విభిన్న వస్తు, కోణాల సమాహారం


Katha-15 Cover

పాతికేళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కథాసాహితి వారి కథాసంకలనాల్లో నేను కూడా ఈ రకంగా ఓ స్థానం సంపాదించుకున్నందుకు కొంత సంతోషంగానూ, కొంత గర్వంగానూ అనిపించినా- ఆ తర్వాత ఆ బాధ్యతని నెత్తిన వేసుకున్న బరువు మాత్రమే తెలిసివచ్చింది. కథల ఎంపిక అనేది అత్యంత సున్నితమైన ప్రక్రియ. మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఎంపిక జరిగినా- అవి చదువరులని చేరి, వాళ్ల ఆలోచనల్లో రేపవలసిన అవసరమైన కల్లోలాలని ఊహించి మరీ కథలని ఎంపిక చేయడం చాలా కష్టమైన పని. అందరూ చర్చించుకున్న కొన్ని కథలని- ఈ ప్రక్రియలో అదనంగా ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా- పక్కన పెట్టేయాల్సి రావడం కూడా బాధాకరమైన పనే!

ఈ కథాసంపుటాన్ని తయారుచేయడంలో, 2015 సంవత్సరంలో 42 పత్రికలలో వచ్చిన 1780 కథలని పరిశీలించాం. వచ్చిన కథలని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండటం వల్ల, ప్రతి కథకీ దానికి తగినంత సమయం కేటాయించడం జరిగింది. ఇంత ప్రక్రియ తరువాత, చివరి వడపోతలో కేవలం 12 కథలు మాత్రమే మిగలడం కొంత నిరాశని కలిగించడం మాత్రం వాస్తవం.

****

కథకి వస్తువు ఎంత ముఖ్యమో- ఆ కథని ఏ స్వరంతో చెబుతున్నామనేదీ అంతే ముఖ్యం. కథని రచయిత తను అనుకున్న పద్ధతిలో పాఠకుడికి చేర్చగలిగింది ఈ కంఠస్వరమే. ఆ స్వరం వైరుధ్యాలు లేకుండా ఉంటే, ఆ సూటితనాన్ని పాఠకుడు అప్రయత్నంగానే పసిగట్టగలుగుతాడు. అలాంటి సూటితనం, నిజాయితీ పాఠకుడి మేధస్సుకి సంబంధించిన అన్ని భద్రతా వలయాలనూ ఛేదించుకుని వెళ్లి, తాకవలసిన చోటుని తాకుతుంది. ఈ సంకలనంలో ఉన్న కథల్లో ఆ స్వరరచన ఎలా జరిగింది?

ప్రథమపురుష కథనంలో, ఆ తర్వాత వివిధ పాత్రల దృష్టికోణంలో నడిచిన చివరి చర్మకారుడూ లేడు… కథలో పాత్రలని బట్టి స్వరం మారడం గమనించవచ్చు. కథలో రచయిత వీలైనంత తక్కువ జోక్యం చేసుకుని, కథని మొత్తం నేపథ్యంలో ఉన్న డాక్యుమెంటరీలాగా నడుపుతారు. రచయిత పాటిస్తున్న ఈ దూరం వల్ల పాఠకుడు కథలో మరింత శ్రద్ధగా లీనమవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ముక్తసరి కథనమే సావిత్రి కథలో కూడా గమనించవచ్చు. క్లుప్తమైన కథనం, సన్నివేశాల్లో మరింత బరువుని నింపుతుంది. చిత్తూరు మాండలీకంలో ఓ హోరుగా సాగే రాతిమిద్దాయన చిన్న కుమార్తె కథన ప్రవాహం, చివర్లో ఓ ఆశ్చర్యకరమైన క్షణంలో ఆగిపోతుంది. అక్కడ ఆ పాత్రకి లభించిన ఎపిఫనీ తాలూకు నిశ్శబ్దాన్ని, అంతవరకూ సాగిన హోరు వల్ల పాఠకుడు మరింత ఆస్వాదించగలుగుతాడు.

తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో కథకురాలి స్వరం ఇప్పటి తరం తాలూకు తాజా స్వరం. ఆ స్వరం వల్ల ఆ పాత్రని గుర్తించడానికీ, ఆ పాత్ర భావావేశాలపట్ల అవగాహనని ఏర్పరచుకోవడానికీ పాఠకుడికి ఎక్కువ సమయం పట్టదు. చివరివరకూ సాధికారికంగా, అద్భుతంగా సాగే ఆ స్వరమే ఈ కథకి ప్రత్యేకత. శతపత్ర సుందరి కథ చెప్పే నీలవేణి మానసిక, బౌద్ధిక స్థితి కథ మొదట్లో రెండుమూడు పేరాల్లోనే ఆవిష్కరించబడుతుంది. పాఠకుడిని అలా సిద్ధం చేయడం వల్లా, కథకురాలి స్వరం అదే ప్రశాంతోత్పాత స్థితిలో కొనసాగడం వల్లా ఆ పాత్ర తాలూకు జీవనవిధానం, దానిలో అంతర్గతంగా ఇమిడివున్న సంఘర్షణ పట్ల పాఠకుడి కుతూహలం చివరివరకూ కొనసాగుతుంది. చరిత్రకి సంబంధించిన మూడు కోణాలు కథలో ఉత్సుకతని ఎక్కడా చెదరనివ్వకుండా నడపడానికి కారణం కూడా, కథలో కథకుడు ఉపయోగించిన అధిక జోక్యం లేని కంఠస్వరమే!

నెల్లూరు మాండలీకంలో సాగే నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో కథకుడు (narrator) ప్రధానపాత్ర భాషలోనే కథని చెప్పడం వల్ల, ఆ పాత్ర పరిస్థితుల పట్ల పాఠకుడు ఆసక్తి చూపగలుగుతాడు. ‘కడగొట్టోళ్ల లోకి కడగొట్టుది ఆడదే,’ అన్న అర్థవంతమైన ఆవేదన కూడా ఆ పాత్ర భాషలోంచి రావడం వల్ల ఆ ఆవేదన మరింత భారవంతంగా ఆవిష్కారమౌతుంది. ఈ స్వరాలన్నీ ఒక ఎత్తైతే, క్రైస్తవ పద్ధతిలో జరిగే వివాహాల గురించీ, ఆ వివరాల గురించీ చెప్పే పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన కథలోని స్వరం విభిన్నమైనది. అన్ని వివరాలను వాస్తవిక స్వరంతో చెబితే ఆ కథ ఒక వ్యాసంలా తయారవుతుంది కాబట్టి, ఈ కథలోని కథకుడి స్వరానికి వ్యంగ్యాన్ని అద్దారు రచయిత. కథలో తను నిరసించదలచుకున్న అంశాన్ని ఎద్దేవా చేయడానికే కాకుండా, కథ మొత్తాన్నీ ఆపకుండా చదివేలా చేయడానికి ఈ వ్యంగ్యం చాలా కీలకమయింది.

తాతిల్‌ కథనంలో ఉపయోగించిన స్వరంలో ఉండే తెలంగాణ మాండలీకపు అమాయకపు స్వచ్చత- కథాంశంలో అంతర్లీనంగా ఉన్న ఆప్యాయతాస్పూర్తిని రెండింతలు చేసి చూపించడానికి సహాయం చేస్తుంది!

****

ఈ సంకలనంలో చర్మకారుల కథలు రెండు ఉన్నాయి. రెండు కథలూ, రెండు విభిన్న వాస్తవాలను చూపిన కథలు. చివరి చర్మకారుడూ లేడు… కథ-సమాజంలో వచ్చిన మార్పుల వల్ల చర్మకారులు ఇప్పుడు కనిపించకపోయినా, ఆ తరువాతి తరాలు ఒక్కొక్క మెట్టూ ఎక్కి సమాజంలో స్థిరపడటాన్ని చూపిస్తుంది. కులవృత్తులు నశించిపోతున్నాయి అనే అర్ధసత్యానికి సమాధానం ఈ కథ. కానీ, నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న మారయ్య పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. మార్పేదైనా ఉంటే అది అదనంగా వచ్చి చేరే సమస్యల జాబితానే. అతను ఇంకా సమాధానాలు వెతుక్కుంటూనే ఉన్నాడు. ఈ రెండు కథలూ వాస్తవాన్ని చిత్రీకరించేవే. వాస్తవం అనేది భిన్న పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఎలా ఉండగలదో నిరూపిస్తాయి ఈ రెండు కథలూ.
చరిత్ర ఆధారంగా రాయబడిన రెండు కథలు ఈ సంకలనంలో చోటుచేసు కున్నాయి. ఆంగ్లేయుల పాలనలో సర్వే పనుల నేపథ్యంలో రాయబడ్డ మూడు కోణాలు మంచి సమగ్రమైన కథ. కథలో అన్ని పాత్రల అన్ని కోణాలనూ అవసరమైనంతమేరకు స్పృశించే ఈ కథ- ముగింపులో భారతీయుల గురించి ఒక వాస్తవికమైన పరిశీలన చేస్తుంది. ‘నైపుణ్యం ఉన్నచోట శాస్త్రం లేదు; శాస్త్రం ఉన్నచోట నైపుణ్యం లేదు…’ అని. ఆ పరిస్థితిలో ఇప్పటికీ చెప్పుకోదగిన మార్పు లేకపోవడమే ఈ కథ తాలూకు వర్తమానత. అందుకే డుంబ్రిలాంటి వాళ్లు, తోలు మల్లయ్య కొడుకు మారయ్యలాంటి వాళ్లు అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుబడి పోయి వుంటారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో జరిగిన చెరువుల అభివృద్ధి, దాని వెనక ఉన్న సాంకేతికమైన శాస్త్రీయతా అంతా కాలగర్భంలో కలిసిపోయి, నీరెటుకాడి కల కథలో పెద్దయ్యలాంటి వాళ్లని జీవన్మృతులుగా మిగిల్చింది. వాళ్ల ఆశ తీరదు, కోరిక చావదు, కలలు నిలవనీయవు, జీవితం బతకనీయదు! తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మల నేపథ్యంలో వచ్చిన అంటరాని బతుకమ్మ మరో మంచి కథ. ఉద్యమాలనాడు బతుకమ్మలు ఆడటానికి అడ్డురాని కులాలు, ఆ ఉద్యమం కాస్తా దాటుకుని ఇప్పుడు జీవితాలు స్థిరపడ్డాక, మళ్లీ యథాప్రకారం కొనసాగుతున్నాయి. రాజకీయాల అవకాశవాదాన్ని, వ్యక్తిగత భావావేశాల నేపథ్యంలో విమర్శించిన కథ ఇది.

రైతుల కథలు ఎన్ని వచ్చినా ఇంకా రాయబడని కథలు మిగిలే ఉంటాయి. ప్రకృతీ, ప్రభుత్వాలూ, పీడకులూ- అందరివల్లా దగా పడుతున్న రైతు క్షోభకి ఎన్ని కోణాలున్నాయి? ఆత్మహత్యే శరణ్యం అని పరిస్థితులు సూచిస్తున్నా, లేచి నిలబడి చుట్టూ చూసి స్థైర్యం తెచ్చుకున్న నారాయణ కథ ఊరవతల ఊడలమర్రి.
కుటుంబ నేపథ్యంలో వచ్చిన కథలు రెండు ఉన్నాయి ఈ సంకలనంలో. అభద్రతతో, అశాంతితో బతకడం కంటే, కొంత త్యాగం చేసైనా సరే (ఆ త్యాగమైనా తన తోబుట్టువు కోసమే కదా!) వాటిని వదిలించుకోవడం మంచిదన్న తాత్వికస్థితికి చేరుకోవడానికి ముందు రాతిమిద్దాయన చిన్నకుమార్తె కథలో నాగేస్పరి చాలా ప్రయాణమే చేసింది. చివరికి- వొళ్లు దెలవకుండా నిద్రపోగల సులువుని తెలుసుకోగలిగింది. అలాగే, మనుషుల్లోనూ, సమాజంలోనూ ఉండే నెగటివ్‌ ధోరణుల నేపథ్యంలో ఎక్కువగా సాగే కథల మధ్య తాతిల్‌ కథ కుటుంబంలో ఉండే అనురాగాలకి సంబంధించిన ఆహ్లాదకరమైన కథ. ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఈ సంకలనంలో స్త్రీవాదం పునాదిగా మూడు మంచి కథలు ఉన్నాయి. ఉపరితలంలో పొసెసివ్‌నెస్‌గా కనిపించే సదాశివ ప్రేమ వెనకాల నిజాయితే ఉందో, ముందరికాళ్లకు బంధం వేసే తెలివితేటలే ఉన్నాయో నీలవేణికి తెలీదు శతపత్ర సుందరి కథలో. బహుశా, ఆమెకి స్త్రీ సహజమైన ఓర్పు, క్షమ, ప్రేమలాంటి ‘బలహీనతలు’ ఉన్నంతకాలం, సదాశివకి తన ఆధిక్యం ప్రదర్శించడానికి అవకాశం దొరుకుతూనే ఉంటుంది. ఈ  ఆటలో  తెలిసో,  తెలీకుండానో  ఓడిపోతూనే ఉండే నీలవేణిలాంటి స్త్రీలకి ఉన్న ఏకైక బలం- మారాకులు వేయగలగడం. అందుకే ఆమె శతపత్ర సుందరి. వచనానికీ, కవిత్వానికీ మధ్య హద్దులు చెరిపేసి, అతి క్లుప్తమైన కథనంతో, స్త్రీపురుష సంబంధాల గురించి పలు ప్రశ్నలు రేపి ఆలోచింపజేసే కథ ఇది. ఈ తరానికి చెందిన మోహిత, తన అస్తిత్వాన్ని తను సంపూర్ణంగా ప్రేమించుకుంటూ, తనని తను ప్రేమించుకోవడంలోనే తన అస్తిత్వం దాగివుందన్న నిజాన్ని గ్రహిస్తుంది తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో. పోగొట్టుకోవడం అంటే ఓడిపోవడం కాదన్న నిజాన్ని కూడా గ్రహిస్తుంది, అందుకే ముగింపులో ధైర్యంగా అందర్నీ పక్కకి తోసేసి నడుస్తుంది. నిడివి విషయంలో కొంచెం పెద్దదే అనిపించినా, రాసిన ప్రతి వాక్యం చదివించగల శక్తి ఉన్నదవ డంతో కథనం చురుగ్గా సాగిపోతుంది. ఉద్యమాల నేపథ్యంలో రాసిన సావిత్రి కథలోని ఆ పాత్ర జీవితం ఏమిటో తెలుసుకునేలోపలే తన ప్రమేయం లేకుండానే అది తన చేతిలోంచి జారిపోయింది. భర్త పోరాటాలని కొంతవరకూ అర్థం చేసుకోగలిగినా, జీవితం తాలూకు వాస్తవికత సృష్టించే అవరోధాలను అధిగమించడం తన వయసుకీ, శక్తికీ మించిన పనైంది. ‘నువ్వు ఉండటానికి, చనిపోవటానికి మధ్య తేడా కనపడటం లేదయ్యా నాకు…’ అన్న సావిత్రి మాటల్లో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది. జీవితంలో కోరుకున్నది దొరకకపోగా, దొరికింది కూడా చేజార్చుకోవలసి వచ్చిన దైన్యమైన స్థితి. మూడు కథల్లోనూ స్త్రీ జీవితం తాలూకు వివిధ పార్శ్వాలు కనిపిస్తాయి.

****

ఈ సంకలనంలో ఉన్న పన్నెండుగురు కథారచయితలలో ఆరుగురు రచయిత/త్రులు మొదటిసారిగా ఈ కథాసాహితి వార్షిక సంకలనాలలో చోటుచేసుకోవడం విశేషం! ఈ ఆరుగురిలోనూ, ముగ్గురికి ఇదే తొలికథ. అది మరో విశేషం!
ఇలా విభిన్న వస్తు, కథన విశేషాలతో- అట్టడుగు జీవితాల నుంచి ఆధునిక జీవనశైలుల వరకూ ప్రయాణించిన ఈ కథలు మిమ్మల్ని కూడా ఆకట్టుకోవాలని మా ఆకాంక్ష!

హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

మీ మాటలు

 1. ఆర్.దమయంతి. says:

  ఎంత చక్కటి విశ్లేషణనందించారు రమణ మూర్తి గారు!!
  మీ సమీక్షలో – వివరించిన కథాంశాలన్నీ మనసుకి హత్తుకుపోయాయి. పుస్తకం చదవాలన్న ఆసక్తిని రేకెత్తించాయి.

  మీరు చెప్పిన మాటల్లో ప్రతి అక్షరం లోనూ సత్యం నిండి వున్న మాట వాస్తవం. నిజమేనండి. కథలో పాత్రని బట్టి, మనిషి కుల, మత, వర్గాన్ని బట్టి, చేపట్టిన వృత్తుల్ని బట్టీ, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని బట్టి మాట్లాడే భాష మారుతుంది. సామాజిక ఆర్ధిక స్థాయీల వారీగా కూడా యాస ఉంటుంది. సంభాషణలో – కారెక్టర్ ఆటిట్యూడ్ ప్రస్ఫుటమౌతుంది.
  మీరన్నట్టు రచయిత ఆ విధానాన్ని కష్టపడి చెప్పి పాఠకుణ్ణి మరింత కష్ట పెట్టకూడదు. ఆ యా పాత్రలతో మాట్లాడించాలి. అది పాఠకుడు వినాలి. ఆ సన్నివేశాన్ని దృశ్యీకరించ గలిగి వుండాలి. అది పాఠకుడు తన హృదయంతో చూడగలగాలి. అలా పాఠకుణ్ని కథలో నిమగ్నం చేసి, మమేకం చేసుకుని పోవడం అంటె అందుకు ఎంత సాధన కావాలి రైటర్స్ కి! మరెంత కృషి సలపాలి!!
  మీరన్నారు చూశారూ, స్వరం అని. కరెక్ట్. మీ అభిప్రాయం తో పూర్తిగా ఏకీ భావిస్తున్నాను.
  నిజానికి – ఇలాటి కథలు రాయడానికి..రైటర్ కి పరిశీలన, పరిశోధనా కావాలి. ఆ ఇతివృత్తం తో ఇన్వాల్వ్మెంట్ కోసమై – సిట్యు యేషన్ ని దగ్గర్నించీ చూసి, చదివి, ఆకళింపు చేసుకునే అవకాశం వుండాలి. లేదా ఏర్పరుచుకోవాలి.
  నా వరకు ఇది చాలా అసాధ్యమైన పని అని చెప్పక తప్పదు. కనీసం అలా కష్టపడి విజయాన్ని సాధించిన వారినైనా ఇలా అభినందించే అవకాశం నాకు – ఈ వేదిక మీద కలగడం ఎంతైనా ముదావహం.
  అందుకు మీకూ, సారంగ కి కూడా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
  ఖచ్చితం గా ఈ పుస్తకం అద్భుత విజయాన్ని సాధిస్తుందనడం లో నాకెలాటి సందేహం లేదు. కథా ప్రియులందరూ ఈ పుస్తకం కొని, లైబ్రరీ లో దాచుకుంటారనడంలో అనుమానమే లేదు. ఒకప్పుడు టైం మాగజైన్ చేతిలో వుంచుకుని కనిపించడమే ఒక గొప్ప ప్రతిష్ట గా భావించేవారు. అలానే ఈ పుస్తకం కూడానండీ.
  ఎంత సంక్లిష్టమైన వడపోత!
  మీ వడపోత విధానం చూస్తుంటే – పుట్ట నించి తేనె పిండిన వైనం గుర్తొస్తోంది.
  ఒక నిష్పక్షపాత వైఖరితో, ఒక నిజాయితీ నిండిన మనసుతో,
  అన్నిటికంటే – కథ పైనున్న అమితమైన ప్రేమతో అత్యంత అనురాగంతో..
  ఉత్తమ కథని ఎన్నుకోవడమొక టే ధ్యేయంగా మీరు చేసిన ఈ కృషి సదా అభినందనీయం.
  తెలుగు కథని – అత్యంత ఉన్నత శిఖారాగ్రాన నిలిపే మీ ఆశయం సిధ్ధించినందుకు , మీకు – నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.
  ఈ మహొత్కర కఠోర దీక్షా యజ్ఞాలు మీరిలాగే కలకాలం కొనసాగించాలనీ, మధుర ఫలాల వంటి మంచి కథలని మాకందిస్తూ వుండాలని, మరిన్ని ఘన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
  గౌరవాభివందనాలతో..
  – ఆర్.దమయంతి.

  – ఆర్.దమయంతి.

 2. Vijaya Karra says:

  చదవాలన్న ఆకాంక్షని మరో పదింతలు చేసింది మీ సమీక్ష – Thank you !

 3. చొప్ప.వీరభధ్రప్ప says:

  పుస్తకంలోని చాల విషయాలు సంక్షిప్తంగా విశ్లేషించి పండించిన విషయం చదివిన తర్వత ఆ పు‌స్తకాన్ని చదవబోయే తీపి గుర్తులు మనసును తాకుచున్నాయి. ఈ వ్యాసం ఆసక్తి కరంగా వ్రాసినవారు అభినంద నీయులు.

 4. ఇంత ప్రక్రియ తరువాత, చివరి వడపోతలో కేవలం 12 కథలు మాత్రమే మిగలడం కొంత నిరాశని కలిగించడం మాత్రం వాస్తవం – అని మీరు మరీ అంత వాపోకండి సుమా! మీరు గుర్తిస్తేనే తెలుగు కథల్లో గొప్ప కథలనే భ్రమల్లో ఎవరూ లేరు. అ వచ్చిన కథల్లో మీరు ఎంపిక చేసినవి కాకుండా ఇంకా చాలానే గొప్ప కథలున్నాయి. మీరు నిరాశ పడి నీరసపడకండి.

 5. Bhavani Phani says:

  గొప్ప విశ్లేషణ సర్ , ధన్యవాదాలు

మీ మాటలు

*