కొత్త కథా ప్రతినిధులు వస్తున్నారు!

pratinidhya

 

మిరకిల్స్ జరుగుతయ్ భాయ్, నేన్ నమ్ముత: వంశీ

కడగొట్టువాళ్ళ కన్నీళ్లు: కృష్ణ జ్యోతి

????????????????????????????????????

‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ అని చెప్పుకున్న మారయ్య కథ నిజానికి నేను కావాలని రాసింది కాదు.   దానికి ఇంత గుర్తింపు వస్తుందని కూడా ఊహించలేదు.  It just happened!  ఇంట్లో పనులు త్వర త్వరగా ముగించుకుని, బడి సమయానికి గంట ముందు బడికి వెళ్లి, ఖాళీ తరగతి గదిలో కిటికీ పక్కన వేపచెట్టు గాలీ ఆస్వాదిస్తూ,  లోపల వున్న ఆలోచనలను ఊరికే అలా కాగితం మీద పెడితే… మారయ్య,   షబానా, ఎలిజిబెత్, కొండయ్య, జగ్గయ్య పంతులూ వీళ్ళంతా జ్ఞాపకం వచ్చారు.

మారయ్య సామాజిక చలనానికీ, విచలనానికీ ‘సర్వధీ సాక్షీభూతం’.  షబానా ‘పెళ్లి’అనే సామాన్యమైన  భౌతిక, మానసిక, శారీరిక అవసరానికి కూడా నోచుకోని అనేక మంది నిర్భాగ్య స్త్రీలకు ప్రతినిధి.  ఎలిజెబెత్, పెళ్ళిలో హింసను నిత్యమూ అనుభవిస్తూ, దాన్నుండీ బైట పడే పరిస్థితి లేని అనేకమంది  వివాహిత స్త్రీలకు ప్రతి రూపం.  కడగొట్టువాళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!  ఇది నిజం.  బజార్లో నిలబడి, వర్గ పరంగా తనతో వేరైనా వారిపై ఆవేశంగా విరుచుకు పడిపోతూ,  సర్వ జన  సమానత్వం అంటూ ఉపన్యాసాలు దంచి, ఇంటికెళ్ళి ఇల్లాలిని కాలితో తన్ని మరీ అదుపులో ఉంచుకునే ‘పోరాట యోధుల్ని’నేను కళ్ళతో చూశాను!   ఇక జగ్గయ్య పంతులు, స్థాయి పరంగా మెరుగైన స్థానంలో వున్నట్టు కనబడతాడు.  కానీ నిజానికి లోపల వున్న దరిద్రాన్ని లోకం కళ్ళని పడకుండా నీలం గళ్ళ చొక్కా లోపల దాచేసి గుట్టుగా బతికేసే కోట్లాది మధ్య తరగతి ప్రజల్లో అతను ఒకడు.  వర్గ పరంగా చెడ్డ మనుషులుండరు.  మంచి మనుషులూ వుండరు.  వ్యవస్థలో వున్న లోపాలు మనుషుల్ని వేరు వేరు అవధుల మధ్య కట్టి పడేసి పీడిస్తాయి.  అంతే.  మరి ఈ వేదనకు అంతం ఎలా?!  బహుశా ఆర్ధిక అంతరాలను తొలగిస్తే మిగిలిన సమస్యలు చాలా వరకూ సర్దుకుంటాయేమో?!  చెప్పినంత సులువు కాదు అమలు.  కానీ ఒక ఆలోచన చేయడమైతే తప్పు కాదు కదా!

కన్నదే  విన్నదే  ఈ  కథ:  శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

‘నిప్పులనడకలోంచి కళ్యాణి ‘ కథ నిజానికి కథ కాదు యదార్ధ జీవన దృశ్యం. వికృతమైన మనుషుల మధ్యలోంచి బయటపడిన ఓ బాలిక జీవితం.   బంగారు భవిష్యత్ కోసం కలలు కనే ఆ బాలిక చెప్పిన విషయాలు నన్నెంతో కదిలించాయి. నా హృదయంలో తిష్టవేసి యాతనపెట్టాయి. విన్న నాకే ఇలా ఉంటే అనుభవించిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో .. ?! ఆ నీలినీడలనుండి బయటపడడం ఎంత కష్టమో కదా .. ఇలాంటి
వ్యధ మరే చిన్నారికీ ఎదురుకాకూడదు అనిపించేది.  కన్నతల్లి కూడా ఇలా ప్రవర్తించగలదా అన్న అనుమానం వేసేది . కన్నతల్లి కాదనుకున్న బిడ్డ జీవితం, కన్నతల్లే కాసులకోసమో .. మరెందుకోసమో కసాయిలకు అమ్మేసిన వైనం మనసులో మెలిపెడుతూనే ఉండేది.  కాలం గడుస్తున్నా అది మరుపుకు రావడం లేదు.

అమ్మాయిల అమ్మకం లేదా వేరే ప్రాంతానికి తరలించడం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు.  కానీ , అలా ట్రాఫికింగ్ కి గురయిన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అనుభవమే.  అలాంటిది కన్నతల్లి  బిడ్డని నరకకూపాల్లాంటి చోటుల్లో అమ్మేసేంతటి పరిస్థితులు ఏముంటాయో.. అనేకానేక ప్రశ్నలు వెంటాడుతుండేవి. అప్పటికే పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లలకి ఎలా ఎరవేసి తరలిస్తారో తెలుసు. ట్రాఫికింగ్ కి బలైన  వారి గాథలు కొన్ని  ప్రత్యక్షంగా విని వున్నాను. అప్పుడెప్పుడూ  లేని కదలిక ఓ పదిపదకొండేళ్ల బాలిక చెప్పిన విషయాలు విన్న తర్వాత నాలో కలిగింది. భరించలేని  యాతన నుండి బయటపడడం కోసం అక్షరీకరించడం జరిగింది. అదే నిప్పుల నడకలోంచి కల్యాణిగా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
నా ఈ కథలో ముఖ్యపాత్రధారి “కళ్యాణి” ఒక పాత్ర కాదు.  ఒకమ్మాయి జీవితమని ముందే చెప్పాను కదా ..నాలో కలిగిన భావ సంఘర్షణ నుండి నేను బయట పడతాను కానీ ఆమెను వెంటాడి వేటాడే గతాన్ని గుర్తుచేయడం నాకిష్టం లేదు. ఆమె జీవితానుభవాలు ఒక కథగా వచ్చాయని  తెలిస్తే ఎలా ఫీలవుతుందో తెలియదు. కానీ ఆమె భవిష్యత్తు దృష్ట్యా చెప్పడం సముచితం కాదని నేనయితే ఆమెకీ విషయం చెప్పదలుచుకోలేదు.

ఇది నేను రాసిన కథ అయినా  చదువుతుంటే నా కళ్ళు చెమరుస్తూ తనరూపం కళ్ళముందు నిలుస్తుంది.  ఈ కథ కళ్యాణి జీవితంలాంటి జీవితంలోంచి, దుర్భర పరిస్థితుల్లోంచి నేర్పరితనంతో బయటపడి భవిష్యత్ కి బాటలు వేసుకుంటున్న కళ్యాణి లకి ఈ కథ అంకితం.

ఈ కథ … 80% పచ్చి నిజం: వనజ తాతినేని

vanajaప్రాతినిధ్య కోసం నా కథ ఎంపిక కావడం ఇది రెండొసారి . ఆ స్థాయికి తగ్గ కథ వ్రాసినందుకు సంతోషంగా ఉంది.ప్రాతినిధ్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను .  ఇక ఈ “మర్మమేమి” కథా నేపధ్యం ఏమిటంటే ..

  కొన్ని గంటల్లో వ్రాసిన ఆ కథకి నేపధ్యం చాలా ఉంది.  చిన్నప్పటి నుండి నేను మా చుట్టూ ప్రక్కల ఉన్న  ముస్లిం కుటుంబాల వారితో సన్నిహితంగా ఉండేదాన్ని,  వారిలో అభిమానం ఆప్యాయతలు మెండు. సమీపంగా చూడటం వల్ల వారి సంప్రదాయం తెలుసు.  నాలుగు గోడలమధ్య బందీగా ఉంటూ చిటికెడు స్వేచ్ఛ కరువై కన్నీరు మున్నీరుగా విలపించడం  తెలుసు.  స్త్రీలు  పేదరికం వల్ల చిరిగిన చీరలని కట్టుకుని పైకి మాత్రం ఘనంగా బురఖా వేసుకుని వెళ్లడం తెలుసు .  సంప్రదాయాన్ని  ఇష్టంగా  పాటించేవారు కొందరైతే , అయిష్టంతో దానిని విసర్జించాలి అనుకునేవాళ్లు కొందరు. నా నెచ్చెలుల  పెదాలపై నవ్వుల  పై పూతలే తెలుసు. హృదయపూర్వకంగా నవ్వడం కూడా నిషిద్ధం. తల్లులు పిల్లల మనసులో కోరికలు తెలిసి కూడా పురుషులకి భయపడి పిల్లల కోరికలని నిర్దాక్షిణ్యంగా నలిపేసేవారు. సంప్రదాయానికి మనసుకి మధ్య నలిగిన ఆడపిల్లల కథలు తెలుసు . వాళ్ళ కంటి చూరుని పట్టుకుని వ్రేలాడిన కన్నీటి చుక్కల ఆంతర్యం తెలుసు. షహనాజ్ పాత్ర అలా పుట్టిందే !
గుంటూరు లో అభ్యుదయ రచయితల సంఘం  కథానిక పాఠశాల నిర్వహించినప్పుడు .. విద్యార్థిగా  మారి మూడు రోజులపాటు  గుంటూరు విజయవాడల మధ్య ఒంటరిగా బస్ లో ప్రయాణించినప్పుడు .. నేను చూసిన దృశ్యాల సమాహారం ఈ  కథ. బస్ లలో  యువతీ యువకుల అసభ్య ప్రవర్తన చూసి అసహ్యం కల్గింది, ఆవేశం ముంచుకొచ్చింది . సంప్రాదాయం కోసం ముస్లిం స్త్రీలు ఇష్టమైనా కాకపోయినా   బురఖా ధరిస్తుంటే  ఆ మతానికి చెందని వారు  తప్పుడు పనులకోసం  బురఖా ధరించడం, బాయ్ ఫ్రెండ్ తో కలసి  తిరగడం కోసం స్కార్ఫ్ కట్టుకోవడం చూసి నివ్వెరపోయాను .  ఎవరిని మభ్య పెట్టుకోవడం కోసం ఈ ముసుగులు ? అన్న ఆవేదన కల్గింది.  ఒక యువతి భర్తని మోసం చేస్తుంటే వాస్తవేమిటో తెలియకపోయినా సరే  ఆ అమ్మాయికి సహకరించానే అన్న ఆపరాధభావం  తొలిచేసి .. ఆ కథ వ్రాయించింది. నేను వ్రాసిన ఈ కథ … 80% పచ్చి నిజం . దానికి  20% నా ఊహా శక్తిని జోడించి ముగింపునిచ్చాను . కథ కచ్చితంగా  అలానే  వ్రాయాలని నేను అనుకోలేదు ..  అలా వ్రాసుకుంటూ పోయాను. కొన్ని గంటల సమయంలో ఆ కథ పూర్తయింది. వెంటనే ఆంద్ర జ్యోతికి పంపించాను . మూడు వారాల్లో కథని అచ్చులో చూసుకోవడంతో  అమితానందం . అశేష పాఠకుల స్పందన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది.  స్పందించిన వారిలో  ఎక్కువ మంది అమ్మాయిలూ లేరన్న బాధ కూడా మిగిలింది అయినప్పటికీ  తాత్కాలికంగా గొప్ప సంతృప్తిని ఇచ్చిన కథ ఇది .
 pratinidhya2

ఒక ఔట్లెట్ దొరికింది: పింగళి చైతన్య

chaitanyaఇది ప్రచురణ పొందిన నా మొదటి కథ. 2015, ఆగస్ట్ నెలలో  సారంగ పత్రికలో అచ్చు అయింది. ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ రాసిన తర్వాత మూడేళ్ళ వరకు నేనేం రాయలేదు. తెల్సిన వాళ్ళు ‘ఈ మధ్య ఏం రాసావ్?’ అని అడిగేవారు. నెత్తికి నూనె రాయటమే బద్ధకం, నేనేం రాస్తాను అని చెప్పలేక ఊరుకునేదాన్ని. వి. ఎం. ఆర్. జి. సురేష్ అనే జర్నలిస్ట్ మిత్రుడు, ఎప్పుడు కల్సినా సరే, ‘కథలు రాయి చైతన్యా’ అని సలహా ఇచ్చేవారు.  పైగా ‘కథలు రాయటం తేలిక’ అని కూడా చెప్పారు! ‘ఎంకరేజ్ చేయటానికి వంద చెప్తామ్’ అని అతను ఇప్పుడు నవ్వేస్తారు. కానీ నేను అప్పటికి తెలియక, నమ్మాను. అలా.. ‘కథ రాయటం’ అనే పురుగు బుర్రలోకి వచ్చింది. అదే టైమ్ లో కుప్పిలి పద్మ గారి కథ ఒకటి నచ్చి, ఆమెకి ఫేస్బుక్ లో మెసేజ్ ఇస్తే, ‘మీరెప్పుడు రాస్తారు’ అని అడిగారు. అసలే ఇష్టమైన రైటర్. మాటవరసకి అడిగారు కావొచ్చు కానీ.. నేను మాత్రం… అప్పుడే కూర్చొని ఒక కథ రాసేశాను.

నాకు మొదట మెదిలింది మా అమ్మ. ఆమె విడో. సింగల్ ఉమెన్ పట్ల మన సమాజం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అమ్మ వల్ల సింగల్ ఉమెన్ సమస్యలు బాగా అర్ధం అయ్యాయ్. అయితే, విడో పట్ల సమాజం కొంత దయ చూపిస్తుందేమో కానీ.. విడాకులు తీసుకున్నా, పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నా  సరే… ఆ స్త్రీలని వాళ్ళ ఇష్టానికి వదిలేసేపాటి జాలి చూపించదు మన సమాజం. ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని అడిగేవాళ్ళని, పెళ్లి ఎందుకు చేసుకున్నావ్? అని అడిగితే ఎలా ఉంటదా?’ అని ఎప్పటి నుండో నా మనసులో అనిపించేది.  దాన్నే పాయింట్ గా తీస్కోని, కథ రాశాను.

స్వాతి వడ్లమూడి అనే ఫేస్బుక్ ఫ్రెండ్ కి కథ పంపా. ఆమె బుర్ర నేను,  నా బుర్ర ఆమె తిన్నాక.. ఫేస్బుక్ లో చాలా సార్లు కనిపించిన ‘సారంగ’ పత్రిక ఓపెన్ చేసి..  మెయిల్ ఐ.డి తీస్కోని, అప్పటికప్పుడే పంపించేశాను. అక్షరదోషాలు సరి చేస్కోటానికి వెనక్కి తిరిగి చదవాలన్నా సరే, డిలీట్ చేస్తా అని భయం వేసింది. పంపేశాను. తెల్లారికే నాకు, అఫ్సర్ గారి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ‘అను లో కాదు, యూనీకోడ్ లో పంపండి, మీ గురించి కూడా రాసి  పంపండి’ అన్నారు. నాకు ఒక్కటే తెల్సు.  ఆ ముక్కే చెప్పాను. అప్పటికి ఈ కథ పేరు ‘తనదే ఆ ఆకాశం’ కాదు.  ఏదో పాత,  ముతక పేరు. ఇప్పుడు ఆ పేరు చెప్పి, నా పరువు నేనే తీస్కోటం  ఇష్టం లేక.. చెప్పట్లేదు. ఆ పేరు తీసేసి,  అఫ్సర్ గారే  ‘తనదే ఆ ఆకాశం’ అని పెట్టి,  యూనికోడ్ లో టైప్ చేయించి ప్రింట్ చేశారు. ‘సారీ సర్, మీకు ఇబ్బంది పెడుతున్నా ’ అని మెయిల్ చేస్తే, ‘కొత్త రచయిత ని చూసినప్పుడల్లా ఒక ఉత్సాహం వస్తుంది; ఇబ్బంది,  కష్టం తెలీవ్’ అని కూడా అన్నారు. ఈ కథ ప్రింట్ అయిన ఉత్సాహం లో కొన్ని కథలు రాశాను.

ఏం చేయలేక, ఏం చేయాలో తెలీక, పరిష్కారం అర్ధం కాక.. బాధ పెట్టే  విషయాలని, కథలుగా రాస్తున్నా. సాహిత్యం లో వాటి విలువ, స్థానం  నాకు తెలీదు. కానీ, ‘కథ’ల ద్వారా నాకో ఔట్లెట్ దొరికింది. అది చాలు.

ఇప్పుడు ‘ప్రాతినిధ్య’ సంకలనం లో ఈ కథ వస్తోంది. ఆ పేరే ప్రేత్యేకం. రకరకాల గొంతులకి, వాదన లకి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. నా కథ కూడా రావటం.. సంతోషంగా ఉంది. వి.ఎం.ఆర్. జి. సురేష్ గారిలాగా.. నన్ను ఎంకరేజ్ చేయటానికే వేసారేమో అని అనుమానం ఉన్నా సరే,  ‘కల్పన’ లాంటి గొప్ప కథ రాసిన సామాన్యకి ఈ కథ నచ్చటం.. కంట్రోల్ చేస్కోలేని సంతోషాన్ని ఇస్తోంది. మొదట అచ్చు వేసిన పత్రికలో.. నా మొదటి కథ..  సంకలనంలో అచ్చు అయిన మొదటి కథ గురించి రాస్తుంటే.. చాలా ఉత్సహం గా ఉంది. ‘ఇక చాల్లే, ఇప్పటీకే జనాలకి బోర్ కొట్టించి ఉంటావ్’ అనిపిస్తోంది కాబట్టి, ఇక్కడితో ఆపుతున్నాను.

 

pratinidhya1

మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో:వోల్గా

volgaవృద్ధాప్యాన్ని గురించి దయనీయమైన కథలు,పిల్లలు క్రూరంగా ప్రవర్తించే కథలు చదివి చదివి విసుగెత్తి భిన్నంగా ఏదయినా  రాయాలని రాసాను .తల్లీ  కూతుళ్ళ అనుబంధాన్ని ఆనందంగా రాసాను.అలా జీవించిన ,జీవిస్తున్న వాళ్ళు నాకు తెలుసు .జీవించలేక బాధ పడుతున్న వాళ్ళూ తెలుసు.వయస్సు పైబడిన తర్వాత రెండొవ బాల్యానికి కూడా పలు కోణాలు ఉంటాయి.ఈ కథలో తల్లిలా తన బాధ్యతను తీసుకోవాలని కూతురుని అడిగి ఒక హక్కుగా పొందిన గట్టి తల్లులూ ,దానిని గుర్తించి తల్లిదండ్రుల బాల్యాన్ని తాము ఆనందించే పిల్లలూ ఉంటె బాగుంటుందనే ఆలోచనే ఈ కథ.ఈఈ సమాజం లో అదంతా తేలిక కాదు .ఎందరికో ఎన్నో పరిమితులు .అయినా పరిమితుల్లోనో పరిధుల్లోనో అనుబంధాలు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి.బహుశా ఇది నేను రాసిన మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో .
(మిగతా  కథకుల ప్రతిస్పందనల  కోసం  ఎదురు చూస్తున్నాం! )

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  పుస్తకాన్ని పరిచయం చేసిన పద్ధతి చాల బావుంది. రచయిత్రు(ల)లకి అభినందనలు.

 2. Allam Vamshi says:

  ఇంతమంచి వేదికనిచ్చిన సంపాదకులకు కృతజ్ఞతలు :)

 3. సారంగ సారథులకు వందనాలు.
  మంచిపని చేస్తున్న మంచి వారికి నమస్కారాలు.
  — గుత్తా హరిసర్వోత్తమ నాయుడు,
  ప్రధానకార్యదర్శి,
  అనంతపురం జిల్లా రచయితల సంఘం,
  ఆంధ్రప్రదేశ్ , ఇండియా

 4. Raghava raghava says:

  ఇవన్నీ ఇక్కడ చదువుతుంటే ఎంత బాగుందో!…

 5. నమస్కారం …. సారంగకి నేను అభిమానిని. మంచి కథల సమాహారంతో ముతాబై వచే సారంగ అంటే ఎంతో అభిమానం ఏర్పడింది.ఆ నడుమ పసునూరి రవిందరన్న కాకి పడగలు గురించి రాసిన వివరణ చాలా బాగుంది. అఫ్సర్ గారికి సలామ్ !

మీ మాటలు

*