ఉదయాన్నే వెలిసిన వర్షం

ఉదయ్యాన్నే

 

రాత్రంతా కురుస్తూ ఉదయాన్నే వర్షం వెలసిన అనంతరం  ఎలా వుంటుంది?  అచ్చం తన అంతరంగ లోతుల్నుండి భావోద్వేగాలను తోడుతూ కవిత రాసిన అనంతరం కవి మనస్తితిలా వుంటుంది.  నిజాయితీగా తనదైన ఒక కవితని  రాయాలంటే కవి బాధో ఆనందమో ఎంత హోరుని అనుభవించాలి? వికాసమో విలాపమో జ్ఞాపకాల్లో ఎంతగా ఉక్కిరిబిక్కిరైపోవాలి?  దుఖం నుండో ఆనందం నుండో వచ్చిన కన్నీటిలో ఎంత తడిసిపోవాలి?

కిటికీగుండా చూస్తేనో లేక తలుపు తెరిచి గుమ్మం బైట తల పెడితేనో ఒక నిండైన దృశ్యం కనబడితే రామానుజరావుగారిలాంటి కవి ఊరుకోగలడా?  అందుకేనేమో ఆయన కవిత్వం నిండా దృశ్యాలు పరుచుకుంటాయి.

***

కవిత్వం గురించి ఆలోచించేప్పుడు చాలా ఆలోచనలొస్తాయి.  అసలు కవిత్వం అంటే ఏమిటి, ఏది కవిత్వం అని సందేహాలొస్తాయి.  కవిత్వం అంటే ఎదైనా కావొచ్చు. అది లిఖితం కావొచ్చు. మౌఖికం కూడా కావొచ్చు. నిర్వచనీయం కావొచ్చు లేదా అనిర్వచనీయం కావొచ్చు.   అయితే ఈ సందేహాల్ని దృష్థిలో పెట్టుకొని, ఒక నిర్వచన స్పృహతో కవిత్వం రాస్తే మాత్రం కవి దారుణంగా విఫలమౌతాడు.  ఒక కవిత్వ విమర్శకుడో లేదా ఒక మంచి పాఠకుడో నిర్వచనాల జోలికి పోవాలి కానీ “ఒక మంచి కవితకి ఇవిగో ఇవీ లక్షణాలు, ఇంకా ఈ లక్షణాలు నేనిప్పుడు రాయబోయే కవితలో ప్రతిఫలించాలి” అని కవి అనుకుంటే కవి ఊహాశక్తికి క్రోటన్ కత్తెర్లు పడతాయి.  ఒక గొప్ప కవి రాసిన కవిత్వంలో ఫలానా లక్షణాలు ప్రస్ఫుటమయ్యాయి కాబట్టి తాను కూడా అలాగే వస్తువు పరంగా, ఎత్తుగడ పరంగా, నడక పరంగా కవిత్వం రాస్తే అది ఎట్టి పరిస్తితుల్లోనూ మంచి కవిత్వం కాబోదు.

 

ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వర్తమాన తెలుగు కవుల్లో అనేకమంది ఎవరో ఒకరి కవిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవటం జరుగుతున్నది.  కవిత్వం రాయటానికి మరో గొప్ప కవిని ఆదర్శంగా తీసుకోవటం మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు.  అందుకే వారిలో ఒక స్వంత గొంతుక లోపిస్తున్నది.  తనదైన ఊహ, డిక్షన్ చాలామందిలో కనిపించటం లేదు.  ఒక గొప్ప కవిత్వం చదివాక కవి మనసులో ఒక గాఢమైన కవిత్వ వాతావరణం ఏర్పడాలి.  ప్రభావం వేరు, అనుసరణ వేరు.  కవిత్వంలోకి స్వంత రక్తాన్నెక్కించి పరుగులు తీయించటానికి ప్రభావం అడ్డుకాబోదు.  కానీ కలంలోకి పరాయి రక్తాన్నెక్కించుకొని రాస్తున్నట్లుంటుంది అనుసరణ కవిత్వం.

*****

రామానుజరావు గారు ఎంతోమంది అంతర్జాతీయ కవుల్ని చదివారు.  కానీ ఆయన ఎవర్నీ అనుసరించ లేదు.  ఆయన అనువాదాలు కూడా చేసారు.  ఆయన అనువాద కవితలకి, తెలుగులో స్వంతంగా రాసిన కవితలకి ఎక్కడా పోలిక లేదు.

 

కవి రాజకీయ, ప్రాపంచిక దృక్పధం ఏదైనా కావొచ్చు.  ఒకరి కవిత్వం ప్రధానంగా దృశ్య వర్ణనగా వుంటుంది.  మరొకరి కవిత్వం జీవితం గురించి, సమాజం గురించి వ్యాఖ్యానంగా వుంటుంది.  ఎలాగైనా వుండొచ్చు.  ఇలా రాస్తేనే కవిత్వం అంటే అదో రకపు మూర్ఖత్వం, నిరంకుశత్వం.  రాసే పద్ధతిని చర్చించొచ్చు.  కానీ నిర్దేశించటం సరైంది కాదు.

 

తనదైన శైలిలో వర్ణన ప్రధానమైన కవిత్వం రామానుజరావు గారిది.  కొన్ని చోట్ల భావుకమైన ఊహలు చేసినప్పటికీ  జీవన గాఢతని పట్టించే దృశ్య వర్ణన ఈ కవిలో ప్రధానంగా కనిపిస్తుంది.  ఆయనెంచుకున్న దృశ్యాలు భిన్న వర్ణ సముదాయం.  భిన్న భావోద్వేగాల సమ్మేళనం.  భిన్న సందర్భాల మాగమం.  అది భర్తని కోల్పోయిన స్త్రీ కావొచ్చు. అంధ భిక్షువు కావొచ్చు, అమ్మ కావొచ్చు.  తూర్పు దిక్కుగా దిగులుగా చూస్తూ పార్కు చీకటి దుప్పటి కప్పుకునే ముందటి సందడి కావొచ్చు. మోటార్ సైకిల్ మీద జాంఝామ్మని హుషారుగా షికారు చేసే  జంట కావొచ్చు.

 

కేవలం దృశ్య వర్ణనే కవిత్వం అయిపోదు  ఆ దృశ్యంలో తనను ఇముడ్చుకుంటేనే కదా కవిత్వం అయ్యేది.  తానెంచుకున్న దృశ్యం తాలూకు ఆనందంలో, దుఖంలో,  ప్రేమలో, పరవశంలో తాను మానసికంగా భాగం కాగలిగినప్పుడు,  ఆ దృశ్యాన్ని తన హృదయంలోకి ఆవాహన చేసి తనదైన అవగాహనతో మన ముందు పెట్టినప్పుడే కదా ఆ వర్ణన కవిత్వం కాగలిగేది.  చూడగానే మనసుని తడిమే ఒక దృశ్యం మీదుగా కవి జీవితాల్లోకి తొంగి చూడగలగాలి.  జీవితాల్లోని బాధలకి, ఆనందాలకి హేతువుని, మనుషుల్ని నియంత్రించే ఆర్ధిక, సాంస్కృతిక శక్తుల్ని పట్టించుకోకుండా కేవలం ఒక రసాత్మక స్పందన మంచి కవిత్వం కాజాలదు.  అయితే ఇదంతా ఒక్క కవితలో జరగక పోవచ్చు.  కానీ ఒక కవి రాసిన మొత్తం కవిత్వంలో ఆ అంశ ప్రతిఫలించాలి.  ఈ కవి సరిగ్గా అదే పని చేసారు.  కవి తన ఒక కవితలో ఇలా అంటారు:

“హృదయాన్ని తాకిన రూపమేదైనా

నా నరాల తీగెలను మీటే

ఆర్ద్రతే నా రస దృష్టి”.

కవిత్వ ప్రధాన లక్షణాల్లో ఒకటైన ఆర్ద్రతని తన రసదృష్టిగా  చేసుకున్నారు.

****

 

ప్రకృతి ప్రేమ, మానవసంబంధాలు, రొమాన్సు, ప్రాంతీయ అసహనాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, స్త్రీ సౌందర్యం, కార్పొరేట్ హాస్పిటళ్ళ దోపిడీ, పార్కులలో వ్యాహ్యాళి, నాన్న, డాబాపై కురులార పోసుకునే అమ్మాయి, అమ్మ…ఇలా జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, జీవితాన్ని ఆవరించి వుండే వాతావరణం, జీవితాన్ని సుసంపన్నం చేసే అనుభవాలు, జీవితం మీద ప్రేమని పెంచే భావోద్వేగాలు, సౌందర్య దృష్టి…అన్నింటినీ కవిత్వంగా స్వీకరించారు కవి.

 

 

“ఇంద్ర ధనుస్సు రంగుల్లో స్నానించిన పాలపిట్టొకటి

కారు బానెట్ పై వాలి ముక్కుతో పొడుస్తూ

మధ్యమధ్య తలెత్తి చూస్తూ మోగిన హారను శబ్దాన్ని

రెక్కలతో అదిలించి ఎగిరిపోతుంది”

 

“వాన చినుకుల్ని తాగి మత్తెక్కినట్లున్న రోడ్డుపై

మట్టి వాసన మోసుకొస్తున్న గాలితో పోటీ పడుతూ

సైకిల్ పై గడ్డి మోసుకొస్తున్న యువకుడు”

 

“అసహనం దుమ్మ్ పట్టిన కారు అద్దాల వెనక

నా పట్నవాసపు మితృడు

అకస్మాత్తుగా గొడ్లకాపరిగా మారి పిల్లనగ్రోవి ఊదుతూ

తన్మయత్వపు జడివానలో తడిసిపోతూ నేను” (“ఓరుగల్లుకు ఒక రోజు”)

 

“ఓరుగల్లుకు ఒక రోజు” ప్రకృతిలో జీవన సౌరభాన్ని వెతుక్కున్న కవిత.  ప్రకృతి ఎంత అందంగా వుంటుందో అంత అందంగానూ జీవితాన్ని చెక్కిన కవిత ఇది.  ప్రకృతిని ఇంత నాజూగ్గా పట్టుకొన్న మరో కవిత “ఉదయాన్నే వెలసిన వర్షం”.  ఇక్కడి దృశ్యవర్ణనలో మానవాంశని కవి హైలైట్ చేసిన తీరు బాగుంటుంది.  ఉదయాన్నే వెలసిన వర్షం ఏ దృశ్యాన్ని మంజూరు చేస్తుంది?

 

“వేకువనే వెలుగులిచ్చి వెళ్ళిపోతుంది

తూర్పు సముద్రంలో స్నానించి సూరీడు తేలి వస్తున్నాడు

ఇంటిముందు పారిజాతం చెట్టు

పులకరించి పూల దోసిళ్ళు విప్పార్చింది

ప్రేమ పావురాలు రెండు సన్ షేడ్ పై వాలి

క్రీనీడలో కువకువలాడుతున్నాయి”

 

“మా ఇంద్రపురి వీధిలో బాల గంధర్వుడొకడు

తలెత్తి అమృతం చినుకుల్ని ఆస్వాదిస్తున్నడు”

 

ఆయనొక ప్రాపంచిక దృక్పధానికి చెందిన కవి కారు.  కానీ అయన కవిత్వంలో హేతువు కనబడుతుంది.  ఆరోగ్యకరమైన ప్రతిస్పందన కనబడుతుంది.  ఆయన కవిత్వంలో ప్రశ్నలు లేకపోయినా పాఠకుల్లో అనివార్యంగా ప్రశ్నలు రేకెత్తుతాయి.  ఉదాహరణకి “గుజరాత్ గాయం” అన్న కవితలో ఇలా అంటారు.

 

“హింస ఒక వ్యసనమైతే

బోధివృక్షాల వేళ్ళు తెగుతాయి

చంపడమొక నాగరికత అయితే

ఏ సబర్మతీ తీరాన స్వాతంత్ర్యాలు అనర్హమౌతాయి

 

శతాబ్దాల యుద్ధాలు, భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు”

 

నిజమే “శతాబ్దాల యుద్ధాలు భూకంపాలు ఇంతకన్నా భయంకరం కావు” అన్నప్పుడు ప్రశ్నలు రేకెత్తకుండా వుంటాయా?

 

“నేనొక్కడినే” అన్న కవితలో “ఆ రాత్రి చెట్ల ఆకులు / ప్రసవ వేదనతో అల్లల్లాడుతూ” అంటారు.  ప్రసవ వేదనతో అల్లల్లాడే రాత్రి చెట్ల ఆకులు నిజానికి ఏదో నిగూఢ అంతరంగ అశాంతికి సంకేతం.  కవిత్వం రాస్తున్నప్పుడు తోచిన ఏ ప్రతీకైనా నిజానికి నిష్కారణంగా బైటికొచ్చేదీ కాదు, నిర్వ్యాపకంగా వుండదు.  చాలాసార్లు తన ప్రతీకలు ఏ కవికైనా ఆశ్చర్యం కలిగిస్తాయి.  కవిత్వం రాసే సమయం కవి జీవితంలో చాలా ప్రత్యేకమైనది.  తనను తాను కొత్తగా, మరింత లోతుగా పరిచయం చేసుకునే సందర్భం అది.  అటువంటి కొన్ని సందర్భాల్లో “వీధి కుక్కల వంతపాటలో స్రవించే విషాదాన్ని” అంచనా వేయటానికి అధివాస్తవిక ప్రతీకలతో “అంధ బిక్షువు” లాంటి కవిత పలుకుతుంది.

 

“రాత్రి

చీకటి దేహావృతమై

నక్షత్రాల వంకీ కర్ర ఆధారంగా

ఒక దయార్ద్ర హృదయ అన్వేషణలో

వీధి అంతా గిరికీలు కొడుతుంది

మూసిన తలుపుల ముందు కీచురాయి గొంతుతో

దీనంగా వేడుకుంటుంది”

 

అమెరికా లోని యూసమైట్ కొండల్లో సెలయేటిని చూసి అక్కడి ప్రశాంతతకి ఉక్కిరిబిక్కిరయిన కవి “ఇక్కడ అలలు లేవు”కవితలో అనుభూతుల జుగల్బందీని వినిపిస్తారు.

“చేతి పట్టు దాటి నీట తప తప తన్నే

ఆనందం

పిల్లల చుట్టూ ప్రవహిస్తుంది

ఇసుకలో కట్టిన గుజ్జన గూళ్ళు

కదిలి వస్తున్న పసితనాల పావురాలు

నిశ్శబ్దం నీట మునిగి కోలాహాలం”

 

ఇక్కడ నేను ప్రస్తావించని కొన్ని మంచి కవితలు ఇంకా వున్నాయి.  ద్రవ్యోల్బణం మీద రాసిన “రూపాయి”,  జంట ప్రయాణ ప్రణయాన్ని వర్ణించే “వాళ్ళిద్దరూ”, నోస్టాల్జియా మీద రాసిన “నాన్న” కవితలు చదవాల్సిన కవితలు.

కవిత్వంతో చాలా కాలం నుండి ప్రయాణం చేస్తున్నా చాలా తక్కువగా కనిపించిన రామానుజరావు గారు తన నడక వేగాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళగల సత్తా ఆయనకుందని ఉదయాన్నే వెలసిన వర్షం సాక్ష్యం చెబుతుంది.

 

*

 

మీ మాటలు

*