ఆకలి (1973 – 1991)

 

 

తొలిసూరి  కానుపని మా అవ్వను వాళ్ల పెద్ద మేనమామ నర్సయ్యచ్చి వాళ్ళ తల్లిగారింటికి కాన్పుకు తీస్కపోయిండట. అప్పుడు నేను మా అవ్వ కడుపులున్న. మా అవ్వ తల్లిగారూరు కాజీపేట జంక్షన్ పక్కన శిన్న పల్లెటూరు. మా అవ్వకు ముగ్గురు మేనమామలు. మా అవ్వ చిన్నగున్నప్పుడే మా అవ్వోళ్ళ తల్లి సచ్చిపోయిందట. అయ్యో  తల్లి లేని పిల్లాయే అందునా అక్క బిడ్డాయె అని మా అవ్వను మేనమామలు, వాళ్ళ భార్యలు మస్తు గార్వంగ సూసుకునేదట. మా అవ్వోళ్ళ పెద్ద మేనమామ నర్సయ్య ఇంట్ల 1973ల మా అవ్వ పసిద్దకాంగనె (డెలివరి) నేను పుట్టిన్నట. వెంటనే బాపనాయినను పిలుస్తే ఆయనచ్చి పిలగాడు పుట్టిన గడియ మంచిదిగాదు. మూడొద్దులు (3 రోజులు ) తల్లి మొఖం పిలగాడు, పిలగాని మొఖం తల్లి సూడద్దు, సూత్తె మంచి జరుగదన్నడట. మావోళ్ళు భయపడి నన్నో అర్రల, మా అవ్వనో అర్రలపండుకోబెట్టిండ్లట. నేను ఆకలయి పాలకోసం మస్తు ఏడిషేదట. ఎంత ఊకుంచిన ఊకోకపోయేదట. ఏడిషి ఏడిషి ఊపిరి పట్టేటోన్నట. మా అవ్వోళ్ల మేనమామలు వాళ్ల భార్యలు ఊళ్ళెకు బోయి ఆవుపాలు, మేకపాలు, బర్రె పాలు ఏవ్వి దొరికితే అవ్వి తెచ్చి నాకు తాపిచ్చెటోళ్ళట. అగో.. అప్పడిసంది నా ఎంటబడ్డది ఈ ఆకలి…

మాది తాలుకా హెడ్‌క్వాటర్‌కు ఓ ఐదు కిలోమీటర్ల దూరంల వుండే చిన్న పల్లెటూరు. మేము కుమ్మరోళ్ళం. కూటికి గతిలేనోళ్ళం. మూడు పూటల కడుపునిండ బువ్వ తినే ఔషత్ లేనోళ్ళం. మాకు రాగడి మట్టిగోడల్తోని కట్టిన ఒక గడ్డి గుడిసె ఒక కుమ్మరి గూనపెంక ఇండ్లుండేటియి. నాకు ఏడెనమిది సంవత్సరాల వయసచ్చి కొంచెం తెలివచ్చేసరికి మా తాత మా ఇంటిముందు సాయబాన్ల కూసోని కుండలు జేస్తుండెటోడు. మా ఇంటి ముందు చిన్న “కుంట” వుండేది. ఎడ్లబండి కట్టుకోని కుంట్లకుబోయి తట్టతోని రాగడి మట్టి ఎత్తి బండి నింపుకోనచ్చి, మట్టిపెళ్ళలను ఎండల  ఎండబెట్టి, ఎండినక్క ఆ పెళ్ళలను పలుగగొట్టిమెత్తగ పొశిపొశి జేసి తరువాత నీళ్ళు బోసి నానబెట్టి, తొక్కి తొక్కి మెత్తగ గ్రీస్ లెక్క జేసి మట్టిముద్దను “సారె”మీద బెట్టి కోలకట్టెతోని సారెను తిప్పి , పేర్పులు, అటికెలు, ఎసులలు, మంచి నీళ్ల కుండలు, ఐరేని కుండలు, కూర కంచుల్లు, కూరాడు కుండలు, ముంతలు, దొంతులు, బోనం కుండలు, పటువలు, గురుగులు, దీపంతలు జేసి “వాము”ల కాలబెట్టి అమ్మెటోడు. పెయ్యంత మట్టి బూసుకొని కాయకష్టం జేషినా ఈ కులం పనిల అర్కత్ లేదు, బర్కత్ లేదని ఒక్క శిత్తం జేసుకోని కుండలు వానుడు ఇడిషిబెట్టి వున్న రెండెకరాల బూమిల వ్యవసాయం జేసుడు షురువు జేషిండు.

మా నాయినను ఊళ్ళె ఓ పటేలుకు  జీతముంచిండు. ఆ పటేళోళ్లు మా నాయినకు జీతం కింద మక్కజొన్నలు కుంచాలతోని కొలిశి ఇచ్చెటోళ్ళు. అప్పుడు మా ఇంట్ల పొద్దున, రాత్రి గడుక వండెటోళ్ళు. పండుగలప్పుడు యాటపోగు తెచ్చుకున్నప్పుడు లేకపోతే ఇంటికి ఎవ్వలన్న సుట్టాలచ్చినప్పుడు బువ్వ వండేది. ఆ పూట నేను మస్తు కడుపునిండ తినెటోణ్ణి. తతిమ్మరోజులు సగం సగం తిండే. మస్తు ఆకలయ్యేది. ఆ మక్కజొన్న గడుక పాడుగాను మూడుపూటల అదే తినేవరకు అరుగక శెంబడుక (విరేచనాలు) పెట్టేది. గడుక పెద్దగ రుశుండకపోయేది కాని తినక తప్పకపోయేది. తినకపోతే ముడ్డెండుతది. ఆకలిగదా ఆకలి.. అందుకే పెద్దోళ్ళు అన్నట్టున్నది “ఆకలి రుశెరుగది, నిద్ర సుఖమెరుగది” అని.

మక్కజొన్న గడుకల ఇంతంత పెరుగు బోసుకొని పల్చగ పిసుక్కోని పక్కకింత మామిడికాయ తొక్కేసుకోని తింటే మంచిగనె అరిగేది కని పెరుగు కొందమంటే పైసలుండకపోయేది. పైసలున్నప్పుడు పెరుగు దొరుకకపోయేది. ఎందుకంటే ఏగిలిబారంగనె లేసి పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు గంపలల్ల పెట్టుకోని మండలంకు బోయి అన్ని అమ్ముకొని వచ్చేటోళ్ళు మా ఊరోళ్ళందరు. బారతదేశంల పల్లెల పరిస్థితి గమ్మతిగుంటది. ఒంట్లె బొక్కలరిగెదాక, మాంసం కరిగెదాక కాయకష్టం జేసి పండిచ్చిన పంటలను అన్నిటిని తీస్కపోయి అడ్డికి పావుశేరు పట్నపోల్ల దినాలకు పెట్టత్తరు కని పండిచ్చినవాళ్లు కూడా తినాలె. వాళ్లది కూడ పానమే, వాళ్లు గూడ ఆరోగ్యంగా వుండాలే అని అస్సలే ఆలోసించరు. మళ్ల రోగమత్తె హాస్పటలల్ల శెరీకయ్యి బాగు శేయించుకోనికి అప్పులు మస్తు జేస్తరు. మంచి తిండి తినండ్లయ్యా నాయిన అసలు రోగమే రాదు అంటే అరికీస్ ఇనరు..

యాభై సంవత్సరాలకె అస్థిపంజరాల లెక్క అయితాండ్లుపల్లెజనం కని అదే అరవై ఏండ్ల చిరంజీవి తెల్లబూరుకు కర్రె రంగేసుకోని 150వ సిన్మా సురువు జేషిండు. పల్లెటూరోళ్ళు పండిచ్చుడు బాగనే నేర్సుకున్నరు. ఇగ పండిచ్చినదాన్ని తినుడు కూడ అలవాటు శేస్కోవాలె.

అట్ల మూడు, నాలుగు ఏండ్లు మక్కజొన్న గడుక అరిగోసబెట్టి నన్ను ఆకలితోని సంపింది. తరువాత మా ఇంట్ల పొద్దున మక్కజొన్న గడుక, రాత్రి బువ్వ వండుడు సురువు జేషిండ్లు. మా నాయినమ్మ ఒక పెద్ద కురాడు కుండ బెట్టి దాంట్లె గంజిని బోషి పులుసబెట్టి “కలి” తయారుజేశేది. పెద్ద బువ్వ కుండల బియ్యంబోసి ఆ “కలి”ని బొశి బువ్వ వండేది. ఎసరు వచ్చి బియ్యం కుతకుత వుడుకుతాంటె పలుకు మీద వున్నప్పుడే సన్నటి, గుండ్రటి శిల్లులు శిల్లులున్న వెదురుబద్దల “శిబ్బి”ని కొంచెం వంచి బువ్వకుండ మూతిలకెళ్లి లోపలికి సొర్రిచ్చి బువ్వకుండను తలకిందులు జేశి గంజి వారబెట్టేది. కొంచెంశేపు వుంచంగనే గంజి కిందబెట్టిన గిన్నెలకు కారేది. ఈ కారిన గంజి వేడి ఆవిరితోని బువ్వ  “ఉమ్మగిల్లేది” కారిన గంజిని మళ్ళా తీస్కపోయి కొంత కలిల కలిపేది. మిగిలిన గంజిల మేము ఉప్పు ఏసుకోని తాగేది. అట్ల కలితోని వండిన బువ్వ పుల్లగ గుమగుమ వాసనచ్చేది. అదో శిత్రమైన పుల్లని పరిమళం. ఆ పరిమళాన్ని నా జిందగీబర్ నేను మల్లెక్కడ పీల్చలే. అది ప్రపంచ వింతలల్ల ఎనమిదో వింత. సచ్చి ఏ సర్గంల వున్నదో  మా ముసల్ది ( నాయినమ్మ). ఆ వాసనతోని సంపేది. ఆ వాసన పీల్వంగనే ఆకలి కొరివి దయ్యమై అదాట్న మీద దునికేది. జెల్ది బువ్వెయ్యె ముసల్దాన అంటె “ఎహె పులిగండు గుంజిగ బువ్వ ఉమగిల్లద్దారా అగడుబడ్డ పోచమ్మ మొగుణ్ణి మింగినట్టు” శేత్తవేందిరా అరుగుడు పేగు వున్నదా నీకు అని తిట్టేది నవ్వుకుంట. రొండు మూడు రోజులున్నా గూడ ఆ బువ్వ పాశిపోయేది గాదు. మళ్ళా మస్తు పుల్లలు, పుల్లలుండేది. ఈ హీరోయిన్ సుహాసిని రోజు T.V. యాడ్‌ల  శెప్పుతాంటదిగదా.. లలిత బ్రాండ్ రైస్ .. సన్నగా సమానంగా 48 గంటలపాటు ఫ్రెష్‌గా వుంటది అని. కని మా ముసల్ది కుండల వండిన కలిబువ్వ ముందు ఈ లలిత బ్రాండ్ రైస్ బలాదూరె. బల్లగుద్ది శెప్తా. పొద్దుందాక మక్కజొన్న గడుక తినలేక ఆకలికి సచ్చినాగాని రాత్రికి బువ్వ మాత్రం కమ్ముగ తినేది.

మా ఊరిబళ్ళె నాలుగో తరగతిదాకనే వుండేది. నాలుగు ప్యాసై అయిదో క్లాసు సదువనీకి మండలం హెడ్‌క్వార్టర్ స్కూళ్ళ శేరికయిన. రోజు పొద్దుగాల లేశి పిడిక బొగ్గుతోనన్న, యాపపుల్లతోనన్న లేకపోతే ఇటుకపొడి పరంతోనన్న పండ్లు తోముకొని,  ఒత్తుల వేడినీళ్లతోని పెయ్యి కడుక్కోని గడుకుంటె గడుక, బువ్వుంటె బువ్వా ఇంతంత తిని పగటికి సద్దిబెట్టుకొని పోను ఐదు, రాను ఐదు మొత్తం పది కిలోమీటర్లు నడుసుకుంట బోయచ్చి సదువుకునెటోణ్ణి. గడుక వండిన నాడు పగటికి సద్దిపెట్టుకపోయెటోణ్ణిగాదు. ఎందుకంటె బళ్ళె అందరం పగటీలి ఒక్కదగ్గర్నే కూసోని తినేటోళ్ళం. అప్పుడు కడుమ పోరగాండ్లు నా గడుక సూత్తె నా ఇజ్జత్ పోతదని పొద్దటిబడి ఇడిషిబెట్టినంక అరేయ్ నువ్వు సద్ది తెచ్చుకోలేదార అని ఎవ్వలన్న దోస్తుగాండ్లు నన్నడిగితె నేనత్తానప్పటికి మా అవ్వ ఇంకా బువ్వ వండలే. రాత్తిర్ది సలిబువ్వుంటె ఇంత తినచ్చిన అని నేను అబద్ధమాడెటోణ్ణి. దోస్తుగాండ్లు వాళ్ల సద్దిగిన్నె మూతల న పరింత బువ్వేశి ఇంతంత కూర ఏత్తె నేను తినేటోణ్ణి. అట్ల రోజు ఒగలుపెట్టేది. తినాల్నంటె తలకాయ తీశినంత పనయ్యేది. పొద్దటిబడి ఇడిషిబెట్టంగనె ఆ గంటశేపు అటుఇటు తిరిగచ్చెటోణ్ణి. మా కింది కులాలోళ్ళ బతుకులల్ల ఇదో పెద్ద పరేషానున్నది. మా ఇండ్లళ్లకు చెప్పు ఇసిరేత్తె కుండ తలుగకపోవచ్చు కని మాకు రేషం ఎక్కువ. జేబుల శిల్లిగవ్వ లేకపోయిన పెయ్యి మీద అయిమనంగ బట్టలేకపోయిన, ఆత్మాభిమానాన్ని మాత్రం అరికీస్ సంపుకోం. ఒకల మోశేతికింది నీళ్ళు తాగి బతుకం.

బొండిగల పాణం పోయెదాక కొట్లాడతనే వుంటం. కిందబడ్డా, మీదబడ్డా పిడికిలి పైకే లేపుతం. శరం దప్పిన రండ బతుకు మేం బతుకం. మా తాతల తండ్రుల జీన్స్‌లల్లకెళ్ళి ఆ గుణం తబాదాలవుకుంట (ట్రాన్స్‌ఫర్) వస్తాంది. అందుకే మేం ఆర్ధికంగా బలపడుతలేమో ఏమో అనిపిస్తది. మా బడి పక్కనే ఒక సౌండ్‌సెంటర్ వుండేది. అప్పుడు రికాడ్లు వుండేటియి. అవి నల్లగ గుండ్రగ పెద్ద పెద్ద జొన్నరొట్టేలున్నట్టుండేటియి. బయిటికి ఇనబడేటట్టు అక్కడ పాటలేశేటోళ్ళు.  నేను రోజు పగటీలి అక్కడ పాటలు ఇనుకుంట ఆకలి మర్శిపోయెటోణ్ణి. పాటలల్ల శానా బలముంటది, ఎగిరిపిస్తది, దునికిపిస్తది, ఏడిపిస్తది, నవ్విపిస్తది, ఉరికిపిస్తది, ఉద్యమాలు చేపిస్తది, నరాలల్ల రకుతాన్ని మరిగిపిస్తది, ఆకలిని మరిపిస్తది, ఆకలి ఎందుకయితాందో ఎరుక కలిగిపిస్తది. సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనేనేను ఐదు కిలోమీటర్ల చిల్లర నడుసుకుంట బోయెటోణ్ణి. అసలే ఆకలి, అంత దూరం నడువాల్నంటె ఏడుపచ్చేది. మా ఊరి సడుగు (రోడ్డు ) పెద్ద పెద్ద కంకర్రాల్లతోని ఏశిండ్లు. నా కాళ్ళకేమో చెప్పులుండకపోయేది. నడుత్తాంటె నడుత్తాంటె పోట్రవుతు నా కాలు ఏల్లకు ఊకె తాకి గోర్లు లేశిపొయ్యేటియి. రక్తం కారుతాంటె మట్టి సన్నగ శెరిగి మట్టి పరాన్ని దెబ్బమీద పోస్తే దెబ్బకే రక్తం కారుడు ఆగేది. ఎండకాలంల్నయితే మస్తు దూప అయ్యేది. వాగుకాడికి పోంగనే వయ్యిలు పక్కనబెట్టి శెలిమెతోడి నీళ్లూరంగనే వంగి మూతితోని కడుపునిండ తాగేది. ఆ నీళ్లు తేటగ సల్లగ పిర్జిల పెట్టినట్టుండేటియి కని ఇప్పుడు మా వాగుల నీళ్లు తాగుతే మారుమాట్లాడకుంట సచ్చుడే.. ఎందుకంటే సుట్టు పొలాలల్ల శితం ఫెస్టిసైడ్ మందులు కొడుతాండ్లు. అడ్డగోలుగా యూరియా పిండి బస్తాలు సల్లుతాండ్లు. ఆ పొలాలల్ల నీళ్లు వాగులకి వచ్చి కలుత్తాంటయ్.అప్పుడు మందులు వాడుకమే లేకుండె ఏదో అడపాదడపా తప్ప.

ARIF6

ఇగ రోజు ఈ ఆకలి, ఈ నడుసుడు నావల్లగాక మా నాయిన బుష్కోట్ కీస(అంగిజేబు)ల కెల్లి పైసలు ఎత్తుకపోయి పావులబెట్టి హాస్టల్ ఫాం, ఆటాన బెట్టి కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, ఇంకో రూపాయిబెట్టి రెవెన్యూ టిక్కట్లు కొని అన్ని ఫాముల మీద నా వివరాలు నింపి తహసిల్దారుతోని సంతకాలు బెట్టిచ్చి, సోషల్ వెల్ఫర్ ఆఫీసుల ఫాంస్ ఇత్తే మేము కుమ్మరోళ్ళమని నాకు B.C. హాస్టల్ల సీటిచ్చిండ్లు. మా ఇంట్ల “గుమ్మి”ల ఓ పాత ఇనుప సందూగ వుండేది. దాన్ని బయటికి దీసి దాని లోపలున్న “పాశిట్టు” దులిపి ఓ తడిగుడ్డతోని తుడిశి దాంట్లె నా వయ్యిలు, అంగిలాగులు, పండుకునెటప్పుడు కప్పుకునెదానికి ఓ చెద్దరి కిందేసుకునె దానికి ఓ తట్టు పెట్టుకోని B.C  హాస్టల్‌కు పోయిన. హాస్టల్ల పొద్దటి8.30కు , రాత్రి బువ్వ5.30 కు పెడుతరు. సొట్లుబోయిన పల్లాలు బట్టుకోని లైనుకు నిలబడి బువ్వ పట్టుకోని సకిలమ్ముకిలం బెట్టుకోని తినేది. రోజు పొద్దున కందిపప్పన్న, పెసరపప్పన్న, శెనిగెపప్పన్న, మైసూరుపప్పన్న పెట్టేది. పప్పంత నీళ్ళు నీళ్ళు పలుచగ వుండేది. పొద్దున మాపున పచ్చిపులుసు గూడ శేశేది. పచ్చిపులుసు నల్ల శింతపండుతోని శేశేది. కర్రెగ పాడయేది. సూడంగనే “ఒకారం” వచ్చేది. అడిగెటోడులేడు, నుడిగెటోడు లేకుండె.

మా బతుకులు “ఎవ్వనికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తాంది” అన్న బాలగంగాధర్ తిలక్ కవిత లెక్కుండేది. మాకు పొద్దటిబడి మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడిషిబెట్టంగనే నా తోటోళ్ళందరు పోరగాండ్లు వాళ్ళ వాళ్ల ఇండ్లళ్ళకు ఉరికి బువ్వ తినచ్చేది. నాకేమో పగటీలి హాస్టల్ల బువ్వ పెట్టకపోయేది. నాకు మస్తు ఆకలయ్యేది. హాస్టల్ల కొంచెంసేపు కూసోని, లైఫ్‌బాయ్ సబ్బుతోని మొఖం కడుక్కునేది. అప్పుడు నాకు వేరే సబ్బులు తెల్వయి. ఎర్ర లైఫ్‌బాయ్ సబ్బు తప్ప. మళ్లా నాలుగున్నరకు సాయంత్రం బడి ఇడిషిబెట్టంగనే దనదనా ఆకలితోని హాస్టల్‌కు ఉరికచ్చేది. ఓ గంట అటు ఇటు టైమెల్లదీయ్యంగనే 5.30 కు రాత్రి బువ్వ కూరగాయల్తోటి పెట్టేది. పచ్చిపులుసు సాయంత్రం గూడ పోశేది. ఒక స్టీలు “రికాబు”తోని హెడ్ కుక్ పెద్ద అండ ముందటబెట్టుకోని మాకు బువ్వ పెట్టేది. ఆకలిమీద మంటర మంటర దనాదనా తిని సరిపోక “మారు”కు మల్లబోతె బువ్వ పెట్టకపోయేది. సరిపోలే అన్న ఆకలయితాంది ఇంకొంచెం బువ్వ ఎయ్యి అంటే ఏంచెల్లి తెచ్చిపెట్టాలె  మా ఇండ్లల్లకెళ్లి తెచ్చిపెట్టాల్న అని వంటమనిషి మొఖమంత ఖండిచ్చుకుంట గదిరిచ్చిపెట్టేది. అవాజ్ ఎత్తుతే ఏదో వంకతోని వార్డన్‌తోని కొట్టిపిచ్చేది. రాత్రి ఎనమిది గంటలకల్లా సాయంత్రం 5.30 కు తిన్న బువ్వ అరిగిపోయి ఆకలయి రాత్రి నిద్ర పట్టకపోయేది.

రూంలల్ల ఫ్యాన్లులేక దోమలు కుట్టి సంపేటియి. వానకాలం వస్తెనయితె ఆ దోమల బాధ శెప్పవశంగాదు. ఆ గోస శెపుకుంటబోతె ఓ రామాయణం ఓ మహాభారతమె అయితది. మాకు హాస్టల్ల సరైన పోషక విలువలున్న బలమైన తిండి లేక రకరకాల రోగాలచ్చేటియి. అవి తిండిలోపం వల్ల వస్తానయని అప్పుడు మాకు తెల్వది. నోరు,నాలుక, పెదవులు, పెదవుల శెలిమెలల్ల తెల్లగ పూశేది. పలిగేది పుండ్లయేటియి. ఒంట్లె చెటాక్ మాంసం వుండకపోయేది. మాకు ప్రొటీన్ ఫుడ్డు సరిగ్గ దొరకకపోయేది. ఎవన్ని సూశిన బక్కపలుసగ, ఎండుకపోయి, బరిబాతబొక్కల్లెల్లి వాయిలు చెట్ల బరిగెల లెక్క, చిన్నపాటి జామాయిలు చెట్ల లెక్కుండేది. శానామందికి నెత్తి ఎంటికలు వూడిపోయేటియి. మేము నెత్తికి కొబ్బరి నూనె పెట్టుకోకపోయేది. మంచినూనె పెట్టుకునేది. చలికాలంల కాళ్లు రెక్కలు పలుగుతె మంచి నూనెనే రాసుకునెటోళ్ళం. మాయిశ్చరైజర్లా మన్నా. పోరగాండ్లందరు మంచినూనెకు ఎగబడుతాండ్లని కూరలల్ల పోశెదానికి తక్కువబడుతాందని మా వంటమనుషులు మంచినూనెల పసుపు కలిపి ఆ నూనె నెత్తికి రాసుకుంటె పెయ్యికి పూసుకుంటె తెల్ల ఎంటికలు వత్తయని బెదిరిచ్చేది. ఇగ మంచినూనె జోలికి ఒక్కడు పోకపొయ్యేది.

సర్కారు హాస్టల్లల్ల వుండి సదువుకునే పోరగాండ్లమంటే అందరికీ అలుసే. బువ్వ సరిపోతలేదంటె వంటమనుషులు వార్డన్లు బెదిరిచ్చేది. బళ్ళెకుపోతె మాతోనిపాటుగ సదువుకునె బాగ పైసబలుపు వున్న పోరగాండ్లు మమ్ముల అంటిముట్టనట్టు వుండుకుంట చిన్న సూపు సూశేది. ఆఖరికి పంతుళ్ళుగూడ మమ్ముల జిల్లపురుగుల సూశినట్టు సూశేది. “సర్కారు బువ్వ తింటాంటె బాగ బలుపులచ్చినాయిరా” అనుకుంట కొట్టేది, తొడపాశం బెట్టేది. నాకయితే “అసలు బువ్వే సరిపోత లేదురా నాయినా” అని అనాల్ననిపిచ్చేది కని ఎందుకచ్చిన లొల్లి అట్లంటె ఇంక నాలుగు ఎక్కువ సప్పరిత్తడని కుక్కినపేనులెక్క కూసునేది.

హాస్టల్ల వుండి సదువుకునే పోరగాండ్లం మాతోని మేమే దోస్తాన్ జేశేటోళ్ళం. S.C హాస్టల్ల వుండే మాదిగోల్ల సామ్రాట్‌గాడు, సంపత్‌గాడు, మాలోల్ల సురేందర్‌గాడు, B.Cహాస్టల్లవుండే నేను, ముత్రాశోల్ల శీనుగాడు, బెస్తోల్ల రమేశ్‌గాడు, గౌలోళ్ల అశోక్‌గాడు, గొల్లోల్ల బిక్షపతిగాడు, కాపోల్ల భాస్కర్‌గాడు మేమంతా ఒక గ్యాంగ్‌గ వుండెటోళ్ళం. హైస్కూళ్ళ మాజోలికి ఎవడన్న రావాల్నంటె “కాకి నెక్కర్ల” వుచ్చ పోసుకునేది.

 

ఆదివారం వచ్చిందంటె మాశిపోయిన అంగి లాగులు, స్కూలు డ్రెస్సులు పట్టుకోని పొద్దుగాల్నే లేశిపెద్ద కాలువకు పోయెటోళ్ళం. అక్కణ్ణే “బర్రెంక” పుల్లతోణి పండ్లు తోముకోని బట్టలు పిండుకోని తానాలు జేసి వచ్చేటోళ్ళం. అప్పుడు మాకు సబ్బులు కొనుక్కునెదానికి హాస్టల్ల నెలకు 10 రూపాయలు సర్కారు ఇచ్చెది. ఆ పైసలు దాసుకోని ఆదివారం సిన్మాకు పోయెటోళ్ళం. నా శిన్నతనంల సూశిన  సిన్మాలల్ల కమల్‌హాసన్ సత్య (1988), నాయకుడు (1987), నాకు మస్తు నచ్చినయ్. నేనొక్కణ్ణే మళ్లా మళ్ళా బోయి ఆ సిన్మాలు సూశెటోణ్ణి. శనివారం నాడు పొద్దుగూకంగనె చిత్రలహరి సూశేదానికి పోయెటోళ్లం. అంగడి రోడ్డు పక్కన గ్రందాలయం ముందట, దీపక్ ఫోటో స్టూడియోల్లకు ఒక్కలకే అప్పుడు “డిష్ ఆంటేనా” T.V  వుండేది. T.V.ల వారానికో సిన్మాగూడ వచ్చేది. “కోకిలమ్మ” సిన్మా నేను T.Vల సూసుకుంట హీరోగాడు హీరోయిన్ సరితను మోసం జేసినప్పుడు నేను దుఃఖం ఆగక ఏడిసిన.

మేము హాస్టల్ల ఏం తక్కువ 200 మందిమి వుండెటోళ్ళం. అందరం ఒక్క దగ్గర్నె తానాలు జేసుడు, మొఖాలు కడుగుడు. తిన్న పిలేట్లు కడుక్కునేవరకు అక్కడ పెద్ద బురద మడుగు తయారయ్యేది. దాంట్లెకు పందులచ్చి బొర్రేటియి. పందుల పక్కనుంచెల్లి మేము మా పక్కనుంచెల్లి పందులు పొయ్యేటియి. వాటిని మేము మమ్ముల అవ్వి పట్టిచ్చుకోకపోయేటియి.నాకు ఇప్పుడు ఆలోసిస్తే నవ్వస్తది. మమ్ముల సర్కారోల్లు మనుసుల లెక్క గుర్తించకపోతే గుర్తించకపోనీయి. కాని ఆఖరికి పందులు కూడ మమ్ముల మనుషుల లెక్క గుర్తించలె.

ఇట్ల హాస్టల్ల ఆకలి నన్ను ఐదు సంవత్సరాలు సంపింది. ఇంటికాడ వుంటెనేమో నడుసుడు బాధ, ఆ మక్కజొన్న గడుక తినలేక ఆకలి బాధ, హాస్టల్ల వుంటెనేమో మద్యాహ్నం, రాత్రి ఆకలి బాధ, నిద్రబాధలు. ఎనుకకుబోతె నుయ్యి ముందుకుబోతె గొయ్యి లెక్కుండేది బతుకు. కాని హాస్టలే నయ్యమని హాస్టల్లనే వుండేది. బాధాకరమైన విషయమేందంటె ఈ దళిత బహుజనుల బతుకులల్ల కష్టాలకు, కన్నీళ్లకు రొండు రకాల పరిష్కారాలుంటయ్. మళ్లా రొండీట్లల్ల దు:ఖమే వుంటది. కాకపోతె ఒకదాంట్లె ఎక్కువ, ఒకదాంట్లె తక్కువ. ఎటుబడి ఏడుస్తానే వుండాలె.నలుభై ఏండ్ల బతుకును ఎనుకకెనుకకు తవ్వుకుంట తవ్వుకుంట పోతాంటె అడుగడుగునా అన్నీ ఆకలి గాయాలే. ఆకలి జ్ఞాపకాలే. ముడ్డి మీద సరిగ్గ లాగు ఏసుకునుడు శాతగాని పసిపోరగాణ్ణి గంత ఆకలిని ఎట్ల బరించిన్నో తలుసుకుంటాంటే అఫ్సోస్ అయితాంది.

*

మీ మాటలు

  1. కందికొండ says:

    శానా పావురంగా నా కథ ను. అచ్చేశిన. సారంగ యాజ మాన్య త్రయానికి దండాలు

  2. ఆకలి మంట అనుభవాలని ఎంత బాగా శెప్పినవే కందికొండ అన్న.ఎన్నో మాటలను మర్శినమే…..నాకైతే ఎన్ని యాదికి తెప్పించినవే …. బువ్వెయ్యె ముసల్దాన అంటె “ఎహె పులిగండు గుంజిగ బువ్వ ఉమగిల్లద్దారా అగడుబడ్డ పోచమ్మ మొగుణ్ణి మింగినట్టు” శేత్తవేందిరా అరుగుడు పేగు వున్నదా నీకు అని తిట్టేది …..గిట్ల మా నాయనమ్మ ముసల్ది ఎన్ని సార్లు తిట్టిందో .మల్ల ముసల్దానా అంటే ….ముసల్దానా అంటావ్ ర భాడ్కావ్ అనేది.ఇంగ ఆ వొయిలు అన్న మాటే మార్షిన్నే.ఎవళ్ళన్నా సుట్టాలు ఇంటికొస్తే ఏందిరా మంచిగ సదువుతున్నావా అనంగనె ….ఏడ ఎప్పుడన్నా వొయిలు వడితేన లంజకొడుకు…..అన్న ముసల్దాని మాటలు యాదికొచ్చినయ్ ….ఇంగ ఆ కలన్నం మాట ఇనంగనే నోట్ల నీళ్లూర్ణయ్.thank you

  3. గొరుసు says:

    కందికొండ గారూ … అద్భుతం. కథ ప్రారంభం చదివి వీలున్నప్పుడు చదువుదామని కొంచెం మొదలు పెట్టాను – మీ అక్షరాలు నా “గల్లవట్టి” లోపలికి లాక్కు వెళ్లాయి. కథ మీరు రాస్తే “మొక్క జొన్న గట్క” తిన్నట్టుగా, కల్తీ కలవని నెయ్యి వాసన చూసినట్టుగా ఉంటుంది. కలి గంజి , బూరు … పదాలు నా బాల్యాన్ని తిరగ తోడినయ్. మీరు రాసే కథకు వస్తువు ఉండక్కరలేదు – అక్షరాలు ఉంటె చాలు – అభినందనలు.

  4. వేణు ఊడుగుల says:

    కందికొండ అన్న రాసిన దళిత బహుజన కథ ఇది….తప్పక చదవాల్సిన ఆకలి కథ ఇది. చాలా అద్బుతమైన కథనం.

  5. కందికొండ says:

    రవి ఫుల్లెం ల గారికి ధన్యవాదాలు

  6. కందికొండ says:

    గొరుసు గారు మీ ప్రేమకు ధన్యవాదాలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను

  7. rajani patibandla says:

    కందికొండ గారు నామిని కథ చదివి నప్పటిలా కన్నీళ్లు ఆగలేదు. ఇప్పటి పిఇల్లలందరితోను చదివించ గలిగితే ఎంత బావుండు….

  8. కందికొండ says:

    వేణు ఉడుగుల కు ధన్యవాదాలు

  9. కందికొండ says:

    రజని పాటిబండ్ల గారికి ధన్యవాదాలు

  10. manne elia says:

    కందికొండ అన్న నీకు దండమే
    కథ చదువుతుంటే మస్తు ఆకలిమీదున్నోడు ఉడుకుడుకు గటుక బువ్వల కమ్మటి కంది పప్పు ఒత్తుగా కల్పుకొని జుర్రినట్లనిపిస్తందే ..అవ్వతోడు గిన్ని ముచట్లు గన్నిగనం పదాలు ఏడ వాయేనొ ఏమో… మీరు మల్ల యాదికి తెచ్చిన్రు కడుపునిండింది . కథ చదివినట్లు లేదు .ఒవ్వలో సెపుతుంటే ఇంటున్న్నట్లనిపించింది .మళ్ళి ,మళ్ళి చదిస్తుంది . అభినందనలు .

    మన్నే ఏలియా ,ఆదిలాబాద్

  11. కందికొండ says:

    ఏలియా గారికి ధన్యవాదాలు

  12. Shashidhar says:

    Sir, mee rasina dani gurinchi matlade anta anubhavam ledu kani…chaduvutunte akadaka nanu nenu polchuko kaligana.

    Indulo naku ardam kanidi okati undi sir…aakali..pedarikam anedi andariki okate kada sir..mari enduku meeru kevalam dalitulke e badalu untay anatlu rasaru. Mee anubhavalu ga rasaru kabati aa samyam lo meeru dalithulake ila jarugutundi ani anukuni undachu kani oka 20 years tarvata kuda ade bhavana lo enduku unnaru. Dalitulaki rendu rakala parishkaralu untay anaru..kani dalitulu kani variki okate kada sir undedi.

    బాధాకరమైన విషయమేందంటె ఈ దళిత బహుజనుల బతుకులల్ల కష్టాలకు, కన్నీళ్లకు రొండు రకాల పరిష్కారాలుంటయ్

    Naku ardam kaka adiganu sir..naa alochana naa sandeham tappu aithe kshaminchandi

  13. అసురుడు says:

    అన్న కందికొండకు నమస్తే.
    నీ కథ సద్విన తరువాత…. నీ కథల నేను గూడ ఉన్న అన్పించింది. అన్పించుడు గాదు… నీతోపాటే ఉన్న. అన్నా గది తరతరాల ఆకలి బాధనే. బాధలు పడటం, వాటిని కిక్కురు మనకుండ భరించడం మన హక్కు అయి పోయింది. జీవితం పాడుగాను. మన ఈడు పోరగాండ్లు బాగా పెరిగే ఏజ్ ల ముప్పుటలా తిన్నోడే లేడనిపిస్తది. యా ఊరికి పోయిన గిట్లనే ఉంది. కథ అని నీవురాసినవ్. కానీ అది మర్రిచెట్టుకు పాలు కారినట్లు….మనకు తనువెల్లా కారుతున్న దు:ఖపు నీళ్లు. హాస్టళల్ల సబ్బు ముచ్చట రాసివన్. నిజమేనే అప్పుడు లాయ్ బాయ్ ఎక్కడ ఉందో అరోగ్యం అక్కడి ఉంది…. అనే యాడ్ పేపర్లలో, రేడియోలో విన్పించేది. కానీ ఒంటి నిండా రోగాలే. చివరికో మాట చాలా బాగా చెప్పినవే. బయటి బాగా బతికేటోళ్లు గుర్తించలేదు. ప్రభుత్వమూ గుర్తించలేదు. చివరకు పందులు గూడా గుర్తించలేదు మన ఉనికిని. గింత కంటే అన్యాయం ఉంటదానే దున్యియల. గీ నడ్మ పసనూరి రవీందర్ అవుటాఫ్ ది కవరేజ్ ఏరియా కథల పుస్తకంలో కూడా కథకథకు బాండెడు బాధలు… కుండెండు కుండెడు కన్నీళ్లున్నవి. శూద్ర, కడ జాతి బతుకులింతేనే. అందుకేనేమో…. పాత సింత పండు పచ్చి పులుసు తిని…. లక్కపురుగుల బియ్యం అన్న…. మెదడును ఎదగనీయలేదు. నీ అసోంటుడు బయటకు వచ్చి…. తెలుగు సినిమా ఇండస్ర్టీని ఊపేసిన కొత్త తరం….కొత్త రకం పాటలు రాసిండు…ఇంగా కొందరు… హాస్టల్ల సద్వి మించి కొల్వులు జేస్తున్నరు.. కింద కులపోల్లను జెర్ర కంత పట్టించుకుంటున్నరు.
    కంది కొండ అన్న…. మనకూ పూటకింత తిండి… రకరకాల కూరలు అవసరం లేదు. పొట్ట నిండ గింత తిండి అదీ ముప్పుటలుంటే…. ఇప్పుడున్న దానికి తెల్వి ఇంకో ఇంచు పెర్గేది గావొచ్చు…. జీవితాన్ని అక్షరాల్లోకి ఒంపి దీంట్ల పెట్టినవ్… అన్న నమస్తే.

  14. కందికొండ says:

    అసురుడు గారికి ధన్యవాదాలు

  15. కందికొండ says:

    శశిదర్ గారికి ధన్యవాదాలు

  16. Varakumar.gundepangu says:

    గి ప్రపంచాన అందరికీ ఆకలిఐతది కాని ఆకలి విలువలు కష్టాలు కొందరికే తెలుసౖవి .ఆకలి బ్రతకడం దానితొపాటు విలువలు నేర్పిసౖది అలాంటి విలువలు ఉన్న మనుషులే తాను ఎ సాౖయికి ఎదిగిన ఒదిగి ఉంటరు. కందికొండన్న కథ చదువుతుంటే చిన్న తనముల ఎప్పుడో ..పులిగడుగు అబ్బా…పేరు చెపుతుంటే నాలుక కింద పులుపు నీరు ఊరుతుంది.నాజీవితం కండ్లముందే కనబడుతుంది నాకే కాదు ఈ దేశంలోని కింది కులపోలందరి జీవితం.ఎందుకంటే దోపిడీకి గురయిన కులాల ఆకలి కథలో జీవము,అనుభవాలు ఉన్నాయి కనుక .వేల సం”ల కల్పిత రాతలకి ఊహల గీతలైన మనువాద మాటలకి చెంపపెట్టు మా” ఆకలి”.శూద్ర అతిశూద్రులున్న ఈ కర్మ భూమిల యిప్పుడు వారి రాతలు బూతులే.అణగారినకులాల ఆకలికి అక్షర రూపం యిచ్చిన కంది కొండన్నకు దళిత బహుజన సేనారుౖలు.జైభీమ్

  17. కందికొండ says:

    థాంక్యూ తమ్ముడా గుండెపంగు

Leave a Reply to rajani patibandla Cancel reply

*