సుధమ్మ యేడ్చింది -5

gopi
సుధమ్మ యేడ్చింది. ఒక రోజు కాదు… రెండ్రోజులు కాదు… రేత్రి లేదు… పగులు లేదు… యేడుత్తనే వుంది. కన్నీరు మున్నీరుగా యేడుత్తుంది. యెవురన్నా పలకరిత్తే సాలు… కన్నీరు కట్టలు తెంచుకొత్తంది. పలకరిచ్చాలంటేనే బయంగా వుంది.
సుధమ్మది మా పక్కూరే… కిష్ట్నాయపాలెం… బోయపాటోల్లు… అధికార పార్టీయే లెండి.   అక్కడ కూడా మాకున్న బాధలే…. అదికూడా రాజధాని ప్రాంతమే. అక్కడా గవర్మెంటోల్లు భూములు తీసుకుంటారంట. అదే సుదమ్మ బాధ.
సుదమ్మకి పాతికసెంట్లు పొలం వుంది. అందులో బంతిపూలు పండిత్తారు. అల్లింకో రెండెకరాలు కౌలికి తీసుకున్నారు. మొగుడూ పెళ్ళాం యిద్దరూ రోజంతా కట్టపడి పనిసేత్తారు. అవసరం వుంటేనే కూలోల్లని పెట్టుకుంటారు. లేకపోతే యిద్దరే పని సేసుకుంటారు. కౌలుకి తీసుకున్న పొలంలో కూరగాయలు, ఆకుకూరలు పండిచ్చుకొని బెజవాడ మార్కెట్టుకి అమ్ముతారు.
సుదమ్మకి యిద్దరు పిల్లలు…  కూతురు పెద్దది. కొడుకు సిన్నోడు. కూతురు యింజినీరింగ్ సదువుతుందంట. కొడుకేమో పదోతరగతంట. సదువులకే అల్ల కట్టం సాలట్లేదని బాధ.
పొద్దున లేగిత్తె సుదమ్మ, ఆళ్లాయన పొలంలోనే వుంటారు. శానా కట్టపడి పనిసేత్తారు. యిద్దరు పిల్లల్ని సదివించుకోవాలంటే కట్టపడకపోతే యెట్టా!? నేను శానా సార్లు సూసిన…. యిద్దరూ పొలంలో సెరోపని సేత్తనే వుంటారు. సుదమ్మ యెవురితోను పెద్దగా మాట్టాడదు. ఆళ్ళాయన కూడా అంతే. పెద్దగా మాటకారి కాదు. యెవుళ్ళన్నా పలకరిత్తే పలుకుతుడు. యెదురుపడితే నవ్వుతుదు. అంతే. అట్టాంటి కుటుంబం యీ మధ్యన రొజూ యేడుత్తనే వుంది.
యెవురో టీవీవోల్లు సుధమ్మతో మాట్టాడి కెమెరాలో రికార్డు సేశారంట. అది టీవీల్లో వొచ్చిందంట. నాకు తర్వాత తెలిసింది. తర్వాత కంప్యూటర్లలో, సెల్లుఫోనుల్లో కూడా ఆయమ్మ మాట్లాడింది వొచ్చింది. మా పక్కింట్లో కుర్రోడి సెల్లుఫోనులో సూసిన… ఆయమ్మ యేడుత్తుంది… కన్నీరు మున్నీరుగా యేడుత్తుంది.
పాతికసెంట్ల పొలంలోనే పూలతోటేసి పిల్లల్ని సదివిచ్చుకుంటంది.  రెండెకరాల కౌలుకూడా… కూలీ, పెట్టుబడి కర్చులు పోయాక యేడాదికి రొండు లచ్చల దాకా వాసద్దంట. దాంతోనే పిల్లల సదువులు… యిల్లు…  మందులు… అప్పుడప్పుడు ఆస్పత్రి కర్చులు… సుట్టాల యిళ్ళల్లో పెళ్లిల్లు… అన్నీ అందులోనే…
యిప్పుడు గవర్మెంటోళ్లు పొలాలన్నీ తీసుకుంటే మేం బతికేదెట్టా అని గట్టిగనే అడుగుతుంది. యేడుత్తనే అడుగుతుంది.
అబ్బో … సెల్లుపోన్లోనే ఆయమ్మ మాట్టాడేది సూత్తుంటే కడుపు తరుక్కు పోతంది. యిక టీవీల్లో సూసినోళ్లు… యెదురుగ్గా సూసినోళ్లు యెట్టతట్టుకున్నరో…
రవిగారు సెప్పిండు… సుదమ్మ సెప్పేది కంప్యూటర్లో యింకా శానా బాగుంటదంట. దేశ దేశాల్లో జనం యిరగబడి సూత్తున్నరంట.
“సుధారాణికి మా మద్దత్తు”
“సుధారాణి కుటుంబానికి మేం అండగా ఉంటాం”
“సుధారాణికి న్యాయం జరగాలి”
కంప్యూటర్లో యిట్టాటి మాటలన్నీ వున్నయ్యంట. అమెరికానుంచి. అయిదరాబాదు నుంచి, యింకా శానా సోట్ల నుంచీ ఆయమ్మకి జైకొడతన్నారంట.
నిజం… ఆయమ్మ సెప్పింది… మాబోటోల్లం సెప్పలేక పోయినం. బాగా సెప్పింది. అర్ధం అయ్యేలా సెప్పింది. మాబాదలు, మా బతుకులు శానా బాగా యిడమర్సి సెప్పింది.
గవర్మెంటోళ్లు ఆయమ్మ సెప్పిన మాటలు టివీల్లోనో, కంప్యూటర్లోనో, సెల్లుఫోనుల్లోనో సూసే వుంటారు. అల్లకర్థం అయితే సాలు అనుకున్న.
***
టీవీలోళ్లు, పేపర్ల విలేకర్లు శానామంది మా వూళ్లల్లో తిరగటం మొదలైంది. రోడ్డుమీద యెవుళ్లు కనపడితే ఆల్లతో మాట్టాడుతున్నారు.
యే టీవీ సూసినా మావూళ్ల గొడవే…
యే పేపరు సూసినా మావూళ్ల వార్తలే… మా వాళ్ల ఫొటోలే…
జనం యిట్టాఅంటన్నారు… గవర్మెంటోళ్లు అట్టా అంటన్నారు….  పేపర్లల్లో అదే… టీవీల్లో అదే… మా బతుకులు అట్టా అయినియ్.
పెద్దరైతులు… ఆపార్టీ నాయకులు కొంతమంది తప్ప మిగతా జనం అంతా ఒక్కటే మాట…
“ఈ పొలాలిచ్చి మేం ఏం తినాల? యెట్టా బతకాల…”
***
గాంధీ గారు రెండు మూడు సార్లు కలిసిండు. యిద్దరం కలిసి బెజవాడలో లాయర్లని కలిసినం. గాంధీ గారు ఆల్లతో శానా సేపు మాట్లాడిండు. పేపర్లలో వార్తలేవో ఆల్లకి సూపిచ్చిండు.
తర్వాత అదేదో ఆపెసుకి తీసుకెళ్లిండు. అక్కడ శానమంది వున్నారు. అంతా పెద్దోల్లే.
“రాజధాని పంట పొలాల్లో యెందుకు? ఆ పక్కన కట్టుకోమనండి”
“రాజధానికి యిన్ని వేల ఎకరాలెందుకు?”
“ఇదంతా వాళ్ళు దోచుకోడానికి… వాళ్ళ మనుషులకు దోచిపెట్టడానికి”
“దీన్ని మనం ఆపాలి… కానీ మనం రాజధానికి వ్యతిరేకం అనే మాట రాకుండా జాగ్రత్తగా చూడాలి.”
అందరూ తలొక మాట మాట్లాడుతున్నారు.
యింతలో గాంధీ గారు అన్నడు:
“మేం రాజధానిని వ్యతిరేకించటంలేదు సర్. రాజధాని ఆ 29 గ్రామాల్లోనే కట్టమనండి. కానీ పచ్చని పంటపొలాలు వదిలేసి నదికి కొంచెం దూరంగా జరిగి మెట్ట భూముల్లో కట్టుకోమనండి. ఆ భూములు యిచ్చేస్తాం. అక్కడ బిల్డింగులు కట్టుకోమనండి. ఇంత సారవంతమైన భూములు ఇంకెక్కడా లేవు. వాటిని పాడుచేస్తే చూస్తూ ఎలా ఉరుకుంటాం?”
గాంధీ గారు చెపుతున్నది నాకు బాగా నచ్చింది. నిజమే ఈ బూములు వదిలేసి ఆ పక్కనే మెట్ట బూముల్లో రాజధాని కట్టుకోవచ్చు… అప్పుడు మా పొలాలు మాకుంటయి… మా పనులు మాకుంటయి… మా తిండి మాకుంటది…
నేనిట్ల ఆలోసిత్తన్న…
“సూరీ… పద పోదాం” అని గాంధీ గారు నా భుజమ్మీద సెయ్యేసి లేపిండు.
“యెవురు సారు యీళ్లంతా?” వుండబట్టలేక అడిగిన.
“వాళ్ళు మనలాంటి వాళ్ళే… పంట  నాశనం చెయ్యొద్దని… బిల్డింగులు కొండలమీదైనా కట్టుకోవచ్చని చెపుతున్నారు. ఇలాంటి వాళ్లంతా మనకు అండగా ఉన్నారు.”
“అంటే మన పొలాలు గవర్మెంటోళ్లు లాక్కోరా సారూ!”
“మన ప్రయత్నం మనం చేద్దాం. అవసరమైతే ఢిల్లీ వరకు పోయి పోరాడదాం.”
“ఢిల్లీ వరకా!!!”
“అవును… వెళ్దాం… పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు… చట్టం ఉంది… కోర్టులు ఉన్నాయి… మన ప్రయత్నం మనం చేద్దాం.”
గాంధీ గారు సెపుతుంటే మనసు తేలికపడ్డట్టయింది. నా పొలం నాకే  వుంటదేమో అనే నమ్మకం కలిగింది.
సూద్దాం… ఏంజరుగుద్దో …. ఆలోసిత్తనే గాంధీ గారితో కలిసి నడుతున్నా.
…..

మీ మాటలు

*