ప్రతి వాక్యం ప్రతిఘటనే!

mouli

 

“…for a brave and kindly-natured comrade is as dear to a man as his own brother.” (Odyssey, Book IX, 585-86).

1

మౌళీ నాకు ఫోన్ చేసి ‘ నా కవితాసంపుటి ‘ ఆకు కదలని చోట ‘ ఈ 21 న ఆవిష్కరణ వుంది. దాని మీద నీ అభిప్రాయం రాస్తే బాగుంటుంది” అన్నాడు. మొదట్లో నేను తటపటాయించాను. నేనెప్పుడు తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని అంత క్షుణ్ణంగా అనుసరించలేదు. ” నా కంటే  బాగా రాసే వాళ్ళు, అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు ” కదా అన్నట్టు అన్నాను. ” లేదు. నువ్వే రాస్తే బాగుంటుందని…” అన్నాడు మౌళి. నేను అభ్యంతరంగానే ఒప్పుకున్నాను- మౌళీ కవిత్వానికి నేను న్యాయం చేయలేనేమోనన్న భయంతో!

ఫోను ముగించగానే పుస్తకం పేరు మరొకసారి గుర్తు తెచ్చుకున్నాను. ‘ఆకు కదలని చోట ‘ – వెంటనే ఫిలిప్పైన్ కమ్యునిస్టు పార్టీ స్థాపించిన విప్లవకారుడు, కవి హోస్ మారియా సిసోన్ రాసిన ‘గెరిల్లా యోధుడు కూడా ఓ కవే ‘ అన్న కవితలోని మొదటి వాక్యాలు గుర్తొచ్చాయి.

“ఆకు కదలికకు,

చితికిన రెమ్మకు,

నది అలజడికి,

నిప్పు వాసనకు,

వెనుదిరిగినపుడు రాలే బూడిదకూ

ప్రతీ అలికిడికీ అప్రమత్తం అయ్యే

గెరిల్లా యోధుడుకూడా ఓ కవే”

ఇక్కడ సిసోన్ ఒక విషయం చెప్పకనే చెప్పాడు – సున్నితత్వం (sensitivity) లో గెరిల్లా యోధునికీ, కవికీ తేడా లేదని.

చేగువేరా తన పిల్లలకు రాసిన వీడుకోలు లేఖలో విప్లవకారుడి సున్నితత్వం గురించి “ప్రపంచం నలుమూలలలో ఎక్కడ అన్యాయం జరిగినా అంతరాంతరాల్లో నుండి ప్రతిస్పందించగలగాలి” అని రాస్తాడు. బహుశా అలాంటి సున్నితత్వం వలనే మౌళీ బస్తర్ నుండి సిరియా వరకూ, తెలంగాణా ఉద్యమం నుండి టర్కీ శరణార్థుల వరకు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఆ పరిస్థితిలో తనను తాను మమేకం చేసుకొని  (identify)  సంఘీభావం (solidarity) తెలుపుతూ కవితలు రాసాడు.

2

మౌళికి నటించటం రాదు. తానేం చూస్తాడో అదే రాస్తాడు. తన చుట్టూ పరిసరాలను, మారుతున్న ప్రపంచాన్నీ, దోపిడీని, అణిచివేతనీ, ప్రకృతిని, రాజుకుంటున్న విప్లవాన్ని- నిజాయితీగా ‘witness’ చేస్తాడు.  ఇలాంటి కవిత్వాన్ని అమెరికన్ కవియిత్రి, మానవహక్కుల ఉద్యమకారిణీ అయిన కెరోలిన్ ఫోర్ష్ ‘Poetry of Witness’ అంటుంది. ఈ రకమైన కవిత్వన్నే రాసే Yannis Ritsos అనే గ్రీకు మహాకవి, మౌళీ కి ఇష్టమైన కవి కావటంలో ఆశ్చర్యం లేదు. Ritsos ఎంత ప్రమాదకరమైన కవి అంటే అతని కవిత్వ జ్వాలకు ఎదురుగా నిలబడలేక 1936 లో గ్రీకు దేశపు ఫాసిస్టు ప్రభుత్వం అతని కవిత్వాన్ని కాల్చి దగ్ధం చేసింది. Ritsos ని  మౌళీని ఇద్దరినీ కలిపే ఓ మౌలిక స్వభావం- నిజాయితీ. తమ అక్షరాల పట్ల నిజాయితీ. తమ జీవితాలలో నిజాయితీ. తమ ఉద్యమాలకూ, భావజాలలకూ నిజాయితీ. తమ చుట్టూ ప్రపంచంతో నిజాయితీ.

ఈ నిజాయితీనే మౌళీ కవిత్వానికి అస్తిత్వం, ప్రాణం.

ఓ నైరూప్య వినియోగదారుడికోసం నిజాన్ని కూడా  న్యూస్ అన్న పేరుతో కమోడిటీ చేసి కృత్రిమంగా మార్కెట్లో అమ్ముతున్న తరుణంలో మౌళీ రాస్తున్నటువంటి కవిత్వం, సాహిత్యం ఓ ప్రత్యామ్నాయ చరిత్రనే  సృష్టించగలదు.

3

స్పానిష్ మహా కవి నెరుడా తన నోబెల్ ప్రసంగంలో కవి గురించీ ఇలా అంటాడు.

“ప్రజలందరిలాగ తాను కూడా ఉత్పత్తి సంబంధాల్లో పాల్గొంటూ, మిగిలిన మనుషుల పట్ల వారి పనుల పట్ల సున్నితత్వంతో వ్యవహరిస్తూ, రోజువారి సామాన్య జీవితపోరాటాలలో పాలుపంచుకుంటూ, చెమటలు కక్కుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా మానవత్వం సమూహంగా కనే ఓ మహోన్నత కలలో తాను కూడా భాగస్వామయినప్పుడు.. ఆ కవి కవిత్వం చారిత్రాత్మకమవుతుంది”

మౌళీ కూడా అలాంటి కవే. ప్రజలలో, పోరాటాలలో మమేకమైన కవి. కవిత్వం సామాన్య ప్రజలకోసమని అనుకునే కవి. అందుకే తాను పాఠాలు చెప్పే తరగతిలోని విద్యార్థులకు కవిత్వం కూడా చెప్తూ, కవిత్వం చదవటాన్ని, రాయటాన్ని  ప్రోత్సహిస్తూ, వారు రాసిన కవిత్వాన్ని పత్రికలకు పంపిస్తూ ఉంటాడు.

ఎందుకంటే మౌళి దృష్టిలో కవిత్వం ప్రజాస్వామికమైనది.

4

మౌళీ కవిత్వంలో మరొక ముఖ్యమైన అంశం జ్ఞాపకం. ఓ వ్యక్తి వ్యవస్థను  ఎదిరించి నిలబడటం లాంటిదే జ్ఞాపకం మరుపును నిలువరించటం కూడా అంటాడు జెకొస్లెవేకియన్ రచయిత మిలన్ కుందేరా.

ప్రపంచం మనిషి ఇచ్ఛతో సంబంధం లేకుండా, నిర్విరామంగా మారుతున్న సమయం ఇది. ఇలాంటి పరిస్థితులలో జ్ఞాపకానికి ఓ విప్లవాత్మకమైన బాధ్యత ఉంటుంది.

మౌళీ కవిత్వం రాయటం ద్వారా జ్ఞాపకాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంటాడు. జాతీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాల తాలుకు జ్ఞాపకం, తను పుట్టిపెరిగిన పల్లెటూరు, అక్కడ చుట్టూ మారుతున్న పరిస్థితుల తాలుకు జ్ఞాపకం రెంటినీ తన కవిత్వం ద్వారా ఒక చోటికి తెచ్చి shortcircuit చేస్తూ ఆ జ్ఞాపకంతో పాఠకున్ని shock కి గురిచేస్తాడు.

5

ఎప్పుడూ ఏకాంతాన్నీ, ఏకాంతంలోని రసాన్ని పెంచి పోషించే mainstream సాహిత్యం నుండి వేరుపడతాడు మౌళి.

మౌళి కవిత్వం ఏకంతాన్ని ప్రతిఘటిస్తుంది. పెట్టుబడీదారివ్యవస్థ ప్రజలందరినీ తమతమ ఏకాంతాలలో బంధించి individualisation అనే పేరుతో  సమాజాన్ని విడగొట్టి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్న తరుణంలో మౌళీ కవిత్వం deindividualise అవ్వమని, గుంపులు గుంపులుగా రోడ్డుపైకొచ్చి ప్రశ్నల వర్షం కురిపించమని పిలుపునిస్తుంది.

మరి మౌళీకి ఏకాంతం లేదా?

ఉండకనేం!

ఏ కవికైనా తన అంతరాంతరాల్లో కూరుకుపోయిన భావోద్వేగాలు, భావాలు, తన జ్ఞానం, తన అస్తిత్వం అన్ని కలగలిసిన  ఏకాంతంలో నుండే కవిత పుట్టుకొస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజంలోని చలనాలను, మార్పులను, దోపిడీని, అణచివేతనూ ప్రత్యక్షంగా ఎదుర్కుంటాడో అప్పుడు కవి ఏకాంతం కూడా political అవుతుంది.

సమాజంలోని మార్పులతో, అదృశ్య అణచివేతలతో ,  కుల వర్గ దోపిడీలతో ఎంతో మమేకమవ్వటం చేతనే మౌళీ ఏకాంతం కూడా ఓ political రూపం దాల్చింది అనుకుంటాను. తన ఏకాంతానికి కూడా proletariate అస్థిత్వం సంతరించింది. అందుకే మౌళీ ఏకాంతం ఆధిపత్య బూర్జువా భావజాలాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.

6

శివారెడ్డి గారు 1990 లో ‘అజేయం’ అనే కవితా సంకలనంలో ‘కవులేంజేస్తారు!’ అనే కవితలో ఇలా అంటారు-

“కవులేం జేస్తారు

ప్రభుత్వాన్ని ధిక్కరిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

తెల్ల కాయితానికి అనంతశక్తినిస్తారు

కవులేం జేస్తారు

చేతుల్లో కింత మట్టి తీసుకొని శపిస్తారు

మణికట్టు దాకా నరికినా

మొండిచేతుల్తో గోడల మీద పద్యాలు రాస్తారు,

..

కవులేం జేస్తారు

చట్టాన్ని ధిక్కరిస్తారు,

ఎడారి మీద పద్యాలు రాస్తారు

ఎడారి క్రమక్రమంగా

సజీవ దేశంగా రూపొందుతుంది

కవులేం జేస్తారు

గోడలకు నోరిస్తారు

చెట్లకు కళ్ళిస్తారు, గాలికి గొంతిస్తారు

ప్రజలకు చేతులిస్తారు

ప్రజల చేతుల్లో

అనంతశక్తి సంపన్నమయిన పద్యాన్ని పెడతారు.”

తెలుగులో ఈ మధ్య రాస్తున్న మిగిలిన కవుల గురించి నాకు తెలియదు కాని- మౌళీ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కవే!

*

mouli1

మీ మాటలు

 1. Kcube Varma says:

  అద్భుతమైన విశ్లేషణ పరిచయం కవికి దగ్గరగా.. ఇరువురికీ అభినందనలు…

 2. బాగుంది, మంచి విశ్లేషణ

 3. విలాసాగరం రవీందర్ says:

  విశ్లేషణ బాగుంది. కవిత్వ పుస్తకం చదవాలనే కోరికను కదిలించింది. మౌళి గారికి శుభాకాంక్షలు.

 4. Aranya Krishna says:

  బాగుంది రో! ఆసక్తికరమైన విశ్లేషణ.

 5. Bollojubaba says:

  Great intro sir

 6. vijaychandra says:

  కవిత్వం చదివేక వ్యాఖ్యానిస్తా, కానీ నీ ఉటకింపులు నాకు నచ్చాయి రోహిత్, ఆ కవుల వాక్యాలు ,చివరిలో శివారెడ్డి గారి కవిత మరోసారి నాకు కన్నీళ్ళు తెప్పించాయి.. ఈ మధ్య ఏమి రాసినా, ఏమి చదివినా కంటి వెంబడి అశ్రువులే వస్తున్నాయి, ఎందుకో తెలియదు.
  ఏ దేశంలోనైనా కవి జీవితం సార్వజనీకం, కవి బాహిర్ ప్రపంచం నుంచి తప్పించుకోలేడు. ఆంతరంగికం ఎల్లప్పుడూ కదిలే నీటిలా ప్రకంపిస్తూ ఉంటుంది. ఆ ప్రకంపనలే కవిత్వం. మిత్రుడు బాల సుధాకర మౌళికి నా శుభాకాంక్షలు, ప్రేమతో సెలవు ఓ అనంతపురం మిత్రుడా.

  .

 7. D. Subrahmanyam says:

  అద్భుతమయిన విశ్లేషణ రోహిత్ గారూ. మౌళి గారి కవిత సంకలన్నీ చాల బాగా పరిచయం చేసారు. ఇద్దరికీ అభినందనలు. ముఖ్యంగా ” ఏ కవికైనా తన అంతరాంతరాల్లో కూరుకుపోయిన భావోద్వేగాలు, భావాలు, తన జ్ఞానం, తన అస్తిత్వం అన్ని కలగలిసిన ఏకాంతంలో నుండే కవిత పుట్టుకొస్తుంది. కానీ ఎప్పుడైతే సమాజంలోని చలనాలను, మార్పులను, దోపిడీని, అణచివేతనూ ప్రత్యక్షంగా ఎదుర్కుంటాడో అప్పుడు కవి ఏకాంతం కూడా political అవుతుంది.

  సమాజంలోని మార్పులతో, అదృశ్య అణచివేతలతో , కుల వర్గ దోపిడీలతో ఎంతో మమేకమవ్వటం చేతనే మౌళీ ఏకాంతం కూడా ఓ political రూపం దాల్చింది అనుకుంటాను. తన ఏకాంతానికి కూడా proletariate అస్థిత్వం సంతరించింది. అందుకే మౌళీ ఏకాంతం ఆధిపత్య బూర్జువా భావజాలాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది.” మంచి మాట

 8. కట్టా శ్రీనివాస్ says:

  మౌళికి నటించటం రాదు. తానేం చూస్తాడో అదే రాస్తాడు.
  రోహిత్ కూ హిపోక్రసీ తెలియదు తనకెలా అనిపించిందో అదే చెప్తాడు.
  మంచి కవిత్వానికి మనస్పూర్తి మాటలు చాలా బావున్నాయి.
  మౌళీని ఎన్నిసార్లు చదివినా తను కొత్తగానే కనిపిస్తుంటాడు.
  ఇద్దరికీ అభినందనలు.

 9. PARESH DOSHI says:

  ప్రాథమికంగా రోహిత్ వొక ఆంగ్ల కవి గా తెలుసు. ఇదివరకొకసారి అతని తెలుగు చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మళ్ళీ.
  మౌళీ కవిత్వం గురించి అది చదివిన తర్వాత.
  కోళ్ళు-సజ్జలు గుర్తుకుతెచ్చే చాలా మంది రాతలతో విసిగిపోయిన నాలాంటివారికి రోహిత్లో వొక చిత్రమైన alchemy కనిపిస్తుంది. చదివినదంతా సారవంతమైన నేల నుంచి పచ్చగా అంకురించే విత్తనాన్ని తలపుకు తెచ్చే కొత్త దృష్టిని ఇస్తుంది. ఈ అబ్బాయి తెలుగులో ఇంకా వ్రాస్తూ వుండాలని చట్టం!
  మౌళీ పుస్తకం గురించి నిరీక్షణ.

 10. బాగుంది, రోహిత్.
  మౌళికి ఆల్ ది బెస్ట్

 11. mitruda,mee visleshana bagavundi. individualization kadu, kavi yakkada vunna prajasmuhala smasyale kavita vastuvuga chesukovali. chandramavuli garu goppakavi. Abinandanalu.

 12. Raghavender says:

  ఈ కవిత్వం తప్పక చదవాలనే అనిపించింది. మీ విశ్లేషణ నిజంగానే బావుంది.

 13. కె.కె. రామయ్య says:

  సమాజంలోని మార్పులతో, అదృశ్య అణచివేతలతో , కుల వర్గ దోపిడీలతో ఎంతో మమేకమవ్వటం తో మౌళీ రాసిన కవితాసంపుటి “ఆకు కదలని చోట” ను అద్భుతంగా విశ్లేషించిన రోహిత్ కు అభినందనలు. ఇప్పుడు మౌళీ పుస్తకం కోసం నిరీక్షణ.

  ” ప్రాథమికంగా రోహిత్ వొక ఆంగ్ల కవి గా” మీకు తెలిసిన రోహిత్ ను మాకూ పరిచయం చెయ్యరా పరేష్ దోషీ గారు.

 14. మౌళి పద్యాలూ వినిపించాల్చింది. వట్టి వచనానికే పరిమితం కావడం లోటె. – రివెరా

 15. ప్రారంభాన్ని అద్భుతంగా ఆరంభించావు రోహిత్.కవి ఏకాంతం ఎట్లా సామూహికం అవుతుందో అది ఎందుకు political గా అవుతుందో అసలు poetry of witness అంటే ఏంటో వివరంగా చెప్పావు.అభినందనలు నీకు

 16. చాలా బాగా రాశావు రో.
  మౌళి కవిత్వం చదివిన ఎంతోసేపటి దాకా, ఒక్కోసారి ఎప్పటికీ, వెంటాడుతుంది. Cant wait to read the book.

మీ మాటలు

*