జ్ఞాపకాల నీడలలో…

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

*

కూపస్థమండూకాన్ని మరపించే నిర్విరామ జాగృదావస్థ.

రెప్పలు విప్పుకున్న అతడి కళ్లలోకి వెలుగురేఖల్ని సూర్యుడు నిర్విరామంగా గుచ్చుతున్నాడు. సూది మొనల గాయాల్తో కనుగుడ్ల చుట్టూ, ఎరుపు రంగు చిక్కబడుతోంది. ఆ చిత్రహింసకి తెర లేపినవి, తెరిచున్న కిటికీ రెక్కలు.  ఆవిష్కృతమైన ఆ మనోజ్ఞ దృశ్యాన్ని అవి, అలవాటుగా తనివి తీరా చూస్తున్నాయి.

ఓ పక్కకి వొరిగి పడుకున్న అతడు, ఆ నొప్పి భరించలేక వెల్లకిలా తిరిగాడు.

కొలుకులమీద నులివెచ్చటి రక్తం తడి. జిగటగా అనిపించని కన్నీళ్లు, వేళ్ల చివళ్లతో తుడుచుకుని పైకి ఒకసారి చూశాడు. పంకా రెక్కల సవ్వడి. గాలి వీస్తున్నట్లుగా అనిపించటం లేదు. వినిపిస్తున్నట్లుగా ఉంది.  స్పష్టంగా కనిపిస్తున్న ఒక అస్పష్టత. అలవాటుగా మారిన మెలకువని రెచ్చగొడుతున్న అలసట.

ఆశల్ని ఊపిరిగా పీలుస్తున్న మెదడు. ఉన్నట్లుండి ఒక ఉక్కిరిబిక్కిరి. శ్వాస ఆడకుండా ఒక నిస్పృహ  అదుముతున్న అనుభూతి. స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించి సహాయం కోసం కేక వేశాడు. అరుపు గొంతులోనే  సజీవసమాధి అయింది. నిస్సహాయంగా కుడి ప్రక్కకి తిరిగి చూశాడు. ఒక అదృశ్యదృశ్యం గోచరించింది.

ఎదురుగా చెలి. ఆమె పెదాలపై విరిలా విప్పారిన విషహాసం. అతడి గుండెలమీద ఆమె కుడి చేయి.

అరచేతిలో కర్కశత్వం. అయిదు వేళ్లూ ముళ్లలా అతనికి గుచ్చుకున్నాయి. ఒకప్పుడు మైమరపు కలిగించిన స్పర్శ ఇప్పుడు వెరపు కలిగిస్తోంది. లోపం ఎక్కడుంది? ఆమె తనని ఉపయోగించుకుంటున్న విధంలోనా? తాను ఆమెని వినియోగించుకుంటున్న విధానంలోనా? బోధపడలేదతడికి.

ఈ మధ్యన జరిగిన సంఘటనలు కొన్ని ఒక్కసారిగా అతడికి గుర్తొచ్చాయి. అవి తలపుకి రావటం వెనక సైతం తనకెదురుగా ఉన్న చెలి హస్తముంది. ఆ విషయం అతడికి తెలుస్తోంది.

***

“ఇన్నాళ్లకి, నేను గుర్తొచ్చానా?” నిష్టూరంగా అడిగింది చెలి.

“నువ్వు నాతో లేకపోవటమే కదా నాకు గుర్తు రాకపోవటానికి కారణం!” అతడు జవాబిచ్చాడు.

“మాటలతో బాగా ఆడుకోగలవు. అవి నిజమని నమ్మించగలవు,” అంటూ ఆమె నవ్వింది. విడకుండానే విచ్చుకున్నట్లుగా అనిపించే పెదాలు. ఒక ముకుళితవికసనం.

“ఇక నుంచి నేను నీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. ఇది మాత్రం నిజం. నువ్వు నా మిగిలిన మాటలు నమ్మకపోయినా ఫర్లేదు. ఈ ఒక్క మాట మాత్రం నమ్ము,”

“నీ నెచ్చెలి అంత త్వరగా నిన్ను వదిలిపెడుతుందా?” అనుమానం వ్యక్తపరిచింది చెలి.

“ఇన్నాళ్లూ నిన్ను వదిలి ఆమె దగ్గర పూర్తిగా ఉండలేదా? అది నువ్వు సహించలేదా? మౌనం వహించలేదా? ఇప్పుడు అదే పని  తానూ చేస్తుంది,”

“నీ ఇష్టం,”

“నీ దగ్గరకు నేను రావటం, ఎవరికయినా అభ్యంతరమా?”

“నా జీవితంలో ఉన్నది నువ్వు ఒక్కడివే. నువ్వు దూరమయినప్పట్నుంచీ నేను ఒంటరినే!”

ఏదో ఒక రోజు అతడు తన దగ్గరకి వస్తాడని ఆమెకి తెలుసు. ఆమెకు కావాల్సిందీ అదే.

***

ఇప్పటివరకూ తనతో సఖ్యంగా సహజీవనం చేస్తున్న అతడు ఈ మధ్యన తరచుగా అన్యమనస్కంగా ఉండటం, నెచ్చెలి గమనించింది.

“ఈమధ్య మీకు నా ధ్యాస ఉండటం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. ఎదురుగా ఉన్నట్లే ఉంటున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లివస్తున్నారు.  ఏమైంది మీకు?” ఒక రోజు అతడ్ని నిలదీసి అడిగింది. నిశ్చలచలనం.

“అలాంటిదేం లేదు. నువ్వనవసరంగా అనుమానపడుతున్నావు,” అతడు తన మనసు కప్పి పుచ్చుకోవటానికి ఒక విఫల ప్రయత్నం చేశాడు.

ఆ జవాబు చెప్పేప్పుడు అతడి చూపు ఆమె కళ్లలోకి సూటిగా లేదు. అదొక్కటి చాలు, అతడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అన్నది ఆమె తెల్సుకోటానికి!

“ఆ మాత్రం గ్రహించలేననుకోకండి. మీరు వెళ్తున్నది ఒకప్పటి మీ చెలి దగ్గరకేగా?” ఎప్పుడూ సరళీస్వరాలు వినిపించే నెచ్చెలి గొంతు ఉన్నట్లుండి పరుషంగా ధ్వనించింది.

ఈ విషయం ఆమెకెలా తెలిసింది? అతడికి అర్థం కాలేదు.

“బంధాన్ని ఎంతవరకు పెంచుకోవచ్చో తెలీకుండానే, ఆమెతో బలమైన అనుబంధాన్ని మీరు మళ్లీ కోరుకుంటున్నారు. నేను వద్దంటానని, ఆ విషయం నా దగ్గర దాచారు. అవునా?” అడిగింది.

“నీతో పాటు ఆమె కూడా కావాలనిపిస్తోంది. అందుకే ఆమె దగ్గరకి మళ్లీ వెళ్తున్నాను,” అన్నాడు అతడు.

“ఒకప్పటి మీ స్నేహం నాకూ తెలుసు. నాకు దూరం కానంతగా ఆమె దగ్గరకూ అపుడపుడు వెళ్తుండండి. అంతవరకూ నాకు అభ్యంతరం లేదు. కాని, అది వ్యామోహం క్రింద మారకుండా చూసుకోండి,”

ఆమె గొంతులో ధ్వనించిన ధృడత్వానికి అతడు విస్తుపోయాడు.

***

చెలి సాంగత్యంలో ఇంతకు ముందెరగని ఒక ఆనందం. ఆమె సాన్నిధ్యంలో నెచ్చెలి హెచ్చరిక అతడికి గుర్తు రావటం లేదు. ఇంతకుముందుకన్నా అతడు ఏకాంతాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇష్టపడుతున్నాడు. వీలు దొరికినప్పుడల్లా చెలితోనే గడపటానికి తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ నెచ్చెలి దృష్టిని దాటిపోలేదు.

“నా మాటని మీరెందుకు లక్ష్యపెట్టటం లేదు?”  ఒక రోజు అతడి చెయ్యి పట్టుకుని కోపంగా అడిగింది.

“…”

“నన్నెందుకు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు?”

“నీ కన్నా చెలితో గడపటమే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. అందుకని!” అసలు విషయం చెప్పాడు అతడు. చెప్పింతర్వాత ఎందుకు చెప్పానా? అని బాధపడ్డాడు. గతజల సేతుబంధనం.

ఆ మాటతో నెచ్చెలి ముఖకవళికలు మారిపోయాయి.  దీపకళికని అంధకారం అంతమొందించింది.

***

“ఎంత సేపు మీలో మీరు ఉంటారు. బయటికి రండి. అలా  కాసేపు తిరిగొద్దాం,” అడిగింది చెలి.  నిక్వణం పలికిస్తానని నమ్మించి, విపంచి తంత్రుల్ని తెంచే ప్రయత్నం.

మొదట్లో ఆమె తనని ఆహ్లాదం కలిగించే ప్రదేశాల దగ్గరకే ఎక్కువగా తీసుకెళ్లేది.  క్రమంగా అది తక్కువైంది. ఇప్పుడు ఆమె తనను తీసుకు వెళ్తున్నది రెండే చోట్లకి.

ఒకచోట, ఒకప్పుడు  తనకు తెలిసి ఏమీ లేదు. ఆ శూన్యాన్ని ఇప్పుడొక శ్మశానం కౌగలించుకుంది. దాంతో అదిపుడు  అంతరించిన అంతశ్చేతనకి ఆలవాలం. చెవుల్లో ఇంకా ధ్వనిస్తున్న చరమగీతం చరణాలు. ఇంకా పూర్తిగా ఆరని చితులు. ఆర్తితో సగంలో ఆగిపోయిన మంటలు. అర్ధభాగం కాలి నిరర్థకంగా మిగిలిన అనుభవాల శవాలు. ఘనీభవించిన విషాదం. దాన్ని అశ్రువులుగా స్రవింపచేయటానికి ఉండుండి ఎవరో గుండెలు బాదుకుంటున్న చప్పుడు. దిక్కులు పిక్కటిల్లేలా ఒక ఏడుపు. అపస్వరఅష్టమస్వరం.

రెండోచోట నిన్నో మొన్నో ఆమని నిష్క్రమించిన వని, పూవని. పచ్చదనం వలువలు పోగొట్టుకుని నగ్నంగా నిలబడ్డ వాంఛావృక్షాలు. తలలొంచిన స్వప్నలతలు. వాటి వైఫల్యం. సాఫల్యత సిద్ధించకుండానే రాలిపోయిన సుమదళాలు. అలరించకుండానే అవనిలో కలిసిపోయిన సురభిళపరిమళాలు. కనిపించే మూగవేదన. వినిపించని మౌనరోదన. జలవీచికల బదులు మరీచికలు.

విభిన్నరూపాల్లో బీభత్సం, భయానక వాతావరణం. జుగుప్స, భయం; ఒక్కోదానికి ఒక్కో స్థాయీభావం.   ఇవేవీ తాను మళ్లీ మళ్లీ చూడాలనుకునేవి కావు.

సింహావలోకనం చేసుకుంటే, అంతా ఒక హింసావలోకనం. నెచ్చెలి తోడులో ఎంత వేదనయినా ఎక్కువగా వేధించేది కాదు. చెలి సాన్నిహిత్యం అలా అనిపించటం లేదు. ఒకప్పుడు అద్దంలో చూసిన అగ్నిపర్వతం ఇప్పుడు భూతద్దంలో దర్శనమిస్తోంది. భూతంగా మారిన ప్రస్తుతం, భూతంలా భయపెడుతోంది.

ధైర్యం తెచ్చుకుని చెలిని అడిగాడు, “నాకు చూపించటానికి ఇంతకన్నా మంచిచోట్లేవీ లేవా నా గతంలో?”

“క్లుప్తమైన సరిగమలు. లుప్తమైన మధురిమలు. సంక్షిప్తంగా నీ జీవితచిత్రం ఇది. వెన్నెలరాత్రులూ, విహారయాత్రలూ ఉండుంటే నువ్వడక్కుండానే నేను వాటిదగ్గరికే  నిన్ను తీసుకెళ్లేదాన్ని. వాటిని నీ నెచ్చెలి మాయం చేసింది. లేని వాటిని చూపించలేదని, నన్నని ఉపయోగం ఏముంది?” అన్నది ఆమె.

ఆ గొంతులో లీలగా ధ్వనించిన వెటకారం, అవలీలగా అర్థమైంది అతనికి.

Kadha-Saranga-2-300x268

***

నెచ్చెలి సోదరి ఇంతకుముందు రోజుకు ఒకసారైనా తన దగ్గరకు వచ్చేది. వచ్చినప్పుడల్లా తన చెల్లెల్ని  ప్రేమగా కౌగలించుకునేది. మనఃస్పూర్తిగా తనని పలకరించేది. ఉన్నట్లుండి రావటం మానేసింది. ఎందుకో తెలీదు.

“ఈ మధ్యన మీ అక్కయ్య కనపడటం లేదేం?” తనకి అందుబాటులో లేకుండా తలుపులు బిగించుకుని  దాక్కున్న నెచ్చెలిని అడిగాడు.

మౌనం సమాధానమయింది.

నేరుగా నెచ్చెలి సోదరినే అడిగితే సరి. ఉదయం ఆమె గృహోన్ముఖురాలయే సమయం.

ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. తేజస్సును విరజిమ్ముతూ, తేలుతున్నట్లుగా నడిచి వస్తూ దూరంగా ఒక కాంతిపుంజం. క్రమంగా అది పెద్దదయింది. ఆ రూపం ఒక ధవళవస్త్రధారిణిది. ఆమె సమీపిస్తున్న కొద్దీ పరిసరాలన్నిటా పరివ్యాపితమై ఒక సాంత్వనాగీతం.  మలయమారుతం.

“మీ కోసం ఎదురు చూస్తున్నాను,”

“నాతో మీకేం పని?”

“ఒక్క మాట అడుగుదామని,”

ఆగకుండా వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపాలని ప్రయత్నించాడతను. ఆమె వొంటి స్పర్శ అతడికి తెలీలేదు. కాని, అతడి స్పర్శ తనకి తగిలినట్లు, అది రుచించనట్లు ఆమె విదిలించుకుంది. ఓ క్షణం ఆగింది. రాత్రంతా తనకి తాను లేనట్లు బరువెక్కిన కళ్లు.

ఏమిటో చెప్పమన్నట్లు అతడి వంక అసహనంగా చూసింది.

“నా మీద కోపం వచ్చిందా? రావటం మానేశారు!”

“కోపం రాలేదు. మీరే తెప్పించారు,”

“బహిరంగంగా ఎందుకు? నా తలపుల్ని తెరుస్తాను. లోపలకి వస్తే ఆన్ని విషయాలూ సాకల్యంగా మాట్లాడుకోవచ్చు,” ఆప్యాయంగా  ఆహ్వానించాడతను.

“ఆ అవసరం లేదు,” కర్కశంగా జవాబిచ్చింది ఆమె.

“ఇంతకు ముందు రోజూ వచ్చేవారుగా?”

“అంతకు ముందు నా చెల్లెలు నీ దగ్గర ఉండేది. సుఖపడుతుండేది. నిన్ను సుఖపెడుతుండేది. అందుకని నేను స్వేచ్ఛగా రాగలిగేదాన్ని. ఇప్పుడా అవకాశం లేదు,” అంది ఆమె.

“ఇప్పుడు కూడా ఆమె నా దగ్గరే ఉందిగా?”

“ఉంది. కాని ఇంతకు ముందులా లేదు. చిక్కి శల్యమైంది,”

“మీకెలా తెలుసు?”

“నీకు కనపడనంతమాత్రాన, ఇంకెవరికీ  కనపడదనుకోకు,”

అందుకనేనా? ఎప్పటెప్పటి విషయాలో  ఒకటొకటి తన మీద దాడి చేస్తున్నది! వాటి వెనక ఉండి వాటిని చెలి రెచ్చగొట్టగలుగుతున్నది! పగబట్టినట్లు వాటిని తట్టి లేపి తనవైపు తరమగలుగుతున్నది!

నెచ్చెలి సోదరి వాటివంక నిర్నిమేషంగా చూస్తోంది.

***

కనపడిన రెండు నిజాలనీ అతడు జీర్ణించుకోలేకపోయాడు. అలాగే కూర్చుండిపోయాడు. ఒక్క నిమిషం తర్వాత తేరుకుని, “ఇప్పుడు నేనేం చెయ్యాలి?” ఇంకా తన ఎదురుగా నిలబడే ఉన్న నెచ్చెలి సోదరిని  నిస్సహాయంగా అడిగాడు.

“చేయగలిగిందేమీ లేదు. మా అమ్మ రాక  కోసం నువ్వు ఎదురు చూడాల్సిందే!”

“నెచ్చెలికి నా వల్ల జరిగిన హాని తెలిసి కూడా,  మీ అమ్మ నా దగ్గరకు వస్తుందా?”

“కన్నకూతుళ్లు కదా! రాక తప్పదు,”

“వచ్చి ఏం చేస్తుంది?” అయోమయంగా అడిగాడు అతడు.

“తన కూతుళ్లని తనతో తీసుకు వెళుతుంది,”

“నా సంగతో?”

“ఆమె వస్తే నీ దగ్గర నువ్వూ మిగలవు!” ”

-o) O (o-

 

 

 

మీ మాటలు

  1. Sailajamithra@gmail.com says:

    Kadhanam chaala bavundhi.l

  2. Bhavani Phani says:

    చాలా బావుంది సర్

మీ మాటలు

*