బహు పరాక్

art: Rafi Haque

art: Rafi Haque

~
వరమో శాపమో
బలేగా మళ్ళీ తయారయారు
నిద్ర లేవలేనిబేతాళుణ్ని
మాచేత మోయిస్తూ
నిరంతరం నిద్ర లేపే ప్రయత్నమూ చేస్తున్నారు.
నవ నిర్మాతలూ బహుపరాక్
మీ నుదుటి కుంకుమ చూసి
పూజా దురంధరులనుకున్నామే కానీ
మీ అవిశ్రాంత నరమేధపు వెచ్చటి నెత్తుటి ఆనవాలనుకోలేదు.
భక్త శిఖామణులూ బహుపరాక్
మీ సహస్ర భాషల్లో
‘ముందుకు పోతావున్నా’మన్న మాట విన్నపుడల్లా
వుత్తమ పురుషుడి బహువచనమనుకున్నాము కానీ
వుత్త పురుషుడి ఏకవచనమనుకోలేదు
వయ్యాకరణులూ బహుపరాక్
మీరు తిరుగని పుణ్యదేశం లేదు
మా గుండె లోతుల్ని తప్ప
మీరు మునుగని గంగ లేదు
మా కంటి ధారల్ని తప్ప
మీరు మొక్కని హోమజ్వాల లేదు
మా ఆకలి మంటలు తప్ప
మీ పబ్బానికో యేరు దొరికింది
మీ మాటల పండగలకు హారతులూ దొరికాయి
మీ డప్పు డవాలు దారులూ
వంతపాటకు దొరికారు
తిరుక్షవరానికి
*అరుకాళుడి నోటి దగ్గర
పట్టు కుచ్చు టోపీలతో
అమాయిక భక్త జనమూ దొరికారు
మేమిలా వింటూనే
కలలు కంటూనే వుంటాం
అపర మయసభా నిర్మాతలూ బహుపరాక్
‘మహేంద్ర నగరి’ హుం
‘సీనా సింహ’ కవచం భం
‘ఋణౌ’షట్
‘వసుధానిధి ధనం’ స్వాహా
అమాయక జనం ఫట్
మహా మాయాజాలంతో
యేదో జరిపిస్తున్నామన్న భ్రమలో
మమ్మల్ని మరిపింపజేసే
మహా నేపాళ మాంత్రికులూ
మళ్ళీ మళ్ళీ బహుపరాక్!
*అరుకాళుడు: పాముపటంలో పెద్ద పాము పేరు
*

మీ మాటలు

*