ఆదివాసీల కొత్త గొంతుక!

jacinta

జార్ఖండ్ రాంచిలో నివశించే 32 యేళ్ళ జసింత కేర్ కెట్టా వోరాన్ అనే ఆటవి తెగకు చెందిన వో సాహస పాత్రికేయురాలు,ఆవేశపూరితమైన కవయిత్రి.కార్పోరెట్ వుద్యోగాలను  వొదలి తను పుట్టిన, తాను సంబంధపడిన ఆదివాసి మూలాలలోని కష్టాలకూ,మౌఖికంగా,రాతపూర్వకంగా,కవితాత్మకంగా ఫుల్ టైం శ్రమిస్తూ,బయటి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రకటిస్తున్న ధైర్యవంతురాలు.తన ఆదివాసి సమాజంలో బాలికలలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆదివాణి అనే వో ప్రచురణ సంస్థను సొంతంగానే స్థాపించింది.

యీమె మొదటి కవితాసంకలనం అంగోర్ (నిప్పు) హిందీ ఆంగ్ల భాషల్లో వొకే సంకలనంగా విడుదలైంది.యిదేకాక హిందీ-జర్మన్ అనువాదం,హిందీ-డచ్ అనువాదాలు ప్రపంచవ్యాప్తంగా గత మే నెలలో ప్రచురింపబడ్డాయి. యీమె కవితాసంకలనం వొక సంచలనం.భారత దేశంలో కంటే విదేశాల్లో అనేక స్పందనలు, అనేక సమీక్షలు వొచ్చాయి.

యీమె కవిత్వంలో అడవి సౌందర్యంతో పాటు ఆదివాసీల భయం, పీడన,అభద్రత,బయటి ప్రపంచపు దోపిడీ, వారి సంస్కృతి పరిరక్షణ,అడవిని తవ్వకాలపట్ల విపరీత వ్యతిరేకత కన్పించే ప్రధాన వస్తువులు.చిన్నప్పటి నుంచి నాలో యేదో బూడిదలో దాగిన నిప్పులా లోలోపల యెక్కడో దహించివేస్తుండేది-అది యిప్పుడు అర్థం అయి యీ బాటను యెంచుకున్నాను అంటోది జసింత. యీమె కవిత్వం చదువుతుంటే పాఠకుడిలో సంభవించే విస్పోటనాలు,కోపం,ఆవేశాలను, నొప్పినీ  పర్సానిఫై చేస్తుంది.

~

satya2

చిత్రం: సత్యా సూఫీ

సుడిగాలులు – దిక్కులు
——————————

యీ నేల పైన
పిడికెడు గింజలు
మిగిలివుండాలి
అందుకే వరిపొట్టు
తూర్పార పట్టేందుకు
నిలబడి వుందొక వూరు
వేడిగాలులకు యెదురుగా

యిలా పని చేస్తున్న వొక సాయం వేళ
పెంకుల రంధ్రాలలో నుంచి
చూసుకొంటోంది దీపపు వెలుగును
కాలిబాటల నుంచి నిశబ్దంగా నడిచి
వచ్చే సుడిగాలులను
పరుగెత్తుతున్న తాజావాసనపు వొరిగింజల నుంచి తీగలను
యెండ యొక్క నిప్పులాటి కత్తిపదునును, కొడవలిని
సుడిగాలుల వక్షస్థలంపై పూడ్చిపెట్టేందుకు..

తటాలున నిలబడి చూసి

వేగంగా వీస్తున్న గాలుల కత్తితో
ధృఢమైన వూరిగాయం పైన
దిక్కుల్ని చీల్చి వేస్తోంది

వారి చరిత్ర పాత గుడ్డపేలికే
అది తనని తాను
మెల్లమెల్లగా ఘాఢమైన చీకట్లోకి
వోదార్పునిచ్చే దిక్కుల ఆధీనంలోకి …

చివరికి దిక్కులు
వెలుగు అభయాన్ని యిచ్చి
సుడిగాలుల్లోకి తోసేస్తాయి

వూడ్చుకొంటారూ
అధికారమిచ్చి
అధికారాన్నే

“యీ నేలను కాపాడేందుకు
యెవరో వొకరూ
ప్రాణాలర్పించుకోక తప్పదు”.

మూలం :జసింత కెర్ కెట్టా

మీ మాటలు

 1. Suparna mahi says:

  కొన్నిసార్లు కొన్ని కవితల్ని చదవడం అంటే ఓ దారి తెలియని ఉద్వేగాల్లోకి ఏదో కాసింత నమ్మకంతో అడుగేసి స్వచ్ఛందంగా తప్పిపోవడమే…
  అద్భుతమైన అనువాదానికి ధన్యవాదాలన్నయ్యా..
  రచయిత్రి వారికో సెల్యూట్…

 2. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

  మహీ మీ ఆదరణకు …ప్రేమకు…దయతో..

 3. చాలా బాగుంది

 4. satyanarayana says:

  “అందుకే వరిపొట్టు
  తూర్పార పట్టేందుకు
  నిలబడి వుందొక వూరు —–”

  “వారి చరిత్ర పాత గుడ్డపేలికే—”

  -కొన్నిసార్లు కొన్ని కవితల్ని చదవడం అంటే ఓ దారి తెలియని ఉద్వేగాల్లోకి ఏదో కాసింత నమ్మకంతో అడుగేసి స్వచ్ఛందంగా తప్పిపోవడమే…

  నేనూ అలాగే అనుకున్నాను .

 5. THIRUPALU says:

  మంచి కవితా పరిచయం. చాల బాగుంది.
  //యీ నేల పైన
  పిడికెడు గింజలు
  మిగిలివుండాలి
  అందుకే వరిపొట్టు
  తూర్పార పట్టేందుకు
  నిలబడి వుందొక వూరు
  వేడిగాలులకు యెదురుగా//

  “యీ నేలను కాపాడేందుకు
  యెవరో వొకరూ
  ప్రాణాలర్పించుకోక తప్పదు”.

 6. బాగుంది.. ఓ కొత్త ఆశ..

 7. Sivalakshmi says:

  భావికి భరోసా జసింత!

 8. D. Subrahmanyam says:

  మంచి కవిత . ఆదివాసుల పైన జరిగే అడ్డులేని దోపిడీని చిత్రిస్తూ రాసె మహాశ్వేతాదేవి లాంటి రచయిత్రి కావాలని ఆశిద్దాం .

 9. Kcube Varma says:

  ఈ అస్తిత్వ పోరాటంలోంచి ఓ నిప్పు రవ్వలాంటి నినాదం జసింత.. ఓ ఆశ.

 10. “యీ నేలను కాపాడేందుకు
  యెవరో వొకరూ
  ప్రాణాలర్పించుకోక తప్పదు”.

  ఆ ఎవరో ఒకరు ఆదివాసీలు,దళితులూ అవ్వడమే విషాదం.

మీ మాటలు

*