ఒరే, సుబ్బిగా!!

 

 

ఒక చేతి లో వెండిగిన్నె పట్టుకుని, మరో మరో చేత్తో – ఒకో జాజి మొగ్గని తుంపుతూ… – పందిరివైపు పరీక్షగా చూసింది కమల.

ఒక గుంజ -మెల్ల మెల్లగా వెనక్కి ఒరుగుతోందని గమనించింది. గుంజని పైకి లేపి, బాగా లోతుకల్లా మట్టి తవ్వి, గుంజని గట్టిగా నిలిపి, పూడ్చాలి. అప్పుడిక కదలదు. ఇది తన ఒక్క దానివల్లయ్యే పని కాదు.  సుబ్బిగాడొస్తే, చెప్పాలి. క్షణాల్లో  చేసి పెడ్తాడు.

మొన్నటికి మొన్న, దొడ్లో మూల వైపు బిగిసిన గట్టి నేలని ఎలా బాగుచేసాడూ? ఒక్క పలుగేసి,  మట్టినెలా  పెళ్ళగించాడనీ! అంత మేర దిబ్బనీ, – నాగలితో దున్నినట్టు నిముషాల్లో  చదును చేసి పారేశాడు. ఎలా అయినా, వాడి బలం వేరు. పిడుగులాంటి మనిషి. ‘ – తమ్ముణ్ణి తలచుకుంది.

“అమ్మా, మావయ్యొచ్చాడు..” చేతిలో లడ్డూ పొట్లమెత్తుకుని, తూనీగలా పరెగెత్తుకుంటూ వచ్చి చెప్పింది పదేళ్ళ కూతురు.

తమ్ముడొచ్చాడని తెలీగానే కమల ముఖం ట్యూబ్ లైట్ లా  వెలిగిపోయింది. వున్న మనిషి వున్నట్టుగా ఉరికి, ముందు గదిలోకొచ్చింది. – “సుబ్బిగా నీకు నూరేళ్ళురా! ఇప్పుడే నీ మాటనుకుంటున్నా..నువ్వొచ్చావు ?” అంది సంతోషంగా.

“నన్ను తలచుకుంటున్నావా? ఏమనీ? ఈ వెధవ ఊళ్ళో వుండి కూడా, చూడ్డానికి రావడం లేదు సచ్చినోడు అని తిట్టుకుంటున్నావా?” అంటూ పకపకా నవ్వాడు సుబ్బులు.”

తమ్ముడి మాటలకు నొచ్చుకుంటూ.. “ ఛ! అవేం మాటలురా సుబ్బిగా?!- అలా ఎందుకనుకుంటాను? మీ ఆవిడ  చెప్పింది. నీకు ఆఫీస్ లో పనెక్కువగా వుంటోందనీ, రాత్రిళ్ళు  కూడా లేట్ గా వస్తున్నావనీ! అద్సరే,  ఇలా నా మీద దయపుట్టింది? ఏమిటీ విశేషం?” అంది నవ్వుతూ.

“చూడాలనిపించింది, వచ్చేశా. నా అక్క ఇంటికి నేనెప్పుడైనా రావచ్చు కదా? కదరా తల్లులూ?” అంటూ ప్రేమగా మేనకోడల్ని వొళ్ళో కుర్చోబెట్టుకుని, లడ్డూ పొట్లం విప్పి, ఒక లడ్డూ తీసి తినిపిస్తున్నాడు.

ఇలాటి సన్నివేశం ఎంత కనుల విందుగా వుంటుందో – కమలకి!  మనసంతా ఏం సంబరమౌతుందో ఏమో కానీ,  ఆ సంతోషం తెచ్చే వెలుగుతో ఆమె ముఖం మరింతగా కళకళ లాడిపోతుంది.

ఆడపడుచులకి – అన్నదమ్ములంటే  ఎందుకింత  పిచ్చిప్రేమో  తెలీదు. ఒక్కసారి కనిపిస్తే చాలు. అప్పటిదాక వున్న అలకలు, కినుకులు అన్నీ మాయమైపోతాయి. వాటి స్థానంలో ఎక్కడ్లేని ఆప్యాయతలూ పొంగి పొర్లుతాయి.  యేడాదికొక్కసారి ఇంటికి పిలిస్తే చాలు. పదేళ్ళ దాకా ఆ మురిపాలే చెప్పుకుని చెప్పుని మురిసిపోతుంటారు.  కట్టిపారేసే ఎన్ని చీరలున్నా, అన్నదమ్ములు పెట్టిన  చీరలని మాత్రం భద్రం గా దాచుకుంటారు బీరువాల్లో. ‘ఈ చీర మా పెద్దాణ్ణి కడుపుతో వున్నప్పుడు పెట్టాడు, ఈ పట్టు చీర ఇంటి గృహప్రవేశానికి పెట్టాడు -మా పెద్ద తమ్ముడు.. మొన్న ఎండా కాలం సెలవలకని వెళితే వొద్దు వొద్దన్నా వినకుండా పట్టుబట్టి మరీ కొనిపించాడు ఈ జరీ చీర..’ అంటూ చెప్పుకుంటారు. అవేవో వెయ్యెకరాల పొలం అన్నట్టు!  ఆ అభిమానానికి అంతే వుండదు. ఆప్యాయతానురాగాలను నిర్వచించడానికి అక్షరాలే చాలవు.

అన్నదమ్ములు –  తన మీద కంటే కూడా తన పిల్లల మీద   ప్రేమ చూపుతూ ముద్దు చేస్తున్నప్పుడు సోదరుల మీద ప్రేమ రెట్టింపౌతుంది ఏ ఆడపడుచుకైనా!పెళ్ళయ్యాక స్త్రీలు – కోరుకునే అసలైన పుట్టింటి ఆస్థిపాస్తులు ఇవే!

సోదరులెంత పేదవారైనా సరే,  ఆ గడప నించి  తెచ్చుకునే చిటికెడు పసుపు కుంకుమలు- ఓ కుంచెడు మణి మాణిక్యాలంత విలువుగా వుంటాయి ఆడపడుచులకి. విలువలనేవి- వస్తువులని బట్టి వుండవు. వ్యక్తులని బట్టి వుంటాయి.  నిజమే, అవి ప్రేమని బట్టి నిర్ణయించబడతాయి.

“అమ్మా, నాన్న ఎలా వున్నారు రా? పది రోజులైపొయింది, చూడక! వద్దాం వద్దాం అనుకుంటే.. ఎక్కడా,  కుదరడమే లేదు. పెద్దాడికి టెంత్ క్లాస్ ఎగ్జాంస్ దగ్గరకొస్తున్నాయి కదా! వాడటూ ఇటూ కదలకుండా చదివించాల్సొస్తోంది.

“అవునవును. చదివించాలి. మార్కులెలా వస్తున్నాయి..?”

“బాగానే వస్తున్నాయిలే. కష్టపడుతున్నాడు. అయినా వాడి వెనకెనకే వుంటున్నాం.  మీ బావ గారు కూడా  చెవినిల్లు కట్టుకుని మరీ  చెబుతున్నారు. మనకే ఆస్థి పాస్తులు లేవూ, చదువొక్కటే దిక్కని.” పిల్లాడి భవిష్యత్తు గురించో, మరెందుకో ఆమె స్వరం దిగులు పడింది.

“వాడింకా పదో క్లాసే కదక్కా! మరీ చాదస్తం కాకపోతే, అప్పుడే మీ ఇద్దరికీ అంతంత దిగుళ్ళైతే ఎలా?  ఆ? ” ప్రేమగా కోప్పడ్డాడు.

“నిజమే అనుకో. ఏదైనా, వాడొక ఒడ్డు చేరేదాకా మాకు స్థిమితం వుండదురా. ఆడపిల్ల సంగతంటావా?, అది వేరే సంగతి. ఎంత చదివితే అంత చదివించి పెళ్ళి చేసి పంపేస్తాం..చూసావా మాటల్లో పడి అడగడమే మరిచిపోయా. మంచి నీళ్ళివ్వనానా?  ఏం తింటావో చెప్పు?” అంటూ ఇక కష్టాల రేడియో కట్టేస్తూ అంది.

పుట్టింటి వారిని చూడంగానే ఆడపిల్లలకు ఏం పూనుతుందో ఏమో కానీ,  కుండపోత వర్షం కురిసినట్టు కురుస్తాయి కబుర్లు. అదొక ఆగని ప్రవాహం. ఇది మొదలు, ఇది ముగింపు అన్నట్టుండదు సంభాషణ. ఎక్కడ్నించి  ఏ విషయం  మొదలు పెట్టాలి అనే ప్రణాలికలేవీ వుండవు. మనసులోవన్నీ ఒకేసారి చెప్పేయాలనే తాపత్రయం లో  ఏవేవో మాట్లాడేయడం పరిపాటే ఆమెకి!

అక్క అడిగిందానికి జవాబుగా  – “ఏం తింటానంటే.. కాస్త నీ బంగారు చేతుల్తో మరమరాలలో ఉల్లిముక్కలేసి చేస్తావు చూడూ, ఆ మసాలా చేసి పెడ్తావూ?” అని అడిగాడు చిన్నపిల్లాడిలా నవ్వుతూ.

తమ్ముడు అడగడమేమిటీ, ఆమె అక్కణ్ణించి వేగంగా  కదలడమేమిటీ!!  – రెండూ ఒక్కసారే  జరిగాయి.

సుబ్బులు – తన   మేనకోడలితో ముచ్చట్లాడటం, మాటలయ్యాక, ఆమె వొళ్ళోంచి దిగి వెళ్ళిపోవడం, అతడు  రేడియో ట్యూన్  చేసి, అలవాటుగా వివిధభారతి లో హిందీ పాటలు పెట్టుకుని, రఫీతో కలిసి గొంతు కలపడం..

– అంతా మనసుతో వీక్షిస్తున్న – కమల ‘హమ్మయ్యా’ అనుకుంది భారం తీరిన దానిలా. ‘ఆ రోజు’ నించి తమ్ముడు ఇంటికి రాకపోతే కోపమొచ్చిందేమో అని  తర్జనభజన పడింది. మునపట్లానే  వున్నాడు చనువుగా. మార్పేమీ లేదు.    ‘అంతా మరిచిపోయాడులే’ –  స్థిమిత పడింది ఆమె మనసు.

ఇంతకీ – ఈ అక్క గారు ‘ఒరే, సుబ్బిగా’అని ముద్దుగా పిలుచుకునే ఇతగాని  అసలు పేరు – నాగ వీర వెంకట శివ సుబ్రహ్మణ్య శర్మ.

చదువులో పూర్. అందరూ చదివే పాఠ్య పుస్తకాలలోని సారమేదీ బుర్రకి అంటకపోవడంతో.. టెక్నికల్  కోర్సులో జేర్పించారు. ఎలా అయితేనేం గట్టెక్కి,  గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు.  ఎలెక్ట్రికల్ విభాగం లో సూపర్ వైజర్  పోస్ట్. వెంటనే వివాహం జరగడం, పిల్లలు కలగడం అంతా సవ్యంగానే వుంది.  మొత్తానికి స్థిరపడ్డట్టే కనిపిస్తాడు చూసే వాళ్ళకి.  కానీ జీవితం లో ఎప్పుడు బాగుపడతాడా అని చింత పోతారు అయిన వాళ్ళు, అతన్ని బాగా తెలిసినవాళ్ళూ.

అలా అని మనిషి దుర్మార్గుడా అంటే  అంటే కాదు. మనసున్న మంచి వాడు.తల్లి తండ్రుల్ని తలా కొన్నాళ్ళు పంచుకోవాలంటూ అన్న గర్లులు తీర్మానించి,  వంతులేయబోతుంటే భోరుమని ఏడ్చిన, గొప్పపసి హృదయుడు. ఎన్నాళ్ళు బ్రతికితే అన్నాళ్ళూ తనింట్లోనే వుంటారని చెప్పి పుత్రుడనే పదానికి నిర్వచనంగా నిలిచిన వాడు.

కోపమొచ్చినప్పుడు తప్ప, – పెళ్ళాం అంటే  ప్రేమున్న వాడు.

తోబుట్టువులంటే ప్రాణం. ప్రేమగా పలకరిస్తాడు. తృణమో ఫలమో పిల్లల చేతుల్లో పెడతాడు. సుబ్బి మావయ్యంటే అందరకీ ప్రియమే.

కమలకి ఇంకా ప్రియం. ‘ఒరే సుబ్బిగా’అంటూ ఎడ తెగని కబుర్లాడుకుంటుంది తమ్ముడితో.

అలానే అతనూ! వీలు చిక్కినప్పుడల్లా అక్క ఇంటికెళ్లడం, కుశలమడగడం, చిన్నా చితకా పనులు  వుంటె  చేసి పెట్టి రావడం అతనికి అలవాటు. ఇలా వచ్చి అలా పిల్లలతో గడిపి వెళ్తుంటాడు.

చుట్టుపక్కల వాళ్ళు కమల అదృష్టాన్ని పొగుడుతుంటారు. “మీ తమ్ముడికెంత ప్రేమండి, మీరంటే! అదృష్టవంతులు. మా వాళ్ళూ వున్నారు..చుట్టం చూపుకైనా వచ్చి పోరు..” అంటున్నప్పుడు కమలకి నిజంగానే గర్వమేసేది.

నిజమే. అక్క చెప్పే మాటలన్నీ  ఆలకిస్తాడు. అన్నీ వింటాడు. ఐతే – ఆ ఒక్క మాట తప్ప!

తమ్ముడి చేతికి మసాలా మరమరాల పళ్ళెం అందిస్తూ అంది. “ఏవిటీ, శ్రావణ శుక్రవారం ఏం కొంటున్నావ్, అమ్మకీ, మరదలకీ? అంటూ, మావూలుగా అడిగింది.

వెంటనే సుబ్బు ముఖంలో వెలుగు మాయమైంది. ” ఏం చెప్పమంటావ్ అక్కా! అటు నా పెళ్ళాం, ఇటు అమ్మా నా ప్రాణం తినేస్తున్నారనుకో..” అంటూ చెంచాతో మరమరాలు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.

కమలకి  సమస్య ఏవిటో తెలుసు. అయినా, ఏమీ ఎరగనట్టు ” ఏమంటున్నారురా?” అని అడిగింది అమాయకపు ముఖమేసుకుని.

“ఏముందీ, దాని గాజులు, ఆవిడ రవ్వల దిద్దులూ విడిపించమనీ…”

తమ్ముడి నోట్లోంచి నిజం బయటకొచ్చింది కాబట్టి, నిట్టూర్చింది. ఇన్ని మంచి లక్షణాలున్న తమ్ముడికి ఈ ఒక్క చెడ్డ అలవాటు లేకపోయుంటే ఎంత బావుండేది జీవితం! అనుకుంటూ  లోలోనే బాధపడింది.

వెంటనే అతని మీద జాలీ, ప్రేమలు కలిసి ఒక ఉప్పెనలా పొంగుకొచ్చాయి. ఎదలోంచి తన్నుకొచ్చిన ఆ భావోద్వేగంలో గభాల్న అనేసింది. “ఒరే, సుబ్బిగా! మనిషివేమో బంగారం లాంటి వాడివి!  ఈ వెధవ చీట్ల పేకాట మానేసి, బాగు పడకూడదట్రా? అమ్మ  ఎంత ఏడుస్తోందో తెలుసా, నిన్ను తలచుకుని తలచుకునీ? మరదల్ని చూసావా? చిక్కి సగమైంది మనిషి. సుబ్బిగా! నా మాట వినరా!  ఇక నైనా ఆ ముదనష్టపు  పేకాటకెళ్ళడం మానేయరా.” తమ్ముడి చేతులు పట్టుకుని బ్రతిమిలాడింది.

ఆమె మనసు ప్రేమతో, మాటలు అభ్యర్ధనతో, చూపులు ఆప్యాయతా స్పర్శలతో  నిండిపోయున్నాయి. నిజానికి  ఆ ఆర్ద్రతా హృదయానికి ఎంతటి రాయైనా చలిస్తుంది. కానీ సుబ్బూ కి మాత్రం అరికాలి మంట నెత్తికెక్కి, చిర్రెత్తుకొచ్చింది.

తాగుబోతుని తాగొద్దన్నా, తిరుగుబోతుని తిరగొద్దన్నా, వాగుబోతుని వాగొద్దొన్నా ఎంత కోపమో, – పేకాట ప్రియుళ్ళకి పేకాటని తిడితే  అంత కోపం వస్తుంది. అది సహజం. ఎందుకంటే – వ్యసనాలకి బానిసలైన వారికి మాన ప్రాణాల పట్ల స్పృహ వుండదు . బ్రతుకు – పతనావస్థకి చేరుతున్నా గ్రాహ్య ధారణ వుండదు. నశించి వుంటుంది ఆ శక్తి.

కన్న వాళ్ళు, తోబుట్టువులు, కన్నీరు నింపుకుని ఇలా ఏమైనా నీతులు చెప్పబోతే..వాళ్ళకి అవి అశ్లీల పదాలు గా  వినిపిస్తాయి.  తీవ్ర అవమానానికి గురి అవుతున్నట్టు భగభగ లాడిపోతారు. క్షణంలో కోపం బుస్సుమని లేస్తుంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడు సుబ్బులు కూడా అదే స్థితి లో వున్నాడు.  అయితే, అక్క గారితో అవసరం వుండి,  వెనక్కి తగ్గాడు. “అదేవిటక్కా, అప్పుడే ఆపేశావ్, భగవద్గీత?  ఇంకా చెప్పు. వినే చవటనున్నాగా!” అన్నాడు పొడిపొడిగా.

తమ్ముడి కి కోపం వచ్చిందని గ్రహించింది. ఏం  మాట్లాడలేదు.  అతనే అందుకున్నాడు. “ ఇంటికెళితే వాళ్ళిద్దరూ చెరోపక్క తినేస్తున్నారు. మనశ్శాంతి కోసం ఇక్కడికొస్తే – ఇహ ..ఇప్పుడు నువ్వూ మొదలు పెట్టావన్నా మాట..నీతి బోధలు..అసలు నా గురించి మీకేం తెలుసని అసలు?” తుఫాను ముందు పిడుగుల్లా వున్నాయి ఆ మాటల జోరు.

“అది కాదురా..పాపం..” అంటూ గుటకేసింది కమల, తమ్ముడు ముఖంలో రంగులు మారడాన్ని చూసి.

“పాపం అంటే? అంతగా హింసించేస్తున్నానా? వాళ్ళకి నేనేం తక్కువ చేస్తున్నానని? అన్నం పెట్టడం లేదా? పస్తులు పడుకోబెడుతున్నానా?”

“……”

“ నాకీ అలవాటు ఎలా అయి చచ్చిందో, అయి చచ్చింది. దీన్ని వదిలించుకోవాలనీ నాకూ వుంటుందమ్మా..మీ అందరితో చివాట్లూ చెప్పుదెబ్బలు తింటం నాకు మాత్రం సరదానా? ఎప్పటికప్పుడు బయటపడాలనే తంటాలు పడుతున్నా. కానీ నా వల్ల  కావడం లేదు.

అయినా, ఒక మాట చెప్పనా అక్కా? –  నేను పేకాట్లో పోగొట్టుకున్నదే మీకందరకీ కనిపిస్తోంది కానీ, ఈ ఆటలో  ఎంత సంపాదించానో అన్నది మీకు కనపడటం లేదు. డబ్బొచ్చినప్పుడు  రాలేదా? అలానే పోయినప్పుడు పోతుంది. వ్యాపారం లో మాత్రం నష్టాలు రావా? తిప్పుకోవాలి. ఇదీ అంతే అనుకోవాలి మనం.”  వివరిస్తున్నాడు. తను చేస్తున్న పనేదో అంతర్జాతీయ మార్కెటింగ్ సర్వీస్ అన్నట్టు.

ఏ వ్యక్తయినా తాను చేసిన వెధవ పనిని గనక  తాను సమర్ధించుకోకపోతే –  చేసిన తప్పుని ఒప్పుకున్నట్టు ఔతుంది. అందుకే ప్రతి నేరస్థుడూ   లాజికల్ థియరీస్ని, లింక్డ్ స్టోరీస్ నీ వినిపిస్తాడు.  వినే వాళ్ళకి నిజమనిపించేలా..’పాపం’ అని జాలి కలిగించేలా మాట్లాడి మెప్పించే సామర్ధ్యం కలిగివుండటం – వ్యసన పరులకున్న గొప్ప లక్షణాలలో చెప్పుకోదగిన లక్షణం.    .

“చెడి పోయావ్  చెడిపోయావని అంటారు మీరందరూ! నిజానికి నాకేం చెడ్డలవాట్లున్నాయంటావ్? పోనీ, నువ్వు చెప్పు! డబ్బు పెట్టి కార్డ్స్ ఆడేటప్పుడు టెన్షన్ పుట్టుకొస్తుంది. ఇదిగో ఈ సిగరెట్టు – అలా అంటుకున్నదే! ఇది తప్ప, నాకే దురలవాట్లూ అంటలేదు, అంటించుకోలేదు.

నా చుట్టూ వుండే మా వాళ్ళందరూ పీకల్దాకా ఎలా తాగుతారో తెలుసా? అంతమంది తాగుబోతులతో కుర్చున్నా, నేనొక్క చుక్కయినా నోట్లో వేసుకోను. అసలా వాసనంటేనే నాకు వాంతేసుకొస్తుంది.”

సుబ్బి చెబుతున్నది నిజమే. ఆ సంగతి ఆమెకి తెలుసు. అంతే కాదు. మాంసం తినడు. మందు తాగడు. పర స్త్రీలని కన్నెత్తి చూడడు. పన్నెత్తి పరుషంగా మాట్లాడడు.

కానీ, లేని దురలవాట్లకంటేనూ, వున్న ఈ ఒక్క చెడ్డలవాటు వాణ్ణీ, వాడి జీవితాన్నీ నిలువునా కూల్చేస్తోంది. ఇది చాలదూ?

దొరికిన వాళ్ళ దగ్గర దొరికినంతగా అప్పులు చేస్తున్నాడు. వాళ్ళొచ్చి, జీతాల రోజున ఆఫీస్ నించే వసూలు చేసుకుపోతున్నారు. పది శాతం వడ్డీకి తెచ్చిన మరో కొత్త అప్పుతో  ఇల్లు నడుపుతున్నాడు. ఇంత జరుగుతున్నా, పేకాట కెళ్ళడం మానటం లేదు. ఇంట్లో ఆడవాళ్ళ నగలు తీసుకెళ్ళి, కుదువ పెట్టి మరీ పేకాడి, డబ్బు తగలేసొస్తున్నాడంటే..ఇక కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించి ఏమౌతుందని ఏడ్వాలి?

‘ఇదేమిటని అడిగినప్పుడల్లా..ఇంట్లో రామ రావణా యుధ్ధాలు జరుగుతున్నాయని, మీరైనా మీ తమ్ముడికొకసారి చెప్పి చూడండి వదినగారు, నా కాపురాన్ని నిలబెట్టండి..’ అంటూ మరదలు తనతో చెప్పుకుని భోరుమంది.. అన్న సంగతి తమ్ముడికి చెప్పలేదు కమల.

ఈ నిజం తెలిస్తే, అతని అహం ఇంకా దెబ్బ తింటుందని ఆమెకి తెలుసు.

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కుటుంబ స్త్రీలు మాట రాని వాళ్లయిపోతారు. రాయి కంటే నిశ్శబ్దంగా మిగిలిపోతారు. ఈ కటిక సమస్య నించి బయటపడే మార్గం కనపడక,  అంధకారం లో తల్లడిల్లిపొతుంటారు.

చెప్పే వాళ్ళెంత మంది వున్నా, వినే వాడి కి బుధ్ధి లేనప్పుడు ఏంచెప్పి ఏం లాభం?

ఇంటి దీపాన్ని కాపాడాల్సిన వాడు ఆర్పేస్తానంటే ఇక ఎవరు మాత్రం ఆ చీకట్లను తరిమేయగలరు? ఎంతకని బాగుచేయగలరు ఆ యజమానిని?

గాఢం గా నిట్టూర్చి, అంది మెల్లగా. “మరేం చేద్దామనుకుంటున్నావ్ రా సుబ్బీ?..ఎలా ఈ విష వలయం నించి బయటపడదామనుకుంటున్నావ్?”

“అదే ఆలోచిస్తున్నాను అక్కా..సరదాగా అలవాటైన ఈ పేకాట – నా తలనిలా చుట్టుకుంటుందనుకోలేదు..” – చేసిన తప్పు అతనకి ఇప్పుడిప్పుడే అతని తెలుస్తోందనడానికి గుర్తుగా చిన్నపశ్చాత్తాపం కూడావుంది ఆ కంఠంలో. కమల ఉలిక్కిపడి చూసింది సుబ్బి వైపు.

“అవునక్కా, బయటపడాలనుకుంటున్నా. ఇక శాశ్వతం గా అందులోంచి బయటకొచ్చేయాలనుకుంటున్నా….”

“ఎలా…?” ఆశగా  చూసింది.

“ఇలానే..మరో సారి పేకాటలో నా అదృష్టాన్నీ పరీక్షించుకుని..”

అతడి మాటలకి వినంగానే గాలి తీసిన బెలూన్లా నీరు గారిపోయింది.

“అవునక్కా. ఎక్కడ పారేసుకున్నావో  అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. నాకు తెలిసిన విద్య ఇదొక్కటే. నాకు వేరే వ్యాపారాలు, వ్యూహాలూ ఏవీ తెలీవు. అందుకే ఆఖరి సారిగా ఈ ఆదివారం క్లబ్ కెళుతున్నా. ఎందుకంటే, ఈ సారి చాలా పెద్ద పెద్ద వాళ్ళొస్తున్నారు బోంబే  నించి. అంతా కాకలు తీరిన వాళ్ళే. ప్రెటీ కాష్ పార్టీలు. పందెం కూడా డబల్ బెట్టింగ్ లో సాగుతుంది.  నా తడాఖా చూపించి గెలుచుకురావాలని చూస్తున్నా. బంగారం విడిపించి, అప్పులన్నీ తీర్చేపడేసి హాయిగా ఊపిరి తీసుకోవాలనుంది అక్కా!”

పగటి కలలు కంటున్న తమ్ముడ్ని చూసి జాలి గా అనుకుంది. ‘సుబ్బిగా..ఎంత పిచ్చివాడివిరా తండ్రీ! పేకాటలో పెట్టే డబ్బు, వెలయాలికిచ్చే మూల్యం రెండూ వెనక్కొస్తాయన్న నమ్మకమే?..ఏమిటీ పిచ్చి ఆశ వీడికి? ఏమిటా గుడ్డి నమ్మకం ఈ అమాయకుడికీ?..మానేస్తా అంటున్నాడు కానీ ఎంత వరకు నిజమని ఈ మాటలు?..

“నన్ను నమ్ము అక్కా! ఈ ఒక్క సారి కి నువ్వు నాకు సాయం చేస్తే..నా జాతకమే మారిపోతుందక్కా, ప్లీజ్..ప్లీజ్..మా బంగారక్కవి కదూ..?

పరధ్యాన్నంగా వున్న కమల అతని మాటలకి ఎవరో  వెన్ను చరిచిన దాన్లా నిఠారై కుర్చుంది.

ఏమిటి..అడుగుతున్నాడు తనని? డ..బ్బా? కనుబొమలు ముదిచి చూసింది.

“అవునక్కా. ఒక్క పదివేలు ఇస్తే చాలు. అదక్కడ పెట్టి కుర్చున్నానంటే, రొటేషన్లో అదే పదింతలౌతుంది. తక్కువైతే లోన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు..” వివరిస్తున్నాడు.

అవేమీ కమలకు వినిపించడం లేదు. తల అడ్డంగా వూపుతూ అంది.

చిత్రం: మన్నెం శారద

చిత్రం: మన్నెం శారద

“ఒరే, సుబ్బిగా. కిందటి సారి ఇలానే అడిగి తీసుకెళ్ళావు. కంపెనీ డబ్బు ఇంట్లో వుంటే,  మీ బావ గారికి తెలికుండా ఇచ్చాను. కానీ ఆ రోజు గుర్తుందా.. ` మనిషిని పంపుతున్నా డబ్బిచ్చి పంపించమని మీ బావగారు చెబితే .. ఎంత గా హడలిపోయాను? వున్నపళంగా  నీ ఆఫీసుకి పరుగెత్తుకొచ్చాను. కాళ్ళల్లోంచి ఒకటే వొణుకు. నువ్వు లేవు. నీ ఫ్రెండెవరో స్కూటరేసుకుని నిన్ను వెదికి పట్టుకొచ్చాడు. నువ్వేమో నన్ను చూసి తెల్ల ముఖమేసావ్. ‘ఇప్పటికిప్పుడంటే ఎలా?’ అన్నావ్..నాకు గుండాగినంత పనైంది..నా యందు దేవుడుండి, నీకెవరో డబ్బిచ్చారు..సర్దావు. కానీ నేను ఆ రెండు గంటలు పడ్డ మానసిక క్షోభ ఎంత భయంకరమైనదో  నీకు అర్ధం కాదు. ఆనాటి చేదు అనుభవంతో నాకు గొప్ప కనువిప్పు కలిగింది. అప్పుడే నేనొక స్థిర  నిర్ణయం నిర్ణయానికొచ్చాను.  నా భర్తకి తెలీకుండా జీవితం లో నేనెవరికీ  డబ్బు ఇవ్వకూడదని!

అంతే కాదు, అప్పుడా క్షణం లో నిన్ను విసుక్కున్నానని, నా మీద నీకు కోపం వచ్చిందని తెలుసుకుని బాధ పడ్డాను. రక్త సంబంధీకుల మధ్య ఆర్ధిక సంబంధాలుండకూడదని అవి ప్రేమాప్యాయతల్ని నొక్కేస్తాయని అర్ధమయింది.

సుబ్బిగా! నన్ను మన్నించరా. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇవ్వలేను.” అంటూ తలొంచుకుంది.

“అంతేనా అక్కా? ఇదేనా నీ చివరి మాటా?” అది బెదిరింపో, లేక చివరి అభ్యర్ధనో అర్ధం కాలేదామెకి.

“సుబ్బూ..నువ్వు మగాడివి. పేకాటలో ఓడినా, అప్పులు నిన్ను ముంచినా, ఉద్యోగం ఊడినా  బ్రతికేయగలనని అన్నావు.  రిక్షా లాగయినా నీ వాళ్ళని బ్రతికించగలనని  ధైర్యంగా చెప్పావు గుర్తుందా? కానీ..ఈ అక్క జీవితం అలా కాదురా! నా బ్రతుకు – నేను పూర్తిగా నమ్మి బ్రతుకుతున్న నా  కాపురం మీదే ఆధారపడి వుంది…”

“నీకేం తక్కువని అక్కా అలా మాట్లాడుతున్నవ్? బావగారు మంచివారైతేనూ!”

“అదే రా నా భయం. అందుకే అబధ్ధం చెప్పి మోసం చేయలేను. ఆరునూరైనా నేను  నిజాయితీ తప్పే అవకాశమే లేదు. అంతే.”

అంతా అర్ధమైంది అతనికి. కానీ, వేరే రీతిలో. “కథలెందుకులే అక్కా. నువ్వు ఇవ్వాలనుకుంటే  ఎలా అయినా ఇవ్వొచ్చు.” అంటూనే, కుర్చీ లోంచి లేచి నిలబడ్డాడు.

ఇంత చెప్పినా తమ్ముడికి అర్ధం కాలేదంటే..అది అతని తప్పు కాదు.

కనీసం ‘వెళ్తున్నా’అని అయినా చెప్పకుండా,  పెద్దపెద్ద అడుగులేసుకుంటూ వీధి ద్వారం దాటి పోతున్న తమ్ముడి వైపు అసహాయంగా  చూస్తుండిపోయింది.

‘ఒరే సుబ్బిగా! నా మీద కోపంతో  నా ఇంటికి  రాకపోయినా ఫర్వాలేదురా! నువ్ బాగుపడితే చాలు..నాకంతే  చాలు..” ఎందుకో! ఎద వంతెన దాటి దుఃఖం పొంగుకొచ్చింది.   చాలా సేపు కళ్ళు వర్షిస్తూనే వున్నాయి ఆమెకు తెలీకుండా!

ఇద్దరి మనుషుల మధ్య గల బాంధవ్యం ఎంత బలమైనదే అయినా, దాన్ని బలహీన పరిచే చేసే శక్తి – కొన్ని పరిస్థితులకుంటుంది.

ఇది జరిగిన సరిగ్గా రెండు రోజుల తర్వాత..

****

“ఇంటి ముందు ఆ జనమేమిటండీ?” కంగారు పడుతున్న భార్యతో నిజం చెప్పాల్సొస్తున్నందుకు బాధ పడుతూ చెప్పాడు మూర్తి. “సుబ్బిగాడు పోయాడు కమలా!నువ్వు తట్టుకోలే…” ఆయన మాటలేవీ ఆమెకి వినిపించలేదు..”ఆ!!” అంటూ ప్రాణం ఎగిరిపోయినదాన్లా, ఒక్క ఉదుట్న రిక్షాలోంచి దూకి, పరుగెత్తుకుంటూ లోపలకెళ్ళింది.

తను విన్నది అబధ్ధమనుకుని భ్రమపడింది కానీ నిజంగానె సుబ్బి గాడు పోయాడు. గదంతా కిక్కిరిసి ఉన్నారు మనుషులు.

చలనం లేని దానిలా అడుగులేసుకుంటూ వెళ్ళి, తమ్ముడి మృత దేహం పక్కన చతికిలబడిపోయింది.  శరీరం మీద తెల్లని దుప్పటి కప్పి వుంది. ఒక్క ముఖం మాత్రమే కనిపిస్తోంది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టున్నాడు. – ‘ఎంత పని చేసావురా సుబ్బిగా..ఎంత పని చేసావ్..” అంటూ మీద పడి భోరుమంది.

ఆమె ని చూసి అందరూ ఒక్క సారి గా ఘొల్లుమన్నారు. ‘అమ్మా, కమలా..చూడవే తల్లీ మమ్మల్నెంత మోసం చేసి పోయాడో వీడు. కడుపు శోకం భరించలేకపోతున్ననమ్మా..భగవంతుడా! ఎంత అన్యాయం చేశావయ్యా…ఒరే సుబ్బిగా..ఒరే సుబ్బిగా..” గుండెలు బాదుకుంటున్నతల్లి తండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి.

దుఃఖతీవ్రత లో గమనించలేదు కానీ మరదలి పరిస్థితి ఇంకా హృదయవిదారకంగా వుంది. ఏడ్చి ఏడ్చి ఓపిక లేనిదాన్లా వ్రేలాడిపోతోంది. దగ్గరికి తీసుకున్న కమలకి తెలుస్తోంది.  ఆమె దుఖంలో మరో సముద్రమేదో భీకరంగా పొంగుతోందని. మనిషి బిగుసుకుపోయి వుంది..కట్టెలా.. ఏదో అనుమానం. ఎన్నో సందేహాలు

“పొద్దుట్నించి పచ్చి నీళ్ళైనా గుటకేయలేదు..” ఎవరో అంటున్నారు.

“పద..ఒక్కసారి లోపలికి పద..నా తల్లివి కదూ?” కమల అతి కష్టం మీద మరదల్ని లోపలికి తీసుకు రాగలిగింది.

“నేను తీసుకొస్తా..మీరెళ్ళండి” అంటూ వెనకొచ్చిన వాళ్ళని పంపేసి,గది తలుపులు మూసేసింది.

తడి బట్టతో ముఖం తుడిచి, మంచి నీళ్ళు తాగించి, ఇన్ని పాలు నోట్లో పోసి బలవంతం గా గుటకేయించింది. చెరిగిన జుట్టు సరిచేస్తూ, రెండు చేతుల్లోకి  ముఖం తీసుకుని మరో సారి కదిలిపోయింది కమల. వదిన గార్ని చుట్టుకు పోతూ భోరుమని శోకించింది.

ఆమెని ఓదారుస్తూనే  అడిగింది మెల్లగా. – ” లతా! ఎలా జరిగింది ఈ ఘోరం..?”

అప్పటికే – ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త పొక్కింది.

అది నిజం కాదన్నట్టు తలూపి, చెప్పింది వెక్కుతూ…”మీ ఇంటి నించి వచ్చాక నాతో గొడవ పెట్టుకున్నారు. మెళ్ళో నాంతాడు ఇవ్వమంటే శుక్రవారం పొద్దు ఇవ్వనన్నాను. అయినా  విన్లేదు..నన్ను కొట్టి, మరీ లాక్కుపోయారు. ఈ రెండురోజులు క్లబ్లోనే వున్నారు.నిన్న తెల్లవారు ఝామున ఫోన్ చేసారు..” అంటూ పెద్ద పెట్టున ఏడ్చింది.

“ఫోన్ చేశాడా!?”

“అవును. చేసారు. డబ్బు గెలిచిన ఆనందం లో  ఏవిటేవిటో మాట్లాడేసారు. ఇక పేక ముక్క ముట్టనని  పిల్లల మీద వొట్టని  చెప్పారు…రేపు కమలక్కింటికి వెళ్ళి చెప్పాలి అన్నారు. గంటలో బయల్దేరి వస్తున్నా అన్నమనిషి..    మాయ..మై.పో..యి,  తెల్లారి….చెరువులో పడున్నాడంటూ…ఇంటికి తీసుకొచ్చారు..”ఇక చెప్పలేనిదానిలా..” కీచు మంటూ ఆగింది స్వరం. ఏడ్వడానికి కూడా కంఠం సహకరించడం లేదామెకి.

వింటున్న కమల రాయిలా అయిపోయింది. మరదలి రెక్కపుచ్చుకుని ఎలా నడుచుకుంటూ వచ్చిందో శవం దగ్గరికి తెలీదు.

మెదడు అనే స్క్రీన్ మీద ఏవో ఆకారాలు నల్ల నల్ల గా కనిపిస్తున్నాయి. పెనుగులాడు   తున్నాడు తమ్ముడు.

. వాడొకప్పుడు అన్న మాటలు – గుండె గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి ‘గెలవంగానే డబ్బు మూటకట్టుకుంటానంటే ఊరుకుంటారనుకున్నావా?  మళ్లా ఆడమంటారు..జాగ్రత్తగా ఆడి, కొంత పోగుట్టుకోవాలి..లేకపోతే…వెంటపడి ప్రాణం తీస్తారు..కక్షలు అలా వుంటాయి..”

‘అవునా సుబ్బీ!?నీ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారా నానా!’

తమ్ముడి ముఖం వంక చూసింది..ఆ తర్వాత కంఠం దగ్గర..అంతే. ఆమెకి కళ్ళు తిరిగాయి.

‘ఒరే, సుబ్బిగా..” అంటూ గావు కేకేసి  నేల మీద కుప్పకూలిపోయింది.

స్పృహ తప్పిన భార్య ని చూసి కంగారు గా దగ్గరకొచ్చాడు మూర్తి.

*****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. సం భ శంకర్ says:

    ఆర్ దమయంతి గారి ‘ఒరేయ్ సుబ్బిగా’ కథ చదివాను!
    కొంత మంది కథలు సామజిక స్పృహ తో ఉంటాయి! చెప్ప బోయే సందేశం ప్రతి అక్షరం లోనూ కనబడుతూ ఉంటుంది! కొంతమంది మాటల్ గారడీ చేయరు! వారికి కథకు సంబంధించిన కథా వస్తువే పెద్ద పెట్టుబడి! అంటె నా అర్థం ఒక చిన్న ఉదాహరణ తో వివరిస్తాను- ఒక ఊరు- ఆంధ్ర దేశపు నడి బొడ్డున- ఆ ఊర్లోని వీధుల పేర్లు కర్ల్ మార్క్స్ వీధి, కెన్నెడీ వీధి అని పెడితే!!!!? . మన రచయిత్రిని – అదే దమయంతి గార్ని అలా పేర్లు పెట్టమంటే —ససేమిరా—ఎందుకంటే ఆమె ఎంత సమాజం గురించి చెప్పలనుకున్నా ఆమెకు స్ఫురించే పాత్రలు- అక్కా, మావయ్య, మరిది, మరదలు అత్తా పిన్నీ – మన చుట్టూ ఉండే మన వాళ్ళు- వాళ్ళకుండే మంచి చెడులూ, కాదంటారా. వీళ్ళందరి తోనే ఈ కథా రాక్షసి అన్ని నీతులూ చెబుతారు ! అదే ఈ కథ లోని అందమూ.
    మనిషి యొక్క విశ్వ రూపాన్ని సుబ్బిగాడి పాత్రలో చక్క మెలితిప్పారు దమయంతి గారు! మనిషే సర్వస్వం, వాడు గుణాల సమాహారం. వాడికి చెడు అలవాటు అబ్బి ఎలా మారుతుందో వేరే చెప్పనవసం లేదు- కథ చదివితే చాలు. ఎండిన నేలని దున్నినట్లు చేయగలిగిన సుబ్బిగాడు తన బ్రతుకు ‘దున్నుకో’ లేక పోయాడు. ఇది దమయంతి గారి పట్టు. కథకి ఆయువు పట్టు!! చదువ వలసిన కథ !!!!

    • ఆర్.దమయంతి. says:

      నిజం చెప్పారు శంకర్ గారు.
      కథ కానిది అనే శీర్షిక లో నే రాసే సంగతులన్నీ నే చూసినవొ, విన్నవో, నాతో ఫ్రెండ్స్ పంచుకున్నవో – అయి వుంటాయి.
      చదివే వారిలో పఠనాసక్తి ని కలగచేయడం కోసం – కథని అల్లుతున్నా, విష్యం మాత్రం సహజమైనదే. అభూత కల్పనలు ఉండవు. నేనెక్కువగా పాత్రల్ని, పాత్రల స్వభావాల్ని చదువుతింటాను. అందుకే మీరన్నట్టు వీళ్లందరూ మన చుట్టూ వున్నవాళ్ళే అని అనిపిస్తుంటారు.
      అవునూ, అనుకోకుండా బిరుదు ప్రదానం చేశారు?
      అంతా ప్రశంసే?!
      :-)
      ధన్యవాదాలు.

  2. Jayashree Naidu says:

    ప్రతి పాత్రనీ కలగలుపుతూ బంధాల్ని దృశ్యం గా పదాల్లో బంధిస్తూ చివరకు వచ్చే సరికి గొంతులో ఎదో అడ్డు పడ్డట్టయింది. చాలా బాగుంది దమయంతి. ప్రపంచ వ్యవహారాలూ అంతే మరి గెలిచిన వాడి గెలుపుని కుడా దోచుకుంటుంది. కాదంటే జీవితాన్నే దోచుకుంటుంది.

    • ఆర్.దమయంతి. says:

      ‘ప్రపంచ వ్యవహారాలూ అంతే మరి గెలిచిన వాడి గెలుపుని కుడా దోచుకుంటుంది. ‘
      -జయశ్రీ నాయుడు.

      జయ్! నీ మాటలెప్పుడూ కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంటాయనడానికి నిదర్శనం ఈ కొటేషన్.
      ఎంత చక్కని వ్యాఖ్య!
      ఈ గుప్పెడు అక్షరాలని గుండెలో బంధించేసాను.
      సదా కృతజ్ఞతలతో..

  3. G.S.Lakshmi says:

    కథ పూర్తిచేసేటప్పటికి గుండె గొంతులోకి వచ్చింది దమయంతీ..

  4. Vaadhoolasa says:

    జీవితం లోంచి పుట్టుకొచ్చిన కథ .అయిన వాళ్ళ బలహీనతలు ఆత్మీయులకు కలిగించే మనో వ్యధను ఒడుపుగా చూపించారు కథలో.ఒక్క దుర్గుణం పెక్కు సద్గుణాలను ఎలా మట్టు పెట్టగలదో చూపించే మంచి శిల్ప నైపుణ్యం కలిగిన కథ.రచయిత్రి ఆర్. దమయంతి గారికి అభినందనలు .

    • ఆర్.దమయంతి. says:

      “మంచి శిల్ప నైపుణ్యం కలిగిన కథ”
      * మీ ప్రశంసకివే నా అభివాదములు.
      శుభాకాంక్షలతో…

  5. Lakshmi raghava says:

    మనసును కదిలించింది దమయంతి గారు. మీ కథ ల్లోఅన్నీ వాస్తవంగా ఉంటాయి.

    • ఆర్.దమయంతి. says:

      థాంక్సండి లక్ష్మీ రాఘవ గారు!
      ‘కథ కానిది..’ అనే ఈ శీర్షిక లో – నిజ అంశాలని ఆధారం గా చేస్కుని కథలుగా రాయాలని ఒక నా ప్రయత్నం!
      నేను చదివిన కొందరి వ్యక్తుల నీడలు చాయలు..కొన్ని కన్నీళ్ళు..మరి కొన్ని విషాదాలు.ఇక్కడ కదుల్తుంటాయి.
      – మీకు వీలున్నప్పుడు నా రాబోయే కథలు కూడా మీరు చదవాలని నా కోరిక!
      శుభాకాంక్షలతో..

  6. నిజంగా ఏడుపు వచ్చింది —

    • ఆర్.దమయంతి. says:

      అయ్యో..కష్టపెట్టానాండీ!
      ఆ పాత్ర అలా ముగిసిందండీ..
      మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు ఉదయరాణి గారు.

  7. కథ చాలా హృద్యంగా, ఆర్ధ్రంగా ఉందండీ! అసలూ, మీ నేరేషన్ భలే ఉంటుంది. కథలో పాత్రల మధ్య సంబంధ బాంధవ్యాల్ని పాఠకుల మనసుకు హత్తుకునేలా చిత్రిస్తారు. మీరు కథని నడిపించే తీరు ఉంటుంది కదండీ.. ఆ మీ అల్లిక సింప్లీ సూపర్బండీ. మీరింకా మరెన్నో బోల్డన్ని మంచి కథలు రాయండి. థాంక్యూ..!

    • ఆర్.దమయంతి. says:

      నాగరాజ్ గారు చాలా ధన్యవాదాలండి. భలే మాట్లాడారు కథ గురించి. చాలా నచ్చింది మీ వ్యాఖ్య.
      శుభాకాంక్షలతో..
      :-)

  8. Venkat Suresh says:

    కంట్లో నీరు తెప్పించారు. మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ :)

    • ఆర్.దమయంతి. says:

      సురేష్!… ఈ తరం యువకులలో తెలుగు కథలు చదివేవారు చాలా తక్కువ. చదివినా చెప్పని వారెక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో.. మీరు అన్ని రచనలు చదివి చక్కని కామెంట్స్ ని అందచేయడం ఎంతైనా ముదావహం. ప్రశంసనీయం. అంటే కాదు ఇది రైటర్స్ చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నాను.
      మీ హృదయ స్పందన తెలియచేసినందుకు చాలా ధన్యవాదాలు.

  9. “ఆడపడుచులకి – అన్నదమ్ములంటే ఎందుకింత పిచ్చిప్రేమో తెలీదు. ఒక్కసారి కనిపిస్తే చాలు. అప్పటిదాక వున్న అలకలు, కినుకులు అన్నీ మాయమైపోతాయి. వాటి స్థానంలో ఎక్కడ్లేని ఆప్యాయతలూ పొంగి పొర్లుతాయి.” ఎంతటి నిజమో కదా!
    చాలా బాగుంది కథ దమయంతీ. ఇలా వ్యసనాల మోజులో పడి నాశనమైపోయిన వాళ్లు ఎందరో!
    ఇప్పుడు.. లాటరీ టికెట్లు కూడా వచ్చాయి.. లక్షలు పోగొట్టుకుంటున్నారు.
    మంచి సందేశం.
    అభినందనలు.

    • ఆర్.దమయంతి. says:

      ధన్యవాదాలు భానక్కా.
      కథ మంచి సందేశాన్ని ఇచ్చింది అన్నందుకు.
      నమస్సులతో..

  10. V Bala Murthy says:

    దమయంతీ, భలే ఉంది నీ కథ. కథ చదువుతున్నట్లు. కాకుండా, జరుగుతున్న దాంట్లో నేను కూడా ఒక పాత్రని అయినట్లుగా అనిపించింది. సుబ్బిగాడు పోయాడంటే, గుండె తడైంది! చాలా బాగుంది. అభినందనలు!

    • ఆర్.దమయంతి. says:

      మీకు కలిగిన బాధే నాకూ కలిగింది అక్కా! ఇలా చాలామంది వున్నారు మన చుట్టుపక్కల! అన్ని కథలని కళ్ళతో చూస్తూనే ఉంటాం. వ్యధలని ఇలా చెప్పుకుని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాననే వేదన ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. వేధిస్తూనే ఉంటుంది అక్కా!
      సుబ్బిగాన్నీ చదివి మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
      నమస్సులతో,
      మీ
      చెల్లెలు.

  11. Ganti sujala says:

    కధా కాదు కాదు పచ్చినిజం ఇలాంటి జీవితాలు కోకొల్లలు. వ్యసనంలోని బాధల్ని, మానవతా విలువల్ని,ఆడపడుచు కి అన్నదమ్ముడి మీద ప్రేమను బాగా చిత్రీకరించారు

  12. D Subrahmanyam says:

    హృదాంతం గా చెప్పారు కధని. ముగింపులో “‘అవునా సుబ్బీ!?నీ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారా నానా!’” ఎందుకో అసహజం గా ఉందనిపించింది. అతని ప్రాణం పేకాటవల్ల పోయే ప్రమాదమున్నట్టు అతని మాటలు “‘గెలవంగానే డబ్బు మూటకట్టుకుంటానంటే ఊరుకుంటారనుకున్నావా? మళ్లా ఆడమంటారు..జాగ్రత్తగా ఆడి, కొంత పోగుట్టుకోవాలి..లేకపోతే…వెంటపడి ప్రాణం తీస్తారు..కక్షలు అలా వుంటాయి..” చెపుతున్నప్పుడు అక్క అన్న పై మాటలు సరిగ్గా లేవనిపించింది .

  13. కర్రానాగలక్ష్మి says:

    జూదదగృహాలలో జరిగే నిజం అదే , నేను అలా ప్రాణాలు పోగొట్టును వారిని చాలా మందిని తెలుసు , వీధిన పడ్డ జీవితాలనీ చూసేను ‘కథకానిది ‘ పచ్చినిజం

Leave a Reply to D Subrahmanyam Cancel reply

*