అదే కథ ఇక్కడా!!

photo: satya sufi

photo: satya sufi

 

శరీరాలు సముద్రాలు దాటినా మనో కాలుష్యం మనల్ని దాటిపోదు. నరనరాన జీర్ణించుకున్న స్ర్తీ వ్యతిరేకత, హిప్పోక్రసీ ఏ కొత్త విషయాన్ని ఏ ప్రోగ్రెసివ్‌ విషయాన్ని మనలో ఇంకనివ్వవు.

ల్యాండ్ ఆఫ్‌ ఆపర్చునుటీస్‌ అనుకుని అమెరికాకు పయనమైన వారిలో కొంతమంది(కొంతమందేమిటిలే,  చాలామందే) ఇక్కడ ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కిందటి కాలంలో ముట్టు మడీ ఆచారాలతో ఆఫీసుల్లోనూ అదరగొట్టే వాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ సారి పిల్లలు-పెంపకాల్లో వారి ప్రతాపం ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం. ఎన్‌ ఆర్‌ ఐలందరూ ఇలా ఉన్నారని చెప్పబోవడం లేదు. నేను పదిహేన్నేళ్ల పైగా ఇక్కడే ఉంటున్న ఎన్ఆర్ఐనే. కాకపోతే  తెలుగే అధికారభాషేమో అన్నంతగా అడుగడుగునా మన స్వరం వినిపించే కాలిఫోర్నియాలో ఉండడం వల్ల అనుభవాలు అనేకం తారసపడుతుంటాయి. అద్దాల భవంతి లాంటి అమెరికా జీవితం వెనుక ఉన్న చీకటి కోణాల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను.

అమెరికా గడ్డమీద అడుగుపెట్టగానే చాలామంది తొందరపడే విషయాలు రెండు. మొదటిది అర్జెంటుగా గ్రీన్‌ కార్డు తెచ్చేసుకోవాలి. రెండు యమార్జంటుగా పిల్లల్ని కనేసి సిటిజెన్‌ షిప్‌ తెచ్చేసుకోవాలి.

మనం ఎంత తొందరపడినా మొదటిది మన చేతుల్లో ఉండే విషయం కాదు. దాని టైం అది తీసుకుంటుంది. రెండోది కూడా పాక్షికంగా మాత్రమే మన చేతుల్లో ఉన్నది. ఒక శుభముహూర్తాన ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అవుతుంది. అక్కడినుంచి హడావుడి మొదలు. మరీ పాత సినిమాల్లో మాదిరి ఎత్తుకుని గిరగిరా తిప్పకపోవచ్చేమో కానీ ఇక్కడ భారత్‌లో కంటే ఎక్కువ హడావుడి అయితే ఉంటుంది. పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అనేది మొదటిది. భారత్‌లో ఐనా అబ్బాయికి అమ్మాయికి మధ్య మధ్యతరగతి వ్యత్యాసం చూపించడం తగ్గిపోతున్నదని అక్కడి మిత్రులు చెపుతున్నారు.

కానీ ఇక్కడ ఇంకా తీవ్రంగానే కొనసాగుతోంది. ఇక్కడ లింగనిర్ధారణ పరీక్షలు నిషేధమేమీ కాదు కాబట్టి తెలుసుకున్నప్పటి నుంచి ఒకటే రంథి. మొగబిడ్డే బిడ్డ. ఆడపిల్ల అయితే మూతి ముడుపులు కనిపిస్తూనే ఉంటాయి. వర్జీనియాలో ఉన్నపుడు ఒక కాబోయే తల్లి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి హిస్టీరియా వచ్చినట్టు గుండెలు బాదుకుంటూ ఏడవడం చూసి నవ్వాలో ఏడవాలో తెలీక చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖంలో కోపం కనిపించకుండా ఉండడానికి బూతులు తిట్టకుండా నిగ్రహించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండియాలో సైంటిస్ట్‌గా పనిచేసిన పెద్దాయన తన కూతురు కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి కళ్లమ్మట నీళ్లు పెట్టుకోవడం చూసినపుడైతే అరేయ్‌ నీకు సైన్స్‌ డిగ్రీ ఇచ్చిన గాడిద కొడుకెవర్రా అని అడగాలనిపించేంత కోపమొచ్చేసింది. కొంతమంది ఆడవాళ్లు అయితే ఇంకో రకమైన భయాలు చెప్పేస్తారు కూడా భోళాగా. అమ్మాయి ఇక్కడ ఏ తెల్లోణ్ణో డేటింగ్‌ చేస్తే ఎలా! ఇనుపకచ్చడాలు తయారుచేయవే తల్లీ అని కచ్చగా అనాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం! అబ్బాయి అయితే ఏం చేసినా ఎలా తిరిగినా పర్లే అన్నమాట!

ఇంతకంటే దారుణమైన అసహ్యకరమైన ప్రక్రియ ఉంది. మనం అసహ్యం అంటున్నాం కానీ దాన్ని వాళ్లు విశ్వాసం అనే అనుకోవచ్చు. ముహూర్తాలు పెట్టుకుని పిల్లల్ని కనడం. ఈ విషయంలో కొంత మంది మరీ పట్టుదలగా ప్రాణాలు పోయినా పర్లేదు అన్నంత నిబద్ధంగా ఉంటారు.

బిటెక్‌ కంప్యూటర్స్ చేసి ఇక్కడికొచ్చిన ఒక అమ్మాయి కథ వింటే మీకే తెలుస్తుంది వారి నిబద్దత విలువ. ఆ అమ్మాయికి నొప్పులొస్తే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ లోపు అమ్మలక్కల ద్వారా ముహూర్తాలు వగైరా తెలుసుకున్నారు. ఇంకా టైముంది ఇపుడే కనకూడదు అని ఆ అమ్మాయి కఠినాతికఠినంగా భీష్మ ప్రతిజ్ఞ చేసేసుకుంది. అంత నొప్పిలోనూ కాళ్లు దగ్గరపెట్టి  బిడ్డ బయటకు రాకుండా కొన్ని నిమిషాల పాటు ఆపడానికి విశ్వప్రయత్నం చేసింది. నమ్మశక్యం కానీ విషయమే. కానీ ఇది స్వయంగా ఆ అమ్మాయి గర్వంగా వినిపించిన కథ.

బిడ్డ సరైన సమయంలో భూమి మీదకు వస్తే ఆతని భవిష్యత్తు బంగారంలా ఉంటుందని భావించి ఒక తల్లి పడ్డ వేదన అన్నమాట! ఓహ్‌! అమాయక డాక్టర్లకు మొదట ఏమవుతుందో అర్థం కాక చివరకు ఏదో అర్థమై నానా తిట్టూ తిట్టి ఏదో రకంగా ఆలస్యంగానైనా బిడ్డను బయటకు తీశారనుకోండి. ఈ ఆలస్యం ఫలితం ఏమిటనుకున్నారు. బిడ్డను అలా బలవంతంగా కాసేపైనా ఆపితే ఏమవుతుంది?  బిడ్డకు ఆక్సిజన్ అందాల్సినంత అందక ఎదుగుదల లోపాలు ఏర్పడ్డాయి. ఇంకేవో సైంటిఫిక్‌ పరిభాషలో ఉండే సంక్లిష్ట సమస్యలు. వాడు అందరిలా పిలిస్తే పలకడు. అందరితో కలిసి ఆడుకోడు. నాలుగేళ్లు దాటినా మాటలు రాలేదు. ఆ తల్లి త్యాగం ఆ బిడ్డకు అంత బంగారు భవిష్యత్తునిచ్చింది మరి! ఇక్కడ కథలో ఇంకో ట్విస్టు ఉంది. ఇంత జరిగినా ఆ తల్లిలో మార్పేమీ లేదు. వాడికేం మగపిల్లాడు, మాటలదేముంది కాస్త ఆలస్యంగా వస్తాయి, డాక్టర్లు చెపుతున్నారుగా కాస్త ఆలస్యంగానైనా వస్తాయని పర్లే, మగపిల్లాడేకదా అని మగజపం ఒకటికి వందమార్లు చేసేది.

అసలు విషయానికి వస్తే అదే తల్లి రెండో సారి గర్భవతి అయ్యింది. ఈ సారి రివర్స్‌. డెలివరీ డేట్‌ అమావాస్య అయ్యేట్టు ఉందని తెలిసి నొప్పులు రాకపోయినా ముందుగానే ముహూర్తం పెట్టుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి నొప్పులు నటించడం వాళ్లు ఇవి లేబర్‌ పెయిన్స్‌ కాదమ్మా అని చెప్పి పంపించడం, ఎలాగోలా ఇపుడు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయండి డాక్టర్ అని వాళ్లతో అంటే ఈమెకేమిటి పిచ్చా అని వారు తిట్టి పంపించడం ఇదో ప్రహసనం.

ఇంకో అంకం ఉంది. పిల్లలు పుట్టాక తమ తల్లిదండ్రుల మీద అమాంతం ప్రేమ పెరిగిపోతుంది. అంతకుముందు స్కైప్‌లో మాత్రమే చూసి మాట్లాడి తరించే తల్లిదండ్రులను ముఖ్యంగా తల్లిని(తండ్రి అంత ముఖ్యం కాదు) దగ్గరగా చూడాలనిపిస్తుంది. అమెరికా చూపించాలనిపిస్తుంది. అమెరికాలో బేబీ సిట్టర్స్‌ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఖర్చు ఎక్కువ. మనం ప్రతినెలా జీతంలో ఎక్కువభాగం మిగుల్చుకోవాలి. అక్కడ మన గడ్డమీద నేల కొనేయాలి కదా! తల్లికి  సమన్లు పంపిస్తాం అత్యంత ప్రేమగా.  వాళ్లకు వేరే ఆప్షన్‌ ఏముంది కనుక. అదే పదివేలు అనుకుని వచ్చేస్తారు. మనుమడో మనుమరాలో అంటే చూడాలని ఉంటుంది కదా!

ఆ రకంగా బేబీ సిట్టర్ని ఫ్రీగా ఏర్పాటు చేసుకుంటాం. వాళ్లు ఇక్కడ ఎక్కువ కాలం ఉండే పరిస్థితి లేకపోతే ఏకంగా బిడ్డల్ని వాళ్లతో పంపించేస్తాం. రోజూ స్కైప్‌లో పాలు తాగాడా, విరోచనాలయ్యాయా, జలుబు చేసిందా, అని ఇక్కడినుంచి అడుగుతూ ఉంటాం. ఎవరైనా బేబీ సంగతేంటి అని అడిగితే చాలు రెండు కళ్లల్లోంచి జలపాతాలే. పిల్లల్ని ఎంత మిస్ అవుతున్నారో వైనవైనాలుగా వర్ణించి చెప్పడమే. ఎవరుంచుకోవద్దన్నారు.ఎవరి ఆశ. ఎవరి అత్యాశ? మిమ్మల్ని కూడా అలాగే మీ తల్లిదండ్రులు మిస్ అవుతుంటారు కదా, బేబీ సిట్టింగ్‌ కోసం కాకుండా మామూలుగా కూడా పిలవొచ్చు కదా, వెళ్లి చూసి రావచ్చు కదా!

ఇలాంటి అనుభవాలు అనేకం చూసి చూసి ఇండియాలో సాధారణమైన టీచర్‌ ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఫ్రెండ్ని అడిగాను. నీకు ఒకతే ఆడపిల్ల కదా, మగపిల్లాడు లేడని చిన్నతనంగా ఫీల్‌ అవుతున్నావా అని? నువ్వు ఇంత చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఇంత వెనుకబాటు తనం ఏమిటి అని మర ఫిరంగి లాగా మండిపడింది.

ఇక్కడ కబుర్లు చెపితే భారత్‌ మధ్యతరగతి ఈ మధ్య బాగానే ఎదుగుతోందని ఇంత అన్యాయమైన వ్యవహారాలు తక్కువే చూస్తున్నామని చెప్పింది. ఇండియానుంచి వచ్చేపుడు ప్రియా పచ్చళ్లతో పాటు మెదడులో ఇంత ఇక్కడి మట్టి పెట్టుకుని పోయినట్టున్నారు. దాన్ని ఎరువేసి పెంచుకుంటున్నారు. ఇక్కడ మట్టి తగ్గిపోతోంది కానీ అక్కడ పెరిగిపోతున్నట్టుందే, మరీ ఇంత ఘోరమైన విషయాలు ఇపుడు ఇక్కడ వినిపించడం లేదు అనేసింది. అదన్నమాట!

ఏవో పరీక్షలు అవీ రాస్తే మంచి జీతం రావచ్చు. కావాలనుకున్న దేశంలో ఉద్యోగమూ రావచ్చు. కానీ ఆరోగ్యకరమైన మంచి జీవితం గడపడానికి పరీక్షలు లేవు. ఎవరు నేర్పిస్తారు? ఆధునికత అంటే చేతికి బ్రాస్‌లెట్లు, చేతిలో లేటెస్ట్‌ ఐఫోన్లు కాదుకదా!

 

*

 

 

మీ మాటలు

 1. దేవరకొండ says:

  కుందుర్తి ఒక కవితలో, “నగరంలో నివసించే కొండజాతి ప్రజలు” అని అప్పట్లో అనగలిగాడు. కొండ జాతి ప్రజలు నగర ప్రజలకంటే ఎంతో స్వచ్ఛంగా బతుకుతుంటే వాళ్ళ బతుకుల్ని వాళ్ళు బతకనివ్వకుండా రాజ్యం దన్నుతో దున్నపోతుల్లాంటి దోపిడీదారులు (నీచోపమకి దున్నపోతులు నన్ను క్షమించాలని కోరుతున్నాను) వాళ్ళ భూముల్ని ఆక్రమించుకొని, వాళ్ళ సహజ వనరుల్ని, వాళ్ళని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్నిరకాలుగా దోచుకుంటూ వారికి ‘నాగరికత’ నేర్పిస్తున్నారు! ‘మీకు బట్ట కట్టుకోవడం రాక ముందే మేము కావ్యాలు రాశామని’ చెప్పుకుంటూ మనకే సరిగా తెలియని మన ఘన చరిత్రను ఊహించుకుని గర్వించి అమెరికాలో కాలు పెట్టి మనం వెలగ బెడుతున్న నాగరికత ఇది! అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ‘మనవాళ్ళు’ భ్రూణ హత్యలకు పాల్పడటంలేదు కాబోలు! వీళ్ళను చూసి ఇదే ఇండియా అనే అపప్రధ, అప్రతిష్ట కలగనీకుండా ఆపే ప్రయత్నం చేస్తున్న సునంద గారు ఇటువంటి వ్యాసాల్ని అనువదించి అక్కడి సమాజానికి అందేలా చేసేందుకు గట్టిగా కృషి చేయగలరు.

  • ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. మనకన్నా నాగరికత ఎవరికుంది అనుకునే వాలు ఉన్నంత వరకు ఇలాంటివి తారసపడుతూనే ఉంటాయి. మనిషి స్వభావానికి అతని చదువుకు సంబంధమే లేదు కదా.

 2. P V Vijay Kumar says:

  వాహ్ … మంచి ఎక్స్ ప్రెషన్….మంచి ఫ్లో….టైమ్లీ సఁర్కాజం…..ఒషిన్….కీప్ అప్ ది గుడ్ వర్క్…..

 3. గుడ్ one

 4. కన్నెగంంటి అనసూయ says:

  నిజంంగానంండి. అక్కడ కడుపు మాడ్చుకుని ఇక్కడికి పంంపే డబ్బుల్తో నేలముక్కలు కొనేసి దళ్ళు కట్టేసి కబ్జాకోరుల కళ్ళబడకుంండా నానా అగచాట్లూ తంండ్రులు పడుతుంంటే తల్లుల కష్టాలు మరోలా ఉంంటున్నాయ్ . ఆర్నెల్లకోసారి ఫ్లైైటెక్కటానికి రెంండ్నెల్ల ముంందు నుంంచే బజార్లట్టుకు తిరగటంం, ఘడియఘడియకీ అదట్టుకురా ఇదట్టుకురా అని అక్కడ్నింంచి ఆర్డర్లు ఇక్కడ పడుతూ లేస్తూ వీళ్ళ రోడ్ల కోలతలూ..వచ్చాకా మళ్ళీ రెణ్ణెల్లు ఇల్లు బాగులు. వెళ్ళేముంందు సర్దుళ్ళూ తాళాలూ..నిజంం చెప్పద్దూ రానని చెప్పలేక వెళ్ళటంంగానీ ఒక తల్లయితే వీకెంండ్ వస్తుంందంంటే పార్టీలకీ పబ్బాలకీ వంండలేక చస్తున్నానని ఒకటే ఏడుపు..
  ఇలా వెళ్ళే వాళ్ళంంతా మీరన్నట్టు జీతంం లేని పనాళ్ళ లెక్కనుకోంండి. ఆది వాళ్ళమాటే. నా మాటకాదు.
  బాగా వ్రాసారు.

  • కన్నెగంటి అనసూయ గారు,

   నిజమేనండి, వయసు పైబడ్డ తల్లి తండ్రులకు మనం చెయ్యక పోయిన పర్వాలేదు కానీ వారిని ఇంకా ఇబ్బంది పెట్టటం భావ్యం కాదు. వీకెండ్ వండడం చాల మంది తల్లులకు ఒక nightmare.

 5. satyanarayana says:

  రంగ నాయకమ్మ గారి ” కళ్ళు తెరిచినసీత ” లో ఇంకెన్ని జబ్బులు కనిపించాయో!
  మీరు చాలా తక్కువే చెప్పారు .
  No amount of learning can cure stupidity and formal learning positively fortifies it ———-Stephan Vizinczey.

  వీలు చేసుకుని ఇతర వైపరీత్యాలు విశదీకరించండి .

  • సత్యనారాయణ గారు,

   తప్పకుండా రాస్తాను . థాంక్ యు.

 6. rani siva sankara sarma says:

  చాలా మంచి వ్యాసం.నిజానికి ఆధునికత పెరిగేకొద్దీ మూఢవిశ్వాసాలకి కూడా అవకాశం పెరుగుతుండడం విడ్డురం. నిజానికి జ్యోతిష్యం , ముహుర్తాలు వంటివాటికి గతంలో కంటే యిప్పుడే గిరాకీ పెరిగింది.

 7. అమెరికా ప్రవాసులని ఇంత generalize చేసి ఇంత పెద్ద వ్యాసాలు వ్రాయటం అస్సలు బాలేదండి..ఇటువంటి వాక్యాలు …. ‘ పిల్లలు పుట్టాక తమ తల్లిదండ్రుల మీద అమాంతం ప్రేమ పెరిగిపోతుంది’ .. ‘ఫ్యాంటు, చొక్కా, చెవులకు జుంకీలు , మెళ్లో నల్లపూసలు , నుదుటన ఇంత పెద్దబొట్టు, దాన్ని డామినేట్‌ చేస్తూ దేవుని కుంకుమ’ , ‘తెలుగు సీరియల్స్ లో లాగా అమ్మలక్కల కబుర్లు మొదలెడతారు’ , ముఖ్యం గా ఈ వాక్యం కొంచం చికాకు పరిచింది …. ‘ఎవరుంచుకోవద్దన్నారు.ఎవరి ఆశ. ఎవరి అత్యాశ?’ …… ఇటువంటి వారిని సమర్థించను కానీ, ఉద్యోగం చేయకపోతే సాధించే భర్తలు ఉన్నారు. పిల్లల్ని మాకిస్తే పెంచి పంపిస్తాం అంటూ సాధించే అత్తమామలు ఉన్నారు. ఒక్కసారి ఉద్యోగం మానివేస్తే పోయిన అనుభవం ఎక్కడనుంచి వస్తుంది? ఇద్దరు సంపాదించడం చాలా ముఖ్యం అమెరికా లో. అత్యాశ కోసం కాదు. ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందో తెలీదు. దర్జా గా ఉన్న జీవితాలు పేకముక్కల్లా కూలిపోతాయి. భర్త కాన్సర్ వచ్చి ఉద్యోగం కోల్పోతే, భార్య ఉద్యోగం కాపాడిన కేసులు ఎన్నో చూస్తున్నాము. ఇలా generalize చేయటం బాలేదు.
  నాకు తెల్సిన పాకిస్తాన్ ఆవిడ అమెరికా లో పుట్టి పెరిగింది. ఆవిడని నేను కలిసినప్పటికే కాలేజికి వెళ్లే వయసున్న పిల్లలున్నారు. ప్రతి శుక్రవారం నమాజ్ అని ఒక రూమ్ లో చేసుకుని వస్తుంది. చక్కటి హిందీ లో సమాధానం ఇచ్చేది. పండగ ఏదైనా వస్తే బిర్యానీ తెచ్చి పెట్టేది. అందరూ లొట్టలు వేసుకు తినేవాళ్లు. ఆవిడని ఈ విధం గా దుయ్యబట్టాలని ఆలోచనే ఏ రోజూ రాలేదు. పై పెచ్చు చాలా మెచ్చుకోవాలన్పించేది. మీరు చెప్పిన విషయాలు నిజమే కావచ్చు.. చాదస్తం తో చేసే పనులు చాలా విసుగు కలిగిస్తాయి. ఒప్పుకుంటాను. కానీ అవతల వారు చేసిన తప్పు కన్నా మీకు వారు వేసుకున్న దుస్తులు దగ్గర నుంచి ప్రతిదీ తప్పు లా కన్పించడం. ఆ విషయాన్నీ మీరు వ్యాసం లో పేర్కొనడం అంత కంటే తప్పులా కన్పిస్తోంది నాకు. చెప్పే విషయం బావున్నా వ్రాసే విధానం మార్చుకోమని నా సలహా!!

  • ప్రవాసులు అందరు ఇలాగె ఉంటారు అని నేను చెప్పటం లేదు, అలాగే మీకు చికాకు అనిపించినా వాక్యం రాయటం అవసరం అనిపించింది ఎందుకంటే ఆలా డ్రెస్ చేసుకొని వాళ్ళను అగౌరవం గా చూడటం నేను చూసాను.
   ఇక ఎవరిని దుయ్యబడదామా అనే ఆలోచన నాకైతే లేదు, కాయిన్ కి రెండు ముఖాలు లు ఉన్నట్టే ప్రవాసుల కొంతమంది ఎంత చదువుకున్న ఇలా కూడా ఉంటారు అని చెప్పాను అంతే కానీ అందరు ఇలాగె ఉంటారు అని చెప్పటం లేదు.
   మీరు చూపిన పాకిస్తాన్ ఆవిడ ఉదాహరణ నేను వ్రాసిన ఆర్టికల్ కి ఎలా సంబంధమో అర్ధం కాలేదు.

   • సునంద గారు !! మీ ముందు వ్యాసానికి కూడా కలిపి ఇదే వ్యాఖ్య లో పెట్టేసాను. మీరు ‘పులిహోర ‘ బ్యాచ్ గురించి చెప్పారు కదా. అందుకే పాకిస్తాన్ ఆవిడ ఉదాహరణ చెప్పవలసి వచ్చింది. మీరు సంబంధం లేని విషయాలు ఛాలా వ్రాసారు మీ రెండు వ్యాసాలలో . మీరే చూసుకోండి. ‘ఆలా డ్రెస్ చేసుకొని వాళ్ళను అగౌరవం గా చూడటం నేను చూసాను’ – నేనూ అదే చెప్పాను మీకు వారు చేసిన ఒక తప్పుకి అది కూడా తప్పులా కన్పించింది అని. చేసే ప్రాజెక్ట్ కి బడ్జెట్ ఉండి,మనుషుల అవసరం ఉంటే వాళ్ళు చెప్పిన పని చేస్తే ఎలా తయారై వచ్చాము అనేది ఎవరికీ అవసరం లేదు. దాని గురించి వ్యాసం పేర్కొనటం బాలేదు. ఆరి సీతారామయ్య గారు చెప్పినట్లు మీరు ఎవరి గురించి అయితే వ్రాసారో వారు ఇక్కడి ప్రపంచం తో కలవట్లేదు. కాబట్టి ఇది మొత్తం కాలిఫోర్నియా NRI ల గురించి మాత్రం కాదు. మీరే ఒక్కసారి చూసుకోండి . చాలా generalize చేసారు మీరు. నాకైతే అమెరికా లో ఉండే NRI ల ని చాలా కించపరుస్తూ మనోభావాలు దెబ్బ తీస్తున్నట్లే ఉంది.

 8. ari sitaramayya says:

  “శరీరాలు సముద్రాలు దాటినా మనో కాలుష్యం మనల్ని దాటిపోదు.”

  “ఎన్‌ ఆర్‌ ఐలందరూ ఇలా ఉన్నారని చెప్పబోవడం లేదు. నేను పదిహేన్నేళ్ల పైగా ఇక్కడే ఉంటున్న ఎన్ఆర్ఐనే.”

  “కాకపోతే తెలుగే అధికారభాషేమో అన్నంతగా అడుగడుగునా మన స్వరం వినిపించే కాలిఫోర్నియాలో ఉండడం వల్ల అనుభవాలు అనేకం తారసపడుతుంటాయి.”

  సునంద గారు,
  నేను నలభై రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. మీరు రాస్తున్న ఎన్నారైలు నా పరిచయస్తుల్లో లేరు. నాకు ఉద్యోగరీత్యా సాధారణ అమెరికా ప్రజలతో సంబంధం ఉంటుంది. తెలుగు మిత్రులతో కలిసే అవకాశం ఎదో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దొరుకుతుంది. ‘తెలుగే అధికార భాషేమో’ అనిపించే సర్కిల్ మీది. ఆ ప్రత్యేకమైన గ్రూప్ గురించి మాత్రమే రాస్తున్నారు మీరు, ఎన్నారైల గురించి కాదు. మీరు ఎవరిగురించి రాస్తున్నారో వారు అమెరికాలోనే ఉంటున్నా నిజజీవితంలో వారికి అమెరికాతో ఎలాంటి సంబంధం లేదు.

  “శరీరాలు సముద్రాలు దాటినా మనో కాలుష్యం మనల్ని దాటిపోదు.” అనడంలో కాలుష్యం అక్కడినుంచే వస్తుందనీ, ఇక్కడ దాన్ని వదిలించుకోవచ్చు అనే అభిప్రాయం వినబడుతుంది. అలా వదిలించుకోవడం జరగాలంటే ఇక్కడి ప్రపంచంతో సంబంధం ఉండాలి కదా? మీరు ఎవరిగురించి రాస్తున్నారో వారికి అలాంటి అవకాశం లేదు.

  • ఆరి సీతారామయ్య గారు,

   ‘తెలుగే అధికార భాషేమో’ అనిపించే సర్కిల్ మీది. నా సర్కిల్ ఇదే అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు చెప్పే ప్రత్యేకమైన గ్రూప్ కూడా అమెరికాలోనే ఉన్నారు కాబట్టి వారిని ఎన్నారైలు అనొచ్చు అనుకుంటున్నాను. మీ పరిచయస్తుల్లో లేరు కాబట్టి ఎవరూ ఇలా వుండరు అనుకుంటున్నారా?

   • ari sitaramayya says:

    ‘తెలుగే అధికార భాషేమో’ అనిపించే సర్కిల్ మీది. నా సర్కిల్ ఇదే అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు?

    మీ మాటల ఆధారంగానే. “కాకపోతే తెలుగే అధికారభాషేమో అన్నంతగా అడుగడుగునా మన స్వరం వినిపించే కాలిఫోర్నియాలో ఉండడం వల్ల అనుభవాలు అనేకం తారసపడుతుంటాయి.” అని మీరే రాశారు. కాలిఫోర్నియా జనాభాలో Indian – American లు 1.4%. వారిలో సగం మంది తెలుగు వారు అనుకున్నా వారి సంఖ్య 1000 మందిలో 7 గురు మాత్రమే. ‘తెలుగే అధికారభాషేమో అన్నంతగా అడుగడుగునా మన స్వరం వినిపించే కాలిఫోర్నియాలో’ అనేది మీ అనుభం అయితే మీది ఏ సర్కిలో తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించనవసరం లేదు.

 9. అజిత్ కుమార్ says:

  పాపం. అలాంటి వారి విషయంలో సానుభూతి చూపండి.

  • అజిత్ కుమార్ గారు,
   ఇటువంటి వారు సానుభూతి కూడా అర్హులు కారు. పదే పదే అయ్యో నీకు ఇద్దరు ఆడపిల్లలేనా అని జాలి చూపిస్తుంటే ఎలా ఉంటుంది. మనకు జీవితం లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఇంకా తెచ్చి పెట్టుకునేవి ఎందుకండీ.

 10. nageswara Rao says:

  సీతారామయ్య గారి గణాంకాల విషయంలో రచయిత్రి జవాబు కోసం చూస్తున్నాం.. అంత మంది కాలిఫోర్నియాలో ఉన్నారా అని నాకు నిజంగానే సందేహం కలిగింది..

 11. ఆరి సీతారామయ్య గారు,

  మీరు చెప్పిన గణాంకాల నేను కాదని చెప్పటం లేదు, మీరు చెప్పిన ఆ 1.4% లో కూడా మెజారిటీ ముఖ్యంగా సిలికాన్ వాలీ లో వర్కప్లేసెస్ లో కనిపిస్తారు. తెలుగు వినపడని ఆఫీసులు నేనైతే చూడలేదు.
  ఇక నా సర్కిల్ గురించి ఆఫీస్ లో తప్పదు కాబట్టి ఇటువంటి వారిని భరిస్తాను కానీ , ఆఫీస్ బయట కూడా వీరిని భరించే ధైర్యం నాకైతే లేదు.

 12. మానవ సంబంధాలన్నీ అవసర ప్రాతిపదికమీద ఏర్పడ్డవే.
  ఆనిజాన్ని ఒప్పుకోడం నిస్సిగ్గుకాదు.ఇంతమందిని తీరులన్ని ఒకటే ఏజాతి చరిత్రచూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే,ఆడవారు వీధుల్లోకి రానంతవరకు కుంటుతూనో గుడ్డుతూనో నడచిన ఉమ్మడి కుటుంబాలు ఆడవారు చదువుటతో పెళ్లవగానే వేరింటికాపరాలకి దారితీసి, భార్యాభర్త లిరువురు ఉద్యోగులవగానే మళ్ళి పెద్దల అవసరం పిన్నలకి కలిగింది.
  ఇదంతా ఆడవారిచేతకాదు అందునిండా మగవాడి స్వార్ధముంది
  ఈచిన్నవిషయాలకి పెద్ద రాతలనవవసరం.అందరం స్వార్థజీవులమే,
  మనం స్వార్ధ జీవులం కానట్టు నటిస్తామంతే.
  శ్రీమతి సునందగారు ఎత్తిచూపిన కొన్ని లక్షణాలకి తమ తమ ఐడెంటిటీ కాపాడుకొని చూసే ప్రయత్నం కూడా తోడవుతుంది.
  రాసేవారందరూ ప్రతి ప్రవర్తన పూర్వాపరాలు గూర్చి ఆలోచించి రాస్తే రాసింది పరిపూర్ణముగా ఉంటుంది .

  • జి బి శాస్త్రి గారు,

   మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 13. ఆంధ్రులు ఈ ప్రవాసాంధ్రులును చూసి తృప్తి పడాలి. చదువుకున్న మెకానిక్ ల కంటే మేము ఎంతో ముందున్నాము అని .
  ఎక్సలెంట్ సునంద గారు. ఎందుకైనా మంచిది కాస్త జాగర్తగా ఉండండి. మీరు ఇలా రాసినందుకు………!

 14. తిరుపాల్ గారు,

  చదువుకొని వాళ్లు వెనుకబడి ఉన్నారని అనుకోకండి, జీవితం లో అందరికి బాగా చదువుకోవాలని పైకి రావాలని ఉంటుంది, పరిస్థితుల దృష్ట్యా అందరికి సాధ్యం కాదు అంతే. అమెరికాలో ఉన్నత మాత్రాన గొప్పమీ కాదు, ఇండియాలో ఉన్నంత మాత్రాన వెనకబడి నట్టు కాదు.

 15. Shanti Prabodha says:

  అభినందనలు సునంద గారు .. అవసరమైన అంశంపై రాసి చర్చ లేవదీసినందుకు .
  సునందగారు రాసిన భాషలో కొన్ని విశేషణాలున్నాయేమో తెలీదు కానీ విషయం మాత్రం సూటిగా స్పష్టంగా ఉన్నదే చెప్పారనిపించింది . ఆవిడ ఎంత బాధపడితే ఇలా స్పందించి ఉంటారో కదా అనిపించింది. అమెరికాలో ఉండి ముహూర్తం చూసుకుని డెలివరీ అయినవాళ్ళు ఎంతో మంది నా ఎరుకలో ఉన్నారు. అదే విధంగా లింగ వివక్ష చూపుతున్న పెద్దమనుషులు తెలుసు. అమెరికాలో ఎన్నో చుసిన అనుభవంతో సునందగారు తన భావాల్ని పంచుకొన్నారేమో .
  నేను అమెరికాలో లేను. కానీ అమెరికాలో ఉన్న బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పే వాళ్ళ విషయాలు వింటూనే వున్నాను. వాళ్ళని చూస్తూనే వున్నాను. సంపాదనతో వచ్చిన దర్పం, అతిశయం చూపిస్తుంటే ఏమోలే అనుకున్నా.. కానీ మాతృదేశాన్ని వదిలిన తర్వాత వాళ్లలో పాదుకున్న మూఢనమ్మకాలు విశ్వాసాలు చూసి నివ్వెరపోతున్నాను . మాతృదేశానికి దూరంగా ఉన్నాం మన సంస్కృతీ సాంప్రదాయాలు కాపాడుకోవాలనే తపనతోనో , భక్తివిశ్వాసాల ముసుగులోనో ఉన్న మనవాళ్ళు నేర్చుకున్న సైన్స్ & టెక్నాలజీ వాళ్ళని ఎటు తీసుకుపోతోండి డాలర్ల పంట పండించడం వరకేనా .. జీవితానికి అన్వయించుకోవడానికి కాదా అని చాలా సార్లు నాలో నేనే ప్రశ్నించుకున్నాను. నేను పడుతున్నటువంటి ఆవేదనని సునందగారిలో నేను చూశాను.

 16. శాంతి ప్రభోద గారు,

  మనవాళ్ళు నేర్చుకున్న సైన్స్ & టెక్నాలజీ కేవలం డాలర్ల పంట పండించడం వరకే, అందులో ఎటువంటి అనుమానమూ లేదు.

 17. ఐ మధ్య చదివిన రాతల్లోకెల్లా పదునైన, నిర్దాక్షిణ్య సర్జికల్ స్ట్రైక్! ఏమాత్రం ఆవేశాన్ని ప్రదర్శించకుండా , భాషలో పరుషత్వాన్ని ప్రదర్శించకుండా చక్కగా , పద్దతిగా చేసిన కేన్సర్ ఆపరేషన్! రచయిత్రికి అభినందనలు! ఇంకా ఇంకా రాయండి. ఐ కోణంలో చాలా రాతలు రావాల్సి ఉంది. ఎన్నారై స్థానాన్ని పొందాం కాబట్టి విమర్శలకు అతీతులం అన్నంతగా విల్లు ప్రవర్తించడం చూస్తూ ఉంటే చాలా సార్లు నవ్వొస్తుంది. విదేశాల్లో ఉంటూ అక్కడ కూడా ఇక్కడి కుల, మాట , ప్రాంతీయ, భాషా వైషమ్యాలను నిక్కచచ్చిగా పాటిస్తూ కక్షలనే కొత్త కొత్త కూటమిలుగా ఏర్పాటు చేసుకుంటూ, వెకిలి సంస్కృతిని పరిరక్షింస్తున్నాం అని ముసుగులేసుకు తిరిగే కొంతమందిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇంకా రాయండి. దేన్నీ వదలొద్దు. ప్రక్షాళన జరగాలసిందే… ఇంటా బయటా!!!

మీ మాటలు

*