సర్కస్ కాదు, యుద్ధం చేయాలి!

 

  

చిత్వాన్ – అతనొక కథలోని పాత్రే గానీ యిటీవల నన్ను చెప్పలేని కల్లోలానికీ వ్యాకులతకీ గురిచేసిన అత్యాధునిక యువకుడు. దాదాపు వొక సంవత్సర కాలంగా చాలా సార్లు అతను నన్ను నిద్రపోనివ్వ లేదు. ఏ పని చేస్తోన్నా అతను నా ఆలోచనల్లో తారాడుతూనే వున్నాడు. అతని జ్ఞాపకాలు తరచు నన్ను వెంటాడుతున్నాయి . బతుకు పట్ల చావు పట్ల అతని ఫిలాసఫీ నన్ను యేదో తెలీని యిబ్బందికి గురిచేస్తోంది. అతని అకాల మరణం నన్ను పదే పదే  వెంటాడుతోంది. ఇక తప్పించుకొని  పారిపోవడం నా వల్ల కావడం లేదు. ముఖాముఖి యెదుర్కోవడమే యిప్పుడు చేయాల్సింది.

‘యెందుకు జీవితాన్ని చేజేతులా అర్ధాంతరంగా ముగించుకొని చచ్చిపోయావు ?’ యెటువంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగా.

నా ప్రశ్నకి అతనేం తత్తరపడలేదు. నా వైపు నిశితంగా వొక క్షణకాలం చూసి – ‘నువ్వు మాత్రం చావక బతికున్నావా ?’ అని యెదురు ప్రశ్నించాడు. నేను నిరుత్తరుణ్ణయ్యా.

 ‘నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పువ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!’

మనం మనకు నచ్చినట్టు బతకడం లేదని చిత్వాన్ ఆరోపణ. ప్రతిక్షణం అనేక విధాల పరాయీకరణకి లోనై బతికే బతుకు చావుతో సమానమని అతని నిర్ధారణ. అసంబద్ధ బంధాల్లో చిక్కుకొని మనల్ని మనం కోల్పోయి బతికే బతుకూ వొక బతుకేనా అని అతని ప్రశ్న. నిజమే. కానీ ‘జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది.’ అన్న అతని మాటల్ని అర్థం చేసుకోవాలనే తద్వారా అతణ్ణి అర్థం చేసుకోవాలనే నా ప్రయత్నం.

కానీ ‘అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడ’ నే చిత్వాన్ మాటలే మళ్ళీ అతణ్ణి అర్థం చేసుకోడానికి అడ్డుపడుతున్నాయి. అయినా అన్నిటికీ అర్థాలు వెతికే క్రమంలోనే మ్యాజిక్కో  థ్రిల్లో మరేదో వుందని నేను నమ్ముతాను కాబట్టి చిత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని నేను మానుకోలేను. చిత్వాన్ ని అర్థం చేసుకోవడమంటే సంక్లిష్టమైన సంక్షుభితమైన సమాజాన్నీ సమాజ చలనాన్నీ అర్థం చేసుకోవడమే. ఇవాళ్టి అత్యాధునిక సందర్భంలో నిర్దిష్ట సామూహిక ధ్యేయాల్లేని యువత  అంతరంగ సంచలనాన్ని  కొలిచే ప్రయత్నం చేయడమే.

ఇంతకీ యెవరీ చిత్వాన్ –  అంటే వెంకట్ సిద్ధారెడ్డి ‘సోల్ సర్కస్’ లోని (సారంగ – జూన్ 11, 2015 ; కథ లింక్ : ) పాత్ర అని వొక్క ముక్కలో చెప్పొచ్చు. కానీ అతణ్ణి అర్థం చేసుకోడానికి యెందుకంత తపన  అంటే మాత్రం అంత తేలిగ్గా చెప్పలేం. కారణం అతను కేవలం కథలో పాత్ర మాత్రమే కాదు అనిపించడం వల్ల కావొచ్చు. రక్త మాంసాలతో వెచ్చని వూపిరితో మన మధ్య జాజ్వల్యమానంగా వెలిగి ఆరిపోయిన మనలోని వ్యక్తే కథలోకి నడిచి వచ్చినట్లు అనిపించడం వల్ల కావొచ్చు. డబల్ పిహెచ్ డి తో తన తెలివి తేటలతో కొత్తతరానికి దారి చూపించగల మేధావికి  తన దారి తానే మూసుకొనే ఆలోచన కలగడంలోని అసంబద్ధత పట్ల అసహనం వల్ల కావొచ్చు. అతణ్ణి బతికించుకోలేని దుస్థితి పట్ల క్రోధంతో కావొచ్చు. మరొకర్ని అతని దారిలో నడవకుండా చేయాలంటే తోటి వ్యక్తులుగా మనమేం చేయాలి అన్న ప్రశ్న తొలవడం వల్ల కావొచ్చు…  యిలా  యెన్నో కారణాలు.

soul

గోపీచంద్ సీతారామారావో రావిశాస్త్రి సుబ్బయ్యో బుచ్చిబాబు దయానిధో కేశవరెడ్డి బక్కిరెడ్డో – యిలా  నవలల్లో పాత్రలు పాఠకుడి మనసు మీద బలంగా ముద్ర వేయడం సాహిత్య ప్రపంచంలో పదికాలాలు నిలబడటం సాధారణంగా జరుగుతుంది కానీ వొక యువ రచయిత రాసిన పది పేజీల కథలోని పాత్ర యింతలా గుర్తుంది అంటే యింతగా వెంటాడుతోంది అంటే కారణం ఆ పాత్రని నిర్మించడంలో లేదా ఆవిష్కరించడంలో అతను చూపిన నేర్పు వొకటే కాదు ;  చిత్వాన్ అతని జీవితంలో భాగం . అందుకే చిత్వాన్ చనిపోతే తన లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా  తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టు , అంత్యక్రియలు జరగాల్సింది ఒక్క చిత్వాన్ కే కాదు. తన లోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అని అతనికి అనిపించింది.

నిజానికి చిత్వాన్ రచయితకే కాదు మనకి కూడా లోపల్లోపల వొక భాగమే. అతనిలా మనమూ యే బంధనాల్లేని జీవితాన్నే ఆశిస్తాం . అతనిలా కట్టుబాట్లు లేని స్వేచ్ఛే  కోరుకుంటాం. ఇళ్ళూ వాకిళ్ళూ అర్థంలేని మమకారాలూ అన్నీ తెంచుకొని పోవడం బాగానే వుంటుంది కానీ చిత్వాన్ బుద్ధుడిలా క్షణిక వాది అయ్యాడు గానీ అన్వేషకుడు కాలేకపోయాడు. మానవకోటి దు:ఖానికి కారణం తెలుసుకోవాలనే ప్రయత్నంలో సిద్ధార్థుడు బుద్ధుడైన క్రమాన్ని అతను మర్చిపోయాడు. తనను తాను అన్వేషించుకొనే దారుల్ని వదులుకొన్నాడు. గుర్తు చేసుకొని సంతోషించే మధురమైన గతమూ ఆశావహమైన భవిష్యత్తూ లేకపోవడం వల్ల తానే క్షణికమని నమ్మిన వర్తమానాన్నీ అందు దాగిన దు:ఖాన్నీ యెదుర్కోలేక  మృత్యుద్వారాన్ని తట్టాడు. హంసలా ఆర్నెల్లు బతికితే చాలనుకొన్నాడు. కానీ మనుషులతో జీవించడానికి కావలసిన వనరుల్ని వెతకలేకపోయాడు , పంచలేకపోయాడు. జీవితాన్నే కాదు  ఆఖరికి ప్రేమనీ ప్రేమించినవాళ్ళనీ బంధనంగానే భావించాడు.

ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. అని సిద్ధాంతీకరించాడు. ప్రేమలోనూ అతని ఆలోచనలు అసాధారణంగానే వుంటాయి. అతని ప్రేమలో గాఢత వుంది. నిజాయితీ వుంది. ప్రేమించినంతసేపూ తనను తాను మర్చిపోయాడు. బయటి ప్రపంచాన్ని వదిలేశాడు (బయటి ప్రపంచం గురించి అతనికెప్పుడూ పట్టలేదు – అది వేరే విషయం). అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మనసులోని ఫీలింగ్సన్నింటినీ సాధారణీకరించడం అతనికి  నచ్చదు. ఇన్నేళ్ల  జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన  ఫీలింగ్ కి అంకితం చేయడంలో యేదో తేడా వున్నట్టు భావిస్తాడు. ప్రేమించడమంటే కోల్పోవడం అని అతని నమ్మకం.

నిన్ను నువ్వు కోల్పోకుండా కూడా యెదుటివారిని ప్రేమించవచ్చనీ  లేదా యెదుటివారిని ప్రేమించడంలో నిన్ను నువ్వు కోల్పోడంలో కూడా మాధుర్యం వుంటుందనీ భరోసానిచ్చే వొక వోదార్పు వాక్యం అతనికెవరూ యివ్వలేకపోయారు.

యే బంధనాల్నీ ఇష్టపడని అతని వ్యక్తిత్వమే ప్రేమకీ జీవితానికి కూడా కట్టిపడేయలేకపోయింది. అతని బాల్యం అతణ్ణి ప్రేమ పట్ల కూడా అవిశ్వాసిగా మార్చింది.

చిత్వాన్ అసలు పేరు కృష్ణమూర్తి. అతని మాటల్లోనే చెప్పాలంటే తండ్రి నెల్లూరికి చెందిన వొక డబ్బులబస్తా , వొక ‘రిచ్ బాస్టర్డ్’. వాడు వుద్యోగరీత్యా నేపాల్ వెళ్ళినపుడు అక్కడ ‘ఉంచుకున్న దాని కొడుకు’ చిత్వాన్. అందుకే అతణ్ణి బాబు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు. కానీ  ‘నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు’ అని కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాడు. నాన్న అతణ్ణి డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. కానీ చిత్వాన్ సమురాయ్. పోరాడాడు. నాన్న ఏ ఊరెళ్తే ఆ ఊర్లో.  చివరికి తండ్రి కాళ్ల బేరానికొచ్చాడు. తండ్రినొక  ఏటియం గా మలచుకొన్నాడు.

ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ పోయాడు. పోరాడి తన జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాడు.

బాబు పోవడంతో ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది.

డబుల్ పిహెచ్ డి తో వుద్యోగం సంపాదించాడు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాడు.  జీతాల జీవితం వొద్దు అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాడు.

రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే అన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడేమో.  కానీ ఈ పేదరికం అతనికి చాలా కొత్త.  ‘జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై’  అని ప్రయత్నించాడు.  కానీ వల్ల కాలేదు.

ఎటియం లు వున్నంత కాలం జీవితం గురించి యెన్నో కబుర్లు చెప్పగలిగిన చిత్వాన్ , జీవితాన్ని యిష్టమొచ్చినట్టు గడపాలంటే ఎటియం ల అవసరం తప్పదని గ్రహించాడు.  ‘యెన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు’ అని గుర్తించాడు గానీ దాన్ని జయించలేకపోయాడు. అందుకు మనసు చంపుకోలేక ఆత్మని అమ్ముకోలేక చావుని ఆశ్రయించాడు.

అంతా చూస్తే లోపలి మనిషి అస్తిత్వ అన్వేషణ – స్వేచ్ఛ ముసుగులు తగిలించుకొన్న వొక వ్యక్తివాదే చిత్వాన్ లో కనిపిస్తాడు. దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవడం , భవిష్యత్తు అగమ్య గోచరం కావడం ,  వ్యవస్థాగత నిర్మాణాలు దాని పట్ల భరోసా ఇవ్వలేని పరిస్థితి , సమూహంలో సైతం వొంటరి ద్వీపాలుగా మిగిలి పోయే భద్రతా రాహిత్యం, వొక చట్రంలో యిమడలేని వ్యక్తిత్వం , వ్యక్తిగతమైనదో సామాజికమైనదో వొక గమ్యం లేకపోవడం , జీవితంలో అస్థిరత్వం , అరాచకత్వం  … యివన్నీ చిత్వాన్ చావుకి కారణమేమో అని తోస్తుంది.

మనుషుల్లోని హిపోక్రసీని ద్వేషించి సమాజానికి అతను దూరమయ్యాడు సరే ; సమాజం కూడా అతణ్ణి తనలో యిముడ్చుకోలేకపోయింది. కెరీరజం వూబిలోకి నెట్టి వైయక్తిక ప్రతిభని పై మెట్టు మీద నిలిపే  విశ్వవిద్యాలయాల డొల్ల చదువులు , మనుషులు సామాజిక జీవులుగా గాక వ్యక్తులుగా విడిపోవడమే స్వేచ్ఛకి పరమార్థంగా నిర్వచించే ఆధునికోత్తర ధోరణులు యువతరాన్ని గందరగోళపరుస్తున్నాయి. చిత్వాన్ లోని వైరుధ్యాలకూ ఇంటలెక్చువల్ యారోగెన్స్ కీ పలాయన తత్త్వానికీ వ్యక్తివాదానికీ కారణం యీ వాతావరణమే.

ఈ ఖాళీలని పూరించుకోడానికి  గానీ యీ గందరగోళాన్నుంచి బయటపడటానికి  గానీ  చిత్వాన్ ప్రయత్నం చేయలేదా అంటే – చేశాడు. కానీ అవి బలహీనమైనప్రయత్నాలు. నిలువుటద్దం లాంటి వొక మంచి స్నేహితుడి కోసం వెతుక్కొన్నాడు.

‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలుఅన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ.’

చిత్వాన్ రచయితలో అటువంటి స్నేహాన్ని చూశాడు. అనుభవించాడు.ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది’ – అంటూ నెమళ్ళ కొలను (పీకాక్ లేక్ కి చిత్వాన్ పెట్టిన పేరు) దగ్గర చేసుకొన్న తొలి పరిచయం తోభయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని’  వున్న రచయితని వాటి నుంచీ బయట పడేశాడు.

‘యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కృత్వా ఘృతం పీబేత్. భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుత:’ అంటూ చార్వాకుడై కాసేపు , పీత్వా పీత్వా పున: పీత్వా అంటూ ఒమర్ ఖయ్యాంగా కాసేపూ , జరాతుష్ట్రగా కాసేపూ , అదేదో సినిమాలో కళాపోషకుడిగా కాసేపూ … గంటకో కొత్త వేషం వేస్తూ వింత  అనుభవాలు  పరిచయం చేసాడు.  వాదాలూ సిద్ధాంతాలూ ప్రవచించాడు ( ఇవ్వాళ చిత్వాన్ బతికుంటే ‘హాయ్ అయామ్ కన్హయ్య కుమార్ ఫ్రం జెయెన్టీయూ’ అనో ‘రోహిత్ వేముల ఫ్రం నక్షత్ర ధూళి అనో’ తనను తాను  పరిచయం చేసుకొనే వాడేమో!)

భీముని కొలను , శ్రీశైలం టైగర్ రిజర్వ్  ఫారెస్ట్ ,   జమ్ము తావిలో వైష్ణోదేవి గుడి , నాసిక్ త్రయంబకేశ్వరం  , ఎల్లోరా కైలాష గుడి , హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె … దేశమంతా తిరిగాడు , తిప్పాడు. జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని – జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుందని చెప్పాడు.

రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని అగ్నిగుండంలోకి నడిపించినప్పటికీ , గంటల లెక్కన నిన్ను నువ్వు అమ్ముకోవద్దని వారించి నప్పటికీ – రచయిత పేదరికాన్ని జయించడానికి విదేశానికి యెగిరిపోయినప్పుడు మాత్రం డీలాపడ్డాడు అనిపిస్తుంది.

‘ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి’ – అని తెలిసినప్పటికీ వొంటరివాడయ్యాడు.

హంపిలో  శిధిలాల్లో   జీవితం  అశాశ్వతమన్న ప్రతీకల్ని చూశాడు. ఆ  శిధిలాల్నుంచి  జీవితం  నశ్వరమని నేర్చుకున్నాడు. అక్కడి రాళ్ళతో అతను మాట్లాడాడు. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిల శిల్పం ‘ ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని అతనికి బోధించాయి. వాటి భాష అర్థం చేసుకొన్నాడు.

కానీ పేరడాక్స్ యేమంటే ఆ శిధిలాల్లోనే ప్రేమలో పడ్డాడు. ప్రేమలోని మాధుర్యం అనుభవించాడు. ఆమెను చూస్తున్నంత సేపూ తన  గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేకుండా పోయాయి. ఆమె మాత్రమే కావాలనుకునే వొకే వొక్క ధ్యేయంతో బతికాడు.ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు. ఆమెను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ  రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది అతనికి.

అంతే –  సడెన్ గా పెరుగన్నంలో ఆవకాయ వేసుకు తినాలనిపించి కాళ్ళా వేళ్ళా బడి ఆమె యెంత బతిమాలినా వినిపించుకోకుండా ఆమెకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యీ లోకం నుంచే వెళ్ళిపోయాడు.

బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు – అని  చిత్వాన్ భావించడానికి కారణాలేంటి అని కథ చదువుతున్నంతసేపూ వొక ప్రశ్న మనల్ని బాధిస్తుంది.

సమూహం నుంచి దూరమైన వ్యక్తివాదమే చిత్వాన్ ఆత్మ హననానికి కారణమని నాకు బలంగా అనిపిస్తుంది. మార్గదర్శనం చేయించే  సామూహిక సామాజికోద్యమాలు బలహీనం అయిన నేపథ్యంలో యిటువంటి ఫిలాసఫీ ముందుకు వస్తుందేమో అని తోస్తుంది. రోల్ మోడల్స్ లేనితనం నుంచి వొక నిస్పృహ నుంచి యిటువంటి విపరీత మనస్తత్త్వం రూపొందుతుందేమోనని భయమేస్తుంది. ఆదర్శవంతంగా వుండాల్సిన వుద్యమ జీవితాల్లోకి సైతం స్వార్థపు నీడలు వ్యాపించడం , ఆచరణలో బోలుతనం చోటుచేసుకుంటున్న అవిశ్వాస వాతావరణంలో వొక సామూహిక స్వప్నాన్ని అతనికి అందించలేకపోయాం అని కూడా వ్యథ కల్గుతుంది.

రొటీన్ లో కూడా మరణించనీకుండా కాపాడే మ్యాజిక్ యేదో మన జీవితాల్లోనూ మనం జీవిస్తున్న యీ సమాజంలోనూ వుందనీ ఆ యేదోని తెలుసుకోలేకపోవడం వల్లే నువ్వు మరణించావు చిత్వాన్ అని అతనికి చెప్పాలని వుంది.

జీవితం అనశ్వరం కాదు ; అశాశ్వతమే …  కానీ స్వయంగా దాన్ని స్వయంగా అకారణంగా నాశనం చేసుకోవాల్సిన అవసరం సైతం లేదు. చావడానికి ధైర్యం అక్కరలేదు – బతకడానికి కావాలి. నిజానికి ప్రేమించడం చావు గాదు ;  ప్రేమరాహిత్యమే మరణం అని గొంతు చించుకు అరవాలని వుంది. వ్యక్తల్నే కాదు మందిని ప్రేమించు , నూతన మానవావిష్కరణ కోసం సమాజంలో యేదో వొక మూల సమూహాలు చేసే ప్రయత్నాల్ని ప్రేమించు , చీకటిని కాదు వెలుగుని ప్రేమించు అని బుజ్జగించాలని వుంది. కానీ కాంక్రీట్ అడవుల్లోనో , భద్ర లోకాల మూలల్లోనో , మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలోనో , ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి పుట్టించడంలోనో మైమరచిపోయి ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు దేశం నుంచి దేశానికి మోసుకుంటూ సంసార రంగుల రాట్నంలో   బిజీగా తిరుగుతూ  వున్న రచయితకు లాగానే నాక్కూడా యేదో తెలీని వ్యక్తం చేయలేని గిల్టీ ఫీలింగ్.

దాన్నుంచీ బయట పడటానికే – అపరాధ భావనని కడిగేసుకోడానికే – పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకుంటూ  జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియని తనం నుంచీ తనను కాపాడుకోడానికే కథలో తననో పాత్ర చేసుకొని తన కథనీ చిత్వాన్ కథనీ రాయడానికి  పూనుకొన్నాడు రచయిత. రాయడం గురించి చిత్వాన్ చెప్పిన మాటలే అతడికి భయం కల్గించాయి  దారిచూపాయి కూడా.

‘రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.

 ‘లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.’

 ఈ మాటలు కథకుడి మీద బలంగా ముద్ర వేశాయి. ‘నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే’ అని నిర్ధారించుకొన్న రచయిత రాయడానికే పూనుకొన్నాడు.

నిజానికి కథలోని పాత్రతో రచయితకు అభేదం పాటించి విశ్లేషించడం ఎంతవరకు సమంజసమో తెలీదు గానీ , సిద్ధారెడ్డి కథ పొడవునా రచయిత పాత్రతో ఐడెంటిఫై అవడం కనిపిస్తుంది. ఆత్మ కథాత్మక కథనంతో విశ్వసనీయత సాధించాడు. అందువల్ల రచయితే కాదు పాఠకులుగా మనం కూడా కథతో కనెక్ట్ అవుతాం. జీవితం పట్ల రచన పట్ల చిత్వాన్ తో యేకీభవిస్తూ విభేదిస్తూ కొట్లాడుతూ రాజీపడుతూ కథలో లీనమవుతాం. ఈ కథ యెందరినో కదిలించిందంటే , దు:ఖ పెట్టిందంటే , చిత్వాన్ పట్ల క్రోధాన్నీ ప్రేమనీ కల్గించిందంటే ,  యేకకాలంలో నచ్చిందీ నచ్చలేదు అన్న ద్వంద్వానికి గురి చేసిందంటే , చదువుతూన్నంత సేపూ తమ లోపలికీ చుట్టూ వున్న యితరుల్లోకీ చూసేలా చేసిందంటే ,   కథా రచనకు  సిద్ధారెడ్డి ఎంచుకొన్న టెక్నిక్కే అందుకు ప్రధాన కారణం.

sidha

అందుకే కథ ఆవు వ్యాసం కాలేదు. మంచి కథ కొత్త కథ చదివామని చాలా మండి పాఠకులు స్పందించారు. కథ యిలా చెప్పడానికి ( రచయిత ఐచ్ఛికంగా యెన్నుకొన్న మౌఖిక శైలి కథకి గొప్ప అందాన్నిచ్చింది) రచయిత దశాబ్దం పైగా స్ట్రగులయ్యాడు. సిద్ధారెడ్డి అంతకు ముందు కథా రచనలో చిన్నా చితకా ప్రయత్నాలు చేసినప్పటికీ సినిమా రంగంలోకి డీవియేట్ అయిన తర్వాత కథా రచయితగా తనను తాను రీడిస్కవర్ చేసుకొనే క్రమంలో రాసిన తొలికథ సోల్ సర్కస్.

రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే అన్న చిత్వాన్ మాటలతోనే కథ ప్రారంభమవుతుంది. ఆ చాలెంజ్ ని రచయిత యెలా  నిర్వహించాడో చూద్దామనే వుత్సుకతతోనే కథ చదవడం మొదలెడతాం. అక్కడ నుంచీ రచయిత పంచుకొనే చిత్వాన్ జ్ఞాపకాలు వూపిరి తీసికోనివ్వవు. జీవితం గురించి చిత్వాన్  ఆలోచనలు మన గుండె లోతుల్ని తడుముతూ వుంటై. అతని మరణానికి కారణం తెలుసుకోడానికి రచయిత వెంట అన్వేషిస్తూ పోతాం.

కథ రచయిత దృష్టి కోణం నుంచీ నడుస్తుంది. కథకుడి దృక్పథం తన సొంత జీవితంపై చిత్వాన్ చూపిన ప్రభావాల గురించి ప్రస్తావించిన సందర్భాల్లో వ్యక్తమౌతుంది. నిజానికి యిద్దరి కథా పక్క పక్కనే కాకుండా జమిలిగా పెనవేసుకొని నడుస్తుంది. అలా నడపడంలోనే వెంకట్ సిద్ధారెడ్డి నేర్పు కనపడుతుంది. నిజానికి కథ అంతా గతమే. కానీ గత వర్తమానాల్లోకి ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. కథ భిన్న స్థల కాలాల్లో జరిగినప్పటికీ అనుభూతి ఐక్యత దెబ్బతినకుండా వుండటమే కథలో బలం. ఆ అనుభూతి పాఠకుల అంతరంగాల్లో విషాదం మిగుల్చుతుంది. ‘నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.’ అని కథకుడి స్థానం నుంచి  రచయిత చేసిన ప్రకటనతో యేకీభవిస్తాం. అందుకే రచయిత లోపలి సంఘర్షణకి కూడా  కథలో సమ ప్రాధాన్యం లభించింది. రచయిత పాత్ర ద్వారా జీవితాన్ని గెలవాలనే ఆరాటంలో మనం కోల్పోతున్నవాటిని గుర్తుచేయడం కూడా వొక కథాంశంగా తయారైంది. రాయడం గురించి రచయిత తనదైన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కూడా వొక సందర్భాన్ని సృష్టించుకొన్నాడు.  అది చిత్వాన్ అభిప్రాయానికి విరుద్ధం కాదు గానీ మరో చూపు.

రచయిత శిల్ప నైపుణ్యం వల్ల దృక్పథా బలం వల్ల కథ వ్యక్తి తలం నుంచీ సామాజిక తలానికి యెదుగుతుంది.

‘రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమోఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా?అంటూ వర్షంలో విరూపాక్షాలయం ముందు నించుని గుండె పగిలేలా రచయిత రోదించినట్టే మనం కూడా వుద్విగ్నులమౌతాం. చిత్వాన్ లను కాపాడుకొనే దారులు వెతుకుతాం. చిత్వాన్ కథ చెప్పడం ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనం అదే అయితే అందులో అతను నూటికి నూరు పాళ్ళు విజయం సాధించాడు.

మరో చిత్వాన్ అకాలంగా  అకారణంగా మన మధ్య నుంచి వెళ్ళిపోకూడదు.

మన మధ్య తిరుగాడే చిత్వాన్ లకీ మన లోపల కదలాడే చిత్వాన్ కీ వొక సామూహిక స్వప్నాన్నిద్దాం ; బతికించుకొందాం. అయితే వొక బృంద గానం ఆలపించిన సామూహిక నినాదమై మోగిన మంది కల గన్న రోహిత్ వేముల కూడా మననుంచి నిష్క్రమించిన విషయాన్ని సైతం మనం మర్చిపోకూడదు. మన స్వప్నాల్ని ధ్వంసం చేసే కుట్రలపట్ల  అప్రమత్తంగా వుండాలి. వాటిని యెదుర్కోడానికి సమాయత్తం కావాలి. అందుకు అవసరమైన శక్తులన్నిటి సమీకరణం యివాళ్టి అవసరం. రోహిత్ ని అయినా చిత్వాన్ ని అయినా మిగుల్చుకోడానికి – అదే యిప్పుడు మనం చేయాల్సిన  సర్కస్ ; కాదు యుద్ధం.

*

మీ మాటలు

  1. Jayashree Naidu says:

    ప్రభాకర్ గారు
    వెంటాడి వేధించిన చిత్వాన్ పాత్ర గురించి రచయిత అంతరంగం గురించి ఇంత విపులంగా మీరు విశ్లేషించిన తీరు చాలా బాగుంది. అప్పట్లో ఆ కథ అంతగా ఎందుకు కలవర పెట్టిందో అర్థం కాలేదు. చిత్వాన్ పాత్ర రక్తమాంసాలతో మనసులో తిష్ట వేసుకోవడం లోని రహస్యం ఏమన్నదీ తెలియలేదు. సిద్దారెడ్డి గారి కథనం లో చిత్వాన్ అంటే తనలో తానుగా తన చితిని మోస్తూ తిరిగే చిత్తమనిపించాడు. అది ఎంతగా నిలవనివ్వకుండా అన్వేషకుడిగా అంతం వరకు అతనితో స్నేహిస్తూ ఉందొ మాత్రం కథలో స్పష్టంగా కనిపించిందీ/వినిపించిందీ. మళ్ళీ మీ విశ్లేషణ కథని జ్ఞాపకాల్లోంచి వెలికి తీసింది.
    థాన్క్స్ ఆ లాట్

  2. అద్బుతమైన కథకు సాటైన విశ్లేషణ. ఇప్పుడు మళ్ళీ సోల్ సర్కస్ చదువుతుంటే చదువుతున్నంత సేపూ నా చుట్టే రోహిత్ తిరుగుతున్నట్టు అనిపించింది. రోహిత్ నిష్రమణ తర్వాత ఈ కథ వచ్చి వుంటే రోహిత్ చిత్వాన్ గా ప్రతిఫలించాడా అనిపించేదేమొ.

    ఇంత సీరియస్ కథలోనూ నాకు పెరుగన్నం-ఆవకాయ కోసం ప్రేమకు దూరంగా వెళ్ళిపోవడం నవ్వులాటగా తోచింది. మీ విశ్లేషణలో దానిమీద మరింత సమాచారం దొరుకుందేమొనని ఆశపడ్డా.

  3. శరత్ చంద్ర says:

    కథ ..ఆశావహ దృక్పడంతో..నడవాలి..ఆ ప్రయత్నం చేసింది ఈ కథ

  4. THIRUPALU says:

    ఎంతమంచి విశ్లేషణ! చిత్వాన్ హీరోయిజాన్ని హైలెట్ చేసిన తీరు అద్బుతం! ప్రపంచ నాయకుల ఎంతో మంది సంస్కారాలను కల బోసి ఒక కొత్త వ్యక్తిత్వాన్ని అందించాలనే తపన కనిపిస్తుంది.

Leave a Reply to THIRUPALU Cancel reply

*