నీతి శాస్త్రమూ కాదు, అరాచకవాదమూ కాదు!

kathana

ఒక సంకలనం కోసం, కొన్ని వందలు వేల కథల్లోంచి డజను లేదా డజనున్నర మంచి కథలను ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే అవసరమవుతుంది. మంచి కథ అని దేనిని అనవచ్చు? అందుకు ఏది సిసలైన ప్రాతిపదిక? తరచు ఎదురయ్యే ప్రశ్న ఇది.

ప్రపంచ కథాసాహిత్యంలో ‘క్లాసిక్స్‌’ అని వి.ఎస్‌. ప్రిచ్చెట్‌ భావించిన కథలు (ఆక్స్ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, ఆక్స్ఫర్డ్‌ ప్రచురణ) వేరు, క్లిఫ్టాన్‌ ఫాడిమన్‌ ఎంచిన కథలు (పాన్‌ బుక్స్‌ లిమిటెడ్‌, లండన్‌ ప్రచురణ) వేరు. అట్లాగే సమకాలీన లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో చక్కని, ప్రశస్తమైన కథలుగా అర్టురోటారెస్‌ రైసెకో సంకలించినవి వేరు, పాట్‌మెక్నీస్‌ మాన్సినీ ఎన్నుకున్నవి వేరు (ఫాసెట్‌ ప్రీమియర్‌, న్యూయార్క్‌ ప్రచురణలు) అని ఆ సంకలనాలు పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. తెలుగులో వివిధ సంస్థలచే ప్రచురితమయ్యే వార్షిక సంకలనాల్లోకి చేర్చుకునే కథల ఎంపిక ప్రమాణాలు విభిన్నంగా ఉండడం, కథల కూర్పు ఆయా సంపాదకుల / సంకలనకర్తల అభీష్టానుసారం లేదా వారి వారి అభిరుచుల ప్రకారం జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.

అంటే కథకు ముందు మనం తగిలించే ‘మంచి’ – కావ్యభాషలో ‘ఉత్తమ’ (ఇంగ్లీషులో ‘the best’)- అనేది అనిర్దిష్టమైన, అస్పష్టమైన, ఆత్మాశ్రయకమైన, సాపేక్షమైన విశేషణమేనా? ఉత్తమ కథల ఎంపికకు సంకలనకర్తల whims and fancies ఆధారమా?

నేను ఔననే అంటాను. వందలు, వేల కథల్లోంచి ఒక డజను లేదా డజనున్నర కథలను ఉత్తమమైనవిగా ఎంపికచేసే క్రమంలో సంపాదకుని/సంకలనకర్త వ్యక్తిగత అభిరుచులు, ఇష్టానిష్టాలు, దృక్పథం, మనఃప్రవృత్తి, భావావేశం తప్పక ప్రభావం చూపుతాయి. దేనినిగానీ ‘ఉత్తమం’ అని నిర్ధారించడానికి ఇక్కడ అబ్సొల్యూట్‌ టర్మ్స్‌ లేవు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు.

అయినప్పటికీ- తన నిర్ణయంలో శాస్త్రీయత, హేతుబద్ధత గరిష్టస్థాయిలో వున్నాయని చెప్పుకుని సమర్థించుకునే వీలు సంపాదకునికి వుంది. అదెప్పుడంటే- సాహిత్యం సామాజిక ప్రయోజనం పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయంతోపాటు సాహిత్యాన్ని వస్త్వాశ్రయంగా విశ్లేషించగల విమర్శనాదృష్టీ, ప్రత్యేకించి ఒక విశిష్ట సాహిత్యప్రక్రియగా కథ పరిణామవికాసాలు, దాని ప్రస్తుత కొత్త పోకడల గురించిన అవగాహనా తనకు తగినంతగా ఉన్నప్పుడు.
సాహిత్యం శూన్యంలోంచి ఉద్భవించదు. కాలం, మనుషులు, సాంఫిుక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు- ఈ నాల్గింటి పర్యవసానమే సాహిత్యం. మనిషి ఆలోచించగల, అనుభూతించగల, వివేచించగల జీవి కాబట్టి వ్యవస్థలతో సంఘర్షించడం, అవస్థలకు ప్రతిస్పందించడం తన నైజం. అతని సంఘర్షణ, సంవేదన, స్పందనల, భావోద్వేగాల ప్రతిఫలనరూపాలే వేల సంవత్సరాల పూర్వం నుండి వస్తోన్న కళలూ, సాహిత్యం. మానవ సమాజ పురోగమనానికి సైన్సు (విజ్ఞాన శాస్త్రం) ఎంతగా దోహదపడుతూ వస్తున్నదో కళలు, సాహిత్యం సైతం అంతగా తోడ్పడుతున్నాయి. మన చుట్టూ ప్రకృతిలోని నిగూఢత్వాన్ని ఛేదించే ప్రయత్నమే సైన్సు. మన జీవితంలోని గందరగోళత్వానికి, విరోధాభాసలకు భాష్యం చెప్ప ప్రయత్నించేదే సాహిత్యం. అయితే సైన్సు ఫలితాలు, ప్రభావాలలాగా సాహిత్యం ప్రభావం భౌతికంగా తక్షణరూపంలో కనపడదు. మనుషుల భౌతికావసరాలను సులువుగా తీర్చే సాధనాలు, సామాగ్రిని సైన్సు సమకూరిస్తే, వారి చైతన్యస్థాయిని పెంచగల, ఆలోచనాపరిధిని విస్తృతపరచగల జీవిత సత్యాలను తెలియజేసే vicarious experience సృజనాత్మక సాహిత్యం అందిస్తుంది. ‘At its best it (literature) evokes unifying emotions; it makes the reader see the world momentarily as a unity’ అని ఒక మహానుభావుడు అన్నది ఇందుకే. జీవితాన్ని జీవించేందుకు అనేక అవకాశాలున్న ఈ లోకంలో తన అస్తిత్వానికి అర్థం వెతుక్కునేందుకు మనిషి పడే ప్రాకులాట, లోకం ఇలా కాకుండా మరోలా వుంటే బాగుండుననే అతని ఆశల, ఊహల విస్తృతి లక్ష గొంతుకల్లో సాహిత్యం ద్వారానే మనకు వినబడతాయి. వివిధ కాలాల్లో విభిన్న పాత్రలుగా పఠితకు కనపడే ఈ మనిషి మానవజాతి ప్రతినిధి అని వేరే చెప్పనక్కర్లేదు. కెన్నెత్‌ బర్క్‌ అన్నట్టు ‘literature serves as equipment for living’ కనుకనే అనాదిగా అది ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవనంలో విడదీయలేని భాగమైపోయింది.

సాహిత్యసృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలనసూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్‌ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (the eternal in the man), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు. రచయిత, సాహిత్యం, సమాజం- ఈ మూడూ ఒకటి మరోదానిపై ప్రభావం కలుగజేసుకుంటాయి. కాబట్టి సాహిత్యం ఎల్లప్పుడూ సామాజిక వర్తమానతను ప్రతిబింబిస్తూంటుంది.

సోఫోక్లీజ్‌, షేక్స్‌ పియర్‌, బెకెట్‌, సార్త్రెల నాటకాలు, టాల్‌స్టాయ్‌, దస్తోవ్‌స్కీ, గంథర్‌గ్రాస్‌, గెథే, ఎమిల్‌ జోలా, మార్క్వెజ్‌ల నవలలు ఈ విషయాన్నే నిదర్శిస్తాయి.

సాహిత్యసృజన వివిధ ప్రక్రియ (genre) లలో సాగుతుంది. కథ (short story) వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. రూపంలోనూ, సారంలోనూ కొత్త సరిహద్దులను తాకుతూ అది తనను తాను పునర్‌ నిర్వచించుకుంటూ వస్తున్నది. కొండొకచో దండాన్వయానికి, వ్యాఖ్యానానికి లొంగీ లొంగక దోబూచులాడటం కథ విలక్షణత.

కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవం లోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్త కోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్‌ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్వ్శం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా.

కథ లక్షణాలకి సంబంధించి అదంతా ఒక పార్శ్వం మాత్రమే. అయితే కథ ప్రయోజనం (impact) ముఖ్యమనీ, దాన్నిబట్టే కథ గుణగణాలను నిర్ధారించ వీలువుతుందనీ మనకు తెలుసు. ఆ impact ఎలా ఉండాలి? సరళమైన భాషలో బ్రిటిష్‌ రచయిత విలియం బాయ్డ్‌ ఒక సందర్భంలో ఇలా అన్నాడు: ‘Short stories are snapshots of the human condition and of human nature, and when they work well, and work on us, we are given the rare chance to see in them more than in real life.’ అలాంటి ప్రయోజనం నెరవేర్చే కథలు అనగా- ఆకట్టుకుని ఆలోచింపజేసే కథలు ప్రశస్తమయిన (brilliant) కథలు. అవి మన కళ్ల ముందు మరో ప్రపంచాన్ని చూపెడతాయి. ఇప్పటిదాకా లోకంలో చూసిందీ, మన చుట్టూ మనుషుల గురించి తెలిసిందీ చాలా తక్కువేనన్న సత్యాన్ని స్పురింపజేస్తాయి. రచయిత ప్రతిభ పై impact ఆధారపడి వుంటుంది. తెలుగులో చీకటి (అల్లం శేషగిరిరావు), ఇంగ్లీషులో ‘Another way to Die’ (హరూకి మురకామి) కథలు ఇందుకు ఉదాహరణలు.

మామూలు లేక సంక్లిష్ట సామాజికాంశమైనా, వైయక్తిక మీమాంసైనా, మనిషి సంకటస్థితి (predicament) అయినా- దాన్ని తాను అర్థం చేసుకుని ఏర్పరచుకున్న దృక్పథాన్ని కమ్యూనికేట్‌ చేసేందుకు రచయిత, all art is an order to form సూత్రం ప్రకారం, కొన్ని పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలను ఒక చట్రంలోకి ప్రవేశపెట్టి, వాటి మధ్య సంబంధ బాంధవ్యాలను కల్పించి, మన మస్తిష్కం లోని అంతర్నిహిత కుతూహల ప్రేరకాలను తాకేలా వాటిని కదిలిస్తాడు. తన కమ్యూనికేషన్‌ పఠితకు అందేలా చేయడానికి తానెంచుకున్న పద్ధతి ప్రకారం కథనం (narration)లో ఎత్తుగడ, విస్తృతి, ముగింపులకు స్థానమిస్తాడు. కథకు అవసరమని భావించిన మేరకే పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, ప్రస్తావనలు ప్రవేశపెడతాడు. సన్నివేశాలు, పాత్రలు వాటి చర్యలు గతిశీలంగా వుండేటట్టు చూస్తూ ఒక సత్యం బహిర్గతమయ్యే పాయింటు వైపుగా మొత్తం యాక్షన్‌ను కేంద్రీకరిస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే కథానిర్మితిపరమైన ‘శాస్త్రీయత’ (exactitude) పాటిస్తాడు. ‘Smaller in its overall dimensions than the novel, it is a fiction in which society is surmised as the darkness around the narrative circle of light. In other words, the scale of the short story predisposes it to the isolation of the self.”

తాను చెప్పదలుచుకున్నది చదువరి గ్రహించినా గ్రహించకపోయినా ముందుగా తన రచన పఠనీయంగా వుండేటట్టు రచయిత కసరత్తు చేయాల్సి వుంటుంది. కుతూహలం రేపే అంశాలు కథలో పొందుపరిచి ఉన్నప్పుడే అది ఆసక్తికరంగా తోస్తుంది, ఆసాంతం చదివిస్తుంది. ‘ప్లాట్‌’ (ఇతివృత్తం)ని ఉత్కంఠభరితంగా నిర్మాణం చేయడం, గతంలో వేరే ఎవరూ స్పృశించని అంశాన్ని కథావస్తువుగా స్వీకరించడం, మనం సాధారణం అని భావించే సమస్యను కొత్తకోణంలో ఆవిష్క రించడం, పాలకవర్గాలు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలను, సమకాలీన రాజకీయాల కుళ్లును హాస్య, వ్యంగ్యధోరణిలో విశ్లేషించడం… ఇవన్నీ చదువరులలో ఆసక్తి రేకెత్తించే కథన పద్ధతులు. రచయిత శ్రద్ధ పెట్టాల్సిన మరో విషయ మొకటుంది. అది కథాసంవిధానానికి సంబంధించినది. పాత్ర(ల) సంకటస్థితితో, సంఘర్షణతో, భావోద్వేగాలతో పఠిత మమేకమైపోయి, అవన్నీ తానే స్వయంగా అనుభవిస్తున్న ఫీలింగ్స్‌ కలిగేలా వాతావరణ చిత్రణ, పరిసరాల వర్ణన, సన్నివేశాల సృష్టి, ఘటనల పరంపర కథలో వుండాలి. అలా పాత్ర సంకటస్థితితో, పఠిత సంలీనమైపోయేంతగా ఆసక్తిగొలిపే కథానిర్వహణనే ‘శిల్పం’ అంటారు. అనుభవం, అధ్యయనం, అనుశీలనం, ఊహాపటిమ వున్న రచయితకు సాధారణంగా ఈ నేర్పు వుంటుంది. మంచి కథలో వస్తువు తాజాదనం గుబాళిం చడంతో పాటు వస్తువుకు తగ్గ శిల్పం వుంటుందని విమర్శకులు అందుకే అంటుంటారు.

కథాసాహిత్యం పట్ల ప్రత్యేకమైన అభిరుచి కలిగి వున్నవాడిగా లభ్యమైన కథలను క్రమం తప్పకుండా పరిశీలిస్తున్న నేను, గత పదిహేనేళ్ల నుండి తెలుగు కథలో కనపడుతోన్న గుణాత్మకమైన మార్పు గమనిస్తున్నాను. ఒకప్పటి విప్లవోద్యమ హోరు నేడు వినిపించడంలేదు. సామాజికాంశాల కన్నా వైయక్తిక సమస్యలు, స్పందనలు ఇవాళ్టి రచయితలకు కథావస్తువులవుతున్నాయి.  విశేషమేమిటంటే ఆధునిక జీవితంలోని కొత్త కోణాలను వారు ఒడుపుగా పట్టుకుంటున్నారు. తరాల అంతరాలు, పాత ఆచారాలు-కొత్త ఆలోచనల నడుమ ఘర్షణ, అర్థాలు మారుతున్న విలువలు, కొత్త నిర్వచనాల్లోకి ఒదిగిపోతున్న స్త్రీ పురుష సంబంధాలు, వైయక్తిక సుఖలాలస, భౌతిక వస్తుసంపత్తి వుండీ అయినవాళ్లు లేక ఒంటరితనంలో కూరుకుపోతున్న మనుషులు, ప్రపంచీకరణ ప్రభావాలు, అభివృద్ధి ఫలాలు అందని వర్గాల ఆందోళన, దళితుల, బిసిల, మైనారిటీల, మహిళల ఐడెంటిటీ అసర్షన్‌, విస్మృత వర్గాల అస్తిత్వ చైతన్యం… ఈ సంక్షుభిత వర్తమానమంతా వారి కథలకు అక్కరకొచ్చే సామాగ్రే.

ఈ సంకలనంలో చేర్చడానికి 15-20 మంచి కథలను ఎంపిక చేసేందుకు పూనుకున్న మేము 2015 సంవత్సరంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన దాదాపు రెండు వేల కథలను సేకరించి వంతులవారీగా పరిశీలించాము. ముందుగా ఈ భారీ కథలరాశిలోంచి తాలును తూర్పారబట్టేందుకు ఒక ప్రాతిపదిక రూపొందించుకున్నాము. దీని పై మా నలుగురి- ఇద్దరు సిరీస్‌ ఎడిటర్లు, ఇద్దరు గెస్ట్‌ ఎడిటర్ల- నడుమ ఏకీభావం వుంది.
1. వినూత్నమైన శైలీ, శిల్పాలతో కూడిన కథనం, 2. కథావస్తువుకు సంబంధించి కొత్త సరిహద్దుల్లోకి ప్రవేశం, 3. సాధారణ అంశమే అయినా ఆవిష్కరించిన తీరులో సరికొత్తదనం, 4. అర్థవంతమైన ప్రయోగం, 5. అత్యంత ప్రాధాన్యమూ, ప్రాసంగికత కలిగివున్న సమకాలీన సమస్య, 6. విస్మృత వర్గాల జీవితచిత్రణ (వాళ్ల భాష యాసలోనే).
పై వాటిల్లో కనీసం ఒక్క షరతునైనా సంతృప్తిపరచని కథలను పక్కన పడేశాం. అన్నీపోగా 25 కథలు మిగిలాయి. నలుగురం మూడుసార్లు కూర్చుని చర్చించాక, మరో రెండు వడపోతల తర్వాత నిలబడ్డ గట్టి కథలు పన్నెండు మాత్రమే. వాటితోనే సరిపెట్టుకోక తప్పలేదు.

వీటిలో స్త్రీ-పురుష సంబంధాలను విశ్లేషించిన కథలు మూడున్నాయి. విప్లవ ఆదర్శాలు, లక్ష్యాల నెపంతో మగవాడు భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి పోగలడు కానీ వంటరిదైన స్త్రీ బతుకీడ్చి పిల్లలను రేవుకు తేవడానికి ఎన్నో కష్టనష్టాలు భరించాల్సి వస్తుంది. అంతులేని సంఘర్షణ, కన్నకొడుకు వ్యతిరేకత- ఈ నేపథ్యంలో స్త్రీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని స్త్రీ కోణంలోంచే తెలియజేసిన కథ సావిత్రి. ఆడపిల్ల ఎదుగుతున్న క్రమంలోని వివిధ దశల్లో మగవాళ్ల గురించిన ఆమె ఆలోచనలు, అభిప్రాయాలు, మోహాలు, విరహాలు, స్వేచ్చా తపనలను ఆవిష్కరించిన కథ తొమ్మిదో నెంబరు చంద్రుడు. భావుకత నిండుగా వున్న కవితాత్మక శైలి, నిర్నిరోధమైన భావప్రకటనకు ఎంచుకున్న డిక్షన్‌ వల్ల ఇందులోని ఉత్తమ పురుష కథనానికి ఆకట్టుకునే గుణం వచ్చింది.

‘మనుషులకి అన్నిరకాల స్వేచ్చలూ వుండాలి, అదే అంతిమ విలువ’ అనే ఆధునిక భావన పునాదిగా స్త్రీ-పురుషుల సహజీవనం ఒక ట్రెండ్‌గా ఇప్పుడిప్పుడే మొదలైనా మన సమాజంలో ఇరువురికీ సమానంగా వర్తించే స్థాయికి ఆ భావన ఇంకా ఎదగలేదు. స్త్రీ మనోభావనలను, స్వేచ్చాపిపాసను స్త్రీ కోణంలోంచే హృద్యంగా వివరించిన కథ శతపత్ర సుందరి.

దళితుల జీవితం ఇతివృత్తంగా కల కథలు మూడు వున్నాయి. చివరి చర్మకారుడూ లేడు… కథలో ముసలి డానియేలు తర్వాతి తరంవారు- తమ్ముడు, అతని కొడుకులు- వేరే ఉపాధులు వెతుక్కుని మునుపటి నిమ్నస్థాయి నుండి పైకి ఎదిగిన వైనం కనపడితే, నేను తోలు మల్లయ్య కొడుకుని కథలో పాత, చెప్పులు కుట్టే వృత్తిని వదులుకోలేక, మరో వృత్తి వెతుక్కోలేక సతమతమయ్యే మారయ్య గుంజాటన కనపడుతుంది. దళిత కుటుంబాల్లో నేడు కనపడుతున్న పరిస్థితి రెండు రకాలుగా వుంది. ఒకటి- పాతవృత్తిని వదులుకోలేని వెనుకబాటు తనం, రెండోది- వేరే ఉపాధులు చేపట్టి సామాజిక నిచ్చెనమెట్లు ఎగబాకటం. రెండో కథ ఒక ప్రశ్న అయితే, మొదటి కథ దానికి జవాబు. Non-linear బహుళ దృక్కోణ కథనం వల్ల చివరి చర్మకారుడూ లేడు ఆసక్తికరంగా వుంటుంది.

ఇక మూడో కథ పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన విలక్షణమైనది. మన సమాజంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థ తాలూకు కుళ్లు కంపు మతమార్పిడి- క్రైస్తవం పుచ్చుకున్న- తర్వాత కూడా గబ్బు కొడుతున్న యథార్థాన్ని వ్యంగ్య ధోరణిలో చెప్పిన కథ యిది.

ఇక మిగతా కథల గురించి. బడిపిల్లల ఎండాకాలం తాతిల్‌ (సెలవులు) మూడు తరాలవారికీ విశ్రాంతినిచ్చి శారీరకంగా, మానసికంగా సేదదీర్చే ఋతువు. ఈ సూక్ష్మం మన గ్రామీణ ప్రజలకు తెలుసు గనుకనే వారి కుటుంబబంధాలు, మానవ సంబంధాలు గట్టివి అని తెలియజేసే కథ తాతిల్‌.

అప్పులతో బేజారై నిరాశా నిస్పృహలతో కూరుకుపోతున్న రైతులోకానికి ప్రతినిధి ఊరవతల ఊడలమర్రి కథలోని నారాయణ. కానీ అందరిలాగా తను ఆత్మహత్య చేసుకోలేదు- ఊరంతా ఉరేసుకునే ఊడలమర్రిని తెగ నరకడానికి పూనుకున్నాడు. ఒక సామాజిక జాడ్యం పట్ల తిరుగుబాటును ప్రతీకాత్మకంగా తెలిపి ఆశావహ దృక్పథం చాటిన కథ.
భౌగోళిక తెలంగాణాయే కాని సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నది చాలా మంది భావన. సబ్బండ వర్ణాలు కలిసి బతుకమ్మ ఆడటమనేది వేదికలకు, రాజకీయ సభలకు మాత్రమే పరిమితం కానీ ఊళ్లల్లో కాదు- ఈ పారడాక్స్ ని అంటరాని బతుకమ్మ కథలో చూడవచ్చు.

వడ్డీలెక్కల్లోకి పోకుండా అసలు మాత్రమే తీసుకుని అక్క వాటా భూమినీ, బీడునీ అక్కకిచ్చేస్తుంది నాగేస్పరి. రాతి మిద్దాయిన చిన్న కుమార్తె నాగేస్పరికున్న దొడ్డమనసు అందరికీ వుంటే సమాజం ఎంత బాగుండునో. కథలో చిత్తూరు మాండలికాన్ని, అక్కడి నుడికారాలను సొంపుగా వినిపించాడు రచయిత.

అతి సున్నిత పరికరమైన థియోడలైట్‌ని ఒక సవరజాతి కొండమనిషి డుంబ్రి, తన ప్రాచీన పనిముట్లతో మరమ్మత్తు చేసిన వైనాన్ని ఒక anecdote లాగా వివరించడం మూడుకోణాలు కథలో చూస్తాం. ‘ఇక్కడి శాస్త్రాలు ఆధునిక కాలంలో ఎక్కడికి పోయాయో,’ అంటూ కార్క్సన్‌ దొర వేసిన ప్రశ్న ఇప్పుడు మనమూ వేసుకోవాలి. కొండ ప్రాంతాల్లో కదలిక (అభివృద్ధి) రావడానికి చాలా కాలం ఎందుకు పడుతున్నదో కూడా మనం ఆలోచించాలి.
చెదిరిన వాస్తవాన్ని ఒక పల్లెమనిషి కల రూపంలో నీరెటుకాడి కలలో చూస్తాం. ఊరూ, నీటితావుల జలకళ, పచ్చని పరిసరాలు, వీటి మధ్య మన బాల్యం, మన బతుకు… గుర్తు చేసుకుంటూ మనమూ కలల్లో తేలిపోతాం.

ఇవీ మా దృష్టికి వచ్చిన కథలు. మా కోణంలో పరిశీలించి మాకున్న అవగాహనతో వీటిలోని వస్తు, శైలి, శిల్పాలను నిర్ధారించి బాగున్నాయని ఎంచిన కథలు. కథలను కథలుగానే చూశాం. రచయితలను బట్టి కాదు. కొన్ని కథలు ఇతరత్రా బాగున్నప్పటికీ మేలైన కమ్యూనికేషన్‌ లోపించింది. సమాజహితం కోరేది సాహిత్యం అని మనకు తెలుసు. అయితే సాహిత్యం నీతిశాస్త్రానికి ప్రత్యామ్నాయం కాకూడదనీ, అదే విధంగా అరాచకాన్ని ప్రోత్సహించకూడదనీ మా ఉద్దేశం. కొన్ని విషయాల్లో రాజీపడాల్సి వచ్చిందని ఒప్పుకోక తప్పదు. వస్తువు బాగుందనుకున్న చోట శైలీ శిల్పాలకు ప్రాధాన్యమివ్వలేదు. కమ్యూనికేషన్‌ తీరు బాగుందనుకున్నప్పుడు వస్తువును పట్టించుకోలేదు.

వేల సంఖ్యలో  కథలు  వస్తున్నా  మంచి  కథలకు  కొరత  వుందన్న  వాస్తవం ఉత్తమ అభిరుచి గల సాహితీప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. ఈ పరిస్థితి మారుతుందని ఆశిద్దాం.

ఇక చివరగా, చెప్పకుండా ఉండలేనిమాట. తెలుగు కథాసాహిత్యంలో ఉన్నత ప్రమాణాలను కాంక్షించే కథాసాహితి వారి కృషిలో పాలుపంచుకున్నందుకు సంతోషిస్తున్నాను.
హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

మీ మాటలు

  1. చొప్ప.వీరభధ్రప్ప says:

    ఆడెపు లక్ష్మీపతి గారి వివరణ చాల చక్కగా వుంది. విశ్లేషణ . విజ్ఞానదాయకం .పుస్తకం పేరు .తదితర వివరాలు .కావలసివుంది. ఆన్లైనేకాకుండా m.o ద్వారా అయితే ?…ఎలా?

  2. ఆర్.దమయంతి. says:

    కథల పై మీ అభిప్రాయాన్ని చక్కగా చెప్పారండి. వారం వారం కథలపై మీ విశ్లేషణని ఇలా కొనసాగిస్తే బావుంటుందేమో?
    ధన్యవాదాలు.

మీ మాటలు

*