మందు, మత్తు బిళ్ళలు

 

gopi
ఊళ్ళన్నీ నిశ్శబ్దం…
రెండునెల్లుగా యిదే పరిస్థితి.
ఎవురూ ఎవురితో మాట్టడేది లేదు. ఏదన్నా మాట్టాడినా రాజధాని… భూములు… మంత్రుల మాటలు తప్ప వేరే సంగతులేం లేవు.
అందరూ పొలాలకెల్తున్నారు. పనులు సేసుకుంటున్నారు. కానీ ఏదో తెలియని అయోమయ పరిస్థితి. బతుకేమవుద్దో, బతికేదెట్టో అనే ఆలోచన్లే…
పెద్ద ఆసాములు కొంతమంది భూములిచ్చెత్తం అంటన్నారు. మనూరుకి రాజధానొత్తే మంచిదేగా అంటన్నారు.
ఏం మంచిదో… ఎట్టమంచిదో ఎవురూ చెప్పట్లేదు.
“రాజధానొస్తే మన భూములకు మంచి రేటొస్తదిరా” అన్నారు పెద్ద రైతు శ్రీనివాసరావు గారు.
“మన పొలాలన్నీ గవర్మెంటోల్లు తీసుకున్నాక ఆటికెంత రేటొత్తే మాత్రం మనకేం లాభం సార్” అని అడిగిన.
“పిచ్చోడా… గవర్నమెంటు మన భూములు తీసుకొని అభివృద్ధి చేస్తారు. రోడ్లేస్తారు. మంచినీళ్లు, కరెంటు అన్నీ ఇస్తారు. అక్కడే ఎకరానికి ఇంత సొప్పున మన వాటా ఇస్తారు. అది మంచి రేటొస్తది.”
“అంటే అది కూడా అమ్ముకుంటేనేగా సార్”
“డబ్బులు కావాలంటే అమ్ముకోవాలి. లేకపోతే అలాగే ఉంచుకో.”
“అది అమ్ముకుంటే ఎక్కడకి పోవాల? అమ్ముకోకపోతే ఏం తినాల సారూ?”
శ్రీనివాసరావు సార్ కి కోపం వొచ్చినట్టుంది. నావంక గుర్రుగా సూసిండు.
“ఏంట్రా… ఏం మాట్లాడుతున్నావ్?  మనూళ్ళో రాజధాని వద్దంటావా ఏంటి?”
“అంత మాట నేనెందుకంటా సార్… నేను బతికేదెట్టా అంటున్నా. కోపం తెచ్చుకోండి సారూ”
మెల్లగా బతిమాలినట్టు అడిగిన.
“నీలాంటి తిక్క ప్రశ్నలకి నాదగ్గర సమాధానం లేదు. నీకేదో దెయ్యం పట్టినట్టుంది. రాజధాని వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటుంటే తిక్క ప్రశ్నలేస్తావేంట్రా?”
శ్రీనివాసరావు సారు గట్టిగానే మందలిచ్చిండు నన్ను.
బతుకులెట్టా బాగుపడతయో అర్ధం కావట్లేదు. నేను అర్ధం కాక అడుగుతుంటే ఆయన ఇంకేంటో అంటుండు.
***
ఇయ్యాల మాఊళ్లోకి గవర్మెంటు అధికారులొచ్చారు. మేం పొలాలిత్తే వాళ్ళేం సేత్తారో, మాకేంవిత్తారో సెపుతున్నారు.
గవర్మెంటు ఆపీసులోత్తయ్, ప్రయివేటు కంపెనీలొత్తయ్ అంటన్నారు. మా పిల్లలకి ఉద్యోగాలొత్తయ్ అంటన్నారు.
సుబ్బయ్య నాయుడుగారి మనవడు అమెరికాలో వుండు. యిప్పుడు ఆమెరికావోళ్ళే యిక్కడికి ఉద్యోగాలకి వత్తారంట.
“అది సరే సార్… మా సంగతేంటి? మా పిల్లల సంగతేంటి?”
ధైర్యం సేసి నేనే అడిగిన ఆపీసర్ సార్ని. ఒక పక్క భయంగానే ఉంది. సుట్టూ పోలీసులున్నారు. ఆల్లందరూ నన్నే సూత్తన్నారు.
“రైతులకు ఎకరానికి కొంత సొప్పున అభివృద్ధి చేసిన భూమి ఇస్తాం. కొంత నష్టపరిహారం కూడా ఇస్తాం. రైతు కూలీలకు నెలకు కుటుంబానికి 2,500 రూపాయలు ఇస్తాం. అంతే కాదు రైతు కూలీలకు ఇతర వృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం.”
ఆయన సెప్తుండు. అందరూ యింటన్నారు.
“ఇప్పుడు మాకు మీరు నేర్పించేదేంటి సారు. మా భూములు తీసుకొని మాకే బిచ్చం వేస్తారా?”
జనంలోనుండి ముగ్గురు రైతులులేచి  అడిగారు.
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి సూసా… ముగ్గురిలో మా పక్కూరి గాంధీ సార్ ఉన్నడు.
నాకు ధైర్నం వొచ్చింది.
“అయ్యా మొగుడూ పెళ్ళాలం కూలికెల్తే రోజుకి 600 నుండి 800 దాకా కూలోత్తది. యింట్లో యిద్దరం నెలకి 20 రోజులు పనిసేత్తే పది, పన్నెండువేలు వత్తయ్. మీరు నెలకి రెండువేలిత్తే మేం బతికేదెట్టా సారూ.”
అధికార్లేదో సెప్పబోతున్నారు… గాంధీ గారూ, యింకొంతమంది ఏంటో అడుగుతున్నారు. గోల మొదలైంది.
సరిగ్గా అప్పుడే పోలీసులు కదిలారు. గాంధీ గారిని, ఆ పక్కనున్న వాళ్ళనీ, నన్నూ బయిటికి లాగేసారు. “ఎవర్రా మీరూ” ఒక కానిస్టేబులు నా సొక్కాపట్టుకొని గుంజిండు.
“మీటింగ్ పాడుచేయటానికొచ్చార్రా? అధికార్లు చెప్పేది మీరు వినరు, మిగతావాళ్ళని విననివ్వరా?” పోలీసు కానిస్టేబులు గట్టిగానే మందలిచ్చిండు.
నాకు బయమేసింది. కొడతాడేమో పోలీసోడు అనుకున్న. కానీ కొట్టలేదు. దూరంగా తోసేసిండు.
ఈ గొడవ వల్ల మీటింగు రద్దయింది. యింకోసారి పెడతారంట. జనం బైటికి రాకుండా పోలీసోళ్ళు ఆపేసారు. అధికార్లంతా బయటికొచ్చి కార్లెక్కి ఎల్తన్నారు. పోలీసులు అధికార్ల పక్కకి జనం ఎల్లకుండా అడ్డంగా నిలబడ్డారు.
యింతలో గాంధీ గారు నా దగ్గరకొచ్చిండు. భుజమ్మీద చెయ్యేసి “సూరీ బాగా మాట్లాడినావ్. అలాగే ఉండు. తగ్గకు. మనం మన పొలాల్ని కాపాడుకుందాం.”
కొండంత ధైర్నం వొచ్చింది. “అట్నే సారు. మీరు ముందుంటే నాబోటోల్లు శానమంది ఎనకుంటాం”
“సరే, రేపొకసారి కలుద్దాం.”
“అట్నే సార్… వత్తా… కలుద్దాం సార్” అన్న. తర్వాత గాంధీ గారు ఎల్లిపోయిండు.
 ఏదో కొద్దీ ధైర్నం వొచ్చింది. కానీ అన్నీ అనుమానాలే …. భయాలే …
***
అధికార్లు వత్తన్నారు… పోతన్నారు…
పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.
కొంతమంది రైతులు తమ పొలాల్లో కొంత భాగం కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారు. డబ్బు రాగానే పెద్దోళ్ళు కార్లు కొన్నారు. బంగారం కొన్నారు. అల్ల ఆడోల్లు పట్టుచీరలు కొంటన్నారు.
మా వూళ్ళల్లో పరిస్థితి యిది.
పెద్దోళ్లంతా ఉషారుగున్నారు. నాబోటోళ్లంతా ఉసూరంటున్నారు.
రాత్రిళ్లు నిద్ర పట్టటం లేదు. మొగోళ్ళు, ఆడోళ్ళు అందరూ అంతే… కంటిమీద కునుకు లేదు.
మొగోళ్ళు బార్లకెళ్తున్నారు. మందు తాగి ఇంటికొచ్చి పడుకొని ఆ మత్తులో నిద్ర పోతన్నారు.
ఇక ఆడోళ్ళు మందుల సాపు కాడ నిద్ర మాత్రలు తెచ్చుకొని అయి మింగి పడుకుంటన్నారు.
తాగి, తాగి మగాళ్లేమవుతారో, మాత్రలు మింగి ఆడోళ్లేమవుతారో తెలవట్లేదు.
***

మీ మాటలు

*