ఆ పాప నవ్వో, ఏడుపో!

chandra-kaanthaalu

 

ఇప్పుడిప్పుడే పుట్టిన ఓ పాప

అప్పుడప్పుడూ నిద్దురలో నవ్వుతూ ఉంటుంది

 

కనుకొలికిల్లోంచి జారిపడే కన్నీటిచుక్క లా నవ్వడం

ఒక్క పాపకి మాత్రమే వస్తుంది

 

మనఃగర్భాల్ని దాచిపెట్టే ఉపరితలపు నీటిముఖాలన్నిటినీ

తెరలు తెరలుగా తొలగించిపెడుతూ గులకరాయిలా నవ్వుతుంది

 

గొంతెండిపోతున్నా గుక్కెడు నీళ్ళెవరినీ అడగలేని

మహావృక్షపు అహంకారదాహాన్ని వానధారలా తీర్చే నవ్వును నవ్వుతుంది

 

వెచ్చగా వెలుగుని కప్పుకుని విశ్రమిస్తున్న ఆకాశమ్మీదకి

గుప్పిళ్ళకొద్దీ అంతఃజ్ఞానాన్ని విసిరికొట్టే చిక్కని చీకటిలానూ నవ్వుతుంది

 

పంజరాలే తమ ప్రాణమనుకునే పంచవన్నెల చిలకల్ని చూసి

తెరిచిపెట్టిన తలుపుల సాక్షిగా విశాలంగా నవ్వుతుంది

 

మండు వేసంగిలో పూసే మల్లెపువ్వులా

అరుదుగానైనా ఆ పాప, అతికమ్మగా నవ్వుతుంది

 

ఆ పాపే ఎప్పుడూ ఏడుస్తుంటుంది కూడా

సుందర స్వప్నమయ లోకాలనొదిలి మెలకువలోకి నిదురించడాన్ని సాధన చేస్తూనో ఏమో!!

 

***********************

 

మీ మాటలు

  1. సాయి గోరంట్ల says:

    ఓహ్ ముందుగా కంగ్రాట్స్ ఆరుణ గారు.

    చక్కని కవితను మాకు అందించి నందుకు మీకు
    ఆలాగే సారంగ టీం కు దన్యవాదాలు

  2. సురేష్ రావి says:

    చాలా బాగుందండీ… ఇప్పుడైతే నవ్వును కూడా సాధన చెయ్యాల్సిన రోజులు వచ్చేసాయి సుమా !

  3. Rajesh Janjanam says:

    చాల బాగుంది

  4. sasikala.v says:

    ఎంతో బాగుంది , -చిన్ని పెదాలపై విచ్చుకున్న నవ్వు పువ్వు లాగుంది . మాకు ఒక చెట్టు ఇస్తే కొన్ని నవ్వుల్ని కోసుకొని దాచుకుంటాము

  5. Suparna mahi says:

    చాలా చక్కని పోయెమ్…
    అభినందనలు…

  6. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    కన్నీళ్లు లా నవ్వడం, అహంకార దాహాల్నీ తీర్చే వానధారలా,మెలకువలో నిదురోవడం లాంటి మరెన్నో ప్రయోగాలు అద్భుతంగా ప్రయోగించి నవ్వును పసి హృదయాన్ని (యెవరికోసమో…ప్రతి పాదంలోని వో నెగటివ్ ఫాల్స్ యిమేజరీలను దుయ్యబడుతూ వెంటనే ఆకు కింది చీకటిలా కమ్ముకున్న మనఃపొరలను కాదంటూనే కాదు) ..ఆవిష్కరించిన అరుణ గారిని అభినందించాలి…

  7. Ravinder VilasagaramVilasagaram says:

    Good poem

  8. Aruna Thara says:

    స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :)

Leave a Reply to Aruna Thara Cancel reply

*