గడ్డపాయన!

 

damayanti

“ఏమండీ!”

‘ఉ..”

” మన ఎదురింట్లో  మేడ మీద పోర్షన్ లేదూ? అందులో   ఒక గడ్డపాయన దిగాడు.”

“ఊ..”

“ మనిషి భలే తమాషాగా వున్నాడు, తెలుసా? ”ఆజానుబాహువు. నలుపు తెలుపు గడ్డమేసుకుని, ఫ్రెంచ్ తత్వవేత్త పోజ్ కొడ్తూ  వున్నాడు”

“ఊ”

“పగలంతా ఏం చేసినట్టో?  సాయంత్రం చీకట్లు  పడుతుండగా  దిగాడు.  పెద్ద సామానేమీ కనిపించలేదు.  మొత్తం కలిపి పది డబ్బాలు కూడా లేవనుకోండి.. ఇట్టా దింపి అట్టా వెళ్లిపోయింది – చిన్న ట్రక్..”

“ఉ..”

“సంసారం తర్వాత వస్తుందేమో?”

“…..”

ఏవిటీ, నిద్ర పోయారా అప్పుడే?”

“….”

***

“ఏమండీ,  గడ్డపాయనింట్లో మన పోచమ్మే పని చేస్తోంది. నేనే చెప్పాను వెళ్ళమని.”

“ఊ..”

“ పనిచేసొచ్చి చెప్పింది.  పెళ్ళాం పిల్లలూ తర్వాత వస్తారేమో అనుకున్నానా?  కాదట. ఇంట్లో ఆడవాళ్ళెవరూ  వుండరు, తనొక్కడే ఉంటానని  చెప్పాడట.

“ఉ..”

“బ్రహ్మచారంటారా?”

“ఏమో. నన్నడిగితే నేనేం చెబుతాను?” ఫక్కున నవ్వి చెప్పాడు ప్రశాంత్.

ఆమెకి రోషమొచ్చింది. “ఎప్పుడూ ఊ కొట్టి వదిలేసే మొగుడు, పాయింట్ పట్టుకుని  నవ్వేసరికి ఉడుకుమోత్తనం వచ్చింది శైలజ కి.  “అవున్లేండీ, ఏమీ వినని  మొగుడుకి అన్నీ చెప్పుకోవడం నాది బుధ్ధి తక్కువ..” అంటూ, విస్సురుగా అటు తిరిగి పడుకోవటం తో ఆమెకి కోపమొచ్చిందన్న సంగతి అర్ధమైంది అతనికి. నవ్విన పాపానికి బ్రతిమాలుకోక తప్పదన్నట్టు, లాప్ టాప్ పక్కన పెట్టి, “అది కాదురా శైలూ! ఊరికే  జోక్ చేసానంతే.  వారం నించి వరసగా నువ్వు ఆయన గురించి చెప్పేవన్నీ వింటూనే వున్నానా, లేదా చెప్పు?” మాటలతో ఊరడిస్తూనే, సలహా కూడా ఇచ్చాడు.  “ పోనీ ఓ పని చేయకూడదూ?  ఒక సారి వాళ్ళింటికెళ్ళి పలకరించి, ఆయన పుట్టుపూర్వోత్తరాలేమిటో ఏక మొత్తంగా   తెలుసుకు రారాదూ? ఎంతైనా ఎదురెదురు ఇళ్ళ వాళ్ళం కదా! నిన్ను నువ్వు పరిచయం చేసుకున్నట్టూ వుంటుంది. నీ సందేహాలు తీరినట్టూ వుంటుంది. ఏమంటావ్?” అంటూ ఆమె చెంప మీద చిటికేసి చెప్పాడు చెవిలో.

‘హమ్మయ్యా, పర్మిషన్ దొరికింది వెళ్ళడానికి’  అనుకుని, ముఖం మీద దుప్పటి లాక్కుని పడుకుంది.”

****

గత కొన్ని రోజులుగా ఆయన్ని గమనిస్తోంది శైలజ. కిటికీలోంచి రహస్యం గా  చూస్తూ, బట్టలారేసే నెపం తో మేడ మీదకి – ఒకటికి పది సార్లు వెళ్లొస్తూ..పసిగడుతోంది ఆయన కదలికల్ని.

పోచమ్మ మాటలు చెవిలో మోగుతున్నాయి.   “ ఆళ్ళు బాపనోళ్ళమ్మా. వాళ్ళమ్మ నాయన్ల పోటో చూసినా. కానీ, ఈయన గుడ్డు తింటాడు. మొన్న పొద్దుగాల  ఆమ్లెట్    ఏసిమ్మంటే ఏసిచ్చినా…”

“ఊహు.అలానా!” చెవి వొగ్గి వింటూనే, ఆసక్తి లేనట్టు ముఖం పెట్టింది  శైలజ.

“ఇల్లంతా ఖాళీ గా వుంటుందమ్మా. మనిల్లు లా నిండా సామానుండదు.  గదినిండా, షెల్ఫుల నిండా బుక్కులే…  బోలెడు పుత్తకాలు.. ”

“అవునా, పుస్తకాల వ్యాపారమంటావా?”

“కాదటమ్మా, ఏవిటికి సారూ గిన్ని బుక్కులు అని అడిగా..”

“ఏమన్నాడు?”

“సదువుకుంటాకని చెప్పిండు….”

“ ఏం పని చేస్తాడట? అడగకపోయావా?”

“అడిగినా. ఏం డ్యూటీ చేస్తారు సారూ అంటే, ఏం సెప్పలా..నవ్విండు.  ఇంట్లో మీరొక్కరే వుంటారా సారూ అంటే ‘ఇదిగో ఇట్టా తలాడించాడు. గంతే..” అనుకరించి చూపిస్తూ, నవ్వి  చెప్పింది పోచమ్మ. “ఎక్కువేం మాట్లాడ్డు….గమ్మున కూకుంటాడు. బుక్కట్టుకుని …”

వింటూ ఆలోచన్లో పడింది. నిజమే ఆయనలో ఆయన  ఆలోచిస్తూ ఒంటరిగా కుర్చోవడం ఆమెకి తెలుసు. కానీ ఆ ఆకారం లో విచారం కనిపించదు. ఏదో శోధన, అన్వేషణ కనిపిస్తుంది.  ఉదయాలు, సాయంకాలాలూ  ఆరుబయట పడక్కుర్చీ లో  పడుకుని కనిపిస్తుంటాడు. లేదా, తూర్పు వైపుకు తిరిగి దూరం గా కనిపించే సముద్రాన్ని చూస్తూ వుండిపోతాడు. అలా గంటల తరబడి.  రాత్రంతా గదిలో  లైట్ వెలుగుతూనే వుంటుంది. సూర్యోదయం కాకముందే లేచి వాకింగ్ కెళ్ళొస్తాడు. కొన్ని సార్లు బయటనించి వస్తూ రెండు చేతుల్లో  బరువైన సంచీలను  మోసుకొస్తుంటాడు.  మరో విషయం. –  ఈయన వాహనం సైకిలు.  దీని  మీద వెళ్ళి రావడం చోద్యమనిపిస్తుంది. మనిషి చూస్తే జమిందార్ లా కనిపిస్తాడు? సైకిల్ ఏమిటో అర్ధం కాదు.

మొత్తానికి ఆమె మెదడు అనే  స్క్రీన్ మీద  గడ్డపాయనకి ఒక ఫోటో ఫ్రెం కట్టేసింది. అందులో ఆయన –    వాలు కుర్చీ లో పడుకుని, కాళ్ళేమో స్టూల్ మీద జాచిపెట్టుకుని, పుస్తకం లో ముఖం దూర్చేసుకునుంటాడు.  అదే స్టిల్ ఫోటో గ్రాఫ్  అయింది. ఐతే,  ఆ ఫోటో ఒక సజీవ చిత్రమౌతుందని ఆమె అప్పుడు అనుకోలేదు. అస్సలు ఊహించనైనా ఊహించలేదు. ఎందుకంటే – గడ్డపాయన మీద ఆమెకి సదభిప్రాయం లేదు కనక.

వైశాఖ పౌర్ణమి నాడు  – మొగుణ్ణి తీసుకుని మేడ మీదకెళ్ళిందా!, ఎదురుగా ఆయనే ప్రత్యక్షం.   చేతిలో గ్లాసు పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ, నింపాదిగా సిప్ చేస్తూ,  ఒక దివ్యామృతాన్ని చుక్కచుక్క గా సేవిస్తున్నవాడిలా అగుపించాడు.  నాట్య శాస్త్రం లో నేర్పని పాదాల కదలికలోని అందమేమో వుంది ఆ షికారు నడకలో. `ఈయన అద్దె కట్టేది ఇంటికికాదు, ఆరుబయట బ్రతికేందుకు` అనుకుంటూ మొగుడితో చెప్పింది – రహస్యంగా! – “ఆయనే గడ్డపాయన  ..చూడండి..చూడండి” అంటూ!

అతను ఎప్పట్లానే “ ఊ…” అన్నాడు.

ఆమెనింకా ఆశ్చర్య పరిచిన విషయమేమిటంటే.. మొన్న మిట్ట మధ్యాహ్నం టీవీ సీరియల్ లో నిమగ్నమై వుంటే.. హఠాత్తుగా ఆకాశం నల్లమబ్బేసుకొచ్చింది. క్షణాల్లో చీకటిపడిపోయింది.  చినుకు మొదలౌతుంటే మేడ మీద కి పరిగెత్తింది. ఆరేసిన దుప్పట్లు  తేవడానికని. అంతలోనే వర్షం -ఆగకుండా  గుమ్మరించేసింది. అలవాటుగా అటు చూస్తే…. గడ్డపాయన వానలో చిందులేస్తూ  కనిపించాడు.   చిన్న పిల్లాడిలా  రెండు చేతులూ బార్లా జాచి, కళ్ళు మూసుకుని వర్షంలో తడుస్తూ   స్టైల్ గా   గిరగిరా తిరుగుతున్నాడు. తనలో తను నవ్వుకుంటూ,  పరవశించిపోతున్నాడు.

ఆ దృశ్యానికి నవ్వొచ్చింది ఆమెకి.అంతకంటేనూ, చిత్రమేసింది. ‘ఈయనింత  పసివాడా!! ’ అని విస్మయం కల్గింది.

ప్రతి మనిషిలోనూ ఒక పసివాడు దాగుంటాడు.  ప్రకృతి అందాలని  చూసినప్పుడో , సృష్టికి  ప్రతినిధి అయిన స్త్రీని చూసినప్పుడో పసివాడిలా కేరింతలాడ్తాడు. గడ్డపాయన కూడా అంతే అన్న  సంగతి ఆమెకి తెలీదు.

గబగబా ఇంట్లొకొచ్చి పొడి బట్టల్లోకి మారి, టీ కాచుకోడానికని స్టవ్ వెలిగిస్తుంటే, బుర్రలో లైట్ వెలిగినట్టు శ్రీకాంత్  మాటలు మనసులో వెలిగాయి. ఒకసారి వెళ్ళి మాట్లాడి రారాదూ అని. వెంటనే మరో కప్పు టీ తయారు చేసి, ఫ్లాస్కులో పోసింది. గొడుగు తీసుకుని, ఇంటికి తాళం వేసి, ఎదురింటి గడ్డపాయనింటికి బయల్దేరింది శైలజ. వర్షం జోరు తగ్గినా,  చినుకు మందంగా రాలుతూనే వుంది.

మేడ మెట్లెక్కుతూ ఆమె ఊహించింది. గడ్డపాయన డాన్స్ చేస్తూ కనిపిస్తాడని.  కానీ, ఆయనక్కడ  కనిపించలేదు.

ముందుగది తలుపులు తీసే వున్నాయి.  తెల్లటి లాల్చీ పైజమా లో గడ్డపాయన ఇందాక తను చూసిన చంటి వాడులా   లేడు. ఎంతో హుందాగా, పెద్ద మనిషి లా కనిపిస్తున్నాడు. తలొంచుకుని టవ ల్  తో తల తుడుచుకుంటున్న వాడు కాస్తా – తలుపు మీద చిటికల  శబ్దం వినిపించడంతో తలతిప్పి చూసాడు.

 

“నేనే”- అన్నట్టు చూసి, “ లోపలకి రావచ్చాండీ?” అని అడిగింది  నవ్వుతో.

ఆయన కనీసం ‘మీరా’ అన్నట్టు గా కూడా చూళ్ళేదు.   “రండి” అంటూ ప్లాస్టిక్ కుర్చీ చూపించాడు – కుర్చోమన్నట్టు.

మన కోసం మనింటికెవరైనా వస్తే..ఎలా స్వాగతిస్తాం? వీరభద్రపళ్ళెరమంత మొహంతో! చాటంత నవ్వుతో…” ‘అయ్ బాబోయ్..మీరే!?..ఏమిటి నా మీదిలా దయ పుట్టింది..? ఏమి నాభాగ్యం అంటూనో నానా హడావుడి పడిపోతాం. ఈయనేమిటీ..ఎక్స్ ప్రెషెన్ లెస్ లుక్ ఇచ్చాడు?

‘ఆ! పోనీయి.’  ఈయనేమైనా నా మేనమామ కొడుకా? మేనత్త మొగుడా? రాకపోకలు సాగించడానికి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ విజిట్ ఔతుంది అంతే గా.’ అని సముదాయించుకున్నాక మనసు స్థిమిత పడింది. మాట పెగిలింది.

“ఒకసారి వచ్చి పరిచయం చేసుకుంటే  బావుంటుందని  వచ్చానండి. బయట వాన గా వుంది కదానీ,  టీ చేసి తీసుకొచ్చాను..మీ కోసం..” – ‘మీ కోసం’ అనే మాటని నొక్కి పెట్టి అంటూ –  ఆయన ముఖం లోకి చూసింది. విప్పారుతుందా లేదా అని.

ఊహు. ఆయనేం మాట్లాడ్లేదు. నిశ్శబ్దం గా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

ఫ్లాస్క్ ని  టీ పాయ్  మీద పెడుతూ..’ఇద్దరికీ కలిపి తెచ్చాన్లేండి. కలిసి తాగుదామని…” అంటూ మళ్ళి ముఖం లోకి  చూసింది. ఎందుకో  నవ్వాడు. కాస్త చిరు శబ్దం చేస్తూ.  నవ్వు బాగుంది.  కానీ, అది నిలదీయడం నచ్చలేదు.  రెండు స్టేట్మెంట్స్ లో ఏది నిజం అని అడుగుతున్నట్టుంది .

నోరూరుకోదు. నిజాలు వాగేంత వరకు. ఏం చేస్తాం? పుట్టుకతో వచ్చిన బుధ్ధులంటారు ఇదే మరి.

ఆయన కప్పులు తేవడానికి  లోపలకెళ్ళాడు.

ఇంటిని  నలువైపులా పరిశీలిస్తున్న  ఆ నిఘా కళ్ళకి టేబుల్ మీద లాంప్, పుస్తకాలతో బాటు, కింద పేర్చిన ఖాళీ లిక్కర్ బాటిల్స్ కూడా కనిపించాయి. – హమ్మో, ఇన్ని ఎప్పుడు లాగించేసాడో!

ఈయన సంచులతో సైకిల్ మీద మోసుకొచ్చే బరువులు ఇవన్నమాట!..

అప్పటికే గడ్డపాయన మీదున్న తేలిక అభిప్రాయం మరింత బలపడింది. ‘బాడ్ అన్న మాట..’అనుకుంది.

ఆయనొచ్చి,  కప్పులు అందించి,  ఎదురుగా కుర్చున్నాడు.

ఆమేం మాట్లాడకుండా   టీ వొంపి,  ప్లాస్కు పక్కన పెట్టి,  చూసే సరికి ఆయన అప్పటికే తన కప్  తీసుకుని, సిప్ చేసేస్తు కనిపించాడు. రెండు గుటకలేసాక మాట్లాడాడు. “మీరు నన్ను చూడ్డానికే వచ్చారు. నాకు తెలుసు ఆ సంగతి” అన్నాడు.

ఆమె ఉలిక్కిపడింది  చూసింది. –  ఎలా తెలుసన్నట్టు.

“టీ కోసమే ఐతే, నన్ను మీ ఇంటికే పిలిచేవారు కదా?” అన్నాడు చతురోక్తిగా.“ టీ బావుందని పొగడటం, థాంక్స్ చెప్పడం, మళ్ళీ వస్తారు కదూ అనడం వంటి మాటలు నా నించి ఆశించకండి. నాకు అలాటి వన్నీ తెలీదు.” హెచ్చరిక గా చెప్పాడు.

గురువు కి మైండ్ రీడింగ్ వచ్చనుకుంటా..చదివేస్తున్నాడు తనని. పట్టుబడకూడదనుకుంటూ, పైకి మాత్రం డాంబికం గా కనిపించడం కోసం కాలు మీద కాలేసుకుని అడిగింది. “నేనేమీ ఆశించడం లేదండీ.  కానీ, మనుషుల మధ్య ఆ మాత్రపు కనీస మర్యాదలు వుండాలి కదా?”

“అవసరం లేదు”ఖచ్చితం గా వుందా స్వరం. మనిషి మాత్రం చాలా కూల్ గా కదలకుండా  ‘అవసరాల కంటే ముఖ్యమైనది మరొకటి వుండాలి.”

‘నీ మొహంలే! నీకు ఇలాటి  సెంటిమెంట్స్ లేవు  కాబట్టే పెళ్ళి కాలేదు. ఎవర్తి చేసుకుంటుంది మరి ఈ ముఖాన్ని’? అలా అనుకోగానే మనసులో రేగిన కోపం అణిగింది.  –  కాస్త చల్లారాక, అంది. – “ పోచమ్మ మీ గురించి చెబుతుంటుంది. చాలా మంచి వాడమ్మా అని..’ ఆ మాటలకి ఉబ్బి పోతాడనుకుంది కానీ, ఆయనేం పొంగిపోలేదు. సరి కదా పైగా  – “పొరబడిందేమోనండి.. నేనంత మంచి వాణ్ణి కాదు ..” అంటూ మళ్ళీ నవ్వాడు.

వొళ్ళు మండింది శైలజకి –  “ అంటే ఎదుటి వాళ్ళు ఏదంటే అది కాదని వాదించడమే  నేర్పుతుందాండీ మీ బుక్ రీడింగ్..?” అంది ఉక్రోషం గా.

ఆయన దెబ్బ తిన్నట్టు చూస్తాడనుకున్న ఆశ కూడా నిరాశే అయింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు గడ్డపాయన అదే నవ్వుతో. “ మనిషి హాయిగా బ్రతకడానికి ముందు కొన్ని సూత్రాల్ని మనం గట్ఠిగా నమ్మి పాటించాలి. అందులో మొదటిది – ఎదుటి వారు ఎలా ప్రవర్తించినా, మనం షాక్ అవ్వకూడదు.”

ఖంగు తిన్న ఆమె  ‘గడ్డపోడు అంటోంది తననే’అని గ్రహించి చూపులు తిప్పుకుంది.

ఆమె ఇబ్బందిని గ్రహించి మావూలు సంభాషణ లోకి  దిగాడు. “ఏం చదువుకున్నారు  మీరు?” అని అడుగుతూ.

ఆమె చెప్పింది. ఇంకా తన భర్త గురించి, అతను చేస్తున్న జాబ్ గురించి,   తను జూనియర్ లెక్చరర్ టీచర్ గా పనిచేస్తున్న విషయం, ఎండాకాలం శెలవులు, తిరిగొచ్చిన సొంతూరు..  అంతా గడ గడా చెప్పేసి ఆగింది. కొంచెం ధైర్యం రావడం తో. “మీరు? మీరేం చేస్తుంటారు?” అడిగింది ఆసక్తిగా.

“ఏమీ చేయను. ప్రస్తుతానికి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను..” అంటూ ఖాళీ కప్పుని టీపాయి మీద పెట్టి, రెండు చేతులూ తల వెనక్కి పెట్టుకున్నాడు.

“మీ ఆవిడ..” అనే లోపే మాటలని ఆపేస్తూ అన్నాడు. “నేను చెప్పను అనడానికి ముందు మీరు అడగకూడదు అని అంటాను. ఎందుకంటే – నాతో మాట్లాడ్డానికి  వ్యక్తిగత  వివరాలు ఒక బయోడటా కాకూడదు. మా ఆవిడ లేకపోయినా మా ఇంటికి వచ్చారు కదా? ఆవిడున్నా లేకపోయినా నేను ఇలానే మాట్లాడతా మీతో. నాకు పెళ్ళైందంటే మీరు సేఫ్ అనుకుంటున్నారా? కాకపోతే ఒంటరిగ వెళ్లడం ప్రమాదమనుకోవడం కూడా పొరబాటే..కదూ? లేకపోతే మీరు వచ్చే వారు కాదు గా? “

“అంటె, వివాహం మనిషికి విలువని భద్రతనిస్తుందంటే కాదంటారా?..”

“కాదనను. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని  బతికిపోవడం తప్పంటాను. మనిషి లోని హీన సంస్కారాలని, బలహీనతల్ని ఉన్నతంగా   కాపాడే ముసుగు  వ్యవస్థలు –  ఎంత సాంప్రదాయమైనవైనా వాట్ని తొలగించేయాల్సిందే సమాజం నించి! కాదంటారా?”

ఆమె తలొంచుకుంది.

“మీరు వివాహిత స్త్రీ అని మీ మీద నాకు కోర్కె కలగకూడదన్న రూలేం వుండదు. ముఖ్యంగా ఇలాటి బలమైన బలహీన క్షణాల్లో” అనుకోని ఆయన మాటలకు హడలిపోతూ చూసింది.‘హవ్వ’అనుకుంటూ  పెదాల మీద అరచేయి కప్పేసుకుంది. పెద్దవైన ఆ కళ్ళల్లో భయాన్ని చూసి ఆయన ఫక్కున నవ్వాడు. “నేను మీ గురించి చెప్పడం లేదు. అందుకు వివాహం అడ్డు రాదని చెప్పడం కొసం. అంతే. నేను జరగనిది మాట్లాడటం లేదు. ఇవాళో నిన్నో జరిగింది కూడా కాదు. రెండు యుగాల కిందటి మాటే చెబుతున్నా.”

ఆమె కొద్దిగా తేరుకుని అడిగింది. – “మీరు రైటరా?” అని.

“లేదండి.  ఎందుకలా అడిగారు?”

“ఇన్ని గుట్టల పుస్తకాలేసుకుని కూర్చుంటే!..”

“రచయితలు ఐతేనే  పుస్తకాలు చదవాలని లేదు…”

“మరి ఇన్ని చదివి ఏం చేస్తారు?”

“నన్ను నేను తెలుసుకుంటుంటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటాను.  నా పాత్ర పోషించడంలోని నైపుణ్యాన్ని కనుగొం టాను.  ”

“దాని వల్ల నటిచడం బాగా తెలుస్తుందంటారా? “ – వ్యగ్యం ధ్వనించేలా బిగ్గరగా నవ్వింది. కావాలనే.

“కాదు.  నటించకూడదని తెలుస్తుంది. జీవితం జీవించడం కోసమని  నేర్పుతుంది. నిన్ను నువ్వు అర్ధంచేసుకుంటూ సంతోషంగా..శాంతిగా..బ్రతకడం కి మించిన పరమార్ధం ఏవిటో అనుభవంలోకి తెచ్చిస్తుంది. ”

“ఏవిటో! మీరు మాట్లాడే ఒక్క ముక్కా నాకర్ధం కావడం లేదు..” పెదవి పెదవి విరిచింది.

“మీ ఇంట్లో ఎవరు సుపీరియర్?

“ఖచ్చితం గా మా ఆయనే..”

“ఐతే, ఐతే ఆయనకు కాస్త తగ్గి వుంటారన్నమాట కదూ? “

“ చస్తే తగ్గి వుండను.” – ఆలోచించకుండా గభాల్న జవాబిచ్చేసింది.

“ఐతే మీరే కదా ఇంటికి సీనియరు, సుపీరియర రూ? కానీ,  పైకి చెప్పరు. కదూ?”

ఆమె గబుక్కున తలొంచేసుకుంది.

“మీ ఆయన మీకంటే ఆర్ధికంగా ఎక్కువ స్థాయిలో వున్నాడని ప్రేమిస్తె అది ఆర్ధిక సంబంధమౌతుంది. ఎంత సంపాదిస్తె నాకేం లెక్ఖా? నేను పెళ్ళాన్ని. అని ధిక్కరిస్తే అది అధికారమౌతుంది. సీత లా అనుసరిస్తే అది బానిసత్వమౌతోంది. సత్య భామలా ముడుచుకుపోతే  భర్తని వొదులుకోవాల్సి వస్తుంది.  ఇంతకీ మీ పాత్ర పోషణ లో లోపాలేమైనా వున్నాయేమో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా?”

“లేదు. అవసరం లేదనుకుంటున్నా..”

“వుందనుకుంటున్నాను.  ఒకసారి వెతికి చూడండి.” అంటూ చేతి వాచీ వైపు చూసుకున్నాడు.

అర్ధమైన దాన్లా లేచి నిలబడింది. కానీ, మెదడుకి ఏ సంకేతాలూ చేరడం  లేదు. ఎవరి మాటలకైతే మైండ్ బ్లాక్ అవుతుందో అతనే ఈ గడ్డపాయన అన్నట్టుంది పరిస్థితి.

ఇతరుల మీద మనం ఏర్పరచుకునే హీన మైన అంచనా, తప్పని   స్వయం గా తెలుసుకుంటున్నప్పుడు, ఆ గొప్ప తనాన్ని వెంటనే అంగీకరించనీదు మనసు. ఏదో మాటల గారడీ జరుగుతోందని మభ్యపెట్టుకోకపోతే అహం ఊరుకోదు మరి.

ఆయన్ని చాలా అడిగేయాలి, నీ గొప్పేమిటో  తెలుసుకోవాలి అన్నట్టు వచ్చింది. పక్కింటి బాబాయి గారింటికొచ్చినట్టు. కానీ లుక్ మార్చేసాడేమిటి ఇలా.

రంగుటద్దాలు అలవాటయ్యాక, అవి లేకుండా లోకాన్ని చూడ్డం, చూసి తట్టుకోవడం   చాలా కష్టమైన పని కాదూ!?.

ఆమె బయటకొచ్చి చెప్పులేసుకుంటుంటే అన్నాడు. “ఆగండి. ఇంటికొచ్చిన ఆడపిల్లని ఉత్తి చేతుల్తో పంపకూడదంటారు. …ఇదిగో ఈ పుస్తకం తీసుకెళ్ళండి. కానీ, చదివి వెనక్కి ఇవ్వాలి.” అన్నాడు నవ్వుతూ.

అప్పటికే నవ్వు మర్చిపోయిందాన్లా తయారైంది ముఖం. తిరిగి నవ్విందేమో తెలీదు.

ఒక యంత్రం లా పుస్తకం అందుకుని మొద్దుబారిన  అడుగులతో  ఇంటికొచ్చి పడింది.

ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత…

****

“ప్రశాంత్” మొగుణ్ణి పిలిచింది పేరుతో. ఆ  పిలుపుకి ఉలిక్కిపడి చూసాడు.  ‘ఏమిటీ నన్నే?’ అన్నట్టు.

“ఇలా రా..’ అంటూ దగ్గరికి పిలిచింది. ‘హమ్మో, ఇదేం జోరు?’ ఆశ్చర్య చకితుడౌతూ దగ్గరికి వెళ్ళాడు.

ఆమె చూపులు అతని శరీరానికి కొత్త గా తాకుతున్నాయి. మేనులో గిలిగింతలు పుట్టించేలా..గులాబీలు గుచ్చుకున్నట్టు..

ఆఫీస్ కి తయారై వెళ్తున్న అతనికి ఇదొక ప్రియమైన సందేహ హేల..

దగ్గరగా నిలబడిన  అతని నడుంని రెండు చేతులతో  చుట్టుకుని, గుండెకి హత్తుకుంటూ చెవిలో రహస్యం గా చెప్పింది. ‘ ఈ బ్లూ షర్ట్ లో నువ్వు చాలా హాట్ గా వున్నావ్  మాన్!  రియల్లీ  ముద్దొచ్చేస్తున్నావ్. ఇక నన్నాపలేవ్ నువ్వు. ” అంటూ ముద్దులిచ్చింది. అది కూడా  – అతనికిష్టమైన వెల్లువలో!!

అనుకోని విరజాజుల ఉప్పెన కి  అతను ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు.  పెళ్ళైన ఇన్నేళ్ళ వైవాహిక జీవితం లో జరిగిన మొట్టమొదటి ఈ అద్భుతం – అతన్ని ఆనంద వివశుణ్ణి చేసేసింది. మధుర డోలికలో ఊరేగిపోతోంది మనసు.

నిజానికి ప్రతి మగాడు పెళ్ళయ్యాక – భార్యలోనే ప్రేయసిని కోరుకుంటాడు. భార్యే ప్రియురాలైన భర్తకి జీవితం ఒక పంచభక్ష్య పరమాన్నం. ఆమె  కితాబు కి అతనా క్షణం లో  అమాంతం నవాబై పోయాడు. సతి  మెచ్చిన ప్రతి మొగుడూ మహరాజు కాక ఇంకేమిటనీ?

హృదయం లోంచి జనియించే ప్రేమ కి మహిమేదో వుంటుంది. అది మనిషిని చిత్తు చేస్తుంది. ఆ అరోమా ఒక స్వర్గం లాటి మత్తు ని ఇస్తుంది. నరం నరం లోనూ ఇంజెక్ట్ అయి, యవ్వనాన్ని ప్రసాదిస్తుంది.

ప్రస్తుతం అతని పరిస్థితి అంత దివ్యం గా వుంది. ఆమెని నిలువునా పెనవేసుకుని కళ్ళు మూసుకుని  అలా వుండిపోయాడు. దాంపత్యం లో శరీరాలు పాతపడటం అంటూ వుండదు. ప్రేమ వ్యక్తీకరణలు కొత్త గా వున్నంతకాలం!

అతను తేరుకుని కళ్ళు తెరిచి  “ హేయ్, శైలూ….గడ్డపాయన  సైకిల్ మీదెళ్తూ మనల్ని చూసాడు…” బిడియపడిపోతూ చెప్పాడు.

“చూడనీ..సంతోషిస్తాడు. ” అంది.  చేతుల్ని మరింత గా బిగిస్తూ..

**

కాలం గడుస్తున్న కొద్దీ..

శైలజ గడ్డపాయనకి మరింత దగ్గరకి జరిగింది. కాదు . పుస్తకాలు దూరాన్ని జరిపాయి. చలం, కుటుంబరావు, శ్రీశ్రీ, రావి శాస్త్రి, తిలక్, లత, బీనాదేవి తెలుగు సాహిత్యం లోంచి మరింత ముందుకు నడిచొచ్చింది. … కాఫ్కా – మెటామార్ఫాసిస్  దాటి,   లియో  స్ట్రాస్ సిధ్ధంతాల పై విమర్శలు సయితం చదివి తెలుసు కుంటోంది.

షేక్ ష్పియర్  కంటే మిల్టన్ ఎలా , ఎందుకు గొప్పవాడు కాదో  ఆయనతో తగవులాడుతుంది.

ఏ కొత్త విషయమైనా వాదిస్తూ వుంటుంది. ఆయన వివరిస్తూ వుంటాడు.

మాటల మధ్య లో  ఆయన  గ్లాసందుకుని రంగు ద్రవాన్ని సిప్ చేస్తున్నా – ఇప్పుడామెకి  – ఆ గడ్డపాయన  తాగుబోతులా కనిపించడం మానేశాడు.

ఆయననే కాదు. ఎవ్వర్లోనూ,   లోపాలు కనిపించడం మానేసాయి. మనుషుల్లో అన్నీ మంచి గుణాలే వుండవు. బలహీనతలూవుంటాయి. అయితే వ్యక్తుల్ని వీక్నెసులతో  సహా  స్వీకరించడం వల్ల కలిగే ఆనందం ఎలాంటిదో  ఆమెకి పూర్తిగా అర్ధమైంది. అందులో ఆరితేరిన విద్యనభ్యసించింది.

నడిచే విశ్వవిద్యాలయాల వంటి వ్యక్తులు జీవితంలో తారసపడటం  ఒక అరుదైన అదృష్టం. వాళ్ళు – ఏ సిలబస్ లో చేర్చని  అతి విలువైన విషయాలు బోధిస్తుంటారు.

*****

ఆ రోజు ప్రిన్సిపాల్ పిలిచి -‘స్టూడెంట్స్ కి మీరు ఇస్తున్న ఆత్మ విశ్వాసం ఎనలేనిదని కమిటీ గుర్తించింది శైలజా!  ఇకనించి రోజూ అన్ని తరగతుల వారికీ మీ ప్రత్యేక క్లాసులు తప్పని సరి అని నిబంధన చేసింది. మీ సాలరీ కూడా రెట్టింపైందని చెప్పడానికి సంతోషంగా వుంది..” కంగ్రాట్స్’’ – అభినందింస్తూ చేయందించింది.

అలవి కాని ఆనందం – ఎగసిన కెరటమై కళ్ళల్లోకి ఉబికింది. చిత్రం గా పెదవులు వొణికాయి.    మనసులోని –    ఫోటో ఫ్రేం లోంచి  గడ్డపాయన నవ్వుతూ కనిపించాడు.

‘  అది ఎలాటి ఉద్వేగపు భావం కానీయి, ఆ క్షణం – నీ ఆధీనంలో వున్నప్పుడు నువ్వు మరింత హుందాగా కనిపిస్తావ్. ఎందరికో మార్గ దర్శకురాలివౌతావ్.  ” గడ్డపాయన   చెవిలోకొచ్చి చెబుతున్నట్టే వుంది.

మౌనంగా మనసులోనే కైమోడ్పులిడింది.

ఒక విజ్ఞానవంతుణ్ణి  చదవడం అంటే – కొన్ని వందల  గ్రంధాలను శోధించినట్టు!!

******

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. g b sastry says:

    వడ్డెరచండీ దాసు గారి హిమజ్వాలమళ్ళి చదువుతున్న అనుభూతికి ఒక బెత్తెడు తక్కువ అనుభూతి కలిగింది

    • ఆర్.దమయంతి. says:

      ఎంతటి అత్యంత ద్భుతమైన పోలిక!
      చెప్పలేనంత ఆనందం కలిగిందండి..
      అంతటి అనుభూతి పొందడం లో బెత్తెడు తక్కువైతేనేం కానీ, : -) ఈ కథ మీకు వడ్డెర చండీదాస్ ని జ్ఞప్తికి తీసుకొచ్చిందంటేనే..నాకు మహదానందం గా వుంది.
      చాలా చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను జి.బి. శాస్త్రి గారు.
      శుభాభివందనములతో..

  2. ప్రతి జీవితం లో ఒక గడ్డపాయన ఉంటె బాగుండు , కాకుంటే తాగ కుండా . మంచి కథ

  3. ఆర్.దమయంతి. says:

    :-) తాగనీయండీ మనకేమీ?
    హాని చేయదు పాపం!
    ధన్యవాదాలండీ, మీకు కథ నచ్చినందుకు, స్పందన తెలియచేసినందుకు.

  4. Sharada Sivapurapu says:

    దమయంతి గారూ ఎంతో అద్భుతమీన కధనం. ఈ కధతో మీ అభిమానినైపోయా. “దాంపత్యం లో శరీరాలు పాతపడటం అంటూ వుండదు. ప్రేమ వ్యక్తీకరణలు కొత్త గా వున్నంతకాలం!” ఈ వాక్యం చాలా నచ్చింది.

  5. ఆర్.దమయంతి. says:

    శారద గారు!
    నాకెంత ఆనందమైందో, మిమ్మల్నిలా కలవడం, ప్రశంస నందుకోవడం.
    కథ మీద చక్కని కామెంట్ కి చాలా ధన్యవాదాలండీ!
    దసరా శుభాకాంక్షలతో..

Leave a Reply to g b sastry Cancel reply

*