ఒక లాలన…ఒక దీవెన!

bhaskarabhatla

 

సినిమా పాట క్వాలిటీ పడిపోయిందని కంప్లయింట్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు! అయినా ఎప్పటికప్పుడు అవసరమైనన్ని మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. ‘పాత పాటలు వింటే ఎంత హాయిగా ఉంటుందో, ఆ సాహిత్యం, ఆ సంగీతం.. అబ్బా ఆ రోజులే వేరు!’ అని నేటి తరం పాటల్ని ఆడిపోసుకునేవాళ్ళు, 1950 నుండి 1970 వరకు ఎన్ని పాటలు వచ్చాయో, వాటిల్లో ఎన్ని పాటలు ప్రాచూర్యంపొందాయో, ఎన్ని పాటలు అసలు వినలేమో పోల్చుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఈ రోజుల్లోకూడా పాటల విషయంలో మంచీ చెడుల నిష్పత్తి ఇంచుమించు ఈకాలంలో లాగే ఉందని.

పాట వస్తువు మారింది, భాషమారింది, సంగీతం మారింది, గాయకుల మారారు, సంస్కృతి మారింది, సినిమాలో కథలు మారాయి, ఇక పాట ఒక్కటీ మారకుండా ఉంటుందా? మన తాతలకి నచ్చిన పాటలు వాళ్ళ నాన్నలకీ, మన నాన్నలకి నచ్చినవి తాతలకీ, మనకి నచ్చినవి మన నాన్నలకీ నచ్చవు! అదంతే.

సంవత్సరానికి సుమారు అరవై సినిమాలూ, నాలుగైదు వందల పాటలూ వస్తున్నాయి మనకి. వాటిల్లో ఒక పది సినిమాలు మెచ్చుకోతగ్గవిగానూ, నలభైపాటలు ఆస్వాదించదగినవిగానూ మిగుల్తున్నాయి.

సినిమా సమిష్టి కృషే అయినప్పటికీ, అందర్నీ సమిష్టిగా ఒక ధ్యేయంవైపుకి తీసుకెళ్ళేవాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్ అభిరుచినీ, సమర్ధతనీబట్టే ఎండ్ ప్రాడక్ట్ ఉంటుంది.

సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ చేసినా, పాటలు కవి రాసినా, గాయకులు పాడినా ఆ డైరెక్టర్ వీళ్ళ దగ్గర తనకి కావలసింది రాబట్టే చాతుర్యాన్నిబట్టే పాటలు ఉంటాయి.

మొన్న విడుదలైన “జ్యో అచ్యుతానంద” సినిమాలో పాటలు ఒకసారి వినగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంత మంచి పాటలు చేయించుకున్న డైరెక్టర్ శ్రీనివాస్ కి అభినందనలు.

jyotachyutananda

సంగీతం : శ్రీకళ్యాణ్రమణ

గేయ రచయిత : భాస్కరభట్ల రవికుమార్

 

) ఆకుపచ్చని చందమామలా

గాయకులు : కార్తిక్, రమ్య బెహర 

 

ఒక అమ్మాయీ అబ్బాయి పాడుకునే డ్యూయట్ ఇది. ఆ కొత్త స్నేహంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సన్నివేశానికి తేలికైన తెలుగు పదాలతో హాయిగా సాగిపోతుంది పాట!

సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా? మనచుట్టే ఉంటుందిగా చూస్తే ఇలా – యువకుల యుగళగీతమే అయినప్పటికీ పల్లవిలోనే ఒక తాత్విక భావన “ప్రశాంతతని ఎక్కడో బయట వెతక్కు, అది నీలోనే ఉంటుంది” అన్న రేంజ్ లో మెరుస్తోంది ఈ లైన్.

కూడబెట్టుకున్న డబ్బులూ, ఆస్తులకంటే ఆనందంగా జీవించిన క్షణాలే నిధులు అని చరణంలో మరొక తత్వభావం విసిరాడు కవి – తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం!

మనసులో నింపుకోవలసింది చెత్తకాదు, హాయినిచ్చే జ్ఞాపకాలు అని మరో చమక్కు – తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం

అప్పుడు ప్రతిఋతువూ వసంతంలా కనిపిస్తుంది, మన చిరునవ్వుల్లో చల్లని మంచు ముత్యాలు కురుస్తాయి అని సాగుతున్నారు! – వసారాలు దాటొచ్చాయి వసంతాలు వేళ; తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా

లోలోపల ఆనందం వెలిగిపోతుంటే వెళ్ళేదారులన్నీ వెలుతురు మయమేనట – “ప్రతీదారి మిణుగుర్లా మెరుస్తోంది వేళ

రెండో చరణంలో —

ఆ అమ్మాయీ అబ్బాయీ ఒకరికొకరు అండగా ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనీ కోరుతున్నారు. ఒకరి కలల్ని మరొకరికి చెప్పుకోవడం ఎందుకు? నిద్రపోయేప్పుడు డైరెక్ట్ గా ఒకరి కలల్లో మరొకరు ప్రవేశించుకు పంచుకుందాం అంటున్నారు. ఎంత అందమైన ఊహ! ఎంత చక్కని కల్పన!

వారి చుట్టు వీచేగాలి ఆనందపు మత్తులో ముంచేస్తుందిట. మరి ఏం సుగంధాలు జల్లిందో మరి అని ఆశ్చర్యంగా ప్రశ్నించుకుంటున్నారు. మరి, వారి తీయని స్నేహ సుగంధాన్ని జల్లుకుందేమో!

*

 

) సువర్ణా సువర్ణా

గాయకుడు : సింహ

 

ఇది అమ్మాయిని టీజ్ చేస్తూ అబ్బాయి పాడే పాటలా ఉంది. అయినా సాహిత్యం ఎంత డీసెంట్ గా, కవితాత్మకంకా ఉందంటే  ఆ పాట అయిపోయే సమయానికి అమ్మాయి ముచ్చటపడి అబ్బాయితో ప్రేమలో పడిపోతుందన్నట్టు ఉంది.

అమ్మాయిని అల్లరిపెట్టిన తీరు, ఆమె ప్రవర్తనని వర్ణించిన విధానం, వాడిన విశేషణాలూ బాగున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాటల్ని తెలుగు పదాలతో రాయడం బాగుంది.

ఆల్చిప్పల్లాంటి కళ్ళనీ, జాంకాయలాంటి దోర ఈడనీ అంటూనే, ఆ అమ్మాయి చిటపటని ముద్దుగా “చక్కెర కలిపిన పటాసు” అంటూ మెచ్చుకుంటున్నాడు. నవ్వితే ముత్యాలు రాలినట్టు అన్న పాత ఉపమానాన్ని పక్కకి తోసి “తిప్పొదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వేయ్” అని బ్రతిమలాడటం కొత్తగా ఉంది.

ఎంతసేపు గోదావరీ, కృష్ణ, వంశధార, గౌతమీ, తుంగ, భద్ర నదులేనా? అమ్మాయిల్ని పోల్చడానికి, పొగడటానికి తెలుగునాట ఉన్న ఇతర చిన్న నదులు పనికిరావా ఏంటి? ఈ కవులెందుకు రాయరు అనిపించేది. ఈ పాటలో నాగావళి నదిని మొదటిసారిగా సినిమాపాటకెక్కించాడు కవి!

నాగావళి హొయలున్నవే మెలికల్లో” – సో క్యూట్!

నాగావళి కి ప్రాసగా నెక్స్‌ట్ లైన్ లో “బంగారి” అనడం బాగుంది. పాత సినిమా పాటని గుర్తుచేస్తుంది!

కొందరికి PDA (పభ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్టన్) నచ్చినట్టు, మరికొందరికి PDB (public display of బెట్టు ) నచ్చుతుందేమో :-)

ఏయ్ అనార్కలీ, అరసున్నా నడుముల్లో” అని నడుముకి తెలుగులో అరుదైపోతున్న అక్షరాన్ని ఉపమానంగా వాడటం గొప్పే!

దీపావళి వచ్చింది మే నెల్లో – పాట మొత్తానికి ఇదొకటే ఇంగ్లీషు పదం! అయినా ఆ దీపావళి చమత్కారంకోసం మెచ్చుకోవచ్చు.

నడిరాతిరి తెల్లారి పోతున్నా పొలమారి” – ప్రేమలో పడిన అబ్బాయి అవస్త కళ్ళముందు కనబడుతుంది.

 

*

) ఒక లాలన ఒక దీవెన (మేల్ వర్షన్)

గాయకుడు :  శంకర్ మహాదేవన్

 

బ్రేకప్ తర్వాత ప్రేయసి జ్ఞాపకాలను నెమరు వేసుకునే సన్నివేశానికో లేదు విడిపోయిన ప్రియురాలిని మళ్ళీ కలుకున్న సన్నివేశానికో రాయబడిన పాటలా ఉంది.  కర్ణాటక సంగీతం బాణీ పాట. కళ్యాణిరాగమని ఎవరో అన్నారు. శంకర్ మహాదేవన్ ఇదివరకే ఇలాంటొక మెలోడీ పాట విశ్వరూపంలో పాడాడు. అప్పట్నుండి ఎదురు చూస్తున్నా శంకర్ మహదేవన్ నోట మళ్ళీ ఎవరైనా అలా పాడించరా అని.

కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో

పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒకప్పుడు ఇద్దరం చెప్పుకున్న ఊసులు,  ఇద్దరినీ పెనవేసిన ఆ ప్రేమలు ఏమైపోయాయి? ఎందుకింత మౌనం మనమధ్య? పరాయి వ్యక్తిని కలిసినట్టు? అని గాఢమైన బాధని పలుకుతున్నాయి ఈ లైన్స్!

ఇంతకాలం దాచుకున్న ప్రేమని, హాయిని కాలమేమీ దోచుకోదు ఇమ్మని!

పెదవంచుమీద నవ్వుని పూయించుకోడం నీ పని నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమని?

 

అందనంత దూరమేలే నింగికి నేలకీ

వాన జల్లే రాయబారం వాటికి

మనసుంటే మార్గమే ఉండదా?

ప్రతి మనిషి నీకే చెందడా?

అసాధ్యం అంటూ ఏదీలేదు అని ఆశావాదం చాటుతుంది!

 

బంధమే ఆనందమే

నువ్వు మోసుకెళ్ళే సంపద!

 

ఈ ఆల్బం లో సెకండ్ బెస్ట్ ఈ పాట!

 

*

) ఇదేమి తాకిడి ఇదేమి గారడి (టైటిల్ సాంగ్)

గాయకులు : స్మిత, శ్రీకల్యాణ్రమణ

 

ఈ పాట ప్రేమ డ్యూయట్! పాట ట్యూన్ ఒకటి రెండు చోట్ల ఇదివరకొచ్చిన కొన్ని పాత తెలుగు పాటల్ని గుర్తు చేయక మానదు (అష్టాచమ్మ సినిమాలో హల్లో అంటూ ఇల్లా రాకే… పాట & సరిగమలు సినిమాలో “సరిగమలాపవయ్యా…” పాట)

చెవులకి హాయిగొలిపే తెలుగు పదాలతో రాయబడిన సాహిత్యం. అంతకంటే ఎక్కువేం చెప్తాం? విని ఆనందించడమే!

*

 

) ఒక లాలన ఒక దీవెన

గాయకురాలు : హరిణి రావ్

 

ఈ ఆల్బం లో నాకు బాగా నచ్చిన పాట ఇదే. గాయని గళంలో ఫ్రెష్నెస్! బాంబే జయశ్రీ గొంతులో సుబ్రహ్మణ్య భారతి పాటలా హాయిగా ఉంది వినడానికి.

పల్లవి మేల్ వర్షన్ కీ ఫీమేల్ వర్షన్ కీ ఒకటే. చరణం మాత్రం వేరు వేరుగా ఉంది. ఏ చరణంలో గొప్పతనం దానిదే.

తన మనసులో ఉన్నది చెప్పలేక, దాచలేక తికమకలో కొట్టుకుంటున్న ప్రియుడిని విన్నవించుకునే పాట ఇది! నీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పేయ్. నా చేయి పట్టుకోవాలని తహతహలాడే నీ చేయిని కట్టిపెట్టుకోకు అని లాలిస్తుంది ఆమె మాటలతో!

 

అంతులేని ఇష్టమంతా గంగలా పొంగనీ,

ఆనకట్టే వేసుకోకు అందనీ

కలపాలనుంటే చేతినీ,

ఎగరాలనుంటే మనసునీ

దాచేయకు, ఆపేయకు

అటువైపు సాగే అడుగుని

 

Nasal voice ఈ పాటకి మరింత ఎమోషన్ ని పెంచింది.

 

———————-

రికార్డింగప్పుడు కవి దగ్గరే ఉండి పాటలు పాడించుకున్నట్టున్నాడు. ఎక్కడా ఉచ్ఛారణ దోషం అనిపించలేదు. వాద్యాలు కూడా సాహిత్యాన్ని ఎక్కడా డామినేట్ చెయ్యలేదు.

ప్రేమికులు తమ ప్రేమలేఖల్లోనూ ప్రేమహైలైటర్స్ గానూ, టీన్ ఏజ్ పిల్లలు నోట్‌బుక్స్ అట్టల మీదా, నెటిజన్ లు తమ ఫేస్‌బుక్ గోడల మీదా ఈ సినిమాలో పాటల లైన్స్ ని రాసుకుంటారు అని కచ్చితంగా చెప్పొచ్చు.

 

*  *  *

మీ మాటలు

  1. సినిమ పాటల్లో సాహిత్య, మానవీయ విలువలు జోడిస్తున్న భాస్కరభట్లకు అభినందనలు..వ్యాఖ్యానం బాగుంది.

  2. అందమైన సంగీత ధ్వని
    అల్లుకున్న భావుకత విని
    తోడుకున్నా ఆనందాల గని
    మెచ్చకుంటే అదేం పని !

    బాగున్నాయ్ మీ మాటలు …
    బహు బాగున్నాయ్ ఆ పాటలు …
    :)

  3. b.narsan & nmraobandi గారూ,
    ధన్యవాదాలండి!

  4. కె.కె. రామయ్య says:

    అన్నమయ్య కీర్తన అభిమాని అవినేని భాస్కర్ గారు, తెలుగులో నేడు కూడా మంచి సినీగీతాలు వస్తున్నాయి. సాహిత్యం, సంగీతం, ఉచ్చారణ దోషాలు లేకుండా సందర్భ శుద్ధి గా ఉంటున్నాయి అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. తమిళ సినీ గేయరచయితలు కణ్ణదాసన్, వాలి, వైరముత్తు లాంటి ప్రముఖల గురించే కాకుండా తెలుగు వారలు ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరధి, ఆరుద్ర, కొసరాజు, జాలాది, వేటూరి, సీతారామశాస్త్రి లాంటి వాళ్ళ గురించీ తెలిసిన భాస్కర్ గారు! తెలుగు సినిమా స్వర్ణ యుగం నాటి వాటితో పోటీపడగలవి నేడుకూడా వస్తున్నాయా? నేనంతగా గమనించడం లేదు. మనసున మల్లెల మాలలూగెనే, చిగురాకులలో చిలకమ్మా లాంటి ఔట్ డేటెడ్ వాటినే కలవరిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదనుకుంటా. ( ఈ టాపిక్ మీద గొరుసన్న లాంటి అధార్టీలే స్పందించాలి గాని, నాలాంటి నేలక్లాసు ప్రేక్షకుడు మధ్యలో జొరబడగూడదని తెలిసినా )

  5. ఆర్.దమయంతి. says:

    ఆర్టికల్ బావుంది భాస్కర్ గారు.
    సాహిత్యం లోకి షేర్ చేసాను.
    అభినందనలు.

  6. దేవరకొండ says:

    ఎప్పుడూ పాత సినిమాల్లోని పాటల సంగీతాన్నీ సాహిత్యాన్నీ తల్చుకుని పోల్చుకుని మురిసిపోయే వారిని ఎదుర్కొంటూ యధాశక్తి ఎదురీదుతున్న నేటి తరం సినీ కవులకు స్ఫూర్తినిచ్చే వ్యాసం. ఈ సందర్భంలో ఒక ‘కథ ‘ గుర్తుకొస్తోంది. నిజానికి అది కథ లాంటి నిజం అని అన్నారు. వివరాలు సరిగా గుర్తు లేవు. చాలా మంది చదివేవుంటారు కనుక అవసరమైన చోట సరిదిద్దగలరు. పాత సినిమాల సంగీత సాహిత్యాలు గొప్పవా లేక 1980 ల తర్వాత వస్తోన్నవి గొప్పవా అని చర్చించడానికి ఆయా రంగాల్లో నిష్ణాతులు ఒక సభ పెట్టుకున్నారు(ట); వాదోపవాదాలు జరిగాయి. ఎటూ తేలలేదు. ఆ సభకి కాసెట్ల వ్యాపారం చేసే పెద్దాయన కూడా ఒకరు వచ్చారు. అంతా కలిసి నిర్ణయాధికారం ఆయనికిచ్చారు. ఆయన అన్నమాటలు: నాకు ఇవన్నీ తెలియవు. మేము మాత్రం అప్పుడప్పుడూ కొత్త సినిమాల కాసెట్లలో వచ్చే నష్టాల్ని పూడ్చుకోవడానికి రఫీ, ఘంటసాల,సుశీల, జానకి, భానుమతి, ముకేశ్, లత, తలత్, హేమంత్, కిషోర్….ల ఆల్బమ్స్ ను మళ్ళీ మళ్ళీ విడుదల చూస్తూంటాము. మీరే నిర్ణయించుకోండి. ” అని కూర్చున్నాడట.

మీ మాటలు

*