బాబూ! గుడ్ బై టు యూ!

kasi1

(సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు,  గొప్ప  వక్త, విర‌సం వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు యాధాటి కాశీప‌తి  హైద‌రాబాద్‌లో కన్నుమూశారు. కాశీపతి స్మృతిలో   ఆయన  సన్నిహిత  మిత్రుడు  హెచ్చార్కె   నాలుగు  మాటలు…)

*

క కంచం ఒక మంచం అంటారు స్నేహానికి పరమావధిగా. ఆ అవధిని చవి జూచిన స్నేహం మాది. ముషీరా బాదు డిస్త్రిక్ట్ జైలులో ఆ రెండు పనులూ చేశాం. ఒకే కంచం లోంచి తిన్న సందర్భాలు, ఒకే సిగరెట్ పంచుకున్న సందర్భాలు సరే…. అవి కొల్లలు.

అది కాదు. ‘మీసా’ (‘మెయింటెనెన్స్ అఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్’) డిటెన్యూలకు జైలు బ్యారక్ లో  పొడుగ్గా రెండు వరుసలుగా మంచాలు వేసి వుండేవి. రాత్రులు పక్క పక్క మంచాల మీద దోమ తెరలు కల్పించే హేజీ వెలుతురులో కబుర్లు చెప్పుకుంటూ కబుర్లలోంచి నిద్దట్లోకి జారిపోయేది మేమిద్దరం.  వేర్వేరు మంచాలు వీలుగా లేవని, మా మంచాల్ని దగ్గరగా జరుపుకుని, ఒకే మంచంగా చేసుకుని, దోమ తెరల్ని కలుపుకుని మాట్లాడుకుంటూ నిద్రపోయే వాళ్ళం కూడా. ఇది చూసి ఒక అనంతపురం వీరుడు మేము ‘స్వలింగ సంపర్కుల’మని జైలు గోడల మీద రాశాడు. మేము ఆ దుష్ప్రచార వ్రాతను గుర్తు చేసుకుని, చాల సార్లు నవ్వుకున్నాం. మా స్నేహాన్ని నిలబెట్టుకున్నాం.  ఇప్పుడెలా వుంటుందో ఏమో గాని, అప్పుడు… 70లలో… ‘గే’ అనే ప్రచారం ఎవరి గురించి చేసినా, అది హీనమూ, దుర్మార్గమే.

‘ఎవ్వడికీ, దేనికీ భయపడగూడదు, ఇతర్లు మన గురించి ఏమనుకుంటారనే దానికి ఆసలే భయపడకూడదు, మనకు నిజ్జంగా ఎలా ఇష్టమో అలా జీవించాలి. ఏదైనా మనం బలంగా అనుకుంటున్నామంటే, అది నూటికి తొంభై వంతులు తప్పై వుండదు’ అనేది ఆనాడు మా ‘బాబు అండ్ బాబు’ లెజెండ్. బాబు అంటే నేను లేదా తను. అది మేము ఒకరినొకరం పిలుచుకున్న పిలుపు.

మేము పరస్పరం విభేదించలేదా? ఎందుకు లేదూ?! ఇద్దరం సిపిఐ ఎం ఎల్ చండ్ర పుల్లారెడ్డి గ్రూపులో క్రియాశీలురం. తను బాగా సీనియర్. ఎమర్జెన్సీ తరువాత పార్టీలో నేను ఏం చేయాలనే విషయంలో, పార్టీలో చీలిక ఏర్పడుతున్నప్పుడు మేము ప్రవర్తించిన పద్ధతుల్లో విభేదాలు వచ్చాయి. విభేదాలు మా వంటి వాళ్ళ మధ్య ఎలా రావాలో అలాగే వచ్చి, అలాగే కరిగిపోయాయి.

నేను హోల్ టైమర్ గా వొద్దని, భార్యాబిడ్డలను చూసుకుంటూ జీవించాలని తను కోరుకోడమే కాదు. ‘ఈ రాజకీయాలు వాడికి చాత కావు, వాడు సంసారం చూసుకుంటూ, వుద్యమం పనులు చేయనీ’ అని పార్టీతో వాదించాడు. నేనూ వినలేదు, పార్టీ వినలేదు.

పార్టీ చీలిక రోజుల గురించి చిన్న సరదా వుదాహరణ. ఒక ముఖ్య కార్యకర్త కమ్ రచయిత్రి విషయమై పార్టీ రాష్ట్ర నాయకులున్న సమావేశంలో చర్చ  వచ్చింది. ఆమె ‘అటు’వైపు వున్నారంటూ నేను అన్నానని… కాశీపతి చెప్పాడు. కాశీపతి అక్కడ అలా అనగూడదు. అలా అనడం నష్టకరం. ఎందుకంటే ఆ సమావేశంలో నా మాటల్ని ఇష్టపడని ‘అటు’వైపు వాళ్లు కూడా వున్నారు. అదింకా చీలికలో శ్రేణీకరణ పూర్తి కాని కీలక దశ. నేను ఆమె గురించి అలా అనలేదని, కాశీపతి చెబుతున్నది నిజం కాదని  వెహిమెంట్ గా ఖండించాను. అక్కడున్న వారంతా నా మాటలనే సీరియస్ గా తీసుకున్నారు. కాశీపతి అబద్ధం చెప్పినట్టయింది.

బయటికి వచ్చాక, టీ కొట్టులో పూర్తిగా మా ‘వైపు’ వాళ్లే వుండగా కాశీపతి ఆ విషయం ప్రస్తావించాడు. “ఏమిరా, నువ్వు నాతో అలా అనలేదా?” అని అడిగాడు. “అన్నాను. ఆ మాట నీతో అన్నాను. అది నీ వరకే వుండాలి. దాన్ని నువ్వు అతిక్రమించావు. నేను అబద్ధం చెప్పను. ఇంత రేర్ గా అబద్ధం చెప్పినా, సమావేశంలో నా మాటకు వుండే విలువ నీ మాటకు వుండదు, నువ్వు చెప్పేది నిజం అయినప్పటికీ. నాకున్న ఆ కాస్త లివరేజ్ ని నేను అక్కడ వుపయోగించుకున్నాను. అలా వుపయోగించుకోడం రైటే” అనే సరికి, “ఉరేయ్, నువ్వు దేవాంతకుడివి” అని నవ్వేశాడు కాశీపతి.

(‘దేవాం’తకుడిని కావడానికి బాగా ప్రయత్నిస్తున్నాను బాబూ! కుదరడం లేదు. )

ఇటీవల కొంతకాలం, నాకు నేను మానసిక ఆరోగ్యం కోల్పోవడం వల్ల, తనను ఆ తీవ్ర అనారోగ్యంలో చూడడం చాతగాక…  విషయాలు తెలుసుకుంటున్నా…. ఎక్కువగా కలుసుకోలేకపోయాను. శ్రీ శ్రీ మీద తను సరదా భాషలో రాసిన సీరియస్ పుస్తకం ‘మందు’ హాసం ఆవిష్కరణలో చూశాను. అనారోగ్యం శరీరానికే గాని, బుద్ధికి కాదని ఆ గంట తన వుపన్యాసం నిరూపించింది.

రాజకీయ ఆర్థిక అధ్యయనంలో, ప్రజా సమస్యలను భౌగోళిక (గ్లోబల్) దృక్పథంతో వివరించడంలో తరిమెల నాగిరెడ్డి తరువాత అంతటి వాడనిపించే అద్భుత మేధావి యాధాటి కాశీపతి. నాగి రెడ్ది లాగే కాశీపతి కూడా పెదిమల మధ్య సిగరెట్ వుంచుకుని, గంటల తరబడి మాట్లాడే వాడు. బహుశా ఈ సిగరెట్ కూడా తనకు తరిమెల నాగిరెడ్డి నుంచి అబ్బిన విద్యే అయ్యుంటుంది.

తన సంగతేమో గాని, నా పొగ మాత్రమే కాశీపతి పెట్టిన నిప్పుదే. జైలుకు వెళ్ళక ముందు నాకు సిగరెట్ల అలవాటు లేదు. జైలుకు వెళ్ళాక పక్కన కాశీపతి రోజుకు పది పాకెట్ల చార్మినార్లను తగలేసే వాడు. నేను ముందే డిప్రెస్డ్ గా వున్నానేమో కాశీపతి సిగరెట్ డబ్బాలు నా వల్ల కూడా ఖాళీ కావడం, నా ‘పాకెట్ మనీ’ నుంచి కూడా సిగరెట్లు కొనడం మాకు తెలీకుండానే మొదలయిపోయింది. నన్నూరు వెంకట్రెడ్డన్న వంటి వారు ‘పిల్లోన్ని చెడగొడుతున్నాడ’ని కాశీపతిని కోప్పడే వారు. ఇద్దరం సిగరెట్ మానలేదు. మొన్న మొన్నటి వరకు.  

మా స్మోకింగ్ అలవాటు గురించి ఇద్దరం తరచు అనుకునే వాళ్ళం. స్మోకింగ్ వల్ల మనిషి ఆయుష్షు పదేండ్లు తగ్గుతుందట కదా?!.ఓకే, లెటజ్, ఎంజాయ్. క్రిష్టొఫర్ మార్లోవ్ నాటకంలో డాక్టర్ ఫాస్టస్ తన ఆత్మను దయ్యానికి ఇచ్చి ఏవేవో ఆనందాల్ని తీసుకుంటాడు. మేము మరీ అంత కాదు. మా జీవితాలు వందేళ్ళ లోంచి ఒక పదేళ్లు సిగరెట్లకు ఇచ్చేస్తాం అని హాస్యమాడుకునేది. ఆ లెక్కన ఇప్పుడు కాశిపతికి ఎన్నేళ్లు? తను సిగరెస్టస్ కు ఇచ్చినవి కూడ కలుపుకుంటే, దరిదాపు ఎనభయ్యయిదు అవుతాయి.

బాబూ, మరేం ఫరవాలేదు! ఎవడు  బతికేడు మూడు యాభైలు. మనం అనుకున్నదే కదా, మనకు నిజంగా ఇష్టమయినట్టు జీవించాం. ఇలా జీవించేట్లయితే, ఇక, ఎవరం ఎప్పుడు మరణిస్తేనేం?

‘ఎనీ టైమ్ ఎనీ సెంటర్’ అని సవాలు చేసి బతికే వాళ్ళం మనం. ఎప్పుడయితేనేం, ఎక్కడయితేనేం?

ఇట్స్ ఓకే బాబూ!

ఈ ‘బాబు అండ్ బాబు’ ఏంటి అనుకుంటారు ఇది చదివే వాళ్లు.

కాశీపతికి ఒక జబ్బుంది. తన కన్న చిన్న వాళ్లైతే చాలు పరిచయం కాగానే ‘ఒరే’ అనేస్తాడు. నన్నూ అలా అనే సరికి ఖోపమొచ్చింది. ఇది తన బ్రాహ్మణ్యాహంకారపు మిగులు అని విమర్శించాను కూడా.  ఒకటి రెండు సార్లు తిరిగి తనను నేనూ ఒరే అని చూశా. అది నాకు బాగుండ్లేదు. నా కన్న కనీసం పదేళ్లు పెద్దాడు . అది మానేసి పేరుతో పిలిచి చూశా. మేము సన్నిహితమయ్యే కొద్దీ పేరు మానేసి ‘అది కాదు బాబూ’ తరహాలో బాబూ అనడం మొదలెట్టా. ఆ మాట తనకు నచ్చింది. తను కూడా బాబూ అనడం మొదలెట్టాడు. ఇద్దరం ఒకరికొకరం ‘ఒరే’లం కాలేదు గాని, ఒకరికొకరం బాబూ అయ్యాం. ‘బాబూ అండ్ బాబూ’…. అనేది ఆ ‘మూవీస్’ వాళ్ళకేమో గాని, మా స్నేహానికీ మంచి బ్యానర్ అయిపోయింది.

బాబూ రావు (మాచవరం ), చలపతి (అరుణోదయ), బూర్గుల ప్రదీప్, శ్యామ్(మధుసూదనరాజు తమ్ముడు), ఇంద్రారెడ్డి (మాజీ మంత్రి), కృష్ణారెడ్డి (తరువాత, విమలక్క భర్త) …  అందరికీ మా ‘బాబూ- బాబూ’ వ్యవహారం కుంచెం అసూయగా వుండేది.

కాశీపతి బయటి నుంచి తెప్పించిన స్టౌ తో ఏవేవో వంటలు చేసి మా మీద ప్రయోగాలు చేసే వాడు. తన వంట పూర్తి కాగానే, దానికి ఫ్రెంచి పుడ్డింగ్ అనో పోర్చుగీస్ పుడ్డింగ్ అనో నామకరణం కూడా చేశాక స్టౌ దగ్గర మా పిల్లల క్యూ. “వాడేడీ? బాబు.. బాబూ.. ఏడీ వాడు?’ అని లైనులో వెనుక వున్న నేను ముందుకొచ్చి, ప్లేటు చాచే వరకు వడ్డన మొదలెయ్యేది కాదు. మరి వాళ్ళకు అసూయ వుండదూ.

వాళ్ళకు చాటుగా చెప్పేవాడు. ‘వాడు, పాపం, పెండ్లైన ఇరవై రోజులకే జైలుకు వచ్చాడు రా. పెద్దోళ్ళం మాకైనా ఒకటి రెండు పెరోల్స్ వచ్చాయి. అదేంటో, వాడికి ఒక్క పెరోలు కూడా రాలేదు. పాప పుట్టినప్పుడు కూడ రాలేదు. పాపం, వాన్ని మనం బాగా చూసుకోవాలి’ అనే వాడు.

ఇప్పుడు అదేం అవసరం లేదులే బాబూ. ఆ ‘ఇరవై రోజుల’ జయకు, అప్పుడు నేను చూడలేదే అని నువ్వు అంగలార్చిన చిన్నారి మమతకు.. ఇప్పుడు నిరంతరం దగ్గరగా వుంటున్నాను. సంతోషంగా వుంటున్నాను. నీ ఫ్రెంచ్, పోర్చుగీస్ పుడ్డింగ్ లను మిస్ అవుతూనే వుంటా.

అయినా జీవితం ప్రహిస్తూనే వుంది. నీ బిడ్డలు ప్రగతి, వెన్నెల…. నువ్వు ఏం చెప్పావో అలాగే…. తమకు నిజ్జంగా ఇష్టమైన విధంగా, అదే సమయంలో ప్రగతి శీల రీతులలో జీవిస్తున్నారు. డోంట్ వర్రీ. వాళ్ళ సంగతి, పుష్ప సంగతి కూడా వాళ్ళు చూసుకుంటారు.

నువ్వొప్పుకుంటావో లేదో గాని, మిగిలిన ప్రపంచం కూడా బాగుంది. తన సంగతి తాను చూసుకోగలనని ప్రతీప శక్తుల తీవ్ర ముట్టడి మధ్య కూడా ప్రపంచం నిరూపిస్తున్నది. మనిషి తనకిష్టమైన విధంగానే జీవిస్తాడు. సందేహం లేదు. ఎవరు ఎలా నియంత్రించినా, ఎవరు ఎలా బుజ్జగించినా… కాసేపు కాలక్షేపానికి అవీ ఇవీ బొమ్మలతో ఆడుకుంటాడేమో గాని…. మనిషి తనకు ఇష్టమైన విధంగానే జీవిస్తాడు. అన్ని నిరంకుశాల్ని, బుజ్జగింపులను, అబద్ధాల్ని కాదని… కాలిలో విరిగిన తుమ్మ ముళ్ళను పిన్నీసు పెట్టి తీసుకున్నంత సహజంగా, సునాయాసంగా తీసేసుకుని…  నడుస్తాడు. నడవడం చాల ఇష్టం మనిషికి, కలలు కంటూ నడవడం మరీ ఇష్టం.

కాశీపతీ! మనం కలిసి పంచిన కలల్ని ఇక్కడ మిగిలి వున్న వాళ్ళం పంచుతూనే వుంటాం. ఎక్కడికక్కడ కలల్ని పంచడానికి, అబద్ధాల్ని తుంచడానికి ఇక్కడ ఎవరమో ఒకరం మిగులుతూనే వుంటాంలే. అబద్ధాల కలుపు తీయడం కూడా కలల సేద్యంలో భాగామే.

“హెచ్చార్కె! ఎవరో అఫ్సర్, జీఎస్ రామ్మోహన్ అట. నీకు మెసేజ్ లు పెట్టారట. చూడు. నీ క్లోజ్ ఫ్రెండు ఎవరో చనిపోయారట. మమత వాళ్ల మేసేజ్ చూసి ఆఫీసు నుంచి ఫోన్ చేసింది.”….  అని పొద్దున్నే మొద్దు నిద్ర పోతున్న నన్ను లేపి కూర్చోబెట్టి, ఆ తరువాత, నేనిది రాస్తుంటే పక్కనే తన ల్యాప్ టాప్ లో తానేదో చేసుకుంటున్న అన్య పాపకు, బహుశా, నువ్వు నేను గుర్తుంటాములే బాబూ! మమత, అన్య వాళ్లకు, ప్రగతి, వెన్నెల వాళ్ళకు మన పనుల్లో మిగుళ్ళు గుర్తుంటాయిలే.

గుడ్ బై, బాబూ! ఐ విల్ మిస్ యూ!.

*

  

మీ మాటలు

 1. Kcube Varma says:

  మీ బాబు అండ్ బాబూ స్నేహ మాధుర్యాన్ని మాకిలా పంచి కాశీపతి గారిని స్మరించుకోవడం వారికిది గొప్ప నివాళి. రాత్రి విరసం కార్యదర్శి వరలక్ష్మి గారి మెసేజ్ ద్బారా నాకు తెలిసింది ఈ దుర్వార్త. మీ ఇద్దరిలా నచ్చిన విధంగా జీవించడం అరుదు. కాశీపతి గారికి జోహార్లు..

 2. :-( :-( ;-(

 3. V Jaya Chandra says:

  పది మంది కోసం బతికినా వాళ్లకి చావు లేదు, జోహార్లు కాశీపతి గారు. కన్నీళ్లు తెప్పించేలా నివాళి రాశారు సార్.

 4. కె.కె. రామయ్య says:

  గురువారం (11-08-2016) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు, విప్లవ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు, తెలుగునాట‌ క‌మ్యూనిస్టు ఉద్య‌మ సార‌థుల్లో ఒకరు యాధాటి కాశీపతి (74) గారికి జోహార్లు..

  స్మరణకు తీసుకొచ్చిన హెచ్చార్కె గారికి నెనర్లు.

  ఆనంతపురానికి చెందిన కాశీపతి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ(జర్నలిజం) చేశారు. అంతేకాక గోల్డ్‌ మెడల్‌ను కూడా సాధించారు. చదువు పూర్తి చేసిన తరువాత వచ్చిన డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం కాదని తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో పని చేశారు.చండ్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి, రామనర్సయ్య తదితర ఎంతో మంది విప్లవ కారులతో పని చేసిన అనుభవం అయనది. ఎమర్జెన్సీ సమయంలో 21 నెలల పాటు ముషీరాబాద్‌లో జైలు జీవితం గడిపారు. జైల్లో ఈయనతో పాటు ఉన్న వరవరరావు, ఇతర ముఖ్యనేతలేందరికో రాజకీయ తరగతులను బోధించారు. సీపీఐఎంఎల్‌ పార్టీ తరపున సిరిసిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు. శ్రీశ్రీ కవిత్వం ఎప్పుడూ కాశీపతి పెదాలపై ఆడుతూ ఉండేది. శ్రీశ్రీ చలసాని తరువాత చెప్పే పేరు కాశీపతి. తెలుగు సమాజానికి ఎంతో మంది జాతీయ అంతర్జాతీయ విప్లవ బుద్ధి జీవులను పరిచయం చేసిన వ్యక్తి కాశీపతి. ప్రముఖ కవి గజ్జెల మల్లారెడ్డి రాసినట్లు కాశీపతి కూసేపతి అన్నాడంటే ఆయన ఉపన్యాసం, వాగ్దాటి ఎంత గంభీరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరిరోజుల్లో మాట్లాడే పరిస్థితి లేకపోయినా మధ్యతరగతి మందహాసం అనే పుస్తకాన్ని కాశీపతి రచించారు. కొంతకాలంగా ఆయన పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్నారు

  http://www.sakshi.com/news/district/formar-journalist-kashiapthi-died-379360

  శ్రీశ్రీ గారి మీద కాశీప‌తి ‘మ‌ద్య‌’తర‌గ‌తి ‘మందు’హాసం ~ పుస్తకం కినిగె నుండి పొందవచ్చు.
  http://kinige.com/book/Madya+Taragati+Mandu+Haasam

 5. కె.కె. రామయ్య says:

  ” మిన్నేటి చుక్క”

  “ఎందుకు, ఎందుకు
  ఎందుకు నాలోని అందరూ
  హోరు హోరుగా ఏడ్చేరు.
  ఒకే ఒక్క కన్నీటి చుక్కను
  ఇంతమంది పంచుకుని
  దాహం పుచ్చుకుని
  ఒక్కొక్కరు ఒక దుఃఖమై
  నాలో రగులు తున్నారు. ” ~ హెచ్చార్కె

 6. P. Rama Koteswara Rao says:

  1970 mariyu 1980 dashakalalo telugunelao Kashipati mata Arunodaya Rama Rao pata enthaga yuvajanulanu uttejaparichayo, endaru yuvakulanu aalochimpa cheshayo … Tarimala Ngireddy arini vinaledu kani kashipati upanyasam vinna taruvatha intakanna baga evaraina matladutharu ante angeekarinchalemu.

 7. కె.కె. రామయ్య says:

  ” ప్రియమిత్రుడు కాశీపతి ఎంతో ఆప్యాయతతో, గౌరవంతో 1974వ సంవత్సరం ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిన తన పాటలు కవితల పుస్తకం “రెడ్ సాల్యూట్స్” ( శ్రీశ్రీ, వరవరరావు, మధుసూధనరావు ల పీఠికలతో కూడిన ) పుస్తకాన్ని చూస్తూ తనని తలపోస్తున్నాను. శ్రీశ్రీ మీద కాశీప‌తి రాసిన ‘మ‌ద్య‌’తర‌గ‌తి ‘మందు’హాసం పుస్తకంలో నా పీఠిక ఉంది. తనతో కలిసి విరసంలో కలిసి పనిచెయ్యడం ఓ గొప్ప అనుభవం. కాశీపతి వాగ్ధాటి ప్రజల్ని కదిలించేది. కాశీపతికి రెడ్ సాల్యూట్స్. హ్రదయపూర్వక నివాళి తెలియజేసుకుంటున్నాను.”

  ~ దిగంబరోద్యమ విప్లవకవి నిఖిలేశ్వర్

 8. కె.కె. రామయ్య says:

  విప్లవ సముద్రుడు 13-08-2016 ( ఆంద్రజ్యోతి ఎడిటోరియల్ )

  అతడు గొంతెత్తితే కాలం సముద్ర అలల హోరు కావలసిందే. అతడు భవిష్యవాణి. వర్తమానాన్ని ముడివిప్పినవాడు. కులాన్ని, చదివిన చదువుని, వచ్చిన పెద్ద ఉద్యోగాన్ని కాలిగోటితో తన్ని, ఈ దేశముఖచిత్రానికి విప్లవ సముద్రుడి అలల శ్వాస అయ్యిండు. కమ్యూనిస్టుపార్టీ రెండు పాయలుగా చీలి ఎన్నికల ఊబిలోకి ఇరుక్కపోయిన సందర్భంలోనే అతడు అగ్గిపుల్ల గీసి, సిగరెట్టు వెలిగించిండు. నక్సల్‌బరి వసంతమేఘాన్ని తన పెదవులమీద చిరునవ్వుల సంతకం చేసుకుండు. శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాలకు తను అక్షరమై మండి, అంతర్జాతీయ వెలుగునిచ్చిండు. ఒక ప్రజాస్వామిక విప్లవ డిమాండ్‌తో, విప్లవ రచయితల సంఘానికి సంకేతంగా ఊపిరిపోసిండు. శ్రీశ్రీలాంటి కవిని తన చిటికెన వేలుతో నడిపించి, ప్రజాపక్షాన నడిచేటట్లు ప్రజాకవిగా, మహాకవిగా చేసిండు. అతడు యాధాటి కాశీపతి, అనుక్షణం కణం కణం మండే ప్రజాపతి. పెద్దాయన చండ్ర పుల్లారెడ్డి రాజకీయ తొవ్వను చక్కగా విడమరిచి, పూస పూస గుచ్చినట్లు, అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లు, ఆర్థిక రాజకీయ శాస్త్రాన్ని బోధించినవాడు. గోదావరి ప్రతిఘటన పోరాటాల ఫలితాలను అంతర్జాతీయంగా తన జర్నలిజం రచన సృజనతో చాటిచెప్పినవాడు.

  నా యవ్వనానికి, నాలాంటి ఎందరో యవ్వనప్రాయులకు టార్చ్‌లైట్‌ వెలుగయి తొవ్వ చూపినవాడు. దాదాపు రెండు దశాబ్దాలు తెలుగునాట కాశీపతి విప్లవ ప్రజాపతి. ఎక్కడ ప్రజాసభలు జరిగినా, కాశీపతి వస్తున్నాడంటే చాలు, యువతరం కాళ్ళకు బలపాలు కట్టుకుని పరిగెత్తుకుంటు అక్కడ వాలేవారు. పెద్ద సినిమానటులకు లేని ‘ఫాలోయింగ్‌’ కాశీపతికి వుండేది అంటే, ఆ గొంతు ఎత్తిన విప్లవ దశాబ్దం ఎంతటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

  తనకు సహచరుడిగా ఉన్న నీలం రాంచంద్రయ్య, తనతో యవ్వన విద్యార్థి అడుగులు వేసిన జంపాల ప్రసాద్‌లను ఈ రాజ్యం ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు, బాధను దిగమింగుకుంటూ ‘ఉయ్యాల జంపాల’ పాట అప్పటికప్పుడు గొంతు తడి ఆరకుండా పాడి, ఈ దేశ యువతకు సందేశం ఇచ్చిం డు. ఒకటా..రెండా.. ఎన్నో తుఫానులను బడబాగ్నిగా దాచుకున్నవాడు. పెన్నును గన్నుగా మలుచుకొని ఒక రాజకీయ విప్లవ ముఖచిత్రం అయినవాడు. అన్నా! లాల్‌సలామ్‌.

  http://www.andhrajyothy.com/artical?SID=296944

 9. syed sabir hussain says:

  ఇటీవల కొంతకాలంగా ప్రజలకోసం ఒక నిబద్దతతో బతికిన వాళ్ళు మృతిచెందడం జరుగుతుంది. ఇది నాకు చాలా బాధాకరంగా వుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పేదల బతుకులు మరింతగా సంక్షోభంలో వున్నా సమయంలో ఇలా జరుగుతుండడం మరింతగా కృంగదీస్తుంది. దీపాలు అదిరిపోతున్నాయి. దారులు మూసుకుపోతున్నాయి . గొంతులు పెగలడంలేదు. మరి భవిష్యత్త్తు ఎలా ఉంటుందో..కాశీపతి మృతికి నివాళులు.

 10. నొప్పిని పంచుకున్న మిత్రులందరికీ థాంక్స్. కెకె రామయ్య వంటి మిత్రులు వేరే చోట్లనుంచి ఇటువంటి స్పందనలను తెచ్చి పోస్ట్ చేయడం చాల బాగుంది.

  కాశీపతి నుంచి ఇంకా ఎన్నో మంచి పనులు జరగడానికి వీలుండింది. దగ్గరగా చూశాన్నేను. అలా ఎందుకు జరగలేదు అనేది నన్ను విచికిత్స కు గురి చేసే ప్రశ్న. జవాబు… తను తన పరిధిని కుదించుకోడంలో వుంది, తన చుట్టూరా వున్న పరిసర పరిస్టితులలోనూ వుందనుకుంటాను. స్పష్టంగా తెంచుకోవలసిన వాటి నుంచి స్పష్టంగా తెంచుకోకపోవడంలోనూ వుంది. ఇక్కడ ఇంతకు మించి చెప్పడం కుదరదు. తరువాతెప్పుడైనా రాస్తాను.

మీ మాటలు

*