కొత్త కవిత్వానికి చిరునామా తెలంగాణా: సోమసుందర్

 

sosu1

‘ వజ్రాయుధం ‘ – నేను చదివిన ఆవంత్స సోమసుందర్ గారి కవిత్వం. శ్రీశ్రీ కవిత్వం తర్వాత లయాత్మకతతో నన్ను చదివించిన కవిత్వం అది. వడివడిగా సాగుతూ, గుర్రపు కాలిగిట్టలు చేసే ధ్వనిలా అనిపించింది.

నా కవితా సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ సోమసుందర్ గారికి నేను పంపిన తర్వాత – చదివి – వొక రోజు ఫోన్ చేసారు. ‘ పిఠాపురం ఎప్పుడొస్తావు ‘ అన్నారు. ‘ వస్తాను గురువు గారూ.. మిమ్మల్ని చూడాలని – మీతో దగ్గరగా వుండి మాట్లాడాలని వుంది ‘ అన్నాను. ఫలానా రోజున వస్తాను – అన్నాను. మళ్లీ కొన్ని రోజులు పోయాక ఫోన్ చేసి.. ‘ ఎప్పుడు వస్తావు ? ‘ అని అన్నారు. ఆ ఫలానా వెళ్తానన్న రోజు నేను వెళ్లలేదు. ‘ మళ్లీ సెలవుల్లో వస్తాను గురువు గారూ… ! ‘ అని అన్నాను. కానీ వేసవి సెలవుల్లో గానీ, దసరా సెలవుల్లో గానీ – వెళ్లలేకపోయాను. మళ్లీ ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ‘ ఎప్పుడు వస్తావు ! ‘ అంటూ ఫోన్ చేసారు.

నా కవిత్వం మీద – ప్రేమగా, ఆప్యాయంగా, విశ్లేషనాత్మకంగా – నాకు చాలా ప్రేరణను యిచ్చే వ్యాసం వొకటి రాసారు గురువు గారు. నా కవిత్వం ఎదుగుదలకు విలువైన సూచనలు చేసారందులో. ఎదిగే క్రమంలో సాధించాల్సిన కవిత్వాంశాలను చెప్పారు. లోపాలను – ప్రేమతో ఎత్తి చూపారు.

ఆ వ్యాసం పదేపదే చదువుకుని – నన్ను నేను దిద్దుకోవాల్సిన వ్యాసంగా మారింది.

చిన్నప్పుడు – తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఆయన కవిత్వం చదివి – గొప్పగా భావించిన నాపై, నా కవిత్వం పై ఆయన వ్యాసం రాయడం గొప్ప ఆనందంగా అనిపించింది.

మళ్లొకసారి ‘వజ్రాయుధం’ చదివాను.

ఈ సంవత్సరం జనవరి 9, శనివారం – తెల్లారిజామున – కవిత్వం రాస్తున్న నా పాఠశాల విద్యార్థిని వెంట తీసుకుని – పిఠాపురం బయలుదేరాను.

మాధవస్వామి గుడి వీధిలో వున్న ఆయన ఇంటికి వెళ్లాము.

ఆయన గదిలోకి అడుగుపెట్టాం.

మంచం మీద వెల్లకిలా పడుకుని వున్నారు. మెలకువగానే వున్నారు. వాళ్ల అబ్బాయితో మాట్లాడుతున్నారు.

నేను వెళ్లి..

‘ గురువు గారూ…. ! ‘  అని పిలిచి – నా పేరు చెప్పాను. నా రెండు చేతులతో ఆయన చేతిని పట్టుకున్నాను. ఏదో ఆప్యాయత అసంకల్పితంగా నన్ను అలా చేయించింది. మహా మృదువైన ఆ చేతి అనుభూతికి లోనయ్యాను. పక్కన కూర్చున్నాను. ‘ నువ్వా… ! ‘ అని చాలా ఆనందపడ్డారు. కళ్లు ఆనందానికి లోనయ్యాయి. వస్తున్నానని ముందుగా తెలియజేయలేదు నేను. నన్ను వాళ్ల అబ్బాయికి పరిచయం చేసారు.

సొసు౨

పక్కనే వున్నాను. నా చేతుల్లోనే ఆయన చేయి వుంది. ఆ మృదుత్వం నాకు తెలీకుండానే నా లోపలకి అనుభూతమవుతుంది.

ప్రేమగా మాట్లాడారు.

తర్వాత లేచి – ఆయన మంచానికి ఆనుకుని వున్న కుర్చీలో కూర్చున్నాను.

ఆయన జీవితానుభవాలు, కవిత్వానుభవాలు, జైలు అనుభవాలు, పోలీసులు ఇంటికొచ్చి అరెస్టు చేసినప్పుడు.. ఇంటందరూ ఏడ్వవడమూ ; మిగిలిన సాహిత్యజీవులతో అనుబంధాలు.. ఇంకా పాత జ్ఞాపకాలను అనేకం నెమరువేసుకోవటం ; సామ్యవాదం గురించి – కులం గురించి – హైందవభావజాలం గురించి – ఆ నాలుగు గంటలూ చాలా విషయాలను చెప్పారు. మాట్లాడానికి కష్టపడుతూ.. అయినా కవిత్వం – సాహిత్యం యిస్తున్న బలంతో చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడారు. చాలా అభిప్రాయాలను వ్యక్తం చేసారు. కల్బుర్గి గురించి మాట్లాడారు . ‘కబుర్గి’ని దగ్గర నుంచే చంపారట ! రచయితలని కూడా బతకనివ్వటలేదా.. ‘ అని బాధతో, ఆగ్రహంతో – అన్నారు.

అప్పటికి నేను రాసిన కొత్త కవితలు చదివాను. కళ్లు మూసుకుని చాలా శ్రద్ధగా విన్నారు. నచ్చిన చోట ‘ బాగుంది ‘ అని అంటూ.. నిమగ్నతతో విన్నారు. అంత గొప్ప కవి, గొప్ప జీవితానుభవం వున్న మనిషి ముందు – కవిత్వం చదవటం.. నేను నా జీవితంలో మరిచిపోలేని అనుభవం.

‘ పద్యం గురించి కాస్తా మాట్లాడుతా ‘ కవిత చదివాను. ‘ పద్యాన్ని అరచేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరితే అట్టే అంటిపెట్టుకుని వుంటుంది ‘ అన్న స్టాంజాని విని.. ఆగమని చెప్పి నెమ్మదిగా కళ్లు మూసుకున్నారు… ఆరేడు సెకెన్లు తర్వాత కళ్లు తెరిచి ‘ కానీ… ‘ అన్నారు. ‘ వేళ్లు గురించి.. ‘ కవిత చదివాను. ‘ అమ్మ నన్ను చంకలో ఎత్తుకునేటప్పుడు కిందకు జారిపోకుండా ఆ వేళ్లతోనే గట్టిగా దేహానికి అదుముకునేది ‘ అన్న దగ్గర.. ఆగి.. ” మా పెద్దబ్బాయిని నా గుండెల మీద వేసి పెంచాను ” అని అంటూ.. కాసేపు కళ్లు మూసారు.

అప్పుడు తెలిసింది ‘ ఆయన కవిత్వంతో తాదాత్మయం చెందుతున్నారని ‘. అంత పెద్ద వయసులోనూ కవిత్వం కోసం ఆవురావురమనడం నాకు గొప్ప ప్రేరణనిచ్చింది.

ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అతనితో నేను గడిపిన కాలం అమూల్యమైనది. ‘ మళ్లీ మళ్లీ చూసిరావాలి. మాట్లాడాలి ‘ అని అనిపించే మనిషి. క్రిష్టోఫర్ కాడ్వెల్ ‘ ఇల్యూజన్ అండ్ రియాలిటీ ‘ పుస్తకం ఇస్తూ.. ” మళ్లీ వచ్చినప్పుడు ప్రతీ భాగం గురించి నువ్వు నాకు చెప్పాలి. ఉత్తరాల్లోనూ రాయాలి ” అని అన్నారు. ఆయన ఆత్మకథ రెండో భాగం ‘ పూలు – ముళ్ళు ‘ ఇచ్చారు. ఇంకా ఆయన సాహిత్యం చాలా ఇచ్చారు. ‘ నిద్రపోకు అనుభవాలు జారిపోతాయి.. మేలుకోకు కలలు పారిపోతాయి ‘ పుస్తకం పేరు ప్రత్యేకంగా వుందండి – అని అన్నాను. నవ్వి.. అలాంటివే మరికొన్ని తన పుస్తకాల పేర్లు చెప్పారు. ఆయన తన పుస్తకాలును ఇస్తూ.. వొక మాట అన్నారు : ‘ ఇంత వరకు నా సాహిత్యం మొత్తం చదివిన వాళ్లు వొక్కరూ కనిపించలేదు.. ‘ అని.. కొనసాగిస్తూ…..  ‘ మళ్లా కొత్త పుస్తకం వేస్తున్నాను ‘ అని చెప్పారు. ‘ అందులో వర్తమాన కవుల మీద నేను రాసిన వ్యాసాలు వుంటాయి , నీ కవిత్వం మీద రాసింది కూడా వుంటుంది ‘ అని అంటూ….  ఆ పుస్తకం పేరు చాలా గమ్మత్తుగా వున్నది.. చెప్పారు. ‘ ఎలా వుంది పుస్తకం పేరు ? ‘ అని అన్నారు. ‘ చాలా ప్రత్యేకంగా పెట్టారండీ ‘ అని అన్నాను. ఆ పేరు వైవిధ్యంగా వుంది.. యిప్పుడు గుర్తుకురావటం లేదు.

ఇలా ఆత్మీయసంభాషణ సాగుతున్నప్పుడే మధ్య మధ్యలో నేను వేసిన కొన్ని ప్రశ్నలకు స్పందించారు :

ప్రశ్నలు – జవాబులు

* ఇప్పడు వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ?

ఇప్పటితరం యువకవులు బాగా రాస్తున్నారు. తెలంగాణా నుంచి మంచి కవిత్వం వస్తుంది. స్ట్రగుల్ వుంది. ఆధునికం కవిత్వం మలుపు తిరగాలి.

* ఇంగ్లీష్ కవిత్వం అధ్యయనం అవసరం గురించి చెప్పండి ?

చదవాలి. కచ్చితంగా చదవాలి. ప్రపంచ కవులను చదవడం అవసరం.

* కులం గురించి… ?

కులం పోవాలి. పేర్లులో వున్న కులం అస్తిత్వం కూడా పోవాలి.

* శ్రీశ్రీ తో మీ అనుబంధం ?

1945 లో ఇంటర్ పూర్తి అయ్యాక.. శ్రీశ్రీని కలవటానికి శ్రీశ్రీ కోసమే మద్రాసు వెళ్లాను. ఇంటికి వెళ్లాను. ఇంటిలో ఆ పూట తినడానికి లేదు. బయటకు వెళ్లి.. టీ, బిస్కెట్స్ తిన్నాము.

అప్పుడు నా దగ్గర వున్న డబ్బులతోనే వండుకోవడానికి కావాల్సిన సామాన్లు కొన్నాం.

మొదట శ్రీశ్రీ కవిత్వం పరిచయం లేదు. ఎలా కవిత్వం రాయాలి ? దారి ఏమిటి ? అని సంశయం వుండేది. కానీ కవిత్వం రాయటం అప్పటికే మొదలుపెట్టాను. శ్రీశ్రీ కవిత్వంలో… ‘ కవితా! ఓ కవితా !, జగన్నాథుని రథచక్రాలు ‘ ఎక్కువుగా పదే పది చదివేవాడిని.

* శివారెడ్డి గారితో మీ అనుబంధం ?

శివారెడ్డి నమ్మే రాజకీయాల గురించి మేమెప్పుడూ మాట్లాడుకోలేదు. శివారెడ్డి నన్ను బాగా ప్రేమిస్తాడు. నేనూ అంతే. బలాఢ్యుడు కాడనిపిస్తుంది కానీ గట్టివాడే. శివారెడ్డి కొడుకుని వొకరోజు వాళ్ల ఇంటి దగ్గర నా రెండు చేతుల్లో పెట్టాడు.. చాణ్ణాళ్ల క్రితం.

* భారతదేశంలో సామ్యవాదం గురించి… ?

సామ్యవాదం ఎప్పుడొస్తుందో చెప్పలేం. స్పాంటేనియస్ గా వస్తుంది – యాక్సిడెంటల్ గా వస్తుంది. సామ్యవాదం వచ్చితీరుతుంది.

ఆ రోజు ఆ సాహిత్యపిపాసిని వదిలి వచ్చేసానే గానీ..  మళ్లీ మళ్లీ వెళతాను… కలుస్తాను… మాట్లాడుతాను… అని అనుకున్నాను. నమ్మాను. పిఠాపురం ఏమాత్రం.. దగ్గరే… ఎప్పుడు పడితే అప్పుడ వెళ్లి వచ్చేయవచ్చు.. అని అనుకున్నాను. నా కొత్త కవిత్వ సంపుటి వచ్చిన వెంటనే పిఠాపురం వెళ్లి.. ప్రత్యక్షంగా యిచ్చి రావాలి – అనీ అనుకున్నాను. నాలుగు రోజుల కిందట హాస్పిటల్లో చేరారు.. అన్న వార్త పేపర్లో చదివి ఫోన్ చేసాను.  ‘ కోలుకుంటున్నారు.. బాగున్నారు – రేపే డిస్చార్జ్ ‘ అని గురువు గారి అబ్బాయి చెప్పారు. ఈ రోజు యిలాంటి వార్త వినాల్సిరావడం పూడ్చుపెట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. మళ్లీ  పిఠాపురంలో నేను ఎవరిని కలవాలి ? నా కవిత్వం మీద మరెన్నో ఎదుగుదలకు తోడ్పడే ఆయన మాత్రమే ఇవ్వగల సూచనలు యింకెవరిస్తారు ?

*

మీ మాటలు

 1. Voleti Venkata Subba Rao says:

  బాల సుధాకర్ మౌళి గారు – పూజ్యులు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారితో మీరు ప్రత్యక్షం గా పంచుకున్న అనుభూతులను చదువుతూంటే హృదయం ద్రవీభూతమైంది – మీ అక్షరాలలో ఆవేదన – ఆయన పట్ల మీ అభిమానం తొంగిచూస్తున్నాయి . సోమసుందర్ గారి మరణం సాహితీలోకానికి తీరని లోటు .వారి స్మృతి కి నా నివాళులు ఘటిస్తున్నాను ~

 2. Prof P C Narasimha Reddy Ph D says:

  We have already expressed of feelings about the great litterateur Sri Avantsa Somasundar. We could get close when we invited him to deliver endowment lectures in Sri Venkateswara University at Tirupati around1985 (?). He was critical about one of my reviews of his Kala Keli literary magazine in Srijana. Later he was very kind towards me putting jokes on his subsequent literary output. Vajrayudha dhaari Kalakeli vilasudu Krishna Sastry kavita pipasi sahasra Chandra darsi ( sahavasi of our late friend Sri Sasanka of Pithapuram) was a legend when the Telangana revolutionary struggle was on. We are he left us. Our condolences to his bereaved family.
  – Prof P C Narasimha Reddy

 3. విలాసాగరం రవీందర్ says:

  మీ ప్రత్యక్ష అనుభవాలను చదువుతుంటే ఎంతో అద్భుతంగా ఉంది. తెలుగు సాహిత్యం గొప్ప సాహితీ వేత్తను కోల్పోయింది మౌళి సర్

 4. నాగభూషణం దాసరి, says:

  సాహితీ కురువృద్దుడు సోమసుందర్ గారితో మీరు ప్రత్యక్షంగా పంచుకున్న అనుభూతుల్ని అక్షరీకరించి మా అందరితో పంచుకున్నందులకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ రచన చదువుతుంటే వారిని మా కళ్లతో చూసినట్లనిపించింది. ఆ మహాను భావుని స్పర్శ పొంది వారిగుండెల్లో మీ కవిత్వాన్ని స్మరించుకుంటూ మీతో అనేకాను భూతులు పంచుకోవడం నిజంగా అనిర్వచనీయం. ఆ మహానుభావుడు కనుమరుగైనా అలాంటి వారున్న కాలంలో మనమూ ఈ లోకంలో జీవించి ఉన్నామన్న తృప్తి, వారి రచనల స్పూర్తి చాలు ఉత్సాహంగా బ్రతుకు కొనసాగించడానికి.

  నాగభూషణం దాసరి,
  హైదరాబాదు

 5. చందు తులసి says:

  మౌళి… కవి గారితో మీ అనుబంధం , ఆయన‌ నుంచి స్ఫూర్తి పొంది మీ లాంటి‌ కవి రావడం.. సంతోషం.‌ మంచి‌ కవిత్వం రాయడమే …మీరు ఆయనకిచ్చే నిజమైన నివాళి.

మీ మాటలు

*