చుక్కల వెలుగులో కాంతి బాట!

konni sephalikalu

దాదాపు పాతికేళ్ళు అయిందనుకుంటాను. అయినా ‘రష్యన్ గాల్యా’ మేజర్ మూర్తిని వదలనట్టే మేజర్ దక్షిణా మూర్తీ నన్ను  వదలలేదు.  ఈ పాతికేళ్ళుగా చాలా సందర్భాల్లో నా వెనకే ఉన్నాడు.  మనుషుల మితిమీరిన స్వార్ధాన్ని, లౌక్యాన్ని, దొంగ వేషాలని చూసి నేను క్రోధంతో ఊగి పోయినప్పుడు ‘గాల్యా’ తో పాటుగా నన్ను సాంత్వన పరచాడు.

అవును. సాహిత్యం, మనం దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా తీసుకోవాలే గాని మనని ఎంతయినా మార్చగలదు.  స్థిమితపరచగలదు.  ఒక్క సాహిత్యమేనా ? ఏ కళారూపమయినా అది నిజమయిన కళారూపమయితే ఆ పని చెయ్యగలదు.  దాన్ని నిరూపించడానికే ఈ రష్యన్ అమ్మాయి గాల్యా కథతో ముడిపడిన మేజర్ మూర్తి కథను మళ్ళీ మళ్ళీ తల్చుకోవాలనుంది.

ఆర్టిలరీ రెజిమెంటు అంటే ఫిరంగి దళం. అక్కడ పెద్ద పెద్ద వృక్షాల మధ్య రాబర్ట్ క్లైవ్ కాలం నాటి సున్నపు స్తంభాలున్న భవనం ఆఫీసర్స్ మెస్.  రకరకాల ఉద్యోగుల రకరకాల హాబీల మధ్య తెల్లటి షర్టు మీద మట్టి మరకలతో ఉన్న మేజర్ మూర్తిని పరిచయం చేస్తాడు రచయిత.  మేజర్ మూర్తి మంచి ఆటగాడు.  మెస్ సెక్రటరీ, రెజిమెంటల్ ఫిల్మ్ క్లబ్ కు సెక్రటరీ, ఇంకా లైబ్రరీ పుస్తకాల పురుగుగా బుక్ వర్మ్.

ఒకనాటి డిన్నర్ తర్వాత జరిగిన ఫిల్మ్ షోలో సబ్ టైటిల్స్ ఉన్న రష్యన్ పిక్చర్ తెప్పించి వేయించాడు కెప్టన్ దేవగుణ్.  ఆర్ట్ ఫిల్మ్ అంటే మూర్తికీ ఇష్టమే.రష్యన్ ఫిల్మ్ అద్భుతంగా ఉంది.  వంద నిముషాల సినిమా.  ‘వేరా పనోవా’ కథ.  కథ, నటన, ఛాయా గ్రహణం అద్భుతం అన్నారందరూ.  అందులో మూర్తి తనను చూసుకున్నాడు.  సినిమాలో ప్రధాన పాత్ర గాల్యా ‘యువతి’ కాకపోతే కథలో చాలా ఘట్టాలు తనవే అనుకున్నాడు.

ఇది మునిపల్లె రాజుగారి ‘సవతి తమ్ముడు’ కథ. జీవితానుభవాల లోంచి తాత్వికపులోతులు చూసి ఆ సారాన్ని పెరుగు చిలికి వెన్న తీసి అందించినంత సులువుగా పాఠకులకు అందించిన కథ.

దక్షిణా మూర్తి కి రేజిమెంట్ లో కొన్ని ముద్దు పేర్లున్నాయి.  వాటికి తోడు మిలటరీ హాస్పిటల్ లో ఇంకో నిక్ నేమ్  ఉంది.  మిలటరీ డాక్టర్లు అతన్ని ‘బబుల్స్’ అని పిలుస్తారు.  అతనికి హిందీలో అన్ని ప్రాంతీయ నుడికారాలూ తెలియడం ఒక కారణమైతే, అలా పిలవడానికి మరో ప్రధాన కారణం అతని కుడి కణత మీద మిల్లీ మీటరు లోతున రెండుగాయాల మచ్చలు ఉండడం. అవి అతన్ని జీవితంలో ఎక్కడా ఓడిపోకుండా పోరాడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేసిన మచ్చలు.

అతని సవతి తల్లి వంట చేస్తూ చేతిలో ఉన్న పట్టకారును బలంగా విసిరితే కుడి కణతకు తగిలి రక్తం కారింది. మూర్ఛ పోయేడు.  మూర్ఛ పోయేముందు ‘నాన్నా అన్నయ్య చచ్చి పోయాడు’ అన్న తమ్ముడి ఆర్తనాదమే జ్ఞాపకం.  తల్లి చనిపోగానే తండ్రి మళ్ళీ పెళ్లి , సవతి తల్లి పెట్టిన బాధలు.  ఆమెకు పుట్టిన కవలలు వెంటనే పోయిన ఆమె బాధ సవతి పిల్లాడి మీద ద్వేషంగా మారింది.

ఆమె పెట్టిన బాధలతో జీవిత యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కణత మీద దెబ్బ, తరవాత పుట్టిన సవతి తమ్ముడి ఆర్తనాదం కలగాపులగంగా అతని అంతశ్చేతనలో ఉండిపోయి గెలుపుకోసం పోరాటం.

ఇల్లు వదిలి దేశ దిమ్మరి అయ్యాడు.  లెక్కల్లో ఎప్పుడూ ఫస్టే.  జీవితంలో ప్రతి మలుపులోనూ లెక్కల అవసరం తెలుసుకున్నాడు.  అంచెలంచెలు గా ప్రయాణం, ఎక్కడో ఎవరో దయాముర్తుల ఆదరణ.

నారాయణ్ దత్ జోషి ఎందుకు అభిమానించాడో తెలియదు.  చదువు తరవాత జోషి గారి స్నేహితుడి సహాయంతో కంటోన్మెంటు ఆఫీసరుగా ట్రైనింగ్ ఆర్డర్లు, శిక్షణ, ఆరితేరాడు.

“సాహిత్యంతో పరిచయం పెరిగింది.  ఇల్లు లేకపోయినా ఎల్.టి.సి., దేశంతో పరిచయం చేసింది.  కజిరంగా నుంచి కన్యాకుమారి వరకు ప్రకృతి సంపద, శిల్ప సంపద. ఈ భూమిని పురాతన కాలం నుంచీ ప్రభావితం చేసిన చరిత్రనంతా కళ్ళతో చూడడం సైన్యంలో ఉండడం వల్లనే సాధ్యమయింది.

105 ఎం.ఎం. గన్  గాని 130 ఎం.ఎం. భోఫోర్సు గానీ ‘మేజర్ మూర్తి, ఆర్టిలరీ, అతి విశిష్ట సేవా మెడల్ బోర్డు చూడగానే జోహార్లు చేయవలసిందే”  ఇవన్నీ రచయిత మాటలు.  తల్లికి – పద్మాసనంలో ఉండి ప్రాణం వదిలిన తల్లికి- శ్రాద్ధం పెట్టడం కోసం, ఆ అర్హత కోసం జోషీ గారి చేత ఉపనయనం చేయించు కున్నాడు.  అంతే. తండ్రి, సవతి తల్లి, తమ్ముడు ఇల్లూ ఏమీ లేవు.

అంత అందంగా లేని దస్తూరీతో తమ్ముడి నుంచి ఎన్నో ఏళ్ళకి ఉత్తరం.  నాన్న పోయాడని, పొలం వేలం వేసారని, అప్పులు తీరలేదని అమ్మ బాధ పడుతోంది, చెల్లి మళ్ళీ పరీక్ష తప్పిందని, అంతా రాసి తనను యునిఫాం డ్రెస్ లో చూడాలని ఉందని కోరుతూ రాసాడు.

ఆ ఉత్తరం మేజర్ మూర్తిలో ఏ వికారమూ కలిగించ లేదు.  మౌనంగా, ఉత్తరం ముక్క లేకుండా వెయ్యి రూపాయలు డ్రాఫ్ట్ పంపి ఊరుకున్నాడు.  పిన్ని, సవతి తమ్ముడు తను చూడని చెల్లీ ఎవరూ అతని జ్ఞాపంలో లేరు.

రష్యన్ సినిమాలో ‘గాల్యా’ కథ కుడా ఇదే.  సవతి తల్లి బాధల నుంచి స్కూల్ టీచర్ ‘ఎలిజబెత్ ఆండ్రి యేవనా’ అనే దీపం సహాయంతో మాస్కో నగరానికి వచ్చింది.  థియేటర్ స్కూల్ లో చేరి సహజమైన ప్రజ్ఞ, ఉపజ్ఞల సహాయంతో నటిగా ఎదిగింది.  ఉత్తమ పాత్రలు ధరించింది.  పెద్ద జీతం  తీసుకుంటోంది.  ఇష్టం లేకపోయినా వెండి తెరకు కుడా పరిచయమయింది.  స్టేజి ఉత్సవాలలో భాగంగా విదేశాలకు వెళ్లి మూడు నేలల తర్వాత తిరిగి వచ్చి మూడు నెలల క్రిందట  రాసిన చెల్లి ఉత్తరం చూసింది.

దక్షిణా మూర్తి కి అందిన ఉత్తరం లాంటిదే.

గాల్యాకు ఎర్రటి కళ్ళతో భయపెట్టే సవతి తల్లి గుర్తొచ్చింది. తండ్రి మరణం, చివరకు విమానంలో తన ఊరికి బయలుదేరింది.  సవతి తల్లికి, చెల్లెళ్ళకూ చిన్న చిన్న బహుమతులు, తనకు సహాయం చేసిన రిటైరయిన టీచరుకు, ప్రపంచాన్ని చూడడం నేర్పిన పుస్తకాలు అందించిన లైబ్రేరియన్ కు కూడా బహుమతులు తీసుకొంది.

గాల్యా తండ్రిసమాధి ముందు మోకరిల్లింది.  పాత టీచరు ఉంది గాని లైబ్రేరియన్ లేదు.  సవతి తల్లిలో మార్పు లేదు.  బహుమతుల మీదే ఆసక్తి చూపించింది.  చెల్లి తనలాగే అందమైంది.  ఇద్దరూ ఆ రాత్రంతా ఒకే మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకున్నారు. చెల్లి ఎన్నో సంగతులు చెప్పింది.  గాల్యాకు చెల్లెలితో మాటలతో పాత  ద్వేషమంతా కరిగిపోయింది.  కరుడు గట్టిన మొరటు భావాలతో ఉన్న ఈ ఇంట్లో ఆమెను ఉంచకుండా తనతో తీసుకుపోవాలి.  మాస్కోకు తీసుకుపోయి అక్కడే సారస్వతంలో పెద్ద చదువు చదివించి లెక్చరర్ ను చెయ్యాలి.   ఆమె ఇష్టం కుడా అదే కాబట్టి దాన్ని నెరవేర్చాలి.

సినిమా అయిపొయింది గాని మూర్తికి ఆగిపోయిన జీవితం మొదలయింది.  “ఈ రష్యన్ గాల్యా చాలా అసాధ్యురాలు, చాలా ఆలోచనల్ని రేగగొడుతోంది” అనుకున్నాడు.  అంత వరకు జీవితంలో దేశ దిమ్మరిగా మొదలుపెట్టి అనేక సామర్ధ్యాలు  సంపాదించుకుని ఒక ఎత్తైన పీఠం మీద కూర్చున్నాను అనుకున్న మూర్తి జీవితంలో ఓడిపోలేదన్న నినాదంతో ఆత్మవిశ్వాసాన్ని దాని పరిమితినీ, స్థాయినీ దాటి పెరగనిచ్చాడు.  అలాంటి మేజర్ మూర్తి గర్వాన్ని గాల్యా కడిగేసింది.

తన బాల్యాన్ని నలిపి, చిదిమి, చింపి పారేసిన వాళ్ళ మీద ఉన్నకక్ష ఆ ఇంట్లోనే ఉన్న పిల్లల మీద చూపితే ఎలా ?  వాళ్ళు తన చెల్లి, తమ్ముడే కదా అన్న నిష్కల్మష ప్రేమ అతని మనసులో ఉదయించడానికి ‘గాల్యా’ కారణమయింది.

మేజర్ దక్షిణామూర్తి కి ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి.  కానీ అతను చార్జి తీసుకోవడానికి హడావిడి పడలేదు.  సెలవు కావాలని ఎప్పుడూ సెలవడగని మనిషి అడిగేడు.  కల్నల్ జగన్నాధ్ విరగబడి నవ్వుతూ “ఇప్పుడెందుకయ్యా నీకు సెలవు” అన్నాడు – “సార్ మా తమ్ముడ్ని మంచి స్కూల్లో చేర్పించాలి, వాడు అక్కడుంటే చెడిపోతాడు” అన్నాడు మూర్తి.  ఆ చివరి వాక్యంతో కథ పుర్తయిపోతుంది.

ఎవరెవరి మీదో ఉన్న ఎప్పటెప్పటి కోపాలో అనివార్యంగా మోసుకుంటూ తిరుగుతాం.  ఎంతటి సంతోష సమయాల్లో కూడా తీసి పక్కన పెట్టలేం.  కానీ పక్కన పెట్టడం ఇంత సులువుగా చెయ్యవచ్చని ఈ కథ చదివితే నాకు అనిపించింది.  అనిపించడమే కాదు అలా చెయ్యడం ప్రాక్టీసు- సాధన అంటే మరీ పెద్ద మాట అవుతుందేమోనని ఈ ఆంగ్ల పదం వాడేను-  చేసేను.  చేస్తూ ఉన్నాను.  అలా ఈ కథ నా వెంట ప్రయాణిస్తో వస్తోంది.

మూర్తి ఇంకొక మాట అంటాడు.  ఆ మాటకి ముందు “యుద్దంలో పలాయనం చేసిన వాళ్ళున్నారు. ప్రేమలో పలాయనం చేసిన వాళ్ళు ఉండవచ్చు.  ఈ దురంత నిశిత స్మృతుల నించి పారిపోగల శక్తి ఎవరికీ ఉండదేమో అనుకుని లైబ్రరీలో స్విచ్ వేసి పుస్తకం తెచ్చుకున్నాడు.  అప్పుడు ఇలా అనుకున్నాడు.  “గోల్కొండలో ఉండగా కొన్ని తెలుగు పుస్తకాలు, ముద్దు కృష్ణ వైతాళికులు, దువ్వురి రామారెడ్డి మధుశాల, వేదుల వారి పద్యాలు, రాయప్రోలు వారివి కంఠతా కొన్ని, తడుముకొంటే కొన్ని, జాషువా సంగతి సరే సరి.  జయశంకర్ ప్రసాద్, మహా దేవి వర్మ, ద్వివేది, చతుర్వేది, ఎవ్వరూ తనని ఈ రాత్రి నిద్ర పోనిచ్చేటట్లు లేరు.  గతం ఉంది, వర్తమానం ఉంది, భవిష్యత్తూఉందని  గుర్తించని వాడు సగం మనిషి అంటున్నారు వాళ్ళు” అంటాడు.

మునిపల్లె రాజు గారు మనిషిలోని సమస్త కల్మషాలూ మాలిన్యాలూ సాహిత్యం వల్ల ప్రక్షాళితం అవుతాయంటున్నారు.  సవతి తమ్ముడు కథలో దక్షిణా మూర్తి క్షమ చూస్తే, అంత కంటే ఎక్కువగా గాల్యా క్షమను చూస్తే మనకి కూడా ఎవరేనా సులువుగా క్షమించేయవచ్చని, అలా చెయ్యాలని అనిపిస్తుంది.  మేజర్ దక్షిణామూర్తి ఒక కథలో సాహిత్య రూపంలో పాత్రగా పాఠకుని అంతరంగాన్ని శుభ్ర పరుస్తాడు.

ఇందులో అంటే ఈ కథలో రాజుగారు చూపిన మరొక శిల్ప నైపుణ్యం ఏమిటంటే గొప్ప ఆర్ట్ సినిమా లాంటి కళా రూపం ద్వారా కూడా వ్యక్తిలో మార్పు వస్తుందని ఆయన ఒక కళా రూపం నుంచి మరో కళా రూపాన్ని చూపిస్తూ వాటి తాలూకు శక్తిని చెప్పకనే చెప్పడం అబ్బుర పరుస్తుంది.

మహాభారతం ఉద్యోగ పర్వంలో ధర్మరాజు కృష్ణుడంతటి వాడితో ఒక మాట చెప్తాడు.  “పగయే కలిగినేని పామున్న ఇంటిలో ఉన్నయట్లు కాక ఊరడిల్లి యుండ నెట్లు చిత్తమొక మాటు – కావున వలవధిక దీర్ఘ వైర వృత్తి” అని.  ఇక్కడ పగ అన్న మాటను కాస్త మార్చి ద్వేషం అన్న అర్ధంలో వాడదాం.  అది ఉంటె పామున్న ఇంట్లో ఉన్నట్టే మనస్సు అస్థిమితంగా ఉంటుంది కావున దీర్ఘ కాలం ఎవరితోనూ వైరం ఉండకూడదు.  ఇంకా ఇలా కూడా అంటాడు “పగ అడగించుట ఎంతయు శుభంబు, అది లెస్స” కానీ “అడంగునె పగన్ పగ “ అనీ అంటాడు.

పగను తీర్చుకోవడం మంచిదే కాని దానివల్ల పగ చల్లారుతుందా ? అన్న ప్రశ్నకు సమాధానం ఈ కథ.  జీవితంలో సౌఖ్యానికి స్థిమితం ఎంత ముఖ్యమో, దానికి దారి ఎటు వైపునుంచి ఉంటుందో చుక్కలవెలుగు లాంటి కాంతి  సహాయంతో ఈ అంధకారంలో దారి చూపించేలాంటి ఇలాంటి కథ ఎవరికైనా ఇష్టమవుతుంది.

*

మీ మాటలు

 1. పద్మావతి says:

  ఇక మూర్తి గారు, గాల్య గారిని నేను కూడా ఎప్పుడూ మననం చేసుకుంటాను మేడం! క్షమలో ఉన్న ప్రశాంతత ద్వేషంలో లేదు! జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఎలా క్షమా గుణం కలిగి ఉండాలో తెలిపిన మధురమైన కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మేడం 🙏

  మీ
  పద్మావతి

  • Kb Lakshmi says:

   ఆ కథ నేను చదివాను వీరా!
   కానీ నువ్విలా రాశాకా చదవడం ( నీ విశ్లేషణ ) ఎంతో బాగుంది .
   మరో శేఫాలిక కోసం ఎదురు చూస్తో …
   కె బి లక్ష్మి

   • Vvlakshmidevi@gmail.com i says:

    లక్ష్మీ ధాంక్స్
    ఆ కధ మళ్లీమళ్లీ చదవవలసినదే

  • Vvlakshmidevi@gmail.com i says:

   పద్మా వతిగారూ
   థాంక్యూ వెరీమచ్

 2. కె.కె. రామయ్య says:

  “మనిషిలోని సమస్త కల్మషాలూ, మాలిన్యాలూ సాహిత్యం వల్ల ప్రక్షాళితం అవుతాయని” గుర్తుచేస్తున్న ….
  ” మనుషుల మితిమీరిన స్వార్ధం, లౌక్యం, దొంగ వేషాలు కలిగించే క్రోధం” నుంచి
  సాహిత్యం ద్వారా సాంత్వన, సమ్యవనం పొందటం అలవాటు చేసుకున్న
  కాకినాడ అక్కయ్య గారికి నమస్సులు.

  త్రిపుర తండ్రి “వలసపక్షుల గానం” గురించి రాస్తానన్నారు. ఎదురుచూస్తున్నాము.

 3. కె.కె. రామయ్య says:

  త్రిపుర గారి ఆప్తమిత్ర రామడుగు రాధాకృష్ణ మూర్తి ( RR ) గారికి మిత్రులైన శ్రీ మునిపల్లె రాజు గారి ( 92 ఏండ్ల వయో వృద్దులు ) హైదరాబాదులోని ఇంటికి ఫోను చేసి వారి ‘సవతి తమ్ముడు’ కథ పరిచయం సారంగ అంతర్జాల పత్రికలో కాకినాడ అక్కయ్య డా. వాడ్రేవు వీరలక్ష్మిదేవి చేసినట్లు చెప్పాను. స్వల్పమైన అనారోగ్య కారణాన వారు ఫోనులో మాట్లాడలేకున్నారిప్పుడు.

  మునిపల్లె రాజు గారి “పూజారి” కథ ఆధారంగా బి. యెన్. రెడ్డి ‘పూజాఫలం’ సినిమా (1964) తీసినట్లు RR గారు గుర్తుచేశారు.

  మునిపల్లె రాజు గారి ‘సవతి తమ్ముడు’ కథ కు లింకు :

  http://lit.andhrajyothy.com/stories/savathi-thammudu-743/page/1

 4. చొప్ప.వీరభధ్రప్ప says:

  కథమరోసారి చదివించినంత నేర్పగా విశ్లేషణ వుంది.చిన్న వ్యాసంలో మనస్తత్వ పరిశీలన సమస్యల పరిష్కారదృక్పథం విషయాన్ని చిన్న పేరాగ్రాఫుల్లో చెప్పినతీరు బాగుంది.మరిన్ని పరిశీలించగలరని ఆశ

 5. దేవరకొండ says:

  హితాన్ని కోరేది సాహిత్యం. అది సాహిత్యానికుండే ప్రధాన లక్షణం. ఆ లక్షణం ఎలా నిరూపితమౌతుందో ఇలాంటి రచనల్లో చూస్తాం. ఎంతో ప్రతిభావంతంగా పరిచయం చేసిన వాడ్రేవు వీరలక్ష్మిదేవి గార్కి, సారంగకు అభినందనలు. అసలు కథ లింకునిచ్చిన కె.కె. రామయ్య గార్కి కృతజ్ఞతలు.

 6. sammeta umadevi says:

  గోరు వెచ్చని వెలుగులో ఇంద్రచాపాన్ని తాకి వచ్చిన అనుభూతి.. ఒక వేదన .. ఒక మోదం ఏక కాలంలో కలిగాయి. ఎండా వానల కలగలుపు భావన.. స్త్రీ పురుష సంభంధాలపయి ఇంత రమణీయ కథలు చాల తక్కువగా వచ్చి ఉంటాయి. సున్నితమయిన వ్యక్తీకరణ..మంచి కథను అద్దాన చూపినందుకు వీరలక్ష్మిదేవి గారికి ధన్యవాదాలు ..

మీ మాటలు

*