ఖాకీవనం

 gopi
పొలానికెల్దామని పొద్దున్నే లేసి బయటికొచ్చిన…
రోడ్డు మీద తుపాకులు పట్టుకొని పోలీసులు తిరుగుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు… శానా మంది…
ఖాకీ బట్టలేసుకునే మామూలు పోలీసులు కాదు… సినిమాల్లో గొడవలప్పుడు సూపించే పోలీసులు…
గట్టి బూట్లు, సేతిలో పెద్ద తుపాకీ…. రోడ్డుమీద తిరుగుతున్నారు.
భయమేసింది… అయినా పొలానికెల్లాలిగా…
మెల్లిగా నడుత్తుంటే ఒక పోలీసాయన అడిగిండు …
“ఏయ్ … ఎవర్నువ్వు? ఎక్కడికెళ్తున్నావ్?”
“మాదీవూరే నండి… పొలంకాడికెల్తున్నా… :
భయం భయం గానే చెప్పా
“సరే పో… “
హమ్మయ్య అనుకొని పొలంలోకెల్లా. కాయగూరలు, ఆకుకూరలు కోసి బాబూరావుకిచ్చి ఇంటిదారి పట్టా…
“పోలీసులెందుకొచ్చినట్టు?  యింతమందా?”
ఎం అర్ధం కావట్లేదు…
అలా నడుచుకుంటూ ఉళ్ళోకెల్లా…
సెంటర్లో ఒక పోలీసు జీపు… జీపులో ఒక పెద్దాపిసరు… జీపు బయట కానిస్టేబుళ్లు…
రోడ్డుమీద ఒక పక్కాగా 20 గజాలకొక్కడు చొప్పున తుపాకీ పట్టుకున్న పోలీసులు నడుస్తున్నారు…
ఆళ్లనే సూత్తా ఉన్నారు మావూరోళ్ళు .
“ఏరా సూరీ…ఇక్కడున్నావేంటి?  పొలానికెళ్లలేదా?”
ప్రశ్నతో పాటు భుజమ్మీద చెయ్యి పడడంతో వెనక్కి తిరిగి చూశా.
ఎదురుగా గాంధీ గారు… మా పక్కూరు. పెద్ద ఆసామి. ఈ సుట్టుపక్కల నాలుగూళ్ళలో ఆయనకి పొలాలున్నయ్. ఆయన ఈమధ్యనే బెజవాడలో మకాం పెట్టిండు.
“నమస్తే సార్… పొలంకాడనుండే వత్తన్న సార్” ఆయన ప్రశ్నకు జవాబిచ్చా.
నా బుర్రలో ఉన్న ప్రశ్నలన్నిటికీ యీయనైతేనే సరైన సమాధానం సెపుతాడనిపించింది.
“సార్… ఏంటి … ఈ పొలిసు జీబేంటి… ఈ పోలీసులేంటి… ఈ తుపాకులేంటి? నాకంతా అయోమయంగా ఉంది సిర్”
గాంధీ గారు చిన్నగా నవ్వి..
“ఏముంది.. మాములే… నిన్న సత్యనారాయణ గారి పొలంలో మంటలు అంటుకున్నాయిగా…. అలాంటివి జరగకుండా బందోబస్తు…”
“అసలు ఆ మంటలేంటి… ఈ పోలీసులేంటి సార్?”
“పిచ్చోడిలా మాట్లాడకు… మంటలేంటంటే నేను చెప్పలేను గానీ పోలీసులు మాత్రం ఈ రాజధాని గ్రామాల్లో అలాంటి సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యగా వచ్చారు.”
“అర్ధం కాలేదు సార్”
“నీ బొంద… నాకూ ఇంకా ఏం అర్ధం కాలేదు. అదే చూస్తున్నా” అన్నారు గాంధీ గారు నా భుజమ్మీద గట్టిగా నొక్కుతూ.
“మీబోటోళ్ళకే అర్ధం కాకపోతే మాకేం అర్ధమైద్ది సార్” అమాయకంగా అడిగా…
“చూద్దాం… కథ ఇప్పుడేగా మొదలైంది…. “
గాంధీ గారు కూడా ఏదో ఆలోసిత్తన్నారని అర్ధమైంది. కానీ ఏం జరగబోతందో అర్ధం కావట్లేదు.
“ఈ పోలీసులంతా ఎంతమందొచ్చారు సార్”
“చానా మంది… మన 29 గ్రామాలకు వచ్చారు. ప్రతి గ్రామంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టారు. ఇంకొంతమంది ఇలా తుపాకులు పట్టుకొని రోడ్లమీద తిరుగుతున్నారు. “
“అవుట్ పోస్ట్ అంటే?”
“అవుట్ పోస్ట్ అంటే చిన్న పాటి పోలీస్ స్టేషన్ లాంటిది. చిన్న డేరా లాగా వేసుకొని అందులో పోలీసులు కూర్చుంటారు. అక్కడినుంచి అటూ ఇటూ తిరుగుతుంటారు. అనుమానంగా కనిపించిన వాళ్ళను ఆపుతారు… గ్రామాల్లో గొడవలు జరక్కుండా ఆపుతారు.”
“మనఊళ్లలో గొడవలేంటి సార్? ఎప్పుడు జరిగినియ్?”
“అదేంటి సూరీ అలా అంటావ్? మన ఊళ్లలో పంట పొలాల్లో ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగిందా? ఇప్పుడు జరిగింది. గొడవలు అంతే.. జరగొచ్చేమో”
“ఏమోలెండి… నాకేం అర్ధంగాలా… అది సరే గాంధీ గారూ… మన పొలాలు తీసుకుంటారంట కదా?”
నా అనుమానం తీర్చగలిగేది ఈయనొక్కడే అనిపిచ్చింది.
ఆయన నావైపు అదోలా చూసి “అవును… పొలాలు తీసుకోకుండా బిల్డింగులు ఎలా కడతారు?”
“అంటే మన పొలాలు గవర్మెంటోళ్లు కొంటారా?”
ఆయన మళ్ళీ నవ్విండు…
“కొనటం కాదు తీసుకుంటారు”
“అదేంటి సార్… తీసుకోవటమేంటి?”
“మరి? కొనాలంటే అంత డబ్బు గవర్నమెంటు దగ్గర ఎక్కడిది?”
“……?”
“అర్ధం కాలేదా….? ఇప్పుడేగా కథ మొదలైంది… ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే… చూస్తా ఉండు”
“పొలాలన్నీ గవర్మెంటు తీసుకుంటే మన గతేంటి.  పంటలెక్కడ పండుతాయ్”
“ఎక్కడో పండుతాయ్… అవన్నీ మర్చిపోవాల్సిందే…”
“నా పొలం ఇవ్వను అంటే!?”
ధైర్యం సేసి అనేసా…
గాంధీ గారు నావైపు సూసిండు… నా కుడి సేతిని పట్టుకొని మెత్తగా నొక్కి…
“ఇవ్వను అంటావా? నీ పొలం గవర్నమెంటుకి ఇవ్వనంటావా?” అడిగిండు…
“యిత్తె నేనూ నా సంసారం ఎట్టా సారూ?”
“అంటే పొలం ఇవ్వనంటావా?”
మల్లి అడిగిండు నా కళ్ళలోకి సూసి.
“ఎట్టా ఇత్తా…? ఎందుకిత్తా?”
“సరే… యిదేమాట ఆ పోలీస్ జీబు దగ్గరకెళ్ళి అను”
భయం వేసింది… వెన్నుపూసలో ఏదో వొణుకు.
“అమ్మో… పోలీసులు… కొడతారేమో సార్!”
ఈ సారి గాంధీ గారు పక్కున నవ్విండు.
“ఇప్పుడర్ధమైందా ఈ పోలీసులు ఇంతమంది ఎందుకొచ్చారో!”
అర్ధమైంది…. నిన్న ఒక పంట పొలంలో రేగిన మంటలకోసం కాదు… రేపు ఈ మొత్తం పంటపొలాల్లో బిల్డింగులు కట్టటంకోసం.,.. అందుకే ఈ పోలీసులు… అందుకే ఈ తుపాకుల పహారా…
నా చెయ్యి వదిలేసి గాంధీ గారు ముందుకు కదిలిండు.
ఆయనెల్లిపోయేదాకా అటే సూసుకుంట నిలబడ్డ.
ఇక యింటికెల్దామని వెనక్కి తీరిగా… ఎదురుగా పోలీసులు… రోడ్డు మీద నడుత్తున్నారు. ఒక చేతిలో లాఠీ కర్ర. మరో చేతిలో తుపాకీ… కాళ్ళకి పెద్ద పెద్ద బూట్లు…
పోలీసోళ్ళు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటా నన్ను దాటుకొని ముందుకెళ్లారు.
నేను ఇంటిముకం పట్టిన…
“ఏరా సూరీ, బాగున్నావా?”
ఎదురుగా మా పుల్లయ్య బాబాయి. పక్కూరు. రాజధాని కోసం తీసుకుంటన్న 29 ఊళ్ళల్లో ఆళ్లూరు కూడా ఉంది.
“బాగున్నా బాబాయ్. నువ్వెట్టున్నావ్?. పిన్నీ, పిల్లలూ బాగుండారా?”
“ఏం బాగులేరా ….”
గట్టిగా నిట్టూర్చిండు బాబాయ్.
“ఏంటి బాబాయ్… యేమైంది?”
“ఏముంద్రా? నీకు తెలవందేంవుంది? రాజధాని అన్నాక, పొలాలు తీసుకుంటారన్నాక కంటికి కునుకు లేదు, మెతుకు దిగటం లేదు”
అప్పుడర్ధమైంది… నేనొక్కణ్ణే కాదు… అందరి పరిస్థితీ నాలాగే ఉందని.
“అవును బాబాయ్… పొలాలు పోతాయంట. పెద్దోళ్ల దేంవుంది? అల్లెట్టాగో సాగు సేయ్యట్లేదు. మనబోటోళ్ళకి కౌలుకిచ్చి కూసుంటున్నారు. యిప్పుడు గవర్నమెంటోల్లకి యిచ్చిన యేమయిద్ధి? నట్టం మనకే”
మా బాబాయ్ వాళ్ళూల్లో అయిదెకరాలు కౌలుకి సేత్తుండు. బాగానే ఉండు.
“మా ఆసామి భూమి గవర్నమెంటోల్లకి యిచ్చేత్తడంట.  యిన్నాళ్ళూ ఆ బూమ్మీదే బతుకుతున్నం. ఇప్పుడది లేకపోతే ఎట్టాగో తెలవట్లేదురా”
బాబాయ్ కళ్ళల్లో నీళ్లు…
“యిక్కడా అదే పరిస్థితి బాబాయ్… ” అన్న బాబాయికి వోదార్పుగా…
“అయినా బాబాయ్ మనం అందరం కలిసి మా భూములివ్వం అంటే?”
బాబాయ్ నావంక సూసిండు… “యేంట్రా, నీకేమైనా పిచ్చా? పెద్దపెద్దోళ్లే నోరుమూసుకుంటే, నువ్వూ నేనూ ఏంమాట్టాడతం?”
బాబాయ్ గట్టిగానే అన్నడు. యించుమించు నన్ను మందలిచ్చినట్టే.
“ఈ పోలీసుల్ని సూసినవా యెంతమందున్నారో? ఏంమాట్టాడతం. ఆల్లని సూత్తుంటే బయమెయ్యట్లేదా?”
నిజమే… నాకు బయమేసింది. బాబాయ్ కూడా అదేమాట…
“సర్లే, ఎట్టా జరగాలనుంటే అట్టే జరుగుద్ది. సూద్దాం. నువ్వు మాత్రం జాగర్తరోయ్. కోడల్ని అడిగినట్టు సెప్పు”
బాబాయ్ ఎల్లిపోయిండు.
ఆలోచనలు మల్లీ మొదలు.

నాపొలం నాదికాదా? ఇవ్వను అంటే కుదరదా?

భయం నాకే కాదు అందరికీ అట్నే వుంది. అన్నూళ్ళల్లో పోలీసులున్నారు.
పెద్దోళ్ళు, బూమున్నోళ్లు, డబ్బున్నోళ్ళు మాట్టాట్టం లేదు. నాబోటి సిన్నోళ్లు మాట్టాడే దైర్యం సేయ్యట్లేదు.
భయం… నాలాగే అందర్లోనూ భయం…
లాఠీలంటే భయం… తూటాలంటే భయం…
భయం అంతటా, అందర్లోనూ మెల్లగా పాకుతుంది.
పంట భూములు పోతున్నా నోరెత్తకుండా … ఎదురు సెప్పకుండా
పళ్ళు, పూలు, కూరగాయలు పండిన ఈ వూళ్ళలో యిప్పుడు లాఠీలు, తూటాలు…
***                                  

మీ మాటలు

 1. Sanjeevani Kusum says:

  గుడ్ వర్క్ గోపి గారు, బయట నుండి చూసి పేపర్ లో వార్తలు చదివే మా లాంటి వాళ్ళ కు నిజం గా వాస్తవిక పరిస్థితుల మీద అంత అవగాహనా ఉండదు. మీ కధ రాజధాని ప్రాంత పరిస్థితుల కు అద్దం పడుతుంది.

 2. akbar pasha says:

  గోపీ గారూ..
  రాజధాని ప్రాంతంలోని ప్రస్తుత భయానక దుస్థితులకు మీ కథ అద్దం పట్టింది. పత్రికలు చదివి ఏదో అద్భుతం జరుగుతోందని భ్రమించే వారికి కనువిప్పు..

 3. చొప్ప.వీరభధ్రప్ప says:

  చదివినా కథ బాగుంది భయంగుప్పెట్లో బతుకు. ప్రభుత్వా నికీ కావాల్సిన అవసరాలు వున్నాయి. సకారం తప్పదు..

మీ మాటలు

*