ఆకాశానికి అంకెల నిచ్చెన!

ramanujan1

గణితమంటే అతనికి అంకెలతో ఉప్పొంగే అనంత ప్రవాహం . అందరూ చూడలేని  విచిత్రమైన రంగుల్ని నింపుకున్న వింత వర్ణచిత్రం, ఇసుక రేణువులన్ని రహస్యాల్ని గర్భాన దాచుకున్న సాగర తీరం. గణితం అతనికి జీవం, జీవన వేదం. గణితం అతని దైవం. అసలతనికి గణితమే జీవితం. ఇంతకీ అతని పేరు శ్రీనివాస రామానుజన్. అంకెల్తో ఎటువంటి ఆటైనా  అడగలిగేటంతటి మేధస్సును కలిగి ఉన్నప్పటికీ వాటిని దైవ సమానంగా పూజించగలిగేటంతటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన  గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్.

రాబర్ట్ కనిగల్ రచించిన రామానుజన్ జీవిత చరిత్ర  ఆధారంగా, అదే పేరుతో 2015లో నిర్మింపబడిన చలన చిత్రం The Man Who Knew Infinity.

భారతీయ గణిత శాస్త్రవేత్తగా, అత్యున్నతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తిగా శ్రీనివాస రామానుజన్ పేరు వినని వారెవరూ ఉండరు. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1887 నవంబర్ 22న జన్మించిన రామానుజన్ ని ముఖ్యంగా గణిత శాస్త్రం రంగంలో అత్యంత మేధావిగా పేర్కొనవచ్చు. కానీ అతని జీవితం నల్లేరు మీద నడకేమీ కాదు.

ఈ సినిమా అతని చిన్నతనాన్నీ, చదువుకున్న రోజుల్నీ ప్రస్తావించకుండా యవ్వన దశలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న పరిస్థితులతో మొదలవుతుంది. మెల్లగా చిన్న ఉద్యోగం సంపాదించుకున్న కొద్ది రోజులకే ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్ కి వెళ్లే అవకాశం అతనికి లభిస్తుంది. ఆ రోజుల్లో సముద్రయానం నిషిద్ధం కావడం వల్ల కొన్ని సందేహాలతో, మరి కొన్ని సంశయాలతోనే అతను కేంబ్రిడ్జికి వెళ్తాడు.

అతను ఇంగ్లాండ్ రావడానికి కారకుడైన సీనియర్ గణిత శాస్త్రవేత్త సి.హెచ్. హార్డీతో కలిసి ఐదు సంవత్సరాల పాటు తాను రాసిన గణిత సిద్ధాంతాలపై సాధన చేస్తాడు. పరస్పర వ్యతిరేక వైఖరులు కలిగిన ఆ ఇద్దరు మేధావుల మధ్య  ఏర్పడే ఘర్షణ, అనుబంధం, అక్కడ రామానుజన్ గడిపిన జీవితం ఈ చలనచిత్రంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. నిజానికి ఆ రోజులే రామానుజన్ కి అత్యంత ఆనందాన్నీ, కష్టాన్నీ కూడా కలిగించిన రోజులు.

ramanujan2

అంకెల్ని అక్షరాలుగా భావిస్తే, రామానుజన్ ని అతి విశిష్టమైన కవిగా పేర్కొనవచ్చు. కవికి హఠాత్తుగా కలిగే సృజనాత్మకమైన ఊహల్లా ఇతని ఆలోచనల్లోకి ఉన్నట్టుండి సరికొత్త సమీకరణాలు ప్రవేశించేవి. కవి వాస్తవాన్నీ, కల్పననీ పద చిత్రాలతో పెనవేసినట్టు, అసంకల్పితంగా ఇతను రాసిన సిద్ధాంతాలన్నీ నిదర్శనాలతో సహా నిజాలుగా నిరూపితమయ్యాయి. ఇసుక రేణువుల్లోనూ, నీటి ప్రతిబింబంలోనూ, కాంతి రంగుల్లోనూ ఇలా ప్రకృతికి చెందిన ప్రతీ చిత్రంలోనూ విచిత్రమైన అంకెల క్రమాన్నీ, అందాన్నీ చూడగలిగిన సౌందర్య పిపాసి రామానుజన్.

ఆటోడిడక్ట్ అయిన రామానుజన్ గణిత శాస్త్రంలో అప్పటివరకూ సాంప్రదాయబద్ధంగా ఉపయోగిస్తున్న పద్ధతులేవీ తెలుసుకోకుండానే ఆ శాస్త్రానికి చెందిన ఎన్నో కొత్త విషయాల్ని వెలికి తీసి తనకో ప్రత్యేకమైన శైలినీ, మార్గాన్నీ ఏర్పరుచుకున్నాడు. తీవ్రమైన ఆధ్యాత్మిక భావాలు కలిగిన ఈ మేధావి, తన ప్రతిభను తమ ఆరాధ్య దేవత నామగిరి అమ్మవారి అనుగ్రహంగా అభివర్ణించాడు. ‘దేవుడి ఆలోచనను ప్రతిబింబించనప్పుడు ఏ సమీకరణమైనా తనకి  అర్థవంతం కాదన్న’ అభిప్రాయాన్ని అతను వ్యక్తపరిచాడు. మేథమెటికల్ ఎనాలసిస్, నెంబర్ థియరీ వంటి గణిత శాస్త్ర రంగాల అభివృద్ధిలో ఇతని పాత్ర అమూల్యమైనది. రామానుజన్ వ్యక్తిత్వంలోని ఈ విభిన్నమైన

కోణాలన్నిటినీ నటుడు దేవ్ పటేల్ అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. హార్డీగా నటించిన జెర్మీ ఐరన్స్  నటన కూడా చెప్పుకోదగ్గది.

అతని జీవితాల్లోని కొంత భాగానికే అధికమైన ప్రాధాన్యతను ఇచ్చి, నటీనటుల నటనా చాతుర్యంపై ఎక్కువగా ఆధారపడిపోవటం వల్ల ఈ చలన చిత్రం అసంపూర్ణంగా అనిపించినప్పటికీ రామానుజన్ వ్యక్తిత్వాన్నీ, మేధా శక్తినీ ప్రతిఫలించడంలో  మాత్రం సంపూర్ణంగానే  సఫలమైంది. పరిసరాలపై తక్కువా, వ్యక్తుల భావాలపై ఎక్కువా శ్రద్ధ పెట్టడం వలన కెమెరా కన్ను వంద శాంతం పనితీరును ప్రదర్శించలేకపోయినప్పటికీ అసంతృప్తిని మాత్రం మిగల్చలేదు. పూర్తి సాంప్రదాయ పద్ధతిలో చలన చిత్రాన్ని నడిపించినా  దర్శకుడు మాథ్యూ బ్రౌన్ కృషి, ప్రయత్నం అభినందనీయమైనవి.

‘మనుషులకంటే మీరు అంకెలనే అధికంగా ప్రేమిస్తారటగా’ అని అతని భార్య  జానకి దెప్పి పొడిచినప్పుడు అతను సంతోషంగా అంగీకరిస్తాడు గానీ భార్యనీ, బాధ్యతనీ కూడా అతను అమితంగానే ప్రేమిస్తాడు, ఇంగ్లాండ్ లో ఉన్న రోజుల్లో ఆమె కోసం తీవ్రంగా పరితపిస్తాడు. సనాతన వాది కావడం వలన అక్కడి ఆహారానికి అలవాటుపడలేక, పర దేశపు వాతావరణంలోని మార్పులకి సర్దుబాటు చేసుకోలేక అనారోగ్యం పాలవుతాడు. టీబీ వ్యాధి బారిన పడి శారీరకంగా నరకాన్ని అనుభవిస్తున్నా తన పనికి మాత్రం ఆటంకం కలగనివ్వడు. ఒక భారతీయుడిగా వివక్షకి గురికావడం వలన కొంత  ఆలస్యమైనప్పటికీ చివరికి హార్డీ కృషి ఫలితంగా తన సిద్ధాంతాలని ప్రచురించుకుని, అరుదైన పురస్కారమైన రాయల్ సొసైటీ ఫెలోషిప్ ని పొందుతాడు. ఇక ఇంటికి వెళ్లాలన్న కోరికతో ఇండియాకి తిరిగొచ్చి దారిలో మళ్ళీ  తిరగబెట్టిన అనారోగ్యం కారణంగా, జన్మభూమిని చేరుకున్న సంవత్సరానికే 1920 లో తన 32 వ ఏట తుది శ్వాసని విడుస్తాడు ఈ అపర బ్రహ్మ.

మరణం కంటే బాధాకరమైన విషయం మరింకేముంటుంది. మరణమంటే నాశనం కావడమేగా. మరణించిన వారు, జీవించి ఉన్న కాలంలో చేసిన గొప్ప పనులు, లోకం వారిని పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా  చెయ్యవచ్చు . కానీ వారి అనుభూతులు, అనుభవాలు ముఖ్యంగా వారి  విజ్ఞానం వారితో పాటుగా అంతం కావాల్సిందేగా. అటువంటిది, ఒక మేధావి అంత చిన్న వయసులో మరణించడం జాతికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందన్న భావన మనల్ని దుఃఖానికి గురిచెయ్యకమానదు.

అయితేనేం? అతనికి అనంతమైన అంకెల గమనం తెలుసు. అత్యల్పమైన జీవితకాలంలోనే అంతులేనన్ని అద్భుతాలని సృష్టించడమూ తెలుసు. అందుకే అతను విశ్వమంత విశాలమైన ప్రపంచ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మిగిలిపోయాడు.

                              ***

 

మీ మాటలు

  1. ఫణీంద్ర says:

    ఈ చిత్రం విడుదల కాకముందు హైప్ చూసినా విడుదలయ్యాక ఎవరూ ఏమీ అనడం చూళ్ళేదు. ఇప్పుడు మీ రెవ్యూ చదివితే చిత్రం చూడాలనిపిస్తోంది. చక్కని రెవ్యూ. మొదటి పేరా, ముగింపూ ఆకర్షణీయంగా ఉన్నాయి. సినిమాలో లోపాలని సున్నితంగా ఎత్తిచూపడం బావుంది!

    • Bhavani Phani says:

      తప్పనిసరిగా చూడవలసిన సినిమానేనండీ, అసంతృప్తిని మాత్రం కలిగించదు. మీ స్పందనను ధన్యవాదాలు

  2. Suparna mahi says:

    చక్కని రివ్యూ… చదువుతుంటే మూవీ చూడాలనిపిస్తుంది… నిజానికి రామానుజన్ గురించి తెలియనిదే ఎక్కువ… ఆ కొరవని ఈ మూవీ ఫిల్ చేస్తుందేమో చూడాలి.. ధన్యవాదాలు…

    • Bhavani Phani says:

      నిజమేనండీ, ముందు తెల్సు కదా అనుకున్నా సినిమా చూసాకా ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలానే ఉందనిపించింది. మీ స్పందనకు చాలా ధన్యవాదాలు

  3. దత్తమాల says:

    లెక్కల గురించి ఆలోచిస్తూ ఆకాశం లో చుక్క గా మిగిలిపోవడం దురదృష్టకరం .
    32 సంవత్సారాలకే పోవడం ఎంత కష్టంగా అనిపించిందో అతని భార్యకి .
    మీ సినిమా రివ్యూ బాగుందండి .

    • Bhavani Phani says:

      నిజం దత్తమాలగారూ , ఆమె పరిస్థితి అత్యంత విషాదకరం. ఐరనీ ఏంటంటే 95 సంవత్సరాల వయసు వరకూ అలా ఒంటరి జీవితాన్నే గడిపారామె. మీ స్పందనకు ధన్యవాదాలు

Leave a Reply to Bhavani Phani Cancel reply

*