కలలో అమ్మ!

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

నా స్వప్న జగత్తు లో
అనంత ఆకాశం లో
ఒలికింది జీవ కలశం-
వెలుగై చిందిన ఆ ప్రాణ రసం తో
తడిసి తపించాయి  జీవ వృక్ష వ్రేళ్ళు .
ప్రవహించిన ప్రాణరసం
జీవ భాండాగారం కాండాంతరంలో
 బుజబుజ పొంగి పరచుకుంది
  కొమ్మలై రెమ్మలై.
కొమ్మకో ప్రాణి రెమ్మకో ప్రాణి
విరిశాయి  వైవిద్య జీవ పుష్పాలై
అదో వెలుగు విరుల సంద్రం-
మెలమెల్లగ విచ్చుకున్నాయి
ఆ వెలుగు పూల రేకులు.
విచ్చుకున్న  విరుల గర్భాలు
రాల్చాయి జలజలా ప్రాణవిత్తులను-
నక్షత్ర దీపాలై రాలిన జీవవిత్తులు
పయనిస్తున్నాయి అధోముఖంగా-
ఆ నిశ్శబ్ద నిశీదిలో మెల్లగా
 క్రిందికి దిగుతూంది
ఒక ప్రాణవిత్తు దీపమై –
భూమి పై కనుచూపు మేర పరచుకున్న
ధవళ కాంతులీను రంగవల్లి పై పద్మాసీనురాలైన మా అమ్మ
 కటిసీమ పై నిలిచి అదృశ్యమయింది
ఆ ప్రాణ దీపం.
నా కల రేపింది నాలో కలవరం
నా అత్మ దీపాన్ని నేను దర్శించానా?!
జీవులన్నీ
ఆ అనంత వృక్షం  రాల్చిన
ప్రాణ విత్తుల అంకురాలా?!
అమ్మా నాన్నా
 కేవలం
భౌతిక రూప దాతలా?!
ఓ బృహత్‌ సంశయానికి
తెరలేపిన నా స్వప్నమది .
(దాదాపు దశాబ్దం నన్ను వెంటాడుతున్న నా కలకు అక్షర రూపమీ  నా  కవిత )
*

మీ మాటలు

*