అన్నం పెడితే చాలు… ఎంతసేపైనా!

 

 

 

చిత్రం: రాజశేఖర్ చంద్రం

చిత్రం: రాజశేఖర్ చంద్రం

*

 

వలసరవాక్కం మెయిన్ రోడ్డు నుంచి శ్రీదేవి కుప్పానికి దారి వుంది. ఆ శ్రీదేవి కుప్పం చాలా ఫేమస్. ఒకటి సినీ జనాల వల్ల, రెండు వేంకటేశ్వర స్వామి ఆలయం వల్ల. ప్రసిద్ధ గాయకుడు మనో ( మన నాగూరు బాబే) , విలక్షణ రచయిత బహుభాషా కోవిదుడు సాహితి, ఏ తెలుగు ఫన్షన్ జరిగినా నోరారా అందరినీ పలుకరిస్తూ తలలో నాలుకగా మెలిగే డా! శివకుమారీ, అంతే కాదు .. ఆ శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డుని ఆనుకొని వున్న కనకతారానగర్ లో ఒకప్పుడుండే వేలుగారు, ముత్యాల సుబ్బయ్యగారు ( మా మంచి మనిషి.. దర్శకులు) , శ్రీలక్ష్మి, పి.జె. శర్మగారు, ఆంజనేయులుగారు, భీమనేని శ్రీనివాసరావుగారు, ఇప్పుడు వుంటున్న నిర్మాతలు శివరాజుగారు, వెంకటరాజుగారు, వందేమాతరం శ్రీనివాస్ గారు ( ఇప్పటికీ ఇల్లు అలానే వుంది.. ఆయనదే) వీరందరితోనూ కళకళాడుతూ వుండేది. ఇక హాస్య నటులు కారెక్టర్ ఆర్టిస్టులూ, మ్యుజీషియన్లు లెక్కకి మించి వుండేవారు.

గతాన్నంతా స్మరించుకుంటూ అటువైపే వాకింగ్ కి వెళ్ళాను. ఇప్పటికీ  ప్రొడక్షన్ మేనేజర్   సర్వేపల్లి బ్రహ్మయ్య , ప్రొడక్షన్ మేనేజర్ రాజు అక్కడే వున్నారు.

ఆ మెయిన్ రోడ్డు మీదే ‘సినిమా నాగే౦ద్రుడి “గుడి వుంది. అదీ కె.ఆర్.విజయ గార్డెన్స్ కి ఎదురుగా.  సినిమా నాగేంద్రుడని ఎందుకన్నారంటే పుట్ట బ్రహాండంగా ఆరేడు అడుగులకి పైగా వుంటుంది. లోపల నాగుపామే వుండదు. ( అని అందరికీ తెలుసు). గుడి మాత్రం కట్టుదిట్టంగా వుండి చాలా డీప్ ఎఫెక్ట్ ని కలిగిస్తుంది. ఇంతా చూస్తే ఆ ‘ప్రాపర్టీ “ప్రైవేట్ వారిది. షూటింగు చెయ్యాలంటే వాళ్లకి డబ్బులు చెల్లించాల్సిందే.

సరిగ్గా ఆ గుడి దాటాక వచ్చే రోడ్డే కనకతారానగర్ కి వెళ్ళే రోడ్డు. అక్కడే కలిశాడు నటరాజన్.

తెలుగులో ‘శీనులు “’రాజులు “ఎట్టాగో తమిళ్ లో “నటరాజన్ “లు ‘వాసు”లు అట్లాగ. నటరాజన్ కూడా ఒకప్పుడు పెద్దపెద్ద తమిళ్ సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా చెయ్యడమే కాకుండా , తమిళ్ టూ తెలుగు డబ్బింగ్ రైట్స్ బ్రోకర్ గా పని చేసి చాలా సంపాదించాడు. ఎంతా అంటే శ్రీదేవి కుప్పంలోనూ , చుట్టుపక్కల ఏరియాల్లోనూ మూడు షూటింగ్ లకి పనికొచ్చే బంగళాలు, తోటలు కట్టేంత.

“ఏమీ సార్ మీ వీధి వదిలి మా ఏరియాకి వచ్చుండారు? లాంగ్ వాకా? ఏమైనా రొంబ హాపీ!”ఆగి మర్యాదగా పలుకరించాడు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వుండటం తమిళ్ వాడి లక్షణం. ఎ.వి.యం శరవణన్ గారి లాంటి గ్రేట్  ప్రొడ్యూసర్లు కూడా ఎవరు ఆఫీసులోకి అడుగు పెట్టినా లేచి, చేతులు జోడించి నమస్కరించి ఆహ్వానిస్తారు.  మన వాళ్ళ సంగతి అడక్కండి. అలా అని మనవాళ్ళని తక్కువ చేయడం లేదు. హీరో నుంచి బాయ్ దాకా అద్భుతమైన భోజనాలు పెట్టడం ఒక్క తెలుగు నిర్మాతకే సాధ్యం. తమిళ్ వాళ్ళు సాంబారు సాదం పొట్లం , తైరు సాదం పొట్లంతో సరిపెడితే , మనవాళ్ళు మాత్రం విందు భోజనాలే పెడతారు.

సరే…..’’హాపీ…నటరాజన్ సారు.. ఏమిటి విశేషాలు? “గుడి పక్కనే ఆగి అన్నాను. “ఏమైనా మీ లకలక సాంగ్  మాత్రం అదిరిపోయింది… అన్నట్టు ఫ్రీ గా వుంటే ఒక చోటకి పోద్దాం”అన్నాడు.

నేను దాదాపు 200 సినిమాల్లో ( డబ్బింగ్) పాటలు వ్రాయడం వల్ల తమిళ్ ఫీల్డ్ లో వారు చాలామంది తెలుసు. మ్యూజిక్ సిట్టింగ్స్ గట్రా  ఏర్పాటు చేసేది ప్రొడక్షన్ మేనేజర్లేగా, అందుకే నటరాజన్ బాగా తెలుసు.

“ఎక్కడకీ? “అన్నాను. టైం చూసుకొని ఏడున్నర అయ్యింది. నేను బ్రేక్ ఫాస్ట్ చేసేది పదింటికి గనక తొమ్మిదింటికి ఇల్లు చేరితే చాలు. స్నానం, పూజా పూర్తవ్వడానికి.

“దగ్గరలోనే… పది నిమిషాల నడక “బుగ్గ గోక్కుంటూ అన్నాడు.

“సరే పదండి..”అన్నాను నడుస్తూ..

“న్యాయంగా మిమల్ని తీసుకెళ్ళకూడదు , మీ ‘కవింజర్లు (కవులు ) రొంబ సెన్సిటివ్. కానీ, ఆమె మీకు నిండా తెలిసిన మనిషి “మనో ఇంటి వైపు వున్న రోడ్డులో ఎంటర్ అయ్యి అన్నాడు.

“ఎవరూ? “అని అడిగాను

“కోడంబాకంలో మీ తెలుగు ప్రొడ్యూసర్ వుంచుకున్నాడే , కుముదం .. ఆమె దగ్గరకి “చిన్నగా నవ్వి అన్నాడు.

ఇండస్ట్రీ హైద్రాబాద్ కి మారాక కోడంబాకంలో తెలుగు సినిమా వాళ్ళు ఎవరు మిగిలారూ? శ్రీ చంద్రమోహన్ గారు, జలంధర్ గారూ, మరి కొంతమంది, విశ్వనాథ్ గారు కూడా హైద్రాబాద్ కి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్లని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు.

“గుర్తురావడం లేదు “అన్నాను.

“ఆయన రెండు తమిళ్  సినిమాలు కూడా తీసి వుండాడు. బాగా వున్నోడు “అన్నాడు. అయినా పేరు గుర్తురావడం లేదు. అసలు కోడంబాకం సినిమా పని మీద వెళ్ళే దశాబ్దం దాటింది.

“సరే ఆ యమ్మని చూస్తే గుర్తుపడతారేమో చూద్దం “అన్నాడు.

సినిమా జనాలకి ఓ తెగులుంది. ఉన్నదిఉన్నట్టు చెప్పరు. బోలెడంత సస్పెన్సు మెయిన్ టైన్ చేస్తారు.  నటరాజన్ ఆ సిస్టంకి విరుద్ధమేమీ కాదు.  ప్రొడ్యూసర్ పేరు తెలిసినా ప్రస్తుతానికి చెప్పడని నాకు అర్ధమయ్యింది.

“ఇంతకీ ఆవిడని నేనెందుకు చూడాలి? “ఆగి అన్నాను.

“మీరు మంచివాండు గనక. కళ్ళలో నీళ్ళు తిరిగితే జేబులో నోటు తీసిస్తురు గనకా. అన్నిటికీ మించి ‘కుముదం “అని తమిళ్ నాట పెరిగినా ఆయమ్మ తెలుగే గనక “అన్నాడు

తమిళ్ వాళ్లని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు చేసే సహాయం చేసి వూరుకోరు. వీలున్నంతగా ఎదుటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అయితే ఎదటి వాళ్ళు చేసి౦దంతా కూడా ‘తామే “చేశామని అనుకోవడమే కాదు , పబ్లిసిటీ కూడా ఇచ్చుకుంటారు. ఇవ్వాళ నేనేదో తమిళ్ సోదర్లని ‘ఏకి “పెడుతున్నానని అనుకోకండి స్నేహితులారా! ఎందరో మహానుభావులున్నారు. వారందరికీ వందనాలు. కొందరున్నారు , వాళ్ళని గౌరవించడం ఏ తెలుగువాడి వల్లా కాదు. తమిళ్ భాషకి ప్రాచీన హోదా దక్కిందని ఏ తెలుగు వాడు బాధపడలేదు. నిజం చెబితే సంతోషించాము కూడా.

అదే హోదాని కేంద్రప్రభుత్వం తెలుగు భాషకిచ్చినప్పుడు ‘ఎందుకివ్వాలి? ఏ బేసిస్ మీద ఇచ్చారు? “అంటూ కోర్టుకెళ్ళారు. తెలుగుభాషకి ప్రాచీన హోదా దక్కితే వాడికి పోయిందేమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అది రావణ కాష్టంలా రగిలీరగిలీ ఇవ్వాళ మళ్ళీ తెలుగు వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందనుకోండి.

సరే నడిచీ నడిచీ 20 నిమిషాలు నడిచాక ఓ చిన్న సందు వచ్చింది. లోపలికెళ్ళాం. సందు చివర్న కొబ్బరాకుల్తో కుట్టిన చిన్న చిన్న పాకలు, గుడెసెలు. ఓ పాక ముందు ఆగాడు, నేనూ ఆగాను. ‘పొన్నాంబళం “అంటూ అరిచాడు నటరాజన్. నాకూ మీకూ తెలిసిన ‘పొన్నాంబళం “భారీ వ్యక్తి, విలన్. (ముత్తు సినిమాలో చూడండి). అతనిక్కడ వుండటం ఇంపాజిబుల్.

సన్నగా, రివట్లా వుండే ‘పొన్నాంబళం “బయటకు వచ్చాడు. “వాంగ…వాంగ “అతి వినయంతో లోపలకి ఆహ్వానించాడు. నటరాజన్ కదలకుండా , “అందమ్మా ఏమిసేస్తా వుండాది “అని చెన్నై తెలుగులో అడిగాడు.

“పడుకోని వుండాది”గుసగుసగా అన్నాడు. “సరే “వెనక్కి తిరిగాడు నటరాజన్.

“చూడాలన్నారుగా”అడిగాను నేను. ఇంతదూరం నడిపించి ఇప్పుడు వెనక్కి తిరిగితే అసలు తీసుకురావడం ఎందుకట?

“లేపితే బేజారు”అన్నాడు పొన్నాంబళం. అతనా మాట పూర్తి చేసేలోగానే ఓ నడివయసావిడ “హా.. ళ్ “అనే ఒక వికృతమైన అరుపుతో పాకలోనుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. పొన్నాంబళం ఠక్కున ఆమెని పట్టుకున్నాడు.

“వాంగ సారు… వాంగ… అన్నం పెడితే చాలు ఎంతసేపైనా.. ఎలాగైనా… రా.. ఇదిగో రా.. “అంటూ జాకెట్టు చింపుకొని రొమ్ము చూపిస్తూ అరచింది. ఒళ్ళంతా మట్టిగొట్టుకుపోయి వున్నా, చీర చిరుగులు పట్టి వున్నా, వదనం  మాత్రం మారలేదు. ఆమె.. అవును.. ఆమెని ప్రొడ్యూసర్ (so and so) ఇంట్లోనే చూశా.

“వాంగ సారు.. వా.. అన్నం పెడితే చాలు ఎంతసేపైనా .. వూ? రావూ? రారా నా కొడకా “అంటూ నటరాజన్ మీదకి వురికింది. ఒక్క గంతులో తప్పుకున్నాడు. యీలోగా పొన్నాంబళం లాగి ఆమె చెంప మీద కొట్టి, గట్టిగా పట్టుకొని పాకలోకి తీసుకెళ్ళి పాక తలుపుకి తాళం వేశాడు. లోపల నుంచి అదే అరుపు “అన్నం పెడితే చాలు రా “అంటూ

“మీరుండండి.. నేనొచ్చేదాక.. డాక్టర్ని తీసుకొస్తా “అని గబగబా అన్నాడు పొన్నాంబలం.

“ఏమయ్యిందండి? “బాధగా అడిగాను.

ఆ ప్రొడ్యూసర్ ది రాయలసీమ. భార్యబిడ్డలు అనంతపురంలోనో ధర్మవరంలోనో మరో ఊళ్లోనో వుంటారని జనాలు చెప్పుకునేవాళ్ళు. మనిషి మాత్రం ‘జమ్ .”చెప్పిన అమౌంట్ ని ఠంచన్ గా ఇచ్చేవాడు. ఆయన తీసిన ఓ డబ్బింగ్ సినిమాకి నేను రెండు పాటలు వ్రాశాను. అప్పుడు చూశాను యీవిడని. ఖరీదైన పట్టుచీరా, ఒంటి నిండా నగలూ, ఓ..హ్… మహా రాజసంగా ఆజ్ఞ ఇవ్వడం.   మహా గయ్యాళి అనేవాళ్ళు డ్రైవర్లు, నౌకర్లు.

అందంతా నీకెలా తెలుసంటే , వాళ్ళింట్లో పని చేసే ‘తిలగమే “తరవాత మా ఇంట్లోకి పనిమనిషిగా చేరింది.

“ఏవన్నా చెప్పండి అప్పా, ఆయమ్మకి నిండా తిమురు”అనేది… యీవిడ ప్రసక్తి వచ్చినప్పుడల్లా. అయితే మాకు తెలిసిన యీవిడ పేరు మహేశ్వరి.  పాండీబజార్లో నేను       ‘మలర్ కోడి మేన్షన్”లో వుండేటప్పుడు యీవిడ బ్రిలియంట్ టుటోరియల్స్ కి అవతల  వున్న వీధిలో వుండేది. మహాచలాకీ మనిషి. క్షణంలో మాటలు కలిపేది. “సినిమాని నమ్ముకొని వచ్చానండి, చిన్న వేషం ఇప్పించినా మీకు కృతజ్ఞురాలిగా వుంటా !”అని అనేది. నేనూ కొత్తే. ఆ మాట అడిగితే చెప్పాను “అమ్మా.. నేనూ కొత్తవాడ్నే “అని “మగాళ్ళకేం సార్ క్షణాలలో ఎదిగిపోతారు “అన్నది. ఆ మాట నాకూ ఇప్పటికీ గుర్తే.

సడన్ గా ఆవిడని ‘ఇలా “చూడటం నాకు డైజెస్ట్ కాలేదు. “నటరాజ్ గారు.. అసలు జరిగింది ఏమిటి? “అడిగాను. లోపలి నుంచి అవే అరుపులు వినిపిస్తుంటే మనసుకి దుర్భరం అనిపించింది.

“ఈ ‘కుముదం “తెలుగు పిల్ల. ఎట్టా చేరిందో మద్రాసుకి చేరింది. సెంట్రల్ బాచ్ వాళ్ళ గురించి విన్నారుగా ! పాపం వాళ్ళ చేతులో పడింది. “ఓ క్షణం ఆగాడు నటరాజన్.

సెంట్రల్ బాచ్ అంటే సినిమా మోజులో అనేక రాష్ట్రాల నుంచీ , పల్లెటూర్ల నుంచీ మద్రాసు కొచ్చే ఆడపిల్లల్ని ట్రాప్ చేసి , వాళ్ళకి బోలెడు ఆశలు కల్పించి ‘వృత్తి “లోకి దించుతారు. లొంగని వాళ్ళని ఏ బాంబే కో, కలకత్తాకో, ఎగుమతి చేస్తారు. అదో పెద్ద సాలెగూడులాంటిది.

“మరి “షాక్ తో అన్నాను…

“యీ పొన్నాంబళం గాడు కూడా ఆ బాచ్ వాడే. అయితే సినిమా వాళ్ళ దగ్గర డ్రైవర్ గా పని చేస్తూ వుండేవాడు. ఆ పిల్లని చూడగానే వీడికి బ్రహ్మాడంగా  ప్రేమ పుట్టుకొచ్చి, విడిగా తన దగ్గర పెట్టుకున్నాడు. సినిమా ఛాన్సులు కూడా ఇప్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని సినిమాలలో ‘గుంపులో గోవిందం”లా కూడా కనిపించింది. ఆ తరవాత యీ పిల్ల ‘లక్ “ తిరిగింది. అలాంటి ఓ గుంపులో యీమెని చూసి మా బండరాక్షసుడిలాంటి కమేడియన్ … అదేనండీ… తెలీదా… నల్లగా.. లావుగా.. ఆ.. ఆయనే యీవిడకో చిన్న యిల్లు ఏర్పాటు చేశాడు. ఆ కమేడియన్ భార్య ఓ కొరకంచు. ఎట్టా తెలుసుకుందో ఏమో ఆర్నెల్లు

గడవకుండానే ఓ పొలిటికల్ గ్యాంగ్ కి చెప్పి యీవిడ్ని ఇల్లు ఖాళీ చేయించడమే కాక వార్నింగ్ కూడా ఇప్పించింది. ఆ గొడవతోనే సదరు కమేడియన్, భార్య విడిపోయేంతవరకు వస్తే ‘పెద్దాయన’  సంధి కుదిర్చి ఫామిలీ సేవ్ చేశాడు.“ఆగాడు నటరాజన్.

ఆ విషయం నాకూ గుర్తుంది. తమిళ్ నాడులో సినిమాకి, రాజకీయానికి అవినాభావ సంబంధం ఏదో వుంది.   అంతేకాదూ, రాజకీయనాయకుల్లో 90 మంది తెలుగు జాతి ‘వేర్లు  “ వున్నవారైనా , తెలుగుని విమర్శించడం, విస్మరించడం నిజంగా మనకు విస్మయం కలిగిస్తుంది.

“తరవాత “అడిగాను

“నేను చెబుతాను సామీ “అన్నాడు డాక్టర్ని తీసుకొచ్చిన పొన్నాంబళం. ఆ డాక్టర్ గారు నాకూ తెలుసు. శ్రీదేవి కుప్పం మెయిన్ రోడ్డు లో వుండే ఎం.బి.బి.ఎస్. డాక్టర్. హస్తవాసి చాలా మంచిది. కానీ ఆయన ఇలా హోం విజిట్ చేయరు. మరి ఇక్కడికెలా వచ్చారో? అదే ఆయనతో అంటే “యీ పేషంటు నాకు కొత్త కాదు సార్, ఈవిడ అక్కడికి వచ్చేకంటే, నేను ఇక్కడకి రావడమే ఉత్తమం. అదీగాక అప్పుడప్పుడైనా వృత్తికి సంబంధించిన తృప్తి వుండాలి కదా సార్! “అని చిన్నగా నవ్వారు.

డాక్టర్ వెళ్ళిపోయాక మాతో పాటు పొన్నాంబళం కూడా నడుస్తూ వచ్చాడు.. ఇంటి తాళం వేసి. “మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, కొన్ని గంటల పాటు పర్లేదు. “ముక్తసరిగా అని “కథ నేను చెబుతానన్నాను కద సార్, తమిళ్ కమేడియన్ భార్య ఈవిడ్ని వెళ్ళకొట్టాక యీమెకి మళ్ళీ నేనే దిక్కయ్యాను. మనిషి చాలా మంచిది. అయినా ‘పాదరసం “లాంటిది. రెండు నెలలలోనే దుఖం నుంచి పుంజుకుంది.

మళ్ళీ ఓ నాడు షూటింగ్ దగ్గరే మీ తెలుగు ప్రొడ్యుసర్ గారి కంట పడింది. ఆయన పోయేంతవరకు అధారిటీ ఈవిడదే. అంత బలంగా ఆయన్ని అల్లుకుపోయింది. నేనూ అక్కడే ఆయన దగ్గరే డ్రైవర్ గా చేరాను. ఎంతలా ఈవిడ వుండేదంటే , నా మొహమే తెలీనట్టు ప్రవర్తించేది. డ్రైవర్ గానే చూసేది. కానీ సార్, నాకెందుకో యీమంటే ప్రాణం. కారణం నేను నిజంగా ప్రేమించిన అమ్మాయిలా వుండటమే. “ఓ క్షణం ఆగి, “నవ్వకండి సార్.. ఆఫ్ట్రాల్ డ్రైవర్ గాడికి ప్రేమేమిటి అనుకోకండి. లోకంలో అందరికీ ఎవరో ఒకరి మీద ప్రేమ వుంటుంది. ఎవరో ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ వుంటుంది. నేనూ ఆర్టిస్టు కాదలచుకునే మద్రాసొచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువు ఆగిపోయింది. నేను ప్రేమించిన పిల్ల నాకు షాక్ ఇస్తే, ఆ షాకులో స్త్రీలనే అసహించుకుంటూ చేయరాని పనులు చేశా. సినిమాల్లో అవకాశాలు రాలేదనే ఫ్రస్ట్రేషన్ మరో వైపు పీడిస్తుంటే , దయా ధర్మం జాలీ కృపా లేని సెంట్రల్ బాచ్ లో చేరాను. మళ్ళీ యీ మనిషిని చూశాక ఎందుకో ‘మనిషి “ నయ్యా. మీ తెలుగు ప్రొడ్యూసర్ అర్ధాంతరంగా పోయాక, యీవిడ చేతులు మారింది , పొట్ట గడవడం కోసం చివరికి ‘ఫలాన “వాళ్ళ చేతుల్లో పడింది. మొదటి నుంచీ నేను ఆమెని ఎంత ప్రేమించినా , నా ప్రేమ విషయం ఎన్ని సార్లు చెప్పినా తను మాత్రం లెక్క చేసేది కాదు. సెంట్రల్ బాచ్ నుంచి తప్పించాను కానీ “ఫలాన “బాచ్ నుంచి మాత్రం తప్పించలేకపోయాను. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఫుల్ గా వుంటుంది. ఎంత క్రూరత్వానికైనా పాల్పడుతారు. నాకు తెలిసిన యీవిడ ఏ పనైనా ఇష్టపడితేనే చేస్తుంది గానీ, బలవంతపెడితే లొంగదు. మరి లొంగదీసుకోడానికి వాళ్ళు ఏమేం చేశారో మన వూహలకి అందదు. ఆరునెలల పాటు పిచ్చిగా వెతికినా ఆవిడ నా కంట పడలేదు. చివరికి ఓ నాడు అంటే మూడు నెలల క్రితం “ఇప్పటిలాగానే , “అన్నం పెడితే చాలు.. ఆ తరవాత నీ ఇష్టం “ అని అరుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దగ్గర కనిపించింది. బట్టలన్నీ చీలికపీలికగా వున్నాయి.

నా గుండె ఒక్కసారి ఘొల్లుమంది. నా కారు… అదే, నేను నడిపే టాక్సీ లో తీసుకొచ్చి యీ పాకలో పెట్టాను. అప్పుడే యీ నటరాజన్ గారు చూసి మంచి మనసుతో కొంత డబ్బిచ్చారు. ఆమెకి ట్రీట్ మెంట్ చేయించాలంటే ఎంతవుతుందో తెలీదు. అదీగాక  ఎలా బయటపడాలో కూడా తెలీదు. పాపం ఆ డాక్టర్ గారికే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఆయనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం ఆమె పరిస్థితి మరింత దుర్భరంగా ఉండేది. ఇప్పుడు పరవాలేదు. పదిహేనురోజులకో ఇరవైరోజులకో యీ మాదిరిగా అరుస్తూ వుంటుంది. ఓ రెండుమూడు ఇంజక్షన్ల తరవాత మౌనంగా పడుకొని వుంటుంది.  ”సైలెంటయ్యాడు పొన్నాంబళం.

ఎందుకో అతని చెయ్యి అందుకోవాలని అందుకున్నాను. మనం మనిషిని చూడగానే ఏవేవో అంచనాలు వేస్తాం. కానీ మనిషిలోని ‘అసలు మనిషిని “అర్ధం చేసుకోవాలంటే యీ బతుకు చాలదు.

“కనీసం నిన్నైనా గుర్తుపడుతుందా? “అడిగాను.

మెల్లగా నవ్వాడు “పడుతోందని నాకు తెలుసు సార్… కానీ గుర్తుపట్టనట్టే వుంటుంది. ఏమో గుర్తు కూడా లేనేమో. కానీ, అందరిలో వైల్డ్ గా ప్రవర్తించే ఆమె, నాతో మాత్రం వైల్డ్ గా ప్రవర్తించదు. పైపెచ్చు తలవొంచుకుంటుంది. ఆ తల వొంచుకుని కూర్చున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది సార్! మీ తెలుగు ప్రొడ్యూసరింట్లో రాణివాసం నెరిపింది. కానీ ఇప్పుడు , ఇంత దయనీయంగా .. “సైలెంటు అయిపోయాడు.

“ఆమెని నువ్వు.. “ఆగాను. “ప్రేమిస్తానా లేదా అనా? లేక ఆమెని నేను వాడుకున్నా లేనా అనా? ప్రేమిస్తాననే చెబుతా. నిజం చెబితే నేను ప్రేమించేది యీమెని కాదు, యీమె పోలికలున్న నా ‘కుముదా “న్ని. యీమెకి ఆ పేరు పెట్టింది నేనే. ఈవిడ అసలు పేరు ఏమిటో కూడా నాకు గుర్తులేదు. ఇహ వాడుకోవడం గురించా? లేదు సార్. ఒకప్పుడు నేను పచ్చి రౌడీని, తిరుగుబోతుని. ఇప్పుడు ఆ ఆలోచన వస్తేనే పొడుచుకొని చచ్చిపోవాలనిపిస్తుంది.

ఎందుకంటే, ఆవిడ అరుపులు విన్నారు కదా సార్… “అన్నం పెడితే చాలు … రారా “అని. నాలాంటి పాషాణంగాడే యీవిడ్ని అంత నీచానికి దిగజార్చి వుండాలి. ఏముండాది సార్? ఎముకలు చర్మం.. అక్కడక్కడా కొండలూ లోయలూ.. ఏముండాది సార్ యీ శరీరంలో. నేనిప్పుడు దీని గురించే ఆలోచించట్లేదు సార్. ఈమె బాగుపడాల. అంతే నేను చేసిన పాపంలో కొంతైనా యీమె బాగుపడితే , కరిగిపోయిందనుకుంటాను.

ముగ్గురం మౌనంగా నడుస్తూ నడుస్తూ సినిమా నాగేంద్రుడి గుడి దాకా వచ్చాం. మౌనంగానే సెలవు తీసుకొని కనకతారా నగర్ వైపెళ్లాడు నటరాజన్. నమస్కారం చేసి వెనక్కి తిరిగాడు పొన్నాంబళం. నేను నడుస్తూనే వున్నాను. ఆలోచిస్తూనే వున్నాను. సినిమా వ్యామోహంలో ఎందరు బంగారు తల్లులు ఇలా పరమనీచుల చేతుల్లో చిక్కారో! ఎందరి మానాలు టైర్ల కింద పువ్వుల్లా నలిగిపొయాయో! ఎందరు ఆకలి కోరలకి బలై ఇలా ఆక్రోశిస్తున్నారో!

మెరిసే తారల్నే కాదు… రాలిపోయిన, రాలిపోతున్న నక్షత్రాలని మాత్రం ఎవరు లెక్కించగలరూ?

PS  : నటరాజన్ చెప్పిన కథనే (కొంత) పొన్నాంబళం చెప్పినా, రిపీట్ చెయ్యడం ఎందుకని పొన్నాంబళంతో కథని కంటిన్యూ చేశా. కథనం సాఫీగా వుండటం కోసం. వాళ్ళు మాట్లాడింది మూడు వంతులు తమిళం ఒక వంతు చెన్నై తెలుగు , అయినా నేను వీలున్నంత వరకు తెలుగులోనే చెప్పాను.

*

మీ మాటలు

  1. మీరు నిజం చెప్పారా, నిజం లాంటి కథ చెప్పారా?

  2. Rajyalakshmi says:

    horrible . చదవటమే కష్టమనిపించింది. మీరెలా రాసారో…

  3. THIRUPALU says:

    చెన్నై తెలుగు బాగుంది. కథ అచ్చం సినిమాలాగే ఉందండి. హృదయం ద్రవించే నిజం కథ. చెన్నై లో యిలాంటి కధలు తెలుగు వాళ్ళ గురించే వింటుంటాం. న్యూస్ లో గాని, మరెక్కడ గాని – తెలుగు వల్లే ఎందుకు ఎక్కువ ఉంటారో అర్ధం గాని ప్రశ్న.

  4. మనసంతా ఘనీభవించిన వాడి కళ్ల లో నుండైనా ఒక చుక్క రాలి పడుతుంది…

  5. g b sastry says:

    ఆడతనాన్ని బెల్లం ముక్కలా చూసే తీరు మారనంతవరకు మనుషులు మనసులు ఇలా మండుతూనే ఉంటారు
    ఆడవారు ఆడతనం దాచుకు తిరుగుతూనే ఉంటారు మగవారు దోచుకుని ఎంగిలాకులా వదిలేస్తూనే ఉంటారు

    • BHUVANACHANDRA says:

      అవునండీ నిజం …. మారేంత వరకూ మార్పుకోసం ప్రయత్నిచక తప్పదు .

  6. Chukka Martin says:

    నా అభిప్రాయం ప్రకారం ఇది నిజంగా జరిగిన కథ, ఈ ఒక్క కుముదం కాదు, ఇలాంటి కుముదాలు ఎందరో అన్ని చిత్రపరిశ్రమలలో ఉంటారు, మీరు చెప్పిన విధానం చాలాబాగుంది.

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు Chukka మార్టిన్ గారూ . ఇది నిజంగా జరిగిన కధే

  7. Rayaprolu lalitha says:

    ఎవరికైనా ఆశ అత్యాశ గా మారినప్పుడు కుముదాలు నయీములు ఉంటూనే ఉంటారు.వాళ్ళు తెలుగా తమిళమా అన్నది అప్రస్తుతం .

    • BHUVANACHANDRA says:

      మీరన్నది సరైన మాటే Rayaprolu లలిత గారూ . మనిషిని బ్రతికించే ఆశే మనిషిని ఒక్కోసారి చంపేస్తుంది …

  8. కందికొండ says:

    భువనచంద్ర గారు మీ కథ చదువు తుంటే తను శవమై… ఒకరికి వశమై…తనువు పుండై…ఒకడికి పండై…ఎప్పు డూ ఎడారై…ఎందరికో ఓయాసిసై…..అన్న అలిశెట్టిప్రభాకర్ గారి కవిత గుర్తుకొచ్చింది అయ్యో పాపం కుముదా…

    • BHUVANACHANDRA says:

      కందికొండగారూ నమస్తే. ఆ కవిత చాలా గొప్పది . నన్ను చాలా కదిలించింది. మళ్ళీ ఆ కవితని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు ….

  9. నమస్తే సార్, బాగున్నారా?
    ఎందుకు సార్ … ఇలాంటి కుముదం కథలు చెప్పి మా గుండె ను అతలా కుతలం చేస్తారు – మీ కథలు నాకు చాలా ఇష్టం కానీ చదివిన ప్రతిసారీ గుండె చిక్క బట్టుకుని చదవాలి – ఇది మాకెంత బాధో మీకు తెలీదు – థూ .. దీనమ్మ జీవితం అనిపిస్తుంది ఈ కథలు చదివినప్పుడల్లా – గొరుసు

    • BHUVANACHANDRA says:

      నిజం Gorusu భయ్యా ….రాసేటప్పుడు నాకూ అలానే బాధనిపిస్తుంది .కానీ ఓ ఆశ …ఇవి చదివితే కొందరైనా పరిస్థితులు ,కష్ట నష్టాలూ అర్ధం చేసుకుంటారని !

    • BHUVANACHANDRA says:

      నిజం Gorusu భయ్యా ….రాసేటప్పుడు నాకూ అలానే బాధనిపిస్తుంది .కానీ ఓ ఆశ …ఇవి చదివితే కొందరైనా పరిస్థితులు ,కష్ట నష్టాలూ అర్ధం చేసుకుంటారని

  10. కె.కె. రామయ్య says:

    ” సినిమా వ్యామోహంలో ఎందరు బంగారు తల్లులు ఇలా పరమనీచుల చేతుల్లో చిక్కారో! ఎందరు ఆకలి కోరలకి బలై ఇలా ఆక్రోశిస్తున్నారో! ” హృదయం ద్రవించేలా రాశారు భువన చంద్ర గారు.

    అలనాటి అందాల తెలుగు తార ( రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముక్కు, ముఖం, జుట్టూ, నాజూకుతనం కలిగిన ) చిత్తజల్లు కాంచనమాల కూడా మతిస్థిమితము పోగొట్టుకున్నవారే. ‘ఫటాఫట్ జయలక్షి’ నుండి సిల్క్‌స్మిత వరకు ఆత్మహత్య లు చేసుకున్న వారూ ఉన్నారు.

    • BHUVANACHANDRA says:

      అవును కె.కె. రామయ్య గారూ ..జయాపజయాల తో సంభందం లేకుండా చాలామంది జీవితాలు కృష్ణబిలం లోకి జారిపోతున్నాయి. కళకీ కన్నీళ్ళకీ అంత దగ్గరి సంబంధం అనుకుంటా !

    • తహీరో says:

      చిత్తజల్లు కాంచనమాల గారిని మీరు స్వయంగా చూసారా రామయ్య గారూ – అంత బాగా వర్ణించారు – నేత్రాలు , ముక్కూ, ముఖం , జుట్టు , నాజూకుతనం … ఇవన్నీ రూపలావణ్యం కిందకి రావా అండీ ! లేక రూప లావణ్యం కూడా ముక్కు లాగే ఒక అవయవమా ? మరేమీ అనుకోవద్దు – తెలుసుకుందామని అడిగాను.
      – మీరు గ్రేట్ సర్.

  11. BHUVANACHANDRA says:

    అవును కె.కె. రామయ్య గారూ ..జయాపజయాల తో సంభందం లేకుండా చాలామంది జీవితాలు కృష్ణబిలం లోకి జారిపోతున్నాయి. కళకీ కన్నీళ్ళకీ అంత దగ్గరి సంబంధం అనుకుంటా !

Leave a Reply to BHUVANACHANDRA Cancel reply

*