డాక్యుమెంటరీ సినిమాగా “కొయ్యగుర్రం”

మీ మాటలు

  1. Aranya Krishna says:

    ఒక గొప్ప ప్రయత్నం. తెలుగు కవిత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఈ కార్యక్రమానికి అందరమూ సహకరించాలి.

    • నిర్మలారాణి says:

      చాలా గొప్ప అడుగు.. …కానీ ఏ రకంగా సహాయపడగలమో వివరించగలరు..

  2. తెలుగు కవిత్వ స్తాయిని ప్రపంచ సినిమాకి కొయ్యగుర్రం పరిచయం చెయ్యబొతోంది . మీ అందరి సహకారం తోనే అధి సాధ్యం .

  3. తప్పకుండా సహకరిస్తారు. కానీ ఎలా?

  4. Aranya Krishna says:

    ఈ రైటప్ లో వేణుగోపాల్ రెడ్డి గారి నంబర్ వుంది చూడండి. ఆయన్ని కాంటాక్ట్ చేయటం ద్వారా మీ సహకారం అందించా వచ్ఛు.

  5. Srinivas Sathiraju says:

    చాలా చక్కని విషయం. ఈ డాక్యుమెంటరీ కోసం నేను ఎదురుచూస్తున్నా.. నాకు కవిత్వమంటే తెలియదు కానీ అప్పుడు చాలా మంది కవిత్వాలు రాశారు ఆ సంఘటన మీద. రోజూ రేడియోలోనూ వార్తా పత్రికల్లోనూ చదివి చదివి నేను వాళ్ళు నిజాలమీద రాయటం లేదని రాసుకున్న రాతలు ఈ కింద రాస్తున్నా.. ఆ సమయంలో అందరూ స్పందించారు కానీ నిజంగా సహాయం ఎంత అందింది ఎవరికీ అందింది అనే విషయం మీద స్పష్టత లేదు రెండు విషయాలు మాత్రం చెప్పాలి. జనతా గవర్నమెంటు నుంచి రాజ్ నారాయణ్ గారు ఆంధ్రులు ఇందిరా కాగ్రెస్సుని గెలిపించడం వల్లనే దేముడికి కోపం వచ్చిందని తరువాత ఆయనే జనతా పార్టీని చీల్చడంలో ఇందిరమ్మకి సహకరించడం. ఆంధ్రుల కోపాగ్నికి జనతా పార్టీ 79 లో ముక్కలు కావడం. రెండవది నరసింహ రాజు అనేది యువతరపు నటుడు ఏ న్ టీ రామారావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన చందాల సీకరణలో జరిగిన లోపాలు వివక్షతలు ప్రజల ముందు పెట్టి వాళ్ళని విమర్శించిన నేరానికి చిత్ర సీమ నుంచి బహిష్కరించి బాదడం తరువాత కొంత కాలం తరువాత వారితో రాజీ పది మళ్ళీ ప్రయత్నించినా కేవలం చిన్న పాత్రలకే పరిమితం కావడం అనేవి అందరికి తెలిసిన విషయాలి అయ్యినా అవకాశవాద రాజకీయ ప్రపంచం నాలాంటి కుర్ర వాళ్లకి అర్ధమయ్యి మేము శ్రీ శ్రీ రంగనాయకమ్మ లాంటి ఎండమావుల వెనక పరుగులు తీయడం. చాలా జ్ఞాపకాలు కలిగించారు ఈ వార్తా ద్వారా… ఆనాటి నా కవిత ఎవ్వరూ ప్రచురించ లేదు.. ఆఖరికి కాలేజీలో ప్రచురించే ప్రతీ నెల సాంస్కృతిక పత్రికతో సహా… కారణం ప్రభుత్వ మరియూ సమాజ వ్యతిరేక ధోరణులు అందులోనుంచి తొలగించా మానడం నేను ఒప్పుకోక పోవడం….

    మాకేం తెలుసు???
    ఆకాశం ముసురెసింది మూడురోజులు
    తుఫాను తుఫాను అన్నారు రేడియోలో
    సెలవు సెలవు అన్నారు కాలేజీలో
    కానీ ఆ తుఫాను ఇంత ఘోరం చేస్తుందని
    మాకేం తెలుసు ?
    జల ప􀅒ళయం అని విన్నాం రేడియోలలో
    ప్రకృతి విలయం కన్నాం పేపరల్లో
    కానీ ఆ విలయం పదివేల శవాలమయమవుతుందని
    మాకేం తెలుసు ?
    ఎంత ఘోరం ఎంత ఘోరం విలపించారు ప్రజలు
    సహాయం సహాయం ఆక్రోశించారు భాధితులు
    ఆ ప్రకృతి విలయాలకి అసలు కారణాలు
    మాకేం తెలుసు ?
    ఆదుకొవాలి ఆదుకోవాలి ఆరాధించారు రాష్ట్ర నాయకులు
    ఎంత నష్టం నష్టం ప్రశ్నించారు కేంద్ర పాలకులు
    అంచనాలు అనచనాలు అన్నారు పరిశీలకులు
    కానీ ఎవరి అంచనాలు అసలు కధలు
    మాకేం తెలుసు ?
    సేకరిద్దాం సేకరిద్దాం అందరూ వంత పాడారు
    ఒక రోజు జీతం విరాళం అన్నారు ఉద్యోగులు
    మా వంతు సహాయాలు ఉచితం అన్నారు వ్యాపారులు
    ఉరూరా తిరుగి అడుగుతాం అన్నారు తారాలోకం
    లక్షలూ కోటుల్ తోచింది దండుకున్నారు
    కానీ ఆ విరాళాలు ఎక్కడికి చేరాయో
    మాకేం తెలుసు ?
    సవ్చ్హంద సేవలు అన్నారు మధ్యతరగతి మానవులు
    మేము సైతమంటూ ముందుకొచ్చారు అందరూ
    ఎంత చేసినా ఎలా తుడవాలో తెలియని ఆ కన్నీళ్లు
    ఆ దివిసీమ వారి బ్రతుకుల్లో విషాదాలూ
    పచ్హటి పళ్లే బ్రతుకులని ఇసుక పర్రలు చేసిన
    ఆ సాగర విలయ ఘోషలు ఎప్పటికీ మానుతాయో
    మాకేం తెలుసు ? !!
    ——సతిత్రాజు శ్రీనివాస్ (స శ్రీ )

  6. Naresh Nunna says:

    బహుశా 1999లో అనుకుంటా- ‘కొయ్యగుర్రం’ – రెండో ముద్రణ వచ్చింది. అప్పట్లో తెలుగు సాహిత్యావరణంలోకి కొత్తగా దూసుకొచ్చిన – స్త్రీ…. దళిత… మైనారిటీ… ప్రాంతీయ – అస్తిత్వ ఉద్యమ సారథులు ‘క్యూ’గట్టి మరీ కొయ్యగుర్రాన్ని ఆకాశానికెత్తేశారు. కొయ్యగుర్రాన్ని మొదటిసారి చదివినప్పుడు (బహుశా 1990ల ప్రారంభంలో), అంత నేలబారు రచనకి అంత hype ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. కాలం, context కారణంగా కొన్ని పాపులర్ అయిపోతాయి. అది కూడా అంతేనేమో అనిపించింది. కానీ, బీట్ ఉద్యమ నవలాకారుడు జార్జి మేండెల్ తో నగ్నమునిని, మేండెల్ కథ The Beckoning Sea తో కొయ్యగుర్రాన్నీ సరిపోల్చుతూ ‘మో’ అంతటి సాహితీవేత్త ‘కొయ్యగుర్రం’కు ‘వెనక మాట’ రాయడం, దాన్ని ఆధునిక మహాకావ్యమన్న చేరా (చేకూరి రామారావు)- నారా (వేల్చేరు నారాయణ రావు) ల మధ్య రేగిన వివాదం నన్ను మరింత అయోమయంకు లోనుచేశాయి. తరం మారినా, ఆ వేలంవెర్రి తగ్గకపోవడంతో “కొయ్యగుర్రం- అను నగ్నముని పతనసూచి!’ అన్న వ్యాసం రాసి వివిధ సాహిత్య పేజీలకు ప్రచురణ నిమిత్తం పంపించాను. కానీ, ఎవ్వరూ వేయక పోవడంతో, దుర్గం రవీందర్ ఒక చిన్న బుక్ లెట్ రూపంలో తెచ్చారు.
    ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 22, 2016న కొయ్యగుర్రం మీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయబోతున్నట్టు సారంగలో చదివి, ఆనాటి నా వ్యాసం పంచుకోవాలనిపించిందిలా:
    http://bit.ly/2daQudj

  7. నరహరి says:

    లింకు పనిచేయడం లేదు సార్! దయచేసి మీ ఫేస్ బుక్ పేజీ ఏదైనా వుంటే చెప్పగలరు, దానిలో ఈ వ్యాసం పెట్టగలరు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ గురించి పోరాడడం అంటే తాము మాట్లాడే సజ్జలకే పరిమితమనే సూడో మేధావులు , గజానికో గాంధారీ భర్తలు కొల్లలుగా వున్న తెలుగు సాహిత్య, సామాజిక పోరాట యోధుల లోకం మనది. మీ వ్యాసం ప్రచురింపబడకపోవడంలో వింత లేదు. దయచేసి స్వేచ్ఛగా మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మీ ఫేస్ బుక్ పేజీ ఏదైనా వుంటే దానిలో పెట్టి తెలియజేయగలరు.

  8. Naresh Nunna says:

    ‘కొయ్యగుర్రం’ అను నగ్నముని పతనసూచి!

    True places never are అన్నాడు Herman Melville. కొయ్యగుర్రం కావ్యానికి కారణమైన సీమ… దివిసీమ మాత్రమే కాదు. సందర్భం… ఉప్పెన మాత్రమే కాదు. వాటిని నెపాలుగానే కవి నగ్నముని భావిస్తున్నాడు. కనుక కనుక కొయ్యగుర్రం విరచిత నగ్నమని సీమాసమయ సందర్భాలలో, ఆయన సమాయానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చి పట్టించుకోవాలి. సమయమంటే కొయ్యగుర్రం రాసిన 1977 నాటి నగ్నముని సమయం మాత్రమే కాదు. ’60లలో కవిగా ఆయన జనన సమయాన్ని కూడా పట్టించుకోవాలి. రోలాండ్ బార్త్ చెప్పిన ‘From Work to Text’ హితవులను పెడచెవిన పెట్టయినా, ఆయన పుట్టుక, పునాది అయిన దిగంబర కవితోద్యమం నుంచి ఆయనను తవ్వుకొని, తరచి చూసుకోవలసిందే. అమెరికాలో బీట్ మూవ్‌మెంట్ స్ఫూర్తిగా పుట్టినదే తెలుగు దిగంబర కవితోద్యమం. మరి బీట్ ఉద్యమానికి మూలమేమిటో తెలుసుకుంటే, మన దిగంబర కవితోద్యమాన్ని క్షుణ్ణంగా అర్థంచేసుకునే అవకాశం కలుగుతుంది.

    * * * * * * * * *

    ఆర్థిక మాంద్యం సంభవించిన 1929 నించి 1945లో రూజ్‌వెల్ట్ మరణం వరకూ అమెరికాలో అంతర్గత పరిణామాలు (నేటికీ కొనసాగుతున్న) అమెరికన్ సాంస్కృతిక పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. 1775-89, 1857-73లలో జరిగిన మహాయుద్ధాల వల్ల చెలరేగిన సంక్షోభాలు అమెరికా ఒక నిర్థిష్టమైన ఆకృతి ఏర్పరుచుకోవడానికి, ఎమర్సన్ వంటి ఆధునిక రుషుల, వాల్ట్ విట్మన్ వంటి మహాకవుల పుట్టుకకు దోహదపడితే, 20వ శతాబ్దంలోని కొత్త సంక్షోభదశ దేశ ఆర్థిక స్థితిని అతలాకుతలం చేసింది. హూవర్ నుంచి అమెరికా పగ్గాలు స్వీకరించిన రూజ్‌వెల్ట్ పరిస్థితి చక్కబరిచేందుకు రాజకీయ చికిత్సలు చేశాడు. ఏ దేశం అవలంబించే ఆర్థిక సంస్కరణలైనా హృదయ గతానుశీలనకు పూనుకోకుంటే, ఆ నేల మీద మానవ విలువల పతనం కూడా ఆర్థిక ఎదుగుదలకి అనులోమంగానే ఉంటుంది. కచ్చితంగా అటువంటి పరిస్థితులే అమెరికాలే నెలకొన్నాయి. వేర్వేరు వర్గాల, జాతుల ప్రజల భిన్నత్వాన్ని సాంస్కృతికంగా ఏకం చేసి కట్టిపడేసే rich heritage లేని దేశం కావడం చేత విలువల పతనం చాలా వేగంగా సంభవించింది.

    19వ శతాబ్దంలోను, 1920’ల ముందు తాము అనుభవించిన భద్రతను ఈ తాజా పరిస్థితుల్లో కూడా పొందడం అంత సులువుకాదని అమెరికన్ జనసామాన్యం గ్రహించింది. అటువంటి భద్రత కోసం కొత్త సామాజిక నిర్మాణాన్ని, తమ జీవన విధానాల్లోకి రాజ్యం చొరబాటును వారు ఆహ్వానించారు. రాజ్యం అవలంబించే క్రమబద్ధీకరణ పద్ధతులు, అమలు చేసే సంస్కరణల వల్ల ‘వ్యక్తి’కి జరిగే హాని పట్ల అమెరికన్ సమాజం నిర్లక్ష్యం వహించింది. ‘ఇండివిడ్యువలిజం’కు పెద్దపీట వేసిన అమెరికా ఈ సంక్షోభదశలో సమష్టితత్వంలోని ‘సహకార ప్రయత్నం’, ‘సామరస్య జీవనం’…. వంటి పాజిటివ్ అంశాల దిశగా గాక, ‘జాతీయ వాద’మనే మహమ్మారి దిశగా లడిచింది. అమెరికన్ సమాజంలో అర్థరహితమైన హింస, పరాయీకరణ, అమానవీకరణ వంటి జాడ్యాల విజృంభణకు దారితప్పిన ఇండివిడ్యువలిజం దోహదపడింది. అమెరికన్, యూరోపియన్ సాహిత్యాల మధ్య అగాధం మరింత ఎక్కువయిన సందర్భం కూడా ఇదే. రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలోని అమెరికా పతనస్థితి అప్పటి యువతరాన్ని, యువ రచయితల తరాన్ని నిరాశావహమైన వేదనకి గురిచేసింది. ఆ వేదనలో వారు ప్రేమ, స్వేచ్ఛల కోసం అన్వేషించారు. ప్రేమాన్వేషణ కొన్ని సందర్భాలలో మనిషిని ఒక ఆధ్యాత్మిక అనుభవం వైపుకు నెడుతుంది. స్వేచ్ఛాన్వేషణ అనార్కిజానికి, నేరప్రవృత్తి వైపునకు కూడా నడిపిస్తుంది. నాటి యువత ముఖ్య ప్రతినిధి అయిన అలెన్ గిన్స్‌ బర్గ్‌ జెన్ బుద్దిజం, క్రిస్టియన్ హ్యూమనిజం, హిందూమిస్టిసిజం వైపునకు ఆకర్షితుడవడానికీ, జాన్ కౌరిక్‌ల నుంచి హిప్పీలు, నార్మన్ మెయిలర్ల నుంచి వైట్ నీగ్రోలు పుట్టడానికీ వాళ్లు ప్రేమ, స్వేచ్ఛలకై చేసిన అన్వేషణే కారణం. అందుకే ఆ దశలోని యావత్ సాహిత్య నాయకుడిని ‘భ్రష్టయోగి’గా అభివర్ణించాడు ఆర్.డబ్ల్యు.ఎస్.లూయిస్. కనుక, గిన్స్‌ బర్గ్‌ ప్రభృతుల నేతృత్వంలో ప్రారంభమైన బీట్ ఉద్యమాన్ని సాంఘిక తిరుగుబాటు అనే కంటే ఒక religious aspiration అనడమే సబబు. బీట్ ఉద్యమ సాహిత్యం ప్రధానంగా ‘నేను’ను ఉద్దేశించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న హెమింగ్వే వంటి రచయితలు యుద్ధం వస్తువుగా గొప్ప నవలలు రచించారు. కమ్మింగ్స్ ‘ది ఎనార్మస్ రూమ్’, డాస్ పాసోస్ ‘త్రీ సోల్జర్స్’, హెమ్మింగ్ వే ‘ఎ ఫేర్‌వెల్ టు ఆర్మ్స్’ వంటి రచనలను ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరం కూడా విమర్శకులు ఆశించారు. కానీ పైన పేర్కొన్న కారణాల వల్ల ఆ దశలో వచ్చిన యుద్ధనవలలు కూడా ‘నేను’ బాగోగులనే పట్టించుకున్న్నాయి. నార్మన్ మెయిలర్ ‘ద నేకెడ్ అండ్ ద డెడ్’, జేమ్స్ జోన్స్ ‘ఫ్రం హియర్ టు ఎటర్నిటి’ వంటి యుద్ధ నవలలు యుద్ధాన్ని గాక, యుద్ధ బీభత్సం వల్ల సంక్షుభితమైన ఆత్మల గురించే ఎక్కువ చర్చించాయి. అయితే, యూరోపియన్ అస్తిత్వవాదులు కర్క్‌ గార్డ్, సార్త్ర్ ప్రతిపాదించిన ‘నేను’కు, బీట్ తరం ఉద్దేశించిన ‘నేను’కు ఎంతో తేడా ఉంది. ఆమోదయోగ్యం కాని సంప్రదాయక విలువలు ఆదర్శం పేరిట ఏర్పరచిన శూన్యాన్ని భర్తీ చేసే ఒక అస్తిత్వభావక ప్రయత్నమే బీట్ ఉద్యమం. హింసాత్మక ప్రవృత్తి, అరాచక ధోరణి, డ్రగ్ ఎడిక్షన్ వంటి లక్షణాలు ఉన్నప్పటికీ, ఒక religious aspiration తో నాటి అమెరికన్ సంస్కృతిపై యుద్ధం ప్రకటించిందీ ఉద్యమం.

    సాహిత్యం కంటే సమాజం, సంస్కృతులపై యుద్ధం ప్రకటించిన బీట్ ఉద్యమ స్ఫూర్తి, ముఖ్యంగా గిన్స్ బర్గ్ ప్రభావం – హిందీలో రాజ్‌కమల్ చౌధురీ, విష్ణు చంద్రశర్మ, కైలాష్ వాజ్‌పేయి వంటి విప్లవ కవులు, బెంగాల్‌లోని సునీల్ గంగోపాధ్యాయ, శక్తి చటోపాధ్యాయ, మలయ్‌ రాయ్ చౌధురీ వంటి యువకవులపై కనబడినంతగా కూడా మన దిగంబర కవులపై లేదు. బీట్ ఉద్యమంతో పోలినట్లు గుర్తింపు పొందిన దిగంబర ఉద్యమం ఊపిరి తీసేందుకై అక్కడి సామాజిక పరిస్థితులే ఇక్కడ కూడా ఉండవలసిన అగత్యం లేదు. ఉద్యమ స్ఫూర్తిని ఆత్మికంగా అనుభవించినా చాలు. దిగంబర కవులు పుట్టినది భద్రమైన దక్షిణాదిలో. అందునా ఏ సాంఘిక ఉద్యమాలూ లేని, ఒక వేళ ఉన్నా, ఆవి పై తరగతులకే పరిమితమై మెజారిటీ వర్గాలకి సెగసోకని తెలుగునేల మీద. అటువంటి భద్రమైన సాంస్కృతిక వాతావరణంలో దిగంబర కవులను అలజడికి, తిరుగుబాటుకు ప్రేరేపించినది కచ్చితంగా సంక్షుభిత ఆత్మిక వాతావరణమే అయ్యి ఉండాలి. అంటే వారి వారి జ్ఞానం వల్ల, తెలివిడి చేత, వారి దృక్పథాల కారణంగా ఆంధ్రదేశంలోని సమాజాన్ని కాకుండా, ఒక అమూర్తమైన పతన సమాజాన్ని ఉద్దేశించి వారు తిరగబడ్డారని అనుకోడానికి ఆస్కారముంది. పరిష్కారం కోసం నడుంకట్టిన వారు సమస్యను కూలంకషంగా అర్థం చేసుకొని ఉంటారని అనుకున్నట్టే, తమలోని ఈ విప్లవ పరిణామానికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడిన బీట్ ఉద్యమం పూర్వాపరాలను దిగంబరులు అర్థం చేసుకుని ఉంటారనే అనుకోవల్సి వస్తుంది. Misconceptions కి తావులేని విధంగా తమంత తాముగా పూనుకొని బీట్ ఉద్యమాన్ని విశ్లేషించుకునే బాధ్యత కూడా వారిపైననే ఉందన్నది నిర్వివాదాంశమే.

    అయితే, అలా చేయకపోవడం వల్లనే, పునాదిని బలంగా నిర్మించకపోవడం వల్లనే దిగంబర కవితాసౌధం అర్ధాం తరంగా కూలిపోయింది. ఉపరితల పరిశీలనతో బీట్ ఉద్యమంలోని కొన్ని అంశాలను మాత్రమే గ్రహించి ఆ కవులు చేసినది ‘దిగంబర కవితోద్యమం’ పేరిట ఒక ఆగ్రహాభినయం మాత్రమే. ‘మహాప్రస్థానం’తర శ్రీశ్రీలోని పతనపార్శ్వం ఆదర్శంగా ఆంధ్రదేశాన్ని అలముకున్న అభ్యుదయ కవితావరణంలోని భరించలేని మొనాటనీ వల్ల అప్పటి తెలుగుసాహీతీ లోకం దిగంబర కవిత్వాన్ని ఆహ్వానించి ఉండొచ్చు.

    ‘అకవిత్వం’ యొక్క అవసరాన్ని రారా గ్రహించలేదు. అందుకే దిగంబర కవిత్వంపై దాడి చేశారు. అయితే దిగంబర కవులు కొందరు విప్లవ కవులుగా రంగులు మార్చుకొని ఆ ‘అకవిత్వ’పు ఆవశ్యకతపై తమకు కూడా అవగాహన లేదని నిరూపించడం విభ్రాంతి కలిగించే కొసమెరుపు.

    * * * * * * * * *

    అటువంటి దిగంబర కవితోద్యమ సారధి అయిన నగ్నముని తన సాహిత్య ప్రస్థానంలోని ఒక మజిలీ (బహుశా చివరి మజిలీ) వద్ద ప్రకటించిన దీర్ఘకవిత ‘కొయ్యగుర్రం’. ‘కొయ్యగుర్రా’నికి సందర్భం- 1977 నవంబర్ 19న సంభవించిన పెనుతుపాను, ఉప్పెన.

    ‘మానవ దౌష్ట్యానికీ ప్రకృతి ప్రళయానికి

    విరిగిపోయేవి దరిద్రుల ఎముకలే

    చివరకు మిగిలేవి గుడిశెల మృత కళేబరాలే’.

    ఇదే నగ్నముని స్థూలంగా రాజ్యం మీద చేసిన ఆరోపణ. స్థలం, సమయం, సందర్భం అన్నీ నెపాలే. ఈ విషయాన్ని దీర్థకవితలో చాలా సార్లు వాచ్యం చేశాడు నగ్నముని.

    ‘చివరి విందులో

    తననెవరు మోసం చేస్తారో

    జీసస్‌కు తెలుసు

    హంతకులెవరో నాకు తెలుసు

    నెపం కాసేపు సముద్రం మీదకు తోస్తాను;

    తీరమంతటా గుడిశె ఉందని తెలుసు

    గుడిశెముందు పుట్టలున్నాయని తెలుసు

    పుట్టల్లో కోడెనాగులున్నాయని తెలుసు

    పడగల్లో విషముందని తెలుసు

    పాలుపోసే చేతినే అదను చూసి పడగ కెరటాల కోరలు

    కాటేస్తాయని తెలుసు

    హంతకులెవరో నాకు తెలుసు

    అయినా నెపం కాసేపు సముద్రం మీదకు తోసేస్తాను’

    అంతేగాదు, అసలు కొయ్యగుర్రమంటే ఏమిటో అది దేనికి ప్రతీకో కూడా కవితలోనే వివరించాడు-

    ‘కొయ్యగుర్రం

    స్తబ్ధతకీ మూర్ఖతకీ

    అజ్ఞానానికీ అహంకారానికీ

    అసమర్థ పాలనకీ ప్రతీక’ అంటూ-

    బహుశా వచన కవిత్వాన్ని ప్రజాస్వామ్యీకరించడం అంటే ఇదేననుకుంటే, కొయ్యగుర్రం ఆసాంతం వైవిధ్యభరిత స్టేట్‌మెంట్లతో నింపేసి గొప్ప ప్రజాస్వామ్యీకరణ సాధించాడు నగ్నముని.

    ‘మనిషిలోని అన్ని అంగాలూ

    జంతువులుగా మారడానికే

    జీవితాంతం ప్రయత్నిస్తాయి’- ఫ్రాయిడియిన్ ప్రకటన;

    ‘ప్రకృతిలో గానీ వికృతిలో గాని

    దానవత్వపు అంధకారమే నిరంతరం

    మనుషుల్ని పాలించే నిజం’- చారిత్రక ప్రకటన;

    ‘దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే

    గొంతు పిసగ్గలదు’- నిష్ఠూర ప్రకటన;

    ‘అంతవరకీ

    ప్రపంచంలోని అర్ధరాత్రుల గదుల్లోని

    భాష అంతా ఒక్కటే’- లోకవృత్త పరిశీలక ప్రకటన;

    ‘ఏ క్షణంలో దేముడు పుట్టాడో

    ఏ క్షణంలో విధిరాత నుదిటిపై

    లిఖించబడిందన్నారో

    ఆ క్షణమే మనిషి చచ్చాడు

    కర్తవ్యం చచ్చింది

    ఇప్పుడు కొత్తగా ఎవరయినా ఎవర్నయినా చంపేదేమిటి

    ఇప్పుడు కొత్తగా సముద్రం చంపేదేమిటి

    ఇప్పుడు కొత్తగా కొయ్యగుర్రం చంపేదేమిటి’- నిర్లిప్తోద్రేక ప్రకటన;

    ‘చనిపోగానే మనిషితోపాటు

    భాష కూడా చనిపోతుంది

    ప్రపంచం కూడా చనిపోతుంది

    దేముడు కూడా చనిపోతాడు’ – మెటాఫిజికల్ ప్రకటన;

    ‘ఈ వ్యవస్థలో

    పుట్టడం మోసపోవడానికే

    పెరగడం మోసపోవడానికే

    ప్రేమించడం మోసపోవడానికే

    నమ్మడం మోసపోవడానికే’ – కఠోర సత్య ప్రకటన.

    ఇన్ని ‘వచన’ ప్రకటనలు చేయడానికీ,

    ‘ఆలోచనకీ మనిషికీ వున్న సంబంధం ఏమిటి

    భాషకీ భావానికీ వున్న సంబంధం ఏమిటి

    వేదనకీ శరీరానికీ వున్న సంబంధం ఏమిటి

    నేలకీ నీటికీ వున్న సంబంధం ఏమిటి…’ అంటూ కొన్ని పరమ తాత్విక ‘వచన’ వేదనలు పడటానికీ నగ్న మునిలోని ప్రజస్వామ్యానుకూల భావజాలమే కారణమనుకుందాం. వచన కవిత్వం పేరిట కొందరు కవులు బాడ్‌ ప్రోజ్ రాస్తున్నారని గోలపెట్టిన ఎలియెట్‌తోపాటు, ఆడెన్, వాలెస్ స్టివెన్‌ల రూపవాద, మేథో జనిత కవిత్వ వైఖరులను వ్యతిరేకించిన గిన్స్‌ బర్గ్ ప్రభృతుల తరం నగ్నమునికి ఆదర్శమయిందనే అనుకుందాం.

    అలా అనుకుంటూ-

    ‘కవి నుండి బయటపడ్డ ప్రతి అక్షరం

    భావాన్ని భ్రూణ హత్య చేసి మరీ

    బయటపడుతుంది

    కవిని హంతకుడిగా చిత్రిస్తుంది…’ అన్న పంక్తుల్ని పట్టించుకుంటే, భ్రూణ హత్యకు గురవుతున్న ‘భావం’ అంటే ‘అర్థం’ అని అర్థం. అక్షరమంటే శబ్దం, అర్థాల సమ్మేళనం. శబ్దానికి నిర్దిష్టమైన అర్థం ఉంటుందని, ఉండాలన్న పాత ప్రతిపాదనల్ని నగ్నముని పై పంక్తుల్లో తిరస్కరిస్తున్నాడు. అంటే శబ్దార్థాలను విడదీస్తూ ఎలియట్ ప్రతిపాదించిన auditory imagination వంటి రూపవాద సిద్ధాంతాలను నగ్నముని (తెలిసో, తెలియకో) సమర్థిస్తున్నాడు. కనుక కవిలో ఇదొక పారడాక్స్.

    ‘కొయ్య గుర్రం’ కవితా రూపాన్ని మరింత తరిచి చూస్తే కేలండర్‌ ను ఒకచోట ఇలా సంభావిస్తాడు

    ‘కాలం కుక్క నోటిలోని ఎముక ముక్క
    గోడకు బల్లిలా కరుచుకునిపోయిన వుత్తి కాగితం ముక్క’. ఇది తర్కాతీతమైన conceit అలంకారం. అయితే తర్వాత చరణంలోనే అదే కేలండర్‌ ను ఇలా వర్ణిస్తాడు.

    ‘…ముసుగు కప్పిన మూలుగులపై వెల్లవేసే తెల్లకాగితం

    కాలాన్ని దినాలుగా… వారాలుగా… ముక్కలు చేస్తే

    కారుతున్న తెల్లటి రక్తం’.

    కేలండర్ కాగితపు తెల్లదనాన్ని రోగులపై కప్పిన ముసుగుగా, తెల్లటి రక్తంగా అభివర్ణించడం తర్కబద్ధమైన ఒక ఇమాజిస్టు పోకడ. అదే విధంగా,

    ‘…జీవితం నాగలై

    చర్మాన్ని దున్ని ముడతల చాళ్ళతో నింపుతుంది

    అనుభవాల పంట బంగారం పండుతుంది…’ అని రాసిన తర్వాత వాక్యంలోనే ‘… పండించిన వాడి నోటిలో మొలిచేది మాత్రం జిల్లేడు’ అంటారు. రెండు విభిన్నమైన planes నుండీ పొంతన లేకుండా వచ్చిన ఈ ప్రకటనలను ఎలా అన్వయించుకోవాలో అర్థం కాదు. ఇలా అలంకారాల ప్రయోగంలోని స్థాయీ భేదాలు, తత్ఫలితంగా ఏర్పడే అయోమయం… కవితా నిర్మాణ పద్ధతులపై కవి అవగాహనా రాహిత్యానికీ, శైలీ దారిద్ర్యానికి తార్కాణంగా నిలుస్తాయి.

    ఇంకా ‘కొయ్యగుర్రం’లో దేముడు, విధి రాతలపై క్రోథమున్న కవి- ‘లోకమంతా అరణ్యంలో అల్లుకున్న మత గ్రంథాల/సూక్తుల కవతల ప్రార్థనల కవతల…’ దృశ్యాన్ని వీక్షించగల కవి, ‘దెయ్యాలు అన్ని భాషల్లోని వేదాలూ/రక రకాల గొంతుల్తో వల్లిస్తాయి వల్లిస్తాయి’ అంటూ వేదాలకు ఎనలేని పవిత్రత అపాదించడం ఆశ్చర్యమనిపిస్తుంది. ‘బట్టలేసుకుని నగ్నత్వంలోకి పారిపోతుంది/నాగరికత/కేబరేలో తాదాత్మ్యం పొందే కళ్ళల్లో దాక్కోడానికి/ ప్రయత్నిస్తుంది’ అన్న పంక్తుల్లో 1970 ల నాటి నేలబారు తెలుగు సినిమాలలో తరచూ దృశ్యించబడిన రసాత్మక సన్నివేశ మొకటి కళ్ళకు కట్టినట్టనిపిస్తుంది. ‘…మ్యూజియంలో శిల్పంగా మారిగడ్డానికి చేతిని ఆన్చి/ఆలోచిస్తూ ఉన్న రోడిన్‌’ను ఈ కవితంలోంచి బైటకు లాగేస్తే , పొడవు తగ్గడం తప్ప కవితకు నష్టమేమిటా అనిపిస్తుంది. ‘రెండు శరీరాలు ఏకమయ్యే సమయం/గడియారంలోని ముళ్ళూ రెండూ ఒకటి కావడానికి/తహతహలాడిపోయే సమయం/కొత్త కొత్త కలలు చర్మంలో ప్రాణం పోసుకునే సమయం…’ గురించి ఒక పేజీ మొత్తం కవిత్వమై ‘సాగి’పోవాల్సిన అవసరం లేనేలేదనిపిస్తుంది. ‘కొయ్యగుర్ర మెక్కి కొయ్య కత్తితో/ఊరేగే ప్రభుత్వాలు/దేవాలయాల మీది బూతు బొమ్మలు’- ఎందుకయ్యాయో అర్థమయ్యే అవకాశం లేదనిపిస్తుంది. ‘విశ్వశ్రేయం కావ్యం అని అరుస్తూ/ప్రబంధ నాయకి తొడల బంధనాల్లో/పాదాలకు పూసుకుని ఎగిరే లేపనాల్లో/అంటుకున్న కవిత్వం అబద్ధం…’ అన్న కవి నిర్వేద ప్రకటనల ఆధారంగా క్రీ.శ.16, 17 శతాబ్దాల మృత భావనల పైనేగానీ, తర్వాతి తరాలతో కవితా వైఖరులతో ఈ కవికి పేచీలేదని తెలిసివస్తుంది.

    అంతేకాదు-

    ‘ఈ భూమిపై నిరంతర ఘోషతో

    రోడ్ల ప్రక్కన పడి మూలుగుతూ దొర్లుతున్న

    కొనవూపిరి నిజం

    మృత్యువు నిజం;’

    ‘అంతరిక్ష నౌక

    చంద్రమండలం వైపు దూసుకు వెళుతుంది

    దారిలోనే పొంచున్న ఓ దోమ శాస్త్ర విజ్ఞాన ప్రగతిని

    పరిహసిస్తూ వ్యోమగానం చేస్తుంది;’

    ‘మానవుడి మనసులో మాత్రం

    మహాబోధి ఎప్పుడో కూలిపోయింది;’

    ‘…కొత్త కలల్తో

    కొత్త విలువల్తో

    కొత్త విశ్వాసాల్తో

    విశ్వవస్త్రం నేసి

    తిరిగొచ్చి

    దినమొలగా దిక్కుల మధ్య దిక్కు లేకుండా

    పడి వున్న మనిషి ఒంటిపై కప్పుతాను’

    …అంటూ దీర్ఘ కవితలో కవి పదే పదే చేసిన ప్రకటనల వల్ల, విశ్వ మానవుడి కోసం పడిన తపన వల్ల ఈ కవి ‘వసుధైక కుటుంబాని’కి చెందినవాడే తప్ప ‘సంకుచిత’మైన ఆంధ్ర దేశానికీ లేదా భారత దేశానికీ చెందనవాడు కాదని స్పష్టమవుతున్నది.

    ఆ విధంగా విశాలమైన కవి domain కు సంబంధించిన ఎరుక వల్ల తెలుగుదేశాన్ని లేదా, భారతదేశాన్ని ఆయన ఎక్కడైనా సరిగా అర్థం చేసేకోలేక పోవడాన్ని అర్థం చేసుకుని సమర్థించుకోవచ్చు. అలా సమర్థించుకోకపోతే, ‘కొయ్య గుర్రం’ అంకితపు మాట దగ్గరే శత కోటి సందేహాలతో ఆగిపోవాల్సి వస్తుంది. ‘ఈ వ్యవస్థ హృదయం గల హయమనీ, వేగంగా కూడూ గూడూ గుడ్డా దొరికే సోషలిస్టు హయాంలోకి తమని తీసుకుని వెళుతుందనీ అమాయకంగా నమ్మి ఈ కొయ్యగుర్రాన్ని కొలుస్తూ దీని రాజకీయపు ఇనుప డెక్కల క్రింద నలుగుతూ బానిసలుగా బతుకుతూ 1977 నవంబర్ 19వ తేదీన సాగరమెత్తిన జల ఖడ్గం క్రింద ఊపిరి తెగిన అసంఖ్యాక అమాయక అభాగ్యులకు-‘ అంకితమిచ్చాడు నగ్నముని. విశ్వకవి కావడం చేత నగ్నమునికి భారతదేశం గురించి తెలియకపోవచ్చుగానీ, ఒకటి, రెండు శతాబ్దాల క్రితం వరకూ దేశంలోని మెజారిటీ ప్రజలకు తాము ఏలుబడిలో ఉన్న వ్యవస్థ స్వరూప, స్వభావాలు అర్థంకాని విషయాలే. ఆధిపత్యం వహిస్తున్న అతి తక్కువ వర్గాలకు (వర్ణాలకు) ఊడిగం చేస్తున్న అత్యధిక ప్రజానీకానికి భిన్న వ్యవస్థలు అందించిన అనుభవం దాదాపు ఒకటే. ఇటీవలి శతాబ్దాలలో, ముఖ్యంగా స్వాతంత్ర్యానంతర భారతావనిలో మెజారిటీ బడుగు వర్గాలలో కొంత మేరకైనా పెరిగిన అవగాహన వల్ల వారు వ్యవస్థ పట్ల ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకునే వీలు చిక్కింది. అయితే వ్యవస్థ తమను ఉద్ధరిస్తుందనే భ్రమ ఏ దశలోనూ జన సామాన్యానికి లేదు. ఈ వ్యవస్థలో వారి mechanical participation కొనసాగినట్లే, సిస్టం పట్ల ritual disobedience కూడా కొనసాగుతూనే వస్తున్నది. ‘వ్యవస్థ హృదయం గల హయమని’ 1977 నాటి జన సామాన్యం నమ్మారని నగ్నముని అనడం హాస్యాస్పదమే.

    ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ప్రేమాన్వేషణ వల్ల ఒక విధమైన ఆధ్యాత్మిక అనుభవం వైపు మళ్ళిన గిన్స్ బర్గ్ తరం ప్రభావంతో క్రిస్టియానిటీలోని మానవత్వాన్ని, బుద్ధిజంలోని తాత్త్విక గాఢతనీ ఆంధ్రదేశంలో త్రిపుర, మో వంటి మహా రచయితలు అధ్యయనం చేశారు. ఆ దశలోని త్రిపుర, మో రచనలలో విరివిగా కనిపించే biblical metaphors కి కారణమదే. అయితే, ‘కొయ్యగుర్రం’లో నగ్నముని వాడిన biblical allusion అయోమయానికి గురి చేస్తున్నది-

    ‘పొద్దు తనను పొడవక ముందే

    బక్కటెద్దులు వెంటరాగా

    నాగలి బుజాన వేసుకుని

    పొలం వెళ్ళే ప్రతి రైతూ నాకు

    శిలువ మోస్తున్న జీసెస్‌లా కనిపిస్తాడు’ అంటూ రైతును, జీసెస్‌తో పోల్చిన వెంటనే రాస్తాడిలా-

    ‘చివరి విందులో

    చివరికి తననెవరు మోసం చేస్తారో

    జీసెస్‌కి తెలుసు

    హంతకులెవరో నాకు తెలుసు.’

    దీనిని బట్టి రైతు అనే జీసెస్‌కు తనను మోసం చేసే జుడాస్ గురించి తెలుసు. అంటే వ్యవస్థలోని flaw గురించి తెలుసు. అంటే ‘కొయ్యగుర్రం’ గురించి తెలుసు. (హంతకులు ‘కొయ్యగుర్రం’ మీద స్వారీ చేస్తున్న ప్రభుత్వాలని కవికి తెలుసు). ‘కొయ్యగుర్రం’ గురించి ఇంత స్పష్టంగా తెలిసి కూడా అది ‘సోషలిస్టు హయాంలోకి తమను తీసుకుని వెళుతుందనీ అమాయకంగా’ దానిని జన సామాన్యం ఎలా నమ్మిందో (లేదా ఎలా నమ్మిందని కవి భావించాడో), ఎందుకు ఆరాధిస్తోందో అర్థం కాదు. ఈ పారడాక్స్ కవి అయోమయ ఆలోచన లోనిదే అనిపించక మానదు. ‘కొయ్యగుర్రం’ ఆద్యంతం వ్యాపించి వున్న ఈ అవగాహనా లోపాన్ని కవిత ప్రారంభంలోనే సూచ్యంగా తెలియజేశాడు నగ్నముని. ‘జీవితం మిధ్య అనడం అబద్ధం…’ అన్న ప్రారంభవాక్యంతో శత్రువుపై యుద్ధభేరీ మోగించాడాయన. అయితే నగ్నముని తన కవితాశరాలను ఎవరి పైనైతే గురి పెట్టాడో ఆ ముదుసలి సంప్రదాయక పండితులు ‘జీవితం మిథ్య’ అనలేదు. ‘జగత్ మిథ్య’ అన్నారు. (‘జీవితా’నికి – ‘జగత్’కీ మధ్య తేడా గురించి చర్చ బహుశా అనవసరమేమో.) ప్రత్యర్థులు ఏమన్నారో కూడా పూర్తిగా వినకుండానే దాడికి దిగారు (దిగినట్లు అభినయించారు) కవి నగ్నముని.

    * * * * * * * * *

    20వ శతాబ్దంలో అమెరికన్ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాలకు హెర్బర్ట్ మార్కహ్యూజ్‌ని సైద్ధాంతిక గురువుగా గుర్తిస్తారు. “…In a society totality was determined by economic relations to the extent that uncontrolled economy controlled all human relations, even non- economic relations, the so called Marxist revolutionary class, i.e. the working class, becomes tame, is no longer in possession of its political bearings and revolutionary potential and in fact, willingly acquiesces in its own exploitation and becomes a staunch and conservative defender of the Status-quo” అని సూత్రీకరించాడాయన. ‘కార్మిక నియంతృత్వ’ భావనకి చెల్లు చీటీ ఇచ్చిన ఆ మార్కిస్టు మహోపాధ్యాయుడు – విప్లవానికి దోహదపడే శక్తులుగా సామాజిక బహిష్కృతులైన నిరుద్యోగులు, బ్లాక్స్, మైనారిటీలు, స్త్రీలను గుర్తించాడు. అదే విధంగా ఏ భావజాలపు వలలోనూ బందీలు కాని యువతరం కూడా విప్లవానికి దోహదపడే ప్రధాన శక్తి అంటాడు మార్కహ్యూజ్. తమకు స్థానం కల్పించని సమాజం మీద ఆగ్రహంతో వ్యవస్థ విధించిన నిబంధనలపై యువత తిరుగుబాటు చేస్తున్నదని ఆయన ప్రతిపాదన. బ్లాక్ మూవ్‌మెంట్స్, ఫెమినిస్టు ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మార్కహ్యూజ్ హిప్పీలకు, బీట్నిక్కులకు కూడా స్ఫూర్తి అయ్యాడన్న అపోహ ప్రచారంలో ఉంది. నిజానికి ఆయన ‘The Question of Revolution’ రాసే (1967) నాటికీ బీట్ ఉద్యమం అవసానదశలో ఉంది. అదీగాక మార్కహ్యూజ్ ఆశించిన ‘విప్లవం’ బీట్నిక్కుల లక్ష్యంకాదు.

    కనుక బ్లాక్, ఫెమినిస్టు ఉద్యమాలు (బలహీనంగానైనా) నేటికీ కొనసాగడమెంత సహజమో, బీట్ ఉద్యమం నిన్నలోనే మిగిలిపోవడం కూడా అంతే సహజం. బీట్ ఉద్యమ వైఫల్యంతోనే దాని విజయం (బహుశా పాక్షికమైనదే కావచ్చు) ఉందని తన జీవితమే ప్రామాణికంగా నిరూపించాడు – గిన్స్ బర్గ్.

    ఆయన ఒక సుదీర్ఘమైన Howl తో ఆగలేదు. తల్లి మరణాన్ని దుఃఖిస్తూ Kaddish దీర్ఘ కవితా శోకంతోనూ ఆగలేదు. బీట్ కవుల విఫల, సాఫల్యాలకు అతీతంగా ప్రయాణం సాగించాడు. రైలును Iron Horse గా సంభావిస్తూ ఆయన రాసిన దీర్ఘ కవిత, అమెరికా పతనాన్ని భేదిస్తూ ట్రావెలోగ్‌లా రాసిన Fall of America దీర్ఘకావ్యం (ఈ రెండూ epics గా విమర్శకులు ప్రశంసించారు) వంటివెన్నో ఆమరణాంతం కొనసాగిన ఆయన ప్రయాణంలో ప్రాణం పోసుకున్నవే.

    నగ్నముని – గిన్స్ బర్గ్ ప్రస్థానాన్ని గుర్తించలేదు. గుర్తిస్తే తన decadence ని నిరోధించుకోగలిగినవాడే. నగ్నముని – బీట్ ఉద్యమం వైఫల్యాన్ని గుర్తించలేదు. గుర్తిస్తే తమ (దిగంబరులు) వైఫల్యాన్ని గుర్తించేవాడే. నగ్నముని – మార్కహ్యూజ్ సిత్ధాంతాలను గుర్తించలేదు. గుర్తిస్తే విరసంలో ఉన్నప్పుడుగానీ, విరసం నుండి బైటపడినప్పుడుగానీ, ఆ సిద్ధాంతాల వెలుగులో స్త్రీ, దళిత, మైనారిటీలను మేలుకొలపగలిగేవాడే. ఇవేమీ జరగలేదు. కనుకనే ఆయన తన evolution కంటే self- elevation కే మొగ్గు చూపారనిపిస్తుంది. ఏ ముఠాలోనూ ఒదగలేక, తనకుతానుగా విధించుకున్న exile కి కూడా పైన పేర్కొన్న ఆ ‘మొగ్గే’ కారణమనుకోవచ్చు. అటువంటి ‘నేను’ కేంద్రక, కీర్తికాముక సంకుచితత్వం వల్లనే తనను మరిచిపోతున్న పాత తరాలకు, తన గురించి సరిగా తెలియని కొత్త తరాలకు పునః పరిచయమవడానికి మాత్రమే ‘కొయ్యగుర్రా’న్ని పునర్ముద్రించారు. ద్వితీయ ముద్రణ మీద లాంఛనంగానైనా పీఠిక రాయకపోవడమే నా యీ ఆరోపణలకు మరో తిరుగులేని సాక్ష్యం!

    – నరేష్ నున్నా

మీ మాటలు

*