నేను యిరోంని!

arya

డాక్టర్  కర్మానంద్ ఆర్య అనే యీ యువకవి బీహార్ లోని గయలో నివసిస్తున్నాడు. దక్షిణ బీహార్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు.యితని కవితలు ప్రముఖ హిందీ సాహిత్యపత్రికలలో ప్రచురింపబడ్డాయి. త్వరలోనే తన మొదటి సంకలనం బోధి ప్రకాషన్, జైపూర్ వారు ప్రచురించనున్నారు.

“నీ దిగులు నా కవిత్వం సాధించిన అపజయమ”నే యీ కవి అడవి చరిత్రను కొత్తగా లిఖించే ప్రయత్నం కవితల్లో కనిపిస్తుంది. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే మోచీనీ చూసి దుఖిస్తాడు. నదుల్లోని చేపల ప్రాణాన్ని యెంత గణిస్తాడో, విద్యా,ప్రజాస్వామిక వ్యవస్థలలోని అసమానతలను ఖండిస్తాడు. వొకటి చూస్తే మరొకటి కనిపించే అడవిపుత్రుల దుఖాన్ని చూసి కవితై ప్రవహిస్తాడు. చరిత్రలేని అడవిని గొంతెత్తి పాడుతాడు. తనను తాను వెతుక్కునే ప్రయత్నంలో వో ప్రత్యేక అస్తిత్వం కోసం చేసే కృషి కనిపిస్తుంది. విపరీతమైన ఆర్తి ఆవేశాలు యితని కవిత్వంలో మెండు.
యిరోమ్ షర్మిలా గురించి దాదాపు భారతదేశపు అన్ని భాషల్లో కవితలు లిఖింపబడిన కర్మానంద్ రాసిన యీ కవిత పాఠకులను కదిలిస్తుంది.

మృత్యువు అర్థాన్ని గ్రహించిన షర్మిలా కోసం యీ కవిత..

Irom-Sharmila-t40807

షర్మిలా యిరోమ్
———————–

నేను పోరాడుతున్నాను
మనుషులు పోరాడడం ఆపేసారు
వొక కలకు,వొక వొడంబడికకు వ్యతిరేకంగా
యేమౌతుంది?
గుర్రపు డెక్కల శబ్దం కంటే భయంకరంగా
యిప్పుడు నా గొంతు పదునెక్కి హెచ్చింది

నాకు జీవితమంటే  ప్రేమ యెక్కువే
నాకు చావు విలువ తెలుసు
అందుకే పోరాడున్నాను
గాయపడ్డ వేటగాడు నేర్పరి
అందుకే పోరాడుతున్నాను
నా పిల్లల నోళ్ళల్లో నా స్థన్యం వుంది
నన్ను నలువైపులా చుట్టుముట్టేసారు
పోరాడుతూనే వున్నాను

వేటగాడికి నా దంతాలు,నా గోళ్ళు, నా  అస్థికలు కావాలి.
నా సాంస్కృతిక ధనస్సు,బాణాలును
మార్కెట్టు లో అన్నింటి విలువలు
నిర్ణయింపబడ్డాయి
నా నల్లమందు మట్టి కూడా అమ్ముడైంది
నాకు నా దేశంలోనే నిర్వాసిత శిక్ష. విధింపబడింది
నేను నా దేశాన్ని వెతుక్కుంటున్నాను
డిల్లీ వీధులలో ఫిర్యాదులతో
తిరుగుతున్నప్పుడు
నా దేశం యేదని అడిగారు
నేను వారి చేరికకు లోపలే వున్నానని
నన్ను అంగీకరిస్తారు

వారు యెక్కడ కోరుకుంటే
అక్కడ జెండా పాతేస్తారు
మా పచ్చని దేహాలను పిసకడం
యీ వేటగాళ్ళను మోహింపచేయును
కామ పురుషులకు విరిగిన మా
యెముకలు కనిపించవు
సైనికుల చప్పుళ్లతో మా నిద్దుర
ముక్కలౌతుంది
వారు మమ్మల్ని వేశ్యలుగా భావించారు
మా పనులు చూస్తే వారికి అసహ్యం కలగదు
మమ్మల్ని చెరపడమే వారికి యిష్టం
వాడి అల్ప ప్రతిక్రియలలో నేను వోడిపోతానని ఆలోచిస్తాడు

గాయపడ్డ వేటగాళ్ళారా రండి చూడండి
నీ కోరిక కంటే యెతైన కఠినమైన నా వక్షోజాలను
నీవు నా స్తనాలను తాగాలనుకొన్నావు కదూ
రా వుప్పుతో విషంతో కలిసిన నా
నెత్తురును రుచి చూడూ!
రా చూడు! బూడిదను వెచ్చగా వుంచే రాతిరి నాలో ప్రాణాలతో వుంది

బ్రహ్మపుత్ర యెలా నవ్వుతుందో చూడూ
వితస్తా నన్నెలా కాపలా కాస్తుందో చూడూ
మా పగుళ్ళలో నుంచి ప్రవహిస్తన్న సిరా
యెంత యెర్రగా మత్తును యిస్తుందో వుందో చూడు
నేను మళ్ళీ పుట్టనని అనుకోకు
నేను నా తరాల్లో స్థిరంగా వున్నాను
నేను యిరోంని
యిరోమ్ షర్మిలా చాను

*

మీ మాటలు

 1. Vilasagaram Ravinder says:

  బాగుంది ఖాన్ గారు అనువాదం. కవిత.

 2. syed sabir hussain says:

  ఒక సుదీర్ఘ పోరాటం… చిన్న నేత్తురు చుక్క నేలనును ముద్దాడకుండా …ఆకలి పేగులను జెండాగా ఎత్త్తిపట్టి చేసిన పోరాటం.. పాలకుల మనసు కరిగాక పోవచ్చు ..పోరాటం మాత్రం నిప్పులు కప్పేసిన బూడిదలా వెచ్చగా వుంది. షర్మిల పోరాటం ఒక బాటలా మారి మరిన్ని పాదాలకు దారిచూపుతాయి…ఇది ఖయాం .

  • పఠాన్ మస్తాన్ ఖాన్ says:

   త్యాంక్సండీ మీ అభిప్రాయానికి..

మీ మాటలు

*