చెదరని సంతకం

నిన్ను నువ్వు అద్దంలో జూసుకుని
తాషిలి మొఖపోనివని  బిరుదులిచ్చుకున్నప్పుడు
తాకట్లుబెట్టి…తలకుబోసుకుంటవని
నీలో సగం నీతో పరాశాకాలాడినప్పుడు
తప్పెవరిదైనా.. బోనులో నిన్నొక్కడినే నిలబెట్టి
ముద్దాయివని ముద్దెర్లు గుద్దినపుడు
యుద్ధంలో ప్రత్యర్ధి సుత
నీ ప్రతిబింబమేనని ఎరుకైనపుడు

నీకు నువ్వే…
జవాబు లేని ప్రశ్నవై
అటక మీద ఓరకు బెట్టిన
సత్తుపైసల మూటవై
జిబ్బ జిబ్బ ముసురుకున్న సంతలో
బ్యారంగాని ల్యాగదూడవై
లబ్బలబ్బ మొత్తుకున్నా…
ఇనుపించుకోని మావుల మన్సుల నడ్మ
పిడ్సగట్కబోయిన నాల్కెవై

art: Rafi Haque

art: Rafi Haque

లంగరేసిన పడవలెక్క ఎటూకదల్లేక
తోట్ల బొమ్మోలె నిలబడి
పాలిపోయిన మొఖంతో
బీరిపోయిన సూపులతో
యుద్ధంలో గాయపడ్డ సైనికునిలా..
మనసంతా కలి కలి!
నెత్తురు పేరుకపోయిన కండ్లతో
అంతా మసక  మసక !!

మాయిల్నే కోంచెపడేటోల్లు
కూసున్న కొమ్మనే నరుక్కునేటోల్లు
తమ  కన్ను తామే పొడ్సుకునేటోల్లు
నీ  కంతకు సూటివెట్టి…
నువ్వెప్పుడో ఓడిపోయినవని  ఎకసెక్కాలాడుతరు !

నువ్విప్పుడు
పారుతున్న ఏరుతోటి పొత్తుగూడి …
తొక్కుడుబండ మీద ..
చెక్కుచెదరని  సంతకమవ్వాలె  !!

*

మీ మాటలు

 1. రాజ‌న్న‌..మీ చెద‌ర‌ని సంత‌కం.. చెదిరిపోని జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసిన‌యి. భావంతో పాటు తెలంగాణ ప‌ద భాగ్యాన్ని చ‌దివేలా చేసినందుకు థ్యాంక్స్‌. నాకైతే మీ ప్ర‌తీ అక్ష‌రం అద్దంలెక్క‌న్పించింది.బ‌త్క‌నీకి సోప‌నాలైన అప‌జ‌యాలు,అవ‌మానాల తియ్య‌ని గాయాల‌ను గుర్తుచేసింద‌న్నా..గిట్ల‌నే బ‌గ్గ రాస్తుండ‌న్నా..

  • BANDARI RAJKUMAR says:

   Anna thanks a lot for your appreciation
   i keep in mind your words

  • బండారి రాజ్ కుమార్ says:

   కృతజ్ఞతలు వేణు అన్న
   నా కవిత్వం ఏ ఒక్కరి హృదయాన్ని కదిలించినా నా పుట్క పుర్సతేనే!

మీ మాటలు

*