రాలిన ఆకులకు లెక్కలేవీ?

krishnudu

మధ్యలో ఆగిపోయింది కాలమ్ అని చాలా మంది అనుకుంటారు కాని నాకు అనిపిస్తుంది అది కాలమేనని. ఎందుకు ఉన్నట్లుండి కాలం ఆగిపోతుందో, సమయం స్తంభించిపోయినట్లు అనిపిస్తుందో కాని అది ఆగిపోవడమా? లేక నండూరి రాసినట్లు గుండె గొంతుకలో కొట్లాడడమా?

పరిణామక్రమంలో ఏదీ ఆగిపోదేమో, ఏదీ స్తంభించిపోదేమో కాని ఎందుకు ఏదీ మారిపోలేదేమోఅని అనిపిస్తుంది? అవే ప్రశ్నలు, అవే జవాబులు. అవే భావోద్వేగాలు.

తరుచూ నేను మట్టిపై కూర్చుంటాను. ఎందుకంటే నా తాహతు నాకు బాగా అనిపిస్తుంది.. నా శైలి నా ప్రత్యర్థులకు నచ్చదు ఎందుకంటే ఎప్పటినుంచో నేను ప్రేమించడాన్ని మార్చుకోలేదు. స్నేహాన్నీ మార్చుకోలేదు.. అని హరివంశరాయ్ బచ్చన్ ఏనాడు రాశాడో కాని కవిత్వం రాయడానికీ, కవిత్వం గురించి రాయడానికీ పూనుకున్నప్పుడల్లా నిన్ను గురించి నీవు తెలుసుకోవడమే అవుతుంది. మట్టి పరిమళం వీడనట్లనిపిస్తోంది.

ఈ రకంగా నీవు నా జీవితంలో చేరిపోయావు.. ఎక్కడికెళ్లినా నీవు పరివ్యాప్తమయ్యావు. అని నిదాఫాజిలీ రాసిందీ కవిత్వం గురించే అనిపిస్తుంది.

జీవితం సగ కాలం గడిపోయింది అనుకుంటాం. సగం రాత్రి గడిచిపోయింది. సగం పగలూ వెళ్లిపోయింది. కాని నిజంగా అది సగం జీవితమా? రెప్పలు తెరుచుకున్నంత సేపూ మూసుకుంటున్నాయి. దోసిలి లోంచి ఇసుకు జారిపోతోంది. దాహం తీరకముందే నీరు ఇంకిపోతోంది..

ఎప్పుడో కందీళ్ల ముందు తడిమిన అక్షరాలేవీ ఇప్పుడు? చెప్పుల్లేని కాళ్లతో ముళ్లడొంకల్లో సాగిన బుడిబుడి నడకలేవీ? గుడి ముందు లైనులో నిలబడింది భక్తికోసమా? ప్రసాదం కోసమా?

కడుపులో రేగిన బడబానలానికి ఎవరు అర్థం చెప్పారు? రాలిన ఆకులకు లెక్కలేవీ? ఏం చేయాలనుకున్నావు? ఏం చేశావన్నది ప్రశ్న కాదు.

ఏం చేశావు ఇంతకాలం? కలతలు రేపిన కళ్లలోకి చూశావా? పులకింపచేసిన నవ్వుల్లో ఉండిపోయావా? పూలవానసల్లోకి తొంగిచూసే తీరికెక్కడిది? స్పర్శకు ముందే ఆవిరైన ప్రేమ ఏదీ?

నినాదం నిరంతరం ప్రతిధ్వనిస్తుండడమేనా? విముక్తి ఎండమావి కోసం పయనమేనా? వెలుగు చూపాలనుకున్న కాగడాలెక్కడ? రెండడుగుల మధ్య దూరమే జీవితమా?

అవే కౌగిలింతలు. అవే కలహాలు, సంఘర్షణలు.. జేబుల్లో కాగితాలే జీవన సంగీతాలా?

ఈ ప్రయాణానికి ఎక్కడుంది మలుపు? మరిచిపోయిన అధ్యాయాల్ని తెరిచి చూసి చదువుకుంటే జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ అదే కదా..

ఎక్కడున్నాయి సగం వసంతాలు? పక్షులై ఎగిరిపోయాయేమో..

చేతివ్రేళ్లు తగలని పుస్తకంలా కొట్టుకుంటోంది జీవితం. ఇన్నేళ్లు గడిచినా ఒక చిరునవ్వుకోసం, ఒక పలకరింపుకోసం మనసు తన్లాడుతోంది. కాని కరచాలనానికి చేయిజాపే లోపు మనిషే మాయం? ఎక్కడ వాడు?

సమీపంలో ఉన్నదేదీ సన్నిహితం కాదా? ఎదురుగా ఉన్నవాడిని పోల్చుకోవడం ఎంత కష్టం? పక్షులు ఆకాశం కోల్పోయాయా? ఆకాశం పక్షుల్ని కోల్పోయిందా?

అయినా వద్దకున్నా వ్రేళ్లు ఆగవు. అవి నాకు తెలీకుండా చలిస్తూనే ఉంటాయి. రాస్తాను.. అఫ్సర్ కోసమైనా రాస్తాను.. రాయకుండా ఉండలేను.

ఇప్పుడు..

అర్థనిమీలిత నేత్రాల మధ్య ఆకాశం దాచుకున్న రహస్యాల వెనుక తెగిపడుతున్న పక్షుల చప్పుడు వినిపిస్తాను.

కనుగ్రుడ్ల భూగోళాల మధ్య, నేల పొరల్లో దాగిన చరిత్ర పుటల వెనుక నిక్షిప్తమైన అస్తిపంజరాల సంభాషణ వినిపిస్తాను.

కనురెప్పల దొంతరల మధ్య ఎగిసిపడుతున్న కెరటాలు చెప్పలేని అల్లకల్లోల దృశ్యాల పదధ్వనులను వినిపిస్తాను.

కనుబొమల అర్థ చంద్రాకారాల మధ్య భ్రుకుటిలో దాగిన ఆత్మ కన్ను వెనుక రగిలిపడుతున్న జ్వాలామాలికల చిటపటలు వినిపిస్తాను.

నిశ్చలమైన దృక్కుల వెనుక ఆలోచనల్లో దాగిన సాంద్ర నీహారికల్లో తొణికిసలాడుతున్న అశ్రుగీతికలు ఆలపిస్తాను.

ఎందుకంటే అకాల మరణం చెందిన ప్రతి శవమూ నాదే. ఆ రోదనా నాదే. ఆ చితి మంటలూ నావే. ఆ చితా భస్మమూ నాదే. ప్రతి హంతక శరీరం వెనుక నడుస్తున్న నీడా నాదే.

*

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  సమీపంలో ఉన్నదేదీ సన్నిహితం కాదా? ఎదురుగా ఉన్నవాడిని పోల్చుకోవడం ఎంత కష్టం? పక్షులు ఆకాశం కోల్పోయాయా? ఆకాశం పక్షుల్ని కోల్పోయిందా?

  అయినా వద్దకున్నా వ్రేళ్లు ఆగవు. అవి నాకు తెలీకుండా చలిస్తూనే ఉంటాయి. రాస్తాను.. అఫ్సర్ కోసమైనా రాస్తాను.. రాయకుండా ఉండలేను. – అఫ్సర్ గారి కోసమే కాక ఆ లిస్ట్ లో నాలాంటి వాడిని కూడా కలుపుకోండి. మీరు పూర్వం ఢిల్లీ లో ఆంధ్రజ్యోతి లో ప్రతీ బుధవారం రాసే ఇండియా గేట్ అభిమానిగా మీకు తెలుసు.

  నిశ్చలమైన దృక్కుల వెనుక ఆలోచనల్లో దాగిన సాంద్ర నీహారికల్లో తొణికిసలాడుతున్న అశ్రుగీతికలు ఆలపిస్తాను.

  ఎందుకంటే అకాల మరణం చెందిన ప్రతి శవమూ నాదే. ఆ రోదనా నాదే. ఆ చితి మంటలూ నావే. ఆ చితా భస్మమూ నాదే. ప్రతి హంతక శరీరం వెనుక నడుస్తున్న నీడా నాదే. – ఎంత బాగా వ్యక్త పరిచారు కృష్ణ రావు గారు. నిజానికి ఆ రోదన సవ్హ్య ప్రపంచంలో బతుకుతున్నామనుకునే మనందరిదీ కావాలి.

  పూర్వటి మీ ఇండియా గేట్ లాగే ఈ కృష్ణ పక్షం కోసం కూడా ఎదురు చూస్తుంటాను.

మీ మాటలు

*