హృదయము సుమ్మీ!  

myspace

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో

చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?

అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.

***

ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.

***

ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!

ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.

అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.

ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.

అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పడాల్సిందే.

రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.

ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు .

తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.

దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.

అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.

ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.

అది హృదయమ్ము సుమ్మీ!

 

 

మీ మాటలు

  1. kurmanath says:

    కాటి సీను పద్యాల లింక్ ని ఇవ్వడం మరిచిపోయాను.
    ఈ పద్యాలు మీరు ఇక్కడ వినవచ్చు https://www.youtube.com/watch?v=qdQiBFW2PAg
    మళ్ళీ మళ్ళీ వినాలనుకునేవారు డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా వినే సౌకర్యం వుంది.

  2. చందు తులసి says:

    నమ్మిన విలువలు, సిద్దాంతాల కోసం సర్వస్వాన్ని ధారపోసిన ….వీరుల త్యాగం అందరికీ తెలుసు. ఆ వీరుల కన్నతల్లి గుండెకోత ఎందరికి తెలుసు…..?
    ఒప్పుకోవడానికి ధైర్యం చాలకపోవచ్చు కానీ…..
    మన ఆనందాల వెనక అనేక త్యాగాలు, విషాదాలు వుంటాయి.
    జాషువా గారి గురించి చెప్పడానికి నా తాహతు చాలకపోవచ్చు.
    కూర్మనాథ్ గారూ. మీరు రాసింది చదువుతున్నంత సేపు…
    కన్నతల్లి మౌనరోదన వినిపించింది.

  3. P V Vijay Kumar says:

    ఎమోషనల్ గా రాశారు ..:)….సరి అయినా శైలిని ఎన్నుకున్నారు. ఐ థింక్ జాషువాను ఇలానే ప్రెజెంట్ చేయాలేమో !
    గుడ్ వన్…కూర్మనాథ్ గారు !!

  4. వృద్ధుల కళ్యాణరామారావు says:

    చాలా గొప్ప వ్యాఖ్యానం చేసేరు కూర్మనాథ్ గారు. జాషువా గారి ఆత్మ కూర్మన్నాథ్ గారి చేత రాయించుండొచ్చు.

  5. ari sitaramayya says:

    చాలా గొప్పగా రాశారు.
    అభినందనలు.

  6. కె.కె. రామయ్య says:

    ” సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు …” అవును అది జాషువా హృదయమ్ము సుమ్మీ!
    కూర్మనాథ్ గారూ అభినందనలు.

    ఒడిసాలో వెనకబడిన కలహండి జిల్లాలో మాంజీ అనే ఆదివాసీ అనారోగ్యంతో మరణించిన తన భార్య అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించాలని భార్య శవాన్ని భుజాన వేసుకుని కూతురితో 10కిలోమీటర్ల ఊరికి కాలి నడక మొదలు పెట్టిన దృశ్యం కూడా గుర్తుకొస్తుంది ( మృతదేహాన్ని తరలించేందుకు మాంజీ వద్ద డబ్బు లేదు, అంబులెన్స్‌ కోసం బ్రతిమిలాడినా ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి ).

    “బుడ్డగిత్త రంకి” కథ రాసిన, బాతిక్ పెయింటింగ్స్ లో ప్రతిభ కనబరుస్తున్న కడప జిల్లా దేవమాసపల్లె పేద దళిత యువకుడు పుట్టా పెంచల్దాస్ జాషువ / హరిశ్చంద్ర. కాటి సీను పద్యాలు పాడివినిపిస్తున్నప్పుడు నిద్రమరుపులో, ఆదమరుపులో కూడా కలేకూరి ప్రసాద్ పదాలలో ఏ చిన్న తప్పు దొర్లినా కూడా సరిదిద్దే వాడని పుట్టా పెంచల్దాస్ చెప్పగా విన్నాను. చీమకుర్తి నాగేశ్వరరావు హరిశ్చంద్ర నాటక పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు కళ్ళ నీళ్ళు పెట్టుకునేవారని ప్రసిద్ధి.

    ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
    కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
    యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
    యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
    యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

    ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
    గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
    ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ
    నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

మీ మాటలు

*