ఎవర్ని ప్రశ్నించాలి?!

 

ప్రజలు అనేమాట నాకు చాలా ఇష్టమైన పదం ఎప్పటికీ.

స్వేచ్ఛ అనేమాట ఒకప్పుడు అంటే యవ్వనంలో నాకు చాలా ఇష్టంగా వుండేది. కానీ కాలం గడిచేకొద్దీ ఆపదం ప్రచారం కావడం వెనక వున్న విస్తృతి అర్ధం అయ్యేకొద్దీ, పరిణామాలు చూసేకొద్దీ ఆమాటపై మోజు తగ్గిపోసాగింది. సరే, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ తాలూకు పరిణామాలకి వారే బాధ్యులుగనక ఆవిషయం పక్కన పెడితే; సాహిత్యకారులు, రచయితలు మానవ సమాజాన్ని వ్యక్తీకరించడంలో, విశ్లేషించడంలో తమకున్న స్వేచ్ఛని జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి అవసరం రాను రాను పెరిగిపోతున్న దశలో మనం ఉన్నామన్నది నా నిశ్చితమైన అభిప్రాయం.
లాజికల్ గా సరైనవి అనిపిస్తున్న విషయాలు అన్నీ సామాజికంగా సరైనవి అనడానికి లేదు.  ప్రతి అస్థిత్వ ఉద్యమమూ మనకి ఈవిషయాన్ని అనేక ప్రశ్నలతో, అనేక రుజువులతో బయటపెట్టాయి, నిరూపించాయి.  అయినాగానీ, సామాజిక పరిణామాలతో సంబంధం లేకుండా,  సామాజికాంశాలని లాజికల్ గా విశ్లేషించ బూనడం, వ్యాఖ్యానించడం కొందరు రచయితలు తరచూ  చేస్తుంటారు. వారు సమాజంలోని
అన్యాయాలకి, వ్యత్యాసాలకి, అపభ్రంశాలకీ  కారణాలను వ్యవస్థీకృతమైన చోట్ల కాకుండా అసంఘటితమైన, అమాయకమైన, అపరిపక్వమైన చోట్ల కారణాలను వెతుకుతుంటారు. అలాంటి వారు తమ వ్యాఖ్యానాలతో ప్రజలని తప్పుపట్టడం తరచూ చూస్తూ వుంటాం.  వారు అలా వ్యాఖ్యానించే స్వేచ్ఛని కాదనలేం గాని, అలాంటివారు విధిగా గ్రహించవలసిన విషయాలని తెలియ జెప్పడమే ఈ వ్యాసం యొక్క
సారాంశం.

*       *       *       *

ఇప్పటి సమాజం ఇలా వుండడానికి అంటే మనం తరచూ ఒక నిస్పృహతో భావిస్తున్నట్టు   కుళ్లిపోయినట్టు వుండటానికి ప్రభుత్వాలు, రాజకీయ
నాయకులే కారణమా? మనం (అంటే ప్రజలు) కారణం కాదా? అని తరచూ కొందరు ప్రశ్నించడాన్ని మనం చూస్తూవుంటాం.  కొందరినుండి వచ్చే ఇలాంటి ప్రశ్నలు లాజికల్ గా వినడానికి బాగుంటాయి గాని, అలాంటి ప్రశ్నలు సామాజిక బాధ్యతతో అడిగిన ప్రశ్నలు  ఎన్నటికీ కాలేవు.

ప్రజలు అనేపదం ఒక సమూహానికి పర్యాయంగా మనం వాడుతాము. ఆ సమూహంలో దొంగలు మొదలుకుని మేధావులు, సైంటిస్టులు, బాలురు, స్త్రీలు, వ్యాపారులు, ఉద్యోగులు, బిచ్చగాళ్ల వరకు… ఇలా అన్ని విభాగాలలోని వ్యక్తులందరినీ కలిపి ప్రజలు అని మనం పిలుచుకుంటాం.  ఈప్రజలని సాధారణంగా విడివిడిగా కొన్ని సాంప్రదాయ నియమాలతోబాటు వారి బుద్ది మరియు హృదయం నడిపిస్తు
ఉంటాయి.  ఇంకా వారి కుటుబ సభ్యులతో వున్న మానవ సంబంధాలు కూడా నడిపిస్తుంటాయి.  దైనందిన జీవితంలో వారి ప్రవర్తనలకి, ఎమోషన్లకి నియంత్రణ కలిగించే విషయాలు అనేకం వుంటాయి.  ఆర్ధిక స్థితి,  కులం, బంధుత్వాలు, సాంప్రదాయాలు వంటివి ఎన్నో విషయాలు  వారి ప్రవర్తనలని నిర్దేశిస్తుంటాయి. మీరు ఇలా ఇన్నిగంటలు ఈపని చెయ్యాలనే రూల్స్ ఏవీ ప్రజలపై వుండవు.

ప్రభుత్వం వేరు. ప్రభుత్వం అనేది దానిని  సక్రమంగా నడపడానికి అవసరమైన ట్రైనింగ్ తీసుకుని, ఆపని చేస్తున్నందుకు జీతం పొందే వారితో ప్రభుత్వం నిర్వహించబడుతుంది.  ప్రతి అధికారికీ, ప్రభుత్వోద్యోగికీ జిల్లా కలెక్టర్ తో సహా తామెలా పనిచెయ్యాలో ఒక మాన్యువల్ వుంటుంది. అలా చేసినందుకు ప్రభుత్వం వారికి జీతంతోపాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అందులో గృహవసతి, ఆరోగ్య సౌకర్యం, ప్రయాణ సౌకర్యం, పెన్షను, లోన్లు వంటివి ఎన్నో కల్పించి వారికి ఒక భద్ర జీవితాన్ని, వారి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తునీ కల్పిస్తుంది ప్రభుత్వం.  వీరి పని ఏమంటే ప్రభుత్వం నిర్వహించే వ్యవస్థలు సక్రమంగా నడిచేలా బాధ్యతతో, నిజాయితీతో,  పైన చెప్పుకున్న ప్రజలకి ప్రజా సౌకర్యాలకీ మేలు కలిగించే పని చెయ్యడం.
ఇప్పుడు విషయానికి వద్దాం.  ఈ ప్రభుత్వోద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చాక తమని 60 యేళ్లవరకు కదిలించే వాళ్లు లేరనే ధీమాతో ఉండడం జగమెరిగిన సత్యం. ఈ ధీమాతో ఒక నిర్లక్ష్యం, దానివెంట ఒక ఉదాశీనతా వచ్చి చేరుతాయి. వీటివెనక వున్న  కారణం  ఏమిటంటే వారివెనక ఉద్యోగ సంఘాలు, కోర్టులు వుండడమే! తిరిగి ఈఉద్యోగ సంఘాలు, కోర్టులు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే.  ఉదాహరణకి ఒక ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఏనాడైనా తమబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడానికి ఈపిల్లలే కారణం అని
ఆలోచించగలడా? అలా ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈనాటి మూతబడవలసిన దుస్థితిలో వుంటాయా? ఇది ఒక్కటీచర్లపై  విమర్శ మాత్రమే కాదు. అన్ని ప్రభుత్వ వ్యస్థలలోని నిరాశాజనక స్థితికి ఉదాహరణ.  ఇలా కావడానికి వారే చెప్పే కారణం  ఉద్యోగుల ఉద్యోగం, వారి పిల్లల భవిష్యత్తు “ట్రాన్స్ఫర్స్” అనే పేరుతో రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం.

ఇకపోతే ప్రభుత్వాలని ఏలే పార్టీలు, రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులు అనేవాళ్లని ప్రజలు తమ సంక్షేమం కోసం ఎన్నుకుని అసెంబ్లీ, పార్లమెంట్స్ కి ఎన్నిక చేసి పంపుతారు. కానీ కరెప్ట్ అయిన అధికార వ్యవస్థలన్నీ కూడబలుక్కుని లేదా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై ఎన్నికల భారతం ఒక తంతుగా మారిపోయింది. ఈక్రమంలో ఎన్నికలప్పుడు కార్పొరేట్ సెక్టార్ తమకి 5 యేళ్లపాటు అనుకూలంగా వుండటానికి సమకూర్చిన  నిథులతో డబ్బు, మద్యం పంపిణీ
చేసి, మీడియాని కొని, కోట్ల రూపాయల పబ్లిసిటీల ఖర్చుతో నాయకులు పుట్టుకొస్తున్న కాలం ఇది.  ఎన్నికల్లో గెలిచాక మళ్లీ ఈ నాయకులు కూడా
భారీగానే చట్టబద్దంగా జీతాలు తీసుకుంటారు. ఇక పోతే గెలిచాక మన ప్రభుత్వాలు, వాటి నాయకులు ఏమేం చేస్తున్నారనేది ఏరోజు ఏపేపర్ చూసినా ఏదోరకంగా క్లూ దొరికిపోతుంది.

ఇక్కడ మళ్లీ కొందరు  లాజికల్ గా, అమాయకంగా ఒక ప్రశ్న వేస్తారు. “ఎన్నికల్లో డబ్బు తీసుకోవడం తప్పుగదా? డబ్బు తీసుకుని వాళ్లకి ఓట్లేసి
వాళ్లని గెలిపించేది మనమే ( అంటే ప్రజలే) కదా?” అని. ఇదెలా వుంటుందంటే, బస్సులోనో బజారు సెంటర్లోనో ప్రతి రోజూ ఒకమ్మాయి ఒళ్లంతా కామంతో చూసేవాడు; “నువ్వు చూడకపోతే నేను చూసినట్టు నీకెలా తెలుసు?” అని వాదించినట్టు వుంటుంది.

rafi1

ఎన్నికల్లో రాజకీయ నాయకులు డబ్బు పంచకుండా ఉండడానికి భారత దేశంలోని సకల అధికార యంత్రాంగాము ఉండికూడా దేశంలో వందల  కోట్లకొద్దీ డబ్బు పట్టుబడుతూనే వుంది. పట్టుబడ్డదే ఇంతింత వుంటే పంచుతున్నదెంత? ఎన్నికలంటే ఇన్ని దశాబ్దాలుగా నడుపుతున్న వారికెంత నిర్లక్ష్యమో అర్ధం అవుతుందిగదా!  పోనీ, ఎన్నికల సమయంలో  పదిమంది నాయకులు గుంపులు
గుంపులుగాగా ఇంటికొచ్చి నవ్వుతూ నమస్కారం పెట్టిపోయి, ఆరాత్రికి వాళ్ల అనుయూయులతో మనిషికి ఇంతని లెక్కవేసి రెండువేలో మూడువేలో కుటుంబపెద్ద  చేతిలో పెడితే తిరస్కరించ గలిగే ధైర్యం సగటు మనిషికి ఉంటుందా? ఈ విషయాలన్నీ  ఆలోచించకుండా “డబ్బు తీసుకుని ఓట్లేయడం తప్పుకదా?” అని ప్రశ్నించడం వాస్తవం పట్ల అవగాహన లేకపోవడమే అవుతుంది. రేపు ఆనాయకుడు గెలిస్తే మనకి ఏదైనా  పనిబడితే పొయ్యి పలకరించాల కదా? ఇక పోతే రెండవ విషయం సగటు ప్రజలు ఆర్ధిక దారిద్ర్యం వల్ల కూడా 500/1000 కాగితానికి
ప్రలోభ పడతారు. ఆ రంగురంగుల కాగితం అప్పుడు తప్ప చూడలేని వాళ్లు కోట్ల మంది.  నిజానికి నాయకుల  డబ్బు పంపకం కార్యక్రమం  అంతా  ఆర్ధికావసరాలు చుట్టు ముడుతున్న స్లంస్ మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది.  ధనవంతుడు కట్టిన 33 అంకణాల్లో మూడో నాలుగో ఓట్లుంటే, అదే 33అంకణాల స్లం ఏరియాలో 30- 40 ఓట్లుంటాయి.

ఇప్పుడు ఈమూడు వర్గాల మధ్య వ్యత్యాసం గమనిస్తే…. ప్రజలేమీ నాయకులలాగా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల మాదిరి జీతం తీసుకోరు.
రెండుపూటలు తింటారో, ఒక పూట తింటారో, తాగతారో, తలకి పోసుకుంటారో, వీథుల్లో తన్నుకుంటారో గాని  ప్రభుత్వం నడవడానికి మాత్రం పన్నులు కడతారు. అంతకు మించి వ్యవస్థని, ప్రభుత్వాన్నీ నడిపించడంలో వారి పాత్ర శూన్యం. “అది చేస్తాం, ఇది చేస్తాం అని నమ్మించి గద్దెనెక్కిన వారినీ, జాబ్ మేన్యువల్ ప్రకారం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సిన ప్రభుత్వ అధికారులనీ వదిలేసి ”  ప్రజలని తప్పు పట్టడం  సామాజిక క్రమం అంతటిపట్లా అవగాహన ఉన్నవారు చెయ్యలేరు.

ప్రజలకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికీ; వారికి విద్య, జ్ఞానం, వైద్యం, భృతి, ఇవ్వడానికే, మంచి పౌరులుగా ఆత్మాభిమానంతో బతకడానికీ, చైతన్యవంతంగా సమాజాన్ని బాగు చెయ్యడానికీ  (ఎన్నికల ముందు చెప్తారు) నాయకులు గెలిచి జీతం తీసుకుని పని చేస్తున్నారు.  అందుకనే నాయకులు మెరికల్లాంటి IAS అధికార్లని తమ పియ్యేలుగా నియమించుకుంటున్నారు.  కానీ నిజానికి చేస్తున్నదేమిటి? ఈదేశంలోని మానవ వనరులు, భౌగోళిక వనరులు చూపి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, వాటిలో కమీషన్లు మింగి, అవి కట్టలేక అప్పిచ్చిన వాడు విధించిన షరతులతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా తిరిగి పెరుక్కుంటున్నారు. మరి అలాంటప్పుడు  వీళ్ల అసమర్ధతకి, వీళ్ల
అవినీతి అక్రమాలకీ ప్రజలని ఎలా తప్పు పట్టగలం? ప్రజలు ఏం చేశారని తప్పు పట్టగలం?  అసలు నోరెలా వస్తుంది?  అందుకే పైన చెప్పిన మాటని మళ్లీ ఇక్కడ రాస్తాను.

రచయితలకి  సమాజం యొక్క వర్తమాన  పరిణామ క్రమాలపై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. మనకి రాయడానికి, ప్రశ్నించడానికీ అందిన స్వేచ్ఛని  మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకుని, వ్యాఖ్యానిద్దాం. మనకున్న ప్రశ్నించే స్వేచ్చని రచయితలుగా మనం దుర్వినియోగ పరచకుండా జాగ్రత్త పడదాం! ప్రశ్నించ వలసిన వారినే ప్రశ్నిద్దాం!

ఇప్పుడిక నా వ్యాసాన్ని ప్రముఖ రచయిత చెప్పిన ఆణి ముత్యాల్లాంటి రెండు మాటలతో ముగిస్తాను.

“రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.

*       *       *       *

మీ మాటలు

  1. Padmakar Daggumati says:

    “రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.

  2. srinivas sathiraju says:

    చాలా కొద్దిమంది ఆలోచించే దిశగా మీరు ఉన్నారు కానీ మీతో నా ఆలోచనలు ఏకీభావిస్తున్నాయి. ఇలా ఇంకా కొంత మంది నిజాయితీగా తమ భావాలని వెలిబుచ్చగలరు అనే విషయం అంతకన్నా ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలు ముద్రించడం ద్వారా తమ సాహితి దృక్పధం సంకుచితం కాదని తెలియ చెప్పిన సారంగ యాజమాన్యాన్ని అభినందిస్తూ (అలాంటి మంచి పోకడలు కేవలం తమ ప్రచురించే విధానాల మీదనే ఉన్న విషయం, ప్రసార మాధ్యమాల దుర్వినియోగమే సమాజ తిరోగమనానికి నాంది అన్న విషయం కూడా గ్రహించి తిరోగమన వాద మరియూ విపరీత పోకడలను ప్రోత్సహించే రచనలను దూరంగా ఉంచాలని మరొక సారి విజ్ఞప్తి చేస్తూ.) .పద్మాకర్ గారికి అభినందనలు తెలుపుతున్నాను.

  3. satyanarayana says:

    పద్మాకర్ గారూ ,
    చాలా మంచి విషయాలని ఎన్నుకుంటారు మీరు ,ఈ భరోసా ఎంతవరకు అనీ,ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి అనీ . సమంజస మయిన విశ్లేషణే చేస్తారు .
    నాకు కొన్ని వాక్యాలు సరిగా అర్ధం కాలేదు .
    ఈ కింద వాక్యాలు కాస్త సరళంగా వివరిస్తే బాగుంటుందనిపించింది .

    “ఉదాహరణకి ఒక ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఏనాడైనా తమబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడానికి ఈపిల్లలే కారణం అని
    ఆలోచించగలడా? అలా ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఈనాటి మూతబడవలసిన దుస్థితిలో వుంటాయా? ఇది ఒక్కటీచర్లపై విమర్శ మాత్రమే కాదు. అన్ని ప్రభుత్వ వ్యస్థలలోని నిరాశాజనక స్థితికి ఉదాహరణ. ”

    మీ నుంచి ఇలాంటి ,ఆలోచనలను పదునుపెట్టే రచనలు ఆహ్వానిస్తూ ,

    • Padmakar daggumati says:

      ధన్యవాదాలు బాబీ గారు. సారంగ నిర్వహణ చాలా విషయాలలో అభినందించ దగిన స్థాయిలో ఉంది. వత్తిళ్లను, విమర్శలను రచనలతో సమానంగా ఆహ్వానిస్తున్నారు వారు! :-)

  4. రమణమూర్తి says:

    “అన్యాయాలకి, వ్యత్యాసాలకి, అపభ్రంశాలకీ కారణాలను వ్యవస్థీకృతమైన చోట్ల కాకుండా అసంఘటితమైన, అమాయకమైన, అపరిపక్వమైన చోట్ల కారణాలను వెతుకుతుంటారు.”

    – చాలా నికార్సైన మాట. కానీ అలాంటి మూలకారణాలను పట్టుకోవడానికి చాలా అవగాహనా, ఆలోచనా ఉండాలి! మంచి వ్యాసం – అభినందనలు పద్మాకర్ గారూ!

    • Padmakar daggumati says:

      ధన్యవాలు రమణమూర్తి గారు. వ్యాసంలోని మంచి వాక్యాన్ని వెలికితీసి నలుగురి దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు

  5. Padmakar daggumati says:

    ధన్యవాదాలు సత్యనారాయణ గారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సహజంగా ఉండే ఉదాశీనతని నేను ఎత్తిచూపడానికి నేను ఒక ఉదాహరణని ఎంచుకున్నాను. తమ వృత్తికీ, శ్రమకీ ప్రతిఫలం ఎలా ఎందువల్ల ఎక్కడినుండి వస్తుందో తాము నిరంతర స్పృహలో ఉండగలిగితే తగిన న్యాయం చెయ్యగలుగుతారనేది నా అభిప్రాయం

  6. ఆర్.దమయంతి. says:

    రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” – రావిశాస్త్రి.
    రవ్వల నగలు అంటే ఇలాటి మాటలు మరి.
    ధన్యవాదాలు పద్మాకర్ గారు, మంచి వ్యాసాన్ని అందించినందుకు.

  7. g b sastry says:

    బలవంతుని బారినుండి బలహీనుని రక్షించి, వాడుకూడా బతకడానికి వీలుకలిగించడానికే వ్యవస్తన్నది పుట్టింది.
    వ్యవస్థ ఒక రిఫరీగా పనిచేస్తుంది ఆ రిఫరీకి కూడా తనపనిచేసేందుకు కావలసిన బలం వ్యవస్థే ఇవ్వాలి.
    వ్యవస్థ ఏర్పడినంతమాత్రాన బలవంతులు తలవొంచుకుని ఉండరు (ఆ బలం భుజ,బుద్ధి లలో ఏదైనా కావచ్చు)
    ఆ పరిస్థితిలో బలహీనులు సంఘటితమై ఏర్పరచుకొన్న విలువలకు కట్టుబడి ఉంటేకానీ బలవంతులబారినుండి తమని రక్షించుకోలేరు
    బలవంతులు వాడే సామ,దాన,బేధ దండోపాయాలకి నిలబడే శక్తిని గుండె నిబ్బరాన్ని మనిషికున్న లాలసతల తో అవిశ్రాతంగా దాడి చేస్తూనే ఉంటాయి ఆదాడిని తిప్పికొట్టగల శక్తి ఏర్పడ్డ సిద్ధాంత బలమే ప్రాతిపదిక అవుతుంది. అది మరచి మిగిలిన వాటిపై మాట్లాడడం పులిని చంపడానికి దాని నీడపై దాడి చేసి నట్టే

  8. Sivalakshmi says:

    “ఈ ప్రభుత్వోద్యోగులు ఒకసారి ఉద్యోగం వచ్చాక తమని 60 యేళ్లవరకు కదిలించే వాళ్లు లేరనే ధీమాతో ఉండడం జగమెరిగిన సత్యం. ఈ ధీమాతో ఒక నిర్లక్ష్యం, దానివెంట ఒక ఉదాశీనతా వచ్చి చేరుతాయి. వీటివెనక వున్న కారణం ఏమిటంటే వారివెనక ఉద్యోగ సంఘాలు, కోర్టులు వుండడమే! తిరిగి ఈఉద్యోగ సంఘాలు, కోర్టులు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే”.
    ఒక నిజం చెప్పారు.ప్రభుత్వోద్యోగుల్లో కొందరు నిజాయితీగా పని చెయ్యాలను కునే వాళ్ళూ ఉంటారు.ట్రేడ్ యూనియన్ల నాయకులు ప్రజలకు పూచీ పడుతూ పని చెయ్యమని చెప్పరు.పోరాటాల్లో ప్రజల పక్షం వహించమనరు.ఎంతసేపూ జీతభత్యాలకోసం ఉద్యమాలు చేస్తారు.అచ్చం ఎన్ జీ వో సంస్థల్లాగే వీళ్ళు కూడా మీరన్నట్లు ప్రభుత్వం కనుసన్నలలో నడిచే వ్యవస్థలే!
    మంచి ఆలోచనలు రేకెత్తించే వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు !

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

*