స్వేచ్ఛకి లోపలి కోణం!

konni sephalikalu

లోగో: భవాని ఫణి

 

 

పదిహేను రోజులు క్రితం హైదరాబాద్ లో ‘రమణీ సె రమణాశ్రమ్ తక్’ అనే పేరుతో హిందీలో రాసిన చలం గారి సంపూర్ణ చరిత్ర 14 వందల పేజీల పుస్తకం తాలుకు ఆవిష్కరణ సభ జరిగింది.  ఆ సభలో మాట్లాడుతూ ఇంతకాలం చలం చెప్పిన బయటి  స్వేచ్ఛ గురించే మాట్లాడాం.  ఇక లోపలి స్వేచ్చ గురించి మాట్లాడాలి.  ఎందుకంటే లోపలి స్వేచ్ఛ లేని బయట స్వేచ్ఛ హాని చేస్తుంది అన్నాను.  సభ పూర్తయ్యాక నన్ను ముగ్గురు నలుగురు ఆ లోపలి స్వేచ్ఛ అంటే ఏమిటని అడిగారు.  వెంటనే నాకు చలంగారి ‘శశాంక’ నాటకం గుర్తొచ్చింది.  చాలా కాలం నన్ను ఆలోచింపజేసి ఇప్పటికీ నా వెంట ఉండి నడిపించే మార్గదర్శకాల లాంటి పాత్రలున్న నాటకం అంది.  ఆ కథ, దానిలో కలగలిసిన ఆలోచనల గురించి కాస్త చెప్పుకుందాం.

తారాశశాంకమనే పురాణ కథను పెద్దగా మార్చకుండా అసలు అలాంటి కథలో అంతరార్థమేమయి ఉంటుందో చెప్పడానికి చలంగారు చేసిన ప్రయత్నమే ఈ నాటకం, ఇది నిరుపమానం.  రచన అంతా కవితాత్మకంగా ఉంటూనే ఆలోచనాత్మకంగా కూడా ఉంటుంది.

బృహస్పతి దేవ గురువు.  అతని భార్య తార.  బృహస్పతి బుద్ధిశాలి, వివేకి.  తారలోని రసస్నిగ్దత అతనికి తెలుసు.  కానీ అది తనవల్ల స్పందన పొందడం లేదని, దానికి లోపం తనదేనని గ్రహించుకోగల వివేకి.  ఎవరిలోనూ లోపాన్ని ఎంచడానికి ఇష్టపడని వ్యక్తి. వారిద్దరూ కలిసి శశాంకుడనే కుర్రవాడిని పెంచారు.  శశాంకుడు ఇప్పుడు లేప్రాయపు యువకుడయినాడు.  అతని మిత్రురాలు అనూరాధ.  తార అనూరాధను నిందిస్తుంటే బృహస్పతి ఇలా అంటాడు “ఇతరులలో కనపడే మాలిన్యమెప్పుడు హృదయ దర్పణాల ప్రతిబింబితమయిన స్వకీయ కల్మషమే” అని అంటూ ఈర్ష్యాసూయలు వద్దు అంటాడు.  అప్పటికే తార శశాంకుడి పట్ల మోహంతో ఉంది అని ఆయన గుర్తించాడు.  తన ప్రేమకు ఆమె స్పందించకపోవడాన్ని కూడా గుర్తు చేస్తాడు.  దానికి ఆమె “తపసి ప్రపంచము వాంఛాతీతము కదా” అంటుంది.  ఇక్కడ బృహస్పతి నోటి వెంట చలంగారు ఒక గొప్ప మాట అనిపిస్తారు.  “ప్రపంచ రసాస్వాదనమే తపస్సు” అని, రసాస్వాదన చెయ్యగల హృదయ స్పందన కలిగి ఉండడమే, అటువంటి హృదయాన్ని సంపాదించు కోగలగడమే తపస్సు అని ఆయన ఉద్దేశం.  తారలో ఉన్న అపారమయిన ప్రణయ ప్రళయ పాతాళగంగను విజ్రుంబించ జేసి, సాఫల్య పరచుకునే శక్తి తనకు లేదని గ్రహించి ఆ లోపం తనదేనని అర్ధం చేసుకోగల ధీరుడు బృహస్పతి.  అతని ప్రేమకు తనను అర్హురాలిగా అతన్నే మార్చుకోమంటుంది తార.  కాని ‘ప్రేమ ఆత్మసమర్పణ మయినప్పుడే స్వీకరణార్హము’ అనే స్వేచ్చ వల్లనే అది సాధ్యపడాలి గాని ప్రయత్నం వల్ల సాధ్యం కాదంటాడు.  ఈ మాటలు జీర్ణం చేసుకోగలిగితే ఎంత స్థిమితం వస్తుంది మనకి.

ఇటువంటి వాతావరణంలో బృహస్పతి పట్ల స్పందించని ఆమె హృదయం శశాంకుడి పట్ల కదలడానికి, కరగడానికి కారణం తారలాగే శశాంకుడు రసోన్మత్తుడు కావడమే.

“నా కళ్ళలో జ్వలించే మహారతి దీప్తికి, నా మొహంలో నాట్యమాడే మోహాతురతను చూసి పార్వతమయినా నన్ను  వరించి ఉంటుందనే నా నమ్మకం” అనేటంత నమ్మకం అతని మీద అతనికి.  ఈ ప్రపంచం లోని స్త్రీత్వమంతా అతనికి దాసోహమవ్వాలన్నంత కాంక్ష అతనిది.

అలాంటి శశాంకుడి పట్ల తార స్పందిచండం గమనించిన బృహస్పతి ఆమెను హెచ్చరించాడు.  అతని హృదయాన్ని అతన్ని ప్రేమించే అనూరాధ వైపు తిప్పే ప్రయత్నం చెయ్యమన్నాడు.  కానీ అది తార వశంలో లేదు.  అది కుడా బృహస్పతి గ్రహించాడు.

gudipati_vekata_chalam

తారా శాశంకల సమాగమం జరిగితే దాన్ని ఎంతో సహజమయిన విషయంగా తీసుకోగల మానసిక శక్తి కోసం, తిరిగి తారను తనదానిగా అంగీకరించగల మానసిక నైర్మల్యం సంపాదించడం కోసం అతను మరింత తపశ్శక్తిని సంపాదించుకోవడానికి వెడతాడు.

సమాగమం జరిగి శశాంకుడు భీతితో ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు.  తార దిగులుతో ఉంది.  అది తన మనసుకు తగిలి తపస్సు మధ్యలోంచి లేచి వచ్చాడు బృహస్పతి.  ఏ సహాయం కోరి నన్ను తల్చుకున్నావని అడిగినప్పుడు శశాంకుడిని తీసుకురమ్మన్నది తార.  ఇక్కడ వారి సంభాషణ ఎంతో ఆలోచింపచేస్తుంది.  ఒక స్పష్టత కుడా ఇస్తుంది.

“నువ్వే అతని వద్దకు వెళ్ళు” అంటాడు.  “ఇల్లు వదిలి వెళ్లిపొమ్మంటున్నారా సాధారుణులవలె ? లోకమూర్ఖత్వాన్ని సహించగలనా ?” అంటుంది.

“నీ భీరుత్వానికి చౌర్యాన్ని జతచేసి నన్ను తెరగా నీతి వస్త్రం కప్పి నుంచోమంటున్నావు తెలుసా” అని ఆమెను ప్రశ్నిస్తాడు.

ప్రేమకోసం తార బృహస్పతిని ఆ త్యాగం చేయమంటుంది.  అతను ప్రేమ కోసం చేస్తానని చెప్పినా, తారకు హెచ్చరిక చేస్తాడు.  “ప్రజల తుచ్ఛ అభిప్రాయాలను లక్ష్య పెట్టే నడత సత్యచోదితం కాదు.  కాంతి నుంచి విముఖవు కావద్దు, హృదయ పరీక్ష తెచ్చే పర్యవసానాన్ని విశ్వసించి, అంగీకరించి, అనుష్టించే ధైర్యం విడనాడకు” అంటాడు.  నమ్మినదాన్ని ఆచరించడానికి కావలసిన నిర్భీతి గురించే ఇలా చెప్తారు చలం గారు.

బృహస్పతి వెళ్లి శశాంకుడిని తీసుకొచ్చి తారకు అప్పగించేడు.  తార అతడిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళింది.  కానీ ఈ విధమైన అనుభవం ఆమెను మాతృత్వ భావనలోకి తీసికెళ్ళింది.  శశాంకుడి వల్ల పూర్ణ స్త్రీగా మారిన ఆమె “ఏ దేశమో పోయి వచ్చిన కుమారుణ్ణి కౌగిలించుకున్నట్టుగా ఉంది ఈ రాత్రి నాకు అంటుంది.

ఈ సంఘటన తర్వాత ప్రపంచ సౌందర్యంలోకి దృష్టి వికసించడాన్ని గురించి చెప్తూ “ఇదంతా నాదే అన్న భావం నుంచి ఇదంతా నేనే” అన్న దానిలోకి మనసు ప్రయాణించాలంటారు చలం గారు.

శశాంకుడినీ, తారనూ అంగీకరించగల శక్తితో లోకపు మూర్ఖత్వాన్ని ఎదిరించగల ధీరుడుగా బృహస్పతి కనిపిస్తాడు.

అయితే శశాంకుడి మాటేమిటి? అందుకోసం చలంగారు ఈ ఆశ్రమంలోకి అహల్యను కూడా రప్పించారు. ‘అమితమైన స్త్రీ ప్రేమ కోసం, మోహం కోసం ఆరాటపడే శశాంకుడికి ఆమె ప్రేమ జీవనానికి కావలసిన ఏకాగ్రత గురించి చెప్తుంది.  చంచలత నుంచి నిశ్చలకు రావలసిన ఏకాగ్రత యొక్క అవసరం, ఆ దారీ వివరిస్తుంది.

కళాకారుడు, పిపాసీ అయిన అతని మోహకాంక్ష సంగీత, సాహిత్యం వంటి ఉపకరణాల ద్వారా శమింప జేసుకునే మార్గాన్ని, వాటినే తపస్సుగా మార్చుకునే ఏకాగ్రతా సిద్ధిని, మనో నిశ్చలతను పొందే దారిని సూచిస్తుంది.

తన కొద్దికాలపు సౌఖ్యానుభవం వల్ల కలిగిన లోకనింద భరించలేక, వేల ఏళ్ళు పాషాణంగా మారిపోవడం తన హృదయ స్థితినే సూచిస్తుందనీ, కానీ ఆ కొద్ది ఘడియల ప్రేమానుభవం వల్లనే మిగిలిన జీవితాన్ని జీవించగల శక్తి వచ్చిందని అహల్య అంటుంది.  అయితే ఏ పురుషుడితో ఆ అనుభవం కలిగిందో అతను భీరువు కావడం వల్లనే తనకలాంటి స్థితి వచ్చిందని, అతడు ధీరుడయితే తను లోకాన్ని జయించి ఉండేదాననని అంటుంది. చివరిగా ఒక మాట అంటుంది.  ఇది చలంగారి మాటే “మన హృదయంలోని సౌందర్యాశయం ఉందే! దాన్ని మన హృదయమే కవ్విస్తోంది.  అది దేనివల్లా సఫలం కాదు.  మన హృదయం వల్లనే తప్ప.  మనని  ప్రేమించిన వ్యక్తిలో మనం ఆ ఆదర్శాన్ని కల్పించుకుని సంతుష్టి పడాలి”  అంటుంది.  అంతే కాక అతని అహంకారాతిశయం చూసి, చెంపల నునుపు చూసి భ్రమసి మతిహీనులయ్యే క్షుద్రులనుకోకు – స్త్రీ జనమంతా” అని హెచ్చరిస్తుంది.  ఈ హెచ్చరిక చాలా మంది పురుషులకు కుడా చెంప దెబ్బే.

మోహ జీవనం నుంచి ప్రేమ జీవనం వైపు చేసే ప్రయాణంలోని కఠోరత అంతా ఈ కథలో ఉంది.  ఇంత కన్నా ముఖ్యమయినది మరోటి ఉంది.  అది ఇలాంటి జీవనంలో ఉన్నవారి గురించి మనం ఎలా ఆలోచించాలి,  అసలు లోకం పట్ల మన స్పందన ఎలా ఉండాలి, అన్నది.

విశ్వామిత్రుడితో కలిసి ఋషులు బృహస్పతి ఆశ్రమానికి వచ్చి ఈ అక్రమ సంబంధాన్ని గురించి నిలదీసినప్పుడు బృహస్పతి వారికి చెప్పిన సమాధానాలు, “నీతి, దుర్నీతుల విచక్షణ నీ జీవితాన్ని దిద్దుకునేందుకు ఉపయోగపడాలి తప్ప లోకాన్ని దిద్దేందుకు కాదు.  నీ ధర్మం తప్ప సామాన్యుడు గానీ, ఇంకెవరు గానీ ఇంకొకరి ధర్మం నీవు నిర్ణయించడం మూర్ఖం, సాహసం” ఇంకా గౌతమ మహర్షితో ఇలా అంటాడు.

new doc 10_1

“అజ్ఞానంతో, దుర్బలత్వంతో, మూర్ఖత్వంతో, సమస్త ఈతి బాధలకూ లోనయి కర్మవశాన జరామరణాదులనుంచి విముక్తి గానక అంధకారంలో మునిగే ఈ ప్రాణికోటికి ధర్మ బోధ చేస్తావా గౌతమా? వారికి ఆత్మాభివృద్ధి చెయ్యాలనే సంకల్పం నీకుందా ? ఉంటే ప్రేమించు, సమస్త జీవుల్నీ ప్రేమించు.  ఖండించకు, శిక్షించకు, నీకన్న, నీ తపస్సుకన్నా, నీ భర్య కన్నా, నీ ఈశ్వరుడి కన్నా అధికంగా దుర్గతిలో పెనుగులాడే ఈ లోకాన్నంతా ప్రేమించు.  కల్మషమంతటితోనూ నిండిన ఈ ప్రపంచాన్ని నీ హృదయానికి హత్తుకో” అంటాడు.

కర్మానుసారం మనుషులు నశిస్తారు.  మనమేం చెయ్యగలం -? ప్రేమించి ఎమిటి లాభం” అన్న గౌతముడి ప్రశ్నకు తిరిగి బృహస్పతి ఇచ్చిన జవాబు నన్ను కదిలించి నిరంతరమూ నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ జవాబు “ప్రేమించడం వారి కోసం కాదు.  నీ ఆత్మ పారిశుధ్యం కోసమోయీ” అన్నది.  అనేకానేక ఉద్యమాలు నడిపే అనేకానేకులైన మహానుభావులు ఈ మాట గ్రహిస్తేచాలనిపిస్తుంది.  ఇంతకన్నా లోపలి స్వేచ్ఛ గురించి స్పష్టంగా ఎవరు చెప్పగలరు -???

ప్రకృతి అందాలకి పరవశిస్తూ అందులో లీనమావుతూ ఆ ఆనందాన్ని తన పాటలో పలికించుకునే మరో విశిష్ట పాత్ర అనూరాధ. “ఈ అడవి దాగి పోనా ! ఎటులయిన ఇచటనే ఆగిపోనా” అన్న కృష్ణ శాస్త్రి గారి మాటలో ‘ఎటులయినా’ అన్నమాట ఎంతగానో ఆలోచింపదగ్గది.  ప్రకృతి మనకి ఎంత ఇష్టమయినా జీవితపు మోహాలు అక్కడ ఆగనివ్వవు.  వెనక్కిలాగుతాయి.  కాబట్టి ఎలాగయినా సరే వాటినన్నిటినీ జయించి ఇక్కడే ఆగిపోతాను అని కవి ఆశయం.  అనూరాధ అలాంటి మోహాలు లేని ప్రేమ జీవి. ప్రశాంతంగా ఉంటూ, నిర్మలంగా శశాంకుడిని ప్రేమిస్తూ ఉంటుంది.  శశాంకుడి వంటి మోహోన్మత్తుడికి ఆమె మాత్రమే తరణోపాయం.  ఇది అహల్య మాటల ద్వారా శశాంకుడు గ్రహిస్తాడు గాని అతని జీవన మోహ జ్వరాలు ఎంతో సాధన వల్లగాని శమించవు అని మనం అలాంటి వ్యక్తుల్ని చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నప్పుడు తెలుస్తుంది.

ఈ నాటకం మొత్తం మీద చలంగారు సూచించిన మరొక ప్రధాన అంశం హృదయస్పందనే ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలని.  అపుడే ఆ సంబంధం దివ్యం అవుతుంది.  ఇటువంటి హృదయ ప్రధానమయిన స్త్రీ పురుష సంబందాల పట్ల చుట్టూ ఉన్న ప్రపంచమూ, ఆయా సంబంధిత వ్యక్తులూ ఎంతో ఉదారంగా ఉండగలగాలి.  ఏ గొప్ప జ్ఞానమయినా అటువంటి దివ్యానుభవం వల్లనే ఆయా వ్యక్తులకు కలుగుతుంది.  కలగలేదు అంటే ఆ అనుభవంలోని దివ్యత్వంలో ఎక్కడో ఏదో లోపం ఉందని అర్ధం.  ఇటువంటి దివ్యానుభవం పొందిన వ్యక్తులకు  ఉదాహరణగా ఇందులో బృహస్పతి, తార, అహల్య పాత్రలను చూపించారు. ఇందుకోసం కాకుండా కేవల ఆకర్షణే ప్రధానంగా శరీర సంబంధాలు పెట్టుకోవడం పట్ల చలంగారికి పెద్ద ఆసక్తి లేదన్నది తెలుస్తోంది.

ఇదంతా ఆచరణకి ఎంతో దూరంగా ఉన్నా సరే పదే పదే ఆలోచింపజేసి, అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులకు లోపలి వెలుగును ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం.

*

మీ మాటలు

  1. దేవరకొండ says:

    ఎంత అద్భుతమైన విశ్లేషణ! అనేకమార్లు అధ్యయనం చేసి ఆ భావాలతో మమేకమై దశాబ్దాలు సహచరించి తనలో లీనం చేసుకోకుంటే ఇలాంటి లోతైన విశ్లేషణ చేయగలగడం అసాధ్యమని నా అభిప్రాయం. ఎన్నో సార్లు చదువుకుని అనుభూతి చెందాల్సిన రచన! వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గార్కి అభినందనలు మాత్రమే కాదు, ధన్యవాదాలు! “ఇందుకోసం కాకుండా కేవల ఆకర్షణే ప్రధానంగా శరీర సంబంధాలు పెట్టుకోవడం పట్ల చలంగారికి పెద్ద ఆసక్తి లేదన్నది తెలుస్తోంది.” ఈ నిర్ణయానికి రావడానికి వెనుక ఇంత తాత్త్విక భూమిక మన ముందుంచిన రచయిత్రి చలం గార్ని అర్ధం చేసుకునే ఒక సందర్భం సృజించారు.

    • Vvlakshmidevi@gmail.com i says:

      దేవరకొండ గారూ మీ సహృదయత కు ఎంతో సంతోషంగా ఉంది

  2. satyanarayana says:

    “ఇదంతా ఆచరణకి ఎంతో దూరంగా ఉన్నా సరే పదే పదే ఆలోచింపజేసి, అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులకు లోపలి వెలుగును ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం.” మీ ముగింపు వాక్యం నిజం.

    హృదయస్పందనే ప్రధానంగా స్త్రీ పురుష సంబంధాలు ఏర్పడాలనుకోవడం నాగరికతా చిహ్నం . కొన్ని పాశ్చాత్య దేశాలలో ఈ తరహా నాగరికత ఏర్పడ్డది . స్త్రీ ,పురుషులు ఒకరినొకరు సమానం గా గౌరవించుకోవడం ,ఒకరి అనుభూతులొకరు గ్రహింపుచేసుకోవడం ,బాంధవ్యాల గాఢత తగ్గినపుడు ,స్నేహపూరితంగా ఎవరి మార్గాన్ని వారనుసరించడం కనిపిస్తుంది . చలం ఇలాటి అధునాతన బంధాలనే ఆశించాడేమో !

    “నీతి, దుర్నీతుల విచక్షణ నీ జీవితాన్ని దిద్దుకునేందుకు ఉపయోగపడాలి తప్ప లోకాన్ని దిద్దేందుకు కాదు. నీ ధర్మం తప్ప సామాన్యుడు గానీ, ఇంకెవరు గానీ ఇంకొకరి ధర్మం నీవు నిర్ణయించడం మూర్ఖం, సాహసం” –ఎంత ఉదాత్తమైన భావం !ఇవ్వాళ లోకం లో ఎంత అవసరం ఈ భావన !

    “అంధకారంలో మునిగే ఈ ప్రాణికోటికి ధర్మ బోధ చేస్తావా గౌతమా? వారికి ఆత్మాభివృద్ధి చెయ్యాలనే సంకల్పం నీకుందా ? ఉంటే ప్రేమించు, సమస్త జీవుల్నీ ప్రేమించు. ఖండించకు, శిక్షించకు, నీకన్న, నీ తపస్సుకన్నా, నీ భర్య కన్నా, నీ ఈశ్వరుడి కన్నా అధికంగా దుర్గతిలో పెనుగులాడే ఈ లోకాన్నంతా ప్రేమించు. కల్మషమంతటితోనూ నిండిన ఈ ప్రపంచాన్ని నీ హృదయానికి హత్తుకో”
    చలం కలలుకన్న “స్వేఛ్చ” లోపలి కోణం ,బాగా వివరించారు .

    చలం ఇప్పటి సమాజానికీ వర్తిస్తాడు .
    వీర లక్ష్మీ దేవిగారూ ,కృతజ్ఞతలు .

  3. Chinaveerabhadrudu says:

    చాలా చక్కటి విశ్లేషణ.

  4. ari sitaramayya says:

    చక్కటి లోతైన విశ్లేషణ.
    చలాన్ని ఎంత బాగా అర్ధం చేసుకున్నారు!
    సభలో మీరు చేసిన ప్రసంగం విడియోగానీ, ప్రసంగ పాఠం గానీ ఎక్కడైనా (వెబ్ సైట్) లభ్యం అవుతుందా?
    ఇంత మంచి వ్యాసం రాసినందుకు మీకు ధన్యవాదాలు.

    • Vvlakshmidevi@gmail.com i says:

      సీతారామయ్యగారు
      నమస్సులు .మీ కథల ద్వారా నాకు మీరంటే ఎంతో గౌరవం .
      ఆనాటి సభలోని నా ప్రసంగం రికార్డ్ చెయ్యలేదు .మీ ప్రశంస నాకు మంచి బహుమతి.
      సత్యాన్వేషి చలం అని నా పరిశోధన .పుస్తకం గా కూడా వచ్చింది.
      మీకు పంపగలిగే ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నాను.
      మరో మారు కృతజ్ఞతలతో …..

  5. Y RAJYALAKSHMI says:

    “ప్రేమించడం వారి కోసం కాదు. నీ ఆత్మ పారిశుధ్యం కోసమోయీ” – ఎంత నిజం.

    చాలా చక్కని వ్యాసం. చలం పట్ల ఎంత విముఖత ఉన్నవారికైనా ఇది చదివితే చలాన్ని ఒక మారు తప్పక చదవాలనిపిస్తుంది.

  6. .. పారిజాత పుష్పాలంటే కృష్ణుని కధా ,సత్యభామ అలక తో మొదలిడి సన్నని పరిమళం ,ఎఱ్ఱని కాడా వరకు తెలుసుకునే మనుషులకు పోనీ మనసులకు వాటి అత్యంత సున్నితత్వం ,మరోసారి చూసినా మాసిపోయే మధుర మైన అందం ఉన్నాయని ఒద్దికగా చెప్పినట్టు
    చలం గారి … మోహం …ఆవేశం … తిరుగుబాటు ల్లో అంతర్లీనంగా ఉండే తాత్వికత ,పరిణితి ,ఆత్మిక దర్శనం ,నిబద్ధత ,స్వచ్ఛత … చేతల్లో సత్యాన్ని ఆచరించి చూపే అంకితభావం అన్నవాటిని ఎంత బాగా చెప్పారండీ వీరలక్ష్మి గారూ ,బహుధా కృతజ్ఞతలు … మీరు ఎన్ని శేఫాలికలు ఏరి తెచ్చినా ఆసక్తితో అనురక్తితో ఎదురుచూస్తూ ఉంటాను. సుమండీ …

  7. renuka ayola says:

    ఇదంతా ఆచరణకి ఎంతో దూరంగా ఉన్నా సరే పదే పదే ఆలోచింపజేసి, అనుభూతి ప్రధానంగా జీవించే మనుషులకు లోపలి వెలుగును ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం.
    చాలా manchi vyasam …

  8. కె.కె. రామయ్య says:

    తమ రచనలు వేరుగా, నిజ జీవితం వేరుగా కాకుండా జీవించిన కొద్దిపాటి ప్రముఖ తెలుగు సాహితీ మూర్తులు చలం, శ్రీశ్రీ, త్రిపుర గార్లు అంటూ మాకు తెలియచెప్పారు సాహితీ సత్యహరిశ్చంద్రుడు, సత్తెకాలపు శ్రీ రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు. పసిపిల్లల్లో ఉండే స్వచ్ఛత, తాము నమ్మిన వాటిపట్ల అంకితభావం, లోకాన్నంతా ప్రేమించే తత్త్వం వీళ్లల్లో చూడవచ్చుఁ అంటుంటారు RR గారు.

    “ఇతరులలో కనపడే మాలిన్యమెప్పుడు హృదయ దర్పణాల ప్రతిబింబితమయిన స్వకీయ కల్మషమే” అని అంటూ ఈర్ష్యాసూయలు వద్దు అంటాడు బృహస్పతి. శిరోధార్యం మైన వాక్కులు.

    చలం గారికి, త్రిపుర గారికీ సాధికారతతో కూడిన వీరాభిమాని అయిన కాకినాడ అక్కయ్య గారికి ( డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారికి ) వినమ్రంపూర్వక కృతజ్ఞతలు.

  9. మంచి వ్యాసాన్ని వేలాదిమంది అంతర్జాల పాఠకులకు. . పరిచయం చేసిన సారంగ కు ధన్యవాదాలు. ఇంత ఉన్నతమైన భావాన్ని అర్థం చేసుకొనే మానసికమైన భాషా ప్రపంచంలోకి ప్రస్తుత విద్య ప్రవేశించే రోజులు రావాలని కోరుకుంటున్నాను. మరోసారి అభినందనలు అక్కా!

  10. Padmavathi vuduthala says:

    Inner freedom leads a human being to create wonders ! But to feel that freedom one should have courage & make it his living style! In this materialistic world human beings are just surviving and not living!
    Great analysis Mam, thank you

  11. భాస్కరం కల్లూరి says:

    వీరలక్ష్మీదేవిగారూ…
    చాలా రోజుల తర్వాత మీతో ఇలా మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది.
    మీ వ్యాసంలో నుంచి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి సహజంగానే. కానీ ఇంతవరకు స్పందించినవారు ఎవరూ ఆ జోలికి వెళ్లలేదు.
    విశ్వనాథకు, చలానికి మధ్య దృక్పథ భేదం ఉంది, నిజమే. కానీ విచిత్రంగా ఒక పోలికా ఉంది. ఇద్దరూ రసవాదులే. కథ కన్న రసము వేయి రెట్లు గొప్పదని విశ్వనాథ అనడం తెలిసినదే. చలం కూడా తనది రసవాదమే నంటారు. కానీ ‘స్వేచ్చ’ విషయంలో ఇద్దరూ భిన్న ధృవాలు. నిజానికి పాశ్చాత్యులతో పోల్చితే, భారతీయులందరూ రసవాదులే ననుకుంటాను; కుడి, ఎడమ తేడాలు లేకుండా.
    చలం రసవాదంతో సరిపడని, లేదా అర్థంకాని, లేదా ఆ అనుభూతిని అందుకోలేని వారూ ఆ రోజుల్లోనే ఉన్నారు. ఉదాహరణకు కొడవటిగంటి కుటుంబరావు. ఆయన మనోవాది కాడనీ, భౌతికవాది అనీ తెలిసినదే. ప్రేమతో కావిలించుకుంటే తగిలేది కామాన్ని జ్వలింపజేసే దేహమే కదా అనే అర్థంలో ఆయన చేసిన వ్యాఖ్య నాకు అస్పష్టంగా గుర్తొచ్చింది.
    మోహం-ఆకర్షణ-ప్రేమ: వీటి మధ్య ఎక్కడ విభజనరేఖ గీయాలి; ఒకదానిలో ఒకటి క్రమగతిలో పర్యవసించవా; మోహాకర్షణలనూ, ఆ దశలోని దైహికేచ్చనూ దాటకుండా అమలినమైన ప్రేమానుభూతిని అందుకోగలమా; అది అందరికీ సాధ్యమా; సాధనతో అది పట్టుబడుతుందా…ఇలా అనేక ప్రశ్నలు. అనుభూతే కానివ్వండి, మరొకటి కానివ్వండి…అది ఎంత ఉదాత్తమూ, ఉన్నతోన్నతమూ అయినా వైయక్తికం అయినంతకాలం లోకానికి దానివల్ల జరిగే మేలు అంతగా ఉండదు. పైగా లోకరీతిలో వైరుధ్యాలకు, ఘర్షణలకు అది దారితీస్తుంది. కనుక అది సామాజికం కావాలి. ఇక్కడే చలం వంటి వైయక్తిక రసవాదులకు, కుటుంబరావు వంటి భౌతిక సామాజిక వాదులకు మధ్య చీలిక వస్తుందనుకుంటాను.
    చలాన్ని కుడి, ఎడమ తేడాలు లేకుండా అందరూ అభిమానించడానికి కారణం ఏమిటన్నది నాలో చిరకాలంగా ఉన్న ప్రశ్న. ఆ అభిమానానికి వేర్వేరు కారణాలు ఉన్నాయా? అవేమిటి?
    ఆచరణకు దూరంగా ఉన్నది ఎంత గొప్ప విలువ అయినా, దాని వల్ల లోకానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదని; దానిని సార్వత్రికంగా ఆచరణాత్మకం చేయడం ఎలాగన్నదే అసలు ప్రశ్న అనీ సామాజిక వాదాలన్నీ మనముందుకు తెచ్చిన అవగాహన.
    నేను ప్రస్తావించిన ఈ అంశాలు తెలియనివీ, చర్చలో లేనివీ కావు. కానీ మీ వ్యాసం చదివిన తర్వాత నాలో కలిగిన భావసంచలనానికి ఇలా అక్షరరూపం ఇవ్వాలనిపించింది.

    • ari sitaramayya says:

      భాస్కరం గారూ, ఇది నాకు చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి నాకున్న అవగాహనను వ్యక్తం చేసే ప్రయత్నంలో ఈ మాటలు రాస్తున్నాను.

      1. “మోహం-ఆకర్షణ-ప్రేమ: వీటి మధ్య ఎక్కడ విభజనరేఖ గీయాలి; ఒకదానిలో ఒకటి క్రమగతిలో పర్యవసించవా?”

      నా అభిప్రాయంలో ఈ పర్యవసానం స్వయంప్రవర్తకం కాదు. ఆకర్షణతో మొదలైన సంబంధాలన్నీ ప్రేమ వైపు ప్రయాణం చెయ్యవు. ఆకర్షణ తగ్గిపోయేలోగా స్నేహం, పరస్పర గౌరవం ఏర్పడితే ఆ సంబంధం బలపడుతుంది. గౌరవం ప్రేమా ఏర్పడటానికి కారణం అభిప్రాయాలూ, ఆశయాలూ, అభిరుచులూ కలవడం కావచ్చు, ఇలాంటి సంబంధాలను అనుభూతి ప్రధానమైన సంబంధాలు అనవచ్చేమో.

      ఆకర్షణ తగ్గేలోగా పరస్పర గౌరవం ఏర్పడకపోతే, ఒకరిమీద ఒకరు అధికారం చలాయించడం, ఆధిక్యత నిరూపించుకోవడం మొదలెడితే వారు ఒకే ఇంట్లో ఉన్నా, భార్యాభర్తలుగా చలామణి అవుతున్నా, బిడ్డల్ని కనిపెంచుతున్నా ఆ సంబంధంలో ప్రేమ ఉండదు. అలవాటు ఉంటుంది. ఈ అలవాటునే మన సమాజంలో స్థిరమైన కుటుంబంగా పరిగణిస్తున్నారు. మన సమాజంలో ఇలాంటి సంబంధాలే ఎక్కువ.

      శరీర సంబంధం అధికారిక సంబంధంగా పరిణమించడానికి కారణం శరీర సంబంధానికి ముందు జరిగే తతంగం. పెద్దలు సవరల, లక్షల, ఎకరాల బేరీజులు వేస్తారు. పెళ్ళి చేస్తారు. అమ్మాయి ఇంటిపేరు మార్చి, తన పరిసరాలనుంచి ఆమెను తరలించి అత్త గారింటికి పంపిస్తారు. మంచిరోజు చూసి శరీర సంబంధానికి ముహూర్తం పెడతారు. ఇలా మొదలయ్యే శరీర సంబంధం ఇద్దరు స్వతంత్ర సమాన వ్యక్తుల మధ్య కాదు అని నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సమాజంలో అయినా మరోచోటైనా, ఇలా మొదలయ్యే సంబంధాలు పురుషాధిక్య సంబంధాలు. ఇలాంటి సంబంధాలనుంచి స్త్రీపురుషుల మధ్య ప్రేమ జనించిందంటే అది నిజంగా అద్భుతమే.

      ఇద్దరు స్వతంత్రులైన వ్యక్తుల మధ్య స్నేహ సంబంధం ఏర్పడి, శరీర సంబంధంగా మారితే, క్రమంగా అది ప్రేమ సంబంధంగా పరిణమించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార సంబంధాలైన మన పెళ్ళిళ్ళ నుంచి కాలక్రమంలో ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం చాలా తక్కువ.

      2. “అనుభూతే కానివ్వండి, మరొకటి కానివ్వండి…అది ఎంత ఉదాత్తమూ, ఉన్నతోన్నతమూ అయినా వైయక్తికం అయినంతకాలం లోకానికి దానివల్ల జరిగే మేలు అంతగా ఉండదు. పైగా లోకరీతిలో వైరుధ్యాలకు, ఘర్షణలకు అది దారితీస్తుంది. కనుక అది సామాజికం కావాలి. ఇక్కడే చలం వంటి వైయక్తిక రసవాదులకు, కుటుంబరావు వంటి భౌతిక సామాజిక వాదులకు మధ్య చీలిక వస్తుందనుకుంటాను.”

      ప్రతి విషయాన్నీ వైయక్తికమా సామాజికమా అని బేరీజు వేసి, సామాజికమైతేనే లోకానికి మంచిది అని నిర్ధారించడం సబబు కాదేమో. స్త్రీ పురుష సంబంధాలు ప్రేమ సంబంధాలుగా పరిణమించకపోవడానికి ముఖ్యకారణం సమాజ జోక్యమే. వాళ్ళ మానాన వాళ్ళను వదిలేస్తే స్త్రీపురుషుల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎంతో వ్యక్తిగతమైన స్త్రీ-పురుష సంబంధాన్ని వ్యాపార సంబంధంగా , పురుషాధిక్య సంస్థగా తయారు చేసి, దాన్నుంచి ప్రేమ సంబంధం ఉద్భవిస్తుందని ఆశించడం సబబు కాదు. నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. కొందరి విషయంలో సాధ్యం అయిన ప్రేమ సంబంధం అందరికీ సాధ్యం కావడంలేదు కాబట్టి దానివలన సమాజానికి మేలు జరగదు అని అంటున్నారేమో అనిపించింది. మీరు అలా అంటారని నేను ఊహించలేను.

      ప్రేమ సంబంధాలు కొందరే సాధించగలిగితే వాటి వల్ల సమాజంలో ఘర్షణలూ వైరుధ్యాలూ ఎలా వస్తాయి?

      సామాజిక సూత్రాలు స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించగలవు, కానీ పరస్పర గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ కల్పించలేవు. ఈ విషయంలో కుటుంబరావుకూ, చలానికీ మధ్య చీలిక ఉందని నేను అనుకోవడం లేదు.

      3. “మోహాకర్షణలనూ, ఆ దశలోని దైహికేచ్చనూ దాటకుండా అమలినమైన ప్రేమానుభూతిని అందుకోగలమా; అది అందరికీ సాధ్యమా; సాధనతో అది పట్టుబడుతుందా?”

      నా అభిప్రాయం అయితే చెప్పగలను గాని, దానికి ఆధారామైన సిధ్ధాంతం ఏదీ చెప్పలేను.
      మోహాకర్షణా, దైహికేచ్చా దాటకుండా ప్రేమానుభూతి సాధ్యమా అని అడగడంలో, ప్రేమానుభూతికి ముఖ్యమైనదేదో దేహ సంబంధంలో ఉన్నది అనే కదా? అదే నిజమైతే దేహ సంబంధం ఉన్న వారి అందరి మధ్య ప్రేమ సంబంధం ఎందుకు జనించడం లేదు? అంటే దేహ సంబంధానికీ ప్రేమకూ సంబంధం లేదనో, లేక ప్రేమకు దేహ సంబంధం మాత్రమే కారణం కాదనో కదా? అందువల్ల ఇతర అనుభవాల వల్లా, అనుభూతులవల్లా స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమించుకోవచ్చు అనిపిస్తుంది; శరీర సంబంధానికీ ప్రేమకూ అవసరమైన సంబంధం లేదనిపిస్తుంది.

      4. “ఆచరణకు దూరంగా ఉన్నది ఎంత గొప్ప విలువ అయినా, దాని వల్ల లోకానికి ఎటువంటి ఉపయోగమూ ఉండదని; దానిని సార్వత్రికంగా ఆచరణాత్మకం చేయడం ఎలాగన్నదే అసలు ప్రశ్న అనీ సామాజిక వాదాలన్నీ మనముందుకు తెచ్చిన అవగాహన.” నా గొడవ ఇదే… మార్క్సిజం గురించి. మార్క్సిజం కంటే ఉన్నతమైన ఆశయం, ఉదాత్తమైన రాజకీయ విలువ లేదని నా అభిప్రాయం. కానీ ఆచరణలో కొంత సమానత్వం సాధించినా, వ్యక్తిగతమైన లోపలి వెలితిని దేన్నో పూరించలేకపోతుంది. ఎంతో ఘర్షణతో సాధించిన “సమ సమాజాలు” మళ్ళా వెనక్కు పోతున్నాయి. కారణం ఏంటో పరిశోధించకుండా, చేసిన తప్పునే మళ్ళా మళ్ళా చేస్తున్నారు మార్క్సిస్టులం అని చెప్పుకునేవారు.

      • భాస్కరం కల్లూరి says:

        సీతారామయ్య గారికి…
        నా ప్రతిస్పందన అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంది. వెరీ సారీ.
        1. –“ఆకర్షణతో మొదలైన సంబంధాలన్నీ ప్రేమవైపు ప్రయాణం చెయ్యవు”. నిజమే. కానీ ప్రేమవైపు ప్రయాణించాలంటే ఆకర్షణ, మోహంతోపాటు దేహసంబంధం అన్న మజిలీలను దాటవలసిందేనేమో! అందరు వ్యక్తులలోనూ ఆకర్షణ, మోహం అనేవి ప్రేమగా పండకపోవచ్చు. మనుషులలో ఉండే అనేక వైవిధ్యాల లానే ఇది కూడా ఒక వైవిధ్యం అనుకుందాం. అలాగే ఆకర్షణ తగ్గేలోగా పరస్పర గౌరవం ఏర్పడకపోవడం గురించి, ఒకరిపై ఒకరు అధికారం చలాయించడం గురించి, అలాంటి భార్యాభర్తల సంబంధంలో ప్రేమ ఉండకపోవడం గురించి మీరు చెప్పినదానితో నేను కూడా ఏకీభవిస్తాను. ప్రేమకు బదులు వాళ్ళ మధ్య “అలవాటు” ఉంటుందన్న మీ మాట ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవలసింది. ఒక నిచ్చెన మీద ప్రేమ అనేది చివరి మెట్టు అయితే “అలవాటు” అనేదానిని మొదటి మెట్టు అనుకుందాం. ఈ మొదటి మెట్టును దాటితే కానీ ప్రేమ అనే చివరి మెట్టును ఎక్కలేము. అనుభూతిని, వైయక్తికతను కాసేపు పక్కన పెట్టి, ఈ “అలవాటు”ను కాసేపు చూస్తే, అది భార్యాభర్తల సంబంధం కొనసాగడానికి సమాజం కల్పించిన కనీసమైన వెసులుబాటు. కనీసమైన హామీ. ఇక్కడే సమాజం అడుగుపెడుతుంది. హృదయ సంస్కారంలో, సభ్యతలో, చదువు సంధ్యలలో రకరకాల అంతరాలు ఉన్న వ్యక్తులు ఒకచోట కనీస సామరస్యంతో సహజీవనం చేయడానికి తగిన వేదికను కల్పించడంలోనే సమాజం అన్నది అడుగుపెడుతుంది. ఆ వేదికనే సమాజం అని కూడా అనవచ్చు. ఒక పోలికతో దీనిని వివరించడానికి ప్రయత్నిస్తాను. నైపుణ్యం, శిక్షణ వగైరా అనేక విషయాలలో వైవిధ్యం, అంతరం ఉన్న పలువురు క్రీడాకారులు కలసి ఒక మ్యాచ్ ఆడుతూ ఉంటారు. వారందరూ కలసి కనీసమైన ఐక్యతతో ఒక చోట ఆడేందుకు తగిన కనీసమైన ఏర్పాటే ఆటస్థలం. దానినే ప్రస్తుత సందర్భంలో సమాజం అందాం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం,లేదా కమ్యూనికేషన్ ఏర్పడిందంటే అక్కడ సమాజం అడుగుపెట్టినట్టే. ప్రేమ అనండి, ఆకర్షణ అనండి, మోహం అనండి, స్నేహం అనండి, అలవాటు అనండి; వీటన్నిటినీ వ్యక్తుల్ని ఒక చోట కలిపి ఉంచే కట్టు తాళ్లుగా సమాజం అభివృద్ధి చేస్తుంది. వ్యక్తులలో ఉండే వైవిధ్యాన్ని బట్టి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కట్టుతాడుగా ఉపయోగపడతాయి. వ్యక్తులలోని అంతరాలను ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఆకర్షణ, మోహం, స్నేహం, అలవాటు మొదలైన కట్టు తాళ్ళను అన్నింటినీ తృణీకరించి ప్రేమ ఒక్కటే సర్వస్వమని అనలేము. ప్రేమ ఉన్నతోన్నతమైన అనుభూతే, సందేహంలేదు. అయితే అది కేవలం వ్యక్తి యొక్క అనుభూతి నిష్ఠమై ఉంటే దానివల్ల సమాజానికి లేదా సమూహానికి ఉండే ప్రయోజనం ఏమిటన్నదే నా ప్రశ్న. ప్రేమ అనే ఉన్నతోన్నత గమ్యానికి రకరకాల అంతరాలు, వైవిధ్యాలు ఉన్న వ్యక్తులందరినీ కూడగట్టి తీసుకువెళ్లడం ఎలా గన్నదే అసలు సవాలు. అలాంటి ప్రయాణానికి అనుకూలంగా లేదని అనుకున్నప్పుడు ప్రస్తుత సమాజం స్థానంలో అందరూ కలసి ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించడం మినహా అందుకు పరిష్కారం ఉంటుందని అనుకోను.
        ఇంకో పోలిక చెబుతాను. ఋషులు దివ్యదృష్టితో ఎక్కడో జరుగుతున్నవి కూడా చూసి చెప్పగలరని మన పురాణ ఇతిహాసాలు అంటాయి. మహాభారతంలో సంజయుడు కురుక్షేత్ర యుద్ధాన్ని దివ్యదృష్టితో చూసి ప్రత్యక్షప్రసారం పద్ధతిలో ధృతరాష్ట్రుడికి చెప్పాడన్న ప్రముఖ ఉదాహరణ మనకు తెలుసు. ఒకవేళ అలాంటి దివ్యదృష్టి నిజమనుకుంటే, వ్యక్తినిష్ఠ మైన ఆ దివ్యదృష్టిని ఈనాడు శాస్త్ర విజ్ఞానం టెలివిజన్ రూపంలో సామూహికం, సామాజికం చేసింది చూడండి. అలాగే వ్యక్తినిష్ఠమైన ఏదైనా సామాజికం అయినప్పుడే దాని ప్రయోజనం. అలా కానప్పుడు వ్యక్తుల మధ్య అంతరాలకు, ఘర్షణలకు అది దారితీస్తుంది. పురాచరిత్ర, పురామానవ శాస్త్ర కోణం లోంచి చెప్పుకుంటే, స్త్రీపురుషుల మధ్య ఇతరేతర నిర్బంధాలు లేని స్వేచ్చా ప్రణయం వికసించిన దశ ఒకప్పుడు ఉండేదని స్థూలంగా అర్థమవుతుంది. ఆ సామాజిక దశను కాదని నేటి సామాజిక దశను అభివృద్ధి చేసుకున్నాం. ఇది ఇప్పుడు పనికిరాదనుకుంటే ఇప్పటి ఆలోచనా సరళికి, ప్రాధాన్యాలకు తగిన కొత్త సమాజాన్ని అభివృద్ధి చేసుకోవలసిందే. చలం అలాంటి ప్రత్యామ్నాయ సమాజ అభివృద్ధికి సంబంధించిన బ్లూ ప్రింటును ఇచ్చారా, లేక వైయక్తిక అనుభూతిని ప్రకటించుకోవడం దగ్గరే ఆగారా అన్నది ప్రశ్న. చలం అభిమానులు చెప్పాలి. కొ.కు. విషయానికి వస్తే; ఆయన తను ఉత్తమమనుకున్న ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని లక్షించారు. అంతిమంగా చెప్పాలంటే వ్యక్తి ఉద్ధరణ అనేది సామాజిక ఉద్ధరణలో భాగంగా జరగాల్సిందే తప్ప సమాజానికి విడిగా జరిగే అవకాశం లేదు.
        2. మీ స్పందనలోని 2వ పాయింటుకు కూడా నేను ప్రకటించిన పై అభిప్రాయంలోనే ప్రతిస్పందన ఉందని అనుకుంటున్నాను.
        3. “మోహాకర్షణా, దైహికేచ్చా దాటకుండా ప్రేమానుభూతి సాధ్యమా అని అడగడంలో, ప్రేమానుభూతికి ముఖ్యమైనదేదో దేహ సంబంధంలో ఉన్నది అనే కదా? అదే నిజమైతే దేహ సంబంధం ఉన్న వారి అందరి మధ్య ప్రేమ సంబంధం ఎందుకు జనించడం లేదు? అంటే దేహ సంబంధానికీ ప్రేమకూ సంబంధం లేదనో, లేక ప్రేమకు దేహ సంబంధం మాత్రమే కారణం కాదనో కదా? అందువల్ల ఇతర అనుభవాల వల్లా, అనుభూతులవల్లా స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమించుకోవచ్చు అనిపిస్తుంది; శరీర సంబంధానికీ ప్రేమకూ అవసరమైన సంబంధం లేదనిపిస్తుంది.” అన్న మీ మూడవ పాయింటుకు వస్తే, ‘ప్రేమ’ అనే మాటను ఇక్కడ నిర్దిష్టంగా మనం స్త్రీ-పురుష సంబంధాలలోనే వాడుతున్నాం. స్త్రీ-పురుష సంబంధం నుంచి ఆకర్షణ-మోహం-దైహికం అనే వాటిని పక్కన పెట్టగలమా?! ఇక్కడ మనం ప్రకృతిని గీటురాయిగా తీసుకోవలసిందే ననుకుంటాను. “దేహ సంబంధం ఉన్నఅందరి మధ్యా ప్రేమ సంబంధం ఎందుకు జనించడం లేదు అన్న మీ ప్రశ్నకు –“ఆకర్షణతో మొదలైన సంబంధాలన్నీ ప్రేమవైపు ప్రయాణం చెయ్యవు”. నిజమే. కానీ ప్రేమవైపు ప్రయాణించాలంటే ఆకర్షణ, మోహంతోపాటు దేహసంబంధం అన్న మజిలీలను దాటవలసిందేనేమో!” నా ప్రారంభ వాక్యం తరహాలోనే స్పందించగలను. దేహ సంబంధమున్న అందరి మధ్యా ప్రేమ జనించకపోవచ్చు. కానీ స్త్రీ-పురుషుల మధ్య ‘ప్రేమ’ జనించడంలో దేహ సంబంధం ఒక ముఖ్యమైన భాగం అని నేను అంటాను. స్త్రీ-పురుషుల మధ్య దేహసంబంధంలేని అనుభూతి ఉంటుంది కానీ దానిని మనం స్నేహం అనో మరొకటనో అంటాం తప్ప ప్రేమ అనం.
        4. ప్రేమ అనేది వైయక్తికం, అమూర్తం. కేవలం ప్రేమనే గీటురాయిగా తీసుకుంటే సామాజిక సంబంధాలు కొనసాగపోయే ప్రమాదం ఉంది. మనం సామాజికంగా కొన్ని పనులు చేస్తుంటాం. ఒక పరిచయస్తుడు ఎక్కడైనా కనిపిస్తే మర్యాదగా మాట్లాడతాము. ఇంటికి వచ్చిన వారిని గౌరవిస్తాము. తెలిసినవారి ఇళ్ళల్లో, బంధువుల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు వెడతాము. ఇవన్నీ వారిపట్ల ప్రేమతోనే చేయం. ఇక్కడ ప్రేమ ఉండచ్చు, ఉండకపోవచ్చు. పరిచయం, స్నేహం, మర్యాద మొదలైనవి పనిచేస్తాయి. ఇలాంటి సామాజిక నియతిని ప్రేమ అనే వైయక్తిక స్పందనను మించి అంతకన్నా వైశాల్యం కలిగిన మరి కొన్ని అంశాలు కాపాడుతూ ఉంటాయి. ‘ధర్మం’ అనేది వాటిలో ఒకటి. ప్రేమ కన్నా ధర్మం అనేది సమాజంలో రకరకాల వ్యక్తులను ఒకచోట కలసి జీవింపజేస్తుంది. ఈ ధర్మం అనే మాటను నేను పౌరాణిక అర్థంలో వాడడం లేదు. సామాజిక, సెక్యులర్ అర్థంలో వాడుతున్నాను. ‘ప్రేమ’నే స్త్రీపురుష సంబంధాలకు గీటురాయిగా తీసుకుంటే ఆ వర్గీకరణ కిందికి వచ్చే సంబంధాలకన్నా ‘ధర్మం’ అనే గీటురాయి కిందిక వచ్చే సంబంధాలు విస్తృతంగా ఉంటాయి. సమాజపు సుస్థితిని కాపాడడానికి అవి ఎక్కువ తోడ్పడతాయి. ప్రేమ గీటురాయిగా ఉండే స్త్రీ-పురుష సంబంధాలు కలిగిన సామాజిక వ్యవస్థను చలం గారు కోరుకుని ఉండచ్చు. అలాంటి వ్యవస్థ ఏర్పడకూడదని నేను అనను. కానీ చలం గారి గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రేమకు సంబంధించిన ఈ పరిమితులను పరిశీలనలో ఉంచుకోవాలని నా ఉద్దేశం.
        ఇలా నా భావాలు ప్రకటించుకోడానికి అవకాశమిచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు.

  12. Jhansi manthena says:

    అద్భుతమైన విశ్లేషణ , చాలాబాగుందమ్మా

  13. D. Subrahmanyam says:

    చాలా చక్కటి విశ్లేషణ వీరలక్ష్మి దేవి గారు. అభినందనలు. మీ విశ్లేషణ ఆ నాటకాన్ని చదివించేలా చేసింది.

  14. S k mohan rao says:

    Nice analysis madam garu. Chalanni inka baga ardham chesukune kramam lo mee vyasam oka special lesson ma lanti vallaki.

  15. అద్భుతమైన విశ్లేషణ మేడమ్ గారు. చాలా మంచి వ్యాసం. ఈ వ్యాసం మీ ” సత్యాన్వేషి చలం” పుస్తకం గురించి నన్ను ఆలోచించేలా చేసింది.
    చలం కావ్యాత్మను సాధికారికంగా ఇరవయ్యొకటో శతాబ్దంలోకి తీసుకొచ్చి సమకాలీన సమాజపోకడలతో సమన్వయపరుస్తూ ఆవిష్కరించిన నేటికాలపు గొప్ప రచన ” సత్యాన్వేషి చలం”. ఆ పేరు పెట్టటంలోనే ఒక సార్వజనీనతను స్ఫురింపచేసారు. చలం రచనల్ని దాదాపు చదివినా, మీ “సత్యాన్వేషి చలం” నా అవగాహనపై మరిన్ని వెలుగులు ప్రసరింపచేసింది– ఈ వ్యాసం లానే. థాంక్యూ మేడం

  16. Sivalakshmi says:

    “భాగ్యాలూ.భోగాలూ పంచుతాం గానీ విలువ గల కళా పదార్ధం నుంచి ఆనందం పొందగల సంస్కారాన్ని ఎవరు పంచగలరు” కళ ఎవరి సొత్తూ కాదు.నిజం.అనుభవించే దృష్టి గల ఆర్టిస్టు కళని ఎంత పంచుకున్నా నీది కాదు.ఒకటే పదార్ధాన్ని అందరికీ పంచినా ఈ tastes లో అనుభవ ప్రజ్ఞల్లో బేధాలు తప్పవు”. తన సొంత సుఖాన్ని తన లోపల్నించి కట్టుకోవాలి మానవుడు” -అని అన్నారు చలం.మీరు తారాశశాంక లను అనుభూతించి మాకు విశదపరిచిన తీరు అద్భుతం!
    వీరలక్ష్మి గారూ, మీరు అరుణజ్యోతి ప్రచురిస్తున్న కామేశ్వరి గారికి చలం రాసిన ఉత్తరాల పుస్తకానికి ముందుమాట రాశారని తెలుసు.ఇంకా చూడలేదు.కానీ మేము చలం గారితో ప్రస్తుతం మునిగి తేల్తున్నాం.ఈ సందర్భంలో మీ వ్యాసం తెలియని జ్ఞానాన్నీ,సంతోషాన్నీ కలిగిస్తుంది.దీన్ని ఆంటీకి చదివి వినిపిస్తానండీ!
    ఇంత మంచి వ్యాసానికి మీకు అభినందనలు,సారంగ కు కృతజ్ఞతలు !

  17. నరసింహ శర్మ మంత్రాల says:

    చలంగారూ, మీరూ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. నాకో అనుమానం. బృహస్పతి, తారా, శశాంకుడు, అహల్య- అనురాధను తీసేద్దాం. ఆవిడది అలా ప్రేమిస్తూనే ఉండే స్వభావం. ఆ స్ధాయి దేవతల్లో ఇటువంటి అతి సాధారణపు పొరపొచ్చలూ, అభిప్రాయభేదాలూ వాటిమీద బుద్ధిని అడ్డంగా, నిలువుగా, అయిమూలగా రొస్టుపెట్టుకుంటూ చర్చోపచర్చలూ విడ్డూరంగా అనిపిస్తున్నాయి. అసలు తన సామర్ధ్యం మీద తనకే నమ్మకంలేని బృహస్పతి తారలాంటి జవ్వనిని ఎందుకు ఎంచుకోవడం. శశాంకుడు అందుబాటులో లేకపోతే తార ఎవరిని చూసి మనసు పారేసుకునేది. “నీ భీరుత్వానికి చౌర్యాన్ని జతచేసి నన్ను తెరగా నీతి వస్త్రం కప్పి నుంచోమంటున్నావు తెలుసా” అని ఆమెను ప్రశ్నిస్తాడు. దాదాపుగా బృహస్పతి తారమీద చిరాకు పడుతూ విసుక్కున్నాడు. భర్తను దాటి శశాంకుడితో పోయిన తార – లోకుల మూర్ఖత్వం గురించి మాట్లాడ్డం బహుశా బృహస్పతి మంచితనాన్ని అసమర్ధతా తీసుకోవడమే. ” నా భార్య నీమీద బెంగపెట్టుకుంది, మా ఇంటికి రా ” అని పిలుచుకుపోవడం …..వాటికేవో పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోవడం సెన్స్ లెస్ గా ఉందండి. ‘ప్రేమ ఆత్మసమర్పణ మయినప్పుడే స్వీకరణార్హము’ అనగలిగే స్ధాయి ఉన్న బృహస్పతి , తారవంటి శరీరస్ధాయిలో ఆగిపోయిన వనితను ఎందుకు వదిలించుకోలేకపోయాడు.

    ఈ నా మాటలు చాలా మామూలుగా రాసాను తప్ప వీటికి ఎలాంటి ఉద్దేశ్యమూ లేదు. కేవలం నాకు స్ఫురించిన ఆలోచనలనే రాసాను తప్ప మీ విశ్లేషణను గానీ, చలంగారిని ప్రశ్నించాలన్న ఇరుకుదనం లేదు.

    నా జీవితంలో జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నాకు కాలేజ్ లో పరిచయమైన ఓ ఆడపిల్లతో ఆరోగ్యకరమైన చనువూ, స్నేహం ఏర్పడ్డాయి. ఆమె పెళ్ళి చేసుకుని నెలలోపే విడాకులు తీసుకుంది. జీవితాన్ని ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటావు అని కోప్పడ్డాను. మనం పెళ్ళి చేసుకుందామా అంది. నేను సరే అన్నాను. అయితే వచ్చి మా పెద్దవాళ్ళతో మాట్లాడు అంది. మీ పెద్దవాళ్ళు నన్ను కాదంటే, నా చేయి పట్టుకుని నాతో వచ్చేస్తావా అనడిగాను. వాళ్ళను ఒప్పించు అంది. అది నావల్ల కాకపోతే అన్నాను. వాళ్ళను ఒప్పించే తెలివి లేని వాడివి నాతో ఎలా నెట్టుకొస్తావు అంది. నా స్నేహాన్ని ఆమె అవకాశంగా తీసుకుంటోంది. ఆలోచించి చెబుతాను అన్న నేను ఆమెను దూరంగా ఉంచాను. రెండు నెలలకు ఫోన్ చేసి నన్ను కాదనుకుని నీవు చాలా పోగొట్టుకుంటున్నావు అని హెచ్చరించింది. మూడోసారి ఆమె ఫోన్ చేసినప్పుడు సూటిగా చెప్పాను. మనం పెళ్ళి చేసుకుందాం అంటే సరే అన్నాను కానీ , నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. ప్రేమలేని చోట పోగొట్టుకునేది ఏదీ ఉండదు అని చెప్పాను. ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు.

    బహుశా…బృహస్పతి తారను గాఢంగా శరీరానికి అతీతంగా ప్రేమించి ఉండాలి. అంటే…బృహస్పతి తన లోపలి స్వేచ్ఛకోసం తారను భరించాడు. ఇంతకన్నా భరించేవాడు దొరకడన్న లోపలి స్వేచ్ఛతో తార బృహస్పతితో ఉండిపోయింది. ఇంక మిగిలిన వన్నీ మనల్ని మభ్య పెట్టడానికే.

    • Vvlakshmidevi@gmail.com i says:

      నరసింహశర్మ గారూ
      ఒక్కసారి శశాంక నాటకం చదవడండి. మీ అపోహలు తొలగి సమాధానాలు దొరకవచ్చు.ఆతర్వాత కూడా అ వసరమైతే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.

    • Vvlakshmidevi@gmail.com i says:

      నరసింహశర్మ గారూ
      మొదట మీరు చలంగారి శశాంక నాటకం చదవడండి. మీ అపోహలు పోవచ్చు. అయినా పోకపోతే నేను పోగొట్టే ప్రయత్నం చేస్తాను.
      నాకు మీరు చెప్పిన మీకధలోచిన్న సందేహం. మీ స్నేహితురాలితో మీకు ఆరోగ్యకరమైన చనువు. స్నేహం అన్నారు. అనారోగ్యం అంటే ఏమిటి?బహుశా శరీరసంబంధం అని చెబుతారు. మీరుచెప్పినమీకధలోఆ అమ్మాయి వెర్షన్ ఏమిటోఎవరుచెబుతారు. ఆరోగ్యకరమైన స్నేహితులు తమను ప్రేమించిన అమ్మాయిల్ని ఇలా రోడ్డు మీద పెడతారా?

      • లవ్ యువర్ రిప్లై సో మచ్ వీవీలక్ష్మిదేవి గారూ!

  18. భాస్కరం కల్లూరి says:

    సీతారామయ్యగారూ…

    ముందుగా మీకు అనేక ధన్యవాదాలు. మీ స్పందన చూశాక నాకు ఎంత రిలీఫ్ కలిగిందో చెప్పలేను. మనలో జీవితం పొడవునా అనేక ప్రశ్నలు, సందేహాలు, భావాలు పేరుకుపోతాయి. వాటిని అప్పటికప్పుడు వ్యక్తం చేసి ఎదుటివారి స్పందనను తెలుసుకునే వెసులుబాటు మొన్నటివరకూ లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఆ వెసులుబాటు ఇచ్చింది. సారంగ లాంటి పత్రికలు ఆ వెసులుబాటును ఉపయోగించుకుని పరస్పరం అభిప్రాయాల కలబోతకు వేదికను ఇస్తున్నాయి. నిజమైన “ఆర్గ్యుమెంటేటివ్ ఇండియా” ఇప్పుడు బ్రహ్మాండమైన శక్తితో విస్ఫోటిస్తోంది. ఈ పరిస్థితిలో నా పై స్పందన పది రోజులపాటు నిరుత్తరంగా, నిశ్శబ్ద కంపనగా ఉండిపోవడం ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. అందుకే మీ స్పందన అమితమైన రిలీఫ్ కలిగించిందనడం.

    విషయం గంభీరమైనది కనుక కాస్త సమయం తీసుకుని సావధానంగా ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాను. అందుకు అన్యధా భావించవద్దని కోరుతున్నాను.

  19. Vvlakshmidevi@gmail.com i says:

    భాస్కరం గారూ
    నమస్సులు .ఇక్కడ అంటే సారంగ లో మీ ఉత్తరం చూసి దానికి జవాబు గా ఫోన్ లో మాట్లాడాలనుకున్నాను.కారణం ఇక్కడ తెలుగు లో ఎక్కువ సేపు టైపు చేయడం ఇంకా రాకపోవడం.దానికి కాస్త ఆలస్యమైంది .ముఖ్యం మీ నెంబర్ లేకపోవడం .మీ ప్రశ్నలల లో చాలా వాటికి నా సత్యాన్వేషి చలం పుస్తకం లో సమాధానాలున్నాయ్.
    సీతారామయ్య గారి విశ్లేషణ ఈ రోజే చూసాను.మీ ప్రతీ స్పందన కూడా చూసాను.వారు ఇంచుమించు నా ఆలోచన లే చెప్పారు. వారికీ మీకూ కూడా ధన్య వాదాలు .
    మీ ప్రశ్నల లో కొన్నింటికి మళ్ళీ చలం గారినుంచే మరో సారి కాలం లో .వివరించే ప్రయత్నం చేస్తాను .మీ స్పందన రెండు మాటల్లో జవాబు చెప్పేది కాదు కనుక ఆగేను తప్ప మిమ్మల్ని అలక్ష్యం చెయ్యడం ఉద్దేశం కాదు

    • భాస్కరం కల్లూరి says:

      వీరలక్ష్మీ దేవి గారూ…

      మీ స్పందన ఇప్పుడే చూశాను. మీ ‘సత్యాన్వేషి చలం’ తప్పక చదువుతాను. ఈ లోపల ఆరి సీతారామయ్యగారికి నేను జవాబు బాకీ ఉన్నాను కనుక దానిని పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా చదవండి. నా అవగాహనలో మీరు ఏకీభవించనివి ఉంటే తెలియజేయండి. ఇలా అభిప్రాయాల కలబోత సత్యాన్వేషణలో భాగంగానే భావిస్తున్నాను.

  20. మీ విశ్శ్లేషణ… పరిశీలన… భావ వ్యక్తీకరణ ……. అద్భుతంగా వివరాయించారు ముక్యంగా మానవ బంధాల్లో ప్రేమకు దేహానికి మధ్య సున్నితమైన రేఖ ను చాల అద్భుతంగా ఆవిష్కరించారు అది నిజం కూడా……… మీకు నా ధన్యవాదాలు

  21. ari sitaramayya says:

    భాస్కరం గారూ,
    నేను ఇక్కడ రాస్తున్న దాంట్లో కొత్తవీ, మీకు తెలియనివీ ఏవీ లేవు. మనం మాట్లాడుకుంటున్న విషయాల్లో కొన్నిటి గురించి నా అభిప్రాయాలు చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను.

    -“ఒక నిచ్చెన మీద ప్రేమ అనేది చివరి మెట్టు అయితే “అలవాటు” అనేదానిని మొదటి మెట్టు అనుకుందాం. ఈ మొదటి మెట్టును దాటితే కానీ ప్రేమ అనే చివరి మెట్టును ఎక్కలేము.”

    ఇక్కడ నేను మీతో ఏకీభవించలేను. ఈ నిచ్చెన ఉపమానం సరైనది కాదని నా అభిప్రాయం. ఎందువల్లంటే ప్రయత్నం చెయ్యాలేగాని మొదటిమెట్టు ఎక్కిన వారు ఎవరైనా చివరిమెట్టుదాకా పోవడానికి మార్గం ఉందని చెప్తుంది ఈ ఉపమానం.
    మన సమాజం ఏర్పరచిన వివాహ వ్యవస్థ “అలవాటు” దాకా తీసుకెళ్తుంది. కాని అక్కడ నుంచి ప్రేమకు చేరడానికి దారి లేదు. అదెలా, కొందరు ఆ గమ్యం చేరుతున్నారుగదా, దారి లేకపోవడేమిటీ అని అడగొచ్చు. ఒక చోటునుండి ఒక గమ్యానికి చేరడానికి ఒక ఆడవిగుండా వందమంది ప్రయాణం చేస్తున్నారనుకుందాం. ముళ్ళు గుచ్చుకోకుండానో, పురుగులు కుట్టకుండానో గమ్యం చేరడం సాధ్యం కాదు. కాని అదే గుంపులో ప్రయాణం చేసిన ఇద్దరికి ముళ్ళు గుచ్చుకోలేదు, పురుగులు కుట్టలేదు. ఆ ఇద్దరినీ ఉదాహరణగా తీసుకుని ఈ అడవిబాట మంచిదే అని చెప్పలేము, ఈ బాటన వెళ్తే ముళ్ళు గుచ్చుకోవు, పురుగులు కుట్టవు అనీ చెప్పలేము. ముళ్ళూ, పురుగులూ లేని బాటన పోవడమే సరైన పద్ధతి. నా అభిప్రాయంలో మన సమాజంలో అమలులోఉన్న వివాహ వ్యవస్థ ప్రేమ నిరోధకం. అది అధికార సంబంధం, స్థిరమైన సంబంధం (అలవాటు) ఏర్పడటానికి మాత్రమే పనికొస్తుంది.

    -“ఇలాంటి సామాజిక నియతిని ప్రేమ అనే వైయక్తిక స్పందనను మించి అంతకన్నా వైశాల్యం కలిగిన మరి కొన్ని అంశాలు కాపాడుతూ ఉంటాయి. ‘ధర్మం’ అనేది వాటిలో ఒకటి. ప్రేమ కన్నా ధర్మం అనేది సమాజంలో రకరకాల వ్యక్తులను ఒకచోట కలసి జీవింపజేస్తుంది. ఈ ధర్మం అనే మాటను నేను పౌరాణిక అర్థంలో వాడడం లేదు. సామాజిక, సెక్యులర్ అర్థంలో వాడుతున్నాను. ‘ప్రేమ’నే స్త్రీపురుష సంబంధాలకు గీటురాయిగా తీసుకుంటే ఆ వర్గీకరణ కిందికి వచ్చే సంబంధాలకన్నా ‘ధర్మం’ అనే గీటురాయి కిందిక వచ్చే సంబంధాలు విస్తృతంగా ఉంటాయి. సమాజపు సుస్థితిని కాపాడడానికి అవి ఎక్కువ తోడ్పడతాయి.”

    ఇక్కడ నేను మీతో ఏకీభవిస్తున్నాను. మన సమాజం ఆచరిస్తున్న “ధర్మం” స్థిరమైన వివాహం ఏర్పడడానికి దోహదం చేస్తుంది. కాని ఆ స్థిరత్వం మిగతా అధికార సంబంధాలలోలాగానే కొందరి స్వేచ్చను (ఇక్కడ స్త్రీ స్వేచ్చను) హరించడం మీద ఆధారపడి ఉంటుంది.

    -“ప్రేమ అనే ఉన్నతోన్నత గమ్యానికి రకరకాల అంతరాలు, వైవిధ్యాలు ఉన్న వ్యక్తులందరినీ కూడగట్టి తీసుకువెళ్లడం ఎలా గన్నదే అసలు సవాలు. అలాంటి ప్రయాణానికి అనుకూలంగా లేదని అనుకున్నప్పుడు ప్రస్తుత సమాజం స్థానంలో అందరూ కలసి ప్రత్యామ్నాయ సమాజాన్ని సృష్టించడం మినహా అందుకు పరిష్కారం ఉంటుందని అనుకోను.”

    అవును. కాని ఇక్కడ మనం కొత్తగా పరిశోధించి కనిపెట్టాల్సిన విషయం ఏమీ లేదు. ఒకరిమీద ఒకరు అర్థికంగా ఆధారపడాల్సిన అవసరాన్ని తొలగిస్తే, మానసికంగా అర్థికంగా సమానమైన వ్యక్తులమధ్య ఏర్పడే సంబంధాలు ప్రేమ సంబంధాలుగా బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నది మనందరికీ తెలిసిన విషయమే.

    -“అంతిమంగా చెప్పాలంటే వ్యక్తి ఉద్ధరణ అనేది సామాజిక ఉద్ధరణలో భాగంగా జరగాల్సిందే తప్ప సమాజానికి విడిగా జరిగే అవకాశం లేదు.”

    మంచి మార్పు ఏదైనా సమాజ వ్యాప్తంగా వస్తే మంచిదేగదా. కానీ, అలా ఒక్క సారిగా సమాజాన్ని మార్చెయ్యాలని (ఉద్ధరించాలని) ఇంతవరకూ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లు లేదు. ఫలించినా ఆ మార్పులు నిలబడలేదు. అలా కాకుండా సమాజంలో ఉన్న ధర్మానికి భిన్నంగా కొందరు వ్యక్తులు ఎంచుకున్న మార్గాన్ని చూసి ఇతరులు ఆ మార్గాన్ని అనుసరించి – ఇలా క్రమంగా, నెమ్మదిగా, బలవంతంలేకుండా వచ్చే మార్పులు మనగలుగుతాయని నా నమ్మకం. స్త్రీ- పురుషుల మధ్య ప్రేమ సంబంధాలు ఏర్పడడానికి అనుకూలంగా ఉండే మార్పులుకూడా ఇలా రావల్సిందేనని నా అభిప్రాయం. కొంత కాలానికి ఈ మార్పులు సమాజ ధర్మం కావచ్చు.

  22. Krishna Rao says:

    చేయితో కాక మనసుతో రాశారు. అందుకే మీ శైలి నాకెంతో నచ్చింది

Leave a Reply to Y RAJYALAKSHMI Cancel reply

*