అక్కడి గార్బేజ్…ఇక్కడి హెరిటేజ్!!

 

 

ఏ దేశమేగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని రాయప్రోలు ఏ కోశాన అన్నారో తెలీదు. దాన్ని అనేక రకాలుగా అన్వయించుకునే వారు పెరిగిపోయారు. భూమి భారతిని పొగడడం అంటే వెనుకబాటు తనాన్ని పొగుడుకోవడం కాదు. నలుగురి దృష్టిలో నవ్వుబాటు కావడం కాదు. సంస్కృతి సంప్రదాయాల పేరుతో పాత చెత్తనంతా నెత్తికెత్తుకుని ఊరేగడం కాదు. కానీ కొందరు సంస్కృతీ రక్షకులు విదేశీ గడ్డమీద చేస్తున్నదేమిటి? మా మూలాలు ఇవి మా సంస్కృతి ఇది అంటూ హేయమైన ఆచారాలను ప్రదర్శిస్తూ భారత్‌ అంటే ఇంకా ఈ స్థితిలో ఉన్న దేశమా అని అంతా నోరెళ్లబెట్టేట్టు చేస్తున్నారు.

విదేశీ గడ్డమీద అడుగుపెట్టి అక్కడ జీవనం సాగిస్తున్నవారికి సొంత మూలాలకు సంబంధించిందేదో ప్రదర్శించుకోవాలని ఉంటుంది. తప్పులేదు. కానీ ఈ మూలాల కోసం కాలంలో వెనక్కు ప్రయాణించనక్కర్లేదు. సొంత గడ్డమీద కూడా ఎబ్బెట్టు అనిపించే విషయాలను పరాయి గడ్డమీద పదిమంది ముందు చాటాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని అంశాల్లాగే సంస్కృతి సంప్రదాయాలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. పురోగామి అంశాలు, ఆహ్వానించ దగిన అంశాలు కూడా మన సంస్కృతిలో ఉంటాయి. అవి వదిలేసి ఆధిపత్య చిహ్నాలైన వాటిని అవమాన కరమైన వాటిని ప్రదర్శనకు పెట్టి ఇవి మా మూలాలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఎంతో చదువుకుని దేశాలు దాటిన వారి ప్రపంచం విస్తృతమవుతుందని ఎవరైనా ఆశిస్తాం. కానీ ఇక్కడ సాగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిపిస్తుంది.నమ్మాలని పించదు. ఇది అవసరమా, ఇది దేశభక్తా, తెలుగు సంస్కృతి అంటే ఇదేనా! అని చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఆ రకమైన చర్చ కోసమే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక ఎన్‌ఆర్‌ఐగా ఒక అనుభవాన్ని ఇక్కడ నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను.

నీకు మైల ఉందా! ఈ హఠాత్ ప్రశ్నకు ఒక్క క్షణం ఊపిరాడలేదు. ఇది సాధారణమే అనుకునే వారు కూడా ఉండొచ్చు. అది వారి సంస్కృతి. అమెరికాలో ఇక్కడ …సంస్థలో సాంకేతికంగా ఉన్నతమనుకునే …ఇండస్ర్టీలో ఈ మాట వినిపించడం నాకైతే షాక్‌. ఆరోజు గురువారం. ఆ మాట వినిపించిన వైపు చూశాను. ఫ్యాంటు, చొక్కా, చెవులకు జుంకీలు , మెళ్లో నల్లపూసలు , నుదుటన ఇంత పెద్దబొట్టు, దాన్ని డామినేట్‌ చేస్తూ దేవుని కుంకుమ, వెరసి ఆవిడ పేరు ఎక్స్‌ అనుకుందాం. పేరు బయటపెట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సాయి భక్తురాలు. భక్తి ఉండడం లేకపోవడం వారి వైయక్తిక విషయం. ఆవిడ మైల భక్తి కూడా ఉండవచ్చును. కానీ ఆఫీసులో పదిమంది ముందు అంత గట్టిగా నీకు మైల ఉందా అని వినిపిస్తే ఏమనుకోవాలి?

ఆగండి.

కథ ఇంతటితో అయిపోలేదు. ఈ ప్రశ్న ఎందుకొచ్చిందో మూలాల్లోకి పోవాలి. ఆవిడకు కూడా ఒక లాజిక్‌ ఉంటుంది కదా! మనం ఎవరినైనా విమర్శిస్తున్నామంటే వారి కోణాన్ని కూడా అర్థం చేసుకుని విమర్శించడమే న్యాయం. ఆవిడ ప్రతి గురువారం సాయి ప్రసాదం తీసుకువస్తారు. ఆ ప్రసాదం పంచేముందు అడిగే ప్రశ్న ఇది. ఎవరు పంచమన్నారు? మేము అడిగామా! అంత గట్టిగా అడుగుతుంటూ పదిమంది ముందు అందులోనూ మగవారి ముందు ఎంత ఎబ్బెట్టు అని ఆలోచించే జ్ఞానాన్ని ఆ మైల తాలూకు భక్తీ భయం మింగేశాయి. ఇక్కడ తెలుగువారు ఎక్కువే. అందులోనూ మగవాళ్లున్నారు. ఈ బాధితురాలిని నేనొక్కదాన్నే కాదు. ఇంకా భారతీయులు ఉన్నారు. ఈ మైల గొడవ పశ్చిమదేశాల వారికి లేదు కాబట్టి బతికిపోయారు. చివరకు గురువారం వచ్చిందంటే ఆమె రాకను చూసి తప్పించుకోవాల్సి వచ్చేది. నాలాంటి వారంతా అదే పనిచేయడం కూడా గమనించాను. ఇది ఒక తరహా.

ఇపుడు ఇంకో “వై” దగ్గరికి వద్దాం. ఈ “వై”లు ఒకరు కాదు. అనేక “వై”లున్నారు. వీరు పెద్ద ముత్తయిదువ బాపతు. వీరు ఏకంగా ఆఫీసులోనే వ్రతాలు నోములు జరిపించేవారు. పశ్చిమదేశాల వారు ఇది భక్తికి సంబంధించిన వ్యవహారం కాబట్టి గౌరవం తోనో సహనం తోనే ఉండిపోయేవారు. కన్నడిగులైతే మంగళవారాలు, తెలుగువారైతే శ్రావణ శుక్రవారాలు. ఈ వైలలో ఒక పెద్ద ముత్తయిదువ అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసింది. ఆఫీసులో ఇద్దరు మగవాళ్ల భార్యలు గర్భం దాలిస్తే ఆమె పట్టుబట్టి వారిద్దరికీ బేబీ షవర్‌ జరిపించింది. వాళ్లిద్దరూ ఎంత సిగ్గుపడిపోయారో తల్చుకుంటే సిగ్గేస్తుంది.

ఇంకొందరు. భర్తతో పాటు వస్తారు. గ్రీన్‌ కార్డ్ వచ్చాక క్యుఏ ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లి ఎలాగోలా ఉద్యోగంలో చేరిపోతారు. తప్పేమీ లేదు. ఆర్థిక స్వతంత్రం ఆహ్వానించదగిన అంశం. కానీ ఏం చేస్తారు? తెలుగు సీరియల్స్ లో లాగా అమ్మలక్కల కబుర్లు మొదలెడతారు. అన్నీ మానవసంబంధాల చర్చలే. తామెంత పతివ్రతలు-అవతలివారు ఎంత అపతివ్రతలు. అంతా తెలుగులోనే. ఆఫీసుకు సంబంధించిన అంశాలు కూడా తెలుగులోనే మాట్లాడతారు. పరాయివాళ్లు కలిసిన గ్రూప్‌లో మాట్లాడుతున్నపుడు అందరికీ
అర్థమయ్యే భాష మాట్లాడాలనే కనీస ఇంగితం ఉండదు. చివరకు మీటింగ్స్లో కూడా తెలుగులోనే మాట్లాడతారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం గొప్ప అని కాదు. కాకపోతే ఇక్కడ ఉద్యోగ అవసరం కదా! ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉండడం వల్ల జరిగిపోతుందనే నమ్మకం. ఒక టీమ్‌ లీడర్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడమని రిక్వెస్ట్‌ చేస్తే నువ్వొక్కడివి తెలుగు నేర్చుకుంటే ఖతం అనేశారు. అతను నాదగ్గరకి వచ్చి తెలుగు ఎలా నేర్చుకోవాలి అని అడిగాడు. ఎందుకు నీకు అంత కస్టం అంటే ఐ నీడ్‌ దిష్‌ జాబ్ అనేశాడు. అలాఉంటుంది కథ.

ఈ వైలలోనే ఇంకో పులిహార బ్యాచ్‌ఉంది. బాస్‌లను మేనేజ్‌ చేయొచ్చు ఇంప్రెస్‌ చేయొచ్చు అని నమ్ముతారు.తప్పుగా అనుకోకండి. ఒకావిడ ప్రతి శుక్రవారం మేనేజర్‌కు పులిహోర పట్టుకువస్తుంది. పైగా క్రిస్‌కి నా పులిహోర చాలా ఇష్టం అంటుంది. క్రిస్‌ వెజిటేరియన్‌ కాబట్టి ఇంకో ఆవిడ ఎగ్‌ లెస్‌ కేక్‌ చేసి తరచుగా పట్టుకు వస్తుంది.

ఈ ఆచారాలు అనే కాదు. ఈ పెద్ద ముత్తయిదువల్లో మరి కొందరున్నారు. వారు సలహాలివ్వడం తమ హక్కు- పాటించడం ఎదుటివారి బాధ్యత అని స్థిరంగా నమ్ముతారు. వయోధిక్యాన్ని ఆధిక్యంగా మార్చుకుని ప్రదర్శిస్తుంటారు. ఫలానా అమ్మాయి, బ్యాడ్‌-మగవాళ్లతో మాట్లాడుతుంది-ఆమెతో మాట్లాడొద్దు అని డిక్రీ జారీచేస్తూ ఉంటారు. వినకపోయామో మనపేరు కూడా ఆ అమ్మాయి పేరు పక్కన జత చేస్తారు.

ఒక అమ్మాయి గురించి చెప్పాలి ఇక్కడ. తను కష్టజీవి. మంచుకురిసే కాలంలో కూడా ఎన్నడూ లేట్‌కాకుండా గడియారానికే టైం నేర్పుతున్నట్టు ఠంచన్‌గా వస్తుంది. కొత్తగా జాయిన్‌ అయిన వారికి చాలా చాలా సాయం చేస్తుంది. డిగ్రీ అవగానే పెళ్లి చేశారు. భర్త శాడిస్ట్‌. కూతురు పుట్టాక విడాకులు తీసుకుంది. వేరే దేశస్తున్ని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడింది. అదో పెద్దనేరం మనవాళ్ల దృష్ఠిలో. పెద్ద ముత్తయిదువులకు ఆమె ఒక విలన్‌. పాత సినిమాల్లో చేతిలో సిగరెట్‌ పట్టుకుని డాన్స్‌ వేస్తూ మామయ్య వస్తే పనిమనిషి అని పిలిచే కోడలు ఉంటుందే అలాంటి దర్శకుల ప్రతిభ వీళ్లలో పుష్కలంగా ఉందన్నమాట. ఆమెను బిచ్‌ అని బ్యాడ్‌ అని ఏమేమో అనేవారు. అందరూ నీవెనుక ఇలా అనుకుంటారు ఎందుకు అయినా అందరితో మంచిగా ఉంటావు. సాయం చేస్తావు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఇది. వాళ్లు నన్ను అలాగే పిలుచుకుంటారు అని తెలుసు. ఇలా ఉండడం వల్ల పాజిటివ్‌ స్పిరిట్ తో గతకాలపు గాయాలను మర్చిపోగలుగుతున్నా. ఇలా ఉండడమే బిచ్‌ అయితే “ఎస్‌ ఐయామ్‌ బిచ్‌ ” అని చెప్పింది. “ఐ యామ్‌ ప్రౌడ్‌ టు బి ఎ బిచ్‌ రాదర్‌దాన్‌ ఏ పతివ్రత” అని కూడా చెప్పింది. సూటిగా స్పష్టంగా. ప్రాజెక్ట్‌ అయ్యాక మిగిలిన వాళ్లు అలా ఇలా వెతుక్కుంటూ ఉంటే ఆ అమ్మాయికి మూడు ఆఫర్లు వచ్చాయి.

అందరికీ ఇలాంటి అనుభవాలు లేకపోవచ్చు. కానీ ఈ అనుభవాలు అయితే నా జీవితంలో నేను కళ్లెదురుగా చూసినవి. ఇది ఏ సంస్కృతి. ఏ సంస్కృతిని మనం అక్కడినుంచి మోసుకొచ్చాం. ఇది మనకు గౌరవం తెచ్చే సంప్రదాయాలా!వాస్తవానికి ఇవాళ భారత్‌లో కూడా ఆఫీసుల్లోకి ప్రసాదం తెచ్చి అందరి ముందూ నీకు మైల ఉందాఅని అడుగుతూ పోయే ఆడవాళ్లని ఊహించుకోలేమని అక్కడివారు చెపుతున్నారు. అక్కడ మహిళలు ఎంతో కొంత పురోగతి సాధిస్తూ ఉంటే ఎంతో ఎదిగామని రెక్కలు కట్టుకుని వచ్చి ఇక్కడ వాలిన వాళ్లు సంస్కృతి పేరుతో ఆచారాల పేరుతో అక్కడ గార్బేజ్‌లో వదిలేసిన సంస్కృతిని జాగ్రత్తగా ఏరుకుని మూటగట్టుకుని ఇక్కడకు తెచ్చి అందరిముందూ ప్రదర్శనకు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

*

మీ మాటలు

 1. గుడ్ one

 2. చాల బాగా ఎక్ష్ప్రెస్స్ చేశారు

  • శోభా గారు ,
   ఇది నా మొదటి ఆర్టికల్, మీ కామెంట్ తో నాకు ఇంకా రాయగలను అనే నమ్మకం కుదిరింది.
   థాంక్ యు.

 3. rajani patibandla says:

  ఐ లవ్ యు

  • రజని గారు,
   మీరు నా ఆర్టికల్ ని ఇంత గా ఇష్టపడటం నాకు చాలా సంతోషంగా అనిపించింది.

 4. దేవరకొండ says:

  సునంద గారు, మీ వ్యాసం ఎంత బాగుండి, ఎంత బాగా చదివించిందంటే దీన్ని ప్రింట్ తీసి ఆ ఎక్స్ లకూ వై లకూ వెంటనే పంచితే బాగుండును అన్నంత! సీరియస్ గానే అడుగుతున్నాను, ఇది వాళ్ళని చేరే అవకాశం ఉందా, లేదా…అప్పుడే దాని ప్రయోజనం కదా! ‘అలాంటి ‘ వాళ్ళు ఇలాంటివి చదవరు, ఇలాంటివి చదివేవారికి ఇలాంటి వాటి అవసరం ఉండదు! ఎంత మాయ!

  • దేవరకొండ గారు,
   ‘అలాంటి ‘ వాళ్ళు ఇలాంటివి చదవరు, ఇలాంటివి చదివేవారికి ఇలాంటి వాటి అవసరం ఉండదు! నిజం చెప్పారు.

 5. P V Vijay Kumar says:

  Oshin ! u r writing well…..keep ur own style

 6. తమ ఎబ్బెట్టు ప్రవర్తన ఎదుటివారికి ఎలా కనిపిస్తుంది అనిపిస్తుంది అన్నది పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలోపడ్డట్టు ఉండేవారు ఎక్కడపడితే అక్కడ లెక్కకు మిక్కిలిగా ఉన్నారు వారికి దేశం,ప్రాంతం,భాషా,మతం,కులం,రంగు తేడాల్లేవు.ఎటొచ్చి మనవారనుకున్నవారు అలా ప్రవర్తిస్తే అందులో పరాయి దేశంలో తలకొట్టేసినట్టుంటుంది.
  వారిని బారిస్టర్ పార్వతీశాలని అనుకోని సద్దుకోవాలేమో? లేకుంటే ‘వారేమి చేస్తున్నారో వారికే తెలియదు క్షమించు భగవంతుడా అనాలేమో?

 7. గుడ్ వన్ సునంద .. బాగా చెప్పావు

మీ మాటలు

*