జాలం

 

తెల్లవార్లూ ప్రయాణంతో పట్టీపట్టని నిద్ర…ఒళ్ళు తెలీలేదు. విమానం అడ్రెస్ సిస్టమ్ లో స్పీకర్స్ నుంచి వచ్చే అమ్మాయి గొంతుతో మెలకువ వచ్చింది.

“కొద్ది నిమిషాల్లో గన్నవరం – విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దిగబోతున్నాం. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటిగ్రేడ్. వాతావరణం వేడిగా ఉంది. ల్యాండింగ్ కి అనువుగా, విజిబిలిటీ పది కిలోమీటర్ల వరకూ స్పష్టంగా ఉంది.”

బోయింగ్ 747 న్యూయార్క్ నుంచి బయలుదేరి పన్నెండు గంటల్లోనే నాన్ స్టాప్ గా విజయవాడలో దిగాబోతోంది. భుజం మీద వాలి గాఢంగా నిద్రపోతున్న శైలజను తట్టిలేపాడు, శివ.

“శైలూ! లే! దిగిపోతున్నాం.”

రోజులు మారాయి, కాలం మారింది. రెండు రాష్ట్రాలు ఇప్పుడు. విజయవాడ గన్నవరంలో ఒక పెద్ద అద్భుతమైన ఎయిర్ పోర్ట్!

బయటకడుగు పెట్టగానే వేడి గాలి, నిప్పుల కొలిమి లోంచి వచ్చినట్టు! జేబులో మొబైల్ ఫోన్ ‘టింగ్’ మని చప్పుడు.

“విజయవాడకి స్వాగతం! మీరిప్పుడు సన్ షైన్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో దిగారు! ఇదిగో ఎయిర్ పోర్ట్ మ్యాప్. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, కాంటీన్, టూరిస్ట్ డెస్క్, టాక్సీలు, బస్సులు ఎక్కడెక్కడుండేదీ వివరంగా మ్యాప్ ప్రత్యక్షం అయింది.

ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్ళే బస్ కదిలింది. దాని లోపల చల్లగా ఉంది.

‘టింగ్’ మళ్ళీ ఇద్దరి ఫోనులు చెప్పాయి. “విజయవాడలో స్వాగత్ ఐదు నక్షత్రాల హోటల్ కి స్వాగతం! మీకోసం హోటల్ కారు వేచి వుంది. డ్రైవర్ నంబర్ ఇదిగో…”

“ఓ! అద్భుతం!” అన్నాడు శివ.

‘టింగ్! మీ బ్యాగేజి బెల్ట్ నంబర్ రెండుకు వచ్చి వుంది.”

‘టింగ్! మీరు అమెరికన్ సిటిజెన్ కనుక గ్రీన్ లైన్లో కస్టమ్స్ నుంచి బయటకు రాగానే త్వరగా వీసా స్టాంప్ ఇవ్వగలము! స్వాగతం!’

‘టింగ్! మీరు విజయవాడలో వుంటే ప్రఖ్యాత బాబాయ్ హోటల్ కి విచ్చేయండి. మరచిపోలేని ఇడ్లీ, పెసరట్ లోయ్!’

‘టింగ్! కొండపల్లి బొమ్మలు విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో. ఆర్డర్ చేయండి!’

“ఇదేమిటి బాబూ, అప్పుడే ఇన్ని మెసేజిలా?” విసుక్కుంది శైలజ.

“స్మార్ట్ సిటీ శైలూ!” అన్నాడు శివ. “విజయవాడ ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఆఖరికి మనూరు మామిడిపూడి కూడా స్మార్ట్ విలేజ్ గా మారిపోయింది తెలుసా?”

ట్రింగ్ ట్రింగ్ మెసేజీలు వస్తూనే ఉన్నాయి. టాక్సీలనీ, టూరిస్ట్ ప్యాకేజీలు, కూచిపూడి నాట్యానికి, దగ్గరలో బీచ్ మచిలీపట్నానికీ, విశాఖ సైట్ సీయింగ్, అరకు లోయలో మూడు రోజులు…

“అది సైలెంట్ లో పెట్టండి, లేదా ఆఫ్ చేయండి!” అంది శైలూ కోపంగా.

గన్నవరం నుంచి విజయవాడకి పొలాల మధ్యగా ఆరులైన్లలో రోడ్డు. అటూ ఇటూ ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయి. వేసంకాలం రాకముందే బయట చాలా వేడిగా వుంది. దూరాన ఎక్కడో ఒక వారి కుప్ప చుట్టూ ఒక ట్రాక్టర్ నీరసంగా తిరుగుతోంది. కొంచెం దూరం తర్వాత ఇక పొలాలు లేవు. అటూ యిటూ క్రమంగా పెద్దవవుతున్న బహుళ అంతస్థుల భవంతులు, మధ్యలో పెద్ద పెద్ద ప్రకటనలు వున్న బోర్డులూ కనిపిస్తున్నాయి.

“ఓ!! వాల్ మార్ట్! స్పెన్సర్స్… అన్నీ వున్నాయిక్కడ!” అంది శైలూ.

“ఔను! కొత్తరాష్ట్రం డిజిటల్ రాష్ట్రం. చాలా మార్పు వచ్చింది.”

కారు రామవరప్పాడు దాటి బెంజ్ సర్కిల్ దారిలో ఒక చోట ఆగింది. ‘హోటల్ స్వాగత్’ ఐదు నక్షత్రాల సౌకర్యం.

రూమ్ కి చేరుకోగానే, “నన్ను రెండుగంటల వరకూ నిద్ర లేపకండి! బడలికగా వుంది. పడుకోవాలి.” అని శైలూ నిద్రలో మునిగిపోయింది.

శివ కూడా బట్టలు మార్చుకొని, టేబుల్ మీదనున్న చల్లని మినరల్ వాటర్ తాగి, ఆనాటి న్యూస్ పేపర్ చదివి నిద్రలోకి జారాడు.

***

“ఆళ్ళు ఒచ్చారంటావా?” అడిగాడు రామకోటయ్య. ల్యాప్ టాప్ మీద, మొబైల్ తెర మీద రెండు చుక్కలు మెరుస్తున్నాయి.

“ఆ, ఒచ్చారు! హోటల్లో దిగారు.” చెప్పాడు నవీన్.

రామకోటయ్య గుబురు మీసాలు తెల్ల గడ్డంలోంచి “హ” అని చప్పుడు చేసి, వెక్కిరింతగా నవ్వేడు.

“రేపు మధ్యాన్నం కేతారంలో రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారంట! జరగడానికి ఈల్లేదు! జరగదు!” కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు.

“అది నీ డూటీ! మరి చూసుకో!” నవీన్ జీన్ ప్యాంటు, తెల్ల టీ షర్టు వేసుకున్నాడు. మాసిన గడ్డం, చురుకైన కళ్ళు, నుదుటి మీద కొద్దిగా, కొద్దిగా ఏమిటి ఈ వాతావరణానికి ఒళ్ళంతా చెమటే!

“చూద్దాం! కానీ గ్యారంటీ చెప్పలేను!” రామకోటయ్య వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి చూసి ఖాండ్రించి ఉమ్మేశాడు.

“పని కాకపోతే డబ్బులుండవ్! నువ్వొక్కడివే  అనుకోబాక! ఇంకా నలుగురున్నారు ఈ పని మీద!” నవీన్ కి అంత వేడిలోనూ చలి పుట్టుకొచ్చింది.

“కోటయ్య తాతా! ఒక కష్టమైన పని పెట్టుకొంటే ఈ కంప్యూటర్ లతో ఖచ్చితంగా చెప్పలేం మరి. మాగ్జిమం ట్రై చేస్తా!”

అతనొక ఎమెచ్యూర్ హ్యాకర్.

***

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

సాయంత్రం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగారు ఇద్దరూ. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ సర్వే మ్యాప్ లు చూడటం మొదలుపెట్టాడు, శివ. సర్వే నంబరు, వూరిపేరు కొట్టగానే మ్యాప్ వచ్చింది.

“ఎకరం రెండు కోట్లు. ఐదు ఎకరాలు అమ్మేస్తే ఈ వూరితో బంధం తెగిపోతుంది!”

“ఎందుకు ఇక్కడ? ఆ డబ్బుతో రాగిణి మెడిసిన్ చదువు మొత్తం అయిపోయి, అమెరికా లో సెటిల్ కూడా అయిపోవచ్చు అని ఎందుకనుకోరు?” అంది శైలూ.

అతి కష్టం మీద రెండెకరాలు కొనడానికి ఒప్పుకున్నారు. ఇవాళ  సగం డబ్బు క్యాష్ ఇస్తారు. ఈ దేశంలో సగానికి సగం బ్లాక్ మనీ లావాదేవీలు! రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మిగిలిన సగం రేపు చెక్కు ఇస్తారట…”

“అంటే ఇంకా మూడెకరాలు…అమ్ముడుపోవా?”

“మార్కెట్ డల్ గా వుంది శైలూ. ఇప్పటికి నాలుగు కోట్లు చదువుకి సరిపోతాయిగా? అది కూడా కొత్త క్యాపిటల్ రావడం, కొత్త రాష్ట్రం అభివృద్ధి వల్ల ఈ మాత్రం రేట్లు! కొనే వాళ్ళు వుండద్దూ? వాళ్లకి కూడా అంత డబ్బు పెట్టాలంటే ఏదో వ్యాపారం ఉండాలిగా?”

“అంతే మీరు! ఏది చేసినా సగం సగమే!” మూతి ముడిచింది శైలూ.

ఆమెను సంతృప్తి పరచటం బ్రహ్మతరం కూడా కాదు.

***

కంకిపాడు నుంచి ఆరులైన్ల రోడ్డు సిగ్నల్ దగ్గర నల్లరంగు ఇన్నోవా కారు.

కంప్యూటర్ లో కనిపిస్తోంది. “ట్రాఫిక్ జామ్. అది కదలడం లేదు.” అన్నాడు నవీన్. అన్ని చోట్లా సీసీ కెమెరాలు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లలో తెరలు. అక్కడినుంచి తనకి సమాచారం. ఏ క్షణం, ఏ వస్తువు, ఏ వాహనం, ఏ మనిషినైనా ఎక్కడున్నాడో తెలుపుతుంది సమాచార వ్యవస్థ.

స్టోర్ రూమ్ లో ఎన్ని వస్తువులున్నాయి, బస్ లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, రైల్లో ఎంత మంది దిగారు, ఏ హోటల్లో ఎవరున్నారు, ఎవరి బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్ లలోంచి ఎంత డబ్బు స్వైప్ అవుతోంది, ఎక్కడ సమావేశాలు, ఆందోళనలు జరుగుతున్నాయి – ఒకటేమిటి వస్తువులు, మనుష్యులు వాహనాలు అన్నీ అనుసంధానమైన డిజిటల్ రాష్ట్రం – స్మార్ట్ రాష్ట్రం. దాంట్లోకి ప్రవేశించాడు, నవీన్ హ్యాకరు.

“ఆ కార్లో రెండు కోట్లున్నాయ్. అవి ఆడికి చేరడానికి వీల్లేదు.” అన్నాడు రామకోటయ్య.

నవీన్ అన్నాడు, “ఆకారును ఆపటానికి అన్ని విధాలా ప్రయత్నించాను సార్. ఇక ఒక్కటే మార్గం.” ఉన్నట్టుండి ఒకేసారి కంకిపాడు జంక్షన్ దగ్గర వాహనాలు అన్నీ రెండు వైపులా కదలసాగాయి. సంక్షోభం! జామ్!! అటూ యిటూ ఒకేసారి గ్రీన్ లైట్లు వెలిగాయి. కార్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఉండటానికి అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయి. అవి ఎర్ర చుక్కల రూపంలో స్క్రీన్ మీద.

రామకోటయ్య సంతృప్తిగా నవీన్ కేసి చూసి, “గట్టోడివే, నువ్వా పనిమీదుండు, నేనింటికి వెళ్లి వొస్తా…” అన్నాడు.

ఇల్లు అంటే రెండో ఇల్లు. రామకోటయ్య కోసం మేరీ ఎదురు చూస్తోంది.

“అయ్యిందా?”

“అయినట్టే. నా కడుపు కాడ కూడా కొడితే నేనూరుకుంటానా? ఎంత మేనల్లుడైతే మాత్రం? సంవత్సరం తిరిగేసరికి పది లక్షలు ఆదాయం వస్తా వుండేది. అమెరికా వెళ్లి అక్కడి పౌరసత్వం పుచ్చుకొన్నోడికి ఈ మామిడిపూడి పొలాలే కావలసి వచ్చాయా?”

వృద్ధుడంటే వృద్ధుడు, మధ్య వయస్కుడంటే మధ్య వయస్కుడు రామకోటయ్య. మేరీ మామిడిపూడి ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ళక్రితం భార్య పోయిన దగ్గర్నుంచి మేరీ నే తోడూ, సహచరీ! అసలు అతనుండేది మామిడిపూడి పక్కనే పది కిలోమీటర్ల దూరంలోని గుడివాడ పట్టణంలో. అమెరికా లో ఉన్న మేనల్లుడి పొలాలు చూడటానికి ఈ వూరు వస్తుంటాడు. రాజధాని కోసం ఈ వూరు గుర్తించి, ఆ ప్రాంతం కలిపేసరికి కోట్ల విలువయ్యింది. న్యూయార్క్ లో, న్యూజెర్సీలో ఇళ్ళు కట్టుకొని వందల కోట్లు సంపాదించిన శివ గాడికి ఈ మారుమూల గ్రామంలోని పొలాలే కావాలా? ఎంత వద్దని చెప్పినా అమ్మాలని పట్టు పట్టుక్కూర్చున్నాడు. తనకి చెప్పకుండానే బేరం కుదుర్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. గుంటూరోళ్ళు  ఎకరా రెండు కోట్లకి బేరం కుదిర్చారు. రామకోటయ్య ఆలోచిస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోవాలి, ఏమైనా సరే. ఆగిపోతుంది. చాకుల్లాంటి కుర్రాళ్ళు చేతిలో వుండగా పదిలక్షల ఖర్చుతో పదికోట్ల ఆస్థి తన చేతుల్లోనే ఉండిపోతుంది.

***

ఇన్నోవా వేగంగా అడ్డదిడ్డంగా తిరుగుతోంది. కారులో వ్యక్తులకి విసుగ్గా వుంది.

“ఏందీ ట్రాఫిక్ జాములూ? సిగ్నల్లో అన్నీ ఒక్కసారే వెలిగాయి. అందరూ అన్ని వైపులనుంచి వొస్తన్నారు! ఎలా? నీ…”అతనికి కోపంలో బూతులు వస్తున్నాయి.

ఎదురుగా లారీ మచిలీపట్నం వైపు ఓడరేవుకు పెట్రోల్ ట్యాంకర్లని మోసుకొని వేగంగా వస్తోంది. ఇటు గరుడా  బస్సు విజయవాడవైపు వెళుతోంది. మీద మీదకి వస్తోంది. ఎలా వచ్చాడో, ఒక గడ్డి మోపు కట్టి వున్నా రెండు చక్రాల సైకిల్ తొక్కుకుంటూ తలపాగా ముసలోడు కారుకి అడ్డంగా వచ్చేసాడు. అట్నుంచి ఎడ్లబండి ఒక్కసారి మీదికి దూకింది.

రెండు ఎద్దుల మేడలో గంటలు గణగణా మోగాయి. శివుడి వాహనం నందిలా. అపుడు చేసే సాయంత్రపు నాట్యంలా బండి గెంతింది. ఒక్క మెరుపు మెరిసి, ట్యాంకరూ, ఇన్నోవా ఢీ కొట్టాయి. ప్రళయంలా మంటలు చెలరేగాయి.

***

“ఏదో భయంగా ఉందండీ…” అంది శైలు.

ఏడున్నరకి ‘కూచిపూడి’ రెస్టారెంట్ లో అసలైన ఆంధ్రా రుచులు అన్న బోర్డు. ఇద్దరూ చాలా కాలం మిస్ అయిన వంటకాలు తింటున్నారు.

“డబ్బు ఇస్తానని వస్తానన్న వాళ్ళు ఇంకా రాలా!” అన్నాడు శివ.

“అది కాదు. ఎక్కడ కోర్చున్నా, ఎవరో నన్నే గమనిస్తున్నట్లు, నా వంకే చూస్తున్నట్లు, ఇందాక కార్లో కూడా వెంక ఇంకేదో కారు వెంబడిస్తున్నట్టు..”

“నీ మొహం!” భార్యని తిట్టడానికి అవకాశం దొరికింది శివకి. “అంతా నీ భయం. ఇన్ సెక్యూరిటీ… అభద్రతాభావం!”

టీవీలో తాజావార్తలు డైనింగ్ రూమ్ లో అందరికీ వినబడేట్లు, కనబడేట్లు, “కంకిపాడు దగ్గర ఘోర ప్రమాదం. ఇన్నోవా, ఆయిల్ టాంకర్ ల ఢీ! నలుగురి దుర్మరణం. కారులో కాలిపోయిన కరెన్సీ నోట్లు లభ్యం!”

“అయ్యో…” అంది శైలూ.

“బ్లాక్ మనీ…” అన్నాడు శివ.

***

హోటల్ సీసీ కెమెరాల్లో ఇద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు. నవీన్ నవ్వి ఈల వేయసాగాడు.

“ఆంధ్రా చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, సాంబారులో ములక్కాడలు కూడా కనిపిస్తున్నాయి. హ! హ! హ!”

శివ, శైలూ బిల్ తీసుకొచ్చిన వెయిటర్ కి క్రెడిట్ కార్డు ఇవ్వడం, సంతకం పెట్టడం, కొంత డబ్బు టిప్ కింద ఇవ్వడం లేచి లాబీలోకి రావడం అన్నీ కనిపిస్తున్నాయి.

“హోటల్ అధునాతనమైనది. మొత్తం కెమెరాలే! వస్తువులకి కూడా ఇంటర్నెట్. స్టోర్ రూమ్ లో సరుకులెంత ఉన్నాయో కూడా తెలుసుకోవటానికి సెన్సర్ లు. ఏసీలో టెంపరేచర్ ఎంతో, రెస్టారెంట్ లో, బార్ లో జిమ్ లో, బ్యూటీ పార్లర్ లో అన్ని చోట్లా సెన్సార్లు “ నవ్వాడు.

“రామకోటయ్య గారూ, అన్న మాట నిలబెట్టుకున్నా…” అన్నాడు. లోపల మాత్రం “IOT – ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్” అనుకున్నాడు. ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం లోకి హోటల్ ఇంటర్నెట్ సిస్టం ద్వారా ప్రవేశించాడు.

“ఆళ్ళు ఆగరు. మళ్ళీ ఇంకో బేరం మొదలుపెడతారు. అదీ చూడు!” అన్నాడు రామకోటయ్య. “ఇదిగో ఐదు. పని అయినాక మిగిలిన అయిదు…” కరెన్సీ నోట్లున్న బ్రీఫ్ కేస్ నవీన్ హ్యాకర్ పక్కన నల్లటి నీడలా  నిలబడింది.

దుష్టుడి దురాశలా.

***

“హలో! హలో!”

“హలో?” అన్నాడు శివ విసుగ్గా అర్థరాత్రి.

“సారీ సార్, నాన్నగారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయనతో పాటుగా నలుగురు పోయారు. మీకందుకే డబ్బు అందలేదు. రిజిస్ట్రేషన్ రేపు చెయ్యలేం.” ఎడుపుగొంటుతో యువకుడు.

“ఓ!! సారీ!” తలపట్టుకున్నాడు శివ.

“ఇంకెవర్ని అయినా చూడండి. మాకసలే సెలవు లేదు. అర్జెంటు!”

ఇదేం క్రూరత్వం? సాటి మనిషి ప్రాణాలు పోతే? అని శైలుకి అనిపించలేదు.

“అనుకొంటూనే ఉన్నా. వీళ్ళకి డ్రైవింగ్ రాదు. ట్రాఫిక్ కంట్రోల్ లేదు. డబ్బు ఇవ్వడం, సంపాదించడం రాదు!” విసుగ్గా అంది.

“ఇంకెవరైనా కొనాలనుకొంటున్నారేమో అడగండి. మన ప్రోగ్రాం అంతా ఖరాబు అయింది! ఛీ! బ్యాక్ వర్డ్ కంట్రీ అండ్ పీపుల్!! ఏసీ పెంచండి చల్లగా లేదు, ఈ విజయవాడ వేడికి!”

శివ ఏసీ రిమోట్ తో టెంపరేచర్ పదహారు సెంటిగ్రేడ్ పెట్టి కళ్ళు మూసుకున్నాడు.

ఏసీ గాలి వేగంగా చల్లగా భారంగా రాసాగింది.

నిద్రలోకి జారుకున్న వాళ్ళిద్దరికీ క్రమంగా ఊపిరి భారం అవుతోంది. వచ్చేగాలిలో ఏదో తేడా వస్తోంది. ఊపిరి ఆడటం లేదు. కళ్ళు మండుతున్నాయి. శ్వాస భారంగా … ఆక్సిజన్ అందనట్టు… ఎనాక్సియా. ఏసీ గాలిలో మిథైల్ ఐసో సైనేట్? విషపుగాలి ఎలా కలిసింది?ఇందాక రూమ్ లోంచి బయటకొస్తున్న ఏసీ మెకానిక్ రూమ్ సర్వీస్ అంటూ… పాడయిందా?

అలసిన శివ మస్తిష్కంలో మామిదిపూడిలో కొబ్బరి చెట్ల మధ్య తూర్పు పొలం, ఐదు ఎకరాలు పచ్చని చేలతో కనిపించింది. చిన్నప్పటి తను ట్రాక్టర్ తో పొలం దున్నటం, తండ్రి తలపాగా చుట్టుకొని మోకాలి లోటు నీళ్ళలో కూలీలతో పాటు నాట్లు వెసూ…

తర్వాత, శరదృతువులో ఏపుగా పెరిగిన పొలాలు గాలికి ఊగుతూ, ఆ తర్వాత సంక్రాంతికి బంగారు రంగులో కుప్పలు రాశులుగా పోసిన ధాన్యం…మరుక్షణం తండ్రి చితిలో మంటలు.. ఆ వెనక మీసాలు గడ్డాలతో నిండిన రామకోటయ్య ముఖం త్రీడీ బొమ్మలా “నీకెందుకురా! నువ్వు అమెరికా ఎల్లి రా.. పొలాలన్నీ నే జూసుకుంటా…” అంటోంది.

గదిలో ఆక్సిజన్ కరువైంది. శివ, శైలూ ఇద్దరికీ ఊపిరి ఆడటం లేదు. చల్లగాలిని ఇవాల్సిన ఏసీ కంప్రెసర్ లోకి ఎవరో విషవాయువు పంపించారు.

మరో గంటలో కలలన్నీ కరిగిపోతాయి. నిశ్శబ్దం. వస్తువులని, మనుషులని, మనసుల్నీ ఆవహించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్…

మామిడిపూడిలో నవీన్ రామకోటయ్య కేసి చూసి తలవూపాడు.

“గట్టోడివే.”మెచ్చుకున్నాడు రామకోటయ్య.

రెండో సూట్ కేస్ చేయి మారింది.

నవీన్ చేతిలో చల్లటి చెమట. సగం ఏసీ మెకానిక్ కి ఇస్తే సగం తనకీ. ఏం సరిపోతుంది? ఫ్లాట్ కొనటానికి ఇంకా కావాలి. కనీసం రెండు కోట్లయినా కావాలి. బయటకు నడిచాడు నీరసంగా. బయట వెన్నెల లేదు. చీకటి వేడిగా కూడా వుంది.

***

మీ మాటలు

  1. G.S.Lakshmi says:

    హమ్మబాబోయ్..స్మార్ట్ సిటీ అంటే ఇలా వుంటుందా.. కథ నిజంగా జరిగినట్టు అనిపంచిందండీ మధుగారూ.. అభినందనలు..

  2. JAYA REDDY BODA says:

    బాగుంది కథ కళ్ళముందు జరుగుతున్నట్లు.

  3. Sivalakshmi says:

    మా విజయవాడ వెళ్ళాలంటే భయమేస్తుందండీ!

మీ మాటలు

*