ఒక వేసవి సాయంత్రం

Akkadi MeghamFeatured

ఉర్దు మూలం : సజ్జద్ జహీర్

తెలుగు సేత : జగద్ధాత్రి

 ఈ కథ ‘అంగారే’ అనే కథా సంకలనం లోనిది. ఇందులో ఎనిమిది కథలు ఒక నాటకం ఉన్నాయి. అరసం వ్యవస్థాపకులు డాక్టర్ రషీద్ జహాన్ , ఆమె భర్త డాక్టర్ సయ్యద్ జహీర్ కలిసి తీసుకొచ్చిన మొట్టమొదటి ఉర్దు కథా సంకలనం. ఈ పుస్తకాన్ని మతాచారాలకు వ్యతిరేకంగా ఉన్నదని అప్ప్తట్లో నిషేధించారు. రషీద్ జహాన్ పేరు ముందు అంగారే వాలీ అని ఆమె ధైర్యానికి గుర్తుగా వ్యవహరించేవారు. అభ్యుదయ రచయితల సంఘం సంస్థాపక సభ్యురాలు ఈమె. ఇటీవల ఈ కథలను అమెరికాలో ఒక ప్రొఫెసర్ స్నేహాల్ సింఘ్వీ ఆంగ్లీకరించారు. ఈ కథతో బాటుగా ఉన్న మిగిలిన కథలను కూడా అనువాదం చేస్తున్నాను. త్వరలో ఇవి ఒక పుస్తకంగా వస్తోంది. 

 

సాయంత్రం ప్రార్ధన ముగించుకుని, మున్షి బర్కత్ అలీ అలవాటు  ప్రకారం అమీనాబాద్ పార్క్ లోకి నడిచాడు. అదో వేసవి సాయంత్రం, గాలి స్తంభించిపోయింది. చల్లని షర్బత్లు  అమ్మే చిన్న దుకాణాల వద్ద నిల్చుని మనుషులు మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లు అమ్మే కుర్రాళ్ళు అరుస్తూ అమ్ముతున్నారు. మల్లెపూల దండలు అమ్మే ఒకతను కాస్త నదురుగా కనబడిన వారందరి వద్దకు పరుగున వెళుతున్నాడు. ఈ మధ్యలో గుర్రపు బగ్గీలు, బళ్ళు తోలే వాటి కలగలిసిన శబ్దం వినపడుతోంది.

“కూడలికి ! అక్కడివరకు బండి మీద ! సార్! తీసుకెళ్లమంటారా కూడలి దాకా?’

‘ హే మిస్టర్, సవారి కావాలా ?’

‘మల్లెపూల దండలోయ్! బంతి పూల మాలలూ !’

‘రుచికరమైన అయిస్క్రీం!’

మున్షి ఒక పూల దండ కొని, కాస్త షర్బత్ తాగి , పార్క్ లోకి వెళ్ళే ముందు కిల్లి వేసుకున్నాడు. కూర్చోవడానికి ఒక్క బెంచీ కూడా ఖాళీ లేనందువలన , కొంతమంది కింద గడ్డిలో చతికిలబడ్డారు. శృతి తెలియని పాటల పిచ్చాళ్లు కొందరు దగ్గరలో గోల గోల చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు మౌనంగా కూర్చుని, పంచెలు ఎగదోసి తొడలు, కాళ్ళు గోక్కోవవడం లో మునిగిపోయి ఉన్నారు. ఉండుండి దోమలను కూడా వేటాడుతున్నారు. మున్షి ఎప్పుడు పొడవాటి కాటన్ పంట్లాం వేసుకుంటాడు, కనుక ఈ మనుషుల సిగ్గులేని ప్రదర్శన అసహ్యం కలిగించింది అతనికి. తనలో తాను అనుకున్నాడు ,’ ఈ వెధవలకు సిగ్గు లేదు’, ఇంతలో ఎవరో అతన్ని ఒక బెంచీ దగ్గరనుండి పిలిచారు.

‘మున్షి బర్కత్ అలీ!’

మున్షి వెనుతిరిగి చూశాడు.

‘ఓహ్ మీరా , లాలాజీ సోదరా !బాగున్నారు కదా !’

మున్షి పని చేసే ఆఫీసులోనే  లాలాజి కూడా హెడ్ గుమాస్తా. మున్షిది అతని కింద ఉద్యోగం. లాలాజీ జోళ్లు తీసేసి హాయిగా తన శరీరమంతటితో బెంచీ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. పొడుచుకొచ్చిన బొజ్జ మీద సన్నగా నిమురుకుంటూ తనకిరువైపులా కూర్చుని శ్రద్ధగా అలకిస్తున్న వారితో ఏవేవో చెప్తున్నాడు. మున్షి ని  గమనించి పిలవాలని నిర్ణయించుకున్నాడు. మున్షి వెళ్ళి లాలా సాహిబ్ ముందర నిల్చున్నాడు.

లాలాజీ నవ్వి అన్నాడు, ‘ఏమిటిది మున్షిజి? పూల మాల కొన్నారే ? రాత్రికి బాగా గడుపుదామన్న ప్లానా? అంటూనే పెద్ద పెట్టున నవ్వుతూ తనకు ఇరు వైపులా ఉన్న ఇద్దరి వైపు తన మాటకు అంగీకరిస్తున్నారా అన్నట్టు చూశాడు. వారిద్దరూ లాలాజీ కావాలని వేసిన జోక్ కి నవ్వడం మొదలు పెట్టేరు.

మున్షి కూడా తప్పని, నీరసమైన నవ్వొకటి నవ్వాడు. ‘ హాయిగా గడపడమా, మీకు తెలుసు నేనసలేబీద వాడిని. ఈ వేదిలో ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంది. కొన్ని రాత్రులుగా నేను నిద్రే పోలేదు. ఈ పూల దండ కొన్నది కనీసం ఓ గంటో రెండు గంటలో నిద్ర పట్టేందుకు ఉపయోగపడుతుందని.’

లాలాజీ తన బట్ట తల నిమురుకుంటూ మళ్ళీ నవ్వాడు. ‘ నువ్వు అనుభవించేవాడివి మున్షి జి, ఎందుకు చెయ్యవు?’ అనేసి ,మళ్ళీ తన మిత్రులతో మాటాడటంలో మునిగిపోయాడు. ఇదే అదను అని చూసి మున్షి ‘సరే మరి లాలాజీ సెలవు తీసుకుంటాను ఇక మరి ! ఖుదాహఫీజ్ !’ అని నడవడం మొదలెట్టాడు. తనలో తాను అనుకున్నాడు ‘ ఈ వెధవ కళ్ళలో పడ్డానేంట్రా బాబు ఇవాళ. రోజంతా రుబ్బిన తర్వాత అడుగుతున్నాడు ‘హాయిగా గడపాలని ప్లానా ? అంటే , ఏమనుకుంటున్నాడు నన్ను ! పెద్ద భూస్వామిని, రోజూ ముజ్రాలు వింటూ, సానుల కొంపలకి తిరిగే వాడిననా ? జేబులో పావలా కంటే ఎక్కువ లేని వాడిని. భార్య, పిల్లలు, నెలకి అరవై రూపాయల జీతం- ఇంకేముంది బల్ల కింద నుండి వచ్చే డబ్బుల పై నమ్మకమే లేదు. ఒక్క రూపాయి ఈరోజు సంపాదించడానికి ఏమి జరిగిందో ఎవరికి తెలుసు. ఈ పల్లెటూరి వెధవలు మహా తెలివి మీరీ పోతున్నారు రోజురోజుకీ. గంటలు గంటలు పనికిరాని హాస్కు కొట్టాక , అప్పుడు నిన్నేదో వాళ్ల బానిసవన్నట్టు ఇన్ని కొంచం నాణేలు జేబులోంచి తీస్తారు. కనీసం మాటలు కూడా మర్యాదిచ్చి మాట్లాడరు. ఈ పల్లెటూరి దరిద్రులు పొగరుమోతులై పోతున్నారు ఈమధ్య. ఇక అన్నిటికంటే దరిద్రం ఈ మర్యాదకోశం పది చచ్చే మాలాంటి మధ్య తరగతి మనుషుల బతుకు. ఒకవైపూ ఈ పల్లెటూరి వెధవలతోనూ కలవలేము, మరొక వైపు పై తరగతి వారు, ప్రభుత్వమూ మరీ స్ట్రిక్ట్ ఐ పోతున్నాది. ఒక్క రెండు నెలల క్రితం , బనారస్ జిల్లాలో ఇద్దరు గుమస్తాలు లంచం తీసుకున్నందుకు  పట్టుబడి సస్పెండ్ చేయబడ్డారు. ఎప్పుడూ జరిగేది అదే. పేదవాళ్లకే శిక్ష. అదే ఒక సీనియర్ ఆఫీసర్ కి మహా అయితే ఒక పదవి నుండి మరో పదవికి బదిలీ అవుతుంది అంతే’.

మున్షి సాబ్ ! ఎవరో ఒక పక్క నుండి అరిచారు. అది జూమ్మన్ గొంతు, తాను ఆర్డర్లీ ( బ్రిటిష్ పెద్ద అధికారుల ఇంట్లో పని చేయడానికి ఉండే ఉద్యోగి).

‘అరె నువ్వా జూమ్మన్? అన్నాడు మున్షి

కానీ మున్షి ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. పార్క్ నుండి బయటకి నడిచి నజీరాబాద్ దగ్గరకి వచ్చాడు, జూమ్మన్ అతన్ని అనుసరిస్తూ వచ్చాడు. అదొక వింత దృశ్యం.  ముందర సన్నగా పీలగా పొట్టిగా ఉండే , పడవ ఆకారం ముఖ్మల్ టోపీతో , చేతిలో పూల దండతో నడుస్తూ మున్షి , అతనికి రెండడుగుల దూరం లో , తల పాగాతో, చేతుల్లేని పొట్టి ఓవర్ కోట్ తో, నిలువెత్తు ఆజాను బాహువు ఆర్డర్లీ జూమ్మన్.

మున్షి అనుకున్నాడు , ‘ ఇప్పుడిలా ఈ వేళప్పుడు జూమ్మన్ నా వెంట పడటం దేనికబ్బా?’

అతని వైపుకి తిరిగి , ‘అయితే జూమ్మన్ , ఎలా ఉన్నావు? ఇప్పుడే పార్క్ లో హెడ్ క్లేర్క్ గారిని కలిశాను, ఆయన కూడా వేడి ఎక్కువగా ఉందంటున్నాడు’

‘సరే , మున్షి జి , ఏమి చెప్పమంటారు. ఒక్క వేడి మాత్రమే నన్ను చంపుకుతినడం లేదు. నాలుగు నాలుగున్నరకి పనిలోంచి బయటపడ్డాను, మేనేజర్ గారింటికి తిన్నగా ఇంటి పనికి వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడే అక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికి పోతున్నాను. రోజంతా ఎంత కష్టమో తెలుసా మీకు , ప్రతి రోజూ పొద్దున్న పది నుండి రాత్రి ఎనిమిది వరకు పనే. ఇంట్లో పని పూర్తి చేశానో లేదో మూడు సార్లు బజారుకి వెళ్ల వలసి వచ్చింది . ఐస్, కూరగాయలు, పళ్ళు – తీరా అన్నీ కొనుక్కుని వెళ్తానా తిరిగి అరుపులు చీవాట్లు ‘ఎందుకివాళ ఎక్కువ పెట్టి కొన్నావు? ఎందుకీ పళ్ళు కుళ్లి పోయాయి? మేనేజర్ గారి భార్యకి అసహ్యం వేసింది నేను ఈరోజు కొన్న మామిడి పళ్ళు చూసి. మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చి రమ్మంది. ‘ఈ టైమ్ లో ఎలా తిరిగి ఇవ్వగలను అమ్మగారు ?’ అన్నాను  , ‘ నాకదంతా తెలీదు , నిన్ను పంపించింది ఈ చెత్తoతా కొనుక్కొస్తావని కాదు’. చూడండి బాబు గారు, ఒక రూపాయి మామిడి పళ్లను ఏమి చెయ్యాలో తెలియక ఉన్నాను. ఆ మామిడి పళ్ల వాడి దగ్గరకు పోయి వాడితో నానా తగాదా పడితే రూపాయికి పన్నెండణాలు మాత్రమే తిరిగి ఇచ్చాడు. నాలుగణాలు నష్టం నాకు. ఈ నెల జీతం ఖర్చు అయిపోయింది సార్ , ఒట్టు నిజంగా తినడానికి రొట్టె ముక్క కూడా మిగలలేదు. నాకేం చెయ్యాలో తెలీడం లేదు. నా భార్యకి మొహం ఎలా చూపించాలో అర్ధం కాకుండా ఉంది’.

జూమ్మన్ తనకీ కధ చెప్పడం లో ఆంతరార్ధమేమిటో మున్షి కి అర్ధం కాలేదు. ఎవరికి తెలియదు కనుక ఆకలితో మాడే పేదవాడి గురించి? అయితే ఇందులో మున్షి చేసిన తప్పేంటి? తాను మాత్రం ఏమన్నా భోగాలు అనుభవిస్తున్నాడా ఏమన్నానా ? అప్రయత్నంగా  మున్షి చెయ్యి జేబు లోకి పోయింది . పొద్దున్న సంపాదించిన రూపాయి జాగ్రత్తగానే ఉంది.

“నువ్వు చెప్పింది అక్షరాల నిజం జూమ్మన్. ఈ రోజుల్లో పేదవారు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరిని చూడు ఇవే కష్టాలు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. నిజంగా చెప్పాల్సి వస్తే ఈ సూచనలన్నీ ‘మహా తీర్పు’ వెలువడే  రోజు త్వరలో వస్తుందని తెలుపుతున్నాయి. ఈ ప్రపంచం నిండా మోసగాళ్ళున్నారు , వాళ్ళకి అన్నీ అనుభవించడానికి దొరుకుతాయి, అల్లాను నమ్ముకున్న పవిత్రమైన వారే ఇలాంటి అన్నీ బాధలూ, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది’.

జూమ్మన్ మౌనంగా మున్షి మాటలు వింటూ అతన్ని వెంబడించాడు. మున్షి బయటికి శాంతంగా మొహం పెట్టినా లోలోపల బాగా కంగారుగా ఉన్నాడు. తన మాటలు జూమ్మన్ మీద ఎలాంటి ప్రభావం  చూపాయో అర్ధం కాకుండా ఉంది అతనికి.

‘నిన్న, శుక్రవారం నమాజు తర్వాత , మౌలానా తీర్పు వచ్చే  రోజును గూర్చిన సూచనలు వివరించారు. జూమ్మన్ భాయి , నీకు నిజం చెప్తున్నా , విన్న వాళ్లందరి కళ్ళలోనూ కన్నీరే. సత్యానికి ఇవన్నీ మన పాపాల ఫలితాలే. దేవుడు ఇచ్చిన ఈ శిక్షలు చాలవు మనకు. మన ఒక్కొక్కరిలో లేని లోపాలంటూ లేవు. బెనే ఇస్రాయెల్ ను మన వాటి కంటే తక్కువైన అతని పాపాలకు దేవుడు ఎలా శిక్షించాడో తల్చుకుంటే నాకు రోమాలు నిక్క బొడుస్తున్నాయి.  అయినా ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి’.

‘నేను బీద వాడిని మున్షిజి, ఈ చదువుకున్న వారి విషయాలన్నీ నాకేలా తెలుస్తాయి.  తీర్పు రోజును గూర్చి విన్నాను  కానీ సార్, పాపమీ బన్నీ ఇజ్రీల్ ఎవరండీ?’

ఈ ప్రశ్న వినగానే మున్షికి కొంచెం హాయిగా అనిపించింది. విషయం ఆకలి , పేదరికం నుండి తీర్పు రోజు, బెన్ని ఇస్రాయెల్ వైపు మళ్లడం బాగుందని పించింది. మున్షి కి కూడా ఆ తెగల చరిత్ర అంతగా తెలీదు, కానీ దాని గురించి గంటలు గంటలు మాటాడ గలడు.’

‘ఏమంటున్నావు జూమ్మన్ ? ముసల్మాన్ వయీ ఉండీ బెనే ఇస్రాయెల్ ఎవరోతెలీదూ! అరె భాయి, ఖురాన్ మొత్తం అంతా బెనే ఇస్రాయెల్ కథలతోనే నిండి ఉంటుంది! ప్రవక్త మూసా ఖాలీం- ఉల్లా పేరైనా విన్నావా పోనీ?( ఖురాన్ లో ఉన్న మూస అనే పేరు బైబిల్ లో మోసేస్ పేరుతో  సమానమైనది. బెనే ఇస్రాయెల్ అంటే ఇస్రాయెలీయులు)

‘అదేంటి? కలీం- ఉల్లా?’

‘ ఓహ్ అలా కాదు ప్రవక్త మూసా …మూ…సా..’

‘అంటే ఆ పిడుగు పడి పోతాడు అతడిని గురించా మీరు చెప్పేది?’

మున్షి గట్టిగా నవ్వేశాడు. ఇప్పుడు పూర్తిగా హాయిగా అనిపించింది అతనికి. కాసేపట్లో ఖాసిర్ బాఘ్ దగ్గరకు చేరారు ఇద్దరూ. ఆకలి పీనుగ ఈ ఆర్డర్లీ ని వదిలించుకోవాలి ఎలాగైనా అనుకున్నాడు. ఆకలితో బీదరికంతో మగ్గుతున్న వాడిని కలుసుకోవడం ఏమీ ఆహ్లాదం కాదు అసలు, అందునా ఈ సాయంకాలం వేళ, అందులోనూ నువ్వు కడుపు నిండా ఆరగించి , నీ నమాజులు పూర్తి చేసుకున్న తర్వాత , అలా వ్యాహ్యాళికి మనసుని ఉల్లాస పరచడానికి అలా నడకకి పోయినప్పుడు. కానీ మున్షి ఏమి చెయ్యగలడు! కుక్కలాగా జుమ్మన్ నివిదిలించి పారేయడానికి అస్సలు కుదిరే పని కాదు, ఎందుకంటే రోజూ కచేరీలో అతనికి ఎదురు పడాల్సిందే, అదీగాక పేద వర్గానికి చెందినవాడవటం వలన కూడా. తాను గనుక అందరి ముందు మున్షిని అవమాన పరిచాడంటే ఇన్నాళ్లూ నిలబెట్టుకున్న పరువు కాస్తా పోతుంది. బహుశా ,ఈ మలుపులో ఇక దారులు మళ్లి విడిపోవడం మంచిది.

‘సరే అయితే ! నీకు బెనే ఇస్రాయెల్ గురించి మూసా గురించి మరోసారెప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పుడు నాకు కొంచం అవసరమైన పని ఉంది…ఇక్కడ.. సలాం , జూమ్మన్.’ మాటలు పూర్తి చేసి ఖాసీ బాఘ్ సినిమా హాల్ వైపు తిరిగి పోయాడు మున్షి. మున్షి అంతా వేగంగా వెళ్లిపోవడం చూసి జూమ్మన్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు అతనికి. అతని నుదుటి మీద చెమట చుక్కలు మెరుస్తున్నాయి.అతని కళ్ళు దిగాలుగా యిటు అటు చూశాయి. పెద్ద వెలుగుతో ఎలెక్ట్రిక్ దీపాలు, నీళ్ళు చిమ్మే ఫౌంటెన్, సినిమా పోస్టర్లు, హోటళ్లు, దుకాణాలు, కార్లూ, బళ్లూ, బగ్గీలూ, అన్నిటికి మించి చిమ్మ చీకటి ఆకాశం , మెరిసే నక్షత్రాలూ. తక్కువలో చెప్పాలంటే దేవుడి సృష్టి అంతా.

అయితే వెనువెంటనే తెప్పరిల్లి జూమ్మన్ మున్షి వెనుక పరుగెట్టాడు, జూమ్మన్ వదిలించుకున్నాననే  ఆనందం లో సినిమా పోస్టరును పరికిస్తున్న మున్షి వద్దకి.

అతని దగ్గరికి వెళ్ళి “ మున్షిజీ !’ అని పిలిచాడు

మున్షి గుండె గుభెలుమంది.  మతపరమైన ఆ చర్చ అంతా , అంతిమ తీర్పు రోజును గురించిన మాటలన్నీ అంతా వృధా పోయింది. మున్షి జూమ్మన్ కి జవాబు చెప్పలేదు.

‘మున్షి జీ , ఈరోజు ఒక్క రూపాయి అప్పు ఇస్తే , మీకు జీవితాంతం…’

మున్షి ఇటు తిరిగేడు. ‘ భాయ్ జూమ్మన్ , నాకు తెలుసు నీవెంతో  ఇబ్బందికర పరిస్థితి  లో ఉన్నవాని, కానీ నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు. ఒక్క రూపాయి గురించి వదిలేయ్, కనీసం ఒక్క పైసా కూడానేను నీకు అప్పివ్వలేను. నా దగ్గరుంటే దాచుకునేవాడినా చెప్పు? నువ్వు అడగల్సిన  పనే లేదు. మొదట్లోనే నా దగ్గరేముంటే అది నీకు ఇచ్చి ఉండేవాడిని”

ఐనా సరే , జూమ్మన్ బతిమిలాడ సాగేడు. ‘మున్షి జీ, ఒట్టు నా కూలిరాగానే మీకు వెంటనే తిరిగి తీర్చేస్తాను. నిజం చెప్తున్నాను అయ్యగారు. నాకు సహాయం చేయడానికి ఇంకేవ్వరూ లేరు….’

ఇలాంటి సంభాషణలేప్పుడు మున్షి ని ఇబ్బంది పెడతాయి. ఏదన్నా సరి అయిన కారణం ఉంటే ఎవరినైనా కాదనేయవచ్చును , కానీ అది బాగోదు మరి. అందుకే ముందు నుండి విషయం ఇంత వరకు రాకుండా చూస్తున్నాడు.

అదే సమయానికి సినిమా పూర్తయి జనం వీధుల్లోకి వచ్చారు ఒక్కసారిగా.

“ బర్కత్ భాయ్ ! ఇక్కడేం చేస్తున్నావు? ‘ ఎవరో దగ్గరనుండి అన్నారు. మున్షి జూమ్మన్ వైపు నుండి అన్నది ఎవరా అని అటు  వైపు తిరిగాడు. ఒక సంపన్నుడు , లావుగా గుండ్రంగా , బహుశా ముప్ఫయ్యో ముప్ఫయ్ ఐదో ఉండొచ్చు వయసు, పొడుగు కోటు  వేసుకున్నాడు,బొచ్చు టోపీ పెట్టుకుని కిల్లీ నములుతూ, సిగరెట్టు తాగుతున్నాడు. ‘ఓహ్ మీరా చాలా ఏళ్లైంది మిమ్మల్ని చూసి. లక్నో పూర్తిగా వదిలేశారే మీరు. అయినా  భాయ్ , సిటీ లోకి వచ్చినా మీకు మాలాంటి పేద వాళ్ళని చూడటానికి టైమ్ ఎక్కడిది లెండి.’. అతను మున్షి కాలేజ్ స్నేహితుడు , మంచి సంపన్నుడు.  ‘అదంతా సరేలే వదిలెయ్. కాస్త సరదాగా హాయిగా గడుపుదామని లక్నో లో కొన్ని రోజులు వచ్చాను. రేపు నాతో రా , నువ్వు  జన్మలో మరిచిపోలేనంత గొప్ప నాట్యకత్తే ఇంటికి  తీసుకెళతాను. నా కార్ ఇక్కడే ఉంది. ఎక్కువ ఆలోచించకూ దాన్ని గురించి , వచ్చేయ్ అంతే. నువ్వేప్పుడైనా నూర్జెహాన్ పాట విన్నావా ? ఓహ్ అద్భుతంగా పాడుతుంది, అందంగా సొగసైన భంగిమలతో నాట్యం చేస్తుంది. ఆ కొంటె చూపులు , ఆ వయారి వొంపులు తిరగడం , ఆ పెదవులు కదిలించే విధానం, ఆమె గజ్జెల శబ్దం. మా ఇంట్లోనే ఆరుబయట , తారల నీడ కింద , గానా బజానా ఉంది. పొద్దున్న మేల్కొలుపు రాగం వినే వరకు అదలా కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా రా. రేపేలాగూ ఆదివారమేగా … మీ ఆవిడ చెప్పు తీస్తుందని భయమా ఏం? ఆడాళ్లకి బానిసలుగా పడి ఉండాలంటే , నీకు తెలుసు పెళ్లే చేసుకోనక్కర్లేదు , అవునా ? రా భాయ్ మరి తప్పకుండా , భలే మజాగా ఉంటుంది.అలిగిన భార్యని బుజ్జగించడం లో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుందిలే …….’

పాట మిత్రుడు, కార్ ప్రయాణం, ఆట పాట,కైపెక్కించే  కను చూపుల వాగ్దానం , స్వర్గం లాంటి ప్రదేశం- మున్షి ఒక్క ఉదుటున కార్ లోకి దుమికి కూర్చున్నాడు కార్ లో .జూమ్మన్ గురించి మరో మాట ఆలోచించలేదు. కార్ సాగిపోతుంటే  జూమ్మన్ అక్కడే మౌనంగా నిలబడి ఉండటం కనిపించింది.

 

 

*

 

 

మీ మాటలు

*