యానాంలో ఒక వేమన…

memory

రోహిణి కార్తె.

ఎండ పేట్రేగి పోతుంది.

పెద్ద గోళెంలో బెల్లం తయారయేటపుడు ఉడుకుతూ పొంగుతున్నట్లు..అలల గతులు!
చెరకు రసం కోకోకోలా ఉత్తుత్తినే గొంతులు తడుపుతున్నాయి. క్షణ తర్వాత మామూలే. తలలు చురుక్కుమంటున్నాయి.
చెమటతో శరీరం తడిసి ముద్దవుతోంది. ఆహా …ఏమి ఎండరా బాబూ…మలమలా మాడ్చేస్తోంది.

అట్లాంటి సమయంలో తీరని దాహంతో ….అలమటిస్తున్న కవులేం చేస్తారు. ? సేద తీరే మార్గాలు వెతుక్కుంటారు. చల్లబడే దిక్కుల కోసం కలియ దిరుగుతారు. నీడల చుట్టూ అల్లుకుపోతారు. కవి సందర్భాలకోసం వెంపర్లాడతారు. ఊహాలోకంలో సేదతీరుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. అక్షర జ్ఞానులు….రాబోవు తరం దూతలు. ఇరవై ఏళ్లనాటి జ్ఞాపకాన్ని దృశ్యమానం చేయడం ఇది. వారంతా పదిమంది కవులు శివారెడ్డితో కలిపి. లుంగీ తలపాగాగా చుట్టి…బండి వాడిని పక్కన కూచోబెట్టుకుని. అదొక పసందైన ముచ్చట. కవుల బండి గోదావరి కేసి పరుగులు తీసింది.

మిట్టమధ్యాహ్నం….యానాం ఫెర్రీ రోడ్డు. సందడి లేదు. నిర్మానుష్యం. చిటపటలాడుతున్న ఎండ. వేళకాని వేళ. ఈ సమయంలో జలవిహారం కోరిక కడువిడ్డూరం. అల్లదివో గ్రీష్మ గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పడవ సిద్ధం. వొక్కొక్కరూ ఎక్కారు. గోదావరి మధ్యగా ఇసుకమేటల లంక. చుట్టూ నీరు. గమ్మత్తైన అనుభవం కోసం ఎదురుచూపు. చండ్ర నిప్పులు చెరుగుతూ ఆకాశంలో వొంటరి సూర్యుడు. నీటి మేఘాల్ని చొచ్చుకుంటూ…పడవ కదిలింది. కవులేం చేస్తారు. ? సమయాసమయాలు లేకుండా పరవశంగా కవిత్వంలో మునిగిపోతారు. సుమధుర రాగాలాపన చేస్తారు. రసస్వాదనకు గంగవెర్రులెత్తుతారు. వీళ్లదే అదే బాపతు. వేడి నీళ్లతో ముఖాన కళ్లాపిచల్లినట్లు…ఆవిరి సెగలు ఎగజిమ్మినట్లు వేడిగాడ్పు…సూర్యకిరణాల ఏటవాలు తనం కోల్పోయి నిట్టనిలువుగా ప్రసరిస్తున్నాయి. వొళ్లంతా చెమటలు. రెప్పలు మూస్తూ తెరుస్తూ.. చెయ్యి అడ్డం పెట్టుకుని చూసే సన్నని చూపులు.
ఉక్కిరి బిక్కిరి అవుతూ కవులేం చేస్తారు. అసహనంగా గెంతులు వేస్తారు. ఆశువుగా నిరసన పాటలు కడతారు. ఉద్రేకంతో గొంతు చించుకుంటారు. కొత్త అనుభవం కోసం ఉర్రూతలూగుతారు. వీళ్లు మామూలు వాళ్లు కారు. చరిత్ర గర్భాన రేపటి గుర్తు సంభాషణలు ముగింపు పలకకుండానే…లంక వచ్చేసింది. దిగారు. సరంజామా వొక చోటకు చేర్చారు. హాయిగా ఆనందించే వెన్నెల సమయమా ఇది…?
మబ్బు తెరలు అడ్డు రాకుండా సూర్యుడు చూస్తున్నాడు. ఇసుకనేల కూర్చోవడానికి గోనె సంచులు కింద పరిచారు.  ఆతృతగా గొంతులోకి జారుతున్న ద్రవం. దేహాన్ని చల్లబరిచే పని మొదలు పెట్టింది. కాసింత స్థిమిత పడ్డారు. ఉపశమనం. సరిగ్గా ఇప్పుడే…  సృజనకారులు తెరచిన పుస్తకాలవుతారు. నచ్చిన లేదా నచ్చని విషయాలు జంకు గొంకు లేని మాటలుగా నాభిలోంచి తన్నుకు వస్తాయి. ఎవరినైనా ఏమైనా అనగలధైర్యం సాహసాలు ఛాతీ కొట్టుకుంటూ వస్తాయి. ఇప్పటి పరిస్థితి వేరే. రసవత్తర సంఘటన పురులు పోసుకునే సంధి సమయం.

అధ్యయన శోభతో ఇంకించుకున్న కవిత్వ పోహళింపులని విప్పుకున్నారు. యువకవులు ఆస్వాదిస్తున్నారు. కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. కవిత్వ శిక్షణలో కొత్తదారి. అంత ఎండలోనూ శాలువా కప్పుకుకున్న శివారెడ్డి రైలు బండి పాట అందుకున్నారు. అందరూ చప్పట్లు. మద్దూరి నగేశ్ బాబు చిత్రమైన గొంతు జీరతో పల్లెవాటు పదాలతో పాడిన పాట మనసుల్ని మరింత చల్లబరిచింది. వాతావరణం నిశబ్దంగా మారిపోయింది. లయబద్దంగా ప్రశంసల జల్లులు. కలకలిగిన వారంతా గొంతు విప్పారు. ఎండ వేిడ చల్లని వెన్నెలయ్యింది.
గుంపులో కవికాని వాడు వొకడున్నాడు.

అతను లేకపోతే ఈ కథే లేదు.

అతను మౌనంగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు.
గూడ పంచె..చిరిగిన బనీను. పెరిగిన గడ్డం. ముంజేతికి తెల్లబారిన కాశీ తాడు. తెల్లని దువ్వని చింపిరి జుట్టు. చేతులు కట్టుకుని మూలగా మాజేటి సుబ్రమణ్యం . వాడి చూపులతో గోదావరిని చూస్తున్నాడు. కవి గుంపులోకి ఎలా చొరబడ్డాడో తెలీదు. శీవారెడ్డి దృష్టి అతని మీద పడింది. అంతే. కందిరీగ తుట్టె రేగింది.
”ఏం  పెద్దాయన. గమ్మునుండిపోయావ్. నువ్వ పాడొచ్చు. మాట్లాడొచ్చు. అంతా మనవాళ్లే. మనుషులే”. శివారెడ్డి పలకరించారు. ఆయనకే చెల్లిన దోర నవ్వుతో.
”మనుషుల్లో పెద్ద మనుషులు బాబు మీరు. నానేం మాట్లాడగలను. బాబయ్యా. ? పొట్ట చింపితే కలికంలోకి కూడా అచ్చరాలు ఆనవు. చిత్తం బాబు.”
”మీకేమైనా పద్యాలొచ్చా..? విని వొంటబట్టించుకున్నయి ఏమన్నా ఉంటే చెప్పండి.” ఆతరంలో చదువుకోకపోయినా పద్యాలు రాని వారు ఎవరూ లేరు.
”వచ్చు గానండీ…తమ బోంట్లు వింటే కిసుక్కున నవ్వేస్తారు. ఏమన పద్యాలు , బ్రహ్మం గారి తత్వాలు బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఏదో కాలక్షేపం కోసం.”
”చెప్పు తాతా..?” అంటూ ముచ్చట పడ్డారు కుర్ర కవులు.
సుబ్రమణ్యం ఎత్తుకున్నాడు ముందుగా వేమన పద్యాలు.

” తేనె పంచదార తీయ మామిడిపండు
తిన్నగాని తీపి తెలియరాదు.
కన్న నింపు బుట్టు  కామిని అధరంబు
విశ్వదాభి రామ వినుర వేమ. ”
అంటూ పద్యాలు మొదలెట్టాడు.

చెవులు రిక్కించి విన్నారు. వొక్కో పద్యం విని అదిరిపోయారు. ”అద్భుతం…”అంటూ సంబరపడ్డారు. శివారెడ్డి చప్పట్లతో ఉత్సాహ పరుస్తున్నారు. వారెవ్వా అంటున్నారు.
గోపి గారికి అందని పద్యాలులా ఉన్నాయి.” ఏదీ మళ్లీ చెప్పండి.” బీరు కేసుల అట్టపెట్టి…కాగితం చింపి దాని మీద రాయడానికి ఉపక్రమిస్తూ సీతారాం చిన్నపిల్లాడై జాగ్రత్తగా నాలుగైదు పద్యాలు రాసుకున్నాడు.
”మా వోడే మా బంధువే. ….. ”మెరుపు కళ్లతో శిఖామణి అన్నాడు.
”మీరు కాసిన్ని ఈ చుక్కలతో గొంతు తడుపుకుని మరికొన్ని పద్యాలు లాగిస్తే తరిస్తాం. ఇన్నాళ్లూ ఎక్కడ దాగి ఉన్నావయ్యా మహానుభావా…?”చేతులు జోడించి చిరునవ్వు  అందించాడు యాకూబ్.
”అబ్బాయిలూ….ఏమనుకోకండి. మనకిది ఎక్కదండీ. వొళ్లు తమాయించుకోలేదండి. కిక్కు సరిపోదండీ. సరిపోక పోత అదోరకం బాధండి.”సున్నితంగా తిరస్కరించాడు సుబ్రమణ్యం. ఎంత బతిమాలినా సీసా తాక లేదు.
సుబ్రమణ్యం కేసి సంబరంగా చూస్తున్నాడు అఫ్సర్. మౌనంగా మనసులో రేగుతున్న భావ శకలాల్ని పోగు చేసుకుంటూ  బహుశా యానాం ఏమన ఏమనే… కైత కట్టుకుంటున్నాడేమో.
”వీర బ్రహ్మంగారి తత్వాలు కూడా అందుకోండి. సుబ్రమణ్యం గారూ….”నిషా ముసుగులేకుండా ఎండ భరిస్తున్న ఏకైక వ్యక్తి దర్భశయనం అడిగాడు. సుబ్రమణ్యం ఇక బతిమాలించుకోలేదు.
” ఏ కులమబ్బీ… నీదే కులమబ్బీ….అని అడిగితే ఏమని చెప్పుదు లోకులకు. పలు గాకులకు.
చెప్పలేదంటనక పోయేరు. నరులారా గురుని చేరి మొక్కితే బతక నేర్చేరు.”

మంద్ర స్థాయిలో మొదలెట్టి ధారాళంగా పాటలు, తత్వాలు అందుకున్నాడు. మనిషి జీవితంలోని దశల్ని, పుట్టుకనుంచి మరణం దాకా చెప్పేవన్నీ ఆలపించాడు. కొన్ని తత్వాలు సుఖ దుఃఖాల అనివార్యతను తెలియ జేశాయి. కొన్నేమో జీవన తాత్వికతలను బోధిస్తూ..వైరాగ్య భావనలోకి తీసుకెళ్లాయి.
కవి మిత్రులు సంతృప్తి పడలేదు. సుబ్రమణ్యాన్ని వదలలేదు. బతిమాలి, బతిమాలి పాడించుకున్నారు.” మరిన్ని పాడండి. మీకొచ్చినవన్నీ వినిపించండి సుబ్రమణ్యం గారూ. ….. ” తనివి తీరనట్లుగా అడిగారు.
”నన్ను అండీ…గిండీ అంటూ మన్నన చేయకండి బాబూ. నాక్కోపం వస్తుంది. నేను అంటరానోన్ని. మీరు చదువుకున్న మారాజులు. వొరేయ్, గిరేయ్ అంటేనే బాగుంటుందండీ. అలవాటైన ప్రాణానికి. ”
”అలాంటి తేడాలు లేవు. అందరూ వొకటే…ఇక చదువంటారా. మేం పుస్తకాలు పట్టుకున్నాం.మీరు లోకాన్ని చదివారు. మీ జ్ఞానం తక్కువేమీ కాదు. మా దగ్గరలేని వేమన పద్యాలు…మీ నోటి నుంచి విన్నాము. మీకు మాకూ తేడా లేదు. మనమంతా వొకేలాంటి మనుష్యులం. ”వొంటి మీద శాలువా తీసి పక్కన పెట్టి అన్నారు శివారెడ్డి.
”సరే వొక మాట. మొత్తం ఈ గోదావరి మీద మత్స్యకారులొక్కరేనా బతికేది. చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు వేరెవ్వరూ లేరా. ? ” గుంపులోంచి వేరెవరో అడిగారు. ఎవరడిగారు చెప్మా. ..!
” మా వాళ్లలోనూ ….రకరకాలుగా గోదావరి మీద బతుకుల్ని లాగించేవాళ్లున్నారు. పడవల్లోకి ధాన్యం బస్తాలు, కొబ్బరి కాయలు ఎగుమతి చేయడం, అర్థరాత్రి ఇసుక దేవుకుని పడవల్ని నింపడం సేత్తారండీ. ఇక చేపలంటారా…? పట్టుకునే వారు తక్కువే కానీ మా వూళ్లో ముత్యాలని వొక ఆడది ఉందండీ. దానిది మాకులమే. అది ఆడది కాదండీ బాబు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వీపు వెనకాల పల్లె గంప మోచేతిమీద వల చుట్టుకుని …గంపెడు చేపల్ని ఇట్టే పట్టుకుంటుందండి. బతుకు తెరువు అలవాటు చేసుకోవాలిగానీ ఏ పనైనా ఎవరికైనా లొంగుతుంది. అంతే కదండీ.” సుబ్రమణ్యం బదులిచ్చాడు.
మద్దూరి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సుబ్రమణ్యం కోసి తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపులు తగిలినట్లున్నాయి. సుబ్రమణ్యం అసహనంగా కదిలాడు. మద్దూరి మాత్రం ఇంకా అతను ఏం చెబుతాడో అని ఎదురుచూస్తూ దోసిలిలోకి ఇసుక తీసుకుని ఎగరేస్తున్నాడు. గవ్వల్ని దూరంగా విసిరేస్తున్నాడు.
సుబ్రమణ్యం ఆకాశం చేసి చూశాడు. చుట్టూ ఉన్న గోదావరిని చూశాడు. ఉస్సూరని నిట్టూర్చాడు. కాసేపు బీరు సేవనంలో మనిగిపోయారు. అక్కడి వారందరి మనసుల్లో సుబ్రమణ్యం….. సుబ్రమణ్యం.
” ఏమయ్యా సుబ్రమణ్యం. నిన్నీపళంగా ఇక్కడ వదిలేసి చక్కగా పడవెక్కి ఉడాయిస్తే….ఏం చేస్తావోయ్…”గమ్మత్తుగా శివారెడ్డి అడిగాడు.
”నాకేటి భయం. నాకేటి భయం. నీటిమీద నడుచుకుంటూ వచ్చేత్తా.”
” విన్నారా ..? అంతకంటే కవిత్వం ఏమిటి..? నిర్మలంగా మైదానంలా గోదావరి ఉందని చెప్పక చెపుతున్నాడు.  తలచుకుంటే మార్గం దొరుకుతుందని అంటున్నాడు.
శభాష్ సుబ్రమణ్యం. అన్నాడు శివారెడ్డి. కోపగించుకోకండీ మరండీ..మరండీ… నన్నేమైనా అనేయమంటారా..? నాకు తోచింది మాట్లాడేయమంటారా..? ” ముందుగా అనుమతి కోరాడు.
”శుభ్రంగా అనవయ్యా… ఈ వేళ నీకేం అడ్డు లేదు. ”
మాటలు కూడదీసుకోవడానికి అన్నట్టు కాసేపు ఆగాడు సుబ్రమణ్యం.” అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అందరూ అమ్మానాన్నల సంతోషంలోంచే..రెండుకాళ్ల మధ్య గుండానే కెవ్వుమని ఏడ్చుకుంటూ పుట్టాం గందా. ఇన్నాళ్లూ రాత్తుండారు. మా కట్టాలు కన్నీళ్లు మీకు ఆపడ్డాయా..అయ్యలారా. వొకే దారి గుండా వచ్చాం సరే. మరి మా ఆకు (విస్తరి) ఎందుకు ఎడం. (దూరం. ) అయింది బాబయ్యా..?” అన్నాడు.
కవుల జేబుల్లోని కలాలూ  దడదడలాడాయి. నిశ్చేష్టులయి తమ అనుభవాల్ని తవ్వుకుంటున్నారు. తాము అధ్యయనం చేసిన అంశాలు గుర్తుకొచ్చాయి.
కవులేం చేస్తారు..? కవులేం చేస్తారు.
దిక్కులు పిక్కటిల్లేట్టు గుండె బద్ధలై..వెలువడిన ప్రశ్నకు సమాధానం ఏది..?
ఈ ప్రశ్నను సజీవ సాహిత్యంగా మలచాలి.

*

మీ మాటలు

  1. Srinivas Vuruputuri says:

    ఏడేళ్ల క్రితం బొల్లోజు బాబా గారు రాసిన వ్యాసం: “యానాం వేమన ఏమనె….” అఫ్సర్ కవిత గురించి

  2. రాజు గోరూ సత్తే పెమాణికంగా సెప్పాలంటే మరి ఈ కతా మా వొదినమ్మ ఎట్టిన పులస పులుసు నాగుందండి మరాండీ ఈ పూటో రొయ్యల కూర నాగుందండి ఆయ్ నిజమండీ నానెప్పుడూ అబద్దాలు సెప్పనని మీకు ఎరికే గదండీ అదండీ …పేవతో జగతి

  3. Amarendra Dasari says:

    “ఈ ప్రశ్నను సజీవ సాహిత్యంగా మలచాలి ” – ప్రయత్నం సఫలం అయింది ….కాని ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతోంది…

  4. కె.కె. రామయ్య says:

    ” అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అందరూ వొకే దారి గుండా వచ్చాం సరే.
    మా కట్టాలు కన్నీళ్లు మీకు ఆపడ్డాయా? మరి మా ఆకు (విస్తరి) ఎందుకు ఎడం (దూరం) అయింది బాబయ్యా..? ”
    దిక్కులు పిక్కటిల్లేట్టు గుండె బద్ధలై..వెలువడిన ప్రశ్నకు సమాధానం ఏది..?

    “కవులు ఉత్త అమాయకులు, అల్ప సంతోషులు వాళ్ళనేవీ అనకండి” అన్న త్రిపుర గారి వీరాభిమాని
    దాట్ల దేవదానం రాజు గారండీ! వ్యాసంలోని మీ ఆత్మీయాన్ని వొళ్లు తమాయించుకోలేకపోయిందండి.

    రామిండ్రి సిన్నయ్యగోరి ( దాట్ల లలిత గారి ) సాహితీ గోదారి, సంగమ సరస్వతిని మళ్ళీ సారంగలో
    అవుపించేలా ప్రయత్నిస్తానని మాటిచ్చిన దాట్ల దేవదానం రాజు గారండీ ఇచ్చిన మాట మర్సిపోరు గదండి.

    ~ ఇట్లు, ఓ అబ్బులు గాడు.

    నోట్ : వ్యాసంతో పాటు ప్రచురించిన ఫొటోలో శివారెడ్డి, సీతారాం, అఫ్సర్, మిమ్మల్ని ( దేవదానం రాజు )
    తప్ప మిగిలిన కవులని పోల్చుకోలేకున్నాను. “చెప్పుకోండి చూద్దాం” అంటూ గొరుసన్న మాకు అగ్ని పరీక్ష
    పెట్టడానికి ముందే ఫోటో కాప్షన్ లా వరసాగ్గా అందరి పేర్లూ రాయించారా.

  5. Key to Wren and Martin లాగ, పై ఫొటోకి నాకు తెలిసిన కీ
    పై వరసలో
    అఫ్సర్, ఆశారాజు
    రెండో వరుసలో
    యాకూబ్, శిలాలోలిత, దర్భశయనం (?), శివారెడ్డి, శిఖామణి, దాదేరా,
    మూడవ వరుస
    సిద్దార్థ, దాట్లగారి అబ్బాయి 1, సీతారాం, దాట్లగారి అబ్బాయి 2, తెలీదు
    subject to be corrected. :-)

    • datla devadanam raju says:

      తెలీదు కు జవాబు రమణ (సీతారాం మేనల్లుడు )

    • datla devadanam raju says:

      అలాగే సిద్ధార్థ కాదు మద్దూరి నగేష్ బాబు

  6. కె.కె. రామయ్య says:

    వ్యాసంలో ప్రచురించిన ఫొటోలోని కవులు :

    ( L to R ) పై వరసలో సారంగ అఫ్సర్ ( కౌముది గారబ్బాయి ), ఆశారాజు ( ప్రముఖ ఉర్దూ కవి )
    రెండో వరుసలో యాకూబ్ ( ప్రవహించే జ్ఞాపకం, కవిసంగమం వేదిక ), శిలాలోలిత ( డాక్టర్ పి. లక్ష్మి, యాకూబ్ గారి శ్రీమతి ), దర్భశయనం ( జీవనవీచిక ), విప్లవకవి శివారెడ్డి ( రక్తంసూర్యుడు ), శిఖామణి ( మువ్వల చేతికర్ర డా. కర్రి సంజీవరావు ), ‘కళైమామణి’ దాట్ల దేవదానం రాజు ( యానాం కథలు )
    మూడవ వరుస : “దీపశిల” సిద్దార్థ ( అంతర్ముఖీనుడైన నగరవాసి దుఃఖo ) , దాట్లగారి అబ్బాయి 1, డా. సీతారాం ( S/o మాణిక్యం ఫేమ్, అంతర్ముఖత్వము, మార్మికత, అధివాస్తవికతల కవి ), దాట్లగారి అబ్బాయి 2, రమణ (సీతారాం మేనల్లుడు ).

    ఫొటోలోని కవులకు “వెలుతురు తెర” పట్టిన బొల్లోజు బాబా గారికి నెనర్లు.

    • datla devadanam raju says:

      రామయ్య గారూ…ఆయన “దీపశిల” సిధ్ధార్థ కాదు
      మద్దూరి నగేష్ బాబు

  7. కె.కె. రామయ్య says:

    క్షమించండి రాజు గారు, ఎక్కడ గొరుసన్న తరుముకొస్తాడేవో అన్న తొందర్లో పప్పులో కాలేసా.

    మూడవ వరుస : లో “దీపశిల” సిద్దార్థ కాదు, దళిత ధిక్కార కవిత్వం మద్దూరి నగేష్ బాబు అని సవరణ.

    ” కులం భల్లూకమైనప్పుడు, వాడ వథ్యశిలగా మారినప్పుడు, విరగపండిన భూమి కుల భూస్వామ్యానికి విచ్చుకత్తులందించినప్పుడు, భూమి లేని నిరుపేదల దళిత వాడలపై దమనకాండలు, దహనకాండలు, గుంపుదాడులు నిరంతర సంఘటనల వుతున్నప్పుడు తిరగబడ్డ దళిత వీరుల పదఘట్టనల నుండి దళిత సాహిత్యం పుట్టింది. . ఈ దళిత యుగ ప్రస్థానంలో ఉక్కునాలుకతో మాట్లాడిన వాడే మద్దూరి నగేష్‌బాబు “

మీ మాటలు

*