మోనోలాగ్!

 

damayanti

 

నాకతని గురించేమీ తెలీనప్పుడు అతను చాలా మావూలు మనిషి అయివుండొచ్చు.

కానీ, నిన్న ఇతని గురించి చదివాక, విన్నాక,  ఇతన్ని విభేదిస్తున్న  వారినందరనీ చూసాక, – అనిపించింది. కాదు. చాలా బలమైన ఆలోచన కలిగింది. నేనెలాగైనా సరే   వెళ్ళి  అతన్ని వ్యక్తిగతం గా  కలవాలని.  ఎందుకంటే, ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడని ఆ పాత్ర  నాతో మాత్రం మాట్లాడతాడు అని కాదు. నే మాట్లాడేది అతను వింటే చాలని. అంతే.

– నెరవేరుతుందా లేదా అన్నది సందేహమే. ఎందుకంటే –  అది చిన్న ఆశ కాదు కాబట్టి.

ఎలా అయితేనేం, చిరునామా పట్టుకోగలిగాను. వెంటనే బయల్దేరి వెళ్ళాను.

సిటీకి దూరం గా వున్న కాలనీ అది. అక్కడ అధిక శాతం నివసించేది ముస్లిం ప్రజలే.  నే వెతుకుతున్న వీధి దొరికింది. నా నోట్లో నానుతున్న క్వార్టర్  నెంబర్నొకసారి సరి చూసుకున్నాను. . ‘ఆ! ఇదే ఇల్లు.’  అనుకుని ఆగాను, ఆ ఇంటి ముందు.

తలుపుకి  తాళం వేసి బయటకెళ్తున్న ఆ ఇల్లాలిని కంగారుగా  అడిగాను నాకొచ్చిన కొద్దిపాటి హిందీలో.. “ ఇక్కడ ఫైజు అని జర్నలిస్ట్..”నేనడగడం ఇంకా పూర్తి కాకుండానే, కనుబొమలు ముడిచి, చూపుడు వేలితో పైకి చూపించింది.  మేడ మీదకెళ్ళమన్నట్టు. ‘మూగదానిలా.. సైగలేమిటో!’ అనుకుంటూ వెంటనే  మెట్లెక్కుతూ నవ్వుకున్నా. ఫైజు ఎక్కువగా మాట్లాడే మనిషి కాడు. అతడొక నడిచే ఆలోచన.  తలవంచుకుని వెళ్ళిపోతుంటాడు. కారెక్టర్ అలాంటిది. అందుకనే కాబోలు  ఈవిడ ఇలా సైగ చేసి చెప్పింది. ఒకవేళ ఫైజు సంగీత కళాకారుడైతే, ఆరునొక్క రాగం తీసి వినిపించేదా? నే వేసుకున్న జోక్ కి నాకే నవ్వొచ్చింది. కానీ, పైకి బిగ్గరగా నవ్వలేదు, బావుండదనీ!

మెట్లు ఆగిపోయాయి. ఆఖరి పై మెట్టుకి  ఎదురుగా –  తలుపులు తెరిచి వున్న గది కనిపించింది. లోపల కి  తొంగి చూసాను. అదొక ఒంటరి గది. పుస్తకాలూ, కొన్ని పెయింటింగ్స్ ,కొంత సంగీతం… ‘మనుషులు తప్ప అన్నీ ఉన్న లోకం’ అతనిదని తెలుసు.

టేబుల్ ముందు కుర్చీ లో కుర్చుని, ముఖాన్ని – పుస్తకం లో ముంచి, కాదు కాదు, సగం శరీరాన్ని దూర్చేసుకుని,  పఠనం లో  లీనమై కనిపించాడు. అతనితో పూర్వ పరిచయం లేకపోయినా, అతన్ని  వెనక నించే చూస్తున్నా..అతనే ఫైజు అని గుర్తుపట్టేసాను. కాడన్న డౌటే లేదు. ఎందుకంటే.. అతను ఫైజే తప్ప మరో శాల్తీ అయ్యే అవ కాశం లేదు గాక లేదన్నపరమ సత్యం – నాకు మాత్రమే కాదు, అతన్ని చదివినవారందరకీ  తెలుసు

గది నలువైపులా చూపు సారించి చూశాను.

మంచం. కుర్చీ, టేబుల్, అల్మారాలు, గోడ క్కొట్టిన చెక్క అటకలు, నాలుగు వైపులా సజాలు..అవి కాదు నేను చూస్తున్నది. వాట్లన్నిటిమీదా పుట్టలు పుట్టలు గా పేరుకునున్న పుస్తకాలు తప్ప నాకిక  ఏ సామానూ కనిపించలేదు. ఇందులో సగం పుస్తకాలు  అన్వర్ ఇచ్చినవే!   అలా అక్షరాల ను మేసి, మేసీ, నెమరు వేసీ వేసీ, చివరకు ఎలా అయిపోతున్నాడంటే – తన చుట్టూ వున్న తన వారికి అన్యాయం జరుగుతున్నా చలించని వాడిలా.. కాదు కాదు చలించకుండా జాగ్రత్త పడే  పెద్ద పలాయన చిత్తుడని  చెబుతాడు అన్వర్. కాదు,  నింద లు మోపుతాడు. ‘  పాపం!ఫైజ్’ అనిపించింది.

చిత్రమేమిటంటే   – అన్వర్ అన్న మాటలు   నిజమే అని ఇతను మధనపడుతుంటాడు.  అక్కడ నాకీ కారెక్టర్ నచ్చక నిలదీద్దామనే వచ్చాను. ఈయన ఫ్రెండ్ (?) అన్వర్ చెప్పినట్టు..ఇతను ఎస్కేపిజాన్ని ఎంచుకున్నమాట వాస్తవమే అయినా, ‘ పరిస్థితి అలాంటిది కదా ‘ అనే ఒక సానుభూతి ఇతనిపై మెజారిటీ జనానికి వుందనేది ఒక సమాచారం.

నేనొచ్చినట్టు అతను గుర్తించడం కోసం..గొంతు సవరించుకుంటూ చిన్న గా దగ్గాను. వెనక్కి తిరిగి చూస్తాడేమో నని.

ఊహు. చూడలేదు. చెప్పాను కదా, ఆ కారెక్టర్ కి ఏవీ వినిపించవని. మరో ప్రయత్నం గా తలుపు మీద గట్టిగానే చప్పుడు చేసాను.

ఉలిక్కిపడి చూసాడు. కనుబొమలు ముడుచుకుని, ఇంత లావు కళ్ళద్దాల్లోంచి అనేకానేక  సందేహప్పోగులన్నీ కలేసిన  చిక్కటి అనుమానంతో పరిశీలనగాచూసాడు.

అవేం పట్టించుకోని దాన్లా, నేనే లోపలకెళ్ళి మంచం మీద పుస్తకాల్ని కొన్ని పక్కకి జరిపి,  ఆ కాస్త జాగాలో కుర్చుండిపోయా.

అతనికిదంతా అయోమయం గా వున్నట్టుంది. కంగారు పడనీకుండా.. నేనే మాట్లాడ సాగాను.

“నా పేరు చెప్పి, పరిచయం చేసుకుని, నేనెందుకు వచ్చిందీ, ఎలా వచ్చిందీ, అతనికి తెలీని నేను – నాకు అతనెంత బాగా తెలుసన్న సంగతినీ అంతా వివరిస్తూ, అతని ముఖ కవళికలను చదువుతూ చెప్పాను.   “మీ ఫాదర్, మీ స్నేహితురాలు సహన, మీ మేడం అందరూ అనుకున్నట్టు మీరేమంత అమాయకులు కాదని నా అభిప్రాయం. ముఖ్యం గా  అన్వర్..” అంటూ  ఆగాను.

ఆ పేరు వినంగానే ఒక వెలుగుతో అతని ముఖం వికసించింది.. అంతలోనే విప్పారిన వెలుగు  చప్పున మాయమై, చీకటీ పరుచుకుంది.   నా వాక్యాన్ని పూర్తి చేస్తూ అన్నాను. “  మీ చుట్టూ వున్న  సమస్యల గురించి మీకేమీ తెలీదని నేననుకోను. మీకు రేపు ఏమౌతుందన్న ఆలోచనల్లోంచి తప్పి పోవడం మాత్రమే ఇష్టం.  నిజానికి మీరు నిజంలోకి తొంగి చూసినా, కొన్ని దుష్ట శక్తులను ఎదిరించడానికి మీ బలం  చాలక..మిన్నకుండిపోయారేమో అని అనిపించింది. ‘మన వర్గం, దాని బలం ఎంత పెద్దదైనా, పొరాటం లో- వ్యక్తి ఎప్పుడూ ఒంటరి వాడే.’ అనే సత్యం మీకు పుస్తకాలు చదవడం వల్ల తెలిసి వుంటుంది అని నా విశ్వాసం.

“…..”

“ఏం చదివినా అది మీలో ఇంకడంలేదని, ఉత్తుత్తి పదాలే తప్ప ఒక వాక్యం లా బ్రతకడం రాని జర్నలిస్ట్ అని  మీ గురించి అన్వర్ ఎద్దేవా చేయడం నాకు నచ్చలేదు.”

అతనొక్క సారి నా వైపు చూసాడు.  అతని మీద నే చూపుతున్న ఫేవరిజం కంటేనూ,  అన్వర్ ని వ్యతిరేకించడం రుచించడం లేదన్న భావం స్పష్టం గా కనిపించి ఆ  ఆ చూపులో.

సహన అన్నట్టు “ఇతనికి ఒక ఫ్రేం లో ఒదిగి వుంటం రాదు.”  నాకు తెలిసి, అతనికి పరిచయమున్న స్త్రీలు చాలా తక్కువ. వాళ్లతో అతను మాట్లాడే మాటలు ఇంకా తక్కువ.  సహన అంటే ఇతనికొక ప్రతేకమైన ఇష్టముంది. ఎందుకంటే, ఇతని మౌనాన్ని, నిశ్శబ్దాన్ని అన్వర్ లా ప్రశ్నించదు. ఆమెకొక ప్రశ్న గా మరిన అతన్ని అర్ధం చేసుకుని మసులుతుందనుకుంటా! అందుకే ఆమె గదిలోకొస్తే ఒక ఆశ కిరణం ప్రవేశించినట్టుంటుందతని, వెళ్లిపోయాక చీకటి అలుముకుంటుందని ప్రకటించుకున్నాడు.

కాబోయే భార్య మంచిదై వుండాలని అందరు మగాళ్ళు కోరుకొంటారు. కానీ తనని పూర్తిగా అర్ధం చేసుకుని వుండాలని కోరుకునే వారిలో జర్నలిస్ట్ లు, రచయితలు  ఎక్కువగా వుంటారు. ఎందుకంటే వాళ్ళు పైకి ఎంత ధైర్యం గా కనిపిస్తారో అంత సున్నిత మనస్కులయి వుండటం వల్ల.

“నేననుకుంటాను. మీరూ అన్వర్ వేరు కాదు, ఒకటే అని.  అర్ధమయ్యేలా మీ మాటల్లోనే చెప్పాలంటే – మీలాగే అతనూ ఆబ్ స్ట్రాక్ట్  చిత్రమే. “కాకుంటే వాడు కొంచెం వ్యక్తమైన ఆబ్ స్త్రాక్ట్” అని అన్నారు గుర్తుందా? ఎవరితోనూ కాదు. మీతో మీరు సంభాషించుకుంటూ మోనోలాగ్.. నేను కూడా అప్పుడప్పుడు ఇలానే, మీలానే మాట్లాడేసుకుంటుంటాను. నాలో నేను. నాతో నేను. ఎడ తెగని సంభాషణలో! బదులివ్వని మనిషితో..అఫ్కోర్స్! ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అనుకోండి..” అంటూ సీరియస్ గా చూసాను అతని వైపు.

చేతిలో తెరిచున్న పుస్తకాన్ని, ఆ పళాన ముఖానికి సగానికి పైగా కప్పేసుకున్నాడు. కళ్ళు మాత్రమే నవ్వుతూ కనిపిస్తున్నాయి నాకు.

కొంచెం ధైర్యం రావడం తో, నా సంభాషణని కొనసాగించాను. “ఇంకా చెప్పాలీ అంటే మీలోని అన్ని ‘వక్రరేఖలూ సందిగ్ధ రేఖలూ’ కలిపి ఒకే బొమ్మ గీస్తే అది అన్వర్. కాబట్టి అతనెప్పుడూ మీకు, మీ వ్యక్తిత్వానికి డూప్ కాడు. అని నా నమ్మకం. ఎందుకంటే మీరెంచుకుని బ్రతుకుతున్న జీవన రేఖ సూటి అయినదే కాబట్టి. మీరు అతనిలా బ్రతకలేకపోతున్నందుకు ఎక్కడా పశ్చాత్తాపం చెందే  అవకాశం లేదంటాను.

“……..” ఏం జవాబు లేదు. కనీసం తలూపనూ లేదు.

“నాకొక డౌటండీ! మీరు అన్వర్ లా ఆలోచించకపోతున్నందుకు, చలించి, జ్వలించలేకపోతున్నందుకు చింతిస్తూ వచ్చారు కదా, మరి ఒక సందర్భంలో అన్వర్ గురించి   “బహుశా, వాడు ఫైజ్ కాకపోవడం వాడి అదృష్టం” అని చెబుతూ అభిప్రాయ పడతా రెందుకనీ?-  “అన్వర్ని ఎదుర్కోవడం ఎప్పుడూ కష్టమే!ఆ మాటకొస్తే, రేపటి గురించి మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా భయం.”  అని చెహ్ప్పుకొచ్చారు. మీకనే కాదు, నాకూ, ఇంకా – సామాన్యులందరకీ భయమే వేస్తుంది.

మీ అన్వర్ ని మీరెంత బాగా గుర్తుపెట్టుకున్నారంటే..అతను తను చదివే పుస్తకాలని ఒక లిస్ట్ గా చేసుకోవడం దగ్గర్నించీ, అతనెంతో ప్రేమించే పుస్తకాలను ఒకానొక అసహాయ స్థితిలో తీసుకెళ్ళిపోమన్న క్షణం దాకా మీకు గుర్తుంది. కదూ?

అంతలా ప్రేమించడం గుర్తుంచుకోవడం, చూడాలని వున్నా వెళ్ళలేకపోవడం, ఎస్కేపవడం..మళ్ళీ ఎవరూ చూడకుండా   – ‘‘టేబుల్ మీద మత్తు ఇవ్వబడిన రోగిష్టిలా ..”  అబ్బ! ఎలియట్ మా అందరకీ బాగా గుర్తుండిపోయేలా ఎంత బాగా చెప్పారు!

అతని కళ్ళు మెరవడం గుర్తించాను.

“సాహిత్యం లో అందాన్ని మాత్రమే చూసే మీరు, జర్నలిస్ట్ అవడానికి స్ఫూర్తి అన్వర్ ‘బోధన ఒక పునాది రాయి’ అని చెప్పుకోవడం దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే, మీ అభిరుచికి తగిన పేజ్ మీకు పత్రిక వారు కేటాయించలేదెందుకా అని!”

అవునన్నట్టు తలాడించాడు ఫైజు.

మీరొక సందర్భం లో- ఆ సాయంత్రం మీ మిత్ర బృందం నించి  వీడ్కోలు చెప్పుకుంటూ, మీ ఇద్దరూ  ఇంటి ముఖం పడుతూ.. మీ ఇళ్ళ ‘ దూరం’ గురించి ప్రస్తావించారు గుర్తుందాండీ?..అప్పట్లో  ఇళ్ళు దూరం జరిగి వున్న మాట వాస్తవం. ఇప్పుడైతే ఆ దూరాలు తరగి, దగ్గరకి జరగలేదంటారా? ఆ మార్పు మీరూ గమనించే వుంటారు కనక ఈ పాయింట్ మీరు డైరీలో నోట్ చేసుకోవాలని ఒక విన్నపం..

నా మాటల్ని ఫైజ్ శ్రధ్ధ గా ఆలకిస్తున్నాడని గ్రహించాక నాకు మరింత ఉత్సాహం  వచ్చింది. ఎదుటివారు చెప్పేది చెవులారా ఆలకించడం ఉత్తమ జర్నలిస్ట్ లక్షణం.

“జీవితమైనా చదువైనా ఒట్టి ఇంప్రెషన్ కాదు, ఉద్వేగమూ కాదు.” అని చెప్పే  మీ మేడం కాత్యాయిని మాటలు  నచ్చయి. అంతే కాదు  “ఇప్పటిదాకా నేను మాట్లాడే ఇంప్రెషనిష్టు భాష అదే. అది ఇంకా మారలేదు.” అని   మీలో మీరు చుప్పుకుంటూ,  అలా  నిజాన్ని ఒప్పేసుకోనే  సింప్లిసిటీ మీ కారెక్టర్ కి ఓ పెద్ద ప్లస్ పాయింట్ !

అయితే అన్వర్ తో చేతులు కలపలేకపోయినందుకు చింతించడం అనే పాయింట్ దగ్గరే మీతో విభేదించక తప్పట్లేదు.

“………………..”

“నాకు తెలుసు. మీరేం మాట్లాడరని. గోడ మీద రాతలు చూసి..రగిలిపోయిన అతను ఒక రహస్యోద్యమం గా మారడాన్ని పూర్తి గా చూడాలని మీరు గట్టిగా అనుకునుంటే చూసి వుండేవారు కాదా? కానీ మీరు ఉద్యోగ వేట లో వున్నారు.

నేనిప్పటికీ అనుకుంటూ వుంటాను. ‘ ఎవరు ఏ దారి ఎంచుకుంటే,  ఏ  ఫలితాలు దొరకాలో – అవే దొరుకుతాయి. అది ఉద్యమమైనా కావొచ్చు. ఉద్యోగమైనా కావొచ్చు.’ అని.

మీలోని ఆంతర్యమే కదా అన్వర్?   అతనికొక బలమైన  ఊతమౌదామని మీకు ఎందుకు అనిపించలేదో తెలుసా?    ఉద్యమాలు రహస్యమైనవై వున్నాయంటేనే..అవి మేలైనవి కాదని అర్ధం. యుధ్ధం లో గాయపడిన క్షతగాత్రులకి ఔషధాలు అవసరం కానీ, తిరిగి యుధ్ధం చేసే విధానపు చిట్టాలు అక్కరకు రావుగా!

ఫైజ్ తలొంచుకున్నాడు. నాకేమీ అర్ధం కాలేదన్న నిరాశ కావొచ్చు. అయినా నా వాక్ప్రవాహం ఆగుతుందా?, ఒక పట్టాన?

“అన్వర్ వెళ్ళిపోవడం ఎన్నాళ్ళకి తెలిసిందన్నది కూడా డౌటే..మీకు గుర్తు లేదన్నారు. అంత లా మరచిపోవడమెలా సాధ్యమౌతుంది అనే సందేహం నాకు అయితే కలగలేదు. ఎలా అంటే – అతను మీరైతేనో, మీరు అతనైతేనో కదా!.. గడిచిన కాలానికి, భవిష్యత్తుకి మధ్యన నలిగే మరణయాతన లాంటిది విప్లవం అంటే..’అని అంటాడు ఒక రచయిత. అన్వర్ కి ఒక విముక్తి దొరికిందని భావించవచ్చేమో!?

“…..”గట్టిగా నిట్టూర్చాడు ఫైజ్!

“మీలో అప్పుడప్పుడు ఏదో ఒక మెలకువ, కానీ ఎప్పుడూ ఒక వెంటాడే వ్యధ. – అలా కనిపిస్తారు. సహన చెప్పినట్టు మీరొక ఫ్రేం లో ఒదిగి వుండాల్సిన క్షణాలు వేగం గా వచ్చేసాయి అనిపిస్తోంది.

అన్వర్ ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి  ముందు  – కనీసం చివరిచూపుకైనా వెళ్ళలేదన్న తీవ్రమైన బాధ తొలిచేయడం సహజమే. కానీ అంతకుముదు అతనొక దాడికి గురి అయినప్పుడు చూసేందుకు వెళ్ళారు కదా?  అప్పుడు మాత్రం అతని కోసమేం చేయగలిగారు?  తలొంచుకుని తిరిగి రావడం తప్ప? –

యుధ్ధం లోపాల్గొన్న వాళ్ళందరూ విజయమొందుతారా? విప్లవంలో మరణించే వారి పేర్లు మిగిలివుండవా?”

శ్రధ్ధగా వింటున్నట్టే అనిపించింది. అది నా అపోహా కాకపోవొచ్చు.

“మీకు తెలీదేమో కానీ, మిమ్మల్ని మీరు సరైన దారిలోనే  ట్రాన్స్ ఫాం చేసుకుని వుంటారని నా నమ్మకం నాది.

‘ కాదు, అది ఎస్కేపిజం’ అని  అన్వర్  మిమ్మల్ని   క న్ ఫ్యూజ్ చేసాడనేది నా అనాలసిస్ లో తేలిన నిర్ధారణాంశం.

“…..” మొట్ట మొదటి సారిగా నా వైపు సూటిగా చూసాడు ఫైజ్.

‘ఏ మనిషీ   తనకు జరుగుతున్న  జరుగుతున్న ఘోర అన్యాయలకు కంటే.. సాటి మనిషి న్యాయం మాట్లాడనందుకు, ఓదార్పు గా భుజం తట్టనందుకు మనిషి రోదిస్తాడు. లో లోన కుమిలి కుమిలీ కదిలి కదిలీ ఏడుస్తాడు.  అలాంటి భయంకర పరిస్తితుల్లో.. ఒక పెద్ద సందేహం కలుగుతుంది. వెన్ను వొణికించే ప్రశ్న ఉద్భవిస్తుంది. ‘చుట్టూ వున్న వాళ్ళు మనుషులేనా? తను బ్రతుకుతున్నది మనుషుల మధ్యేనా ‘అని..   సరిగ్గా మీకూ ఇలాటి సందేహమే కలగడం నాకెంత ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలగచేసిందంటే ఇదిగో ఇలా ప్రత్యక్షం గా వచ్చి కలిసి మాట్లాడేంత! ‘ పత్రికా ఉద్యోగంలో పక్కనున్న వాళ్ళు మనుషులో కాదో ఎప్పుడూ అనుమానమే. మాటల చుట్టూ కంచెలు.’ అన్నరు చూసారూ, నిజంగా మీ మాటలు నన్ను కదిలించాయి. ఆ చెడ్డ కాలమంతా కళ్ల  ముందొక్కసారి గిర్రున తిరిగింది..అప్పట్లఓ సరిగ్గా మీలానే  నేనూ   అనుకున్నాను. కానీ, ఈ పదాలలో కాదు కానీ సరిగ్గా ఇలాటి భావంతోనే…

“……………”

“గోడ మీద రాతలకి కారణం – మీకు మతం గా కనిపిస్తోంది కానీ నా అనుభవం లో నేనెదుర్కొన్న అవమాన పర్వం లో నా చుట్టూ వున్నవాళ్ళందరూ  మా మతం వారే. ఇంకా చెప్పాలంటే వారిలో  ‘మా కులపోళ్ళూ’ వున్నారు.

ఎందుకు చెబుతున్నానంటే  , ‘మనిషిని మనిషి హింసించడానికి, అవమానపరచి, హీనపరచి, అణగదొక్కడానికీ  –  మతం ఒక్కటే మూలకారణం కాదు.  కేవలం అదొక భాగం మాత్రమే సమాజంలో జరిగే దుర దృష్ట సంఘటనలకి ‘అని చెప్పాలని నా ప్రయత్నం ఇదంతా!

‘……’ కావొచ్చు అన్నట్టు తలూపాడు ఫైజ్.

“అణచివేత- అన్ని విప్లవాలకి మూల బీజం. భరించరానిఅవమానం, అన్ని యుధ్ధాలకి బలమైన కారణం.

కాదనం.  అయితే – మన ముందు తరాలవారికి మనం  ఇదే సందేశం గా మిగిలిపోవాలా? –ఈ ప్రశ్నని మీ అన్వర్ ని కలిసినప్పుడు అడుగాలంకుంటున్నా!

ఒక రెప్పపాటు ఉలిక్కిపడి  చూసాడు. ‘ఇంకెక్కడ అన్వర్?’ అన్నట్టు అనుమానం తో బాటు, ఇంకా మిగిలి వున్నాడంటారా? అనే ఆశా  ద్యోతకమౌతోంది ఆ చూపుల్లో!

“అవును. మరణించలేదు.  అతని గాయాలకు మరణమేమిటీ? మీలోని అతని జ్ఞాపకాలు సజీవమై వున్నంతవరకూ..అన్వర్ కనిపిస్తూనే వుంటాడు. మాట్లాడలేని అతని దేహం ఇంకా మూలుగుతూనే వుంటుంది. .

మీ రాక కోసం –  మూసిన ఆ కళ్ల వెనక అతని ఆశ ఏదో తచ్చాడుతూనే వుంటుంది. అని నా నమ్మకం.  .

అయినా, మీరూ వెళ్ళి చూసి రావొచ్చు కదా, ఒకసారి!.. ఇలా తలుపు వెనక ఎన్నాళ్ళనీ?

ఇప్పుడు, ఏదీ రహస్యం కాదీ  ప్రపంచ మండువాలో! అన్ని ద్వారల నించి అందరూ నడుస్తూనే వున్నారు.” అంటూ ఆగి గది గోడల మీద కనిపించటంలేదేమిటా అని చూపులతో వెదుకుతున్నా.

“???..” అతను దేనికోసమన్నట్టు ఆందోళన గా చూసాడు.

“గోడ మీద ఒక మూడు కాలాల  గడియారం వుండాలి..ఎక్కడా అని చూస్తున్నా..” అన్నాను అతని వైపు చూడకుండా!..వచ్చిన పని అయిపోయిందాన్లా లేచి నిలబడి, బాగ్ భుజాన తగిలించుకుని గుమ్మం దాటి బయటకొచ్చేస్తుంటే..వెనక నించి వినిపించింది..

‘ఎట్లా మాట్లాడాలీ ఈ వేల మరణాల గురించి?

ఎవరు వింటారు నా లోపలి గాయాల మూలుగుల్ని?

బలహీనమైన ఈ దేహంలో ఒక్క నెత్తుటి చుక్కా లేదుమిగిలిన అరకొర నెత్తుటి చుక్క.. ఒక్క వెలుగూ కాదు, కాసింత ద్రవమూ కాదు.

ఇది నిప్పు రాజేయనూ లేదు, దప్పిక తీర్చనూ లేదు!’

-మహాకవి ఫైజ్ స్వరం వినిపిస్తోంది..

***

ఫైజ్, అన్వర్ గురించి ఇంకా  ఆసక్తి కరమైన సంగతులు తెలుసుకోవాలనుకునే వారు ఈ లింక్ మీద క్లిక్ చేయగలరని మనవి.

అందరకీ నా ధన్యవాదాలు.

http://lit.andhrajyothy.com/stories/oka-talupu-venaka-5935

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. S V R Jogarao says:

    సోదరి
    శ్రీమతి దమయంతి గారికి,
    నమస్కారములు.
    సారంగ వార పత్రిక లో ప్రచురించిన మీ కధ మోనోలోగ్ ” కధ కానిది ” రెండో సారి కూడా చదివేను.
    కాదు.
    మొదటి సారి కధ (?) చదవడానికి ప్రయత్నించేను.
    ఊహూఁ
    రెండోసారి కూడా ప్రయత్నించేను.
    ఊహూఁ !
    సరే !
    చదివినంత మేరకి, నాకు అర్థమయినంత వరకు, నా స్పందన తెలియ చేస్తున్నాను.
    ఈ రచనను కధ అనడానికి నా మనసు ఒప్పుకోవడము లేదు.
    అలా అని కవిత అనలేను కూడా
    ముగ్గురు పాత్రలతో ఈ మోనోలోగ్ ను నడిపించిన మీరు కృతకృత్యులు అయ్యేరేమో !
    కాని అర్థము చేసుకోవడానికి, మననము చేసుకొంటూ, జీర్ణము చేసుకోవడానికి నా ప్రయత్నము ఫలించలేదు.
    ఈ విషయము ప్రక్కన పెట్టి, అసలు కధ కానిది రచనకు వస్తే,
    దిగితే కాని లోటూ తెలియదని అన్నట్లు, చదివితే కాని, రచన పస తెలియదు.
    ముఖ్యంగా, ఫైజ్ ని మనో నేత్రము ముందు నిలుపుకుంటే, ప్రఖ్యాత ఉర్దూ కవి ఫైజ్ అహమెద్ ఫైజ్, సాహిర్ లూధియానవీ, గాలిబ్, జౌఖ్ గుర్తుకు వస్తున్నారు.
    మధ్య మధ్య ఛాయావాద ప్రయోక్తలు మహాదేవీ వర్మ పలుకరించుతున్నారు.
    మేము లేమా అన్నట్లు, మన బుచ్చిబాబు గారు, చలం గారు ఎదురుగా నిలబడుతున్నారు.
    ఏమి ధారా స్రవంతి అండీ ఈ రచన !
    కనిపించుతున్న ఫైజ్ , కనిపించని అన్వర్ ఇద్దరూ ఇద్దరే !
    ఇంతకీ ఎవరు ఎవరో తెలియటము లేదు.
    ఈ రచన లో ప్రత్యక్షముగా పలుకరించే నాలుగవ పాత్ర కథ గమనమునకు అక్కడక్కడా తోడు పడని వాతావరణము.
    నన్ను అడిగితే ఈ రచనలో ముఖ్య పాత్ర కాలము .
    భూత, వర్తమాన , భవిష్యత్తులను అటూ ఇటూ మారుస్తూ పాఠకుడి మేధస్సును పరీక్షిస్రున్న కాలము మరియు వాతావరణము రచనను కంచికి చేర్చడానికి ప్రయత్నము చేసేయి.
    కథ కంచి కి వెళ్ళిందో లేదో తెలియదు కాని, నేను మాత్రము మోనోలోగ్ దగ్గరే ఆగిపోయేను.
    ఎంత ప్రయత్నము చేసినా , ఫైజ్ ,అన్వర్ లు మస్తిష్క మధనము చేస్తూనే ఉన్నారు.
    కానివ్వండి.
    ఒక మంచి రచనను అందించిన శ్రీమతి దమయంతి గారికి ధన్యవాదములు.
    శంభర వెంకట రామ జోగారావు
    గురుగ్రామము.
    Gurgaon Haryana

    • ఆర్.దమయంతి. says:

      కథ చివర ఒక లింక్ ఇచ్చ్చాను కదా! ఇదిగో మళ్ళా ఇస్తున్నా ఇక్కడ మీ కోసం ..
      http://lit.andhrajyothy.com/stories/oka-talupu-venaka-5935
      ఈ కథ మీదే ఒక కథ రాసాను. ఫైజ్, అంవర్లని మీరిక్కడ పూర్తిగా చదివి తెలుసుకోవచ్చు జోగారావు గారు.
      నిజం చెప్పాలంటే..నా మనసుని బాధ పెట్టిపోయిన కథ.
      చాలా సేపు నన్ను నిశ్శబ్దం లోనే ఉంచేసి వ్యధ.
      అయితే.. నా అభిప్రాయాన్ని ఇలా నా శీర్షిక లోకి కథ గా వస్తుందని నేనప్పుడు ఊహించలేదు.
      ..
      కాని, ఇప్పుడు చదివిన చాలా మంది కూడా అప్పటి నా లానే ..మౌనంగా ఉండిపోయారని చెప్పాలి.
      నిన్న ఒక మిత్రులు చాలాసేపు ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉండిపోయారు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ..ఎంతో ఆవేదనకు గురయ్యారు.

      మనం కనీసం మాట్లాడుకోడానికి కూడా వెనకాడితే, సమస్య ఎలా తీరుతుంది, ఎప్పటికి కొండెక్కుతుంది?
      ఒక ముస్లిం దేశంలో – చరిత్రలో జరిగిన మతకల్లోలాలు కక్షలు కార్పణ్యాలు వంటి పాఠాలను తొలగించేసారు.
      పిల్లల పసి మనస్సులో ప గా ప్రతీకారాలు చోటుచేసుకోకూడదని..ఎంత గొప్ప ఆలోచన చేశారనిపించింది. మనసులోనే అభినందించాను. (నా కా దేశం పేరు గుర్తుకు రావడం లేదు..చదువు వాళ్ళ తన వాళ్ళు బాగుపడి సుఖం గా బ్రతుకుతారని ఒక చిన్నది ప్రాణాలను సైతం ఫణం గా పెట్టి పోరాడుతొంది..
      మనం ఇక్కడ కనీసం మాట్లాడటానికి వెనకాడతాం.
      వీళ్ళు మనవాళ్ళు అని దైర్యం గా చెప్పడానికెందుకు అసలు ఎందుకు భయం?
      ఈ దేశం మాది అని ఎలుగెత్తి చాటడానికి వారికెందుకు జంకు?
      తెలియదు…
      కాశ్మీరు మీద నిన్నటి ఎడిటోరియల్ చదివితే ..రాజకీయం అనే రక్కసి ఎంత అశాంతి పాలు చేస్తోందీ దేశాన్ని అని మరోసారి వ్యధ చెందుతాం మనం..
      http://www.eenadu.net/editorial/editorial.aspx?item=ap-editorial

      ధన్యవాదాలు జోగారావ్ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు..
      నమస్సులతో..

  2. అద్భుతమైన అంతర్‌ సంఘర్షణావిష్కరణ

  3. ఆర్.దమయంతి. says:

    ధన్యవాదాలు నిత్య గారు!
    ఇంత నిశ్శబ్దం తర్వాత వినిపించిన ఒక ప్రశంసా వాక్యం నాకెంతో నెమ్మదిని కలిగించింది.
    మాట్లాడుకోడానికెందుకో కొందరికి – ఇంత బెదురూ అనేది తెలియదు.
    :-)

  4. Venkat Suresh says:

    ఆ లింక్ చాలా ఉపయోగకరంగా ఉంది మామ్. చాలా బాగుంది మీ మోనోలాగ్ :)

    • ఆర్.దమయంతి. says:

      మీ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు సురేష్.
      అసలు కథంతా ఆ లింక్ లోనే ఉంది కదా మరి!? అందుకే అందచేసాను.
      :-)

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

*