సమాంతర భాష: వొక సంభాషణ!

sach

 

1

కె. సచ్చితానందన్ కేరళకు చెందిన ప్రముఖ భారతీయ కవి, విమర్శకుడు, అనువాదకుడు.  ఈయన ఇంతవరకు    ఇరవైరెండు కవితాసంపుటులు, పదహారు అనువాద కవిత్వ సంకలనాలు, పంతొమ్మిది సాహిత్యవ్యాస సంపుటులు, నాలుగు నాటకాలు – వెలువరించారు.  ఆధునిక మళయాల సాహిత్యానికి బీజంవేసిన వారిలో సచ్చిదానందన్ ఒకరు.   సరళమైన భాష, కొత్తఒరవడి, ప్రతీకాత్మకత, సునిశితమైన వ్యంగ్యం వంటి లక్షణాలతో ఉండే సచ్చితానందన్  కవిత్వం దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకొంది.

2

ప్రశ్న: కవిత్వానికి తనదైన భాష ఉంటుందా? (A CONVERSATION WITH K. SATCHIDANANDAN ~ Rizio Raj  గారి ఇంటర్వూ లో ఒక ప్రశ్న)

సచ్చితానందన్ జవాబు:  కవి ఆత్మను సంపూర్ణంగా ఆవిష్కరించటంలో  భాష సరిపోదని కొన్ని కవితల్లో చెప్పాను. నేను వ్రాసిన కాక్టస్ అనే కవితలో, పదునుగా గుచ్చుకొనే సమాంతర భాష ఆవిష్కృతమవటం గమనించాను. ఉత్తర కేరళలో జరిగిన హింసాత్మక ఘటనలపై వ్రాసిన An attempt at Conversation  అన్న కవితకూడా అలాంటిదే. ప్రస్తుత కవులు- సంప్రదాయాల్ని, పునరుక్తుల్ని ధిక్కరించే కొత్త నుడికారాల్ని, భాషని వెతుక్కొని- నూతన తాత్వికతను, వినూత్న కోణాల్ని ఆవిష్కరిస్తున్నారు.

Tadeus Rozewicz – యుద్దానంతర కవిత్వం గురించి మాట్లాడుతూ- “ఆ కవిత్వం- భయకంపితమైన, కసాయివాళ్ళకు ఒదిలిపెట్టబడిన జీవన్మృతుల కొరకు వ్రాయబడి – తుక్కులోంచి తీసిన  పదాలతో, ఆకర్షణ లేని పదాలతో, కాపాడుకొన్నపదాలతో నిండి  ఉంటుంది” అంటాడు.  చివరకు కవిత్వం అంటే దాని పదాలే. Paz  “తన అస్తిత్వాన్ని తన పదాలుగా మార్చుకొన్నమనిషే కవి” అని అంటాడు. మనిషి- తనతో , ఇతరులతో, ప్రకృతితో , అగోచరత్వం తో చేసే సంభాషణలో కలిగే చిక్కులన్నీ అతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి.

 

3.

“సంభాషించటానికి ఒక ప్రయత్నం” అన్న కవితలో సచ్చితానందన్ ఒక బీభత్స ప్రపంచాన్ని మనముందుంచుతాడు.  ఇది కవిత్వభాష.  వాచ్యం కాదు, ధ్వని పూరకం. మన చుట్టూ జరుగుతున్న హింసకు రక్తాన్ని ప్రతీకగా తీసుకొని చెపుతాడు. ఫుట్ నోట్సులు ఉండేది కవిత్వమే కాదు అని త్రిశ్రీ అన్నప్పటికీ ఈ కవితలో వచ్చే కొన్ని అంశాలకు ఇచ్చిన ఫుట్ నోట్సులు కవితను పరిపుష్టం చేస్తాయి. కొన్ని  పాతవిషయాల్ని సచ్చితానందన్ ఎలా ప్రస్తుతానికి అన్వయించాడో అర్ధమౌతుంది.

2వ ఖండికలో వచ్చే  Ezhuthachan, రాముని కథను రామచిలుక తో చెప్పించిన ప్రసిద్ద మళయాలకవి.

7వ ఖండికలో వచ్చే  Asan అనేది ఒక కవిపేరు. అతను  వ్రాసిన ఓ కవితలో సీత, రాముని పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తుంది.

9వ ఖండికలో  “మన భాష చచ్చిపోయింది” అన్న వాక్యం వ్రాసి ఆత్మహత్య చేసుకొన్నది సుబ్రమనియదాస్ అనే ఓ యువ రాడికల్.

 

ఈ కవితలో ఖండికలన్నీ- కవి తనతో, సమాజంతో చేసే సంభాషణలు.  చెల్లాచెదురుగా, ఒకదానికొకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నప్పటికీ బీభత్సం, మానవత్వం రెండు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగినట్లు- ఏదో ఏకసూత్రత    అన్నింటినీ బంధిస్తుంది.

ఈ కవితలో కనిపించే చేదు అంతా, ఒక కవి  అంతర్, బాహ్య లోకాలతో చేసిన సంభాషణలలో పలికిన చేదుగా అర్ధం చేసుకోవాలి.

 

 

సంభాషించటానికి ప్రయత్నంశ్రీ కె. సచ్చితానందన్

 

 

1
మనం ఒక కత్తినీడలో జీవిస్తున్నాం
ఎవరో పెంచిపోషించిన కత్తి అది.
ఎవరి హృదయమో చీల్చబడుతుంది.
ఆ రక్తం మనల్ని అంధుల్ని చేస్తుంది.
రక్తంలో స్నానం చేసి అన్నం తింటాం
రక్తంలో స్నానం చేసి ప్రేమించుకొంటాం
ఆఖరకు కలల్లో కూడా రక్తమే.
2

Ezhuthachan కు రామాయణ గాథ చెప్పిన రామచిలుక
మండేఎండలో టివి కేబుల్ పై విశ్రాంతి తీసుకొంటోంది
దాని ముక్కుపై నక్షత్రకాంతులు లేవు
దాని రెక్కలు కూడా రక్తమోడుతున్నాయి.
3

నాకు కన్నీళ్ళు లేకుంటే
నేనూ ఒక కత్తిగా మారి ఉండేవాడినేమో.
మా అమ్మ నాకు కన్నీళ్ళు ఇచ్చింది
ఆమె గొప్ప పాటకత్తె కాదు అయినప్పటికీ
ఆ స్త్రీమూర్తి సంగీతంలో నేను మునిగిపోయాను
4

నేను అమ్మాయినయితే బాగుండేదని ఆశపడేవాడిని
నా చిన్నతనంలో కళ్ళకు కాటుకపెట్టుకొని
పొట్టిగౌనులు వేసుకొని అద్దం ముందు ఆడుకొనేవాడిని
వద్దు వద్దు… ఏదో ఓ రాత్రిఫూట ఓ ఇరవై మందిచే
ఈ దేహం చీలి ఛిద్రమవటం నేను కోరుకోను.
నా సహచరీ! దయచేసి మూడో అమ్మాయిని ఈ లోకంలోకి తీసుకురాకు.
5

మా అమ్మ కన్నీళ్ళలో నేను పండించుకొన్న ముత్యాలు
ఏ సాగరాల్నీ వెలిగించలేక పోయాయి.
వాటి పిలుపును ఎక్కడో విన్న ఒకే ఒక్క అమ్మాయి
తన కనులు తెరిచి, ఓ పూవుగా మారింది
6

కత్తులు పూలగురించి మాట్లాడవు.
దారుల్ని, స్థలాల్ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తుంటాయి
హృదయాల్లోకి చొచ్చుకొని అరుస్తాయి ‘నీ మతమేమిటి అంటో
పదాల్లోకి ప్రవేశించి గర్జిస్తాయి ‘నీదే పార్టీ అనీ.
7
Asan వర్ణించిన సీత
అడవికి, భర్త పేర్చిన అగ్నిపరీక్షకు మధ్య కూర్చొని
ప్రేమంటే ఏమిటో తొలిసారిగా నేర్పిన రావణుని త్యాగాన్ని
జ్ఞాపకం చేసుకొంటుంది.
ఆమె గర్భాశయం రాక్షస శిశువుని కాంక్షిస్తుంది
తన రావణుడు కోరుకొన్నంత బలంగా…
8
ప్రేమ పదాలు అన్నీ అయిపోయాయి
ఒక్కో పదము ఇప్పుడో పగిలిన సారాసీసా ముక్క
మనం ఒకరినొకరం దానితో గాయపర్చుకొంటూఉంటాం.
ఈ ప్రపంచం, కోర్టునోటీసులు మన తలుపులకు అంటించాకా
ప్రేమించుకోవటం అంటే ఒకరి రక్తం ఒకరు తాగటమే.
9
‘మన భాష చచ్చిపోయింది’ అన్న వాక్యం వ్రాసిన వాడు పారిపోయాడు
ఆ భేతాళ శవాన్ని మనమింకా మోసుకు తిరుగుతున్నాం
దాని ప్రశ్నలకు సమాధానాలు
పక్షి కువకువల్లో లేదా గజ్జెల గలగలల్లో ఎక్కడా లభించవు
10
తడబడుతూ మాట్లాడేవారు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు
నాలిక కత్తిరింపబడిన వ్యక్తి మాటల్లా నేను అస్పష్ట శబ్దాలు చేస్తున్నాను
అంతా కుదుటపడుతుందని, పూర్వస్థితి వస్తుందని ఏదో సంకేతం చెపుతుంది
నమ్మబుద్దికాక నన్నునేను కొరడాతో కొట్టి చూసుకొంటాను
11
బ్రహ్మపుత్ర నదీతీరాలపై గుల్మొహర్లు విచ్చుకొన్నాయి
నువ్వు ఈ గదిలో లేవు
నా భుజాలు మరల సలుపుతున్నాయి
మరో శవాన్ని మోయటానికేమో
లేక ఏ కత్తీ ఖండించలేని రెక్కలు మొలవటానికో

బయట నిప్పులు చెరిగే ఎండలో
జటాయువు తన తెగిన రెక్కల్ని తపతప లాడిస్తోంది

 

 

(An attempt at Conversation by Sri.K. Sachithanandam)

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

 

మీ మాటలు

  1. sailajamithra says:

    ప్రస్తుత లోకం ఇలా గందర గోళంగానే ఉంది కదా ? కానీ ప్రతి వాక్యం లో వాస్తవం ఉంది. చమత్కారం ఇమిడి ఉంది . అనువాదకునికి అభినందనలు

  2. Suparna mahi says:

    చక్కని పాఠం లాంటి ఆర్టికల్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా సర్…

  3. satyanarayana says:

    మా అమ్మ నాకు కన్నీళ్ళు ఇచ్చింది

    మా అమ్మ కన్నీళ్ళలో నేను పండించుకొన్న ముత్యాలు
    ఏ సాగరాల్నీ వెలిగించలేక పోయాయి.

    ..ప్రేమ పదాలు అన్నీ అయిపోయాయి
    ఒక్కో పదము ఇప్పుడో పగిలిన సారాసీసా ముక్క
    మనం ఒకరినొకరం దానితో గాయపర్చుకొంటూఉంటాం.

    ఏమి కవిత్వం !
    సంభాషించడానికి ఇంకా కొంత మంది మిగిలే ఉన్నారు బొల్లోజు బాబా గారూ ,

  4. ఇలాటి ఉపదేశ పూర్వక సాహిత్య గోష్టులు చాలా అరుదు.
    నేటికీ కవిత్వాన్ని నిర్వచించలేని గందరగోళ స్థితిలో నే
    అన్ని భాషలలోనూ ఆధునిక సాహిత్యం కొనసాగుతూ ఉంది.
    భావ వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటె కవిత్వంగా పిలవబడుతుంది?
    అని ప్రశ్నిస్తే …. విభిన్న కోణాల్లో వేలాది అభిప్రాయాలు వ్యక్తమౌతాయి.
    నిజానికి ఇది కవిత్వమేకాదు అని చెప్పేందుకు
    ప్రామాణికాలు నిర్ధారించ బడనప్పుడు,
    నిర్దిష్టత లేని డోలాయమాన స్థితి
    ఆధునిక సాహిత్యం లో కంటే విమర్శకులలో
    ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. …..సాహితీ ఔత్సాహికుడు …నూతక్కి రాఘవేంద్ర రావు.

    • సాహిత్యాన్ని మదింపు వేయాల్సింది విమర్శకులే. పాలను నీళ్ళను వేరుచేయాల్సిన బాధ్యత విమర్శకులదే. ప్రముఖ విమర్శకులు శ్రీ నారాయణ శర్మగారు అన్నట్లు, ఆధునిక కవిత్వాన్ని తూకం వేయటానికి సరైన పనిముట్లు తక్కువ. సాహిత్యం ఎంతైతే అవసరమో విమర్శకూడా అంతే అవసరం అనుకొంటాను సర్.

  5. నాగభూషణం దాసరి, says:

    “నేను అమ్మాయినయితే బాగుండేదని ఆశపడేవాడిని
    నా చిన్నతనంలో కళ్ళకు కాటుకపెట్టుకొని
    పొట్టిగౌనులు వేసుకొని అద్దం ముందు ఆడుకొనేవాడిని
    వద్దు వద్దు… ఏదో ఓ రాత్రిఫూట ఓ ఇరవై మందిచే
    ఈ దేహం చీలి ఛిద్రమవటం నేను కోరుకోను.
    నా సహచరీ! దయచేసి మూడో అమ్మాయిని ఈ లోకంలోకి తీసుకురాకు”.

    సచ్చితానందన్ గారి అనువాద రచనే ఇంత అద్భుతంగా ఉంటే ఒరిజినల్ గా మళయాల భాషలో నున్న ఆయన రచనలెలా పాఠకులను ప్రభావితం చేసి చలింపజేస్తాయో నన్న ఉత్సుకత కలుగుతుంది. పరిచయం చేసిన బొల్లోజు బాబా గారికి వారికి ధన్యవాదాలు.
    నాగభూషణం దాసరి,
    హైదరాబాదు

  6. నాగభూషణం దాసరి, says:

    సచ్చితానందన్ గారి అనువాద రచనే ఇంత అద్భుతంగా ఉంటే ఒరిజినల్ గా మళయాల భాషలో నున్న ఆయన రచనలెలా పాఠకులను ప్రభావితం చేసి చలింపజేస్తాయో నన్న ఉత్సుకత కలుగుతుంది. పరిచయం చేసిన బొల్లోజు బాబా గారికి ధన్యవాదాలు.
    నాగభూషణం దాసరి,
    హైదరాబాదు

    • నాగభూషణం గారికి
      సచ్చిదానందన్ కవిత్వం is my latest passion sir, గొప్ప కవి. గొప్ప కవిత్వం. మీకు నచ్చటం సంతోషంగా ఉంది.

  7. కె.కె. రామయ్య says:

    ప్రియమైన సత్యనారాయణ గారూ! బొల్లోజు బాబా గారి అనువాదం ఎంత పదునుగా ఉందొ చూపటానికి
    సచ్చితానందన్ గారి ఆంగ్ల అనువాదం కూడా చూడండి. ( ప్రతి పదమూ మళ్ళీ టైపు చేసాను )

    An Attempt at Conversation ~ K. Satchidanandan

    1

    We live within a knife,
    a knife raised by someone else.
    It is someone else’s heart
    that gets pierced.
    That blood blinds us.
    We bathe in blood before we eat,
    bathe in blood before we mate.
    Blood, even in our dreams.

    2

    Ezhuthachan’s parrot 1
    roosts on a television cable
    that blows across the boiling street.
    She has not even a star’s ray in her beaks.
    Her wings are bleeding too.

    3

    I too would have become a knife
    if I had no tears.
    It was my mother who gave me tears.
    I was drowned in the music of that woman
    who did not know how to sing.

    4

    I had longed to be a girl.
    In my childhood, I would darken my eyes
    and dance before mirrors in short skirts,
    No more. I don’t want this body to be
    torn by twenty men in one night.
    And please, my beloved, don’t carry
    a third girl into the light of the day.

    Ezhuthachan, the 16th century author of the Malayalam Ramayan
    makes a parrot tell the tale of Rama.

    5

    The pearls I raised from
    my mother’s tears
    could not light up any sea.
    Only a girl somewhere heard their call
    and opened her eyes to become a flower.

    6

    Knives don’t speak to flowers
    It only splits apart roads and lands,
    enter each heart and scream,
    which is your religion,
    enter each word and roar,
    which is your party.

    7

    Asan’s Sita sits between the forest and the fire 2
    her husband gave her
    and remembers the sacrifice
    of Ravana who first taught her
    what love is.
    Her womb aches for a rakshasa child 3
    as intense as her Ravana.

    8

    Words of love have been exhausted.
    Each word is now a piece of a
    broken wine-bottle.
    We hurt each other with that.
    To love is to drink each other’s blood,
    when the world pastes
    the court notice on our doors.

    ________________________

    2. Asan ( Kumaran Asan ) wrote a poem “Sita’s Lament “ where Sita
    critiques Rama’s idea of morality.

    3. Ravana belonged to the rakshasa clan which according to the legend
    is an evil clan, though many think it must have been just a clan
    of dark-skinned people.

    9

    Our language is dead.
    The one who wrote it has escaped 4
    We still carry that corpse,
    like a vetal 5.
    Its questions find no answers
    in the birds’ twitter
    or the anklets’ jingle.

    10

    Those who used to stammer
    have been to speak fluently.
    And I make indistinct noises like a man
    whose tongue has been chopped off.
    A wind tells me everthing will be retrieved.
    I whip myself to believe it.

    11

    Gulmohars bloom
    on the banks of Brahmaputra.
    You are not in this room.
    My shoulders ache again;
    may be to carry one more corpse.
    Or may be to grow a wing
    that no knife can chop off.
    A Jatayu beats its broken wings 6
    in the sharp Sun outside.

    ( Translated from the Malayalam by the Poet )

    4. A reference to Subramaniadas, a young radical who committed suicide
    leaving a note that our language is dead.

    5. Vetal, a sphinx-like figure in the Vikramaditya Tales puts puzzling
    questions to the King.

    6. The holy bird in Ramayana, whose wings are chopped off by Ravana
    for trying to rescue Sita when he was carrying her to Lanka.

    • కె. కె. రామయ్యగారికి
      నమస్తే
      మీ వాఖ్యకు చాలా చాలా ధన్యవాదములు.

      సాధారణంగా మూలం చదివాక అనువాదం చాలామందికి నచ్చదు.

      ఒకవేళనచ్చినా అది అనువాదకుని ప్రతిభ కంటే, అలా చదివినవారి సహృదయత అని నమ్ముతాను.

      మీ సహృదయతకు, ఓపిగ్గా టైప్ చేసినందుకు సదా కృతజ్ఞుడను

      ధన్యవాదములు

Leave a Reply to నాగభూషణం దాసరి, Cancel reply

*