అవధూత గీత

dhyanam

ఆప్త చైతన్య గా ప్రసిద్ధి చెందిన దొడ్లంకి వెంకటరావు కవి, చిత్రకారుడు, పిల్లల ప్రేమికుడు, అన్నిటికన్నా మెహెర్ చరణాలముందు మోకరిల్లినవాడు. సహజంగానే ఉపాధ్యాయుల హృదయాలు చాలా విశాలంగా ఉంటాయి. ఇక ఆ ఉపాధ్యాయుడు కళాకారుడు కూడా అయితే చెప్పవలసిందేముంది? ఆ కళాకారుడు ‘ధూళిగా మారే’ ‘ప్రేమ పథికుడు ‘అయితే ఆ జీవితం నిత్యం దీపం వెలిగే కోవెలనే కదా.

ఇప్పుడు ఈ ‘కవితాధ్యానం ‘ చేతుల్లోకి తీసుకోగానే మనమట్లాంటి ఒక మందిరంలో అడుగుపెట్టినట్టు అనుభూతి చెందుతాం. అసలు కవిత, ధ్యానం రెండూ ఒకటే, ‘కవితా ధ్యానం ‘ ఒకరకంగా పునరుక్తి పదమే. కాని అర్థవంతం కాకపోతే కవి ప్రయోగించడు కదా. పుస్తకం ఒక పఠనం ముగించేటప్పటికి నాకేమనిపించిందంటే, ఇది కవిత ద్వారా చేసిన ధ్యానమని.

ధ్యానమంటేనే, మరే విషయం మీదా మనసు పోకుండా ఒకే అంశం మీద మనసుని లగ్నం చెయ్యడం కదా. అది నేరుగా జరగవలసిందే కదా. మధ్యలో కవిత్వమెందుకు?

ఇది చాలా సూక్ష్మమైన విషయమనిపించింది. దీని వెనక ఎంతో యోగశాస్త్రముందేమో కూడా. కాని, అనాది కాలంనుంచీ భక్తి కవులు చేస్తూ వచ్చింది ఇదే కదా. ఒక చోట తుకారాముడిట్లా అంటాడు:

‘తుకా అడిగేదొక్కటే, ఏదో ఒకటి మాటాడు నాతో
అప్పుడు ఈ కవిత కూడా ఏదో ఒకటి మాటాడుతుంది.’

కవిత మనకి అద్దం లాంటిది. అద్దం నిశ్చయాత్మకతకు చిహ్నం. మనమున్నామని మనకు ధైర్యం చెప్తుంది. కవిత కూడా అంతే. మన అంతరంగ ప్రయాణానికి అదొక అక్షరసంకేతం.

నిజమైన సాధకుడికి జీవితమంతా తనకీ దేవుడికీ మధ్య ఎడతెగని ఒక సంభాషణ. కొందరు సాధకులు తాము నిత్యం దేవుడి ముందు ప్రసంగిస్తూ, సంకీర్తన చేస్తూ ఉంటారు. అన్నమయ్య లాగా. కొందరు దేవుడి ప్రసంగాన్ని మౌనంగా వింటూ ఉంటారు, రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షి లాగా. కాని చాలామంది సాధకులకి అది తమకీ దేవుడికీ మధ్య సంభాషణ. తమ మాటలు దేవుడు వింటున్నాడనీ,తాము దేవుడి మాటలు వింటున్నామనీ తమని తాము గిల్లి చూసుకున్నట్టుగా వాళ్ళు అప్పుడప్పుడు కవిత్వం చెప్తుంటారు.
ఈ కవితా ధ్యానం కూడా అట్లాంటి సంభాషణ. అన్ని సంభాషణల్లోలానే ఇందులో కూడా కొంత కలకలం, కొంత కలవరం, చివరికి ఆ కల వరంగా మారేదాకా-

‘నీవు చెప్పేదంతా గందరగోళంగా కనిపిస్తాది నాకు
పరీక్ష పెట్టేవాడే తట్టుకునే శక్తినిస్తాడంటావు
పరీక్ష ఎందుకో, తట్టుకుని నిలబడ్డవెందుకో
నేనెంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు
కల గనడమెందుకొ,ఆ కలను బాధల ఒత్తులతో చెరపటమెందుకో ‘ (పే.7)

మామూలుగా ధ్యానం మౌన వ్యాసంగం. కాని కవితాధ్యానం కాబట్టి నాదమూ,రాగమూ, అనురాగమూ తప్పనిసరి. కాని ఆ ప్రయాణం దారితీసేది చివరికి మౌనానికే.

మౌనం నుంచి మౌనానికి చేసే ఈ ప్రయాణంలో సాధకుల మానసికావస్థలన్నీ గోచరమవుతున్నాయి కాబట్టి ఈ కవిత్వం మనకొక సాధకుడు అయాచితంగా తన ఆత్మరహస్యాన్ని విప్పి చెప్పినట్టుంది.

ఒక సూఫీకీ ఈశ్వరుడికీ మధ్య అనుబంధం మూడు దశల్లో బలపడుతుందని ఒక సూఫీ సాధువు చెప్పాడు. అందులో మొదటిదశలో సూఫీకీ, ఈశ్వరుడికీ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన ఒక క్లయింటుకీ, అతడి లాయరుకీమధ్య ఉండే సంబంధంతో పోల్చాడు. ఆ క్లయింటు తన లాయరుతో మొత్తం మొరపెట్టుకుంటాడు. ఏ చిన్న వివరం, రహస్యం, విశేషం ఏదీ అతణ్ణుంచి దాచడు.

‘ప్రీయమైన తండ్రికి,
ఆ ఒక్కటీ నీకు చెప్పేశాక
ఇంక నా దగ్గర ఏవీ మిగల్లేదు
నావన్నీ నువ్వు లాక్కుంటావని
ముందస్తుగా నన్ను హెచ్చరించిన నీకు
నా కృతజ్ఞతలనెలా తెలుపుకోవాలో నాకు తెలీదు.’ (పే.21)

అనే మాటలు ఆ దశకి చెందినవే.

రెండవ దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య అనుబంధం పసిపాపకీ, తల్లికీ మధ్య ఉండే హృదయబంధం. పసిపాప ఒక క్లయింటులాగా ఏదీ చెప్పుకోలేదు. అసలు మాట్లాడనే లేదు. తన సంతోషం, దు:ఖం ఏదైనా సరే, గుక్క పట్టి ఏడుస్తుంది. ఆ బాధ ఏమిటో ఆ తల్లికే తెలుస్తుంది, ఆ రోదన వినగానే, ఆ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను ఎదకు హత్తుకుంటుంది.

‘నేనెవరిమీద కేకలేస్తున్నాను?
నీ మీదేకదా!
నేనెవరిని కావలించుకుంటున్నాను?
నిన్నే కదా!
నా చుట్టూ నువ్వు తప్ప
వేరే ఎవరున్నారు?
నువ్వు కోపించడం చూసాను
నువ్వు ద్వేసించడం చూసాను
నువ్వు లాలించడం చూసాను
నువ్వు ప్రేమించడం చూసాను
నువ్వు మథన పడటం చూసాను
నువ్వు దు:ఖించడమూ చూసాను
నువ్వు పీకలు కోయడమూ చూసాను
నువ్వు నీ కుత్తుకను కత్తికి బలివ్వడమూ చూశాను
నువ్వు మోసగించడం చూసాను
నువ్వు మేల్కొల్పటమూ చూసాను ‘ (పే.86)

అట్లాంటి రోదన.

ఇక చివరి దశలో, సాధకుడికీ, ఈశ్వరుడికీ మధ్య ఉండే అనుబంధం ఒక మాసిన వస్త్రానికీ, ఒక రజకస్త్రీకీ మధ్య ఉండే సంబంధం లాంటిదట. ఆ మాసిన గుడ్డ కనీసం ఏడవను కూడా ఏడవదు. తనని తాను ఆ రజకస్త్రీ హస్తాలకు మౌనంగా సమర్పించుకుంటుంది. తన మురికి వదిలేదాకా, ఆ హస్తాలు తనని బండకేసి బాదుతుంటే, వళ్ళప్పగించేస్తుంది.

‘కొట్టేది నువ్వే!
కౌగలించుకునేది నువ్వే!’ (పే.6)

అనే మాటలు అప్పుడే వస్తాయి.

ఆప్త చైతన్య ఈ మూడు దశలూ దాటాడు అనటానికి, ఈ కవిత్వం ఒక ఆనవాలు. కనుకనే ఇట్లా అంటున్నాడు:

‘నా దృష్టి ఇప్పుడు దేనిమీదా లేదు
సూర్యుని మీదా లేదు
సుందరమైన ప్రకృతిమీదా లేదు.
భ్రమర ఝుంకారానికీ, ఝుమ్మన్న ఈగల శబ్దానికీ
తేడా నాకు తెలియడం లేదు
స్త్రీ వక్షానికీ, శరాఘాతానికీ తేడా నాకు తెలియడం లేదు.’

ఎట్లాంటి కవిత ఇది! నేను చదివిన అత్యున్నత ఆధ్యాత్మిక సాహిత్యానికి సరితూగే వాక్యాలివి, ఇంకా వినండి:

‘నా దృష్టి ఇప్పుడు సంతోషం మీదా లేదు
సంకట స్థితి మీద లేదు
మలయమారుతానికీ, మండే జ్వాలకీ
తేడా నాకు తెలియడం లేదు
వలపులు విసిరే నవ్వుకీ, వల విసిరే జాలరికీ
తేడా నాకు తెలియడం లేదు.
నా దృష్టి ఇప్పుడు కలమీదా, వాస్తవం మీదా లేదు
పగటికీ, రాత్రికీ తేడా నాకు తెలియడం లేదు
వగలకీ, పగలకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు నవ్వుల పడవ మీదా లేదు
కెవ్వుమన్న ఏడ్పుల పాడె మీదా లేదు
పకలరింపులకీ, పరనిందలకీ తేడా నాకు తెలియడం లేదు
తీయని మాటలకి, తేనె పూసిన కత్తులకీ తేడా నాకు తెలియడం లేదూ

‘నా దృష్టి ఇప్పుడు సముద్రం మీద గాని, అలలమీదగానీ
నురుగుమీదగానీ, బుడగమీద గానీ లేదు
నీ మీదే ఉంది!
ఒక్క నీ మీదే ఉంది! (పే.28)

మన కాలంలో మన మధ్య సంచరిస్తున్న మన మిత్రుడొకరు రాసిన అవధూత గీత ఇది. ఇతడూ, నేనూ కలిసి కొన్నాళ్ళు ఒకచోట పనిచేసామని తలచుకుంటే నన్ను నేను అభినందించుకోకుండా ఉండలేకపోతున్నాను.

*

మీ మాటలు

  1. ఖరీదు కట్టే షరీబు కావాలన్న శ్రీ శ్రీ వాక్యం ఇక్కడ అన్వయిస్తున్నది.ఆధ్యాత్మికభావనల అర్థ గాంభీర్యాన్ని,మూడు దశల ఉపమానాలతో వింగడించ గలిగిన మీ వంటి వారు ఆయన(కవి) గారితో కలిసి పనిచేయడం ఆ పుస్తకం చేసుకున్న సుకృతం.

Leave a Reply to Rammohanrao Cancel reply

*