చీకటిదే మతం?

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

ఉదయమే ఇంటర్వ్యూ  కి వెళ్ళాలి. వెళ్ళగలనా ? ఈ  చీకటి , ఈ నిద్రలేని  రాత్రులు ఇలా  అలవాటైపోయాక అనుకున్న సమయానికి  నిద్రలేవగలనా ? మళ్ళీ నన్ను వెతుక్కునే పనిలో పడాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. అహ అస్సలు చూడకూడదు.

ఎంత  బాగుంటుంది  చీకటి. ప్రశాంతంగా. పొగలూదుతూ కాఫీ తాగే చంద్రున్ని వేల ప్రశ్నలు అడుగుతూ నేను ఓ కాఫీ కలుపుని నాలుగో అంతస్తులో ఉంటున్న మా  ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఆకాశంకేసి చూస్తూ తాగడం. ఇవన్నీ ఇవన్నీ నేను బ్రతికున్నాను, బ్రతుకుతున్నాను అన్న సూచనలే.

ఏదో  ఆలోచిస్తుంటాను. ఏదో రాద్దాం అనుకుంటాను. ఎవరెవరి జీవితాలో కళ్ళముందుకి వచ్చి అసంపూర్ణ కథలు చెప్పి వెళుతుంటే వాళ్ళ వంక దీనంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాను. ఎవరు వీళ్ళంతా . వీళ్ళ మానసిక వేదనలేంటి.

ఏమో ఇవ్వాలెందుకో ఆ పిల్ల బాగా గుర్తొస్తుంది. అందరికన్నా ముందే బైబిల్ పట్టుకుని చక చక చర్చికి వచ్చే పిల్ల. అందరికన్నా ముందే నన్ను సండేస్కూల్ లో పలకరించడానికి వచ్చే పిల్ల. కంఠతా పట్టేసిన ఆ రోజుటి వాక్యాన్ని గబగబా అప్పగించే పిల్ల. బాగా గుర్తొస్తుంది.

పోయినేడే కదూ ఆ అమ్మాయి క్రిస్మస్ కి చర్చ లో స్పెషల్ సాంగ్ పాడింది. అందరూ మెచ్చుకున్నారు. వాళ్ళమ్మ నాన్నలకైతే ఎంత సంతోషమేసేదో ఆ రమ్య  పాడుతూ , బైబుల్ వాక్యం చదువుతుంటే.

చిన్నప్పుడు వాళ్ళను చూస్తే నాకు సందేహం కలిగేది. తెలిసో తెలియకో మా నాన్నను ఒక రోజు అడిగేసా. మన ముక్కుల్లా వాళ్ళ ముక్కులెందుకు లేవు అని. ఏం చెప్పాలి ఈ పిల్లకి అనుకున్నాడో ఏమో  మా నాన్న కొంచెం సేపు తటపటాయించి చెప్పాడు. ఆ అంకుల్ వాళ్ళది ఇక్కడ కాదు వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చారు. అని అప్పటి వరకు నాకు అందరి ముక్కులూ ఒక్కలా వుండవు అన్న విషయమే తెలియదు. కాని రమ్యకి ఆ ముక్కుతో ఏ సంభంధం లేదు. ఎంత చక్కగా వుండేది. తెల్లగా , బుగ్గలేసుకొని. “స “ మామూలుగా పలకడానికి రాక. పై పల్లకి నాలుక ఆనించి స అన్నప్పుడు సండేస్కూల్ లో పిల్లలు కుళ్ళుతో ఏడ్పించే వాళ్ళు కాని అందరికీ  తెలుసు. బైబుల్ మెమరీ వర్సస్ చెప్పాలంటే అందరూ రమ్య తరవాతే అని . చదువులో కూడా అంతే ఫస్ట్ కదా. అందుకే బాసర ట్రిపుల్ ఐటీ  లో సీట్ సంపాదించింది.

ఇప్పటి వరకూ ఇంటర్వ్యూ గురించి ఎంత ప్రిపేర్ అవ్వాలో అయ్యాను. గూగుల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఏ ప్రశ్నైనా అడుగు టపీ మని సమాధానం చెప్పేయదు. రాత్రి ఒంటిగంట అవుతుంది ఇప్పుడు . రాసుకునే అన్ని రాసుకుని, నేర్చుకునే అంత నేర్చుకుని రేపటి కోసం చూస్తున్నా .

నాకే నిద్దర ఎందుకు రాదో అర్ధం కాదు. ఈ రాత్రి పూట బయటకొచ్చి ఖాళీగా ఉన్న ఇంటి ముందు నడుస్తూ రేలింగ్ దగ్గర నిల్చుని చూస్తే గుర్రు పెట్టి నిద్రపోతున్న ఇళ్ళ మధ్య గుండా ఎన్నో కలలు వీధుల్లో లేసర్ షో వేస్తున్నట్టు కనిపిస్తుంటాయి నాకు. నిద్దర పట్టకపోతే కీబోర్డ్ మీద వేళ్ళు ఊరుకోవు. బుర్రలో ఆలోచనలు ఊరుకోవు. ఎవరెవరో గుర్తొస్తూ ఆలోచనల్లోకి బలవంతంగా ప్రవేశిస్తారు.

ఆ రమ్య సంగతేంటి చెప్పమంటార. ఏముంది ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతున్నట్టుంది కదా ఆ పిల్ల రమ్య ఇల్లొదిలి పారిపోయి. అవును ఎనిమిదో తొమ్మిదో నెలలు అవుతుంది. ఆ పిల్ల ఇల్లొదిలి వెళ్ళినప్పుడు చర్చిలోని సంఘస్తులంతా ఒకటే చెవులు కొరుక్కున్నారు. బాగయ్యింది అని. ఎందుకో మరి వాళ్లకు ఆ సంభరం. తను  వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మా నాయన్ని ఎవరెవరు ఎలా మాట్లాడారో తెలుసో లేదో ఆ పిల్లకి . ఎలా తెలుస్తుంది. ఆ పిల్లుండే స్థలానికి వీళ్ళు వెళ్ళలేరు. వెళ్లి చూడడానికేమో వీళ్ళకు ఇష్టం కలగడం లేదు.

ఇంతకు ఎవరైనా మత విశ్వాసాలను అంత తొందరగా ఎలా మార్చుకుంటారు. ఏ నమ్మకాన్నైనా వెంటనే ఎవరం మార్చుకోలెం కదా. ఆ మార్పు వెనక ఎప్పటినుంచో వెంటాడే సమయం వుంటుంది. అది ఒక నెలో , మూడు, నాలుగు, ఆరు నెలలో, లేదా సంవత్సరమో  రెండు సంవత్సరాలో.

రమ్య తన విశ్వాసాన్ని మార్చుకోడానికి ఎన్ని రోజులు పట్టిందో. అందరూ ఆ పిల్ల అమ్మా నాన్నలను పొడవడమే. ఎవడినో ప్రేమించి వుంటుంది. లేకపోతే అలా ఎలా మతం మార్చుకుని , చెప్పా పెట్ట కుండా ఇంట్లోంచి వెళుతుంది అని. ఆ పిల్ల మతం మార్చుకోవడం కన్నా ఎవడినో ప్రేమించే మార్చుకుంది అన్న మాటలు వాళ్ళను ఇంకా బాధించి వుంటాయి.

వాళ్ళు మూడు నెలల వరకు చర్చికి రావడమే మానేశారు. జనాలకు మాట్లాడుకోడానికి ఆ మసాల దొరికింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రకంగా కుదిరితే అలా కథలు అల్లుకోవడం మొదలు పెట్టారు. నా వరకూ వచ్చాయి. వినే ఓపిక లేదనిపించింది. ఎందుకో నేను సరిగ్గా నా మత విశ్వాసాన్ని ఆ అమ్మాయి వరకు చేరవేయడం లో విఫలమైయ్యానేమో. లేక ఆ అమ్మాయికి నేను అవలంభిస్తున్న మతం, సిద్ధాంతాలకన్నా తాను మారిన మతంలో ఏ విషయం గొప్పదనిపించిందో. ఆ అమ్మాయి తనకు నచ్చిన  విశ్వాసాన్ని స్వీకరించి అనుసరించే హక్కు ఆ పిల్లకి వుంటుంది కదా. వద్దు అంటే ఆ అమ్మాయి వింటుందా ? బలవంతం చేసి మతాన్ని మోయించగలమా?. ఇల్లు వదిలి వెళ్ళేంత నమ్మకం పెంచుకుంది అంటే అంత గొప్పగా తనకి ఏమనిపించిందో.

ఈ విషయం అయ్యాక కొన్ని రోజులు ఇదే ఆలోచించాను. అవును ఆయనెవరో ఫేస్ బుక్ లో మతం మారకండి అని అరిచి రాసేప్పుడు జాలి వేసేది. మా నాన్న మేనత్తలందరూ  హిందువులను పెళ్లి చేసుకుని హిందువులైయ్యారు. మా తాత RCM సిద్ధాంతాలతో ఉన్నప్పుడు మా నాన్నమ్మ ప్రొటెస్ట్ టెంట్ గా వుండి అందరిని అటువైపు తీసుకెళ్ళింది. మేము ఆ విశ్వాసంలో బలపడ్డాo. అయినా బంధుత్వాలేవి పోలేదు.

నిజమే మత విశ్వాసాల జోలికి వెళ్ళకుండా మనుషులు మనుషులుగా స్వీకరిస్తే ఏ గొడవా వుండదు కదా. ఏంటో ఓల్డ్ సిటీలో ఎదో మదరస్సాలో ఇస్లాం స్టడీస్ చేస్తుందంట ఆ పిల్ల. ప్రేమ గీమ లాంటి జోలికి కాకుండా కేవలం మతపరమైన చదువులకోసం వచ్చాను ఇప్పుడు నా పేరు అఫ్రీన్ అని వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళినప్పుడు ఆమె తరపున లాయర్ తో చెప్పించిందట. మా పాస్టర్ గారు నన్నోసారి రమ్మన్నారు.  నువ్వు మాట్లాడుదువు గాని రా అమ్మా అని. నేనేం మాట్లాడతాను. నా దేవుడు తప్పు కాదు అంటే ఆ అమ్మాయి కూడా నేను అనుసరించే దేవుడు తప్పు కాదు అంటుంది. ఆ అమ్మాయికి  ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడే ఎవరినైనా అడిగి తెలుస్కోవాల్సింది. కాని అలా జరగలేదు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను వెళ్లి మాట్లాడినా మార్పు వస్తుందా. రాదు . కాని కాలం అన్నిటికీ పరిష్కారం చూపగలదు. నేను అదే అనుకున్నా. వీలున్నపుడు ఎపుడైనా కుదిరితే ఆ మదరస్సా ఎక్కడో కనుక్కొని వెళ్ళాలని మాత్రం అనిపించింది.

సమయం ఒకటిన్నర అవుతుంది . రేపు ఉదయాన్నే ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఉద్యోగంతో తిరిగి రావాలనే అనుకుంటున్నా. వస్తా కదా.

*

మీ మాటలు

 1. మనుషులు మనుషులుగా స్వీకరిస్తే ఏ గొడవా వుండదు. అవును దేన్నైనా మనుషులు మనుషులుగా స్వీకరించినపుడే ఏ గొడవా వుండదు. ప్రశ్న ఒకటే, దేన్నైనా ఎలా స్వీకరిస్తున్నాం ? అనేది…సమాధానం అక్కరలేదు, ఆ సందిగ్ధావస్థలో వుండాలంతే …

 2. ఏ నమ్మకాన్నయిన వెంటనే ఎవరం మార్చుకోలేం.ఆ మార్పు వెనుక ఎప్పటినుండో వెంటాడే సమయం వుంటుంది .నిజమే కదా !కధ పూర్తిగా చదివేకా నా కర్ధమైంది ఒకటే ,చర్చయినా గుడయినా,మసీదయినా తప్పుడు మాటలకి చెవి ఒగ్గడంలో ఏ భక్తీ చదువూ సంస్కారాలు అడ్డురావని !ఇక మతాల గురించి మాటలు దేనికి !చిన్న కధయినా చెప్పినతీరు బాగుంది మెర్సీ !అభినందనలు !

 3. D. Subrahmanyam says:

  మంచి కదా. నిజమే ఈ దేశం లో రాను రాను మత స్వయచ్ఛ, అసలు ఎలా బతకాలా అన్న స్వేచ్ఛ పోవడం ఇబ్బంది గా ఉంది.

 4. revathi krishna says:

  నిజమే మత విశ్వాసాల జోలికి వెళ్ళకుండా మనుషులు మనుషులుగా స్వీకరిస్తే ఏ గొడవా వుండదు కదా. నిజమే కదా. .మత విశ్వాసాలు వ్యక్తిగతం ఎవరి స్వేచ్ఛ వారిది మనిషి ని మనిషిగా మనలో ఒకరిగా స్వీకరించడానికి మతం ఈ రోజుల్లోనూ అడ్డు రావడం విచాకరం కదా. చాలా అద్భుతం గా రాశారు అండి

 5. P V Sunil Kumar says:

  Vibhinnam ga undi. Inkomchem rasi unte bavundu.
  Part2 rayandi

 6. ఎప్పటికైనా పపంచాన్ని జయించగలిగేది ప్రేమ మాత్రమే అనే మీ సందేశం బాగుంది మెర్సిగారు. మతాలజతీతమైంది ప్రేమ.

 7. బాగుంది. కథ. ఆతరువాతేంజరిగిందన్న విషయాన్ని పాఠకునికే వదిలేసారు. ఇదొక టెక్నిక్. ఇలాంటి పరిస్థితులకు కాలమే సమాధానం చెప్పాలి.

 8. చాలా బాగుంది మార్గరెట్ గారు. నాకు నచ్చిన వాక్యాలు : ” ఎంత బాగుంది చీకటి….. ఇవన్నీ నేను బ్రతికున్నాను, బ్రతుకుతున్నాను అన్న సూచనలే ”

  ” ఏదో ఆలోచిస్తుంటాను…. ఎవరెవరి జీవితాలో కళ్ళముందుకి వచ్చి అసంపూర్ణ కథలు చెప్పి వెళుతుంటే వాళ్ళ వంక దీనంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాను.

  ” గుర్రు పెట్టి నిద్రపోతున్న ఇళ్ల మధ్య గుండా ఎన్నో కలలు వీధుల్లో లేసర్ షో వేస్తున్నట్టు ”

  ” మత విశ్వాసాల జోలికి వెళ్ళకుండా మనుషులను మనుషులు గా స్వీకరిస్తే ఏ గొడవా ఉండదు. “

 9. Ramakrishna says:

  కథ అనడం కంటే, మెర్సీ గారి శైలి లో వున్న కథనం అంటే బాగుంటుందేమో.

  మొదటి నాలుగైదు పేరాగ్రాఫ్ లలో వున్న అందమైన సరళిని చివరిదాకా కొనసాగించలేకపోవడాన్ని పెద్దగా ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేపథ్యం అలాంటిది.

  all the best mercy garu

  • mercy margaret says:

   thank you Ramakrishna sir .. truely dont know the technical words of story writing .but thanks for reading and giving your feedback

 10. కథనశిల్పం కూడా అద్భుతంగా జాలువారగలదని నీలోంచి అని ఈ కథా నిరూపిస్తున్నది మెర్సీ.అది చర్చి అయినా మసీదైనా మందిరమైనా స్త్రీల ఆలోచనపట్ల వుండే దృక్పథాన్ని బద్దలు కొట్టి చెప్పావు. రచయితలకీ వుండే సర్వసాధారణ జబ్బు నిద్రలేమే కదా..పాత్రలు చెప్పే కథల్ని మాటల్ని చెక్కి మలిచి కథని రూపు కట్టించడానికి. మంచి టెక్నిక్ లతో రాశావు .All the best.కవిత్వం రాయడం వదలొద్దు.

 11. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

  రమ్య బాల్యం తన శక్తిసామర్థ్యాలు, స్వభావ సంపన్నతలు బాగా చెప్పారు..ఫ్లష్ బాక్ లో…వొక దైనందిన జీవితం దాని తాలుకు పోరాటం….
  మినీ కథలాటి నిర్మాణం….పాత్రలను యింకా విస్తరణ,తాదాత్మ్యత అవసరం…స్థలకాలాదులు లేకపోయిన గతం వొక్కోసారి వర్తమానమై నడుస్తుంటుంది….అలాటి స్థితి యీ కవితలొ వెంటాడే మరో యెగోని….

 12. mercy margaret says:

  thank you sir fr taking some time and reading … thanks for your feedback

 13. అజిత్ కుమార్ says:

  రమ్య ఇల్లు వదిలి వెళ్ళడానికి బహుశా ప్రేమ కారణం కావచ్చును. ఇది కులాంతర మతాంతర ప్రేమ వివాహం జరిగివుండవచ్చు. ఇలాంటివేవీ లేకపోయినా కేవలం వ్యక్తిగత నమ్మకాలప్రభావంతో మతం మారడం జరగవచ్చు. అయితే అది ఎక్కువగా కుటుంబమంతా వేరే మతంలోకి మారుతూంటారు. వేరే మతంలోకి మారడం ఈజీయేగాని అన్నిసందర్భాలలో కులం మారడానికి మాత్రం వీలుండదు. పాత మతం వాళ్ళు మనల్ని ద్వేషభావంతో చూస్తూ సూటిపోటీ మాటలంటుండగా క్రొత్త మతానికి చెందిన వ్యక్తుల గుంపు మాత్రం మనల్ని ప్రేమగా చూస్తారు. ఆప్యాయంగా మనతో మాట్లాడుతారు. మొదట మనం చెప్పుకున్నట్లు ఓ అమ్మాయి గనుక వేరే మతానికి చెందిన అబ్బాయిని ప్రేమించితే తప్పనిసరిగా మతంతోపాటు కులం కూడా మారినట్లే. వారికి పుట్టే పిల్లలకు తండ్రి కులమే వస్తుంది. అదే ఓ అబ్బాయి మరో కులానికీ మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కి చెందిన ఏరియాలోనే నివసిస్తే అతనికి ఆమె కులమే వస్తుంది. ఇటువంటి కులాంతరమతాంతర వివాహాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే దేవుడిచ్చిన తండ్రి (God Father ) ఉండితీరాలి.
  ఇక ఈ కథలో మీరు వర్ణించిన మీ కుటుంబంలో మతాంతర వివాహాలు జరిగినా అవి ఒకే కులం లోని వారి మధ్యనే ఉన్నాయి గనుక మరేవిధమైన సమస్యలూ కలగలేదు. అలాగే ఒకే మతానికి చెందిన వివిధ కులాల మధ్య జరిగే వివాహాల వలన కూడా అంతగా సమస్యలు ఏర్పడవు. ఇరువైపులా ఆర్ధిక స్థితి ఒకే స్థాయిలో ఉంటే అప్యాయతా అనురాగాలు ఏమాత్రమూ తగ్గకుండా ఉంటాయి.
  మీరన్నారు “ ఇంతకూ ఎవరైనా మత విశ్వాసాలను అంత తొందరగా ఎలా మార్చుకుంటారోగదా ” అని. మతం మారటం చాలా తేలిక పని. అది ఎంత తేలికంటే ఓ పెళ్ళైన మగాడు తన భార్యను కాకుండా మరో అమ్మాయిని ప్రేమించగలిగేంత తేలిక. అవకాశం కలిసివస్తే త్వరగానూ లేదా ఆలస్యంగానూ అది జరగవచ్చు. అందుకనే పెళ్ళాలు ఎప్పుడూ తమ మొగుళ్ళను ఓ కంట కనిపెడుతూ , ఆరాలు తీస్తూంటారు. ఒకవేళ తన భర్తకనుక ఒకానొక అమ్మాయి వలలో పడే పరిస్తితులు కనిపిస్తే , ఆ అమ్మాయిని గూర్చి తన భర్తకు చెడ్డగా చెప్పడంద్వారా తన భర్తకు ఆ అమ్మాయి యడల విముఖత కలగుతుందని నమ్ముతారు. అదేవిధంగా మతబోధకులు కూడా తమ మతానికి చెందిన భక్తులు ఇతర మతాలయడల ఆకర్షితులు కాకుండా ఉండడానికి ఆయామతాలగురించి అసహ్యత కలిగేలాగా కట్టుకధలల్లి చెబుతుంటారు. అందుకే ఆయామతాలకు చెందిన వారు మనకు దగ్గరలో ఉన్నప్పటికీ దాన్ని గురించిన కనీస పరిజ్ఞానం కూడా సంపాదించుకోలేము. ఏవైనా పరిస్తితులవల్ల అలా తెలుసుకోగలిగితే మతం మారడానికి బహుశా వెనుకాడని రమ్య లాంటివాళ్ళు తప్పనిసరిగా కనిపిస్తారు.

 14. Dr.Pasunoori Ravinder says:

  మెర్సీగారు..అభినందనలు.
  చాలా సీరియస్ విషయాన్ని అలవోకగా రాశారు. కథన శైలి బాగుంది. మీరు కవిత్వంతో పాటు కథలు కూడా బాగా రాయగలరనే విషయాన్ని ఈ చిన్న కథ రుజువు చేస్తున్నది. కథలు రాయడం మీద కూడా దష్టి సారించండి.
  ఆల్ ది బెస్ట్
  -డా.పసునూరి

 15. టి. చంద్రశేఖర రెడ్డి says:

  సారంగ తన రచయితలకి ఇచ్చిన సూచనల్లో (అ) రచనలు పంపే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఎడిట్ చేసుకోండి. (ఆ) అచ్చు తప్పులు లేకుండా చూసుకోండి అని ప్రతి వారం చెపుతోంది. కాని, ఈ సూచనలు కొన్ని రచనల విషయాల్లో ఆచరణలోకి అంతగా వస్తున్నట్లు కనపడదు.
  చీకటిదే మతం? అనే శీర్షిక రెండు అర్థాలు ఇస్తోంది. చీకటిది ఏ మతం? అని అర్థం చేసుకోవాలా? చీకటిదే మతం? అని చదువుకోవాలా?
  ఇది కాక ఇదే కథలో చోటు చేసుకున్న మరి కొన్ని పదాలు లేదా వాక్య ప్రయోగాలు ఈ అభిప్రాయాన్ని మరికాస్త బలపరుస్తాయి.
  అవి-చంద్రున్ని కలుపుని (చంద్రుడ్ని కలుపుకుని అని ఉండాలేమో?-కలుపు అంటే వేరే అర్థం ఉంది), ఇవ్వాలెందుకో (ఇవ్వాళెందుకో, ఇవ్వటం అనే అర్థం వస్తోంది కదా?), బైబుల్ (బైబిల్, కథలో ఇంకో చోట బైబిల్ అనే ఉంది), సంభంధం(సంబంధం), పల్లకి (పళ్లకి, పల్లకి అనే పదానికి మరో అర్థం ఉంది), చెప్పేయదు, అర్ధం (అర్థం), చెప్పమంటార (చెప్పమంటారా), సంభరం (సంబరం), పిల్లుండే (పిల్ల ఉండే), మార్చుకోలెం (మార్చుకోలేం), ప్రొటెస్ట్ టెంట్ (ప్రొటెస్టెంట్-ప్రొటెస్ట్ టెంట్ రచయిత అనుకునే అర్థం ఇవ్వదు), బంధుత్వాలేవి (బంధుత్వాలేవీ), ఆ అమ్మాయికి ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడే (ఆ అమ్మాయిలో ప్రశ్నలు ఉత్పన్నం అయినప్పుడే).
  మంచి కథ లేదా ఒక విభిన్నమయిన కథని చదివి పొందిన/పొందాల్సిన అనుభూతి సాంద్రతని; పై కథలో ఉన్న పంటి కింద పలుకురాళ్లు బలహీనపరుస్తాయి.
  కథకి 23 కామెంట్స్ వచ్చాయి. అందులో సుమారుగా సగం, పాఠకుల వ్యాఖ్యలకి కథయిత ప్రతిస్పందనలు. కథ బాగుంది అన్న వాటికి కాకుండా, స్పందించాల్సిన వాటికే రచయితలు స్పందిస్తే, ఒక కథ క్రింద ఉన్న అన్ని వ్యాఖ్యలనీ అనివార్యంగా అనుసరించే అగత్యం పాఠకులకి తప్పుతుందేమో?

  • ari sitaramayya says:

   Thank you, Sir. నాక్కూడా అలాగే అనిపించింది.
   ఇలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత రచయితదే.
   కానీ… సంపాదకులు ఈ రచనని ఒక్క సారైనా పూర్తిగా చదివే ఉంటారు.
   ఇన్ని తప్పులున్న రచనను తిరిగి రచయితకు పంపించి మరొకసారి చదివి, సవరించి పంపించండి అని చెప్పుంటే బాగుండేదేమో.

 16. గంగాధర్ వీర్ల says:

  మెర్సీగారు.. సున్నితమైన విషయాన్ని చకచకా చెప్పడం బావుంది. మత మార్పుల రహస్య చేధనని పాఠకులకే వదిలేశారు. ఎందుకంటే.. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇబ్బందులూ ఉంటాయి. చిన్నకథ అని చెప్పినా.. నిడివి పెద్ద కథనే తలపించింది. చంద్రునితో కాపీ పంచుకోవడం.. వంటి వర్ణనాత్మక విషయాలు రక్తికట్టాయి. గుడ్ కీపిట్ అప్

 17. వచ్చావు కదా ! :)

మీ మాటలు

*