స్వాతంత్ర ఫలాలు!

 

Indian Flag 3

ప్రధాన అమాత్యుల వారికి..

ప్రణామములు!

భారత దేశానికి డబ్బైవ స్వాతంత్ర్య దినోత్సవం! ఈ సందర్భంగా “స్వాతంత్ర్య ఫలాలు ప్రతి వొక్కరికి అందాలి..!” అన్న మీ పిలుపు జాతికి మేలు కొలుపు! స్వాతంత్ర్య ఫలాలు అందుకున్న భారతీయ మణి మకుటములైన వారి సందేశాలను సంక్షిప్తంగా మీకు కొన్ని సమర్పించుకొనుచున్నాము!

***

“విదేశాల్లో నల్ల ధనాన్ని మేం దాచుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“విదేశాలలో నుండి నల్ల ధనాన్ని రప్పిస్తాం.. తెప్పిస్తాం..’ అని పదే పదే మీరు ప్రకటించినగాని- ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోవడం, తప్పనిసరి వొత్తిళ్ళలో కొందరిని మొక్కుబడిగా యిబ్బంది పెట్టినగాని- మా యెవ్వరి పేర్లూ ప్రకటించనందుకు.. బయటపెట్టకుండా గోప్యత పాటించినందుకు.. మీకూ మీ మంత్రివర్గానికి పేరు పేరునా కృతజ్ఞతలు..!”

యిట్లు

నల్లకుబేరులు.

***

“మీ దేశంలో పెట్టుబడులు పెట్టి మా వ్యాపారాలు మేము చేసుకోనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు! మా వృద్ధిని ప్రజల అభివృద్ధిగా మీరు అభివర్ణించిన తీరు మిక్కిలి ఆనంద దాయకము మరియు శుభకరము!

“మీ ప్రజలకు రాయితీల్లో కోతలు విధించుకుంటూ వొచ్చినా గాని- ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’తో మమ్మల్ని ప్రోత్సహించి రాయితీలు కల్పిస్తున్నందుకు మీకు మా ధన్యవాదములు.!”

యిట్లు

విదేశీ బిజినెస్ మేగ్నెట్స్.

***

“ఉల్లి నుండి కందిపప్పు వరకు..

మినప్పప్పు నుండి మిరప వరకు..

అన్నిటా మార్కెట్టును బ్లాక్ చేసి.. అధికరేట్లతో అమ్ముకొని.. మేం వ్యాపారం చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“మా వ్యాపారాలే కాదు, మీ వ్యాపారాలూ బావుండాలని కోరుకుంటున్నాము!”

యిట్లు

స్వదేశీ వ్యాపారస్తులు.

***

“ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్య..

అన్ని విద్యా విభాగాల నుండి మీరు తప్పుకొంటూ మా ప్రవేటు వాళ్ళకి అప్పగించడమే కాక, నచ్చినంత ఫీజులు మేము వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

విద్యాసంస్థల నిర్వాహకులు.

***

 

“ప్రతి పౌరుడిని రోగిగా గుర్తించి అందించే మా వైద్యానికిగాను  మాకు నచ్చినంత ఫీజు వసూలు చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“ప్రభుత్వ వైద్య రంగాన్ని రోగగ్రస్తము చేసి యేకంగా పడక యెక్కించి.. మీరు సేవా విభాగాలనుండి తప్పుకొని.. ఆ బాధ్యతను మా భుజస్కంధాలపై వుంచడమే కాక వైద్యము లాభసాటి వ్యాపారముగా మించి వొక పరిశ్రమగా అభివృద్ధి చేసుకొనే వెసులుబాటు కల్పించినందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు!”

యిట్లు

ప్రవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు.

***

“దళితులమీద దాడులు చేసే ఆధిపత్య స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“తోలు కనిపిస్తే దళితుల తోలు తీసే హక్కునూ.. మాంసము కనిపిస్తే దళితులను మాంసము కొట్టే అధికారమునూ మాకు సంక్రమింపజేసిన మీ పాలన పదికాలాలు వుండాలని కోరుకుంటున్నాము!”

“గోవును నువ్వు రక్షించు! గోవు నిన్ను రక్షిస్తుంది!”

“గోరక్షణే మానవ రక్షణ!”

యిట్లు

గో రక్షక దళం మరియు అగ్రకుల హిందూ ధర్మ పరిరక్షకులు.

***

“మానవ వనరులను బహు చవుకగా వినియోగించుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

“చైల్డ్ లేబర్ కారు చవగ్గా దొరకడం బహు ఆనందనీయమూ మరియు అభినందనీయమూ!”

యిట్లు

పారిశ్రామిక వేత్తలు.

***

“మహిళలను అత్యాచారం చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

“నిర్భయ లాంటి కేసులనేకం దేశమంతా తలెత్తడం.. అయినా తగు చర్యలు తీసుకోకుండా జరిగినప్పుడు మాత్రము హడావిడి చేసి మమ్ములను విచ్చలవిడిగా వదిలేయడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము!”

యిట్లు

పురుష పుంగవులు.

***

“విమెన్ ట్రాఫికింగ్ ను కూడా ‘యెగుమతి’ వనరుగా గుర్తించి మా పనులు మేము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

బ్రోకర్ల ముఠా.

***

”మాదక ద్రవ్యాల సరఫరా మరియు అమ్మకము చేసుకొనే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

మాఫియా ముఠా.

***

“ఓడిన పార్టీలో కొనసాగకుండా-

పోటీచేసిన పార్టీకి రాజీనామా చెయ్యకుండా-

అధికార పార్టీలోకి జంప్ చేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

జిలానీ ఎమ్మెల్యేలు.

***

“మీ వోటును మీరే శ్రమపడి వెయ్యకుండా మేము వేసే స్వాతంత్ర్యం కలిగి వున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు!”

యిట్లు

పార్టీ కార్యకర్తలు!

***

నోట్:

తమ తమ స్వాతంత్ర్యాలను.. తమకు దక్కిన స్వాతంత్ర్య ఫలాలను గుర్తు చేసుకుంటూ యిలా యెన్నో యెన్నెన్నో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల సందేశాలు మన కోటప్రాసాదాలకు లెక్కకు మిక్కిలిగా వచ్చినవి! కొన్ని ఉత్తరాలను మచ్చుకి మీ దృష్టికి తెస్తూ తమ పరిశీలనార్థం జతపరచడమైనది!

మళ్ళీ స్వాతంత్ర్య దినోత్సవానికి చూసుకుందాంలే అని మిగతా వుత్తరాలను సమయ స్థలాభావాల వల్ల పక్కకు పెట్టడం జరిగినది!

కృతజ్ఞతలు!

యిట్లు

తమ వ్యక్తిగత సహాయక కార్యదర్శి

 

మీ మాటలు

 1. కె.కె. రామయ్య says:

  అబ్బా సెగట్రీ ఎప్ప్పుడూ బిగినెస్ పనులే సెప్పి సంపమాక.

  ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటాదని జెప్పి కళాపోసనకి జేసిన సేవ గురించి ఒక్క ముక్కన్నా చెప్పవే. ( అట్టని జెప్పి కల్బుర్గి , ధబోల్కర్ , పన్సారే, పెరుమాళ్ మురుగేశన్, సాహిత్య అకాడెమి పతకాల వాపసీ లాంటి సెండాలవంతా తిరగ తోడమాక.).

  బచ్చా గాళ్ళు రోహిత్ వేములకి, కన్హయ్య కుమార్లకి అర్తం కానీ దేశభక్తిని, స్వతంత్ర భారత స్వేచ్చా మారుతాలకి మనవిఛ్చిన దిశానిర్దేశం గురించి జనం ఎం అనుకుంటున్నారు. అది జెప్పవే.

 2. దేవరకొండ says:

  వ్యంగ్య రచనకు ఉదాహరణగా సాహిత్య విద్యార్థులకు పాఠ్యఅంశంగా ఉండదగిన రచన! బజరా గార్కి, సారంగకు అభినందనలు. తస్సాదియ్యా! వ్యంగ్యం అంటే ఇలా ఉండాలి అనిపించిన రచన! అయితే ఒక్క మాట. ఈ మహత్తర స్వాతంత్ర ఫలాలన్నిటికీ బీజాలు వేసి పెంచి పోషించినవి గత ప్రభుత్వాలు అని అనడమే కాదు నిరూపించ సాధ్యమయేవి కాబట్టి ఈ కృతజ్ఞతా భారాన్ని ఒక్క మోడీపైనే మోపడం కాకుండా ఈ తిలా పాపాన్ని తలా పిడికెడూ పంచితే అన్ని పార్టీల ఆత్మలూ శాంతిస్తాయేమో ఆలోచించండి! అంతా మోడీయే చేశాడా మేమేమీ చేయలేదా అని ఇతర నాయకులు అడిగితే ఏం జవాబు చెప్తారు?

 3. syed sabir hussain says:

  ఈ లేటర్లన్నీ విక్రయిస్తే ఎంత వస్తుందో అంబానీని అడిగి వివరాలు తెలపండి. ఇందుకు వెంటనే టెండర్లు వేయండి లేదా మనోడికి ఇవ్వండి. భరతమాతకు జై చెప్పడం మాత్రం మరిచిపోకండి. ఉదయం రష్యాలో తిన్న టిఫిన్ అంత బాగా లేదు.. మధ్యాహానం అమెరికా వెళ్లి భోంచేసి వస్తాను .కుదరక పోతే రాత్ర బ్రిటన్ వెళ్లి డిన్నర్ ముగించుకొని రేపుదయం కోసం టిఫిన్ పార్సిల్ తెచ్చుకుంటాను. అప్పటిదాకా నా విదేశీ యాత్ర ఫోటోలు అన్ని పత్రికల్లో వచ్చేలా చూడండి. జై హింద్. జై చాయి వాలా.

 4. THIRUPALU says:

  అమ్మ నా దొంగా ! వీళ్లంతా విర్రవీగి పోతుంటే మేమాత్రం మిన్నకుండాలా, అయ్యా ! అందుకో మా అభినందనల కృతజ్ఞుతలు, పుట్టి న పసికందును కూడా మందు కొట్టడానికి నేర్పించడానికి మాకు లైసెన్సులు ఇచ్చి సెన్సు లేకుండా చేసే మీ ప్రభుత్వానికి, పది కాలాలుండాలని కోరుకుంటూ, దండాలు. పదేళ దండాలు!

మీ మాటలు

*