అన్నదాత మరణమృదంగ వాయుధ్వని!

1973-2 మనలో ఎంతమందిమి అన్నం తినేటప్పుడు రైతు గురించి ఆలోచిస్తాం? అసలీ వ్యవసాయక దేశంలో ఇంతవరకు ఏ రైతుకూ ఎందుకని భారతరత్న అవార్డు రాలేదు?” ఇవి నటరాజ్ మహర్షి వేసిన ప్రశ్నలు, తనకు తానే వేసుకున్న ప్రశ్నలు. అతనికి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. బహుశ వాటికి జవాబులు దొరక్కపోవచ్చు. కానీ రైతుకి తన రుణం మాత్రం తీర్చుకోవాలనుకున్నాడాయన. ఫలితమే “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” అనే లఘు చిత్రాన్ని నిర్మించారు.

నిజానికి నటరాజ్ కి ఇది మొదటి సినిమా కాదు. ఈ సినిమా కి ముందుగా ఓ ఫిలిం మేకర్ గా ఆయన చేసిన ప్రయాణం వుంది. “న్యూయార్క్ ఫిలిం అకాడెమీ” అనుబంధంతో కాలికట్ లో జరిగిన వర్క్ షాప్ లో శిక్షణ పొందిన నటరాజ్ అక్కడ మెథడ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తరువాత నవ్య యుగపు నవీన భావాల దర్శకులందర్నీ కలుసుకున్నానని చెప్పారు. ఆ తరువాత ముంబైలో సెటిల్ ఐన నటరాజ్ 2014 లో “డ్రాయింగ్ బ్లడ్” అనే ఇంగ్లీష్ సినిమా తీసారు. అది ఒక పెయింటర్ కథ. ఆ తరువాత కెరీర్లో ఎదగటం కోసం తనని తాను కోల్పోయిన ఒక గజల్ గాయని మీద “మేరా ఆలాప్” అనే హిందీ లఘు చిత్రం 2015లో తీసారు. తన అన్ని సినిమాలకీ తనే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, తనే స్క్రిప్ట్ రైటర్, తనే దర్శకుడు. ప్రతి షాట్ ని ఎంతో శ్రద్ధగా చిత్రిస్తారు ఆయన. లైటింగ్, కెమెరా యాంగిల్స్ వంటి అన్ని విషయాల్లో మంచి క్రాఫ్ట్స్ మెన్ షిప్ కనబరుస్తారు. ప్రేక్షకుడి మూడ్ ని ఎలవేట్ చేసే నేపధ్య సంగీతం గురించి, ఎడిటింగ్ గురించి శ్రద్ధ తీసుకుంటారు. నేను ఆయనతో మాట్లాడిన మేరకు ఆయనలో ప్యూరిటానిక్ కళాకారుడు ఉన్నాడు. ఇది ఆయన మొదటి ఫీచర్ సినిమా “డ్రాయింగ్ బ్లడ్” లో కనిపిస్తుంది. జీవిత పరమార్ధం ఆధ్యాత్మిక దృక్పధంలో దొరుకుతుందనే ఆలోచన ఆయనలో వుంది. ఇది ఆయన షార్ట్ ఫిలిం “మేరా ఆలాప్” లొ స్పష్ఠంగా కనబడుతుంది. ఆయన ప్రస్తుతం “ద స్కల్ప్టర్” అనే డాక్యుమెంటరీ నిర్మాణంలో వున్నారు. ఇది కాకుండా “అనోనా” అనే ఫీచర్ ఫిలిం కూడా తీస్తున్నారు. శరవేగంతో షూటింగ్ తీసినా దాని ముందు, తరువాత చాలా పని చేస్తానంటారు నటరాజ్.

“1973” సినిమాలో నటరాజ్ ఏ చెప్పారు? వర్తమాన రైతు సమస్యల మీద, రైతుల ఆత్మహత్యల మీద తీసిన సినిమా కాదిది. తనకేమైన కష్టం వస్తే ఎవరికీ పట్టని రైతు ఒంటరితనం గురించి, నిస్సహాయత గురించి, ఎవరికీ వినిపించని రైతు ఆర్తనాదం గురించి, దుఖం గురించి, అభద్రత గురించి, నిన్నటి దాకా పంటకి నీరు పెట్టిన రైతు హఠత్తుగా కనిపించక పోతే పట్టించుకోని సమాజ నిర్లక్ష్యం గురించి నటరాజ్ చెప్పారు. నీరందని పంటలాగా ఎండిపోతున్న రైతు గురించి చెప్పారు. రైతు భూమిలో వనరుల మీద కన్నేసి అతని భూమిని దక్కించుకోవాలన్న పొలిటీషియన్ స్వార్ధం గురించి, క్రూరత్వం గురించి చెప్పారు. ఎవరూ చెప్పని ఓ రైతు గురించి చెప్పారు. నిస్సహాయంగా గాలిలో కలిసిన అతని ఆక్రందనని మనకు వినిపించారు. అసలు భవిష్యత్తులో రైతనే వాడుండని హెచ్చరించారు.

నిజానికి నటరాజ్ ఏమీ చెప్పలేదు. కేవలం చూపారు. చాలా చూపించారు. దేశం మీద ప్రేమతో జెండా కింద సేద్యం చేసిన రైతు నిబద్ధత గురించి చూపించారు. ఆ రైతు వెక్కిళ్ళు మన దోసిలిలో పోసి చూపించారు. “దాహం వేస్తుంది. నీ భూమిని ఇస్తావా?” అనే రాజకీయ నాయకుడి స్వార్ధం చూపించారు. పెద్దగా డైలాగులు లేని ఓ ఇరవై నిమిషాల లఘు చిత్రంలో ప్రేక్షకుడి మనసుని కదిలించే విధంగా ఆయన ఇవన్నీ చూపించారు. జెండాని సంక్షేమ రాజ్యానికి చిహ్నంగా చూపించి బలవంతుడి దౌష్ట్యం ముందు రాజ్యాంగం పూచీపడే సంక్షేమం ఎంత బలహీనమో చూపించారు. రైతుని కొట్టడానికి జెండా కర్రని వాడుకున్న మంత్రి చివర్లో జెండా విశిష్ఠతని గురించి రేడియోలో ఉపన్యసిస్తాడు. ప్రతీకలు కలిగించే మిధ్యావేశంలో మనం బతికేస్తుంటాం కదా!

1973-3

1973లో ఖమ్మం జిల్లాలో ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టిన నటరాజ్ కి ఆయన తండ్రి అదే సంవత్సరంలో తన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతుకి జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పారు. ఎవరికీ తెలియకుండా చరిత్ర కాలగర్భం లో కలిసిపోయిన ఆ రైతు కథ ఇప్పుడు నటరాజ్ చేతిలో ఓ సినిమాగా ప్రాణం పోసుకుంది.

“వాయుధ్వని ప్రొడక్షన్స్” సమర్పణలో నటరాజ్ మహర్షి తానే స్వయంగా రాసి, తీసిన “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” ఇప్పటికి 5 అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎంపికైంది. ఆల్ లైట్స్, బెంగళూరు, రుమేనియా, మన్ హట్టన్ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ లో ఈ సినిమా ఎంపికైంది. ఇది ఓ తెలంగాణ యువకుడు సాధించిన ఘనత.

ఈ సెప్టెంబర్ 24 నుండి 27 వరకు రామోజీ ఫిలిం సిటిలో జరగబోయే “ఆల్ లైట్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్”లో ఈ సినిమాని ప్రదర్శించబోతున్నారు. “షార్ట్ ఫిలిం కార్నర్”లో తెలుగు నుండి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన రెండు సినిమాల్లో ఇదొకటి. కెవీఅర్ మహేంద్ర తీసిన “నిశీధి”మరొకటి. ఇది తెలంగాణ చిన్న సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ విజయం. మొన్నీమధ్యనే 1973 కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని విడుదల చేసారు. ఈ సినిమా చూసి నగ్నముని గారు స్పందించిన వీడియో కూడా యూట్యూబ్ లో లభ్యమౌతుంది.

స్లాప్ స్టిక్ కామెడీ తోనో, చీప్ డైలాగులతోనో నాసిరకపు సాంకేతిక, సంగీత నాణ్యతా విలువలతో కనబడతాయి తెలుగులో షార్ట్ ఫిలింస్ యూ ట్యూబులో. వాటికి భిన్నంగా మంచి అభిరుచితో, బాధ్యతతో సినిమాలు తీసే వృత్తిరీత్యా ఫాషన్ ఫోటోగ్రాఫర్ ఐన నటరాజ్ మహర్షి వంటి ఫిలిం మేకర్స్ ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీదుంది. మనం ప్రోత్సహించాలే కానీ ఆయన దగ్గర చాలా మెటీరియల్ వుంది. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్!
Official Trailer – 1973 An Untold Story (2016) Short Film

 

మీ మాటలు

 1. KVR MAHENDRA says:

  Good article about good film…

  • Aranya Krishna says:

   ధన్యవాదాలు మహెంద్ర గారూ! మీ సినిమాని కూడా చూసే అవకాశం దొరికితే బాగుండు.

 2. Krishnagaru, thank you for introducing the famous, and real director and his movies based on real stories. I will watch.all his movies if they are available in you tube.
  One question each and everyone has to ask ” in this agricultural country why untill now not even a single farmer awarded Bharatha Rathna”.Thought provoking question.Why. …why….why…..who will give answer ?. Thank you krishnagaru

 3. buchi reddy gangula says:

  excellent .article

  ఒక సారి బాబు గారు వ్యవసాయం వేస్ట్ అంటూ ఉపన్యాసామ్ చేయడం –ఓడిపోవడం
  చూసాం —వ్యవసాయం గురించి ఏమి తెలియని వారు వ్యవసాయ మంత్రులు –దేశం లో
  రాష్ట్రాల లో —

  బుచ్చి రెడ్డి గంగుల

 4. D. Subrahmanyam says:

  అభ్యుదయం పేరుతో రాతుని పూర్తిగా మరిచిపోవడమే కాదు అస్సలంటే అస్సలు పట్టించుకోవటం లేదు. మన రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ అబ్ హ్యూదయానికి స్థలం పేరిట మంచి పంటనిచ్చే భూమిని స్వాహా చేసి భూముల వ్యాపారం చేసే వారికీ తిని పిస్తిన్ను ప్రభుత్వాలను అడిగే నాధుడే లేకపోవడం మన దౌర్భాగ్యం. ప్రజలకోసం, సమాజ మార్పుకోసం, గిరిజనులకు, రైతుల భాదల గురించే మేము రాస్తున్నాం అందుకే మేము జీవిస్తున్నాం అన్న రచయితల తెచ్చిపెట్టుకున్న ఆర్భాటమే కానీ నిజాయితీ లేని సాహిత్య సమాజంలో బతుకుతున్నందుకు బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత. మంచి వివరం ఇచ్చినందుకు సారంగ లో రాసె రచయతలు ఇప్పటికైనా మేల్కొనగాలరా?!!

  • D. Subrahmanyam says:

   తప్పులను సరి చేసి నావ్యాఖ్య ఇది. అభ్యుదయం పేరుతో రైతును పూర్తిగా మరచిపోవడమే కాదు అస్సలంటే అస్సలు పట్టించుకోవటం లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభ్యుదయం పేరిట మంచి పంటనిచ్చే భూమిని స్వాహా చేసి భూ వ్యాపారం చేస్తున్న మోసగాళ్లకు తినిపిస్తున్న ప్రభుత్వాలను అడిగే నాధుడే లేకపోవడం మన ప్రజల, ముఖ్యముగా రైతుల దౌర్భాగ్యం.ప్రజలకోసం , సమాజ మార్పుకోసం, గిరిజనుల బాగు కోసం, రైతుల బాధలగురించే మేము రాస్తున్నాం అందుకే మేము జీవిస్తున్నాం అన్న రచయితల ఆర్భాటమే కానీ చాలావరకూ నిజాయితీ లేని తెలుగు సాహిత్య సమాజంలో బతుకుతున్నందుకు బాధపడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత . ఇంత మంచి వ్యాసాన్ని సారంగలో చదివాకనయినా ఇక్కడ రాసె రచయితల్లో మార్పొస్తుందని ఆశిస్తాను .

 5. కర్ణాకర్ says:

  ఈ ధరత్రికే దాత
  సమస్త జనవాహినికే అన్నధాత
  కాలేకడుపుని
  కష్టాలకన్నీటి కడలిఅలలని
  కడదాకా పంటిబిగువున భరిస్తూనే
  వ్వవస్తకే వెన్నెముకై
  తనవెన్నెముకలో ఒక్కోకీలు అరిగి తనువు సొడసిపోతున్నా
  జీవితకాలంలో సెలవనేదేలెని చేనూసెలకపనుల్లో
  తన రక్తబింగువులనే స్వేదచినుకులై పుడమిపై చిందిస్తూ
  శాశ్వతసెలవుతీసుకునేదాక అలుపెరగని నిజమైన ఆత్మీయుడవీ ఈ స్వార్దసమాజంచేతిలో బలైనాకూడా
  బువ్వపెట్టే బుద్దీప్రదాతవీ మాకు అన్నదాతవి

  ———————– సదా తోటి రైతుగా నేను

 6. నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు తెలియజేసారు ! ఇప్పుడిక రైతుని మరచిపోవడం అసాధ్యం.ప్రతి అన్నం మెతుకు లోనూ ఆయన దర్శన మిస్తాడు .నటరాజ్ మహర్షి గారికి మీకూ ధన్యవాదాలు

 7. దేవరకొండ says:

  రైతుల ఆత్మహత్యల్లో దేశానికే అగ్రగామి అనిపించిన నవ/బంగారు తెలంగాణా నుండే ఇలాంటి బంగారు దర్శక మేధావి రావడం యాదృచ్చికం కాదు. బహుశ: ప్రకృతి నియమం కావచ్చు . అన్నదాత రైతన్నకు, అతన్ని గుండెల్లో దాచుకునే సంస్కారమున్న అల్పసంఖ్య మేధావులకూ ఈ అందరినీ మనకు చూపి అక్షరాస్య ప్రపంచాన్ని జాగృతం చేస్తున్న సారంగకూ జేజేలు!

 8. Prof P C Narasimha Reddy PhD says:

  Short films of 15 -20 mnts duration may be made. They can be creative and thought provoking without any padding or dragging which we find often in “art” films and off course in documentaries !!!
  – Prof P C Narasimha Reddy

 9. hari venkat says:

  “వాయుధ్వని ప్రొడక్షన్స్” సమర్పణలో నటరాజ్ మహర్షి తానే స్వయంగా రాసి, తీసిన “1973 – యాన్ అన్ టోల్డ్ స్టోరీ” …కి విషెస్

మీ మాటలు

*