కలసి పారిపోతుంది. అతగాడికి కంటి పైన తీవ్రగాయమై, ఆస్పత్రిలో కుట్లు కూడా పడతాయి. మీనల్‌ మీద కక్ష తీర్చుకోవాలని విలన్‌ బృందం ప్రయత్నం. పోలీసుల దగ్గరికి వెళ్ళాలని హీరోయిన్‌ సాహసం. రాజీ కుదర్చాలని మధ్యలో ఫ్రెండ్స్‌ తాపత్రయం.

రాజీ ప్రయత్నం విఫలమైపోతుంది. పోలీసుల దగ్గరకు హీరోయిన్‌ వెళ్ళడంతో ఆమెను ఏకంగా కిడ్నాప్‌ చేసి, వ్యాన్‌లో అఘాయిత్యానికి పాల్పడి మరీ విలన్లు బెదిరిస్తారు. పైగా, అమ్మాయిలపై తామే ఎదురు ఫిర్యాదు చేస్తారు. హీరోయిన్‌ జైలు పాలవుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలకు, ఆ ఇంటి పక్కనే ఉండే ప్రముఖ రిటైర్డ్‌ లాయర్‌ దీపక్‌ సెహ్‌గల్‌ (అమితాబ్‌ బచ్చన్‌) బాసట అవుతాడు. చాలా రోజుల క్రితమే నల్ల కోటు వదిలేసిన ఆయన మళ్ళీ ఈ ఆడపిల్లలకు న్యాయం జరిపించడం కోసం బరిలోకి దిగుతాడు. కానీ, తీరా విలన్లు, వారి లాయర్‌ (పీయూష్‌ మిశ్రా) మాత్రం హీరోయిన్, ఆమె స్నేహితురాళ్ళు పక్కా వ్యభిచారుణులన్నట్లు చిత్రీకరిస్తారు. మరి, అప్పుడు ఏమైంది? ఆ అపవాదును ఆ అమ్మాయిలు ఎలా ఎదుర్కొన్నారు? అసలింతకీ ఆ పార్టీ రోజున జరిగిందేమిటి? మొదలనవన్నీ మిగతా సినిమా.

————————-

ఒక చిన్న సంఘటన, దాని పర్యవసానాలు… అంతే ఈ సినిమా కథ. పాటలు, డ్యాన్సులు, కామెడీల లాంటి ఐటమ్‌లు, కనీసం ఐటమ్‌ సాంగ్‌లు కూడా లేని సినిమా. సినిమాలో ఒకటికి రెండుసార్లు వినిపించే ఒకే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, రోలింగ్‌ టైటిల్స్‌లో వచ్చే కవితాత్మక గీతం మినహా ఇందులో సోకాల్డ్‌ ‘సినిమాటిక్‌ సాంగ్స్‌’ లేవు కాక లేవు. ఆ మాటకొస్తే, సినిమాలో పేరున్న నటీనటులు మాత్రం ఎవరున్నారని? మనందరికీ తెలిసిన అమితాబ్‌ బచ్చన్, మన దగ్గర మాత్రమే కాస్తంత పాపులరైన తాప్సీ. వాళ్ళు కూడా మనకు వాళ్ళలా కనపడరు. కథలో పాత్రలుగానే అనిపిస్తారు.

అమితాబ్‌ను ఎందుకు గొప్ప నటుడంటారో తెలుసుకోవాలంటే, అనారోగ్యం పాలైన భార్యను చూసుకొనే టైమ్‌లో అతని హావభావాలు, అతని డైలాగ్‌ మాడ్యులేషన్, పూడుకుపోయిన గొంతుతో అతను మాట్లాడే డైలాగులు చూడండి, వినండి. ఫెమినిస్టుగా కనిపించే అదే మనిషి – కోర్టులో నిలదీస్తున్నప్పుడూ, నిర్ఘాంతపోయి ఆవేదనాపూరిత మనస్కుడైనప్పుడూ మాట్లాడే తీరు, ప్రవర్తన గుర్తించండి. ఇవాళ్టికీ ‘సర్కార్‌’, ‘బ్లాక్‌’, ‘పీకూ’ లాంటి విభిన్న తరహా సినిమాలు, వయసుకు తగ్గ సినిమాలూ చేసే ఆయన మీద మన సినిమా స్టార్స్‌ అందరి కన్నా ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి దాకా తాప్సీని గ్లామర్‌ రోల్స్‌లోనే చూసి, మానసికంగా అలాగే ఫిక్సయిపోయివాళ్ళకు ఈ సినిమా ఒక స్టార్‌ట్లింగ్‌ రివిలీషన్‌. ఈ పాత్ర, కోర్టు బోనులో నిలబడే సీన్లలో ఆమె నటన చూశాక, నటిగా ఆమె మీద గౌరవం కలుగుతుంది.

సినిమాలో ఇక, మిగతా అంతా పెద్ద పేరున్నవాళ్ళు కాదు. కానీ ఎంత బ్రహ్మాండంగా పాత్రల్ని పండించారో! తాప్సీకి స్నేహితురాలుగా వేసిన ఇద్దరమ్మాయిలూ, ముఖ్యంగా ఫాలక్‌ అలీ పాత్రధారిణి, అలాగే కోర్టులో అబ్బాయిల తరఫు లాయర్, జడ్జి (ధ్రుతిమాన్‌ ఛటర్జీ), అమితాబ్‌ భార్య (మమతా శంకర్‌), చివరకు హౌస్‌ ఓనర్‌ సహా ప్రతి పాత్రా సహజంగా అనిపిస్తుంది. తెరపై సజీవంగా కనిపిస్తుంది.

————————-

టెక్నికల్‌గా కూడా ‘పింక్‌’ సౌండే! విడిగా మళ్ళీ డబ్బింగ్‌ చెప్పాల్సిన అవసరం లేకుండా సెట్స్‌లో నటిస్తున్నప్పుడే డైలాగులు కూడా రికార్డు చేసే ‘సింక్‌’ సౌండ్‌ విధానం వాడారు. ఇవాళ తెలుగు సినిమాకు కూడా విస్తరిస్తున్న హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల తాలూకు ‘సౌండ్‌ డిజైనింగ్‌’ అనే ప్రత్యేక శాఖతో స్క్రిప్టుకు వచ్చే బలం ఎంతో సినిమా చూస్తే అర్థమవుతుంది. నేపథ్య సంగీతం అంటే, డబ డబ డప్పుల మోత, హీరో గారి ఎంట్రన్స్‌ నుంచి విలన్‌తో ఢీ అన్నప్పుడల్లా హై డెలిబల్స్‌ సౌండ్‌ అలవాటైపోయిన ప్రాంతీయ భాషా సినీ ప్రేక్షకులకు ‘పింక్‌’ ఒక రిఫ్రెషింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. శాంతను మొయిత్రా (గతంలో రాజేశ్‌ టచ్‌రివర్‌ డైరెక్ట్‌ చేసిన అవార్డు చిత్రం ‘నా బంగారు తల్లి’కి నేపథ్య సంగీతం కూడా శాంతనూయే) నేపథ్య సంగీతం, రీ–రికార్డింగ్‌ ఇటీవల వచ్చిన సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అంటే అతిశయోక్తి అనిపిస్తుందేమో! కానీ, అది నిజం!

సినిమా చూస్తుంటే… తెరపై టైట్‌ క్లోజప్‌లు, నేమ్‌బోర్డ్స్‌ మీదుగా ప్యాన్‌ చేస్తూ సిటీలోకి కారులో సాగే ప్రయాణం – ఇలా చాలా చోట్ల కెమేరామన్‌ అభిక్‌ ముఖోపాధ్యాయ్‌ పనిమంతుడని అర్థమైపోతుంటుంది. ఆ సీన్‌లో, ఆ సన్నివేశం తాలూకు అనుభూతిలో ప్రేక్షకుణ్ణి కూడా ఒక భాగం చేసే ఆ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక, సినిమా ఎడిటింగ్, షాట్స్‌ సెలక్షన్, వాటి కూర్పులో తెచ్చిన డ్రామా కూడా చాలా ఉంది. వీటన్నిటినీ సౌండ్‌ డిజైన్, నేపథ్య సంగీతం మరో మెట్టు పైన కూర్చోబెట్టాయి. కథ జరుగుతున్న కొద్దీ, టైమ్‌కు తగ్గట్లుగా విలన్‌ ముఖం మీది గాయం కూడా క్రమంగా మానిన లక్షణాలతో మేకప్‌ చేయడం లాంటివి చూడడానికి చాలా చిన్న విషయాలే. అయితే, అవన్నీ దర్శకుడి శ్రద్ధాసక్తులకు నిస్సందేహంగా నిదర్శనం.

————————-

pink2

సినిమా మొదలైన క్షణాల్లోనే ప్రేక్షకుల్ని కెమేరా కన్ను వెంట కథలోకి లాక్కుపోవడం ఏ ఉత్తమ స్క్రిప్ట్‌కైనా ప్రాథమిక లక్షణం. అది ‘పింక్‌’లో పుష్కలం. న్యూస్‌పేపర్లలో వస్తున్న సమకాలీన సంఘటనల స్ఫూర్తితో రితేశ్‌ షా రచన చేసిన ఈ సినిమా మొదలైన తర్వాత గంటకి ఎప్పుడో ‘ఇంటర్‌మిజన్‌’ అని తెరపై పడితే కానీ, టైమ్‌ తెలీదు. ఇక, పూర్తిగా కోర్టు డ్రామాగా నడిచే సెకండాఫ్‌ అయితే అంతకన్నా రేసీగా, ఆలోచించే తీరిక ఇవ్వకుండా పరుగులు తీస్తుంది. ఆస్పత్రిలో భార్యకు ఈ ముగ్గురు ఆడపిల్లల్నీ అమితాబ్‌ పరిచయం చేస్తుంటే, మంచం మీద నుంచి లేవలేని భార్య బిస్కెట్‌ ప్యాకెట్‌ అందించే సీన్‌ లాంటి సెన్సిబుల్‌ మూమెంట్స్‌ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. అసలు జరిగిన కథేమిటో ఆఖరులో రోలింగ్‌ టైటిల్స్‌లో చూపెట్టే ‘పింక్‌’ స్క్రీన్‌ప్లే పరంగా, కథాకథన శైలి పరంగా ఔత్సాహికులు గమనించాల్సిన సినిమా.

అలాగని ఈ సినిమా స్క్రిప్టులో లోపాలు లేవని కాదు. హీరోయిన్‌ను పోలీసులు జైలులో పెట్టినా, ఆ తరువాత కథ కోర్టు దాకా వెళ్ళినా – అంతకు ముందు కనిపించిన హౌస్‌ ఓనర్‌ ముసలాయన ఎందుకొచ్చి, నోరు విప్పడో తెలియదు. అలాగే, తనను కిడ్నాప్‌ చేసి, ఊరంతా వ్యాన్‌లోనే విలన్లు తిప్పిన సంగతి గురించి కోర్టులో హీరోయిన్‌ చెప్పదు. విలన్ల కన్నా ముందే పోలీసుల్ని ఆశ్రయించి భంగపడిన విషయమూ జడ్జి ఎదుట బయటపెట్టదు. అయితేనేం! ఈ సినిమా ప్రస్తావించిన అనేక మౌలిక అంశాల ముందు ఈ లోటుపాట్లు మర్చిపోదగ్గవే!

చలం ఏనాడో చెప్పినట్లు, స్త్రీకి కూడా ఒక మనసుంటుంది… ఆమెకూ ఇష్టానిష్టాలు ఉంటాయి. అవేవీ గమనించకుండా, గౌరవించకుండా తాళి కట్టిన భార్య అనో, సరదాగా తిరిగిన తోటి ఉద్యోగిని అనో, స్నేహితురాలు అనో… పశువులా మీద పడితే? అచ్చంగా పశువు అనే అనుకోవాల్సి వస్తుంది. తనకు ఇష్టం లేదని తోటి మనిషి ‘నో’ అంటే, ఆ ఒక్క పదంలో కొన్ని కోట్ల భావాలు, వాక్యాలు ఉన్నాయని గుర్తించాలని ‘పింక్‌’ మన పురుషాహంకార జీవుల చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. రూల్‌ నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ కోర్టులో అమితాబ్‌తో దర్శక, రచయితలు చెప్పించే ప్రతి డైలాగూ ఒక పాఠమే. ‘విక్కీ డోనర్‌’, ‘మద్రాస్‌ కేఫ్‌’, ‘పీకూ’ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఈసారి నిర్మాతగా వెండితెరపై చేసిన కాంటెంపరరీ సోషల్‌ కామెంట్‌ ‘పింక్‌’. రాగల చాలా కాలం పాటు ఈ సినిమా గుర్తుంటుంది.

ఒక సినిమాలో మహా అయితే కథ బాగుండవచ్చు. మరొక సినిమాలో నటీనటుల అభినయం బాగుందనిపించవచ్చు. ఇంకొక సినిమాలో టెక్నికల్‌ బ్రిలియన్స్‌ కొట్టొచ్చినట్లు కనిపించవచ్చు. కానీ, ఒకే సినిమాలో ఈ మూడూ బాగుంటే? ఈ మధ్య కాలంలో అలాంటివేవీ లేవు. కానీ, ఇప్పుడు ఆ కొరత తీరుస్తుంది – ‘పింక్‌’. ఆ మాటకొస్తే – చూసిన కాసేపే కాకుండా, హాలులో నుంచి బయటకు వచ్చేశాక కూడా వెంటాడే ఒక అనుభూతినో, ఆలోచననో మిగల్చడానికి మించి ఏ సినిమాకైనా ప్రయోజనం ఇంకేం ఉంటుంది! రెండుంబావు గంటల ‘పింక్‌’ అచ్చంగా అలాంటి సినిమానే! అందుకే, ఇలాంటి సినిమాలకు యూ కాన్ట్‌ సే… ‘నో’. కావాలంటే, వెళ్ళి చూసి రండి. చూసి వచ్చాక నా అభిప్రాయంతో నూటికి నూరుపాళ్ళూ మీరూ ‘యస్‌’ అనే అంటారు! మే ది ట్రైబ్‌ ఆఫ్‌ థాట్‌ ప్రొవోకింగ్‌ ఫిల్మ్స్‌ గ్రో!

 

తాజా కలం

 ఇంతకీ ‘పింక్‌’ అంటే ఏమిటి? అమ్మాయిలకు సంబంధించిన విషయమనేది వాచ్యార్థం. కానీ, ‘పింక్‌’ అంటే భయపెట్టి, బాధించి, బలవంతాన స్త్రీ జననేంద్రియాన్ని పురుషుడు ఆక్రమించడమనేది కొన్ని దేశాల్లో ఉన్న అర్బన్‌ స్లాంగ్‌ అట! జర్నలిస్ట్‌ మిత్రుడొకడు తాజాగా గుర్తుచేశాడు. అది ఈ టైటిల్‌లోని సూచ్యార్థం. సినిమా చూస్తే, ‘పింక్‌’ అంటే ఏమిటో ఇట్టే అర్థమవుతుందని సూజిత్‌ సర్కార్‌ అన్న మాటల వెనుక ఇంత నిగూఢార్థం ఉందన్న మాట! ఈ సినిమానే కాదు టైటిల్‌ కూడా ప్రేమ ముసుగులో బయటా, పెళ్ళి ముసుగులో ఇంటా జరుగుతున్న కనిపించని లైంగిక హింసకు అర్థవంతమైన అద్దం కదూ!

…………………………………..

 

 

 

 

మీ మాటలు

  1. నైస్ రివ్యూ..”.‘పింక్‌’ మన పురుషాహంకార జీవుల చెంప ఛెళ్ళుమనిపిస్తుంది”. నిజమే..

  2. వృద్ధుల కళ్యాణరామారావు says:

    చాలా చక్కని రివ్యూ. వృత్తి రీత్యా న్యాయవాది నైన నాకు ఈ సినిమా ఇంకా చాలా నచ్చవచ్చు. బేగి సూసియ్యాల!

    • Rentala Jayadeva says:

      థాంక్ యు సర్. లాయర్ గా మీకు ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది.

  3. Mahendra Kumar says:

    చాలా వివరణాత్మకమైన, విశ్లేషణ, ఏ రివ్యూ చదవకుండా వెల్తెనే బాగుంటుందని సూచించిన జయదేవ్ గారు, మీ రివ్యూ చదివి కూడా వెల్లేలా రాసారు.

  4. జయదేవ్ గారూ !!
    నా మంసులో మాటలన్ని మీరు చెప్పేసారు ..
    స్త్రీ కి ఒక మెదడు ,మనసు ఉంటాయని ..ఆమె శరీరం పై ఆమెకి సర్వాధికారాలు ఉన్నాయి అన్న మాట ,ఎన్ని రకాలుగా చెపుతూ ఉన్నా ,ఎన్ని సార్లు చెప్పినా విననందుకు ఎన్ని శిక్షలు వేస్తున్నా , ఆమె శరీరం పై వేధింపులు ,అధికారం ,తరతరాలుగా కొన సాగుతూనే ఉన్నాయి .
    నో ..అంటే వద్దు అనే అర్ధం కూడా ఇంతగా విడమిరచి చెపుతున్నా కూడా ,మన చుట్టూ జరుగుతున్న స్త్రీ శరీరం మీద అత్యాచారాలు చూస్తూ ,వింటూ ఉంటే సిగ్గుతో ,అసహ్యంతో ముడుచుకు పోయి ,మాయం అయిపోవాలి అనిపిస్తోంది , ఈ భూగ్రహం నుంచి ఒక్కసారి స్త్రీ జాతి మాయం అయిపోతే ,మగ వారి అహాలూ ,అధికారాలూ ఎవరి మీద చూపిస్తారా ? అని ఒక ఆలోచన వచ్చి ,ఇలా ఎందుకు ఆలోచించాను అసలు అని ధుఖం కలిగి , ఈ సిన్మా చూసిన తరవాత అయినా ఒక స్త్రీ నో అంటే నో అని అర్ధం చేసుకునే మగవారు పెరుగుతారేమో అన్న ఒక్క ఆశ తో ..
    వసంత లక్ష్మి

    • Rentala Jayadeva says:

      వసంత లక్ష్మి గారూ.
      కచ్చితంగా ఏ ఒక్కరు మారినా ఈ సినిమా ప్రయోజనం నెరవేరినట్లే. మార్పు ఆలోచన లో వస్తుంది, ఈ సినిమా అది ఎంతో కొంత తెస్తుందని ఆశిద్దా మ్.

  5. గుడ్ రివ్యూ జయదేవ్.. బాగా చెప్పావు. దశాబ్దంలో రెండో మూడో చూసే బాపతు అయిన నేనిప్పుడు తొందరగా చూడాలనుకుంటున్నాను..

  6. Madhu Chittarvu says:

    I agree totally .The most thought provoking film.Great acting and music and story telling.Though a few lapses are there.Every working woman every lawyer must see this .Good review

  7. ఆర్. దమయంతి says:

    నేను సరిగ్గా ఎదురుచూసే సినిమాలు ఇలాటివే!… మీ సమీక్ష చదివాక ఆ నిజాలను చూడాలni తహతహ లాడుతొంది manasu. .
    అమితాబ్ నా ఎవెర్ గ్రీన్ హీరో అని చెప్పక తప్పదు. పీకూ చూసాక ఈ కథా నాయకుని మీద నాకున్న అభిమానం రెట్టింపైంది అని సగర్వంగా చెబుతాను.

    చాలా బావుంది మీ రివ్యూ
    ధన్యవాదాలు.

    • Muddu Krishna Jyothi says:

      ఇంతకు ముందు ‘పీకు’ చూసి ఉండడం చేత అదే దర్శకుని సినిమా ‘పింక్’ ని నిన్ననే చూసా. నిజంగా మంచి సినిమా. అత్యాచారం జరిగినప్పుడు న్యాయం జరిగేలా చూడాలి కానీ మోరల్ పోలీసింగ్ చేయడం కాదు.

    • Rentala Jayadeva says:

      ధన్యవాదాలు. చూడండి… మీరు నిరాశ పడరు.

  8. Raghavendra says:

    నేనీ సినిమా చూడలేదుగానీ, మీ సమీక్ష చదువుతుంటే 1988 లో వచ్చిన జోడీ ఫాస్టర్ నటించిన ది ఆక్యూస్డ్ గుర్తుకువస్తూంది. జోనాథన్ కాప్లాన్ దర్శకుడు. ఒక వాస్తవసంఘటనఆధారంగా తీశారది.

  9. దేవరకొండ says:

    సినిమాను కూడా ఒక ముఖ్యమైన సాహిత్య ప్రక్రియగా గుర్తించినప్పుడు ఇలాంటి సమీక్షలు ఎక్కువగా రాయగలుగుతారని తలుస్తాను. సమీక్షకులకు అభినందనలు. ” పశువులా మీద పడితే? అచ్చంగా పశువు అనే అనుకోవాల్సి వస్తుంది” అని రాశారు. (మగ) మనుషుల్లో ఉండే ఈ నీచ నికృష్ట లక్షణం పశువుల్లో ఉండదని, ఏ పశువూ కూడా అవతలి పశువు ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడికి పాల్పడదని నా అభిప్రాయం. పశువులను ఇలా అనడం అవమానించడమేమో ఆలోచించండి.

  10. జయదేవ్! చదవాలని రివ్యూ ఓపెన్ చేసి, ముందు రెండు లైన్లు చదివి నేను కూడా పింక్ చూసే చదువుదామని ఆగిపోయాను. తర్వాత చదువుతాను

    Narsim

    • rentala Jayadeva says:

      థాంక్స్ నర్సిం. మీరు సినిమా కి వెళ్లి రండి. మీకు నచ్చుతుంది. అప్పుడు చదవండి.

  11. గొరుసు says:

    హాయ్ జయదేవ్ గారూ , “పింక్ ” నిన్ననే చూసాను . మీరు బాగా పరిచయం చేశారు – ధన్యవాదాలు.
    ఇలాంటి కథనాలకు మన తెలుగు చిత్ర సీమ ఎప్పుడు నాంది పలుకుతుందో చూద్దాం :)

  12. ఈ సినిమా మీద నాకున్న ఆరోపణ… దర్శకుడు ఆ అమ్మాయిలని చివరాఖరికి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కాదు “మంచిపిల్లలు” అని చూపడమే. వాళ్ళు నిజంగానే ప్రాస్టిట్యూట్స్ అయినా వాళ్లకు నో అని చెప్పే అధికారం ఉంది అని చూపించి వుంటే ఈ సినిమా చెప్పదల్చుకున్న విషయం మరింత ఎఫెక్టివ్ గా ఉండేదేమో అని నా అభిప్రాయం.
    దాదాపు 20 ఏళ్ళ కిందట తెలుగులో వచ్చిన “శ్రీకారం” సినిమా ఎంతమంది చూసి ఉంటారో తెలియదు కానీ, ఇంతకన్నా బోల్డ్ సబ్జెక్ట్ డీల్ చేసిన సినీమా. ముగింపు గుర్తులేదు కానీ ఒక రేప్ విక్టిమ్ ని తన వాళ్ళు, చుట్టూ వున్న వాళ్ళు ఎలా చూస్తారో, తన తప్పే లేకుండా, తానే దోషిగా మారాల్సివస్తే ఎలాఉంటుందో బాగా చర్చించిన సినీమా. సిరివెన్నెల గారి పాటలు మరో ప్లస్. అమితాబ్ లాంటి ఊతం లేక మరుగుపడిందనుకుంటా..

    • Hemalata.Ayyagari says:

      ఐ అగ్రీ విత్ యు.

    • venkatarao says:

      ఆది వారం చూసాను. టీవీ ముందు నుండి అస్సలు కదల లేదు నేను. చాలా బాగుంది. కట్టి పడేసారు. జ్యోతి గారు శ్రీకారం లో భర్త రోజు అదే విషయం గుర్తు చేసి మరి హింసిస్తుంటాడు. ఆ విక్టిమ్ భర్త పెట్టె హింస తట్టుకోలేక అతన్ని చంపేస్తుంది.కోర్ట్ లో తన సంఘర్షణ అంతా చెబుతుంది. న్యాయ మూర్తి శిక్ష వేయరు ఆ అమ్మాయి కి.

  13. ర‌వి బ‌డుగు says:

    జ్యోతి గారూ.. వెల్ సెడ్‌

  14. Kishan pinnamshetty says:

    YES…

  15. సోమశేఖర్ says:

    ఈ రోజే చూశాను… చాలా మంచి సినిమా… నిజమే, రాగల చాలా కాలం గుర్తుండేపోయే సినిమా. పింక్ గురించి మీ విశ్లేషణ బావుంది

  16. palagiri viswaprasad says:

    జయదేవ్ గారు
    మీరు సినిమా సమీక్ష కు కూడా సాహితీ విలువలు అద్దుతారు. సమీక్ష బాగుంది.

  17. ఈ సినిమా గురించి నా వర్షన్ లో ఇక్కడ ఒక చిన్న పొస్ట్ రాశాను చూడండి.
    https://okavennela.blogspot.in/

  18. జ్యోతి…గారు మీరు చెబుతున్న సినిమా చూడాల్సిందేనా ఐతే

Leave a Reply to గొరుసు Cancel reply

*