బొజ్జ తారకం ఎవరు?!

tarakam1
బొజ్జా తారకంగారితో నాకు గల పరిచయాన్ని మీతో పంచుకోవాలనిపిస్తోంది.
2004 డిసెంబర్ లో నేను జపాన్ నుంచి భారత దేశానికి తిరిగివచ్చినప్పుడు కొద్దికాలం హైదరాబాద్ లో టూరిజం డైరెక్టర్ గా ఉన్నాను. ఆ సమయంలో కొన్ని దళిత సమావేశాలలో బొజ్జ తారకంగారిని కలిసేవాడిని.  ఆయన సంపాదకీయంలో వెలువడే ‘నీలి జెండా’ పత్రికను తెప్పించుని  దళితుల సమస్యలమీద రాస్తున్న వ్యాసాలను చదివి అర్దం చేసుకునేవాణ్ణి.  గనుముల జ్ఞానేశ్వర్ గారు కనబడినప్పుడు బొజ్జ తారకంగారి గురించిన వార్తలు చెప్పేవారు. అప్పుడు నేను కొత్తగా దళిత కవిత్వం రాయడం మొదలు పెట్టాను. కవితలు ఆంధ్ర జ్యోతిలో ప్రచురింపబడ్డప్పుడు తారకంగారు తప్పకుండా ఏదో విధంగా చదివేవారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కనబడినప్పుడు నా కవిత్వం గురించి  ప్రస్తావించి మరిన్ని దళిత సమస్యలమీద రాయాలని ఉద్భోధించేవారు. ‘పోరాడాలి. లేకపోతే  అన్యాయం జయిస్తుంది ‘ అని తరుచుగా అనేవారు.
ఏ విషయాల మీద రాయాలి, ఏ విషయాల మీద పోరాటం చెయ్యాలి అని మార్గదర్శకత్వం చేసేవారు. “బొజ్జ తారకం గారిని ఎలా చూడాలి”  అనే సందేహం నన్ను వెంఠాడేది. ఒక కవిగా, రచయితగానే కాదు, సామాజిక, దళిత న్యాయవాదిగా, పౌరహక్కుల కార్యకర్తగా అన్ని రూపాల్లో నాకు కనబడేవారు. సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఎన్ని పాత్రలు నిర్వహించాలో అన్ని పాత్రలనూ ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.  అందుకేనేమో ఈరోజు అన్ని వర్గాలవారు తారకంగారిని తమవాడిగా చెప్పుకుంటున్నారు. పౌరహక్కులకోసం ఇంతగా పోరాడిన నాయకుడు నాకు ఇంతవరకూ తారసపదలేదు. దళిత కులం నుంచి వచ్చిన తారకంగారు పౌరహక్కుల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. అనేక  బూటకపు పోలీసు ఎన్కౌంటర్లలో పాల్గొన్న అధికారులకు వ్యతిరేకంగా తారకంగారు సుప్రీం కోర్ట్ లో కేసు దాఖలు చేసి కేసు గెలిచారు . 2004లో  డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు  ముస్లింలకు  రిజర్వేషన్లు ఇవ్వాలన్న కేసును తారకంగారు వాదించారు.  కారంచేడు దళితులపై జరిగిన హింసకు  నిరసనగా  తారకంగారు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక ప్రాసిక్యూటర్ పదవికి  1984 లో రాజీనామా చేశారు.
టోలీ చౌక్ లో ఉన్న ఆయన ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళాను. అంబేద్కర్ గారు రాసిన రాసిన పుస్తకాలను తెలుగులోకి  ఆనువదించిన ఆయన సతీమణి విజయభారతిగారు కాఫీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేసేవారు. 2007 లో నా మొదటి కవితా సంకలనం ‘దళిత వ్యాకరణం ‘ ఆవిష్కరణకు మొత్తం కార్యక్రమాన్ని తన బుజాలమీదకు ఎత్తుకున్న కవి శిఖామణిగారు  బొజ్జ తారకంగారిని  నా తరపున ఆహ్వానించారు. నా కవిత్వం చదివి మురిసిపోయి నన్ను తుల్లిమల్లి కాదు, ‘తుళ్ళీతుళ్ళిపడే విల్సన్ సుధాకర్’ అని తారకంగారు చమత్కరించారు. గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్ బుక్ఫెస్టివల్ కు సామాన్యగారి పుస్తకం ఆవిష్కరణకు బొజ్జ తారకంగారిని ఆమె ఆహ్వానించారు.  ఆమె తరపున నేను తారకంగారింటికి వెళ్ళీ ఆయనను, విజయభారతిగారిని కారులో ఎగ్జిబిషన్కు తీసుకువచ్చాను. ఆ సందర్భంగా ఆయనతో దళిత సోదరులమంతా ఫోటోలు దిగాము.
 tarakam2
దళిత వాణిగా పేరొందిన బొజ్జా తారకం గారి మరణ వార్త విని ‘ పౌర హక్కులకు  ఆసరాగా నిలబడ్డ చివరి బురుజు కూలిపోయింది ‘ అన్నారు ఆంధ్ర జ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ గారు.  ‘బొజ్జ తారకం ఎవరు’ అనే ప్రశ్న నేటి తరానికి  కలగొచ్చు.  ఒక్క మాటలో తారకం గారిని నిర్వచించలేము.  దళిత, పౌరహక్కుల, సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా,  ఆంధ్రలో రిపబ్లికన్ పార్టీ , దళిత మహాసభ సంస్థాపకుడిగా తారకంగారు ఎంతో సేవ చేశారు.  దళితుల మీద అగ్ర వర్ణాలు జరుఫుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆయన నిరంతర పోరాటం చేసారు.  సెంట్రల్ ఊనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యోదంతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి దేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించగలిగారు. మేజిస్ట్రేట్, హైకోర్ట్ , సుప్రీం కోర్ట్లలో దళితులు, మైనారిటీలు, కొండజాతులవారికి న్యాయ సహాయం అందించారు. అనారోగ్యం పాలయినా సరే  RPI ద్వారా అంబేద్కర్ ఆశయాలను యువతలో ప్రచార చేసేలాచివరివరకూ క్రుషి చేశారు.  జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశేష అధికారాలతో పోలీసు యంత్రాంగం చెలరేగిపోయి నక్సలైట్ ముద్రలు వేసి యువతను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ‘ పోలీసులు  అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకాన్ని రచించి పౌరహక్కుల కోసం క్రుషి చేశారు. ఈ పుస్తకం Jane Maxwell రచించిన Where There Is No Doctor అనే పుస్తకం పొందినంత ప్రచారం పొందింది.
1992 లో చుండూర్ లో దళితులపై అగ్రవర్ణాలు జరిపిన మారణ కాండపై తారకం గారు జరిపిన న్యాయపోరాటం ఎంతో ప్రసిద్ధమయ్యింది. మా ఇద్దరి మధ్య కొన్నిసార్లు చుండూరు కేసు ప్రస్థావనకు వచ్చేది. ఏకపక్షంగా కొందరు న్యాయమూర్తులు ఎలా వ్యవహరిస్తున్నదీ, చివరకు వారి మనసులో ఏమున్నదీ తారకం గారు నాకు చెప్పేవారు. ఒకానొక దశలో తారకంగారిమీద కోర్టు ధిక్కార నేరాన్నిమోపుతానని ఒక న్యాయమూర్తి బెదిరించారనీ, మీరు ఏమిచేసుకుంటారో చేసుకోండని  అన్నాననీ తారకం గారు చెప్పి వారి పక్షపాత ధోరణి పట్ల విచారం వ్యక్తం చేసేవారు.
చుండూరు ఊచకోత కేసులో  తారకంగారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. దళిత కెమెరా తో ఒక ముఖాముఖిలో మాట్లాదుతూ ” చుండూరు కేసులో ఇచ్చిన తీర్పు తర్కవిరుద్ధమయినది, పక్షపాతంతో కూడినది  అని  చీత్కరించారు. హైకోర్టు చేసిన వాదన నేర న్యాయశాస్త్రం మీమాంసకు, రుజువులున్న సాక్ష్యాలకు, అన్ని నియమాలకు విరుద్ధంగా ఉంది.  తొలి తీర్పు ఇచ్చిన  ట్రయల్ కోర్టు మొత్తం సాక్ష్యాల్నిచర్చించించి తిరుగులేని ఒక నిర్ధారణకు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు  అన్ని నిబంధనలను గాలికి వదిలి, నేర న్యాయ శాస్త్ర మీమాంసను తెలియక,  అశాస్త్రీయతార్కికంతో  అన్ని ఆరోపణలున్న దోషులను నిర్దోషులుగా విడుదల చేసింది” అని అభిప్రాయపడ్డారు.
tarakam3
హైకోర్టు  వాదన ప్రకారం- కారణాలలో ఒకటి ఏమిటంటే  ” ప్రాసిక్యూషన్ ‘సంఘటన సమయాలను రుజువుచెయ్యడంలో విఫలమైంది, ఏ సమయంలో బాధితులకు  గాయాలు ఏ తగిలాయో చెప్పలేదు.”  కేవలం భౌతికమైన వైరుధ్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మేము న్యాయమూర్తులకు చెప్పామని” తారకంగారు అన్నారు. కానీ నేరపూరిత న్యాయ మీమాంసకు, విధానాలకు సంబంధం లేకుండా, చట్టం, సాక్ష్యం ప్రసక్తి లేకుండా హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఎటువంటి వాదనలకోసం ఎదురు చూడకుండా దోషులను వదిలివెయ్యాలని హైకోర్ట్ నిర్ణయించిందని మాకు అర్దమయ్యింది అని తారకం గారు నాడు వ్యాఖ్యానించారు. చివరకు వారు కొరినట్లే జరిగింది అని ఆయన అన్నారు.
తారకంగారు తెలుగు రాష్ట్రాలలోని  అట్టడుగు వర్గాలకు  ఆయన ఒక గొప్ప వాగ్దానం. దళితులు మీద దుర్మార్గపు చర్యలపై నిత్రంతరం పోరాటం జరిపిన వ్యక్తి. ఒక గొప్ప నాయకుడు, కవి, వక్త , కార్యకర్త. ఒక గొప్ప రచయిత విజయ భారతి జీవిత భాగస్వామి. తమ మీద అత్యాచారాలు జరిపిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలని కోరిన ఏకైక వ్యక్తి. ఆయన మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.
*

మీ మాటలు

  1. “ఆయన మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.”

    • sabir hussain says:

      అయన నుంచి ఇలాంటివి ఆశించడం వృధా. మన ముఖ్యమంత్రి కూడా మతోన్మాద సర్కారులో భాగమే కదా. తారకం గారి గురించే కాకుండా గుజరాతులో ఔచర్మాల విషయంలో దళితులపై జరిగిన దాడిని కూడా మన సి ఎం ఖండించలేదు. యు పీ లో అఖ్లాక్ హత్యను కూడా అయన నిరసించలేదు. తీ డీ పీ కూడా బీ జీ పీ తానులో ముక్కే.

  2. కె.కె. రామయ్య says:

    ” నిశబ్దం రాజ్యమేలుతుంటే చూస్తు ఊరుకోవద్దు … మేధావి మౌనం ఈ సమాజానికి చాలా ప్రమాదం… ” అన్న పౌర హక్కుల నేత, విరసం సభ్యుడు, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత ( పదిరికుప్పం, కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట దళితుల ఊచకోత ఘటనలలో, నక్సలైట్ల బూటకపు ఎన్ కౌంటర్ లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ) హక్కుల ఉద్యమాలకు కేంద్రబిందువు గా మార్క్సిజం, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడు ….
    బొజ్జా తారకం గారి మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.

    ( ఎమర్జెన్సీలో బొజ్జా తారకం గారు రాసిన ” పోలీసులు అరెస్టు చేస్తే ” పుస్తకం ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు 40 వేల కాపీలను తగలబెట్టారు. )

  3. పేదల పెన్నిధి –చుక్కాని –నాయకుడు
    Burugu కూలిపోయింది –Srinvas గారి మాటలు నిజం
    పౌర హక్కుల కోసం పోరాడిన కే.జి కన్నబిరామం గారిని –బాలగోపాల్. గారిని
    మరిచి పోకూడదు
    70 ఏళ్ళ స్వతంత్రం –యిప్పటికి. దొరల. పాలన లే
    మారింది ఎక్కడ — ఏమిటి
    విప్లవం రావాలి
    మల్లి. కన్నాబి గారు –గోపాల్ గారు — తారక్. గారు పుట్టాలి
    ఆశ తో
    —————————
    Buchi రెడ్డి. Gangula

  4. తమపై అత్యాచారాలు చేసే వారిపాయి ప్రతీకారం తిరుచుకోవాలీ
    అది ఆచరణలో పెట్టితే నే
    తారకం నిజమైన నివాళి
    i

  5. sabir hussain says:

    బొజ్జ తారకం గారి మృతి దళితులకు,మైనారిటీలకు, బీసీఏలకు తీరని లోటు. కేంద్రంలో ,రాష్ట్రంలో మతోన్మాద ప్రభుత్వాలు గద్దెనెక్కిన తరుణంలో దళితులు,మైనార్టీలు సంక్షోభంలో వున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తారకం గారు కన్నుమూయడం చాలా బాధాకరం. ఈ వర్గాలు ఐక్యమై పోరాటాలతో హక్కుల సాధనకోసం నిలవడం ఒక్కటే తారకం గారికి నివాళి అవుద్ది,

  6. కె.కె. రామయ్య says:

    ” బొజ్జ తారకం మృతికి విరసం నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్, రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు జీవన్‌కుమార్, నటుడు ఆర్ నారాయణమూర్తి, గాయకుడు గోరటి వెంకన్న, మల్లు స్వరాజ్యం, ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, చుక్కా రామయ్య, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్, సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు ప్రజాసంఘాల నాయకులు తదితరులు నివాళులర్పించారు “.

Leave a Reply to Reddy Cancel reply

*