టెన్సెస్-కాలాలు

 

gudem

రోజూ గూడెంలో నేను ఎదురు పడినప్పుడల్లా రోషిణి, దీపిక, సుష్మ, ప్రమీల, జయశ్రీ, సౌజన్య నవ్వుతూ నన్ను దాటి వెళ్లిపోతుండేవారు. పదో క్లాసు కావటంతో స్కూలు సమయం దాటాక ప్రత్యేక క్లాసులు మరో రెండు గంటలు పాటు జరుగుతాయి వాళ్లకి. ఎప్పుడైనా క్లాసులు లేనప్పుడు కాస్త తొందరగా వచ్చినా గూడెం లో క్లాసుకి వచ్చేవాళ్లు కాదు. తాము పదో క్లాసు పిల్లలు కనుక తమకో ప్రత్యేక హోదా ఉందన్నట్టు, అక్కడ జరిగే క్లాసుతో తమకు సంబంధం లేదన్నట్టు మసలేవారు. ఒకరోజు ఇంగ్లీషు గ్రామరు హోమ్ వర్క్ ఇచ్చారని, అది చెయ్యాలంటే తమకు అర్థం కావట్లేదని చెప్పించుకుందుకు వచ్చారు.

అది మొదలు వాళ్లకి సమయమున్నప్పుడల్లా రమ్మని చెప్పేను. ముందర్లో మాత్రం ‘ మాకు పనులుంటాయి టీచర్, అవి అయ్యాక హోం వర్క్ చేసుకోవాలి, రావటం కుదరదు’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసేరు.

‘ మీ పనులయ్యాకే రండి, ఈ లోపు మిగిలిన వాళ్ల చదువులు అవుతాయి’ అంటూ రోజూ వాళ్ల వెంట పడటంతో ఇంట్లో వాళ్ల ఒత్తిడి కూడా వాళ్ల మీద పడింది.

రావటం మొదలెట్టేక కూడా కొన్నాళ్ళు కాస్త అసహనంగా కనిపించేవారు, ‘మాకు స్కూల్లో ఇలా చెప్పలేదు టీచర్. మీరు చెప్పేది వేరుగా ఉంది’ అంటూ.

సిలబస్ పూర్తైపోయి వరసగా పరీక్షలు పెడుతుండటంతో అప్పటికి వాళ్లలో ఒక సీరియస్ నెస్ కనిపించింది. తమకు తెలియకుండానే అల్లరి మాని బుధ్ధిగా పాఠాన్ని వినటం మొదలెట్టారు.

చాలావరకు ఆ పిల్లలందరి తల్లిదండ్రులూ వ్యవసాయ పనుల్లోకి వెళ్లే వాళ్లే. కొద్ది మంది మాత్రం అక్కడ పచ్చళ్ల కంపెనీలో షిఫ్టుల్లో పని చేస్తారు.

ప్రమీల తల్లి రోజీ మాత్రం ఒక ఆసుపత్రిలో పనిచేస్తుంది. అక్కడున్న అందరిలోకీ  ఖరీదైన బట్టలు కట్టుకుని, శుభ్రంగా తయారై సాయంకాలం డ్యూటీకి భర్త బండి మీద వెళ్తుంది. దారిలో క్లాసు దగ్గర ఆగి, ‘టీచరుగారూ, మా ప్రమీలని డాక్టర్ ని చెయ్యాల. బాగా చదివించండి.’ అనేది నవ్వుతూ. ఆమె అలా క్షణం పాటు ఆగినప్పుడు, ప్రమీల లేచి తల్లి దగ్గరకి వెళ్లి,

‘అమ్మా, అన్నం వండావా?’ అని అడగటం, ‘ ఈ అన్నం గోలేంటే నీకు? మద్యాన్నం తిన్నదంతా ఏమైపోయింది? మీ అన్నయ్యో, నాన్నో బిర్యానీ ప్యాకెట్టట్టుకొస్తారులే వొచ్చేప్పుడు’ అంటూ వెళ్లిపోయేది. తల్లి మాటలకి విసుగ్గా వచ్చి కూర్చునేది ప్రమీల.

‘ఆళ్ల తిరుగుళ్లన్నీ అయ్యి ఎప్పటికి పట్టుకొస్తారో, ఆపాటికి నేను ఆకలితో చచ్చిపోతాను’ అంటూ గొణుక్కునేది. ఎంత చిన్నాగా అనుకున్నా స్పష్టంగానే వినిపించేవా మాటలు. దాదాపు రోజూ ఇలాటి సంభాషణేదో జరుగుతూనే ఉండేది ప్రమీలకీ ఆమె తల్లికీ.

మిగిలిన వాళ్లకంటే తామొక మెట్టు ఆర్థికంగా పైనున్నామని అందరికీ తెలిసేలా రోజీ ప్రవర్తిస్తుండేది. పెద్ద కలర్ టి.వి. కొన్నప్పుడు నన్ను ప్రత్యేకం ఇంట్లోకి పిలిచి, ‘ బావుందా టీచర్ గారూ, ఇంకా పెద్దది కొనమంటే మా ఆయన వద్దన్నాడు. సర్లే , వచ్చే ఏడు మార్చచ్చు అని ఊరుకున్నాను.’ అంది. ఆ గది ని పరిశీలనగా చూసాను, ఒక ప్రక్క డబుల్ కాట్ మంచం, ఒక ప్రక్క ఎయిర్ కూలరు అన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి.

వంటింట్లోకి తీసుకెళ్లి క్రొత్త గ్యాసుపొయ్యి, మిక్సర్ చూబించింది. క్రొత్త స్టీలు సామాన్లు తళతళ లాడుతూ అక్కడున్న గూళ్లల్లో సర్ది ఉన్నాయి. కానీ వంట గదిలో సాధారణంగా కనిపించే సరుకులు కానీ, వాటిని దాచిపెట్టే డబ్బాల్లాటివి ఏవీ కనిపించలేదు.

నా ఆలోచన చదివినట్టే చెప్పింది, ‘సరుకులు నిలవ పెట్టుకోవటం అలవాటులేదు టీచరుగారూ, ఎప్పటియప్పుడే తాజాగా తెచ్చుకుంటాం. అదీకాక పొయ్యి దగ్గర పనంటే నాకు విసుగు. ఎక్కువగా బయటనుంచే తెప్పించేస్తా టిఫిన్లు, బిర్యానీలు ’ అంది.

అందరిలోకీ ప్రమీల చురుకైనది, అందులోనూ గత మూడేళ్లుగా ఇంగ్లీషు మీడియంలో చదువుతోంది. మిగిలిన వాళ్లకంటే ముందుగా అర్థం చేసుకునేది, కానీ రోజూ ఓ పావుగంట పాఠం అయ్యాక,

‘ నాకు ఆకలేస్తోంది టీచర్, ఏమీ ఎక్కట్లేదు’ అంటూ మొదలెట్టేది. అదో అలవాటైన ధోరణిగా తయారైంది. మిగిలిన వాళ్లు అదేదో నవ్వులాటలా తీసుకుని పాఠం వినటం మాని అల్లరి మొదలెట్టేవారు.

ఒకరోజు రోజీ హడావుడిగా వచ్చి, ‘ టీచరుగారూ, ఈ రోజొక్కరోజుకీ పిల్లని పంపండి, మా ఆయన కొత్తగా కట్టిన సిటీమాల్ లో సినిమాకి తీసుకెళతాడంట.’ అంది.

సమాధానం చెప్పేలోపునే, ‘ నేను కూడా ఆస్పత్రికి రానని ఫోన్ చేసి చెప్పేసేనులే టీచర్. మా ఆయనకి అసలు టైమే దొరకదు, వాళ్ల సార్ గారు ఈ పూట ఊరెళ్ళేరంట. ఖాళీ దొరికిందని మాల్ కి తీసుకెళ్లి, సినిమా చూబిస్తానన్నాడు, టైమైపోతోంది, పంపండి’ అంటూ ఉన్నపళాన పిల్లని తీసుకెళ్లిపోయింది.‘ సిటీ మాల్’ మా ఊళ్లో క్రొత్తగా కట్టిన మాల్.

పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. వీళ్లలో సీరియస్ నెస్ జాగ్రత్తగా కాపాడాలి అనుకుంటూ  రోజూ ఇంటికి కూడా కొంత పని ఇవ్వటం మొదలెట్టాను. సరిగ్గా చేసుకొచ్చినా లేకపోయినా వాళ్ల ప్రయత్నానికి చిన్నగా ప్రశంసలు, ఓ క్రొత్త పెన్నో, నోటు పుస్తకమో బహుమతిగా ఇవ్వటం లాటి వాటితో వాళ్లని చదువు దారిలోకి మరింతగా మళ్లించేందుకు నా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

ఆరోజు టెన్సెస్ గురించి చెబుతున్నాను. ఒకటి, రెండు ఉదాహరణలు ఇచ్చాక అర్థమైనట్టే కనిపించారు. వాళ్ల దైనందిన జీవితంలో కబుర్లని భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉదాహరణలుగా చెప్పమని ప్రోత్సహించాను.

సౌజన్య ప్రయత్నం చేసింది, కానీ వాక్య రూపంలో ఎలా చెప్పాలో తెలియక తడబడుతూ, ‘ నేను తెలుగు మీడియం టీచర్’ అంది.

‘ అయితే ఏం, కొంచెం ఆలోచించి చెప్పు. నీకు అర్థమైనది ఏమిటో నువ్వు చెప్పగలగాలి. ఇంకో నాలుగు నెలల్లో కాలేజీ చదువుకొస్తావు.’

సౌజన్య మౌనంగా నిలబడింది. తప్పు చెబుతామేమో అన్నసంశయం మిగిలిన పిల్లల్ని కూడా మౌనంగా కూర్చోబెట్టింది.

ప్రమీల లేచింది, ‘టీచర్, నేను చెబుతాను.’

‘ఐ వజ్ హంగ్రీ, అయామ్ హంగ్రీ, ఐ విల్ బి హంగ్రీ ‘……………….

మిగిలిన పిల్లలు ఆమె మాటలకి నవ్వారు. ప్రమీల చెప్పేది నవ్వులాటకి కాదని నాకు తెలుసు. ఎదుగుతున్న ఈ పిల్లలు సరైన పోషణ లేక ఎంత అవస్థ పడుతున్నారు!

‘ ప్రమీలా, ఇంత కంటే మంచి ఉదాహరణ దొరకలేదా? అసలైనా నువ్వు ఒక్కదానివి రోజూ ఆకలని గోల పెడతావు, నీ స్నేహితులెవరూ ఒక్కసారి కూడా నీలా గొడవ చెయ్యరు. క్లాసుకొచ్చేముందు ఏదైనా తిని రావచ్చు కదా’.

‘ వాళ్లకీ ఆకలేస్తుంది టీచర్, వాళ్ళు చెప్పరు. అయినా ఇంట్లో ఏదైనా ఉంటే కదా  తిని రావటానికి’ ప్రమీల ముఖాన్నిపుస్తకంలో దాచుకుంది.

ఉలిక్కి పడ్డాను. మిగిలిన పిల్లల కంటే ఒక మెట్టు ఆర్థికంగా పైనుందని అనుకుంటున్న ప్రమీల ఇలా చెబుతోంది. అప్రయత్నంగా అందంగా పొందిగ్గా సర్దిన రోజీ వంటిల్లు కళ్లముందు కదిలింది. ఇంటి విషయంలో అంత శ్రధ్ధగా ఉన్నరోజీ కూతురు పడే ఆకలి బాథని అర్థం చేసుకోలేదెందుకో?! ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యం లేదామె దృష్టిలో?! సిటీ మాల్ లో సినిమాకి, భోజనానికి ఖర్చు పెట్టగలదు రోజీ.

అంతోఇంతో జరుగుబాటు ఉన్న కుటుంబాలు ఎలాటి జీవితాల వైపు మొగ్గు చూపుతున్నాయో, వాళ్ల ప్రాధాన్యతలు ఏమిటో చూస్తే ఆశ్చర్యం వేసింది.

ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నవారైనా కూడా  తమకేం కావాలో కాక, చుట్టూ సమాజంలో తమ స్థాయిని చూబించుకునేందుకే ఎక్కువగా ఆరాట పడుతు న్నారనిపించింది. సాయంత్రాలు ఇలా ఆకలితో గడపాల్సిన పరిస్థితి ప్రమీలకు ఖచ్చితంగా లేదు. ఆ కుటుంబ స్థాయికి అది సమస్య కానే కాదు. రోజీతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను.

*

 

 

 

మీ మాటలు

  1. Prasadarao says:

    డాబులకు పోయే తల్లి తండ్రులు తమ పిల్లల భవిష్యత్ గురించి సరిగా ఆలోచించ రనడానికి ఈ కథ నిదర్శనం .

  2. ప్రసాద్ రావు గారు చాలా బాగా చెప్పేరు. మేడి పండు సామెత లాంటి జీవితాలు !

  3. ఇది కూడా ఒక సామాజిక సమస్యే!! దీని వలన అనర్ధాలు ఉన్నాయి. చదువులు వెనక్కి వెళతాయి, పిల్లలు తిండి కోసం పక్క దారి పట్టడం..దొంగతనాలో, లేక తిండి కోసం వీధి చివర చిల్లర మనుషులతో తిరగడం లాంటివి ఎక్కువ అవుతాయి. టీచర్ గారు ప్రమీల తల్లి తో మాట్లాడ దామని అనుకోవడం బాగానే ఉంది కానీ, అది ఎంత వరకు ఫలిస్తోందని ఆశించాలి !!

  4. N.SURYANARAYANA says:

    కోటి విద్య లు కూటి కొరకే అనే మన పెద్దలు చెప్పినట్లు ఏ పని చేసిన పొట్టనింపుకోవడానికే కదా, కానీ ఈ కధ లో ప్రమీల తల్లి తన కూతురి ఆకలి ఎందుకు తీర్చలేక పోతోందో అడగాలని టీచర్ నిర్ణయం బాగుంది. ఇంటి విషయంలో అంత శ్రధ్ధగా ఉన్నరోజీ తన కూతురు ఇలా ఆకలితో గడపాల్సిన పరిస్థితి లేదు .ఆర్థికంగా డాబు వున్నా ఆకలి తీర్చే ఆలోచన లేని తల్లి.

Leave a Reply to N.SURYANARAYANA Cancel reply

*