అతనొచ్చాడు!

 

chinnakatha

 

 

ఉద్యోగులతో సమావేశంలో ఉండగా, రిసెప్షన్‌ నుంచి ఫోను.

”సార్‌, మిమ్మల్ని కలవడానికి దాచేపల్లి నుంచి ఒకామె వచ్చింది. మీ ఆఫీసుకు పంపమంటారా?”

హైదరాబాదులోని రాజ్‌భవన్‌ రోడ్డులో మా హెడ్డాఫీసు ఉంటుంది. పక్కనే ఉన్న సందులో మెరక మీద మహిళా కళాశాల పక్కనున్న అద్దె భవనంలో నేను పనిచేసే ఫౌండేషన్‌ ఆఫీసు ఉంటుంది.

ఎవరు, ఏమిటి, ఎందుకు లాంటి ప్రశ్నలు అడక్కుండా ”పంపించండి” అన్నాను, మీటింగ్‌ సీరియస్‌గా నడుస్తుండటంతో.

పది నిమిషాల తర్వాత బాయ్‌ చెప్పాడు, ఆమె వచ్చినట్లు. కాసేపు బయటే కూచోబెట్టమన్నాను.

అరగంట తర్వాత నా క్యాబిన్‌ ఖాళీ అయింది. వచ్చినవాళ్లను లోపలికి పంపమన్నాను.

ముందుగా మస్తాన్‌ లోపలికొచ్చాడు. అతనో జర్నలిస్టు నాయకుడు. గుంటూరు జిల్లా. కొద్దిగా పరిచయం.

”మీరా? ఎవరో మహిళ వచ్చిందన్నారు…” నవ్వుతూ అడిగాను, సందేహాస్పద చూపుల్తో.

”అవును సార్‌. ఆమెను నేనే తీసుకొచ్చా”.

”అవునా! దేని గురించి?”

”కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా మీకో అర్జీ పంపించాం. దాని గురించి మీకు నాలుగైదు సార్లు ఫోన్‌జేశాను. మీరు తర్వాత చూద్దాం అన్నారు. కానీ అతని పరిస్థితి…”

ఆ అర్జీ గుర్తొచ్చింది. దాచేపల్లిలో ఓ పత్రికకు విలేకరిగా పనిచేసే వ్యక్తికి ఏదో జబ్బు చేసింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఆపరేషన్‌ చేయాలంటే అయిదు లక్షల ఖర్చు. ఫౌండేషన్‌ సాయం కోసం ఎమ్మెల్యే సిఫారసుతో కూడిన లేఖను మస్తాన్‌ నాకు కొరియర్లో పంపాడు.

”మస్తాన్‌ భాయ్‌, ఈ సంవత్సరం ఫౌండేషన్‌కు రావల్సిన బడ్జెట్‌ పూర్తిగా విడుదల కాలేదు. తప్పనిసరిగా చేయాల్సిన కార్యక్రమాలే డబ్బుల్లేక ఆగిపోయాయి. ఇలాంటి రిక్వెస్టులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఫైల్‌ చూపించమంటావా?”

”సార్‌ సార్‌, అలా అనకండి. మీరు ఒక్కసారి అతన్ని చూడండి. వాళ్ల ఆవిడ కూడా వచ్చింది” నా అనుమతి కోసం చూడకుండా బయటికి నడిచాడు.

రెండు నిమిషాల తర్వాత నా క్యాబిన్‌ తలుపులు తెరుచుకున్నాయి. ముందుగా మస్తాన్‌… అతని వెనక ఓ మహిళ… ఆమె వీపు మీద ఎవరో ఉన్నారు, పిల్లాడు కాదు, యువకుడే. పసిపిల్లల ‘ఉప్పు ఆట’ గుర్తొచ్చింది.

ఆమె అతన్ని తీసుకొచ్చి, నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూచోబెట్టింది. అతను రెండు చేతులూ జోడించి, నమస్కారం పెట్టాడు. నడుం దగ్గరనుంచి పైభాగం బొద్దుగా, చూడ్డానికి యాక్టివ్‌గానే ఉన్నాడు. కింది భాగం మాత్రం చచ్చుబడిపోయినట్లు అర్థమైంది.

”కూర్చోమ్మా” ఆమెకు చెప్పాను.

”పర్లేదు సార్‌” అంటూ అతని పక్కనే నిలబడింది. మస్తాన్‌ నాకెదురుగా కుర్చీలో కూచున్నాడు. అప్పటికర్థమైంది అతను ఆమె భర్తేనని.

ఆ పరిస్థితి చూశాక, నాలో ఏదో కదలిక.

గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి ఎంతో ప్రయాణం… తీరా ఇక్కడికొచ్చాక, బాగా మెరక మీద ఉన్న ఆఫీసు దాకా అతన్ని వీపుమీద మోసుకురావడం… గుండె ద్రవించిపోయింది.

నిజానికి అతని అర్జీ వచ్చినప్పుడు, మస్తాన్‌తో ఉన్న పరిచయం కారణంగా రెండురోజులపాటు నా టేబుల్‌ మీద ఉంచుకుని, ఆ తర్వాత ‘రిజెక్ట్‌డ్‌’ ఫైల్లో కుక్కేశాను.

‘బైలేటరల్‌ ఆస్టియో ఆర్థరైటిస్‌’. నడవలేడు. కదల్లేడు. మనిషి మంచానికే పరిమితం. ఒకే ఒక్క పరిష్కారం… ఆపరేషన్‌ చేయాలి. కనీసం 6 లక్షలవుతుంది. అతను రూపాయి కూడా భరించగలిగే స్థితిలో లేడు.

”మస్తాన్‌…” సందేహనివృత్తి కోసం ప్రయత్నించాలనుకున్నాను.

”చెప్పండి సార్‌” ముందుకు వంగుతూ అన్నాడు మస్తాన్‌.

”ఎలాగో కష్టపడి అన్ని లక్షలు ఖర్చు పెడతారు సరే, అనిల్‌ మామూలు మనిషవుతాడా? అంతకుముందులాగే లేచి తిరగ్గలడా? తన పనులు తాను చేసుకోగలడా?”

”కచ్చితంగా నయమవుతుందని, తిరగ్గలడని కిమ్స్‌ డాక్టర్లు చెప్పారు. ఓ డాక్టరుగారైతే ఈ కెేసు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన సహకారం వల్లే అంత తక్కువలో అయిపోతుంది. లేదంటే ఇంకో రెండుమూడు లక్షలు ఎక్కువవుతుంది” నమ్మకంగా చెప్పాడు మస్తాన్‌.

”అవునా?!”

”ఒక్క నిమిషం సార్‌, ఆ డాక్టరు గారికి ఫోన్‌ కలుపుతాను. మీరు మాట్లాడండి.”

”అక్కర్లేదు. ఆయన బిజీగా ఉంటారు…” నేను వారిస్తున్నా వినకుండా రింగ్‌ చేశాడు మస్తాన్‌.

”హలో, డాక్టరుగారూ, నేను దాచేపల్లి మస్తాన్‌ని. అనిల్‌కు ఆర్థికసాయం కోసం ఓ ఫౌండేషన్‌ మిత్రుడి దగ్గరకు వచ్చాం. ఆయన మీతో మాట్లాడతారట..” ఫోన్‌ నాకందించాడు.

డాక్టరు గారు ఓపిగ్గా ఫోన్లోనే అన్నీ వివరంగా చెప్పారు.

ఆపరేషన్‌తో అనిల్‌ మళ్లీ మామూలు మనిషి అవుతాడని చెప్పారు.

థాంక్స్‌ చెప్పి, ఫోన్‌ మస్తాన్‌ చేతికిచ్చాను.

నాలో ఆలోచన హోరు…

ఏమీ చేయలేమా! ఏదో ఒకటి చేయాలి. ఎంతో కొంత ఆదుకోవాలి.

నా మదిలో ఉదయకుమారి మేడమ్‌ కదిలారు. కలిసినప్పుడల్లా తనక్కూడా ఫౌండేషన్‌ పనుల్లో ఎక్కడో ఒకచోట భాగస్వామ్యం కల్పించమని అడుగుతుంటారు.

‘డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు. ఎక్కడో మారుమూల గ్రామాలకు రావడం, మా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకెక్కడ కుదురుతుందండీ’ అనేవాణ్ని నవ్వుతూ.

‘పోనీ, నా నుంచి డొనేషన్‌ తీసుకుని, ఓ విద్యార్థికి స్కాలర్‌షిప్పయినా ఇవ్వండి’ అనేవారామె.

ఆమె సహకారం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను.

ఉదయకుమారి గారికి వెంటనే ఫోన్‌చేసి ”ఓ మంచిపనిలో మిమ్మల్ని భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నాను. ఒకసారి మా ఆఫీసుకు రాగలరా?” అడిగాను.

ఆమె అయిదు నిమిషాల్లో మా ఆఫీసులో ఉన్నారు. అనిల్‌ను చూపించి, అతని గురించి చెప్పాను.

ఉదయకుమారి గారు అనిల్‌ భార్యను దగ్గరకు పిలిచి, పక్కనే కూచోబెట్టుకుని ధైర్యం చెబుతూ ”ఎంతమంది పిల్లలు” అనడిగారు.

”ఇద్దరమ్మా..”

”ఏం చదువుతున్నారు?”

”బాబు రెండో తరగతి. పాపకు మూడో ఏడు. ఇంకా స్కూలుకు పోవడం లేదు.”

”ఇప్పుడు వాళ్లను ఎక్కడుంచి వచ్చారు?”

”మా అమ్మగారింట్లో..”

ఆ తర్వాత వాళ్లను బయటికి పంపించి, నాతో మాట్లాడారు.

”ఓ పనిచెయ్యండి. ఇతని గురించి ఓ కేస్‌స్టడీ రాసి, మన గ్రూపు ఉద్యోగులందరికీ మెయిల్‌ చేస్తూ, ఎవరికి తోచిన సాయం వారిని అందించమని అడగండి. ఫౌండేషన్‌ అకౌంటు నంబరిచ్చి, దానికి ట్రాన్స్‌ఫర్‌ చేయమనండి. ఎంత వస్తుందో చూద్దాం. ఫౌండేషన్‌ తరఫున ఏం చెయ్యాలో అప్పుడు చూద్దాం” ఫౌండేషన్‌ ట్రస్టీ కూడా అయిన ఆమె అలా సలహా ఇచ్చారు. నాకు కొండంత ధైర్యమొచ్చింది.

”ఇదిగో, నావంతుగా ఇరవై వేలు” అప్పటికప్పుడు హ్యాండ్‌బ్యాగ్‌లోంచి చెక్‌బుక్‌ తీసి, సంతకం చేసి, నా చేతికిచ్చారామె.

మెయిల్‌ రాయడానికి సృజనాత్మకతకు కాస్తంత పదును పెట్టాను.

‘మీ కుటుంబంతో ఓసారి సినిమా మానెయ్యండి. లేదా ఒక్క వారాంతపు హోటల్‌ సరదాకు స్వస్తి చెప్పండి. లేదా మీరు కొత్త దుస్తులు కొనుక్కోవలసిన అవసరాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకోండి. ఆ కాస్త మొత్తాన్ని ఫౌండేషన్‌కు విరాళంగా అందిస్తే, అనిల్‌ అనే జర్నలిస్టుకు కొత్త జీవితం ప్రసాదించిన వారవుతారు…’ అంటూ అతని సమస్యను వివరిస్తూ మెయిల్‌ పంపాను.

 

అద్భుతమైన స్పందన వచ్చింది. తలా ఒక చెయ్యి వేశారు. డైరెక్టర్‌ స్థాయి నుంచి స్వీపర్‌ దాకా ఎవరి స్థాయిలో వారు ఉదారంగా స్పందించారు.

ఎక్కడో గుజరాత్‌లో మా కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్న కుర్రాడు రెండొందలు ఫౌండేషన్‌ అకౌంటుకు పంపుతూ, ”మరోలా అనుకోకండి, చాలా తక్కువ మొత్తం విరాళంగా పంపుతున్నాను. నా వంతుగా ఎంతోకొంత సాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా పేరు ప్రకటించకండి” అంటూ లెటరు రాశాడు.

వారం రోజుల వ్యవధిలో మూడు లక్షల రూపాయలకు పైగా విరాళాలందాయి.

అతని ఆపరేషన్‌కు ఆరు లక్షల దాకా కావాలి.

 

++++++

 

హైదరాబాద్‌. ప్రెస్‌క్లబ్‌. ఉదయం పది గంటలు.

వేదిక మీద మా ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దాక్షాయణి, అనిల్‌, మస్తాన్‌ కూచొని ఉన్నారు. ఎదురుగా దాదాపు అన్ని పత్రికల నుంచీ వచ్చిన విలేకరులు.

నేను మైకందుకుని, పూర్వాపరాలు వివరించి, ”అలా మా ఉద్యోగుల నుంచి మూడు లక్షలకు పైగా వసూలైంది. మిగతా మొత్తం కోసం మరెవరినైనా సంప్రదిస్తామని మస్తాన్‌ చెప్పారు. మరి ఫౌండేషన్‌ నుంచి ఎలాంటి సహకారం అందించబోతున్నామో ప్రకటించి, ఆ చెక్కును అనిల్‌కు అందించాల్సిందిగా మా మేనేజింగ్‌ ట్రస్టీ గారిని కోరుతున్నాను” అని చెప్పి, నేను పక్కకు తప్పుకొన్నాను.

అనిల్‌ కుర్చీ వెనక నిలబడిన అతడి భార్య ఆసక్తిగా కళ్లు పెద్దవి చేసి చూస్తోంది. మాసిన పంచె, నెరిసిన గడ్డం, తలగుడ్డతో ఆమె పక్కనే నిలబడి ఉన్న అనిల్‌ తండ్రి మొహంలో మాత్రం ఎలాంటి భావమూలేదు.

మేడమ్‌ లేచి, ”అందరికీ నమస్కారం. ఈ సహాయం చేయడం ఏదో గొప్ప కార్యంగా నేను భావించడం లేదు. నిజానికి ప్రెస్‌మీట్‌ వద్దన్నాను. మరొక సంస్థకు స్ఫూర్తిగా ఉంటుందని మస్తాన్‌ ఏర్పాటు చేశాడు. మా ఉద్యోగుల విరాళం పోను, అనిల్‌ ఆపరేషన్‌ పూర్తి చేసుకుని, ఇంటికి వెళ్లేదాకా ఎంత ఖర్చయితే అంత మా ఫౌండేషన్‌ నుంచి భరిస్తాం” అని ప్రకటించారు.

ఆరు లక్షల రూపాయల చెక్కును అనిల్‌కు అందజేస్తుండగా, వాళ్ల నాన్న తలగుడ్డ విప్పి కళ్లకు అడ్డుగా పెట్టుకుని, ఒక్కపెట్టున ఏడ్చేశారు.

మేడమ్‌ ఆయన్ని ఓదార్చారు. గభాల్న ఆమె కాళ్లమీద పడబోగా, పట్టుకుని పైకిలేపారు.

”బాధ పడకండి. మేమున్నాం. అతను మళ్లీ తన కాళ్ల మీద తాను నడుచుకుంటూ మా ఆఫీసుకు రావాలి. అదే మా కోరిక” అన్నారు.

ఒకవైపు ఎంత నిగ్రహించుకున్నా కన్నీటిని ఆపుకోలేక… మరోవైపు తన భర్త మామూలు మనిషి అయ్యే అవకాశం వచ్చిందన్న ఆనందం పట్టలేక… అనిల్‌ భార్య చిత్రమైన స్థితిలో గడిపింది.

 

++++++

 

కిమ్స్‌ ఆసుపత్రి…

నేను అనిల్‌ను చూడ్డానికి వెళ్లాను. భార్య సహకారంతో నడక ప్రాక్టీస్‌ చేస్తున్నాడు అనిల్‌.

మమ్మల్ని చూడగానే వాళ్ల నాన్న నమస్కారం పెట్టాడు.

కాసేపు కూచొని, డాక్టరుతో మాట్లాడి, ఫైనల్‌ బిల్లు సెటిల్‌ చేశాం. వాళ్లు కారులో ఇంటికి బయల్దేరారు.

 

++++++

 

నాలుగు నెలల తర్వాత…

నేను లంచ్‌కు వెళుతుండగా ”సార్‌, అటు చూడండి” అన్నాడు నా కొలీగ్‌ ఆశ్చర్యంగా.

కారిడార్‌ ఆ చివరి నుంచి ఓ జంట మావైపు నడిచివస్తోంది.

అతను ‘అనిల్‌’ అని గుర్తు పట్టగానే, నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. భార్య సాయం లేకుండా మామూలుగా నడుస్తున్నాడు. కళ్లు పెద్దవిచేసి, మరింత ఆశ్చర్యంగా చూశాను.

నాకు దగ్గరగా వచ్చి, ఇద్దరూ చేతులు జోడించి, నమస్కరించారు. నా క్యాబిన్‌లోకి తీసుకెళ్లాను.

”లోకల్‌ టీవీ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాను సార్‌. ఇప్పుడంతా బాగానే ఉంది. మెల్లగా నడుస్తున్నాను. మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను” చెప్పాడు అనిల్‌ సరికొత్త స్వరంతో.

నాకా మాటలేవీ వినబడటం లేదు.

‘మీరందించిన సాయం ఓ వ్యక్తికి జీవితాన్నిచ్చింది. అతని కుటుంబాన్ని ఆదుకుంది. మంచానికే పరిమితమనుకున్న ఓ జర్నలిస్టు మళ్లీ అక్షరపావురాల్ని ఎగరేస్తున్నాడు’ అనే సారాంశంతో గ్రూపు ఉద్యోగులందరికీ పంపబోయే మెయిల్‌ గురించే ఆలోచిస్తున్నాను, ఆనందంగా!

 

—0—

 

 

మీ మాటలు

  1. shaik. allabakshu says:

    సార్ కధ బాగుంది . ప్రపంచపు బాధ తన బాధగా భావించి వార్తలు మలిచే జర్నలిస్ట్ లకు కష్టం వస్తే యాజమాన్యం పట్టించుకోదు . లబ్ది పొందిన వారు పట్టించు కోరు. గ్రామీణ విలేకర్ల పరిస్థితి మరీ దారుణం . మీ కద లో లా ఫౌండేషన్‌ సంస్థలే దిక్కు. ఇదే విషయాన్ని మరోలా బాగా చెప్పారు.
    — అల్లాబక్షు

  2. veerabhadrappa says:

    కథ బాగుంది నిజజీవితంలో ఇలాటి సహృదయులుంటే ఎంతబాగుంటుందో రచయిత మనస్సు మంచిది

  3. rajya lakshmi says:

    కథ చాల బాగుంది. అభినందనలు

  4. Srinath Marri says:

    చాల బాగావుంది సర్!!!!!! ఇది కథ కాదు, మీ జీవితం లో ఇది ఒక సంఘటన, మీరు చేస్తున్న సేవ లో ఇది ఒక పేజీ మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయ్, ఉండాలి.

Leave a Reply to Srinath Marri Cancel reply

*