కల గురించే.. (సంవాద కవిత)

rafi1

 

ఎవరు  నీవు? ఇది రోజు రోజుకూ విస్తృతమవుతున్న ప్రశ్న. నీ అస్తిత్వం నీకే ప్రశ్నార్థకం అవుతోంది. మనకు తెలియకుండానే మనపై ముద్ర. మన జననానికి, మరణానికీ సంబంధం లేని ప్రశ్న ఇది. మన ఆలోచనలకూ చైతన్యానికి సంబంధం లేని ప్రశ్న ఇది. నీతో సంబంధం లేకుండా ఒక సంఘర్షణ లో భాగమవుతున్నావు. నీ ప్రమేయం లేకుండానే నీవు గాయపడుతున్నావు. కొన్ని ఉద్యమాల తర్వాత, కొన్ని పోరాటాల తర్వాత కొన్ని ఊచకోతల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే, నీలో నీవు లేవు. నీ ప్రశ్నలకు సమాధానాలు లేవు. 2010 ప్రథమార్థం లో అఫ్సర్, కృష్ణుడు ఢిల్లీ లో కలుసుకున్నప్పుడు రాసుకున్న గొలుసు కవిత ఇది. అంతకు 20 ఏళ్ళ క్రితం ఈ ఇద్దరూ మరో నలుగురు కవులతో కలిసి ఇవే ప్రశ్నలు వేసుకొని ‘క్రితం తర్వాత ‘ అనే గొలుసు కవిత రాశారు. కాలం మారుతున్న కొద్దీ పథ ప్రశ్నలకు సమాధానం లభించదు. కొత్త ప్రశ్నలు తలెత్తక మానవు. ప్రశ్నించి జవాబులు వేసుకొనే ప్రతి కవితా సమకాలీనమే. ఆరేళ్ళ క్రితం రాసిన ఈ కవితలో నేటి సామాజిక సంక్లిష్టత బీజాలు లేకపోలేదు. 
~

అఫ్సర్:
కల గురించే మళ్లీ,
మరిచిపోని కల గురించే మళ్లీ..
కలతలో, తలపోతలో
చిటుక్కుమని పగిలిపోయిన
ఒకానొక కల గురించే
మళ్లీ.. ఇప్పుడు..

కృష్ణుడు:
పాత అంగీ జేబులోంచి
పడిపోయిన కాగితం కోసం
చెట్టుబెరడులాంటి ముఖంలో
మధుర మందహాసం కోసం
ఎప్పుడో తాగిన ఇరానీచాయ్ రుచికోసం..
తెల్లవారుజామున వచ్చిన
సుందర స్వప్నం కోసం..

అఫ్సర్:
ఇరుదేహాల ఇరుకిరుకు గోడల్ని
లోపల్నించీ తంతున్న
ఒకే ఒక్క పద్య శిశువు
జారిపోయిన మాటకోసమో..
రాలిపోయిన కలకోసమో..
కొస తెలిసీతెలియని కాలినడక.
ఈ సందు చివర గోడలు లేని బావి ఉందో,
ఇంకో దారిలో తెరుచుకునే నిప్పుకన్నుందో తెలీదు..
కల నడుస్తోంది
నిన్నటి కాళ్లతో, రేపటి కళ్లతో!

కృష్ణుడు:
నిన్న తిరిగిన రాత్రుళ్లలో
మేల్కొల్పిన పగళ్లు
కుప్పకూలిన కట్టడాల్లో
చితికిపోయిన జ్ఞాపకాలు
కరచాలనం కోసం చేతులు లేవు
చిరునవ్వుకోసం పెదాలు లేవు
ప్రతిపరిచయంపై పరుచుకుంది
ఏదో ఒక విషపు నీడ!

అఫ్సర్:
ఇవాళ ఈ దేహం
ఒక ఆలోచన కాదు
ఒక ఉద్వేగం కాదు
ఒక కల కానే కాదు
ఎప్పుడో తయారై ఉన్న మూస
ఒక స్త్రీ,
బ్రాహ్మణ్యం
మాల మాదిగ తురక
బిసీ ఏబీసీడీ
ఏ మూసలోనూ ఇమడకపోతే
ఒక వైఫల్యం
ఒక అపజయం
ఒక గాఢాంధకార మార్గం

కృష్ణుడు:
నిన్నటివరకూ
నీవు నా స్నేహం
నా రక్తంలో రక్తం
నా నేలలో నేల
నీ ప్రతి అక్షరంలో
నా చైతన్యం
ఇప్పుడు ఇద్దరి మధ్యా
ముళ్లకంచెలు
నీ ప్రతి శబ్దంలోనూ
నీ పుట్టుకే ధ్వనిస్తోంది..
నీవు మా వాడివేనా?

అఫ్సర్:
మేం వాళ్ల అడ్డంకి
వాళ్లు మా అవతలి దిక్కు
వినూత్న శత్రునిర్మాణం
తక్షణ విధ్వంసవ్యూహం
‘నేను’ ఎవరి ఎజెండా?
ఉమ్మడి కల ఓడిపోయింది
పరస్పర ఆత్మహనన శోకాల కింద;
ఉమ్మడి ఆకాశం చచ్చిపోయింది
ఎటూ కలవని దిక్కుల మృత హస్తాల కింద;
ఈ షికాయతు అందరిమీదా,
నాలోని మీమీదా
మీలోని నా మీదా
కలవనివ్వని దారుల మీదా
కలయికల్ని తెంపిన పొలిమేరల మీదా!

కృష్ణుడు:
కుళ్లిపోయిన మనసుల్లోంచి
చ చ్చిపోయిన ఆలోచనల్లోంచి
పాతిపెట్టిన నినాదాల్లోంచి
ఒక అభావం, ఒక అభద్రత
ఒక నిస్ప­ృహ, ఒక నిట్టూర్పు..
పెల్లుబుకుతున్న లావాలో
ధగ్దమవుతున్న
నా అనామక శవంలోంచేనా
ఈ దుర్వాసన?

అఫ్సర్:
ఒక కల
ఒక కళేబరం
కుళ్లిపోతోంది దశాబ్దంగా
మిగిలిన అరకొర అవయవాలు
పట్టివ్వవు ఆనవాలు
కల గురించే మళ్లీ
ఎలాగూ తెగిపోయిన
కల
గురించే
మ…ళ్లీ..
ఒక్కసారి

మాట్లాడనివ్వండి
మీరు కప్పిన కఫన్ గుడ్డల
అడుగున పడి ఉన్న కలని!
అది స్త్రీ కాదు,
బ్రాహ్మణి కాదు
ఎస్సీ, ఎస్టీ, బీసీ తురకా దూదేకులా కాదు
కాస్త మాట్లాడనివ్వండి

కృష్ణుడు:
బొందిలోప్రాణాలను శబ్దాలు కానివ్వండి
శబ్దాలను చైతన్యాలను కానివ్వండి
ప్రతి సమాధినీ ప్రతిధ్వనించనివ్వండి..

మీ మాటలు

 1. విజయ్ కోగంటి says:

  -వినూత్నంగా ఏర్పడిన
  దిక్కుల కంటి పిడికిళ్ళ మధ్య
  వాసనకొట్టే పీనుగుల క్రింద
  యిప్పటికీ ఆ కల అలా
  తన గొంతుక కోసం ఆరాట పడుతూనే వుంది!
  – అద్భుతం అఫ్సర్ మరియు కృష్ణుళ్ళూ.
  ప్రయోగమూ, భావ సంవాదమూ!
  – విజయ్, కోగంటి

 2. మీ ఇద్దరి కవిత్వ సంభాషణలో అనేక తాత్విక ప్రశ్నలు, బహుశా నాకు నేను వేసుకున్న ప్రశ్నలు, ఇంకా జవాబు దొరకని, వెతుక్కుంటున్న ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ, కవి హృదయంలో కలలు కనగల ఆశ ఒకటి వేగుచుక్కయి వెలుగుతుంది. మూసుకుపోతున్న దారులలో తడబడే అడుగులతోనన్నా ముందుకు నడవమంటుంది. మీ ఇద్దరి పోయెమ్స్ బాగున్నాయి. — విమల

 3. సాయి గోరంట్ల says:

  వాహ్ వండర్ఫుల్
  ఎన్ని ప్రశ్నలు
  ఎన్ని సందేహాలు
  ఎన్ని నిట్టూర్పులు
  అద్బుతమైన సంభాషణ
  ఉన్నతమైన కవిత్వం..👌👌💐💐

 4. “ఈ షికాయతు అందరిమీదా, నాలోని మీమీదా మీలోని నా మీదా కలవనివ్వని దారుల మీదా కలయికల్ని తెంపిన పొలిమేరల మీదా! ” :( :( :( “బొందిలోప్రాణాలను శబ్దాలు కానివ్వండి ..శబ్దాలను చైతన్యాలను కానివ్వండి” — రెండు కలాల్లోని ప్రవాహపు వేగం, ఉద్వేగపు తపన మాటలకు అందట్లేదు …

మీ మాటలు

*